మృతజీవులు – 31

-కొడవటిగంటి కుటుంబరావు

తొమ్మిదవ ప్రకరణం

ఉదయాన, ఆ నగరంలో ఒకరినొకరు చూడబోవటానికి ఏర్పాటై ఉన్న వేళ ఇంకా కాకముందే, ఒక స్త్రీ పసందయిన గళ్ళ పైదుస్తు కప్పుకుని, నీలం రంగు గల స్తంభాలూ, వంగపండు రంగు పూతా కలిగిన ఒక ఇంట్లో నుంచి గబగబా వెలువడింది. ఆమె వెంట ఒక బంట్రోతు ఉన్నాడు, వాడి టోపీకి సరిగ పట్టీ ఉన్నది. ఆమె శరవేగంతో వచ్చి, ఇంటి ముందు నిలబడి ఉన్న బండిలోకి ఎక్కింది. వెంటనే బంట్రోతు బండి తలుపు దబాల్న మూసి, ఆవిడ బండిలోకి ఎక్కటానికి ఉంచిన మెట్టు తీసేసి, బండి వెనక భాగంలో ఉన్న తోలు పట్టీ పట్టుకుని నిలబడి, బండివాడికి “పో!” అని కేక పెట్టాడు. ఆవిడ ఇప్పుడే ఒక కబురు విన్నది, దాన్ని మరొకరికి చెప్పిన దాకా ప్రాణం నిలిచేటట్టు కనబడక దాన్ని మోసుకుని బయలుదేరింది. ఆవిడ క్షణ క్షణానికీ కిటికీలోంచి బయటికి చూస్తూ, ఇంకా సగం దారిలోనే ఉన్నట్టు తెలుసుకుని రోత చెందింది. ప్రతి ఇల్లూ మామూలు కన్న చాలా పొడుగుగా ఉన్నట్టు కనిపించింది. చిన్నచిన్న కిటికీలు గల తెల్లని ధర్మసత్ర భవనం ఎంతకీ అయిపోకపోవటం చూచి ఆమె, ఈ దిక్కుమాలిన యిల్లు ఎంతకూ తరగదేం? అనుకున్నది. “త్వరగా పద, త్వరగా పద; అంద్రూష్క. ఏం, అలా పాకుతున్నావు?” అని అప్పటికే రెండు సార్లు బండివాణ్ణి హెచ్చరించటం జరిగింది. చిట్టచివరకు గమ్యస్థానం వచ్చింది. బండి ఒక కర్రడాబా ముందు నిలిచింది. డాబాకు ముదురు బూడిదరంగు వేసి ఉన్నది. కిటికీలకు ఎగువగా కొద్దిగా చెక్కడం పని చేశారు. కిటికీలకు ముందు బద్దీల తడికెలున్నాయి. ఇంటి ముందున్న చిన్నతోటలో సన్నటి చెట్ల మీద నగరపు దుమ్ము తెల్లగా పడివున్నది.

కిటికీలలో పూలతొట్లున్నాయి, పంజరంలో ఒక చిలక ఊగుతున్నది, రెండు బుల్లికుక్కలు ఎండలో పడుకుని వున్నాయి. ఈ ఇంట్లో ఈ స్త్రీ యొక్క ప్రాణస్నేహితురాలు ఉంటున్నది. ఈ స్త్రీలకు ఏం పేరు పెడితే ఎవరికి ఆగ్రహావేశం వస్తుందో అని కథకుడు తికమక పడుతున్నాడు. ఎందుకంటే, లోగడ అలా జరిగింది. వాళ్ళకు ఊహించిన పేర్లు పెట్టటం ప్రమాదకరం. ఏ ఇంటిపేరు ఆలోచించినా, విస్తృతమని చెప్పబడే సామ్రాజ్యంలో, ఎక్కడో ఒకరికి ఆ పేరు ఉండనే ఉంటుంది. వాడికి అంతా ఇంతా కాని ఆగ్రహం వచ్చేస్తుంది. తాను ఎలాటి వాడో, ఎలాటి గొర్రెచర్మాలు ధరిస్తాడో, ఏ అగ్రఫేన ఇవానవ్నతో పోతాడో, తనకు ఏమేమి తినటం ఇష్టమో ఆరా తీయటానికి గాను కథకుడు పనిపెట్టుకుని రహస్యంగా ప్రాంతాలకు వచ్చి వెళ్ళాడని ఆరోపణ చేస్తాడు. సైన్యంలో వారి హోదాలు కూడా పేర్కొన్నామంటే, బాబో-ఇంకా ప్రమాదం. ఇప్పుడు అన్ని హోదాలవాళ్లూ ఎంత తామసంగా ఉన్నారంటే, వాళ్ళకు పుస్తకంలో ఏది కనిపించినా ఎవరో ఒకరిమీద రాసినట్టే తోస్తుంది; ఈ తామసం సర్వత్రా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫలాని పట్టణంలో ఒక మందమతి అయిన మనిషి ఉన్నాడంటే చాలు, అది ఎవరికో ఒకరికి తగులుతుంది; పెద్దమనిషిలాగా కనపడేవాడొకడు లేచి “నేను మనిషినే; అయితే, నేను మందమతి నన్నమాట!” అంటాడు. అంటే, నిజం ఇట్టేపట్టేస్తాడు. ఆందుచేత ఈ చిక్కులన్నీ లేకుండా ఉండగలందులకు ఈ ఇంట్లో వుండే ఆవిడను, నగరంలో ఉండే అందరూ అన్నట్టే, ఒప్పుల కుప్ప అందాం. అంతులేని పరోపకారపారీణత ద్వారా ఆవిడ ఈ పేరు సంపాదించుకున్నది. అయితే అంత మంచితనంలోనూ-ఏమైనా ఆడవాళ్లు గద! -ఎంత తియ్యని మాటల సందున కూడా ఒక ముల్లు తగలనే తగులుతుంది! ఇక, ఎవరైనా ఆమె దారికి అడ్డుతగిలి ఆగ్రహం తెప్పించారో వారికి మూడిందన్న మాటే. అయితే ఆ ఆగ్రహం కూడా పైకి ఎంతో నాగరికంగానూ, మర్యాదకు భంగం కలగకుండానూ ఉంటుంది; అదీ మారుమూల బస్తీలలోని రివాజు. ఆవిడ ఏం చేసిన ఎంతో ముచ్చటగా ఉండేది, ఆవిడకు కవిత్వమంటే కూడా ఎంతో ఇష్టం, ఆలోచనా నిమగ్నురాలిగా తలను ఉంచటం ఆమెకు చాతనవును, అందరూ ఆమె నిజంగా ఒప్పులకుప్పేనని ఒప్పుకున్నారు.

రెండవ యువతి, అంటే చూడవచ్చిన ఆవిడ, ఇంత సమగ్ర లక్షణపతి కాదు, అందుచేత ఆమెను తేలికలో ఒయ్యారి భామ అందాం. ఎవరో రావటంతో, ఎండలో నిద్రపోయే కుక్కలు కాస్తాలేచి, కొత్త మనిషితో బాటు హాలులోకి వచ్చి గుండ్రంగా తిరగసాగాయి. ఆమె హాలులోకి వస్తూ పై దుస్తు తీసేసింది. ఆమె లోపలి దుస్తులు నాజూకుగా ఉన్నాయి. ఆమె మెడ నుంచి రంగురంగుల పట్టీలు వేళ్లాడుతున్నాయి. హాలంతా మల్లె అత్తరు వాసనతో నిండిపోయింది. ఒయ్యారిభామ రాక వింటూనే ఒప్పులకుప్ప హాలులోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరూ చేతులు పట్టుకుని, ఒకరినొకరు ముద్దుపెట్టుకుని, శలవుల అనంతరం కలుసుకున్న విద్యార్థినుల్లాగా పొలికేకలు పెట్టారు. ఆ తరవాత ఆ పిల్లలను తల్లులు, వారిలో ఒకతె రెండవ దానికన్న పేదదని చెప్పటం జరుగుతుంది. వీరి ముద్దుల చప్పుడుకు కుక్కలు మొరిగాయి. వాటిని చేతిరుమాలుతో విదిలించి, ఇద్దరూ డ్రాయింగ్ రూములోకి వెళ్ళారు. ఆ గది తేలిక నీలంరంగులో వున్నది. అందులో ఒక సోఫా, ఒక కోడిగుడ్డు ఆకారంగల బల్లా, ఐవీ తీగ పాకే ఒక స్క్రీనూ కూడా వున్నాయి. రెండు కుక్కలూ వారి వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. “ఇటు, ఇటు, ఈ మూల కూచోవాలి!” అంటూ ఇంటావిడ తన స్నేహితురాలిని సోఫా మూల కూచోబెట్టి “ఆఁ, అలాగా! ఇదుగో దిండు,” అని ఆమె వీపు వెనక ఒక మెత్త దోపింది; దానిమీద ఊలుతో కుట్టిన ‘వీరుడి ‘ బొమ్మ వున్నది. అలాటి బొమ్మలను చిత్రించేటప్పుడు ముక్కును నిచ్చెనలాగానూ, పెదవులను పలుచదరంగానూ చిత్రిస్తారు. “వచ్చింది నువ్వేమో, బతికిపోయాను… బండి వచ్చి ఆగటం విని ఇంత పెందలాడే ఎవరు వచ్చి ఉంటారా అనుకున్నాను. ఉపాధ్యక్షుడి భార్య అయివుంటుందని పరాష అన్నది. ఆ వెలికిది వచ్చి జిడ్డుపట్టిస్తుంది గామాలనుకుని ఇంటోలేనని చెప్పమందామని కూడా అనుకున్నాను.”

వచ్చిన మనిషి వెంటనే అసలు విషయం చెప్పేద్దామనుకుంటుండగా ఒప్పులకుప్ప ఆశ్చర్యంతో చిన్నకేక పెట్టి సంభాషణను మరొకదారి పట్టించింది.

“ఈ అద్దకం గుడ్డ ఎంతబాగుందో!” అన్నది ఒప్పులకుప్ప ఒయ్యారిభామ దుస్తుకేసి చూసి.

“అవును, బాగుంది. కాని గళ్ళు చిన్నవిగా వుండి చుక్కలు నస్యం రంగుకాక తేలిక నీలంరంగుగా వుంటే ఇంకా బాగుంటుందని ప్రస్కోవ్య ఫ్యదురోవ్న అంటుంది. మా చెల్లికి ఒక గుడ్డ పంపించాను. అది ఎంత బాగుందో చెప్పలేను. తేలిక నీలంరంగు మీద సన్నసన్నని గీరలు, మనం ఊహించలేమన్నమాట, ఆ గీరలమీద చుక్కలూ ఈనెలూ, చుక్కలూ ఈనెలూ, చుక్కలూ, ఈనెలూ… అద్భుతం! అటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకోవలిసిందే.”

“మరీ కొట్టవచ్చినట్టుంటుంది లెస్తూ!”

“ఎబ్బే, కొట్టవచ్చినట్టుండదు!”

“కొట్టవచ్చినట్టు ఉండే ఉంటుంది.”

ఒప్పులకుప్ప భౌతికవాది అని మనం తెలుసుకోవాలి, ఆవిడ కన్నీ శంకలూ, సందేహాలూనూ, ఎన్నో విషయాలను ఆమె నమ్మేది కాదు.

ఒప్పులకుప్ప కొట్టవచ్చినట్టు ఉండనే ఉందని చెప్పి, “ఓ భలే బాగా చేశావే, అరుకుటంచులు పెట్టగూడదు!” అన్నది.

“పెట్టగూడదూ?”

“వాటి బదులుగా చిన్నచిన్న తోరణాలు పెడుతున్నారు.”

“బాగుండదే-చిన్నచిన్న తోరణాలా?”

“చిన్నచిన్న తోరణాలు, అంతా తోరణాలే: తోరణాలతో ఆడవాళ్ళు పైతొడుగులు చేస్తున్నారు, చేతులమీదా, భుజాలమీదా, కింది భాగంలోనూ, అంతటా తోరణాలే.”

“అంతా తోరణాలే అయితే ఏం బాగుంటుంది. సోఫ్య ఇవానివ్న?”

“చాలా బాగుంటుంది అన్నా గ్రిగోర్యెవ్న; ఎంత బాగుంటుందో ఊహించలేవు. దానికి రెండంచులుంటాయి, చేతులు దూర్చేటందుకు రెండు పెద్దకంతలు వదల్తారు, పైనా… ఇక చూడూ నువ్వాశ్చర్యపడతావుగదా… మహాచిత్రంలే: నడుములు ఎన్నడూ లేనంత పొడుగనుకో, ముందువేపు కోసగా వస్తాయి. ముందుబద్దీ చాలా పొడుగు పెడతారు. లంగా, పాతకాలపు ఫార్దింగేల్ లాగా చుట్టూ ఎత్తుకుంటుంది. బొద్దుగా కనిపించటానికి వెనక మదువు కూడా పెడతారు.”

“ఇంకా నయం… అడగక్కర్లేదు!” అన్నది ఒప్పులకుప్ప, దర్పంగా తలవిసురుతూ.

“అవును, మరి; అడగనే అక్కర్లేదు” అన్నది ఒయ్యారిభామ.

“ఎన్నయినా చెప్పు, నాకా ఫాషను అవసరంలేదు.”

“సరిగా నాకూ అలానే అనిపించింది–ఒక్కోసారి ఈ ఫాషన్లు చూస్తేనే…అన్నిటినీ మించిపోతాయి! ఊరికే తమాషాకు ఒక నమూనా పంపించమని మా చెల్లెల్ని అడిగాను; మా మిలాన్య దాన్నిబట్టి కుట్టిపెడతానన్నది.”

“ఏమిటీ? నిజంగా నమూనా సంపాదించావూ?” అన్నది ఒప్పులకుప్ప. ఆవిడ గుండె వేగంగా కొట్టుకోవటం పైకే తెలుస్తున్నది.

“ఆ, మా చెల్లెలు తెచ్చింది.”

“చూడవమ్మా, నాకొకసారి ఇస్తావా, నీకు పుణ్యముంటుంది.”

“అయ్యో, ప్రస్కోవ్య ఫ్యదోరవ్నకు ఇస్తానని మాట ఇస్తినే. ఆవిడ పని అయినాక ఏమన్నా”

“ప్రస్కోవ్య ఫ్యదోరవ్న తరవాత ఎవరు వేసుకుంటారేమిటి? నువు స్నేహితురాళ్ళకన్న పరాయివాళ్ళను ఎక్కువగా చూడటం ఏమీ బాగాలేదు.”

“ఆమె మా బంధువురాలే గద, నీకు తెలీదూ?”

“ఏం బంధువులే, అత్తవారి వేపు బంధుత్వమేగా… లేదు, సోఫ్య ఇవానీవ్న, నాతో మాట్లాడకసలు; నీకు నేను లోకువైనట్టున్నాను… నా మీద నీకు విసుగెత్తినట్టుంది, నాతో స్నేహం మానెయ్యాలనుకుంటున్నావులే.”

పాపం, సోఫ్య ఇవానీవ్నకు ఏం చెయ్యాలో తోచలేదు. అటునుయ్యీ, ఇటుగొయ్యీ అయినట్టయింది ఆమె గతి, దంభాలు పలికితే ఊరికేపోదు! ఆమెకు నాలుక కోసేసుకోవాలనిపించింది.

“ఇంతకూ, మన పెద్దమనిషి వార్తలేమిటి?” అని ఒప్పులకుప్ప అడిగింది.

“అయ్యొ రాతా! నే నిలా కూచుండి పోయానేమిటీ? నా మతి మండా! నేనసలు ఎందుకు వచ్చానో తెలుసా, అన్నా గ్రిగోర్యెవ్న?” చూడవచ్చినావిడ దీర్ఘంగా ఊపిరి పీల్చింది. ఆవిడ నోటినుంచి మాటలు ఒక్కొక్క డేగ లాగా ఎగిరి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆవిడ ప్రాణస్నేహితురాలు కౄరంగా ఆమెకు అడ్డువచ్చింది.

“ఆయన్ని నువు మెచ్చుకుంటే మెచ్చుకో, ఆయన్ను గురించి ఎంత తియ్యటి కబుర్లయినా చెప్పు, నేనుమాత్రం ఖండితంగా చెబుతున్నాను. కావలిస్తే ఆయన మొహానే అనేస్తాను, అతను వట్టి పనికి మాలినవాడు, పనికిమాలినవాడు,” అన్నదామె ఉద్రేకంతో.

“అవునా, నేను చెప్పేది కూడా కాస్తవిను…”

“ఎంతో మంచివాడని పుకారు వేశారు, కాని అతను మంచి వాడేకాడు, ఆయన ముక్కు… వట్టి అందవికారమైన ముక్కు.”

“కాస్త నన్ను చెప్పనీ, నన్ను చెప్పనీ…అన్నా గ్రిగోర్యెవ్న తల్లీ, నన్ను చెప్పనీ! ఎంత అప్రతిష్ఠ పని అనుకున్నావ్? పెద్దకథ, ‘స్కోనాపెల్ ఈస్ట్యా’,” అన్నది వచ్చినావిడ, ఏదో వేడుకుంటున్నట్లుగా గొంతూ, దాదాపు నిరాశచెందినట్లు మొహమూ పెట్టి.

ఆడవాళ్ళు తమ సంభాషణలో ఎన్నో విదేశీ మాటలూ, ఫ్రెంచి వాక్యాలూ ప్రవేశపెట్టేవారని చెప్పటం నా విధి.

రష్యాకు ఎంతో మహోపకారం చేసినందుకు ఫ్రెంచి భాషపైన ఈ రచయితకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, మా నాగరిక జనులు కేవలం దేశాభిమానం కొద్దీ అస్తమానం ఆ భాషలోనే మాట్లాడటం అలవాటు చేసుకోవటమనేది మెచ్చుకోదగిన ఆచారమని ఒప్పుకున్నప్పటికీ, ఈ రష్యను వాక్యంలోకి ఇతర భాషా వాక్యాలు ప్రవేశపెట్ట సాహసించలేడు. అందుచేత రష్యను భాషలోనే పనిసాగిస్తాం.

“ఏం కథ?”

“ఓ నా బంగారు అన్నా గ్రిగోర్యెవ్న! నా స్థితి నువు ఊహించుకున్నట్టయితేనా! నువు ఊహించు చూస్తాం, ఇవాళ పొద్దున ఫాదర్ కిరివ్ భార్య నా దగ్గిరికివచ్చి-ఏమిటనుకున్నావు? మహాసాధువు లాగా కనపడే ఈ పెద్దమనిషి, మొత్తానికి భలేవాడు కాడూ?”

“ఏమిటీ, ఆయన ప్రీస్టు పెళ్ళాంతో కలగజేసుకున్నాడా?”

“అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న! అంతకంటె లేకపోతే ఇక లేనిదేం? ఆవిడ నాతో ఏం చెప్పిందని అడుగూ! కరబోచ్క సతి అని పల్లెటూరినుంచి ఒకావిడ వాళ్ళింటికి వచ్చిందట, వచ్చి మతిపోయిన దానిలాగా, మొహాన రక్తం చుక్క లేకుండా కథంతా చెప్పిందట, ఏం కథ! నువు విను అంతే, నవల అనుకోవలసిందే! అకస్మాత్తుగా అర్థ రాత్రివేళ అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో మనం ఊహించలేనంత భయంకరంగా గేటు తట్టి ఎవరో, ‘గేటు తెరుస్తారా? పగల గొట్టమా?’ అన్నారుట… నీ కెట్లా ఉంటుందీ? అంత చేసినాక అతను చాలా మంచివాడు కాడూ?”

“మరి ఈ కరబోచ్క ఏరకం మనిషీ, చిన్నదీ, అందగత్తేనా?”

“ఎబ్బే, ముసలావిడ.”

“ఏం చిత్రం! ముసలిదానివెంట పడ్డాడూ? మన ఆడవాళ్ళ అభిరుచులకు చెప్పుకోవాలి! ప్రేమించటానికి భలేవాణ్ని సంపాదించుకున్నారు!”

“అదేమీకాదు, అన్నా గ్రిగోర్యెవ్న. నువు పెడదారిలో ఉన్నావు. నువే ఆలోచించు, ఈ మనిషి ఏ రినాల్డో రినాల్డినీ లాగానో కత్తులూ, కటార్లూ ధరించివచ్చి, ‘చచ్చిపోయిన నీ కమతగాళ్ళందర్నీ నాకు అమ్ము.’ అన్నాట్ట. ‘చచ్చిపోయినవాళ్ళను ఎలా అమ్మేది?’ అన్నదట కరబోచ్క మంచిగా. ‘లేదు, వాళ్ళు చావలేదు, వాళ్ళు నా సొత్తు. వాళ్ళు చచ్చినదీ లేనిదీ నాకు తెలుసు,’ అన్నాట్ట. ‘వాళ్లు చావలేదు, చావలేదు,’ అని కేకలు పెట్టాట్ట. అతనుచేసిన అల్లరికి ఊళ్ళో వాళ్ళంతా పరుగెత్తుకొచ్చారుట, పిల్లలు ఏడవసాగారుట, అందరూ ఒక్కసారిగా మాట్లాడి నానా గందరగోళమూ, బీభత్సూ అయిందట… ఇదంతా విని నాకు ఎలా మతిపోయిందో, నువు ఊహించలేవు, అన్నాగ్రిగోర్యెవ్న. ‘అమ్మగారూ, అద్దంలో ఒకసారి చూచుకోండి, మీ మొహం ఎలా పాలిపోయిందో,” అంటుంది మా మాష్క. ‘ఇప్పుడద్దం మాట ఎత్తకే. నేను వెళ్ళి అన్నా గ్రిగోర్యెవ్నను చూడాలి.’ అన్నాను నేను, వెంటనే నా బండిని పట్టుకురమ్మని కబురుపెట్టాను. మా బండివాడు అంద్య్రూష్క ఎక్కడికి పోవాలంటే నా నోటమాట వస్తేనా? పిచ్చిదానిలాగా వాడికేసి తేరిపారచూశాను. నాకు మతిపోయిందని తప్పక అనుకుని ఉంటాడు. అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న, నేనెంత బెంబేలు పడిపోయానో నువు ఊహించగలిగితేనా!”

“విచిత్రంగానే ఉంది. ఈ చచ్చిపోయిన మనుషులకు అర్థమేమిటై ఉంటుంది? నా మటుకు నాకేమీ పాలుపోవటం లేదుమరి. ఈ చచ్చిపోయిన కమతగాళ్ల ప్రసక్తిరావటం ఇది రెండోసారి. నజ్ ద్ర్యోవ్ చెప్పినదంతా పచ్చి అబద్ధమని మా ఆయన ఇంకా అంటూనేఉన్నారుగాని, అందులో ఏదో ఉండాలి.”

“ఇదంతా విన్నప్పుడు నే నే స్థితిలో ఉన్నానో ఊహించుకో. కరబోచ్క అంటుందిగదా, ‘నా కిప్పుడేం చెయ్యాలో తెలీదు. నాచేత ఏవో తప్పుడు కాగితాలమీద సంతకం పెట్టించి, పదిహేను రూబుళ్లనోట్లు పారేశాడు. నేను అనుభవంలేని విధవరాలిని ‘ అంటుంది… ఎటువంటి పనులు జరుగుతున్నాయో చూశావా? నేనెంత గందరగోళ పడ్డానో నీకు తెలిస్తేనా!”

“నువ్వేమైనా చెప్పు, ఇది చచ్చిపోయిన మనుషుల విషయం కానేకాదు, దీనికంతకూ వెనక ఇంకేదో ఉంది.”

“నాక్కూడా అలానే అనిపించింది చెప్పొద్దూ, అన్నది ఒయ్యారిభామ ఆశ్చర్యపడుతూ. మరుక్షణమే ఆమెకు ఆ వెనక ఉన్నదేమిటో తెలుసుకోవాలని తహతహ పుట్టింది. ఆవిడ కొంచెం అనుమానిస్తూ, దీనికంతకీ వెనక ఏమిటుంటుందంటావేం?” అనికూడా అన్నది.

“ఇంతకూ నీ ఉద్దేశమేమిటి?”

“నా ఉద్దేశమా? నాకంతా అయోమయంగా వుంది.”

“అయితే అయింది, నువు ఏమంటావో తెలుసుకోవాలని వుంది.”

కాని ఒయ్యారిభామ ఏమీ అనలేకపోయింది. ఆవిడకు కంగారు పడటమైతే చాతనవునుగాని, దేన్ని గురించి కూడా ఇది ఇలాగూ అని విస్పష్టంగా చెప్పగల సమర్థత లేదు. అందుకే ఆవిడకు అందరికన్నా అధికంగా అడుగడుగునా ఆపేక్షచూపేవాళ్ళూ, ఆలోచన చెప్పేవాళ్లు కావాలి.

“అయితే, ఈ చచ్చిపోయిన కమతగాళ్లకు అర్థమేమిటో చెబుతా విను,” అన్నది ఒప్పులకుప్ప. ఈమాటలు వినగానే చూడ వచ్చిన మనిషి వినటానికి ఆత్రంగా కూచున్నది. ఆమె చెవులు నిక్కబొడుచుకున్నట్టుగా అయాయి. ఆమె గాలిలోకి లేచి సోఫాకు అంటీ అంటకుండా కూచున్నది. వస్తుతహా ఆమె కాస్త ఒళ్ళుగల మనిషే అయినా చిక్కిపోయి, ఈకలాగా అయి, కాస్త గాలి వీస్తే చాలు కొట్టుకుపోయేదానిలాగా అయిపోయింది.

ఇదే విధంగా వేటగాళ్ళు చుట్టిముట్టి కుందేలు అడివిలోనుంచి బయటికి రాగానే, గుర్రంమీద ఎక్కి కొరడా పట్టుకుని ఉన్న వేటగాడు నిప్పు అంటుకోవటానికి సిద్ధంగా వున్న పేలుడు మందులాగా అయిపోతాడు.

అతను మకిలగా ఉన్న గాలిలోకి చూస్తూ గురిగా జంతువును కొట్టి చంపుతాడు

, తన మీద పడే వెండి నక్షత్రాల లాటి మంచును కూడా లక్ష్య పెట్టడు, అది అతని పెదవుల మీదా, మీసాలమీదా, కళ్లమీదా, కనుబొమలమీదా, టోపీమీదా పడుతూ ఉంటుంది.

“ఆ చచ్చిపోయిన వాళ్లు…” అన్నది ఒప్పులకుప్ప.

“ఏమిటి, ఏమిటి?” అన్నది చూడవచ్చినావిడ.

“ఆ చచ్చిపోయిన వాళ్లు…”

“చెప్పుదూ, చంపకా!”

“వాళ్లు కేవలమూ మిష. అతను నిజంగా చేయదలచిన దేమిటంటే, గవర్నరు కూతురితో లేచిపోవటం.”

ఇది బొత్తిగా ఊహించరాని విచిత్ర పరిణామం. ఈ మాట వింటూనే ఒయ్యారిభామ కొయ్యబారి పాలిపోయింది, చచ్చేటట్టు పాలిపోయింది. ఈసారి ఆమె కంగారు పూర్తిగా వాస్తవమైనది. ఆమె తన చేతులను ఒక దానితో ఒకటి పట్టుకుని, “అమ్మో, నేను కలలో కూడా అనుకుని వుండను!” అన్నది.

“నువు నోరు మెదిపేసరికల్లా నాకు అసలు సంగతి తెలిసే పోయింది” అన్నది ఒప్పులకుప్ప.

“ఇంత అయాక వసతి పాఠశాలల చదువు గురించి ఏమనుకోవాలి, అన్నాగ్రిగోర్యెవ్న! వాళ్ళ బుద్ధిమంతనం ఇదా!”

“బుద్ధిమంతనమో, ఇంకానయం! ఆ అమ్మాయి కొన్నిమాటలంటుందిగదా, నేను నోటంట తిరిగి అనలేను!”

“మనుషులిలా తెగబడిపోవటం చూస్తే గుండె తరుక్కుపోతుంది అన్నాగ్రిగోర్యెవ్న!”

“ఆ పిల్ల కోసం మగవాళ్ళు ఒకటే వెర్రెత్తి పోవటం. నామటుకు నాకామెలో ఏమీ కనిపించదు… తగని నిక్కులు పోతుంది.”

“అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న తల్లీ, వట్టి రాతిబొమ్మ, మొహాన కొంచమైనా కదలిక వుంటేనా!”

“ఏమి నిక్కులు పోతుంది! ఏమి నిక్కులు! అమ్మయ్యో, ఏమి నిక్కులు! ఎవరు నేర్పారో తెలీదు. నా మటుకు నేను అంత నిక్కులు పోయే పిల్ల నెక్కడా చూడలేదు.

“వట్టి బొమ్మేనోయ్, పాలిపోయి వుంటుంది.”

“నాకు చెప్పకు, సోఫ్య ఇవానీవ్న, ఎరువు ఇంత మందాన మెత్తుకుంటుంది.”

“ఏమిటి నువ్వనేది, అన్నాగ్రిగోర్యెవ్న? ఆమె సున్నం లాగా వుంటుంది, సున్నమే!”

“నే నామె పక్కనే కూచున్నానోయ్. ఎర్రరంగు నావేలి మందాన వుండి, పెళ్లలూడి వస్తున్నది, తల్లిని చూసి నేర్చుకుంటున్నది. ఆవిడ ఒక కులుకులాడి, కూతురు తల్లిని మించిపోయింది.”

“క్షమించాలి. చూడూ, ఎంతైనా పందెం వేస్తాను, నా పిల్లల్నీ, భర్తనీ, నా ఆస్తి అంతా కూడా పందెం ఒడ్డుతాను, ఆ పిల్ల మొహాన ఒక్క చుక్క కూడా ఎరుపు రంగు లేదు.”

ఒప్పులకుప్ప తన రెండు చేతులూ కలిపేసుకుని, “ఏమిటి నువ్వనేది, సోఫ్య ఇవానీవ్న?” అన్నది.

“నువు నిజంగా ఏం మనిషివి, అన్నాగ్రిగోర్యెవ్న! నిన్ను చూస్తే ఆశ్చర్య మేస్తున్నది!” అన్నది ఒయ్యరిభామ, తానుకూడా చేతులు కలిపేసుకుని.

ఈ ఇద్దరూ ఏక కాలంలో తాము స్వయంగా చూసిన విషయం గురించి భిన్నాభిప్రాయాలు ప్రకటించటం చూసి పాఠకుడు ఆశ్చర్యపడరాదు. ఒక ఆడదానికి తెల్లటి తెలుపుగానూ, మరో ఆడదానికి ఎర్రటి ఎరుపుగానూ కనబడగలిగినవి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

“ఆ పిల్ల పాలిపోయి ఉన్నదనటానికి ఇంకో సాక్ష్యం చెబుతా చూడు. ఇప్పుడు జరిగినట్టుగా జ్ఞాపకం ఉన్నది, మానిలవ్ పక్కనే కూచుని, ‘ఆ పిల్ల ఎలా పాలిపోయి ఉన్నదో చూశారా?’ అన్నాను. మన పెద్దమనిషి లాటి బుద్ధి తక్కువవాళ్లు తప్ప ఆమెను చూసి మోహించరు. మన పెద్దమనిషేమో… ఆయన్ను చూసి ఎంత అసహ్యించుకున్నాను! ఎంత అసహ్యించుకున్నానో నువు ఊహించలేవు, అన్నాగ్రిగోర్యెవ్న.”

“అయినా ఆయన్ను చూసి మూర్ఛపోయిన వాళ్ళున్నారు.”

“నేనా, అన్నాగ్రిగోర్యెవ్న? అలా ఎన్నటికో అనుకోకు, ఎన్నటికీ, ఎన్నటికీ!”

“నేను నీ విషయం అనటం లేదే, నువు తప్ప ఇంకెవరూలేనట్టు!”

“ఉత్తది, ఉత్తది, అన్నాగ్రిగోర్యెవ్న! నాసంగతి నాకు బాగానే తెలుసులే! కొండెక్కి కూచున్నట్టు ప్రవర్తించే కొందరు స్త్రీలకేమైనా అలాటి వికారం కలిగితే కలిగి ఉండవచ్చు.”

“క్షమించాలి, సోఫ్యఇవానీవ్న! నన్ను గురించి ఎన్నడూ ఇంత చిన్న అపవాదుకూడా లేదనుకో. ఇతరుల మాట తెలీదుగాని, నన్ను గురించి లేదు నీ దయవల్ల”.

“నువ్వెందుకు ఉడుక్కుంటున్నావు? అక్కడ ఇంకా ఎందరో స్త్రీలున్నారే, అతని ప్రక్కన కూచోవటానికని వాకిలి దగ్గిర ఉన్న కుర్చీల మీదికి ఎగబడినవాళ్ళు”.

ఒయ్యారిభామ ఇంతమాట అన్నాక దుమారం సాగితీరుతుందనుకోవలిసిందేగాని, వింత ఏమిటంటే, ఇద్దరాడవాళ్ళూ ఒక్కసారిగా చప్పబడిపోయారు, ఏమీ జరగలేదు. కొత్త ఫాషను నమూనా ఇంకా తన చేతికి అందలేదన్న సంగతి ఒప్పులకుప్ప జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణస్నేహితురాలు ఇంతకుముందే బయలుపెట్టిన విషయం తాలూకు వివరాలింకా తనకు తెలియలేదని ఒయ్యారి భామ స్మరించింది, అంతతో ఇద్దరికీ మధ్య శాంతి నెలకొన్నది. అయితే ఈ ఇద్దరు స్త్రీలలో ఏ ఒకరికీ ఇతరులపట్ల అసహ్యంగా ప్రవరించే స్వభావం ఉన్నదనటానికి వీల్లేదు. వాళ్ళది కుళ్లుబుద్ధి కాదు, మాట్లాడుకునేటప్పుడు అలా ఒకరి నొకరు గిచ్చుకోవాలన్న బుద్ధి అప్రయత్నంగా పుడుతుంది. “నీకు అంతేకావాలి!” అన్నట్టుగా ఒక ములుకు లాటి మాట అవతలిమనిషి మీద ప్రయోగించటంలో కాస్త ఆనందం ఉంటుంది, అంతకంటె మరేమీ లేదు. మగవాళ్ళ తత్వంలోలాగే ఆడవాళ్ళ తత్వంలోనూ అనేక రకాల ప్రేరణలుంటాయి.

“నాకు అర్థం కానిదల్లా ఏమిటంటే, ఎక్కడినుంచో ఊడిపడిన ఈ చిచీకవ్ ఇంత సాహసానికి ఎలా ఒడి గట్టాడా అని. ఈ వ్యవహారంలో ఇతరులు కూడా ఇరుక్కుని ఉండాలి!” అన్నది ఒయ్యారిభామ.

“లేరనుకున్నావా ఏం?”

“అతనికి ఎవరు సహాయం చేస్తున్నారేం?”

“నజ్‌ద్ర్యోవ్ ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు.”

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *