కాళ్లు పరాంకుశం

నా రాజమండ్రి ప్రయాణానికి మా ఇంట్లో పాత, కొత్త సామెతల మేలు కలయిక రివాజు.

”పని లేని బార్బర్‌కి పిల్లి తల. నీకు రాజమండ్రి” అంది బామ్మ.

”పుల్లయ్యకి వేమవరం. నీకు రాజమండ్రి. అన్నట్ల వేమవరం రాజమండ్రికి దగ్గిరే కదా! పని లేకపోవడంలో పని లేకపోవడంగా ఓ సారి వేమవరం కూడ వెళ్లొచ్చేయ్‌” అంది అమ్మ.

”ఇంట్లో ఉంటే స్పాం మెయిల్. ఇల్లు దాటితే రాజమండ్రి” అంది చెల్లి.

”ఒబామాకి హోప్‌ నోబెల్‌ తెచ్చింది. రాజమండ్రి నీకెప్పుడు తెస్తుందో” అన్నారు నాన్న.

పాపం మా ఆవిడొక్కతే ఏమీ అనదు. మా పిల్లల్నీ అననివ్వదు. ఆ పైన మిగతావాళ్లమీద తనకి అదుపు లేదని నొచ్చుకుంటుంది కూడా.

లీలది ఎమ్మెన్సీ ఉద్యోగం. నాకిష్టం లేదని ఆమెరికా ఛాన్స్‌ వదులుకుంది. నాకిష్టమని వీలున్నప్పుడల్లా బ్లాగు నిర్వహణలో సహకరిస్తుంది. ఏదో రోజున నా వెబ్‌సైట్‌ని ఏ గూగుల్‌ ఇంకార్పరేషనో- బిలియన్‌ డాలర్స్‌కి కొనేసుకోవచ్చని ఎంకరేజ్‌ చేస్తుంటుంది.

కంప్యూటర్‌ ఇంజనీర్ని. వివిధ అంశాలపై నా అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ- వెలిబుచ్చడానికి ఓ వెబ్‌సైట్‌లో బ్లాగు నిర్వహిస్తున్నా. ఉద్యోగమున్నా కూడా మన పనులన్నీ మనమే చేసుకోవాలనీ, అందువల్ల వెబ్‌సైట్‌ నిర్వహణ కుంటువడుతుందనీ అనుమానించి అప్పట్లో అమెరికా ఆఫరొస్తే వదులుకున్నా. ఇండియాలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి- ఆ టైమింగ్స్ వెబ్‌సైట్‌ పనికి ఆటంకమనిపించి- వదిలేసా. నా బ్లాగుని మోహించి నన్ను ప్రేమించిన లీల పెళ్లికి ప్రపోజ్‌ చేస్తే- అందుకప్పటి నా ఉద్యోగమే కారణమని ఇంట్లో అందరిదీ ఏకాభిప్రాయం.

లీలది ఎమ్మెన్సీ ఉద్యోగం. నాకిష్టం లేదని ఆమెరికా ఛాన్స్‌ వదులుకుంది. నాకిష్టమని వీలున్నప్పుడల్లా బ్లాగు నిర్వహణలో సహకరిస్తుంది. ఏదో రోజున నా వెబ్‌సైట్‌ని ఏ గూగుల్‌ ఇంకార్పరేషనో- బిలియన్‌ డాలర్స్‌కి కొనేసుకోవచ్చని ఎంకరేజ్‌ చేస్తుంటుంది.

”ఆ రామకృష్ణన్‌ ఇంగ్లండ్‌ వెళ్లి నోబెల్‌ తెచ్చుకున్నాడు కానీ- తన ఫీల్డుమీద శ్రద్ధపెడితే-మావాడు ఇండియాలోనే ఉండి నోబెల్‌ తెచ్చుకోగలడు” అని అమ్మా నాన్నా నా తెలివిని అతిశయిస్తూ, ”ఆఖరికి ఎందుకూ పనికిరాని ఆ కాళ్ల పరాంకుశం కూడా ఉద్యోగంలో స్థిరపడ్డమే కాదు, ప్రయోజకుడు కూడా అయ్యాడు” అని వాపోతుంటారు.

పరాంకుశం చిన్నప్పుడు నా క్లాస్‌మేట్‌. ఆ మురళిని చూసి నేర్చుకోరా అని అస్తమానూ నాతో పోల్చి వాణ్ణి చిన్నబుచ్చేవారు వాడి అమ్మా నాన్నా. అలాంటిదిప్పుడు కేసు రివర్సైంది.

పరాంకుశం ఇంటిపేరు కాళ్లు కాదు. కాళ్లకి అవకరముందనో, కాళ్లు సినిమాలో నటించాడనో వాడికా పేరు రాలేదు. వాడి ఇంటిపేరు చింతపెంట. చిన్నప్పట్నించీ కూడా-తన కాళ్లు ఐస్‌క్రీం స్తంభాల్లా అందర్నీ ఊరించి పాదాక్రాంతుల్ని చేసకోవాలని వాడి అభిలాష.

జాతకం ప్రకారం ఏదో ఒకరోజు ప్రపంచమంతా తనకి పాదాభివందనం చేస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పాడంటాడు పరాంకుశం. ఇటీవలే చంద్రుడిపై నీటి చుక్కల్ని కనుగొన్న మన ఇస్రో వాళ్లు పూనుకుంటే ఏమో కానీ- అ జ్యోతిష్కుడెవరో అందరికీ పెద్ద మిస్టరీ. ఆయనెవరో తెలిస్తే బ్లాక్‌లిస్ట్‌ చేసేయాలని చాలామంది కుతూహలపడుతుంటే- తెలిసిన జ్యోతిష్కులందరూ నేను కాదంటే నేను కాదని నొక్కి వక్కాణించి జ్యోతిషగ్రంధాలు దులిపేసుకున్నారు. పరాంకుశం మాత్రం- చిన్నప్పట్నించీ కూడా కాళ్లమీద పడే కస్టమర్స్‌ కోసం ఎదురు చూసేవాడు.

ఇంట్లో అందర్లోకీ ఆఖరివాడు. అందుకని వాడికక్కడ అలాంటి కస్టమర్స్‌ దొరక్క ఊరిమీద పడ్డాడు. అదేంటో వాణ్ణి చూడగానే- అప్పుడే మాటలొచ్చిన ఆడపిల్ల కూడా వయసు పెంచేసి వాడికంటే పెద్దదాన్ననేది. ఐనా వాడు పట్టు వదలని విక్రమార్కుడు. ఎలాగో కొందర్ని తనకంటే చిన్నవాళ్లని ఒప్పించి- తను టీచరు, వాళ్లు స్టూడెంట్స్ ఆట ప్రపోజ్‌ చేసాడు. ఆ గడుగ్గాయిలు- ”ఆటల్లో పెద్దా చిన్నా ఉండదు. పంట వేయాల్సిందే” అన్నారు. చేతులు కలిపి వేసే పంటైతే-అదృష్టాన్నైనా పరీక్షించుకోవచ్చు. కానీ వాళ్లనే పంటలో- ఒకర్నొకరు ప్రశ్నలడిగి చెప్పలేనివాళ్లు స్టూడెంట్స్. అందరి ప్రశ్నలకీ జవాబు చెబితేనే టీచర్‌. ఇక పరాంకుశానికి ఛాన్సెక్కడ?

అప్పుడు పరాంకుశం- పెద్దా చిన్నా అనే కొత్త ఆట సూచించాడు. చిన్నవాళ్లు ఒకొక్కరుగా పనిమీద వెళ్తూ పెద్దల కాళ్లకి మ్రొక్కి దీవెనలందుకోవాలి. తనే అందరిలోకీ పెద్ద కాబట్టి-పార్టిసిపెంట్సంతా తన కాళ్లకి మ్రొక్కుతారని పరాంకుశం ఆశ. కానీ ఆదిలోనే హంసపాదులా-అతడి కాళ్లకి మ్రొక్కబోయిన ఐదేళ్ల పిల్ల- అతడి పాదాలు చూసి ‘యాక్‌’ అని లేచి పక్కకి వెళ్లి వాంతి చేసుకుంది. మిగతావాళ్లంతా మ్రొక్కకుండనే యాక్‌ అంటూ అక్కణ్ణించి పారిపోయారు.

“స్నానమంటే ముఖం, వళ్లూ రుద్దుకుంటే సరిపోతుందా- కాలిగోళ్లలో మట్టి. వేళ్ల మధ్యలో మట్టి. పగిలిన మడమల్లో మట్టి. పాపమైతే అయింది కానీ- ఇకమీదట అలాంటి పాదాలకి మ్రొక్కనుగాక మ్రొక్కను”

ఎందుకలా జరిగిందో మర్నాడు తెలిసింది వాడికి. తాతగారి తద్దినానికి మంత్రాలు చదివిన బ్రాహ్మణోత్తముడి కాళ్లు మ్రొక్కిన తండ్రి- ఆయన వెళ్లేక, “స్నానమంటే ముఖం, వళ్లూ రుద్దుకుంటే సరిపోతుందా- కాలిగోళ్లలో మట్టి. వేళ్ల మధ్యలో మట్టి. పగిలిన మడమల్లో మట్టి. పాపమైతే అయింది కానీ- ఇకమీదట అలాంటి పాదాలకి మ్రొక్కనుగాక మ్రొక్కను” అని శపథం చేసాడు.

కాళ్లకి మ్రొక్కేవాళ్లు కస్టమర్స్‌. కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌ కదా- వాళ్లకోసం కాళ్లని శుభ్రంగా ఉంచుకోవడం తన బాధ్యత- అనకున్నాడు పరాంకుశం. స్నానం చేసినప్పుడు ముఖాన్నీ,వంటినీ పట్టించుకోక- కాళ్లనే అదేపనిగా తోమేవాడు. ఎప్పుడెవరికి కాల్మ్రొక్కాలనిపిస్తుందోనని పాదాలకి పగుళ్లు రాకుండా క్రీమ్స్ రాసి- సిద్ధంగా ఉంచేవాడు. కస్టమర్సే దుర్లభమైపోయారు.

మనిషి ఆరోగ్యానికీ పాదాల పరిశుభ్రతకీ ఎంతోకొంత లింకుంది కాబట్టి పరాంకుశం కాళ్లకి కొంత గుర్తింపొచ్చింది. తమకెలాగూ రిస్కు లేదన్న నమ్మకంతో పెద్దలతడి కాళ్ల గురించి తమ పిల్లలకి బుద్ధి చెప్పేవారు. తమకి దణ్ణాల రిస్కుందని గ్రహించిన పిల్లలు వెంటనే కాళ్లకి బుద్ధి చెప్పేవారు.

కాల్మ్రొక్కు కోసం అతడి తహతహకి సహకరించాలని, ”క్లాసులో ఫస్టు రా. తక్కువ రాంకుల వాళ్లచేత దణ్ణాలెట్టిస్తా” అంది తల్లి. కానీ వాడికి చిన్నప్పుడు చదువులో డల్‌గా ఉన్న ఐన్‌స్టీన్‌ ఆదర్శం. ”కనీసం లెక్కల్లోనైనా ఫస్టు రారా” అందామె. కానీ- టీచర్లు అర్థం చేసుకోలేని అన్సరర్లు వ్రాసిన- లెక్కల జీనియస్‌ రామానుజం వాడికాదర్శం. ”పోనీ చెడు సావాసాలు పట్టకురా” అంటే- చెడుని పాటించి కూడా ఆదికవి ఐన వాల్మీకి వాడి ఆదర్శం.

”మా బాబేం చేసినా వెనకాల బోలెడాలోచన” అని మురిసిపోయేది తల్లి. కానీ వెనకాలోచన లేని మిగతా పిల్లలు ఒకొక్కరుగా ముందుకెళ్లిపోతూ పరాంకుశం వెనకబడిపోతుంటే- ”వెళ్లి సన్యాసుల్లో కలు. అంతా కాళ్లకి దణ్ణం పెడతారూ’ అందామె విసిగిపోయి.

దణ్ణాలకోసమైతే సన్యాసుల్లో కలవాలని వాడనకున్నాడు కానీ సన్యాసికి టీవీలూ, సినిమాలూ,సరదాలూ, ఉద్యోగం నిషిద్ధమట. అడుక్కునే బ్రతకాలిట. కొందరు కాళ్లకి మ్రొక్కినా- కొందరు అడక్కునేవాళ్లని తిట్టినట్లే తిడతారట. వీటికి తోడు- పెళ్లి కూడా నిషిద్ధమన్న మాట-యువకుడయ్యేక పరాంకుశాన్ని వరింత కలవరపరిచింది.

చదివింది బియ్యే. ఆపైన నిరుద్యోగి. దాంతో సన్యాసం స్వీకరించకపోయినా చాలామంది అతణ్ణి సన్నాసిగానే రిఫర్‌ చేస్తన్నారు. చేసారని కాళ్లకి మ్రొక్కారా అంటే అదీ లేదు. సన్నాసన్న వాళ్ల నోళ్ల మూయించడానికున్న ఒకే ఒక్క మార్గం పెళ్లి. పెళ్లైతే తనకీ పాదాభివందనం చేసే మనిషి దొరకుతందని వాడాశ పడ్డాడు కానీ- పెళ్లి ప్రసక్తి రాగానే కొందరు- వీడికా పెళ్లి అన్నారు. కొందరు- వీడిక్కూడా పెళ్లా అన్నారు. వాళ్ల మాటలకి ముందూ వెనకా జతపడిన వ్యాఖ్యలు విన్న తల్లి తను కూడా- వీడికా పెళ్లి- అనుకుని నాలిక్కరుచుకుంది.

అలాంటి సమయంలో అమెరికాలో దండిగా సంపాదించిన డాలర్లతో ఇండియాలో ఓ కంపెనీ ప్రారంభించడానికొచ్చాడు జంబులింగం. గతంలో తనకి సాయంచేసిన పరాంకుశం తాతగారి ఋణం తీర్చుకుందుకు- ఆయన వాడికి తన కంపెనీలో నెలకి పదివేలొచ్చే ఉద్యోగం వేయించాడు. వాడి గురించి తెలిసినవారంతా- ఆ జీతం ఋణం తీర్చుకోవడమేనన్నారు.

ఉద్యోగం రాగానే- అదే పెళ్లికి అర్హతైనట్లు తల్లి వాణ్ణి హెచ్చరించింది- ఏ ఆడపిల్లైనా బుట్టలో వేసుకునే ప్రమాదముందని. అప్పట్నించీ పరాంకుశం రోజుకో బుట్ట కొని ప్రమాదం లేకుండా అందులో పడ్డానికి ప్రాక్టీసు చేయడం మొదలెట్టాడు. వాడికి బుట్టలో పడ్డమొచ్చింది కానీ- ఆ బుట్ట పట్టుకునే అమ్మాయి దొరకలేదు. ఇక తను కలగజేసుకోక తప్పదనుకుని-దూరపు బంధువులమ్మాయి రాధని ఏదో వంకన ఇంటికి రప్పించుకుందతడి తల్లి.

మొదటిసారి రాధని చూడగానే వాడు బాత్రూంలోకి పరుగెత్తాడు. ముఖం కడగలేదు,తల దవ్వలేదు. అప్పటికే తళతళలాడిపోతున్న కాళ్లని మరింత కడిగి పాలిష్‌ పెట్టాడు.

మొదటిసారి రాధని చూడగానే వాడు బాత్రూంలోకి పరుగెత్తాడు. ముఖం కడగలేదు,తల దవ్వలేదు. అప్పటికే తళతళలాడిపోతున్న కాళ్లని మరింత కడిగి పాలిష్‌ పెట్టాడు.

ఎదురవగానే ముందు వాడి కాళ్లనే చూసిన రాధ- వెంటనే వాటిమీద పడిపోయి, ”ఇవి పాదపద్మాలు కాదు. పద్మాలే” అంటూ వాటిని ముద్దాడింది. అప్పుడామె అందం, వయసు,స్పర్శలకి చలించక- తన కాళ్లకి లభించిన ప్రశంసకీ, గౌరవానికీ పరవశించిపోయిన వాడితో,”వీ పాదాభివందనాలకి అంతం కాదిది ఆరంభం” అంటూ చెవుల్లో అమృతం పోసింది రాధ.

ఇద్దంరికీ పెళ్లైపోయింది, ఆ తర్వాత వాడు నాకు కనిపించలేదు- రెండు వారాలక్రితం రాముడనబడే రామేశ్వరి అత్తయ్య మా ఇంటికొచ్చేదాకా.

అత్తయ్య నాన్నకి కజిన్‌. విజయనగరంనుంచి ఆర్నెల్ల క్రితం రాజమండ్రి వచ్చారు వాళ్లు.భర్తని కూడ రాముడి మొగుడనిపించుకునే పెర్సనాలిటీ అత్తయ్యది. మా ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా అడిగి మరీ పిలిపించుకుని వచ్చి ఆడపడుచులతో సమంగా లాంఛనాలూ, మర్యాదలూ డిమాండ్‌ చేస్తుంది. తనింట్లో పెళ్లిలాంటి పెద్ద వేడుకలక్కూడా కనీసం నాన్ననైనా పిలవదు.ఇంటికొచ్చిన ఆడవాళ్లకి జాకెట్‌ గుడ్డ మాటటుంచి చేతిలో అరటిపండు కూడా పెట్టదు. కోడల్ని రాచి రంపాన పెట్టబోతే, ఆ పిల్ల విజయశాంతి లెవెల్లో ఎదురు తిరిగిందంటారు. వాళ్లింట్లో అందరికీ ఆమెకిలాగే స్వార్థం, అహంకారం, మూర్ఖత్వం ఎక్కువని నానుడి.

ఈసారి కూడా రాముడత్తయ్య- అడిగి చీర పెట్టించుకుని ఆ చీర నచ్చక, ”మీకు మరీ ఇంత పిసినారితనం పనికిరాదు. కాస్త తీరిక చేసుకుని ఏ ప్రవచనాల సభకైనా వెళ్లండి- బుద్ధి వికసిస్తుంది” అని అందర్నీ మందలించింది. తను రాజమండ్రిలో ప్రవచనబ్రహ్మ చింతపెంట పరాంకుశం గారి సభలకి రెగ్యులర్‌గా వెడుతూ ఎన్నో తెలుసుకుందిట. ఆ ప్రవచనాలు వమిస్సైపోతాననే తప్పనిసరైన ఈ ట్రిప్పు కట్‌షార్ట్‌ చేసుకుందిట.

పరాంకుశం పేరు విని ఉలిక్కిపడి- కాళ్ల పరాంకుశమేనా అని ఇంటిల్లపాదీ ఏకగ్రీవంగా అడిగితే- అలాగనడం అపరాధమని తను లెంపలేసుకుని మా చేత వేయించి వెళ్లింది అత్తయ్య.

ఆ తర్వాత ఇంట్లో పరాంకుశం ప్రయోజకత్వంతో పోల్చి నా చేతకానితనాన్ని నిరసించడానికి భార్యాబిడ్డలు తప్ప మిగతా పెద్దా చిన్నా అంతా యధాశక్తి పాటుపడ్డారు. నేను పరాంకుశం ప్రయోజకత్వం గురించి తెలుసుకుందుకు రాజమండ్రి ప్రయాణం కట్టాను.

పరాంకుశం గొప్పవాడైతే- ఆ కథని నా బ్లాగులో వినిపించాలని నా తాపత్రయం. దానికే మా ఇంట్లో పనిలేని బార్బర్‌, పుల్లయ్య వేవవరం, స్పామ్ మెయిల్‌ వాచ్‌, ఒబామా హోప్‌ వంటి పేర్లు.

అత్తయ్య తక్కువదా- “తిరపతి హుండీలో డబ్బులేసేది పాపాలు కడుక్కుందుకే-మానేందుక్కాదు” అంటూ ఆధునిక భక్తి సిద్ధాంతాన్ని నిర్వచించింది.

రాజమండ్రి నేను పుట్టి పెరిగిన ఊరు. ఆ గాలి, నేల, నీరు నాకిచ్చే ప్రేరణ- అమెరికాలో దొరుకుతుందా? మనిషి జీవితానికి సంపాదన ఒక్కటే లక్ష్యమా? ఉన్న ధనంతో తృప్తిపడి,జ్ఞానధనాన్ని పదిమందికీ పంచిపెట్టాలనుకోవడం- గర్హించతగ్గ విషయమా?
– – – – –
ఎక్కడికెళ్లినా తెలిసినవారింట్లో బస చేసి- ఆయా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల్ని బ్లాగులో విశ్లేషించడం నా హాబీ. రాజమండ్రిలో నా బంధుమిత్ర బలగం ఎంత ఎక్కువంటే- పదేల్లుగా వెడుతున్నా ఇంకా సందర్శించాల్సిన కుటంబాలు చాలా ఉన్నాయి.ఈసారికి రాముడత్తయ్యిల్లు సెలక్ట్‌ చేసుకున్నా- తనకి గెస్టులిష్టముండరని తెలిసీ.

అత్తయ్యింట్లో ఎవరిలోనూ ఏ మార్పూ లేదు. అదే స్వార్థం. అదే అహం. అదే మూర్ఖత్వం. రాముడత్తయ్యకి నచ్చదని తెలిసినా, ”అతిథి దేవో భవ- అంటారు ప్రవచనబ్రహ్మలు. ప్రవచనాల
ప్రభావంతో- మీ అతిథి మర్యాదలో వచ్చిన మార్పు తెలుసుకుందుకు నేను మీ ఇంట్లో పది రోజులుండాలనుకుంటున్నాను” అన్నాను.

అత్తయ్య తక్కువదా- “తిరపతి హుండీలో డబ్బులేసేది పాపాలు కడుక్కుందుకే-మానేందుక్కాదు” అంటూ ఆధునిక భక్తి సిద్ధాంతాన్ని నిర్వచించింది.

అంటే అత్తయ్యని పరాంకుశం మార్చలేడనేగా- నాకో పాయింటు తేలిపోయింది. ఇక పరాంకుశాన్నోసారి కలవాలి. నా అదృష్టంకొద్దీ ఆ కోరికా ఆరోజే ఆ ఇంట్లోనే తీరింది.

ఇల్లు పావనం చేయమని కోరిన వారందరి పేర్ల లిస్టు వ్రాసుకుని- ప్రవచనాలకి మూడు గంటలముందు రోజుకో ఇంటికెళ్లడం పరాంకుశం రివాజు. నా అదృష్టంకొద్దీ ఆ రోజు అవకాశం అత్తయ్యది. వాడు ఇంటికొచ్చి నన్ను చూసి వెంటనే గుర్తుపట్టి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.మేమిద్దరం ఏరా అంటే ఏరా అనుకోవడంతో ఆ ఇంట్లో నా హోదా ఒక్కసారిగా పెరిగిపోయింది.

అత్తయ్య ప్రత్యేకించిన గదిలో నేనూ వాడూ సమావేశమయ్యాం. నేను ఆశ్చర్యంగా, ”ఒరేయ్‌,నువ్వేమిటి? ప్రవచనాలేమిటి? నాకంతా అయోమయంగా ఉంది” అన్నాను.

”నా చిరకాలవాంఛ తెలుసుగా. కాళ్లకి మ్రొక్కించుకోవడం. అందుకు నేను సన్యాసినై ఉద్యోగం, సంసారం, ఆర్భాటం వగైరాలేం మానక్కర్లేదు. అందుకే ఈ ప్రవచనాలు” అని,”కొందరు మహా జ్ఞానులు, పండితులు- సాహిత్యాన్నీ, సంప్రదాయాన్నీ ప్రచారం చేయాలన్న గొప్ప లక్ష్యంతో ప్రవచనాలు ప్రారంభించారు. జనాలకవి బాగా నచ్చి- ఇప్పుడు ప్రవచనాలు వినడం ఫాషనైపోయింది. నేనా వీక్‌నెస్‌ని ఎక్స్‌ప్లాయిట్‌ చేస్తున్నానంతే” అన్నాడు.

”సంస్కృత పదాల గొప్పతనం ఏమిటంటే- వాటిలోని ప్రతి అక్షరానికీ ఎన్నో అర్థాలుంటాయి. ప్రతి పదాన్నీ ఏ కీలుకాకీలు ఊడదీసి- అటుతిప్పి ఇటుతిప్పి తోచిన అర్థాలు చెప్పడం ప్రవచనాల స్ట్టైల్‌. పండితులు జ్ఞానంతో చెప్పినా నేను అజ్ఞానంతో చెప్పినా- సభలకొచ్చే శ్రోతలు పరవశించి వింటారు.

”మరి దీనికి ట్రైనింగెక్కడ, ఎప్పుడు తీసుకున్నావ్‌” అడిగాను ఆశ్చర్యంగా.

”ట్రైనింగా- పాడా? ఉదాహరణకీ రోజు నా ఉపన్యాసం భగవద్గీతమీద. అందులో మొదటి శ్లోకం ఎత్తుకున్నానంటే కనీసం గంట” అంటూ తన చేతి సంచీలోంచి టీకాతాత్పర్యసహితమైన పాకెట్‌ భగవద్గీత తీసి- ”ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమవేతా యుయుత్సవః, మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” అని చదివి- ”దీని అసలు అర్థం- ఒ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మ క్షేత్రమైన కురు క్షేత్రమున చేరియున్న నా కుమారులును, పాండుపుత్రులును ఏమి చేసిరి- అని. కానీ నేను అదనంగా అక్షరాలతో ఆటాడిస్తానక్కడ” అన్నాడు.

ధర్మ శబ్దంలో ధ ర మ అనే మూడక్షేరాలున్నాయి. మ అంటే తల్లి. ధర అంటే వెల. ధర-ధా అని దృఢంగానూ, రా అని సన్నితంగానూ పిలిచే తల్లి పిలుపులా ఆప్యాయంగా ఉండాలిట.అలాంటి ప్రాంతం (క్షేత్రే) లోనే- ధరలు- సమవేతా- అంటే వేతనాలకి సమంగా ఉంటాయట.లేనప్పుడు జనాలు యూ యూ అంటూ ఒకర్నొకరు నిందించుకుంటారట. అలాంటప్పుడు-నేనూ నావాళ్లైనా, పాండవులైనా, ఆఖరికి సంజయ్‌ గాంధీ బ్రతికున్నా- ఏం చేయగలరు? కురు క్షేత్రే- అంటే వ్యవసాయమే చేస్తారు.

నేను తెల్లబోయి, ”మరి ఈ తాత్పర్యాన్ని పండితులు హర్షిస్తారా?” అన్నాను.

”సంస్కృత పదాల గొప్పతనం ఏమిటంటే- వాటిలోని ప్రతి అక్షరానికీ ఎన్నో అర్థాలుంటాయి. ప్రతి పదాన్నీ ఏ కీలుకాకీలు ఊడదీసి- అటుతిప్పి ఇటుతిప్పి తోచిన అర్థాలు చెప్పడం ప్రవచనాల స్టైల్‌. పండితులు జ్ఞానంతో చెప్పినా నేను అజ్ఞానంతో చెప్పినా- సభలకొచ్చే శ్రోతలు పరవశించి వింటారు. వాళ్లకి మనం ఎలా చెప్పామన్నదే తప్ప ఏం చెప్పామన్నది ప్రధానం కాదు.”

”కానీ నీవంటి కుహనా పండితుల కారణంగా ఉద్దండులు పరిహాసం పాలు కారా?”

వాడు నవ్వి, ”కుహనా గాంధేయవాదులు స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు పోగేస్తున్నారు. గాంధీకి చెడ్డ పేరొచ్చిందా? ఇదీ అంతే! మహాపండితులు ప్రవచనాలు చెప్పి పాదాభివందనాలు పొందుతున్నారు. నేను పాదాభివందనాలకోసం ప్రవచనాలు చెబుతున్నాను. ఈ తేడా శ్రోతలకి తెలియకపోయినా నాకు తెలిస్తే చాలు. జ్ఞానమివ్వకపోయినా ముచ్చటైన పాదాలనివ్వగలను.సాగినంత కాలం సాగిపోతుంది” అన్నాడు.

ఐడియా నాది కాదు. మా ఆవిడది. తను నాకంటే చాలా తెలివైనది. మన సంప్రదాయంలో ఆడదాని తెలివి స్వంతానికి సహకరించదని గ్రహించి నన్ను పెళ్లి చేసుకుంది.

వాడి పరిణతికి ముచ్చటేసి, ”అసలీ ప్రవచనాల ఐడియా నీకెలా వచ్చిందిరా?” అన్నాను.”ఐడియా నాది కాదు. మా ఆవిడది. తను నాకంటే చాలా తెలివైనది. మన సంప్రదాయంలో ఆడదాని తెలివి స్వంతానికి సహకరించదని గ్రహించి నన్ను పెళ్లి చేసుకుంది. నాకు రోజూ పాదాభివందనం చేయలేక నన్ను వదుల్చుకుందుకీ ఉపాయం చెప్పింది. ఇప్పుడు వో భీ కుష్‌.హం భీ కుష్‌” అన్నాడు.

– – – – –

ఆ సాయంత్రం సభకి వెడితే- జనం క్రిక్కిరిసి ఉన్నారు. పరాంకుశం వేదికనలంకరించగానే-
ఒకొక్కరే వచ్చి వాడికి పాదాభివందనం చేసి వెడుతుంటే- అవాక్కైపోయాను.
పరాంకుశం తన జీవితాశయాన్ని సాధించగలిగాడంటే- కారణం?
వాడి భార్యా? శ్రోతలా? వ్యవస్థా?
పరాంకుశం కాదన్నదొక్కటే నాకు తెలుసు.

*******

రచయిత పరిచయం:

జొన్నలగడ్డ రాజగోపాలరావు – రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. వసుంధర తో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామ లోనే ఏడువందలకు పైగా కథలు వ్రాశారు. బొమ్మరిల్లు లో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు వ్రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేశారు. ఆమె వసుంధర లో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు వ్రాశారు.
ఇక పెద్దలకోసం వారు వ్రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత? (హాస్యకథల సంపుటి)
ఇవేకాక రచన మాసపత్రికలో సాహితీ వైద్యం (సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటి సేవ లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షికను దశాబ్దం పైగా ఏకధాటిగా నిర్వహిస్తున్నారు.

వీరు వ్రాసిన నవలల్లో కొన్ని: అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరాముని దయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. వారాలబ్బాయి గా కామరాజు కథ, రామరాజ్యంలో భీమరాజు, ప్రేమించు – పెళ్ళాడు గా తులసితీర్థం సినిమాలుగా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు. వీరి బ్లాగు అక్షరజాలం.

vasundhara

ఫోటో కర్టెసీ కౌముది.నెట్

About వసుంధర

జొన్నలగడ్డ రాజగోపాలరావు – రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. వసుంధర తో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామ లోనే ఏడువందలకు పైగా కథలు వ్రాశారు. బొమ్మరిల్లు లో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు వ్రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేశారు. ఆమె వసుంధర లో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు వ్రాశారు.

ఇక పెద్దలకోసం వారు వ్రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత? (హాస్యకథల సంపుటి)

ఇవేకాక రచన మాసపత్రికలో సాహితీ వైద్యం (సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటి సేవ లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షికను దశాబ్దం పైగా ఏకధాటిగా నిర్వహిస్తున్నారు.

వీరు వ్రాసిన నవలల్లో కొన్ని: అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరాముని దయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. వారాలబ్బాయి గా కామరాజు కథ, రామరాజ్యంలో భీమరాజు, ప్రేమించు – పెళ్ళాడు గా తులసితీర్థం సినిమాలుగా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు. వీరి బ్లాగు అక్షరజాలం.

This entry was posted in కథ. Bookmark the permalink.

5 Responses to కాళ్లు పరాంకుశం

  1. ”సంస్కృత పదాల గొప్పతనం ఏమిటంటే- వాటిలోని ప్రతి అక్షరానికీ ఎన్నో అర్థాలుంటాయి. ప్రతి పదాన్నీ ఏ కీలుకాకీలు ఊడదీసి- అటుతిప్పి ఇటుతిప్పి తోచిన అర్థాలు చెప్పడం ప్రవచనాల స్ట్టైల్‌. పండితులు జ్ఞానంతో చెప్పినా నేను అజ్ఞానంతో చెప్పినా- సభలకొచ్చే శ్రోతలు పరవశించి వింటారు.”

    nenu cheppadaniki senkinchaalsivachina, mee pai maatalo nijamundi. naa sankaku kaaranam, nenu chese ee vyaakhya kuda aa konamlo ki veltundemonane… 🙂

    — Vinay Chaganti

  2. viswam says:

    prastuta paristitulani pratibimbinchindi.bagundi

  3. Mula Ravi Kumar says:

    From Begining toend, it reads houmorously, and with bursting-into-laughter at couple of sentenses. Haasya-aahlaadakara katha, as I understand

  4. Sree says:

    “పని లేకపోవడంలో పని లేకపోవడంగా ఓ సారి వేమవరం కూడ వెళ్లొచ్చేయ్‌” –
    “పనిలో పనిగా” మాత్రమే పరిచయం ఇప్పటివరకు.. 🙂

  5. మీ దంపతులు చిర కాలంగా తెలుగు పత్రికా రంగానికి చేస్తున్న సేవ కొనియాడ తగినది. ఇన్ని రచనలు ఎలా చేస్తున్నారా ? అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మీకు నా అభినందనలు.
    కాళ్ళు పరాంకుశం కథ చక్కని సెటైర్. ప్రవచనాల కంటె ఫోజులిచ్చే వారిని మనం తరుచుగా బుల్లి తెర మీద చూస్తూనే ఉన్నాం కదా… కథ మరీ అంత గొప్పగా, హాస్య భరితంగా లేక పోయినా చదివించింది.

Comments are closed.