ఓ కథ చచ్చిపోయింది!

పూర్ణిమ తమ్మిరెడ్డి

ఓ కథ చచ్చిపోయింది. ఇదో, ఇప్పుడే, ఇక్కడే, నా సమక్షంలోనే! అంతా నా చేతుల్లోనే ఉందనిపిస్తూ, ఏదో ఒకటి చెయ్యాలని నేననుకుంటూ ఉండగానే చేయిదాటిపోయింది. చచ్చిపోయింది.

వేళ్లకి అంటుకున్న ఇంకు మరకల తడింకా ఆరనేలేదు, మృత్యువు వచ్చి వెళ్లిన వాసనలు మాత్రం గుప్పుమంటున్నాయి. టేబుల్ లాంప్ వెలుతురులో పాలిపోయినట్టు పడున్న తెల్లకాగితాలని సమాధి చేయ్యందే ఆ వాసనలు తగ్గవు. కళ్లు మూసుకునే పనికానివ్వాలనుకున్నాను కాని, కడసారి చూపుల్ని కాదనుకోకని అంతరాత్మ పరిఘోషించింది. నాలో పుట్టింది నా కళ్ళముందు చచ్చిపడుంటే చూసే ధైర్యమూ లేదు. చూడకుండా పనికానిచ్చే రాతిహృదయమూ లేదు. ఒక్కసారి. కేవలం ఒకే ఒక్కసారి కాగితాల వైపు చూడ్డానికి ప్రయత్నించాను. కళ్ళెదుటి దృశ్యం కన్నీటిలో కరుగుతూ పల్చబడేకొద్దీ, లోలోపలి దుఃఖం తీవ్రమైంది. కాగితాలను చేతి వేళ్ళతో తడుముతూ ఉంటే, వాటిపై పడున్న అక్షరాలూ, విరిగిన పదాలూ, పూర్తి కాని వాక్యాలు, కొట్టివేతలూ, దిద్దుబాట్లూ అన్నీ ఒక్కసారిగా గాలిలోకి లేచి నా తల చుట్టూ గిర్రున తిరగటం మొదలెట్టాయి.

“మమల్ని చంపి కథకి అమరత్వం చేకూర్చినా ఇంత బాధ ఉండేది కాదు. కథనే చేయిదాటినిచ్చి మా బతుకు చావుకన్నా దుర్భరం చేశావ్.”అని పాత్రలు ఈసడించుకుంటున్నాయి.

“కథ లేకపోతే మా ఉనికికి అర్థమేంట?”ని పదాలు నిలదీస్తున్నాయి.

ఏమని సమాధానపరచను? ఉద్దేశ్యపూర్వక నేరం కాదు, కేవలం నా అసమర్ధతే అని ఎలా నచ్చజెప్పను? మృత్యువే నయం కదూ, ఈ నిందారోపణలకన్నా! ఒక్క వేటులో కావాలనుకున్నది తీసుకుపోయింది. నా చేతకానితనాన్ని నర్మగర్భంగా దాచుకోగల చెత్తబుట్టలోనే ఈ కాగితాలనూ సమాధి చేశాను. అంత్యక్రియలయిపోయాయి. నేనో కథను రాయబోయానన్న విషయాన్ని మరో ప్రాణికి తెలీనివ్వకుండా ముందే జాగ్రత్తపడ్డం మంచిదయ్యింది. “ఓహ్.. ఎలా జరిగిందిదంతా?” అన్న పరామర్శలకు తావివ్వకూడదనే గబగబా చేతులు కడిగేసుకున్నాను. చెత్తబుట్టను ఖాళీ చేశాను. కథ తాలూకూ ఆనవాళ్లన్నింటినీ దాదాపుగా నాశనం చేసినట్టే, ఒక్క నా జ్ఞాపకాలలో తప్ప. అక్కడ నుండి కూడా తుడిచేయగలిగితే?!

తనది కానిదాన్ని, తనదన్న భ్రాంతిలో సొంతం చేసుకోలేక, విస్మరించలేక మధనపడుతూ, గత్యంతరం లేదని తెల్సిన క్షణాన వదులుకుంటూ, తనలోని కొంత భాగాన్నీ కోల్పోవడమనేది మనిషి బతికుండగానే అనుభవించే నరకం కదూ! కథనీ, దాని మరణాన్నీ మర్చిపోవాలంటే నాలోని కొంత భాగాన్నీ సమాధి చేయగలగాలి.

నేనో ఊహలబాటసారిని. బతికేది భూమ్మీదే! బతకడానికి కావాల్సినవన్నీ నిక్కచ్చిగా చేస్తాను. కమ్మని కలలు కనటానికి ఒళ్ళొంగేదాకా పని చేసి, కడుపు నిండా భోంచేసి, సంగీతాన్ని ఆస్వాదిస్తూనో, కథలని ఆలకిస్తూనో నిద్ర లోకి జారుకోవాలనే అవశ్యకాలు నాకేవీ లేవు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, వీలు కుదుర్చుకొని, గుళ్ళో కెళ్ళే ముందు చెప్పులు వదిలేసినట్టు, వాస్తవికతను వదిలి ఊహా ప్రపంచంలో ప్రవేశిస్తూ ఉంటాను. ఊహించుకోవడంలోని అలౌకికానుభూతిని అనుభవించి మళ్ళీ ప్రాపంచిక విషయాలేవన్నా నన్ను తట్టి లేపినప్పుడు గానీ వాస్తవికతలోకి రాను. అనుభవంలోకొచ్చిన అలౌకికానుభూతిని మానవబుద్ధికి అవగతమయ్యే మాటల్లోనో, రంగుల్లోనో, గమకాల్లోనో తర్జుమా చేసి, ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టి, ఆమోదముద్ర వేయించుకోడానికి తాపత్రయపడి, ఓ వైపు అహాన్ని పెంచి పోషించుకుంటూనే మరోపక్క నైతికబాధ్యతని భ్రమసి, మోయలేని భారాన్ని నెత్తినేసుకొని, దించుకోలేక, పంచుకోలేక యాతనలు పడ్డం నా వల్ల కాదు. కళాకారుడిగా కన్నా స్వాప్నికుడిగానే నా ఉనికికి గుర్తింపు అనుకున్నాను.

ఓ రోజు, ఊహాంబరంలో విహరిస్తుండగా ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. నన్ను ఆకర్షించింది. ఆకర్షణలు నాకు కొత్త కావు. నా ధ్యాస దాని మీద నిలిచిపోయేసరికి, ఆలోచనకి కొత్తగా రెక్కలు పుట్టుకొచ్చాయి. రెక్కలు ఆడిస్తూ అది చేసే విన్యాసాలు నన్ను కట్టిపడేసాయి. దాని నుండి ధ్యాస మరల్చాలని అనిపించలేదు. ఇంత చనువిచ్చాక, అది మాత్రం ఊరుకుంటుందా? ఏదో ఒక మూల మరుగున పడి సమసిపోవాల్సింది కాస్తా, నా మెదడులోని క్రియాశీలక భాగంలో ప్రవేశించి, ఒక్క చోట ఉండక కుప్పిగంతులేస్తూ ఒక కణం నుండి మరో కణం పైకి దూకింది. ఆలోచన అడుగేసిన ప్రతీ కణం నుండి దాని క్లోన్లు పుట్టుకొచ్చాయి. ఒకటే ఆలోచన, బుర్ర నిండా! ఎన్నో మైళ్ళ ప్రయాణంలో బోలెడు వింతలూ-విశేషాలు చూస్తూ, తనతో పాటు రాగలిగిన ప్రతీదాన్ని లాక్కుంటూ, రాలేనిదాన్ని అక్కడే వదిలివేస్తూ నిరంతరంగా కొనసాగే నా ఆలోచనా స్రవంతికి ఇప్పుడో పెద్ద కొండల సమూహం అడ్డొచ్చినట్టయ్యింది. స్తబ్ధత అలుముకుంటుంది లోలోపల. అలసిందేమో పాపం, మెదడులోని నీటి మడుగుల్లోకి దూకి ఈత కొడుతూ దాని కేరింతలూ. నిద్రలో నాకు కలవరింతలూ.

ఇలా వదిలేస్తే కష్టమని, తలను గట్టిగా విదిల్చాను. దెబ్బకు ఆలోచన బుర్ర నుండి పోయింది. రక్తం ద్వారా నరనరంలోనూ ప్రయాణించింది. నాలోని ప్రత్యణువునూ తాకింది. చుట్టూ చుట్టొచ్చి గుండెలో ఓ మూల ఒదిగ్గా కూర్చుంది. ఆకర్షణలు కొత్త కాకున్నా, పరవశాన్ని నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు. తొలిసారి అనుభవంలో కలిగే ఉత్సుకత, గుండె దడ, అయోమయం ఒక్కోటిగా తెల్సొస్తున్నాయి. ఏదో క్షణాన భయం బలపడింది. గుండెను ఖాళీ చేస్తే నయమనిపించింది. గుండెలోని సంగతులను ఒద్దికిగా పట్టుకోగల పాత్రలు రెండే – ఒకటి మరో గుండె, రెండు కాగితం. పీడకలలో ప్రాణం మీదకొచ్చిందని గొంతు చించుకొని అరుస్తున్నా, పైకి మాత్రం మూల్గుళ్ళే వినిపిస్తాయి! ఒక గుండె, మరో గుండెను అర్థంచేసుకోవాడానికి మూల్గుడులాంటి సంభాషణలే దిక్కు. కథో, ఆత్మకథో కాగితంపై పెట్టగలిగితే అంతకన్నానా?! కానీ, కథంటే మాటలా? కంటికింపుగా అనిపించిన అందాన్ని కళ్ళల్లో నింపుకొని ఊరుకోక, కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న తాపత్రయం వంటిది కథ రాయడమంటే! అదీ కాక, కొన్ని కథలను చెప్పకుండానే వినిపించగలగాలి.

నా ప్రపంచం, నాకు తెల్సిన ప్రపంచం అన్నీ అయ్యి కూర్చున్న ఆలోచనని గుండె నుండి బయటి తరిమేయలేకపోయాను. కొన్నాళ్ళ వరకూ ఉన్న చోటునే ఉంటూ అది పెరుగుతూపోయింది. దాచుకోలేనంతగా. దాయలేనంతగా! గుండె భరించలేనంత భారమైనా మోయడానికి సిద్ధపడ్డాను. విశ్వరూపం దాల్చడంతో ఆగక. గుండెను చీల్చటం మొదలెట్టింది. బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా చీల్చటం లేదు. పదునైన సూదితో గుచ్చుతూ రంధ్రాలు చేసి గుండెను చీల్చుతుంది. పంటికింద నొక్కి పెట్టే బాధ కాదది. నా ఉనికినే ప్రశ్నార్థకం చేసేటంతటి బాధ. భరించలేకపోయాను. కాగితాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను.

కథ రాయాలంటే ఏకాంతం కుదుర్చుకోవాలి నేను. తలుపు మూశాను, నా నుండి ప్రపంచాన్ని వెలివేయడానికి. నేనూ, నాలోని ఆలోచనకి తప్ప అన్యులకి ఆ గదిలో ప్రవేశం లేదు. గదినంతటినీ చీకటి చేసి, టేబుల్ లాంప్‍ని మాత్రమే వెలగనిచ్చాను. కాగితం మీద కలం పెట్టాను. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటితో కూడిన మాటలు, మాటల అర్థాలు, విపరీతార్థాలు, నానార్థాలు, అర్థవంతమైన మాటల సమూహాలతో వాక్య నిర్మాణం, గొలుసుని గొలుసుతో ముడివేస్తున్నట్టు వాక్యాలను వాక్యాలతో అల్లిక – ఇవ్వన్నీ నాకు సుపరిచితమే. వీటి మధ్యనే బతుకంతా గడిపాను. గడుపుతున్నాను. ఇప్పుడు మాత్రం చేయి కదలటం లేదు. మాట పుట్టటం లేదు. అక్షరపు ఆకారం స్ఫురణకి రావటం లేదు. తొట్టతొలి నాటక ప్రదర్శన ఇస్తున్నప్పుడు బిర్రబిగుసుకుపోయే నటుడల్లే టేబుల్ లాంప్ వెలుతురులో చేయి కదలటంలేదు. ఆ క్షణాన్న శూన్యం అనుభవంలోకి వచ్చింది.

లోపలి బాధ హెచ్చింది. బయట శూన్యం బలపడింది. భాషాజ్ఞానం నిక్షిప్తమైన చోటకి వెళ్ళలేకపోతున్నాను. మెదడు సహకరించటం లేదు. ఏదోఒకటి రాయాలి. చేయి కదలాలి. మాటల కోసం నన్ను నేను మధించుకోవాలి. పొట్టలో అక్షరం ముక్కలుంటాయా? ప్రయత్నించాలి. కడుపులో చేయి పెట్టి దేవాల్సివచ్చింది. ఇంకా అక్షరం దొరకలేదు. మరింతగా ప్రయత్నించాను. సన్నని ప్లాస్టిక్ ట్యూబుని చూపుడు-బొటనవేళ్ళతో గట్టిగా పిండినట్టు పేగుల్ని పిండాను. నరనరంలోని రక్తం కాసేపు ఆగి, ఒక్కసారిగా పోట్టెత్తింది. తల పగిలిపోతోంది. బిగిసుకుపోయిన మెదడు నరాలు మెల్లిమెల్లిగా వదులయ్యాయి. భాషకి ద్వారాలు తెరిచాయి. అక్షరాలు, మాటలు, వాక్యాలు, వాక్యాలు నిర్మించాల్సిన ఊహాచిత్రం అన్నీ ఒక దాని వెనుక ఒకటి కాగితం మీద పడ్డాయి, గాయం నుండి కారుతున్న రక్తపు చుక్కాల్లా. కొన్ని పాత్రలను పుట్టించి, వాటికేవో పరిస్థితులు కల్పించి – కథ మొదలయ్యింది.

ఇక ఆలోచన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా కథలో నిల్పాలన్న తరుణంలో ఆలోచన తుర్రుమని ఎగిరిపోయింది. నాతో ఏ సంబంధమూ లేనట్టు. నాది కాదన్నట్టు. దాని వెంట పరిగెత్తబోయాను. వాస్తవికత కాళ్ళకి అడ్డం తగిలి కిందపడ్డాను. దేని కోసం అయితే ఇంతటి భారం తలకెత్తుకున్నానో అదే పోయాక కథ దేనికి? మొదలెట్టిన కథనేం చెయ్యాలి? ఆసరికే ఊపిరి ఆడక, ఊపిరి ఆగక కొట్టుకుంటున్న కథని చూస్తూ ఊరికే ఉండలేక, చేతుల్లోకి తీసుకొని, దాని సంపూర్ణ పోషణభారం తీసుకున్న వేళ, దాని కోసం తల బద్దలైపోతున్నా మాటలను మధిస్తుంటే.. అదో అప్పుడే, ఏదో క్షణాన కథ చచ్చిపోయింది, చిటుక్కున! నా చేతుల్లోనే, నేను చూస్తూ ఉండగానే!

మర్చిపోవాలనుకుంటూనే చనిపోయిన కథ గురించిన కథ చెప్పుకొచ్చాను. మర్చిపోవడానికి ప్రయత్నించటమంటే సముద్రపు ఒడ్డున నత్తగుల్లలన్నీ ఏరి, దారానికేసి కట్టి, ఆ దండను సముద్రంలోకి విసిరేయడం. ఎప్పుడో ఏదో ఒక అల మళ్లీ వాటిని తీరానికి చేర్చుతూనే ఉంటుంది. చనిపోయిన కథకీ కథ అల్లగలిగానే అని నవ్వువస్తోందిప్పుడు, కథే మిగిల్లేదన్న బాధను వెంటేసుకొని. అసలు దీనికి ఆయుష్షు తక్కువని ముందే గ్రహించగలిగాను. గ్రహించీ ఆరాటపడ్డాను, క్షణికమైనా బంధం కోసం పరితపించాను. బతికించుకోలేకపోయిన అసమర్థతను పదే పదే గుర్తుతెస్తూ, అంతరాత్మ ఘోషిస్తూనే వుంది, “ఒక కథ చచ్చిపోయింది” అని.

— పూర్ణిమ తమ్మిరెడ్డి, హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

This entry was posted in కథ. Bookmark the permalink.

14 Responses to ఓ కథ చచ్చిపోయింది!

  1. John Hyde says:

    ఇక ఆలోచన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా కథలో నిల్పాలన్న తరుణంలో ఆలోచన తుర్రుమని ఎగిరిపోయింది. నాతో ఏ సంబంధమూ లేనట్టు. నాది కాదన్నట్టు. దాని వెంట పరిగెత్తబోయాను. వాస్తవికత కాళ్ళకి అడ్డం తగిలి కిందపడ్డాను. దేని కోసం అయితే ఇంతటి భారం తలకెత్తుకున్నానో అదే పోయాక కథ దేనికి? మొదలెట్టిన కథనేం చెయ్యాలి? ఆసరికే ఊపిరి ఆడక, ఊపిరి ఆగక కొట్టుకుంటున్న కథని చూస్తూ ఊరికే ఉండలేక, చేతుల్లోకి తీసుకొని, దాని సంపూర్ణ పోషణభారం తీసుకున్న వేళ, దాని కోసం తల బద్దలైపోతున్నా మాటలను మధిస్తుంటే.. అదో అప్పుడే, ఏదో క్షణాన కథ చచ్చిపోయింది, చిటుక్కున! నా చేతుల్లోనే, నేను చూస్తూ ఉండగానే!

    good narration

    congratulations

  2. Sowmya V.B. says:

    బాగుంది. కీప్ రైటింగ్.

  3. Sowmya V.B. says:

    నాదో సందేహం – మూల్గుళ్ళు,మూల్గుడు – అన్న పదాలు ఉన్నాయా? ఉంటే, ఏ ప్రాంతం వాడుక? మూలుగు-మూల్గు, మూలుగులు-మూల్గులు : ఇవి తరుచుగా కనబడుతూ ఉంటాయి రాతల్లో. అందుకని అడిగాను.

  4. బావుందండి, మీ కధనం.

  5. vinaychakravarthi says:

    artham kaaledu……..

  6. Mahita says:

    :), can’t quite speak about the impressions yet, I am choked with the swarm of feelings and thoughts running through me at this moment, as a result of this narration.

    Good going, keep it up.

  7. 🙂 బాగుందండీ మీకథనం. లేదు, లేదంటూ కథని కొనసాగించడం అంత తేలిక కాదు.

  8. కానీ మీరు బాగా నడిపేరు అంటున్నాను.

  9. chavakiran says:

    🙂

    అందుకే కొద్దిగా జనాల మధ్య తిరగాలి, మరీ సాహితీ కారలతోనే కాకుండా. అప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగవు.

  10. నెలనెలావెన్నెల says:

    బాగుంది, బాగుంది
    అభినందనలు

  11. మోహన says:

    Felt like a sky jump!!
    Traveled a great depth very fast. But, dont remember what I met on the way! 🙁

  12. Independent says:

    Your out of body experiences are so much detailed and amazing Purnima.
    నీ లోంచి నువ్వు బయటకొచ్చి నిశితంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నిన్ను చూడాలని నాకు చాలా కుతూహలం. ఏ నువ్వు ఇంట్రస్టింగ్ గా ఉంటావో వింటానికి. అసలు నాకో ఊహానుమానం. రూం లోకెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే ఆ గది ఒక ‘స్పేస్ కాప్సూల్” అయిపోయి, అందులో నువ్వో తారాజువ్వై విచ్చుకొని బయల్పడిన ఎన్నో నువ్వులు అలా గదిలో తేలుతా ఒక నువ్వు, మరో నువ్వుతో సంభాషిస్తా ఉంటాయేమోనని.

  13. పూర్ణిమగారి కథా కథనం చాలా బావుంది. ‘కథ చచ్చిపోయిందీ కథలో పూర్ణిమ గారి కథ మాత్రమే చచ్చిపోయింది. వాస్తవంలో… తెలుగు కథే చచ్చి పోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే జీవచ్ఛవమయ్యింది. జన జీవిత గమనాన్ని, గమ్యాలను ప్రతిబింబించే కథలే కరవయ్యాయి. సమాజంలోని వ్యక్తుల చారిత్రక, వైయక్తిక లక్షణాలను పుణికిపుచ్చుకున్న పాత్రలున్న కథలు రావడమేలేదు. ప్చ్ …… కథనశక్తున్న పూర్ణిమలాంటివారు తమ కథలలో జీవితాన్ని ప్రతిబింబించే విధంగా సీరియస్ ప్రయత్నం చేయాలి. అందుకు తగిన తాత్విక దృక్పథాన్ని, జీవిత దృక్పథాన్ని పుణికిపుచ్చుకోవలసి ఉంటుంది. గతంలోని అలాంటి కథాసాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇది ఉపదేశం కాదు అభ్యర్థన మాత్రమే….

  14. murty says:

    కథ (నం..!) చాలా బాగుంది. స్వాప్నికత, తాత్వికత, వాస్తవికత లను అబ్సర్డిజం దారంతో అందంగా అల్లిన అక్షర హారం.

Comments are closed.