కవికృతి -౩

కత్తి మహేష్ కుమార్:

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు
న్యూటన్ సూత్రం తప్పిందా?
లేక…
నీలేమి శూన్యంలో
సూత్రమే మారిపోయిందా!

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది
నీ శూన్యాన్ని…
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మంటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను

అప్పుడు తెలిసింది…
కన్నీరుకార్చే మగాడికి షర్టెంత అవసరం అని.

పెరుగు రామ కృష్ణ:

రుమాలైనా ఎంతో అవసరం..
చొక్కా లేకున్నా..
కన్నీళ్లు ఆపడం ఎవరితరం మిత్రమా..?

స్వాతీ శ్రీపాద:

నీకు తెలుసా ………..

కృత్రిమత సీతాకోక చిలుకల్ను కత్తిరించుకుని

కాగితపు నవ్వుల్ను పెదవులమీద అతికించుకు

చూపుల గాలాలను తప్పించుకుంటూ

మనసు దరిని ఒరుసుకుంటూ సాగే

మౌన ప్రవాహాల ఉపరితలంపై ఊగిసలాడే

ఉషోదయం తొలి పలకరింపులు

ఇవేనా? ఇవేనా నా చుట్టూ తెరిచి పరచుకున్న పుస్తకాల పుటలు

నిన్నటి చీకటి కీనీడలో

విరగబూసిన ముళ్ళగోరింట పూల గుసగుసలేకాని

ముళ్ళపొదల్లో నిలువెల్లా గాయపడి

రక్తాక్షరాలు స్రవించే

అంతరంగపుటలజడుల జాడైనా తెలుసా నీకు?

కంటి రెప్పల చిమ్నీల మీద

ఒంటిగా ఎదురుచూస్తూ

రాత్రి గుడ్లగూబల ఆహ్వాన హస్తాల్లో

కుండపోతగా కురిసే వెక్కిళ్ళ జడివానలో

సొమ్మసిల్లిన క్షణాలు తెలుసా?

దూరంనించి గూగుల్ భూగోళాన్ననీ

లోలోనకు పాకితే తప్ప

లోయల గుప్పిళ్ళు వీడవనీ

పర్వతాల పందిళ్ళూ రూపు దిద్దుకోవనీ

ముదురాకుపచ్చ ముద్దమందారపు కొమ్మల్లా

పెళుసనిపించే సౌకుమార్యం నీకేం తెలుసు?

పగిలిన స్వప్న శకలాల్ను ఏర్చి కూర్చి

పునర్నిర్మించుకున్న ఈ జీవన సౌధంలో

ఏపక్క తడిమినా ఆనాటి రాగాలేననీ

నీకు తెలుసా?

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

5 Responses to కవికృతి -౩

  1. చివరి లైన్ తో మీరు పవర్ తీసేశారు.

  2. కత్తిగారూ..
    నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచెరుగదు అని మా అమ్మమ్మ అంటూఉండేది. అలానే బాధ లింగబేధ మెరగదండీ. వర్మగారన్నట్టు చివరి లైనుతో మీరు కవితలోని సీరియస్నెస్సు (పలచబడి)పోయింది. కానీ అంతబాధనూ ఓ నవ్వుతో చెరిపేయడం, దాన్ని చీత్కరించినట్టూ.. పరిహసించినట్టూ ఉంది. మంచి యాటిట్యూడు చూపించారు. అభినందనలు.

    స్వాతీ శ్రీపాద గారూ..
    మీ కవిత బాగుంది.

  3. స్వాతిశ్రీపాద గారు
    మీ అక్షరప్రవాహం అద్భుతంగా వుందండి.

  4. I disagree about last line of Mahesh’s poem. I thought the conclusion brought a certain charm to the whole thing.

  5. కవిత రసాత్మకంగా వుంది..గుడ్ .

Comments are closed.