An Apology of a Telugu fa(lu)natic

(కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “ఈ తరానికి ప్రశ్నలు” సంధించిన దరిమిలా తెలుగు భాష మనుగడ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలపై భైరవభట్ల కామేశ్వర రావు గారి ప్రతిస్పందన ఇది. -సం.)

– భైరవభట్ల కామేశ్వర రావు

Dear Telugu readers who cannot read this letter or who cannot understand all the words in this letter, please don’t feel bad about it (in fact you have to be proud!). The fault is not yours, but mine. It is my fault of sticking to the same old rotten stinking language instead of writing it completely in English, or upgrading myself to the current Telugu language that can be understood by everyone. It is my disability. So please pardon me. In fact this letter is precisely to do this. To seek a public apology from you and those who are aspiring to embrace the change like you. Please.. please excuse me.
You may opt out of reading this further.

భాషంటే కేవలం వ్యక్తీకరణ సాధనమని, it is just a tool for communication అనీ, అంతకుమించి మరేదీ కాదనీ తెలుసుకోలేక తప్పుచేసాను. భాషకీ ఒక చరిత్ర ఉంటుందనీ, దానికొక సంస్కృతి ఉంటుందనీ, వాటి అవసరం ఆ భాష మాట్లాడేవాళ్ళకి ఉంటుందనీ భ్రమపడి తప్పుచేసాను.

పాఠకులారా,

నేను తప్పు చేసాను. తప్పుడు ఆలోచనలు చేసాను. తప్పుడు ప్రచారం చెయ్యడానికి ప్రయత్నించాను. అందికే ఇప్పుడిలా అందరినీ క్షమాపణ వేడుకొంటున్నాను. దాసుని తప్పులు దండంతో సరి. మీకందరికీ కోటికోటి దండాలు. నన్ను క్షమించేయండి.

భాషంటే కేవలం వ్యక్తీకరణ సాధనమని, it is just a tool for communication అనీ, అంతకుమించి మరేదీ కాదనీ తెలుసుకోలేక తప్పుచేసాను. భాషకీ ఒక చరిత్ర ఉంటుందనీ, దానికొక సంస్కృతి ఉంటుందనీ, వాటి అవసరం ఆ భాష మాట్లాడేవాళ్ళకి ఉంటుందనీ భ్రమపడి తప్పుచేసాను. కేవలం ఒక ఏభై సంవత్సరాల ముందు వెలువడిన రచనల్లోని భాషని ఈ కాలపు చదువుకున్న తెలుగువాడు అర్థం చేసుకోలేకపోవడం నామోషీ అని పొరబడ్డాను. మనకు కూడు పెట్టే భాషలో, విస్తృతంగా ప్రచారమయ్యే సాహిత్యాన్ని చదవకపోవడమే అతి పెద్ద నామోషి అని నేను గ్రహించలేకపోయాను. దానికి నన్ను క్షమించండి.

అమ్మమ్మా తాతయ్యలు వాళ్ళ మనవలు మనవరాళ్ళతో “కమ్యూనికేట్” చెయ్యాలని ఆత్రపడతారనీ, వాళ్ళ ఆర్తిని పట్టించుకొనే బాధ్యత మనవలు మనవరాళ్ళకీ ఉందనీ అపోహపడ్డాను. అమ్మమ్మలూ తాతయ్యలూ పాతకంపు కొట్టే ముసలిపీనుగలనీ, వాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు సాగలేమనీ తెలుసుకోలేక తప్పుచేసాను. నన్ను క్షమించండి.

వారసత్వంగా పిల్లలకు కావలసింది డబ్బూ దస్కమే తప్ప మరేవీ కాదన్న కటిక నిజాన్ని కళ్ళుండీ చూడలేకపోయాను. “సంపద” అంటే మనిషి భౌతిక అవసరాలని తీర్చే ఆర్థిక విలువ కలిగిన ధనమూ ఇతరత్రా నగలూ నట్రే తప్ప, సాహిత్యమూ భాషా సంస్కృతీ, సంపద కాదన్న అతి చిన్న విషయాన్ని గ్రహించలేని మందబుద్ధినయ్యాను. దీనికీ నన్ను క్షమించెయ్యండి.

భాష మార్పుచెందుతూనే ఉంటుందని తెలిసినా, ఆ జరిగే మార్పు ప్రజల వల్లనే (అంటే మనందరి వల్లనే) జరుగుతుందని అనుకున్నాను. అంచేత ఆ మార్పుని నిర్దేశించగల శక్తి ప్రజలకుందని నమ్మాను. ఈ మార్పుకి కారణం “ప్రకృతి” అనీ, దానిమీద మనకి ఏ విధమైన అజమాయిషీ లేదనీ, చట్టం తనపని తాను చేసుకుపోయినట్టే అదికూడా తనపని తను చేసుకొనిపోతుందనీ, మనం చేవచచ్చిన చవటల్లా దానితోపాటు సాగిపోవడమే తప్ప మరేమీ చెయ్యలేమనీ నేను తెలుసుకోలేకపోయాను. తప్పు చేసాను. నన్ను క్షమించండి.

మారుతున్న భాష తన రచనలని (సాహిత్య, సాహిత్యేతర రచనలన్నీనూ) తానే సృష్టించుకోగలదనీ, ఒకవేళ అంతగా అవసరమైతే ఆ రచనలేవో మరొకరు మనకి సృష్టించిపెడితే వాటిని డబ్బిచ్చి కొనుక్కొని చదువుతామనీ గ్రహించలేకపోయాను. మన వెనకతరం రచనలు మనకు అనవసరమనీ, ఒకవేళ అంతగా అవసరం అనుకుంటే మరో భాషవాడు మన పాతభాష నేర్చుకొని అవి మనకి వచ్చిన భాషలోకి అనువదిస్తాడనీ, అప్పుడే అవి మనకి అవసరమవుతాయనీ, అప్పుడు అలా అనువదించిన వాటిని హాయిగా డబ్బిచ్చి కొనుక్కొని చదువుకోవచ్చుననీ తెలుసుకొనే సామర్థ్యం నా చిన్ని మెదడుకి లేకపోయింది. దానికీ నన్ను క్షమించండి.

మారుతున్న భాష తన రచనలని (సాహిత్య, సాహిత్యేతర రచనలన్నీనూ) తానే సృష్టించుకోగలదనీ, ఒకవేళ అంతగా అవసరమైతే ఆ రచనలేవో మరొకరు మనకి సృష్టించిపెడితే వాటిని డబ్బిచ్చి కొనుక్కొని చదువుతామనీ గ్రహించలేకపోయాను. మన వెనకతరం రచనలు మనకు అనవసరమనీ, ఒకవేళ అంతగా అవసరం అనుకుంటే మరో భాషవాడు మన పాతభాష నేర్చుకొని అవి మనకి వచ్చిన భాషలోకి అనువదిస్తాడనీ, అప్పుడే అవి మనకి అవసరమవుతాయనీ, అప్పుడు అలా అనువదించిన వాటిని హాయిగా డబ్బిచ్చి కొనుక్కొని చదువుకోవచ్చుననీ తెలుసుకొనే సామర్థ్యం నా చిన్ని మెదడుకి లేకపోయింది. దానికీ నన్ను క్షమించండి.

చదువుకున్నోళ్ళ భాష చదువుకోనోళ్ళ భాషకి మరీ దూరమైపోతోందేమో, వాళ్ళ మధ్య ఇదికూడా అంతరాలకి దారితీస్తుందేమోననీ భయపడ్డాను. అంచేత చదువుకున్న గొప్పోళ్ళు ప్రజలందరికీ తెలిసిన తెలుగుభాషకి దూరం కాకూడదనీ, అదే ప్రజాతంత్రీకరణ అనీ అనుకున్నాను. కాని చదువుకోని వాళ్ళని (లేదా చదువుకున్న పేదోళ్ళని) కూడా, వాళ్ళకొచ్చిన భాషకి దూరం చేసి, చదువుకున్నోళ్ళకి వచ్చిన వేరే భాషని మాత్రమే నేర్పించడం అసలైన ప్రజాతంత్రీకరణ అని అర్థం చేసుకోలేకపోయాను. తప్పే మరి! క్షమించండి.

తిండిపెట్టని భాష మనకి అక్కరలేదు. తిండిపెట్టే భాషొక్కటే మనకి కావాలి. అంచేత తిండిపెట్టని భాష ఎంత మనదైనా, దాన్ని తిండిపెట్టే భాషకి బానిసని చేస్తే తప్పేంటి? అసలు తిండిపెట్టని భాష ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోయాను. ఏఁ, మన భాషనే తిండిపెట్టే భాషగా ఎందుకు చెయ్యకూడదూ అని వెఱ్ఱిమొఱ్ఱి అభిప్రాయాలు వ్యక్తం చేసాను. తప్పే. మళ్ళీ క్షమించేయండి.

పైనున్న బెంగాలీవాళ్ళనీ కిందనున్న తమిళులనీ పక్కనున్న మళయాళం వాళ్ళనీ చూసి వారి భాషాభిమానానికి ఆశ్చర్యపోయాను. ఎందుకు వాళ్ళంతగా వాళ్ళ భాషని ప్రేమిస్తున్నారో తెలియక తికమకపడ్డాను. అయినా మురిసిపోయాను. వాళ్ళనుంచైనా మనం నేర్చుకోలేమా అని ఆశపడ్డాను. కానీ వాళ్ళది భాషా దురభిమానమనీ, అది వాళ్ళ మానసిక రోగమనీ, వాళ్ళని చూసి మురిసిపోవడం వాళ్ళనుంచి నేర్చుకోమనడం నేను చేస్తున్న పెద్ద ద్రోహమనీ, నాదికూడా దురభిమానమే అనీ అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి.

ఈ కాలపు కృష్ణభగవానులు, “నువ్వేమీ చెయ్యలేవు. ఈ మార్పు జరిగి తీరుతుంది. నువ్వు యుద్ధం చేసి ప్రయోజనవేమీ లేదు. అంచేత నీ ప్రయత్నాన్ని విరమించుకో, నీ ఉత్సాహాన్ని చల్లార్చుకో, నీ ఆలోచనలని మార్చుకో” అని ఎంతగా గీతాబోధ చేసినా వినలేదు. విషాదం ఆవరించిన అర్జునుడికున్నపాటి తెలివైనా నాకు లేకపోయింది, అస్త్ర సన్యాసం చెయ్యడానికి. మనసు ఊరుకోక ఉద్రేకపడింది. ఆ ఉద్రేకంలో ఏవో అవాకులూ చెవాకులూ పేలుంటాను. నన్ను క్షమించండి.

చదువుకున్నోళ్ళ భాష చదువుకోనోళ్ళ భాషకి మరీ దూరమైపోతోందేమో, వాళ్ళ మధ్య ఇదికూడా అంతరాలకి దారితీస్తుందేమోననీ భయపడ్డాను. అంచేత చదువుకున్న గొప్పోళ్ళు ప్రజలందరికీ తెలిసిన తెలుగుభాషకి దూరం కాకూడదనీ, అదే ప్రజాతంత్రీకరణ అనీ అనుకున్నాను. కాని చదువుకోని వాళ్ళని (లేదా చదువుకున్న పేదోళ్ళని) కూడా, వాళ్ళకొచ్చిన భాషకి దూరం చేసి, చదువుకున్నోళ్ళకి వచ్చిన వేరే భాషని మాత్రమే నేర్పించడం అసలైన ప్రజాతంత్రీకరణ అని అర్థం చేసుకోలేకపోయాను. తప్పే మరి! క్షమించండి.

అన్నట్టు అసలు విషయం. ఇదంతా నన్ను నేను ప్రమోట్ చేసుకోడానికీ, నా ఆభిజాత్యాన్ని ప్రదర్శించడానికీ, తద్వారా అఖండ కీర్తిప్రతిష్ఠలు సంపాదించెయ్యడానికీ, ప్రభుత్వం వారు తెలుగు భాషాభివృద్ధికోసం ఇచ్చే కోట్ల రూపాయల్లో అధికవాటా కొట్టేయడానికీ చేసానన్న రహస్యం కూడా నాకు తెలీలేదు. తద్వారా మిమ్మల్నందరినీ మోసం చెయ్యడమే కాకుండా నన్ను నేను కూడా మోసం చేసుకున్నాను. నన్ను మనసారా క్షమించండి.

ఇకపై నేనూ నాలాంటి కొందరూ సగం కాలిన శవం వాసన కొట్టే పాత తెలుగు భాషా సాహిత్యాల గురించి ఎక్కడైనా మాట్లాడితే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించేయండి. ముక్కుమూసుకొని మీదారిని మీరు దూరంగా వెళ్ళిపోండి.

నా మనసు కుక్కతోక లాంటిది. అంచేత ఇంత జరిగీ ఇంతగా కనువిప్పయిన తర్వాత కూడా మళ్ళీ నేను ‘తెలుగుభాష మరుగున పడుతుందేమో, మనకి తెలీనంతగా మారిపోతుందేమో, జరుగుతున్న మార్పువల్ల మనం మనం కాకుండా పోతామేమో’ లాంటి భయమూ బాధా ఎప్పుడైనా ఎక్కడైనా వ్యక్తం చెయ్యవచ్చు. దయచేసి దాన్ని మీరు పట్టించుకోవద్దు. దానిక్కూడా ముందుగానే యిప్పుడు నన్ను క్షమించెయ్యండి.

దయచేసి, దయచేసి, దయచేసి క్షమించండి.

సెలవు.

———–

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. రాయగల శక్తి ఉన్నవారు కూడాను. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగును ఇటీవలే మొదలుపెట్టి ప్రఖ్యాతి గాంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.

About భైరవభట్ల కామేశ్వరరావు

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగులో ప్రసిద్ధి చెంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

59 Responses to An Apology of a Telugu fa(lu)natic

  1. Meher says:

    కామేశ్వరరావుగారూ,

    రెటోరిక్ వదిలేస్తే మీ వాదనంతటితోనూ నేను నూరుశాతం ఏకీభవిస్తాను. కానీ ఏం చేయాలి? ఏం చెయ్యాలో ఎవరైనా చెప్పండి. ఏ యుద్ధానికైనా నా వంతు పోరాటానికి వెంటనే రిక్రూట్ అయిపోతాను.

    నా స్నేహితుడొకడున్నాడు. డిగ్రీ తర్వాత చదివే స్తోమత లేక హైదరాబాద్‌లో ఉద్యోగాలు వెతుక్కోవటానికి వచ్చాడు. సేల్స్‌‍మెన్ మొదలుకొని అన్నీ ప్రయత్నించాడు. ఇప్పుడో బొటాబొటీ ఉద్యోగంలో కుదురుకున్నాడనుకోండి. అతను ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న కాలంలో ఒకసారి, తెలుగు పాఠశాలల్లో ఆంగ్ల విద్య తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం గురించి మా మధ్య ఎందుకో చర్చ వచ్చింది. అది చాలా చెత్త నిర్ణయం అని నేనన్నాను. వెంటనే వాడెంత ఆవేశంతో ప్రతిస్పందించాడో చూసి నాకు నోట మాట పెగల్లేదు.

    మొదట తెలుగు మీడియం విద్యని ఓ బూతుమాట తిట్టి తర్వాత తన వాదన మొదలుపెట్టాడు. వెళ్ళిన ప్రతీ ఉద్యోగంలోనూ ఇంగ్లీషు అడుగుతున్నారని, నోరెళ్ళబెట్టాల్సివస్తుందని, చిన్నప్పట్నించే ఆ పనికిరాని తెలుగుని మూలబెట్టి ఇంగ్లీషు నేర్పించి వుంటే ఇప్పుడీ బాధ వుండేది కాదనీ విరుచుకుపడ్డాడు. ఎవరిపై వెళ్ళగక్కాలో తెలియక లోలోపలే గూడుకట్టుకుపోయిన ఆక్రోశాన్నంతా సందు దొరకడంతో నామీదకు వదిలేశాడు. నాకేం సమాధానం చెప్పాలో తెలీలేదు, చెప్పాలనిపించ లేదు కూడా. (తర్వాత వాడు రామకృష్ణ మఠంలో చేరి ఏదో కోర్సు చేసాడు.) తెలుగు రాని వాళ్ళ సంగతి వదిలేద్దాం; వచ్చిన వాళ్ళు కూడా తమ నేర్పరితనానికి గర్వించడం పోయి, కుమిలిపోయే వాతావరణం ఉందిప్పుడు. బ్లాగుల్లో తెలుగుని చూసి తెలుగుకి ఢోకా లేదని చంకలు గుద్దుకునేవాళ్ళని చూసి నవ్వొస్తుంది నాకు.

    వాణ్ణో మతిమాలిన చవటగా జమ కట్టి మనం చాలా సులువుగా విషయాన్ని పక్కకు పెట్టేయచ్చు. కానీ నా చుట్టూ పరిచయస్తుల వలయంలోనే అలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు, పల్లెటూళ్ళ నుండి తెలుగు మాత్రమే తోడ్కొని నగరంలో ఉద్యోగాలకి బయల్దేరేవాళ్ళు. వాళ్ళకి మీ వాదనేం అవసరం లేదు. మీ క్షమాపణలు కూడా అక్కర్లేదు. వాళ్ళ బతుకుతెరువుకి తెలుగు ఎలా ఉపయోగపడుతుందన్న ప్రశ్నకు సమాధానం కావాలంతే.

    తెలుగు భాషపై మీరిక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నేను నూటికి నూరుశాతమూ ఏకీభవిస్తానని మళ్ళీ మనవి చేసుకుంటున్నాను.

    ~ మెహెర్

  2. రవి says:

    వ్యాసం ఉద్విగ్న భరితంగా, ఆవేదనా పూరితంగా ఉంది. అయితే ఈ వ్యాసం ముందూ వెనుకా చర్చ లు ప్రచురించి ఉంటే ఇంకా బావుండేది.

  3. Rohiniprasad says:

    రచయిత వ్యంగ్యధోరణిలో రాసినప్పటికీ ఆయన ఆవేదన ఎటువంటిదో తెలుస్తూనే ఉంది. తెలుగువాళ్ళున్నంత కాలమూ తెలుగుభాష ఏదో ఒక రూపంలో బతికే ఉంటుందనేది నిజమే అయినా గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

    చాలా ఏళ్ళ కిందట ఒక శాస్త్రీయసంగీత కచేరీ సందర్భంగా ఉపన్యాసం చేసిన అశోక్ వాజపేయీ గతంలో తాను చైనా పర్యటించిన సంగతి చెప్పాడు. “సంగీతకచేరీకి వెళదామా?” అని తన గృహస్థు అడగగానే ఆయన పరమానందంతో సరేనన్నాడట. తీరా వెళితే అది చైనా సంగీతమే కాదనీ, పాశ్చాత్యసంగీతపు ఆర్కెస్ట్రా అనీ తెలిసిందట. “మీకు శాస్త్రీయసంగీతం లేదా?” అని అడిగితే చైనావారు అటువంటిది ఉండేదనీ, ప్రస్తుతకాలంలో ఎవరూ ఆదరించకపోవడంతో అది అంతరించిపోయిందనీ చెప్పారట. మనదేశంలో సంగీతాన్ని ఆదరించడం ఎందుకు ముఖ్యమో వివరించడానికి వాజపేయీ ఈ ఉదాహరణను చూపాడు.

    తెలుగు విషయంలో ఇప్పటికే కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్రాంథికభాషలో చేసిన రచనలకు పాఠకులు తగ్గిపోతున్నారు. అదేదో సరిగ్గా అర్థం కానటువంటి తమిళభాషలా తయారవుతోంది. వ్యవహారికంలో రాసినప్పటికీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారివీ, మల్లాది రామకృష్ణశాస్త్రిగారివీ కథల్లో కొన్ని ‘జానుతెనుగు’ పదాలు మనకు అర్థం కావు.

    తెలుగుభాష ఆటోమేటిక్‌గా బతికి ఉంటుందని నమ్మడం గురించిన అనుమానాలు అందువల్లనే.

  4. విష్ణుభొట్ల లక్ష్మన్న says:

    తెలుగు భాష భవిష్యత్తు పై వచ్చిన వ్యాసాలు, వాటిపై అభిప్రాయాలు చదివిన తరవాత నా మనసులోని మాట చెప్పటం అవసరమనిపించింది.

    నేను బి. యెస్. సి. వరకు ఆంధ్రాలో తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. అప్పటి పరిస్థితి అది! తరవాత ఎం. యెస్. సి. తప్పని సరిగా ఇంగ్లీషులోనే చదవ్వలసి వచ్చింది. ఆ పై ఉద్యోగ ప్రయత్నంలో చాలానే ఇబ్బందులు పడ్డాను. ముఖ్యంగా ఇంగ్లీషులో అనర్గళంగా మాటాడలేకపోటం అప్పట్లో నా అభివృద్ధి నిరోధకాల్లో ఒకటయింది. అందుకని కసిగా ఇంగ్లీషు అధ్యయనం మొదలు పెట్టా! ఆ కసిలో ఐ. ఐ. టి. లో ఇంజినీరింగు చదవటం, తరవాత టి. ఐ. ఎఫ్. ఆర్. లో పి.హెచ్. డి చెయ్యటం ఆ పై వచ్చిన అవకాశాల వల్ల అమెరికాలో యేల్ విశ్వ విద్యాలయంలో రిసెర్చ్ చేస్తూ అనేక ఊర్లల్లో ఉద్యోగాలు చేసి దాదాపు తెలుగు మర్చిపోయా!

    అప్పుడు వచ్చింది ఫ్రాన్సులో మూడేళ్ళు ఉద్యోగం చేసే అవకాశం. అక్కడ వారి భాషాభిమానం చూసాక, ఎవడో నన్ను లాగి లెంపకాయ కొట్టినట్టు నేను నా మాతృభాష తెలుగు ఎందుకు మర్చిపోతున్నాను అన్న అనుమానం, బాధ పీడించటం మొదలయింది. ఒక సారి పెద్ద చదువులు చదివాక తెలుగుతో అవసరం తీరినట్టే!

    మరి నా తెలుగు బాధ ఏమిటి? ఇది చాలా సులభం. అదృష్టంగా నాకు వచ్చిన అవకాశాలు, అనుభవాలు తోటి తెలుగు వారితో పంచుకోపోతే, నాకు చిన్నప్పుడు తెలుగు (అసలు భాష) నేర్పిన పెద్దల ఋణం ఎలా తీర్చుకోగలను? నేను బహుశా చాలా మందిలా మంచి తెలుగు రాయలేకపోవచ్చు. కానీ, ప్రయత్నలోపం ఉండకూడదు కదా!

    ఈ ఉపోద్ఘాతం పక్కన పెట్టి అసలు విషయానికి వస్తా! నిజమే. తెలుగు మాత్రమే తెలిసిన వారికి జీవితంలో పైకి వచ్చే అవకాశాలు తక్కువ. అలాగని తెలుగును తిడుతూ కూర్చోలేము కదా. సత్తువ, అవకాశాలు ఉంటే మిగిలిన భాషలు నేర్చుకోవచ్చు. తప్పు లేదు. తెలుగును చిన్న చూపు చూడక్కర లేదు. మనమే తెలుగు భాషని పట్టించుకోకపోతే, మరో భాష వాడు తెలుగుపై మమకారం పెంచుకొని తెలుగును వృద్ధి (గుర్తు) చేసే సంస్కారం ఎలా వస్తుంది?

    భాష నిరంతరం మారుతూ ఉంటుందని తెలిసినా, తెలుగు భాష బాధలన్నీ పక్కవాడు పట్టించుకుంటాడులే అని వదల్లేము కదా. మన పని, చేతనైనంత వరకు, మనం చేసుకుంటూ పోవాలి.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. రెడ్డొచ్చె మొదలాయె…సాహిత్యమే భాషని బ్రతికించాలా? మానవ అవసరానికి భాషగానీ మూసలో పోసింది బ్రతికితేనే భాషా?

    ఒకసారి పల్లెల్లొకిబోయి సూడండి సామీ బాస దర్జాగా బతికిపోతావుండాది. సచ్చింది సస్తావుండేదీ “ఇది సరైన భాష” అని చెప్పిచచ్చిన భాష. అది ఉన్న్యా పోయినా ఒగటే.పనికొచ్చే బాసంటే ఉద్యోగానికి అచ్చొచ్చిన బాసేకాదు. బతుకుల్ని బతికించే బాసగూడా. మాఊర్లో ఇంగా అదే మాట్లాడతావుండాము. తెలుగు. గాకపోతే కొందరు మనుసుల్లాంటి మనుసులు “అహే నీది బాసేకాదు. రాయాలంటే ఇలాగే ‘వ్రాయాల’. యాకరణం శుద్దంగా ఇట్టే పలకాల” అని నాశనం సేసి హైరానా పట్టిత్తనారుగానీ మాబాసకేమొచ్చింది పోగాలం? వడ్డారమైన మీబాసలకే వస్తాది పొయ్యేగాలం.

  6. మహేష్ గారితో చాలావరకు ఏకీభవిస్తాను. “తెలుగు భాష క్షీణిస్తోంది” అంటున్న “మేధావులను” ఎక్కడ క్షీణిస్తున్నదో చెప్పమండి. అందరూ “హైదరాబాదులో ఆటో డ్రైవరు కూడా తెలుగు మాట్లాడడు…” అంటూ ఉపన్యాసాలు ఇస్తారు. మరి మిగతా ఊళ్ళ సంగతేమి? ప్రస్తుత విద్యార్థుల్లో ఒకప్పటికంటే తక్కువ తెలుగు వాడకం ఉన్నమాట నిజమే. అంత మాత్రాన తెలుగు నశించడం లేదు. పట్టణాల్లొ, గ్రామాల్లో ఇప్పటికీ చక్కగా (కేవలం)తెలుగు మాట్లాడుతూనే ఉన్నారు. హైదరాబాదు బయటకూడా తెలుగు మాట్లాడుతారు అని పెద్దలు గ్రహిస్తే బాగుంటుంది.

  7. మహేష్ గారు, జీడిపప్పుగారు,

    మీతో వాదించే ఉద్దేశంతో నేనీ వ్యాఖ్య రాయడం లేదు. అలా చేసే ఓపికా సత్తా రెండు నాకు లేవు. అయినా మనసారా క్షమాపణ వేడుకున్నాక ఇంకా వాదులాట ఎందుకు. అయితే, మీ వ్యాఖ్యల వల్ల నా బాధని నేను స్పష్టంగా చెప్పలేదేమో అన్న అనుమానం వచ్చి ఒక రెండు విషయాలని స్పష్టం చెయ్యాలని ఇది రాస్తున్నాను.
    నా బాధ పల్లెల్లోని భాష గురించి కాదు. పల్లెల్లో భాష సరైన తెలుగుభాష కాదని నా ఉద్దేశం ఏమాత్రం కాదు.
    నా బాధ నగరాల్లో (ఇది హైదరాబాదే కాదు ఆంధ్రాలో ఉన్న అన్ని నగరాలూను) “చదువుకున్న” తెలుగువాళ్ళు మాట్లాడే భాష గురించి. తెలుగువాళ్ళై తెలుగు చదవడం రాయడం రాని చదువుకున్నవాళ్ళ గురించి. వీళ్ళు హైర్దరాబాదులోనే కాదు, మిగతా నగరాల్లోనూ ఉన్నారు. టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తున్న భాష గురించి. వీటిలో కనిపించేది కూడా తెలుగుభాషే అనే అనుమానంతోటి. ఈ నగరాల్లో చదువుకున్న వాళ్ళ, టీవీ సినిమాల్లో ప్రచారం అవుతున్న భాష, పల్లెల్లోని సామాన్య జనం మాట్లాడే భాషమీద కూడా ప్రభావం చూపించి అదికూడా ఇలా మారిపోతుందేమో అనే భయంతోటి.
    ఇది వేరు, అది వేరు. పల్లెల్లో భాష దానికున్న మహత్తర మంత్రశక్తితో యీ నగరభాష ప్రభావం పడకుండా అలాగే కొనసాగుతుంది అని మీరు భరోసా ఇస్తే, నాకన్నా సంతోషించేవాడు మరొకడుండడు. అలా మీలాటివాళ్ళు అప్పుడప్పుడు గట్టిగా నాకిస్తున్న ధైర్యం వల్లనే నేనింకా హాయిగా ఊపిరితీసుకుంటున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు.

    మెహెర్ గారు, మీరడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే నేనెందుకిలా ఏడుస్తాను! ఏవీ చెయ్యలేని ఒక నిర్భాగ్య నిరర్థ నీరస గళంనుంచి వచ్చిన పొలికేకలే ఇవి.

  8. ఈ రోజులను బట్టి బతకటానికి ఇంగ్లీషు అవసరం

    జీవించటానికి తెలుగు అవసరం

    ఏ జీవికైనా బతకటం ముఖ్యం కనుక మొదటి వాక్యం పరమసత్యమే.

    ఏ భాషైనా జనుల నోళ్లలో నానుతున్నంత సేపూ సజీవంగానే ఉంటుంది.

    మంచి సారస్వతం ఒక భాషను మరింత ప్రజ్వలింపచేస్తుంది. ఉదా: ఎక్కడో నెట్ లో చదివాను పాబ్లో నెరుడా కవితలకోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది స్పానిష్ భాషను నేర్చుకొన్నారట. భాషకు సాహిత్యం చేసే మేలు అది.

    ఈ విషయాన్ని– తెలుగును నేర్పండీ, మాట్లాడండీ, భాషను బతికించండీ, స్కూళ్ల్లో తెలుగును మాధ్యమంగా చేయండీ, తెలుగుమీడియంలో చదివినవారికి రిజర్వేషన్లు కల్పించండీ, ఆర్టీసి బస్సులపై తెలుగు అంకెలు వేయండీ, ప్రభుత్వ జీవో లు తెలుగులో విడుదల చేయండీ, తెలుగుభాషా తద్దినోత్సవాలు చేయండీ, మీ మాండలీకం విలనీకి బాగుంటుంది, మీ మాండలీకం కామెడీకి బాగుంటుందీ — అంటూ మైకులు పుచ్చుకొని ఉపన్యాసాలు చేసేవారు గ్రహిస్తే మంచిది.

  9. @భైరవభట్ల కామేశ్వర రావు గారు: ఘరానా మొగుడు సినిమా వీడియో వేస్తుంటే, చిరంజీవి వయ్యారంగా పక్కకి తిరిగి “కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా” అని రావుగోపాల్రావును అంటే ఇంగ్లీషుముక్కరాని మా పల్లెజనం ఉర్రూతలూగిన క్షణం గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ expression వారి జీవితాల్లో ఒక భాగం. ఏది తెలుగు? ఎవరి తెలుగు? ఎవరికి తెలుగు?

    “ఇది తెలుగు” అని నిర్ణయించుకున్న మనకు సమస్యగానీ, నేను తెలుగోడ్ని కాబట్టి నేను మాట్లాడేదే తెలుగు అనుకునేవారి భాషతో వారికి అస్సలు సమస్య లేదు. భావం అర్థమయ్యేవరకూ యాస ఏదైనా,ఎన్ని (పర)భాషాపదాలు కలిసినా, ఎన్ని వత్తులూహల్లులూ హరించినా కొంచెం తేడాగా అనిపిస్తుందేగానీ నాకైతే తెలుగుతెలుగే.తెలుగు రాయడం,చదవడం రాని టి.వి.యాంకర్లు హైద్రాబాదీ “తెలుహిందింగింగ్లీష్” యద్దేచ్చగా మాట్లాడుతుంటే మనకు కటువుగా ఉంటుందంటారా! అది తెలుగుభాషలోని మరో శైలిగా అంగీకరించే విశాలత్వమే మనలోలేదా!

    ఏదిఏమైనా, మన తలక్రిందులు తెలుగు బోధనావిధానం మారనంతవరకూ తెలుగు బ్రతకడానికీ,జీవించడానికీ రెంటికీ పనికిరాకుండా పోతుంది.”మంచి తెలుగు” పేరుతో జనాలతెలుగుని పక్కన త్రోసినన్నాళ్ళూ అసలు తెలుగు వీధిచివర్లలోనే ఉంటుంది. మరికొన్నాళ్ళకు “జానుతెనుగు”ని మరొక మ్యూజియం తయారుచేసి సంస్కృతం పక్కనే హాయిగా పరిరక్షించుకోవచ్చు.జనాల తెలుగు మాత్రం దర్జాగా బ్రతికే ఉంటుంది.

  10. విష్ణుభొట్ల లక్ష్మన్న says:

    తెలుగు భాష ఆంధ్రాలో పల్లెల్లో, పట్టణాల్లో ఎలా ఉందో, ఉండబోతోందో అభిప్రాయాల్లో వెలిబుచ్చారు కనక, నా స్వంత అనుభవం ఇందుకు సంబంధించి ఒకటి చెప్పాలి.

    ఇరవై ఏళ్ళు అమెరికా జీవితం గడిపిన తరవాత, ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న (ఉంటాడు అనుకున్న)నా చిన్ననాటి స్నేహితుడ్ని కలవటానికి చిక్కడపల్లిలోని పోస్టాఫీసు పక్క సందులో వెతకటం మొదలెట్టాను. అప్పటి ఇల్లు గుర్తు పట్టటం కష్టమైంది నాకు. మొత్తం మీద ఇల్లు గుర్తుపట్టి తలుపు తడితే, ఒక మధ్య వయస్సులో ఉన్నావిడ తెలుపు తెరిచి ఏం కావాలని అడిగింది నన్ను ఎగాదిగా చూస్తూ.

    “మా స్నేహితుడు రామారావు ఈ ఇంట్లో కొంత కాలం క్రితం ఉండేవాడు ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నాడా?” అని అడిగా.

    “మీదే ఊరు?” అని అడిగిందావిడ అనుమానంగా చూస్తూ.

    “ఒకప్పుడు ఇక్కడివాడినే, ఇప్పుడు ఇరవై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నా” అన్నా.

    మాటల్లో మా వాడు అక్కడ లేడని తేలింది.

    కానీ, ఆవిడకి అనుమానం వచ్చి “మీ భాష ఇంత చక్కగా ఉంటే, అమెరికా అని చెప్పి హాస్యాలాడుతున్నారా?” అని నిలతీసింది. బాహుశా నా భాష నే చిన్నపుడు నేర్చుకున్న కోస్తా భాషేమో! ఈ మాటల్లో నలుగురూ పోగడ్డారు. అందరూ నేనేదో ఆటపట్టించటానికి “అమెరికా” పేరు వాడుకున్నానని వారి అభిప్రాయం. వాళ్ళ దృష్టిలో నేను నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టయితే, నా భాష పూర్తిగా అమెరికన్ యాక్సెంటుతో ఉండి తీరాలని వాళ్ళ నమ్మకం.

    పరిస్థితి శ్రుతి మించుతోందని గ్రహించి అక్కడ నుంచిపోబోతుంటే, ఒక పెద్దాయన “అయితే, మీ పాస్‌పోర్ట్ చూపండి” అని అడిగి నా అమెరికన్ పాస్‌పోర్ట్ చూసి తిరిగి ఇచ్చేస్తూ, నాకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపొమ్మన్నాడు.

    నాకు ఇప్పటికీ అర్ధం కానిది, వాళ్ళసలు ఎందుకు అనుమానపడ్డారని? నాలాగ తెలుగు హైదరాబాదులో ఇప్పుడు ఎవరూ మాట్లాడరా?

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  11. రాఘవ says:

    నాకు ఇప్పుడు అనుమానం వస్తోందండీ… మొదటే మనిషి యావద్భూమండలానికీ ఒకే ఒక భాషలో ఎందుకు కుదురుకోలేదా అని, అసలు మనిషి దేశం సంస్కృతి గాడిదగ్రుడ్డూ అని ఎందుకు ఏడిచాడా అని, పోనీ అవి ఉన్నా అసలు వాటి గుఱించి ఎందుకు అంత మక్కువ అభిమానం గౌరవం పెంచుకోవాలీ అని, గౌరవం ఉన్న విషయాలని ప్రక్కవాడు చిన్నచూపు చూస్తూంటే ఎందుకు బాధపడాలీ అని, అసలు మనిషికి మాట్లాడవలసిన అవసరం ఉందా అని! అంతా “విష్ణుమాయ”… ప్చ్. కాదు కాదు కేవలం “మాయ”. విష్ణుమాయ అని వాడితే లౌకికమైన (లోకంలో కనీసం వేఱే ఇంకొకరికైనా ఈ భాష చదవటం, వ్రాయటం, అర్థం చేసుకోవడం, మాట్లాడటం వచ్చును అనుకుంటే) భాష కాస్తా హిందూభాష ఐపోతుందేమో!!! భాష గుఱించి ఇన్ని వాదనలు అనవసరం ఐనప్పుడు మళ్లీ విడిగా వ్యావహారికభాషా గ్రాంథికభాషా అని వాదనలు ఎందుకు నడిచాయో, పాపం వాళ్లందఱూ వెఱ్ఱివాళ్లలా ఇంత ఏమీ ఆలోచించక ఎలా బ్రతికేసారా అని మఱో అనుమానం!

    ఎందుకంటే వ్యాకరణం లేకపోయినా భాష బ్రతికేస్తుంది కదా, అసలు మాట్లాడవలసిన అవసరం ఉన్నదని అనుకుంటే, ఒక వ్యక్తి తన భావం రెండవ వ్యక్తికి తెలియజేయాలీ అంటే, మొదటి వాడు రెండవ వాడి భాష నేర్చుకుంటే సరిపోదా? ఒక వేళ మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడనుకుంటే, ఈ రెండవ మూడవ వ్యక్తుల భాషలకి పోలికలు ఉన్నా, పోలికలతో పాటుగా వ్యత్యాసాలు కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటే అప్పుడు మొదటి వాడు చచ్చినట్టుగా మూడవ వ్యక్తి భాష కూడా నేర్చుకోవలసినదే కదా ఒకవేళ ఆ మూడవ వ్యక్తితో ఏదైనా మాట్లాడవలసివస్తే? సంస్కృతం భాషామాతృక కాని వాళ్లు కూడా గౌరవించే పతంజలి మహర్షి రక్షోహాగమలఘ్వసందేహాః ప్రయోజనమ్ అని వ్యాకరణం గుఱించీ, దాని ఆవశ్యకత గుఱించీ ఎందుకు గొంతు చించుకున్నారో కదా అని జాలి కూడా వేస్తోంది! వ్యాకరణం వల్ల ఈ వ్యత్యాసాలు తగ్గి మూలభాష ఒకటే ఐనప్పుడు అందఱూ ఒకే రకమైన భాషలో మట్లాడుకోవడం సులభమౌతుందీ అని పిచ్చి ఆలోచన అనాలోచితంగా చేసేసారేమో అని కూడా అనుమానం! వ్యాకరణాదులు లేకపోతే ప్రమాదవశాత్తూ చివరకి తండ్రీ కొడుకుల భాషలో కూడా తేడాలు వచ్చినా వచ్చి, వాళ్లు పరస్పరం మాట్లాడుకోవడం కూడా కష్టమౌతుందేమో అని ఎందుకు అంత దూర దురాలోచన చేసారో కదా మన పెద్దవాళ్లూ పాపం అని వాళ్ల అమాయకత్వానికి నవ్వు కూడా వస్తుంది!!!

    అందుకే… హెయిల్ దీ ఇంగ్లీష్ లేఁఙ్గ్‌వేజ్.

  12. బొల్లోజు బాబా గారూ, మీరు చెప్పినదాన్ని బట్టి మీ భావం అర్థం చేసుకోలేకపోయాను.

    “ఏ భాషైనా జనుల నోళ్లలో నానుతున్నంత సేపూ సజీవంగానే ఉంటుంది.” అన్నారు. అలాగే..
    “మంచి సారస్వతం ఒక భాషను మరింత ప్రజ్వలింపచేస్తుంది.” అన్నారు.
    వెనువెంటనే,
    “ఈ విషయాన్ని– తెలుగును నేర్పండీ, మాట్లాడండీ, భాషను బతికించండీ, స్కూళ్ల్లో తెలుగును మాధ్యమంగా చేయండీ,..”,
    “… — అంటూ మైకులు పుచ్చుకొని ఉపన్యాసాలు చేసేవారు గ్రహిస్తే మంచిది.” అనేసారు.

    అసలు మీ ఉద్దేశం ఏంటో నేను అర్థం చేసుకోలేక పోయాను. పిల్లలకు తెలుగు నేర్పనక్కరలేకుండానే, తెలుగులో మాట్టాడనక్కర్లేకుండానే, వాళ్ళు మంచి సారస్వతాన్ని వెలయించగలరనా? సారస్వతంలోని స్వారస్యాన్ని అస్వాదించేయగలరనా?

  13. కె.మహేష్ కుమార్: ఊరికే అభ్యుదయవాదిగా కనబడాలనే దుగ్ధతోనో, మరోకారణంగానో మీ వాదనను వెళ్ళగక్కినట్టుంది తప్పితే, మీ రాతకు ఇక్కడ సందర్భం లేదనిపిస్తోంది. జనాల తెలుగు – జనాల తెలుగును వద్దన్న ధోరణి ఈ వ్యాసంలో నాక్కనబళ్ళా!

    కొత్త భాషలను నేర్చుకోవద్దనడంలేదు. కొత్తకొత్త పదాలను, భావనలను మన భాషలోకి తెచ్చుకోవద్దనడం లేదు.

    మన భాషనే కొత్త కొత్తగా, హిందీలానో. ఇంగ్లీషులానో, హిందింగ్లీషులానో, హిందింగ్లీషాంద్రంలానో మాట్టాడే విధానాన్ని ఒప్పుకోగలిగేలా గుండెను ఎడల్పూ చేసుకుందాం, తప్పేదేముంది!

    కానీ, ఈ కొత్తల మోజులోపడిపోయి, మన భాషావారసత్వాన్ని, మన పూర్వ సాహిత్యాన్ని కాదనుకోనక్కర్లేదు, కాలదన్నుకోనక్కర్లేదు. భావితరాలకు మన వారసత్వంగా దాన్ని అందించాలి. అనుక్షణమూ చరిత్రను గుర్తు చేసుకుంటూ బతికేవాళ్ళం.. చరిత్రలోని అన్ని విషయాలనూ గుర్తుపెట్టుకోవాలి. సెలెక్టివ్ మయోపియానో, సెలెక్టివ్ అమ్నీసియానో పనికిరాదు.

  14. చర్చ బాగుంది. ప్రతిఒక్కరూ తమఅభిప్రాయాలని గట్టిగా నమ్మే చెబుతున్నారు. అయితే, సామూహికంగా ఏం చేస్తున్నాం, ఏంచెయ్యగలం అన్నవిషయం మాత్రం నాకు అగమ్యగోచరంగా వుంది.
    నేను కూడా ఇలాటి అభిప్రాయాలే వెలిబుచ్చేను తల్లీ, నిన్ను దలంచి అన్నకథలో. అది రాసి నాలుగేళ్ల పైనే అయింది.ఇప్పటికీ నాబాధ కామేశ్వరరావుగారి తపనలాగే – అలాగే వుంది. ప్చ్.

  15. తెలుగు మీడియం లో చదివినవారికి ఇంగ్లీషు రాదని, కేవలం తెలుగు మీడియంలో చదవడం వల్లే మాకు ఇంగ్లీషు రాకుండాపోయిందని ఎవరైనా అన్నా అది నిజం కాదు. నిజానికి తెలుగు మీడియం బళ్లలో ఇంగ్లీషు “సరిగా నేర్పకపోవడమే” అసలు సమస్య. తెలుగు మీడియం బళ్లలో మేం చదివేటప్పుడు ఐదో తరగతి నుంచి, ఇప్పుడు మూడో తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పిస్తున్నారు. స్నాతకం (graduation) అయ్యేసరికి కనీసం పది సంవత్సరాలు నిర్బంధంగా చదివిన భాష సరిగా రాలేదంటే అది విద్యార్థుల లేదా వారికి ఆ భాష నేర్పిన ఉపాధ్యాయుల అసమర్థత/నిర్లక్ష్యం. అసలు కారణం వదిలేసి తెలుగును విమర్శించినా సమర్థించజూసినా సమస్య పరిష్కారం కాదు.

    >> తెలుగు మాత్రమే తెలిసిన వారికి

    లక్ష్మన్న గారూ,
    చదువుకున్న తెలుగువారెవరికీ “తెలుగు మాత్రమే తెలిసి ఉండే” అవకాశం లేదండీ.

    బాబా గారూ,
    బతకడం/జీవించడం??? తేడా నాకు తెలియడం లేదు.

    >> ప్రభుత్వ జీవోలు తెలుగులో విడుదల చేయండీ,

    చెయ్యనవసరం లేదంటారు!

  16. @చదువరి: అభ్యుదయవాదమా!! అదేమిటి? నాకు దానిగురించి బొత్తిగా తెలీదండీ. నాకు తెలిసిందల్లా “నావాదమే”.
    ఈ విషయంబుపై కూలంకషంబుగ ఒక టపా బరికితిని. నాయందు దయదలంచి ఆ టపాను తిలకించవలెనని ప్రార్థన.
    http://parnashaala.blogspot.com/2009/06/blog-post_30.html

  17. Rohiniprasad says:

    ఇంగ్లీష్ నేర్చుకోవడంవల్లనే తెలుగు మరుగున పడిపోతోందనేది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే మనతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల స్కూళ్ళలో ఇంగ్లీషుకన్నా హిందీయే ఎక్కువగా నేర్పుతారు. అంతమాత్రాన అక్కడి ప్రాంతాల్లో మన దేశపు సంస్కృతి వెల్లివిరుస్తున్న దాఖలాలేమీ లేవు. దేశీయభాషలను చిన్నచూపు చూసే లక్షణం సామాజికమైనది. ఈ లెక్కన తెలుగు తప్ప మరేదీ రాని గ్రామీణులే భాషకు ఆధారమని అనడంలో తప్పేమీ లేదు. అయితే మధ్యతరగతివారికి ఉన్నంత “నోరు” వారికుండదు. ఒక ఉదాహరణ ఏమిటంటే జానపదకళలుగా ఎదిగిన తోలుబొమ్మలాటలవంటి కళారూపాల్లో క్రమంగా పాత బాణీలు పోయి సినిమాపాటలు చోటుచేసుకోవడం మొదలుపెట్టాయట. ఇటువంటిది అన్ని విషయాల్లోనూ జరుగుతుంది. మార్పు అనివార్యమే. కొన్ని విషయాలు మ్యూజియంలకే చేరుతాయి. అయితే గతంలో భాష విషయంలో జరిగిన ప్రయత్నాలను మనం మరిచిపోకూడదు. వ్యవహారిక భాషావాదం ఒక ఉద్యమంగా రూపొందకపోతే ఏమై ఉండేది? (తమిళంలో పత్రికల దగ్గర్నుంచీ రచన ఇప్పటికీ అంతా గ్రాంథికంలోనే జరుగుతుంది.)

    స్కూళ్ళలో బలవంతాన నేర్చుకున్న తెలుగు కొంతవరకే తోడ్పడగలదు కాని పూర్తిగా కాదు. భాషమీద నిజంగా అభిమానమూ, గౌరవమూ లేని వర్గాలు ఎలాగూ డబ్బు వెంట పరిగెడతాయి కాబట్టి వాటిని పట్టించుకోనక్కర్లేదని భాషాభిమానులు అనుకోవచ్చు. ఈ వర్గాల్లో కూడా అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరికి తెలుగుమీద ఆసక్తి కలుగుతుంది. ఇటువంటి వ్యాసాలు వారి కోసమే. ఇదంతా వట్టి సొద అనుకునేవాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు. తెలుగు గురించి కొంత మథనపడడంవల్ల లాభం లేకపోవచ్చునేమోగాని నష్టమేమీ లేదుకదా?

    ఏదో సర్దార్జీ జోక్ గుర్తుకొస్తోంది. ఇంగ్లండ్ వెళ్ళొచ్చిన సర్దార్ని “అక్కడెలా ఉం”దని అడిగారట. “చాలా గొప్ప ప్రగతి సాధించారు. చిన్నపిల్లలుకూడా ఇంగ్లీషే మాట్లాడతారు” అన్నాట్ట. ఈ పద్ధతిలో గ్రామీణుల తెలుగును చూసి మనం మురిసిపోవచ్చుగాని “నోరున్న” వర్గాలు క్రమంగా వారిని marginalize చెయ్యవచ్చు.

  18. bollojubaba says:

    @ చదువరి గారికి
    ఈ భాషేదో చచ్చిపోతున్నట్లు, తామే దీన్ని బతికిస్తున్నట్లుగా పోజులు కొడుతూ, కోట్ల కోట్ల రూపాయలు, పరిరక్షణ పేరిట తగలేసేవారికోసం.
    జనుల నాలుకలపై ఉన్నంతకాలం ఏ భాషా చచ్చిపోదు.

    అలా అనటం తెలుగుని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చెయ్యద్దని. ఈ ప్రయత్నాలు కూడా వేరే గతిలేక ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్ధులపై చేయటమనేది దారుణం. ద్వితీయ భాషా ఐచ్చికాలేమీ లేకుండా పి.జి. వరకూ తెలుగును ఒక కంపల్సరీ సబ్జ్కటుగా ఉంచే ప్రయత్నాలు చేయకుండా, మొత్తం మాధ్యమమే తెలుగు మాత్రమే ఉండాలి అని వాదించే, ఈ కుహనా భాషోద్దారకుల గురించి ఆ మాటలు.

    2.తెలుగు సారస్వతానికి సేవలు చేసిన వారికి ఇస్తున్న గుర్తింపు ఏదీ. యే శ్రీశ్రీకో,క్రిష్ణ శాస్త్రికో చలానికో, విశ్వనాధకో వారి పేర్లమీద మ్యూజియములు ఏర్పాటు చేయచ్చుగా. వారు నివసించిన గృహాలను పునర్నింమించి సందర్శనార్ధం పెట్టొచ్చుగా. దౌర్భాగ్యమేమిటంటే, విశ్వనాధవారికంటూ ఆంధ్రదేశంలో ఓ విగ్రహమన్నా లేదు. (నాకు తెలిసి-ఎవరైనా సవరిస్తే తప్ప)

    ఏ ఊరూరా కవులకు ముంసిపల్ స్థలాలలో విగ్రహాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం పోతుంది?్ తెలుగునుద్దరించండీ అంటూ కోట్లు కోట్లు గా తగలేయటం తప్ప.
    తద్వారా కొన్ని తరాల రచయితలకు స్పూర్తి కలిగి మరింత మంచి సారస్వతం వెలువడుతుందిగా. అపుడు ఆ సారస్వతమే భాషను మరో వెయ్యేళ్లు బతికిస్తుంది. ఈ సభలు, కరపత్రాలు కావు. ముమ్మాటికీ కావు.

    త్రివిక్రం గారికి
    బతకటం అంటే to survive- to win bread

    ఇక జీవించటం అంటే అనుబంధాలతో, ఆత్మీయతలతో, ఒకరమైన మానసిక తృప్తితో జీవనాన్ని సాగించటం. ఈ రెండవ దానికి తెలుగు వారందరూ తెలుగునే వాడతారని నా విశ్వాసం. (దెబ్బతగిలినప్పుడు అమ్మా అనే అంటారు తప్ప ఓ జీసస్ అని అనకపోవచ్చని నా అభిప్రాయం)

    bollOju baba

  19. భాష అంటే కేవలం పక్కవాడితో సంభాషించడం మాత్రమేకాదు, అది ఒకజాతి సంస్కృతిని తర్వాతి తరానికి అందించడానికి కూడా. కేవలం ప్రజలభాషతోటే జాతి అవసరాలు తీరిపోతాయనుకుంటే, తాజమహల్ కట్టడానికి కేవలం కూలీలే కానీ మేస్త్రీల, నిర్మాణశాస్త్ర నిపుణుల అవసరం లేదని వాదించినట్లుంటుంది.
    నాకైతే మాతృభాష అవసరంలేదనడం పాలింకిపోయాయని అమ్మ అవసరం లేదనడమే అనిపిస్తుంది. అలాగే మా అమ్మ ఇదివరకులా అందంగా లేదని బాధపడడంలో కానీ, ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకోవడంలో కానీ తప్పు లేదనిపిస్తుంది. ధానికి ఆక్షేపణ ఏముంటుంది?

  20. ravikiran timmireddy says:

    వైరుధ్యవనేది ప్రకృతి సహజ లక్షణం. మనం కూడా ప్రకృతిలో భాగవే కాబట్టి ఆ వైరుధ్య లక్షణం మనక్కూడా సహజవే. నేనిక్కడ జీవ శాస్త్ర పరవైన, వస్తు సంబంధవైన వైరుద్య లక్షణాల గురించే చెప్పటం లేదు. సామాజిక పరవైన, మానసిక వైరుధ్యాలు కూడా సహజవేనని నా అభిప్రాయం. కాబట్టి ఒక సమాజంలో, ఒక భాష మాట్లాడే, ఒకరకవైన మనుషుల మధ్య కూడా పరస్పర విరుద్దవైన అభిప్రాయాలు అసహజవేవీ కాదు. ఏవిటయ్యా ఈ సుత్తంతా అనిమీరనొచ్చు, ఈ సుత్తంతా ఎందుకంటే, ఆ పరస్పర విరుద్దవైన అభిప్రాయాల్ని ఎలా చర్చకు పెడదాం అని. మనకు నచ్చని అభిప్రాయాన్ని, అయ్యా నీ అభిప్రాయం నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు. లేదా మరికొంచ ఓపిక వున్న వాళ్ళు, ఇదిగో నీ అభిప్రాయాల్ని బలపరుస్తూ నువ్వు చెప్పిన తర్కంలో లోటుపాట్లివి అని చెప్పొచ్చు. ఇంకా ఓపికుంటే నీ తర్కంలో లోటుపాట్లు ఇవి అని ఆపెయ్యకుండా, ఇదిగో ఇదీ నా అభిప్రాయం, దాని వెనుక వున్న నా లాజిక్ ఇది అని చెప్పటం. ఆ చెప్పటంలో అక్కడక్కదా వ్యంగ్యం అనేది వాదానికి మరింత పదును పెడుతుంది. దారిన పొయ్యేవాడిని బలవంతంగా నిలబెట్టి ఇచ్చిన ఉపన్యాసంలా కాకుండా, దారినపొయ్యే వాడే ఆగి మరీ వినాలన్న కుతూహలాన్ని కలిగిస్తుంది. ఐతే ఆ వ్యంగ్యం పరిధిలు దాటితే, అసలు అభిప్రాయానికి మూలాంశం అయితే, అది వెటకారంగా, వెకిలి తనంగా దిగజారుతుంది. వెకిలితనంలో తార్కికత వుండదు, వెకిలితనంలో విశ్లేషణ వుండదు. కొన్ని సమయాల్లో మనకు వుండే బలవైన నమ్మకాల్ని, మరొకరు విమర్శించినపుడు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగింది కాబట్టే ఆ విమర్శకి మనవొక జవాబు వ్రాస్తాం. ఐతే ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చే తీరు వ్యంగ్యపు పరిధుల్ని దాటి వెటకారపు సరిహద్దుల్ని దాటి, వెకిలితనపు లోతుల్లోకి దిగజారితే ఆ బాధ ఉక్రోషవవుతుంది, తార్కికత లోపించిన ఆ అభిప్రాయపు విలువ అదేదో సావెత చెప్పినట్టు ఆక్కడ వుంటుంది.

    శ్రీ భైరవభట్ల గారి అభిప్రాయం ఆ ఉక్రోషాన్నే బయటపెట్టింది. తమ అభిప్రాయాలు ఎందుకు ఒప్పో, అవతలి వారివి ఎందుకు తప్పో చెప్పటం పోయి, భుజాలు తడుముకోవడవే నాకా అభిప్రాయం నిండుగా కనిపించింది. ఆ భుజాలు తడుముకోవడాన్నే వ్యాసంగా మన ప్రొద్దు సంపాదకులు ఎలా భ్రమపడ్డారో దానికి వారే జవాబు చెప్పాలి.

    ఇక వారు కక్కిన సున్నా, ఒకట్లలో నాకు ఒకటే ఒక్క చర్చించదగిన విషయం కనిపించింది దాని విషయవేవిటో చూద్దాం రండి.

    “భాషకి ఒక చరిత్ర ఉంటుందని, దానికొక సంసృతి ఉంటుందని, వాటి అవసరం ఆ భాష మాట్లాడే వాళ్ళకి ఉంటుందని భ్రమపడి తప్పుచేసేను.” నిజంగానే తప్పుచేసేరు భైరవభట్ల గారు. చరిత్ర, సంసృతి భాషకి ప్రత్యేకంగా ఉండవు. ఆ భాష మాట్లాడే జనాల చరిత్రే, ఆ జనాల సంసృతే ఏ భాష చరిత్రయినా, సంసృతైనా. అందుకని మీరు జనాలనొదిలేసి, వాళ్ళ సామాజిక వైరుధ్యాలనొదిలేసి, వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్నొదిలేసి, వాళ్ళు మాట్లాడే భాషలో ప్రతిఫలించే అన్ని రకాల వైరుధ్యాలని, వర్గీకరనలణి వదిలేసి, మీకు తెలిసిన, మీకు నచ్చిన మీ సమాజంలో మీ అమ్మమ్మ, తాతయ్యలు మాట్లాడిన భాషనే ప్రామాణికవైన (ప్రామాణికవైన భాషకసలు అర్థం వుందా) భాష అనే సాము చేస్తున్నారు. మా అవ్వా, తాతలు పురాణాలు చదవలేదు, కావ్యాలు కంఠతా పెట్తలేదు, వేదాలు ఔపోసన పట్తలేదు. గుళ్ళో ఏవో పురాణాలనిన్నారు, వాళ్ళూ, వీళ్ళూ చెప్పిన కతలేవో విన్నారు. మాక్కొడా అవే చెప్పేరు, ప్రామాణిక భాషలో కాదు అచ్చవైన నెల్లూరు తెలుగులోనే. బళ్ళో చదివిన ఆ కొద్ది పాఠాలు తప్పిస్తే నాకు మరే పురాతన సాహిత్య పరిచయం లేదు. మా నాయన అదే కోవ, నేను అదే దారి. కాబట్టి పాత సాహిత్యం గురించి మీ బాధ నాకు, నాలాంటి వాళ్ళకి (గుర్తు పెట్టుకోండి మీరే దేశవేగిన, ఎందు కాలిడినా మేవే మెజారిటీ) అనవసరం. మెజారిటీ ఆశలు, ఆరాటాలు, ఆందోళనలు, అవస్థలు, ఇవన్నీ కలగలిసిన బ్రతుకుల చరిత్రలు, వాళ్ళ సంసృతులు వాళ్ళ భాషలో ప్రతిఫలించని సాహిత్యం చనిపోయితీరుతుంది. పూర్తిగా కాకపోయినా దేవ భాషలాగా నడుస్తున్న శవమై మిగులుతుంది. మీకు బాధ అనిపించినా సరే అదే వాస్తవం, మా వర్గ వాస్తవం, మా జీవన వాస్తవం. మెజారిటీ మేవే కాబట్టి మా వాస్తవే నిలబడితీరుతుంది, మీరు ఎన్ని అభ్యంతరాలు ఏకరువు పెట్టినా, ఎంత ఉక్రోషాన్ని వెలిబుచ్చినా, ఎంత వెటకారాన్ని వ్యక్తపరిచినా.

    ఎందుకంటే భాష వ్యక్తీకరన సాధనం కాబట్టి, కేవలం వ్యక్తీకరన సాధనం కాబట్టి. అది తెలుగు భాషైనా, ఆంగ్లవైనా, కేన్వాసుపై కుంచె నుంచి జారే రంగుబొట్ల శివతాండవమైనా, భాష కేవలం వ్యక్తీకరణ సాధనవే. సాహిత్య, సంసృతులు ఆ వ్యక్తీకరణలో ఒక భాగవే.

  21. bollojubaba says:

    నేనిదివరకp పెట్టిన కామెంటు కనపడటం లేదు.
    in a nut shell
    @ చదువరిగారికి
    నేనుద్దేశించిన మాటలు, తెలుగుని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించేవారిని గురించి. (ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మాధ్యమం ఉండాలి అని కోరుతూ)

    బ్రతకటం అంటే బ్రతుకు తెరువు కొరకు

    జీవించటం అంటే, అను్బంధాలు, సాంప్రదాయాలకు ఆప్యాయతలు, కుటుంబ సంభాషణలు తెలుగు వారు తెలుగులోనే చేసుకొంటారని నా నమ్మకం. బాధకలిగినపుడు అమ్మా అని అంటాడు తప్ప హో జీసస్ అనడని నా విశ్వాసం (క్రిష్టియన్లైతే తప్ప)

    బొల్లోజు బాబా

  22. Rohiniprasad says:

    రవికిరణ్‌గారూ,
    నా వరకూ ప్రామాణిక తెలుగు భాషను గురించిన అపోహలేమీ లేవు. నాకు అన్ని జిల్లాల యాసలూ వినడానికి బాగానే ఉంటాయి. మీ అవ్వాతాతలు గుళ్ళో విన్న పురాణాల ప్రభావం మీమీద పడే ఉంటుంది. అటువంటిది ప్రస్తుతకాలంలో జరిగే అవకాశం లేదు. పురాణాలు ఎవరూ చదవరు (చెప్పడం మాట దేవుడెరుగు). పురాణాల్లోని విలువ ఎంతుందనేది కాదు ఇక్కడి ప్రశ్న. ఏమీ లేకపోవచ్చు కూడా. నోటిమాటగా తప్ప తెలుగు నిలబడుతుందా అనేదే ప్రశ్న. చదవడం, రాయడం మాటేమిటి? మీ పిల్లలకు అది సహజంగా రాదు; మీరు బుద్ధిపూర్వకంగా వాళ్ళని కూర్చోబెట్టి చెపితే తప్ప. అందుకు ప్రతివారూ ప్రయత్నించాలనేదే నా ఉద్దేశం.

    ప్రపంచీకరణ ముసుగులో జాతీయసంస్కృతులు నాశనమవుతున్న సంగతి మీకు తెలియనిది కాదు. నాకు సంబంధించినంతవరకూ ఇక్కడి చర్చ యాసల గురించీ, ప్రామాణికభాష గురించీ కాదు. రాయలసీమ యాసలోనూ, తెలంగాణా యాసలోనూ రాస్తున్న ఉత్తమకథకులు మంచి సాహిత్యపటిమ ఉన్నవారే. పికాసోవంటి చిత్రకారులందరూ ఆర్ట్ స్కూళ్ళకు వెళ్ళినవారే. నేర్పేవారే కరువైతే ఏమవుతుందో కూడా ఆలోచించాలి. (ఇంకెందుకూ పనికిరానివారు స్కూలు టీచర్లవుతున్నారనే ఫిర్యాదు ఉంది.) పోటీ ప్రపంచం పరిస్థితి ఇది.

    “మీ వాస్తవం, మా వాస్తవం” అనేమాటలు వాడారు. ఇటువంటి విచక్షణ గురించిన చర్చ అనవసరం. ఏ విధమైన తెలుగు ఉపయోగంలోకి వచ్చినా అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మార్పులు జరగటం లేదని కాదు. మునుపటిలాగా ఈ రోజుల్లో ఎవరూ 27 నక్షత్రాల పేర్లూ, 60 సంవత్సరాల పేర్లూ బట్టీపట్టరు. ఆసక్తి ఉన్నవారికోసం వాటికి వెబ్‌సైట్లున్నాయి.

    తెలుగు గురించి ఎవరైనా తమ ధోరణిలో కాస్త అతిగా ఆందోళన పడుతూ ఉంటే పడనివ్వండి. ఏ రూపంలో తెలుగు నిలబడి ఉందో, ఏ రూపంలో కొనసాగబోతోందో వీలుంటే వివరించండి. Leaving it to nature మాత్రం మంచి పద్ధతి కాదేమో ననిపిస్తుంది.

  23. ఓ టపా కొట్టేంత ఉత్సాహం వచ్చింది కానీ సమయాభావం వల్ల వ్యాఖ్యతో సరిపెడుతున్నాను.

    మద్దతు పలుకులు:

    వ్యాఖ్యలు చదివాక బహుశా భాష అంటే మాట్లాడటం/చదవగలగటం వరకే అన్న భ్రమలో కొందరు ఉన్నారేమో అనిపించింది. మాట్లాడేభాషగా మాత్రమే ఉంటే చాలు అనుకున్నప్పుడు మా చిన్నప్పుడు “క” భాష అని పక్షుల్లా “క” గుణింతం మాత్రమే ఉపయోగించి సరదాకి మాట్లాడేవాళ్ళని చూసాను. ఆ మాత్రం దానికి “తెలుగు” భాషే అక్కర్లేదు. హాయిగా సైగలతో అయినా మాట్లాడుకోవచ్చు. నడిపే చోటు లేక కార్లు వదిలి మనుషులు సైకిలెక్కటం మొదలెట్టినట్లు, మాట్లాడగలిగే జనాలు లేక సైగలభాషకి మారిపోవచ్చు. నవ్వకండి…ఇది నిజమైనా నాకాశ్చర్యం కలగదు.

    చదవగలగటం, వ్రాయగలగటం లేకుండా భాష మన్నతుంది అనటం కన్నా అతిశయోక్తి మరొకటుండదు. ఎన్నో గ్రంధాలు ఆయా భాషల్లో ఆనాడు రాసి ఉండబట్టే మాట్లాడే భాష అత్యంత నెమ్మదిగా దిగజారుతూ ఇన్నాళ్ళకి ఈ స్థితిలో ఉంది. అదే భాషకి మద్దతుగా ఉండాల్సిన లిపి అదృశ్యమై ఉంటే మనమేనాడో “క” భాష మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం 🙂

    కొందరన్నట్లు ఊళ్ళల్లో భాష బతికుంది… నిజమే కానీ ఎల్లకాలమూ కాదు. చదవగలిగే, రాయగలిగే శక్తి లేక ఎలా అయితే పట్టణాల్లో యువత (నా మేనల్లుళ్ళతో సహా) మాతృభాషకి దాదాపుగా దూరం అయ్యారో
    ఆ స్థితి పల్లెలకి రావటం కొద్దిరోజుల మాటే. మొన్నటి పల్లెలు నేటి పల్లెలు కావు…నేటి పల్లెలు రేపిలాగే ఉండవు. మాట్లాడే భాష ఉంటే చాలంటారా…

    కాకెకాకికూకికీకూకెకి…. చిత్తగించగలరు.

    వ్యతిరేకపు పలుకులు:

    అప్పట్లో మా కుటుంబ ఆర్ధిక స్థితి దృష్ట్యా మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు మా ఇంట్లో. ఒకవేళ అలా కాకపోయినా మా ఇంట్లో ఉన్న వాతావరణం (పుస్తకాలే పుస్తకాలు) ప్రభావం వల్ల కూడా నాకు ఖచ్చితంగా వ్రాత వచ్చుండేదనుకోండి. అంతా మనమంచికే అన్నట్లు ఆ తెలుగు ఇప్పుడిలా ఉపయోగపడింది. అవకాశమున్న మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. వాళ్ళ ఇంటి వాతావరణం వేరు. వాళ్ళు ఇప్పుడు కేవలం తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు మాత్రమే. ఇది అంతో ఇంతో మన తెలుగు మాట్లాడే ఓ ఇంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా ఇలాంటి ఇళ్ళే ఆంధ్ర దేశంలో. తప్పు పూర్తిగా వాళ్ళది కాదు. ఎలా అంటారా? 960 మార్కులు వచ్చిన మేనల్లుడికి ఎంసెట్ దెబ్బకొట్టింది… ఆ మిగతా నలభై మార్కుల్లో 40000 మంది పోటీదార్లు. తెలుగు ఊసెత్తితే వినే పరిస్థితా మనం ప్రతినాయకులం అవటం తప్ప?

    నా ఉద్దేశ్యంలో వ్రాయగలిగే తెలుగు బతకాలంటే…

    ఒకటి, నిర్బంధంగా తెలుగు ప్రాధమిక స్థాయిలో ప్రవేశపెట్టటం.(అంతో ఇంతో అబ్బుతుంది, లేకపోతే అసలే దిక్కుండదు.)
    రెండోది, ఇంగ్లీష్ చదువు”కొన”గలిగే స్థోమత లేకపోవటం.
    మూడోది, బళ్ళో తెలుగు చదివేవాడికి ఇంట్లో తెలుగు వాతావరణం లేకపోయినా పర్లేదు కానీ, ఇంగ్లీష్ వాతావరణం అతిగా ఉండకూడదు.

    ఇకపోతే, తెలుగుని బళ్ళో చదివినా ఇంట్లో ఇంగ్లీష్ వాతావరణం ఉన్నా మాట్లాడగలిగే వారే మిగులుతారు.

    ఏమాటకామాటే, కాస్త ఇబ్బందిగా చెబుతున్నాను…. మీరు తెలుగు భాష మెల్లగా కనుమరుగు అవుతోందని పడుతున్నంత దిగులు నాకు లేదు. ముందే చెప్పినట్లు మా మేనల్లుళ్ళే సాక్ష్యం. మనం మన కుటుంబంలో వ్యక్తుల వరకు ఏమైనా కిందామీదా పడీ(అదీ ఆసక్తి ఉంటే) వ్రాసే తెలుగు అలవాటు చెయ్యొచ్చేమో గానీ అంతకన్నా దూరాలు వెళ్ళి మనుష్యుల్ని మార్చే పెద్ద ఆశల్లేవు. ఎవరి ఇష్టాలు, ఎవరి ప్రాధాన్యాలు వాళ్ళవి 🙁

  24. పాఠశాల స్థాయిలో తెలుగు “విపరీతంగా” తగ్గిపోతోందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ముఖ్యంగా మెజారిటీ ప్రాంతాలైన గ్రామీణ క్షేత్రాలలో అసలు లేవు.గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలలు కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. పాఠశాల విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. ప్రాధమిక మరియూ పాఠశాల విద్య కలిగిన స్కూళ్ళు 11,195. ప్రైవేటువి 2,772. విధ్యార్థులు 17,55,415. 54,7415 మంది ప్రైవేటు పాఠశాలలో.

    ఒకవేళ భవిష్యత్తులో అక్కడ తెలుగు ‘చదవడం.రాయడం’ తగ్గిపోతే నేను హర్షిస్తాను. విచారించను. ఎందుకంటే, ప్రస్తుతం పుస్తకాలు నేర్పేతెలుగుకీ వాళ్ళజీవితాల్లో ఉన్న తెలుగికీ అస్సలు సంబంధం లేదుగనక అదొక అర్థరహిత addition తప్ప జీవితాలలో ఎన్నటికీ “పనికొచ్చేది”అస్సలు కాదు.

  25. తమ్మిరెడ్డి రవికిరణ్ వ్యాఖ్య ఇప్పుడే చదివాను. నేను మరో అర ఠావు జాగాతీసుకున్నా అంతకుమించి మరేమీ చెప్పలేను.”పొయ్యేగాలం పోవాల్సిన తెలుగుకే వస్తుంది. తెలుగు మాత్రం బ్రతికేవుంటుంది.”

  26. rayraj says:

    భాషలు ఎక్స్టింక్టు ఔతున్నాయి, ఔతాయి అనేది గత అనుభవం.అలా అవ్వకుండా ఉండటానికి కొందరు ఆలోచనపరులు రక్షించుకుంటున్నారు. ఎందుకలా ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి తమ ఆలోచనలూ, అవసరాలు, ఆవేశాలు ఆవేదనలూ అన్నీ ఇంగ్లీషులొనే వస్తున్నాయి. అందుకని వాళ్ళకి భయం. కానీ వాళ్ళు కూడ తెలుగు వాళ్ళే. అందుకనే వాళ్ళని తెలుగులొ ఆలోచించండి, బ్లాగుల్లో ఆలోచించండి అని చెబ్తున్నాను. అలా ఆలొచిస్తేనే , రేపు ఊళ్ళో జనాలు, నా పిల్లలూ కూడా తెలుగులొ ఏదన్నా దొరుకుతుందని వెతుకుతారు. లేకపోతే, ఇంగ్లీషులోనే వెతుకుతారు

  27. కొడవళ్ళ హనుమంతరావు says:

    కె. మహేష్ కుమార్ గారికి,

    చర్చని సమాజం, సంస్కృతి, సాహిత్యం లాంటి క్లిష్ట విషయాల నుండి ప్రాథమిక చదువుల వైపు మళ్ళించినందుకు సంతోషం. దయచేసి మీరిచ్చిన గణాంక వివరాలకి మూలాధారం చెప్పండి. జులై 2009 “వీక్షణం” పత్రికలో చదువులపై ఫోకస్ వ్యాసాలు ప్రచురించారు. ఎం. గంగాధర్ గారి “ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్య” వ్యాసంలో ప్రైవేట్ పాఠశాలలు పది శాతం లోపయినా విద్యార్థులు మాత్రం ముప్ఫై శాతం (ప్రభుత్వ పాఠశాలల్లో 36 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 18 లక్షల మంది) పైనే ఉన్నారన్నారు (పేజీ 25). ఆయనా మూలాధారం ఇవ్వలేదు.

    మీరు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ‘చదవడం, రాయడం’ తగ్గిపోతే హర్షిస్తామన్నారు. కనీసం పేపరు చదవడం, చిల్లర లెక్కపెట్టడం అయినా నేర్చుకుంటారు కదా. అదీ అర్థరహితమేనా?

    కొడవళ్ళ హనుమంతరావు

  28. కొడవళ్ళ హనుమంతరావు గారు: నేను ఉదహరించిన సంఖ్యలు “Center on Globalization and sustainable Development” వారి వర్కింగ్ పేపర్ సిరీస్ లోనివి.DPEP మరియూ SSA కార్యక్రమాల నేపధ్యంలో Scaling up primary Education in Rural India పేరున ఆంధ్రప్రదేశ్,కర్ణాటక మీద ఒక case study చేశారు. ఈ సంఖ్యలు 2005-06 విద్యాసంవత్సరానికి సంబధించినవి. గత మూడేళ్ళలో ఆ సంఖ్యపెరిగే అవకాశం మెండు. సర్వశిక్షా అభియాన్ కేటాయింపులు పెరిగిన నేపధ్యంలో ప్రభుత్వపాఠశాలల్లో ఎక్కువ enrollments జరిగాయి. http://www.dpepmis.org లో చూస్తే మీకు మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది.

    నేను భాషా బోధకుడిగా శిక్షణపొందిన వ్యక్తిని. పాఠశాల విద్యలో పేపరు చదివేదిశగా విద్యార్థుల్ని తెలుగు బోధన ప్రేరేపిస్తుందన్న మీ ఆశ నిజం కాదు. చిల్లరలెక్కపెట్టడానికి స్కూలు చదువు అవసరం లేదు. నా నిరసన ప్రస్తుతం ఉన్న తెలుగుబోధనా పద్దతి శాస్త్రీయరాహిత్యం మీద. విద్యార్థుల సహజభాషని చంపేసి వారి ఆలోచనని monolithic cultural expression దిశగా తీసుకెళ్తున్న తీరుమీద.

    కత్తి మహేష్ కుమార్

  29. @చదువరి: “ఈ కొత్తల మోజులోపడిపోయి, మన భాషావారసత్వాన్ని, మన పూర్వ సాహిత్యాన్ని కాదనుకోనక్కర్లేదు, కాలదన్నుకోనక్కర్లేదు. భావితరాలకు మన వారసత్వంగా దాన్ని అందించాలి.” అన్న మీమాటలోనే నావాదనకు మూలముంది. అది అసందర్భం ఎట్టా అయ్యిందో ఇప్పటికీ ఎరుకగాలే!

    తెలుగు భాష సాహిత్యంలో బ్రతకడం లేదు. తెలుగు ప్రజల నాలుకలపై బ్రతుకుతోంది. ఆ సార్వజనిక భాషని వదిలేసి సారస్వతభాషని మాత్రమే తెలుగనుకుంటున్న మన ఆభిజాత్యంలోంచీ మాత్రమే తెలుగు చచ్చిపోతోందనే అపోహ కనిపిస్తుందితప్ప మరొకటి కాదు. మొత్తం సాహిత్యాన్ని కట్టగట్టి గంగలో విసిరేసినా, తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. బహుశా అప్పుడు బ్రతికున్న తెలుగే అసలు తెలుగు కాబోలు.తెలుగులోని భిన్నత్వాన్ని హరించి standardization పేరుతో జనాలతెలుగుని జనాలకే దూరం చేసిన భాషా వారసత్వానికో దండం. భావితరాల్ని భయపెట్టి తెలుగుకు దూరం చేసిన మీ పూర్వసాహిత్యానికి మరోదండం. ఇప్పుడు మీరు దాన్నే భావితరాలకు అందించాలనుకుంటే అందుకోవడానికి వారు ఉత్సుకచూపుతారోలేదో కనుక్కోండి. అప్పుడుగానీ నిజమేమిటో తెలిసిరాదు.

    భాషాచరిత్ర,ఘనత,పూర్వసాహిత్యం మీద గర్వప్రవచనాలు పక్కనబెట్టి, జనాలకు వారి తెలుగును అందించండి. తెలుగు ఎలాగూ దానంతట అదే బ్రతుకుతుంది. కనీసం అలా చేస్తే మీకు కొంచెం చెప్పుకోవడానికి క్రెడిట్ అయినా దక్కుతుంది.

  30. సురేష్ says:

    మగేస్ బాబుగోరూ,

    తవరు రాసే బాస, “…….ఆ సార్వజనిక భాషని వదిలేసి సారస్వతభాషని మాత్రమే తెలుగనుకుంటున్న మన ఆభిజాత్యంలోంచీ మాత్రమే తెలుగు చచ్చిపోతోందనే అపోహ కనిపిస్తుందితప్ప మరొకటి కాదు…………..భాషాచరిత్ర,ఘనత,పూర్వసాహిత్యం మీద గర్వప్రవచనాలు పక్కనబెట్టి, జనాలకు వారి తెలుగును అందించండి”, తవరు సెప్పే జనోలకి తెలుత్తదా, అర్థం అవుతాదా, ఏటీ? నాకు తెలవక అడుగుతుండా. తవరు రాయొచ్చు గానీ,ఆ పాతోళ్ళు ఆళ్ళ బాసలో రాత్తే తమకు కట్టం ఏసిందా?

    సురేష్

  31. bollojubaba says:

    చర్చ భలే రంజుగా ఉంది.
    భాష జనుల నాలికలపై ఉన్నంతవరకూ చచ్చిపోదు. వాస్తవమే

    రవికిరణ్ గారు, మహేష్ గారు మరో సారి ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. కానీ వారి వాదనల్లో భాషకు మౌఖిక రూపము ఒకటీ చాలు అన్న భావం ధ్వనిస్తుంది.

    మరి భాషకుండే లిఖిత, పఠన రూపాల మాటేమిటి. (మరీ విడ్డూరంగా మహేష్ గారు తుంగలో తొక్కమంటున్నారాయె)

    ఒక భాష పరిణితి చెందాలన్నా, విస్తరించాలన్నా ఈ రెండు రూపాల అవసరం లేదంటారా?

    ఒక భాష బ్రతికి ఉండటానికి మౌఖిక రూపం ఎంతైతే అవసరమో లిఖిత రూపం కూడా అంతే అవసరం.
    ఎందుకంటే ఈ నాడు సంస్కృతం మౌఖిక భాషగా లేకపోయినప్పటికీ, దాని లిఖిత రూపం వలననే ఇంకా బ్రతకగలుగుతున్నది. దానిలో ఉన్న సారస్వతం కారణంగా మరో వెయ్యేళ్లు బ్రతికినా ఆశ్చర్యపోనక్కరలేదేమో.
    అలా కాక లిఖిత రూపంలో లేని ఎన్ని వందల భాషలు క్రమక్రమంగా అంతరించిపోవటంలేదు ఈ ప్రపంచంలో.

  32. @సురేష్: అబ్బా సురేసూ,అట్టాంటి తెలుగు దెల్సినోళ్ళతో అట్టాగే సెప్పితేతప్ప అరతం గాదప్పా. అందుకే ఈ సోదంతా వాళ్ళ”అచ్చ తెలుగు”లో సెప్తాండా.అయినా పాతోళ్ళు ఆళ్ళు మాట్లాడే బాసలోనే రాసినారు అనేది అంతా అబద్ధం బ్రదరూ. మాట్లాడేబాసనెప్పుడూ రాసేబాసతో సమానంగా సూళ్ళేని సాంపరదాయాల్లోంచీ వచ్చినోళ్ళుగాదాయీళ్ళు. నీకు దెలవందేముంది.

    అయినా ఆళ్ళు రాసిందాంతో నాకే కట్టమొచ్చిందీ! అది సెప్పాల్సిన వయసులో పిలకాయలకి సెప్పమనిగదా నా గోలంతా. డిగ్రీలో తెలుగు తీసుకున్న ఆనక వీళ్ళ “పైస్థాయి” తెలుగు నేర్పించమనండి. పదొ తరగతి వరకూ తన గమనాల్ని సక్కంగా తెలుగులో కుదించే కిటుకు నేర్పమనండి. అప్పుడు ప్రజలు తెలుగులో… తనకొచ్చిన తెలుగులో… ఎందుకు రాయరో చదవరో చూద్దాం.

    @బొల్లోజుబాబా:”భాషనుంచి సాహిత్యం గానీ సాహిత్యం నుంచి భాష కాదు.” అనే ధోరణిని బలంగా చెప్పడానికి సాహిత్యాన్ని తుంగలో తొక్కమన్నానుగానీ, లిఖిత రూప భాషకున్న ప్రాముఖ్యత తక్కువని కాదు. కాకపోతే ఇలా రాస్తేనే “మంచి తెలుగు” అనే ఆభిజాత్యాన్ని వీడి మౌఖిక భాషలకు యధాతధంగా,గౌరవప్రదంగా అక్షరరూపం ఇస్తేగానీ లిఖితభాషకు మనుగడ ఉండని కాలం ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకం. ప్రస్తుతం “సంక్షోభం” బహుశా అదేనేమో.

  33. Meher says:

    పొద్దు సంపాదకులకు,

    నావి కొన్ని అనుమానాలు. మీది బ్లాగా, పత్రికా? నాకు తెలిసి ఇలాంటి వ్యాసాలు బ్లాగుల్లో బాగా అమరుతాయి. ఎందుకంటే ఇందులో ఎమోషనూ, రెటోరిక్కూ తప్ప మరేమీ లేదు. పత్రికల్లో వ్యాసాలు, నాకు తెలిసి, తమ వాదనలకి కొన్ని facts జోడిస్తాయి. ఓ అభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా పాఠకుల ముందు పెడతాయి. అలాంటివి ఎన్ని పత్రికలున్నాయని అడిగితే నేన్చెప్పలేను గానీ, పత్రికలున్నవి అందుకు.

    నిజానికి ఈ వ్యాసం కన్నా, ఇది ప్రేరేపించిన చర్చలాంటి రచ్చ చూసి నాకీ మాట చెప్పాలనిపించింది. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడేస్తే చర్చ అయిపోతుందా? ఎవరి కురచ అనుభవాల్ని వాళ్ళు సార్వజనీన సత్యాలు చేసేసి అక్షరాల్లో పరిచేస్తే చర్చ అయిపోతుందా?

    కొంతమంది ఆంధ్రప్రదేశ్ పల్లెటూళ్ళన్నింటినీ తన అరచేతి రేఖలంత దగ్గరగా చూసినట్టు అడక్కపోయినా వాటి వకాల్తా పుచ్చుకుని, లేని elite ని ఒకదాన్ని తమ ముందు ఊహించేసుకుని, లేదా తయారు చేసుకుని, “సాహిత్యాన్ని తుంగలో తొక్కడం” లాంటి అవాకులూ చెవాకులూ పేల్తూన్నారు. మరికొంతమంది తెలుగు సంస్కృతి తరపున కత్తీ డాలూ పట్టుకుని కదం తొక్కేస్తున్నారు.

    ఈ వ్యాసం మొదటిసారి చదవగానే అనిపించింది, కొన్ని బాధాకరమైన వాఖ్యానాలు చూడాల్సి వస్తుందని. ఎందుకంటే చుట్టూ వున్నవాళ్ళెలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి. కానీ ఇది బ్లాగు కాదు కదా, పత్రిక కదా, అలా జరక్కపోవచ్చని సరిపెట్టుకున్నాను. కానీ అంచనా తప్పింది.

    మనుషులపై దాడి చేసే కామెంట్లే మీకు అభ్యంతరంగా కనిపిస్తాయేమో. ఒక సంస్కృతి పైనే నిరాధారమైన నిర్హేతుకమైన మాటలు వదిలేస్తే మీకు అభ్యంతరంగా కనిపించవేమో. ఇలాంటి వెకిలితనం చూపించుకోవడానికి ఎవరికి వాళ్ళకి సొంత బ్లాగులున్నాయి కదా. ఇక్కడ కూడా దానికి చోటు కల్పించడమెందుకు?

    నేనిక్కడ తెలుగు భాషపై నాదైన వాదనేదీ జోడించి ఇంకా కంపు పెంచదలచుకోలేదు. కానీ “పొద్దు” పోతున్న తీరు చూస్తే దిగులేస్తుంది. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయల పట్ల సహనం ముఖ్యమే కాదనను. కానీ పత్రికకి ఓ సొంత వ్యక్తిత్వమంటూ వుండడమూ అంతే ముఖ్యం. అదేమీ ఇక్కడ కనిపించడం లేదు. అది నిలుపుకోలేకపోతే మీకూ బ్లాగుకూ తేడా ఏం లేదు.

    ఉండాల్సిన అవసరం లేదంటారా. మీరీ కామెంట్‌‍ని ప్రచురించాల్సిన అవసరం లేదు.

    ~ మెహెర్

  34. bollojubaba says:

    మాండలీకాలు భాషను పరిపుష్టం చేస్తాయా? లేక ప్రతిబంధకంగా మారతాయా?
    పరిపుస్థం చేసేట్లయితే ఎలా? ప్రతిబంధకంగా మారేట్లయితే ఎలా?

    pl. kindly throw some light on the above questions please.

    bollOJubaba

  35. suresh says:

    blog is fantastic and i like this post very much. Every feeling need promotion.English got here because British took care of it.our policies are written around religion and region and not language or culture because de facto rules.

  36. Meher gaaru

    Well said..No more comments !

    Vamsi

  37. Balasubramanyam says:

    బాల్యం తమిళ నాడు లో జరిగింది భాష పండితులు శ్రీ వెంకటేశ్వరా రావు గారు M A తెలుగు భోదిన్చ్చే వారు wari చలువ వలన Hyderabad వచ్చిన తరువాత తెలుగు కాస్త స్వచ్చంగా పోఅలకడం అలవరుచుకున్నాను కానీ పిల్లలు కేంద్రియ విద్యాలయ లో చదివి తెలుగులో మాట్లాడడం తప్ప ఇంకా ఏమి రాదు
    మీ వరస చూస్తుంటే అందరు తెలుగు పట్ల ఆకర్షితులు కావడం ఎంతో దూరం లేదు
    అనిపిస్తుంది ముఖ్యంగా google mail వారి సహకారం ఎంతో బాగుంది

  38. ravikiran timmireddy says:

    రోహిణీ ప్రసాదు గారు,

    తెలుగు ఏ రూపంలో నిలబడి వుందో, ఏ రూపంలో కొనసాగబోతుందో వీలుంటే వివరించమన్నారు. మీరు ఏ భాషా శాస్త్రవేత్తనో, సామాజిక తత్వవేత్తనో అడిగుంటే, లేకపోతే వాళ్ళెవరైనా పూనుకుని ఈ వివరణ ఇచ్చుంటే బావుండేది. కాకపోతే శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతోపాటూ, సామాన్యులకి కూడా వారి, వారి పరిధిలో, వారికున్న అవగాహనలో, ఈ విషయం మీద కొన్ని అభిప్రాయాలుంటాయి కనుక, ఆ నా అభిప్రాయాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.

    తెలుగు ఏ రూపంలో నిలబడి వుంది? ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకునే ముందు, మనం మరికొన్ని ప్రశ్నలకి కూడా జవాబు చెప్పుకోవాలి. అవి భాషకి సమాజంతో సంబంధంలేకుండా ఒక ప్రత్యేక అస్థిత్వం ఉందా? భాష దేశకాలాతీతవా?

    భాషకి సమాజంతో సంబంధంలేకుండా ఒక ప్రత్యేక అస్థిత్వం ఉందా? దీనికి జవాబుగా మరొక ప్రశ్న వస్తుంది. భాష ఏవిటి? ఏవిటి భాష? ఎక్కడ నుంచి వచ్చింది? సృష్టి ఆది నుంచి వుందా? ఆఫ్రికాలో తిరుగాడిన మొదటి మనుషులకి ముందుతరాల కోతులకి (కోతి పదం తప్పు, కానీ ఏప్ అనే ఆంగ్ల పదానికి తెలుగు తెలియదు క్షమించ గలరు) సంఘ జీవనం ఎలా వీలయ్యింది భాష లేకుండా? ఇంకా వెనక్కి, వెనక్కి పోకుండా ఇక్కడతో మొదలెడదాం. భాష లేని సంఘ జీవనం ఊహించను కూడా లేనటువంటి విషయం. అది మూడు, నాలుగు కోతుల గుంపేకావచ్చు, కానీ ఆ మూడు నాలుగు కోతులు ఒకదానితో ఏదోరకంగా సంభాషించుకోలేకపోతే అవి ఒక సంఘంగా నిలబడలేవు. ఆ సంభాషణ సైగలే అవొచ్చు, శబ్ధాలే అవొచ్చు, మన ఊహకందని మరింకేదో అయ్యుండొచ్చు. పరిణామక్రమంలో ఎంతో పరిణితిచెందిన ఇరవై ఒకటో శతాబ్ధపు మానవుడులాగా, ఆ కోపం, భయం, ఆకలి, సెక్సు, అమ్మకి పిల్లల పట్ల భాద్యత, ఇలాటి అతికొద్ది భావాలకి రూపవిచ్చిన ఆ కొద్ది సైగలు, శబ్ధాలు ఈరోజు అనంతవైన వ్యక్తీకరన సాధనంగా, ఎన్నెన్నో రూపాల్లో, ఎన్నెన్నో భాషలుగా మార్పు చెందటం మనకు తెలుసు. ఆ మొదటి మానవుల నుంచి, కోపం, భయం, ఆకలి, సెక్సు, అమ్మకి పిల్లల పట్ల భాద్యత మొదలైన ఆ ఆది భావాలు ఇంత పరిణామం తర్వాత కూడా ఎట్లాగ మన మానవ సమాజాన్ని, దాని పరిణామాన్ని నిర్వచిస్తున్నాయో, పరస్పర వ్యక్తీకరణ మూలంగా జనించిన ఆ భాష పరిణామక్రమంలో ఈరోజు కూడా ఆ వ్యక్థీకరణ (కమ్యునికేషన) అనే అంశాన్నే ఆధారం చేసుకుని రూపుదిద్దుకుంటుంది. ఇన్ని లక్షల సంవత్సరాలనుంచి ఆ ఆధారంగానే ఇంకా రూపు దిద్దుకుంటూనే వుంది. మానవ పరిణామంతో ముడిపడిన భాషా పరిణామం అన్ని దేశాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోనూ జరుగూతూనే వుంది. ఈ నిరంతర ప్రక్రియలో తెలుగుగా రూపు దిద్దుకున్న ఒకానొక పాయ ఈ రెండువేల (?) సంవత్సరాల కాలంలో ఎన్ని సార్లు తన కుబుసాన్ని విడిచిందో, ఎన్ని మార్పులకి లోనయ్యి ఈ రోజు మన నోటిలో నానుతుందో ఒక సారి ఆలోచించండి. పరిణామవే సహజ లక్షనవైన ఆ మహాద్భుతానికి, సంస్కృతం, తెలుగు తనకు పుట్టిన కూతురు కాకపోయినా, తన తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా, తెలుగు పైన అధికారం చెసినందుకు ప్రతిగా తన పద భండాగారాన్ని తెలుగుకి సమర్పించుకుంది. తెలుగు ఆ దిశలో తనని తాను ఎంతో మార్చుకుంది. తెలుగు సంస్కృతాంద్రవై, ఆ సంస్కృతపదాల్ని అరగదీసుకోని కుబుసం విడిచిన పావులా మరింతగా తళతళలాడింది. మరపొచ్చుకాని, మాన్పరాదని ఒక సావెతుంది కదా, సంస్కృతాన్ని కొల్ల గొట్టిన తెలుగు, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం తదితర భాషల్ని కూడా కొల్లగొట్టటం మొదలుపెట్టింది. అవకాశం దొరక్క కొంతకాలం మన్నుతిన్న పావులాగున్నా, ఈ గ్లోబల్ గ్రామాల సంస్కృతిలో ఆంగ్లాన్ని ఎడాపెడా కొల్లగొట్టి తనలో కలిపేసుకుంటుంది. ప్రస్తుతం అక్కడుంది. రెండు దశాబ్ధాలముందు లేని మలుపులో ఇప్పుడుంది. ఒకప్పుడు తన అస్తిత్వానికే ఎసరు తెచ్చేంతగా సంస్కృతాన్ని తనలో కలిపేసుకున్న తెలుగు ఈ రోజు తిరిగి అదే రకంగా ఆంగ్లాన్ని తనలో కలుపుకుంటుంది. ఈ మార్పు తెలుగు మరణానికి మొదటి మెట్టా?

    ఒక మెట్టు కాదు, చాలా మెట్లెక్కెవెవో అని కొందరి బాధ. తెలుగు మన భాష. మన ఆత్మ, మన బంగారు అమ్మ. మన తోడబుట్టిన, మనతోనే, మనలోనే పుట్టిన మన ప్రాణం. బాధ కలగడం ఎంతో సహజం (మీరు తెలుగు గురించి బాధ పడుతున్నారు, నెను మరీ ఘోరం, నెల్లూరు తెలుగు గురించి బాధ నాకు. కందిపులుసు (సాంబారు) పదం అదృశ్యవపోతుందే అని దిగులు. మొన్న నెల్లూరినించి ఒకరొస్తే, “ఏందయ్యా మందల” అనడిగే, ఆయనకి మందలంటే ఏవిటో తెలీదు, ఎంత టవున్ లో పుట్టి పెరిగితే మాత్రం “మందల” తెలీని నెల్లూరోళ్ళుంటారని నేననుకోలా, దిగిలు). దిగులు దిగులే, కానీ మార్పుకి కారణవైన సామాజిక, చారిత్రక, ఆర్ధిక నేపద్యాల్ని అవగాహన చేసుకోవాల. మార్పు భాషకి ప్రత్యేకవేవీకాదు, భాషకి మాత్రవే ప్రత్యేకం కాదు. ఈ గ్లోబల్ గ్రామాల సంస్కృతి మాత్రవే దానికి కారణం కాదు. పూర్వం ఉన్నట్టు ఏ గ్రామానికాగ్రామం స్వయం సమృద్దిగా వున్న రోజుల్లో తెలుగు పరిణామం ఆగిపోలేదు. ఆ పరిస్తుతులకి అణుగుణంగా తెలుగు మార్పు చెందుతూనే వుంది. రాజ్యాలు, సామ్రాజ్యాలు మొదలైన రోజుల్లో ఆ జీవన పరిస్థితులకి అణుగుణంగా తెలుగు పరిణామ క్రమం మారింది. ఆ దిశలోనే తెలుగులో ఇన్ని రకాల ప్రాంతీయతలు, మాండలికాలు అభివృద్దిలోకొచ్చినాయి. భారతవంతా ఒక దేశవైన ఆంగ్లేయ కాలంలో, రోడ్లు, కమ్యునికేషన్లు మరింతగా విస్తరించిన ఆ కాలంలో, జన సామాన్యంనుంచి వేరుబడిన గ్రాంధీకాన్ని త్రోసిరాజని వ్యవహారికం సెంటర్ స్టేజిమీదకొచ్చిన నిజాన్ని కాదనలేం. వివిధ కాలాల్లో వివిధ రూపాలు తీసుకున్న తెలుగు, ఆ దెశ, కాల పరిస్థితులకణుగుణంగా తన పరిణామక్రమాన్ని నిర్వచించుకుంటూ వచ్చింది. తెలుగుకి, సంస్కృతపు మంచేదో అది చెసింది. సంస్కృతభరితవైన తెలుగు తన భాద్యతని తాను నిర్వహించింది. గ్రాంధీకం తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి ప్రక్కకు తప్పుకుంది. పాత వ్యవహారికం తప్పుకుంటూ, క్రొత్త మాండలీకానికి చోటిస్తుంది. సంస్కృత కావ్యాలు, గ్రంధాలు, సంస్కృతాంద్ర గ్రంధాలకి, కావ్యాలకి తమ చోటునిచ్చి ప్రక్కకు తప్పుకున్నట్టుగానే, ఆ తర్వాత తెలుగు గ్రంధాలు, కావ్యాలు, చంధోబద్దవైన, వ్యాకరణ బద్దవైన తెలుగు సాహిత్యం తెరవెనుకకి తప్పుకుంది. రేపు చందస్సులని బద్దలుగొట్టి, వ్యాకరణాల్ని విరగ్గొట్టిన పంతొమ్మిది, ఇరవై శతాబ్ధపు సాహిత్యం కనుమరుగైపోతుంది. అప్పుడు ఇప్పుడు లాగే అయ్యో, గురజాడలు, శ్రీశ్రీలు, కారా మేస్టార్లు, కొడవటిగంటి, రావీశాస్త్రులు, రంగనాయకమ్మలు, శివారెడ్లు, కేతు విశ్వనాధరెడ్లు, నామిని సుబ్రమణ్యం నాయుళ్ళు, కాదీర్ బాబులు, వైదేహి శశిధర్లు, బల్లోజుబాబాలు లేని తెలుగు అసలు తెలుగేనా అని మన ముందు తరాలు బాధ పడే రోజు వస్తుంది. మార్పు ఒక సహజ గుణం. మానవ పరిణామం ఒక అనంతవైన ప్రక్రియ. జీవరసాయనిక పరిణామంతో ముడిబడిన సామాజిక పరిణామం, దాంట్లో భాగవైన భాషా పరిణామం మనం గోడలుగట్టి ఆపితే ఆగేది కాదు. ఐతే గట్టుమీద కూర్చోని కథలు చెప్పడం తప్ప మనవేవీ చెయ్య లేవా? తెలుగుని మనవే విధంగానూ ఉధ్ధరించలేవా, దాని వ్యాప్తికి ఏవిధంగానూ తోడ్పడలేవా?

    ఇక తెలుగు భాషోద్దరణ కోసం ఆతృత పడిపోయే వాళ్ళకి ప్రత్యేకంగా నా ఉచిత సలహా ఇది. పేరు వ్రాయటం మాత్రం కూడా రాని డెభ్భై శాతం జన్నభా వున్న సమాజంలో, విశ్వవిధ్యాలయపు చదువులు చదివినా తలకెక్కని పురాతన సాహిత్యాన్ని గురించిన దిగుల్ని ఏ నయాగారాలోకో విసిరెయ్యండి. తెలుగు దేశంలో ప్రతి పౌరుడికి చదువు చెప్పగల ప్రభుత్వ పాఠశాలల కోసం మీరు చెయ్యగలిగినది మీరు చెయ్యండి. ఆ దిశలో సమాజాన్ని నిట్ట నిలువుగా విడగొట్టి, క్రింది తరగతుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రయివేటు పాఠశాలల్ని నిర్మూలించడం అవసరం. కానీ ఆ మాత్రపు చదువు ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పడానికి, చదువుపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చును, నాలుగైదంతరాలు పెంచాల్సిన అవసరం వుంది. ఎన్ని కథలు చెప్పినా పేదరిక నిర్మూలన ఒగదిగే పనికాదు. అందువలన పాఠశాలల్లో విద్యార్ధులకి రెండుపూటలా పౌస్ఠికాహారాన్ని అందించాలి. కాలే కడుపుతో చదివి మహామహులైన వాళ్ళు వున్నారు, కానీ అందరికీ అది వీలు కాదు. మెజారిటీ అమ్మా, నాన్నలు మన దేశంలో తమ పిల్లకి చదువుల విషయంలో ఏమాత్రం సహాయం చెయ్యలేరు. ఒకటి పొట్టనింపుకునే పని వత్తిడి, రెండు వాళ్ళలో వున్న నిరక్షరాశ్యత. ఆ దిశలో సాయంత్రాలు అవసరవైన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆ సహాయం లభించేట్టు చూడాలి. ఇవన్నీ అయింతర్వాత, కనీసం పదవతరగతి వరకు తెలుగు, ఆంగ్లం తప్ప మరో భాషని భోదించకుండా చూడాలి. ఆంగ్లం రెండవ భాషగానే వుండాలి. ఇవన్నీ కావాలంటే పెద్ద పోరాటం చెయ్యాలి. ఆ ఓపిక, తీరిక మనకి వుందని నేననుకోను. భాష గురించి భాదైతే వుంది కాని కీబోర్డుని వదిలి పెట్టి పోవాలంటే మనకి కొంచం కష్టవే. అందుకని కనీసం మన బ్లాగుల్లోనన్నా విధ్యా రంగాన్ని ఎలా మార్చాలో చర్చించండి. వీలైతే కనీసం ప్రభుత్వానికి లేఖలు వ్రాయండి. ఈ చర్చంతా ఏవిటి చెత్త అనుకోకుండా చర్చలో పాల్గొనండి. చేతనైనది చెయ్యండి. అంతే కానీ కీబోర్డుంది కదా అని నాలాగా వుబుసుపోక తెలుగు గురించి మహా బాధపడిపోకండి. కానీ అదేందో సావెత చెప్పినట్టు మాటలకి చింతకాయలు రాలవు. అందుకని పురాతన సాహిత్యాన్ని ఎంత సరళీకరించి సరసవైన ధరలకి తెలుగు సామాన్యానికి అందించినా, తెలుగు మీద విశ్వవిద్యాలయాల్లో ఎన్ని పరిశోధనలు చేసినా, తెలుగుకి ఏ ప్రాచీన భాషా స్టేటస్ తెచ్చుకున్నా, వాళ్ళీచ్చే ముష్టి వందకోట్ల రూపాయలు ఏ తెలుగు పీఠంమీద కర్చుచేసినా ఏవీ ఉపయోగం కనిపించదు. తెలుగుమీద ఊర్కే మదనపడిపోవటం కాకుండా, బస్సుల మీద తెలుగుకోసం, ఎవరికీ అర్థంకాని అంకెలకోసం కాకుండా , చనిపోయిన సాహిత్యాన్ని గురించి, సాహిత్యకారుల గురించి దిగులునొదిలేసి, వాస్తవ ప్రపంచంలో, బ్రతికున్న తెలుగు బాలబాలికలకి ఏక్రొద్దిగానైనా ఉపయోగపడే మార్గం కోసం ఆలోచించి చెప్పండి మాలాటి నలుగుర్ని కూడా ఆ మార్గంలో కలుపుకుని పదండి.

  39. రవికిరణ్ గారు,

    మీ పై పోస్టుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను (ముఖ్యంగా చివరి పేరాతో).
    మీరు చెప్పినట్టు దీనికోసం సంఘటితంగా అర్థవంతంగా చర్చించి, చెయ్యవలసినదీ చెయ్యగలిగినదీ మనం చేద్దాం. నేను దీనికి పూర్తిగా సిద్ధం. మీరన్నట్టు కీబోర్డు కదిలిపోవాలంటే కష్టమే అయినా, సాధ్యమైనంత వరకూ కదులుదాం.
    ఏవిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఆలోచించి ఒక పద్ధతి ద్వారా అంగీకారానికి వచ్చి దాన్ని ఆచరణలో పెడదాం. ఏమంటారు? నా వెటకారపు రాతలతో మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి (ఇది రెటోరిక్కుకో వెక్కిరింపుకో అంటున్నది కాదు, మనస్పూర్తిగా అంటున్నది!).

    సంపాదకులకు,
    రవికిరణ్ గారు చెప్పిన దానికి ఇక్కడ మిగతావాళ్ళు కూడా సిద్ధమే అయితే, పొద్దులోనే దీనికొక వేదిక ఏర్పరిచే ఆలోచన చేస్తే బాగుంటుందేమో.

  40. చర్చ వాదోపవాదాలను దాటి నిర్మాణాత్మకమైన దిశలో పయనిస్తోంది- కనుక నావి కొన్ని సలహాలు:

    ౧. తెలుగుకు ఒక మంచి ప్రైమర్ (వాచకం) తయారు కావాలి. రంగనాయకమ్మగారు ఇప్పటికే ఒక మంచి వాచకాన్ని వ్రాశారు. ఒక సంఘంగా పూనుకొని ప్రయత్నిస్తే ఆమె మరిన్ని వాచకాలు వ్రాయవచ్చు. ఈ వాచకాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వాచకాలుగా ఆమోదించేలా కృషి చేయాలి . “తెలుగు నేర్పడం ఎలా” అని ఆమె ఒక పుస్తకం వ్రాశారు. తెలుగు ఎలా నేర్పాలో, ఎలా నేర్పకూడదో చాలా వివరంగా చర్చించారు. తెలుగును ఉధ్ధరించాలనుకొనే వారందరూ తప్పక ఈ పుస్తకాన్ని చదవండి ( గమనిక: నేను రంగనాయకమ్మ గారి పుస్తకాల ఏజంటును కాను).

    ౨. తెలుగు భాషకు ఒక మంచి వ్యాకరణాన్ని తయారు చేయాలి. చిన్నయసూరి వ్యాకరణానికి భాష్యంలా కాక, నేటి పరిస్థితులకనుగుణంగా ఆ వ్యాకరణం ఉండాలి. తెలుగునాట సంస్కృత ప్రాభవం ఉన్న రోజుల్లో తెలుగు వ్యాకరణాలు సంస్కృత వ్యాకరణాలను నమూనాగా తీసుకొని వ్రాశారు. నేటి పిల్లలకు తెలుగే రాదు. సంస్కృతమెలా చదువుతారు? ఇప్పుడు వాళ్ళు చదివేది ఆగ్ల వ్యాకరణం. కనుక ఈ కొత్త తెలుగు వ్యాకరణం ఆంగ్ల వ్యాకరణం నమూనాలో ఉండాలి. అప్పుడే నేటి తరానికి, రేపటి తరాలకు సులభంగా అర్థమౌతుంది.

    ౩.తెలుగులో శాస్త్ర భాషా నిఘంటువులు తయారు కావాలి. పదాలపై విస్తృ తంగా చర్చ జరగాలి. పదాలను ప్రామాణీకరించాలి. దీనికోసం సంస్కృత పదాల అవసరం తప్పదు. శాస్త్ర పదాలను ఉత్పత్తి చేసే శక్తి ఉన్న భారతీయ భాష ప్రస్తుతం అదొక్కటే. యూరోపియన్ భాషలకు లాటిన్, గ్రీక్ లాగా భారతీయ భాషలమధ్య శాస్త్రీయ చర్చలకు వారధిగా నిలిచే శక్తి ఉన్న భాషకూడా అదే.

    ౪. పుస్తకం.నెట్, పద్యం.నెట్ లాగా భాషా చర్చ కోసం ఒక పోర్టల్ కావాలి. అందులో నిఘంటువు, వ్యాకరణం, పారిభాషిక, శాస్త్రీయ పద నిర్మాణం వంటి ఉప విభాలు ఉండాలి. వాటిల్లో వ్యాసాలు ,చర్చలు రావాలి (పోర్టల్ ఉంటే అవే వస్తాయి).

    ౫. తెలుగు భాష పాఠ్య ప్రణాళిక, ప్రామాణిక భాష ఎలా ఉండాలో చర్చ జరగాలి. మన అధికార భాషా సంఘం కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ తెలుగు భాషకు చేసే మేలు ఏదీ లేదు, కీడే తప్ప. కనుక పబ్లిక్ డొమైన్ లో వీటిపై చర్చ జరగాలి. భాషా శాస్త్ర వేత్తలను ఈ చర్చల్లోకి బలవంతంగానైనా లాగాలి. ఆ ముసాయిదాలకు జన బాహుళ్యంలో ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడు ప్రభుత్వమే గుర్తిస్తుంది.

    ౬. ఏదో ఒకటి ఇప్పుడే మొదలు పెట్టాలి. Armchair thinkers లాగా ఊరికే మాట్లాడుతూ కూర్చుంటే ఏమీ ఉపయోగం ఉండదు.

    పై సలహాలు విజ్ఞులందరూ పరిశీలించండి. నావంతు చేయడానికి నేను సిధ్ధమే!

  41. chidipothu ashok says:

    రవి కిరణ్ గారు,

    మీ మందల( 🙂 ) బాగుంది,
    ముఖ్యం నా ఆలొచనా పరిదిని విస్తరించింది, అదే చేతొ తెలుగు పట్ల నా బాధ ను కూడా తగ్గించింది.
    నేను సైతం ఆ నలుగురి లొ ఒకడిగా ఉంటాను.

    ధన్యవాదాలతొ(రవి గారికే కాదు చర్చ లో పాల్గొన్న అందరికి),
    చిడిపొతు అశొక్.

  42. రవి says:

    చంద్రమోహన్ పాయింట్లకు తోడు నావి కొన్ని.

    1. కొన్ని విషయాలకు రాజకీయం సపొర్టు తప్పనిసరి. అయితే, వాళ్లకు తీవ్రమైన విషయాలే పట్టవు. ఇంక ఇలాంటివి ఎందుకు నెత్తికెక్కుతాయి? ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకున్న, సమాన్యుల గోడు వినే ఏకైక పార్టీ లోక్ సత్తాయే. వారికి “తెలుగు” భాషాభిమానుల గోడు, చెప్పగలిగిన రీతిలో చెప్పగలిగితే, ఏమైనా సపోర్టు దొరకవచ్చు.

    2. పైన జరిగిన చర్చలో ఓ విషయం గమనించాను. “తెలుగు” అన్న వెంటనే, తిక్కన, పోతన, శ్రీనాథుడు అంటున్నారు, లేదా, సహజ భాష అంటున్నారు. నిజానికి తెలుగు అభివృద్ధి చెందాలంటే, సైన్స్, గణితం వంటి సబ్జెక్ట్ లు తెలుగులో నేర్పించాలి, లేదా అలాంటి వాటిని తెలుగులో నేర్పించటానికి తగినంత ప్రాచుర్యం లభించాలి. మన తరంలో “మహీధర నళినీ మోహన్” గారి కృషి మనకు తెలిసిందే. అలాంటి సాహిత్యం, కనీసం బ్లాగులు ప్రోత్సహింపబడాలి. “లోలకం” అన్న బ్లాగు ఎంతమంది చూస్తున్నారో తెలియదు. చూడకపోతే దయచేసి ఒక్కసారి చూడండి. అలాంటివి మరిన్ని రావాలి.

  43. ఇక్కడి చర్చలో పాలుపంచుకుని ప్రయోజనకరమైన సూచనలను, అభిప్రాయాలను అందించిన వ్యాఖ్యాతలందరికీ నెనరులు. రవికిరణ్ గారు, భైరవభట్ల కామేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ చర్చను ఒక అర్థవంతమైన పరిష్కారాన్ని సూచించే దిశగా తీసుకెళ్ళేందుకు చర్యలు చేపడుతున్నాము. దీనికి సంబంధించి పొద్దు ఇప్పటికే కృషి చేస్తోంది. మా ఈ ప్రయత్నాలను మీ ముందుకు తెచ్చేందుకు మరి కొంత సమయం పడుతుంది. తెలుగు భాషాభిమానులతో కలిసి పనిచేసే అవకాశం కొరకు ఎదురుచూస్తున్నాం.

  44. Rohiniprasad says:

    ద్వానా శాస్త్రిగారిని సంప్రదిస్తే ప్రయోజనం ఉండవచ్చు.

  45. ravikiran timmireddy says:

    చర్చ ఆగిపోయింది. మిగతా ఖండాల్ని వదిలేసినా, ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఇంత మంది తెలుగువాళ్ళున్నారు. వాళ్ళలో కనీసం ఒక వెయ్యి మందన్నా పొద్దు పాఠకులుంటారు కనీసం, వాళ్ళలో ఒక నలుగురైదుగురు మేవంటూ ముందుకొచ్చారు, సంతోషం.

    ఆ నలుగురైదుగురు ఒక వందమందిని పోగుచెయ్యగలిగితే! తెలుగు సాహిత్య శరభాల్ని, తెలుగులో మహాహోపాద్యాయుల్ని వదిలెయ్యండి. అంత ఎత్తుకి ఎదిగిన వాళ్ళు పేరూ ఊరూ లేనీ చిన్న చిన్న పనులు ఏవీ చెయ్యరు. వాళ్లకి చేసే పనికన్నా, వచ్చే, తెచ్చే పేరు ముఖ్యం. అందులోనూ ఆ ఎత్తులో వున్న వారు, ఆ వయసుకి కూదా ఎదిగుంటారు. ఆ వయసులో వాళ్ళు మాటలు తప్ప చేతలు పెద్దగా ఏం చెయ్యలేరు. అందువలన వాళ్లనొదిలేసి, వాళ్ళతోబాటూ, అంత ఎత్తులో ఉన్న ఆ ప్లాన్లనొదిలేసి, మనకు తగ్గ, మనకు చేతనైనది ఏవిటో ఆలోచించండి.

    ఇక్కడ నాదొక చిన్న సలహా. ఇక్కడ పెద్ద, పెద్ద ప్లాన్లేవీ లేవు. ఎడతెగని చర్చలేవీ అవసరం లేదు. తెలుగు దేశాన్నంతా ఉద్దరించే ఆలోచనలేవీ కాదు. మన పరిధుల్లో మనం చెయ్యగలిగిన మంచేదో ఆలోచించండి. ఆ దిశలో నాకొచ్చిన ఆలోచన నేచెప్తాను విని మీ అభిప్రాయం చెప్పండి.

    మనం కనీసం ఒక వందమందిని కూడగట్టగలిగితే. ఆ వందమంది నెలకు కనీసం ఒక 30 డాలర్లు ఇవ్వగలిగితే, మనం నెలకి 3000 డాలర్లు సేకరించగలం. ఇదేవీ పెద్ద మొత్తంకాదు, వ్యక్తిగతంగా (30 డాలర్లు), గుంపుగా 3000 డాలర్లు. ఐతే ఏదో పెద్ద ఎత్తున చేద్దావని, నెలలు సంవత్సరాలు ఏవి చేద్దావని చర్చలు, ఆలోచనలతో గడిపేకంటే, మనం చెయ్యగలిగింది, మన పరిధిలో వున్నది అది చిన్నదైనా చెయ్యటం మొదలుపెట్టటం మంచిదేవోనని నా అభిప్రాయం.

    ఏ పెద్ద పేర్ల కోసం పాకులాడేదానికన్నా, ఆ సేకరించిన 3000 డాలర్లని, పొద్దు సంపాదకులు, తెలుగుదేశంలో “తెవికీ” లాంటి గ్రూపుల్లోనూ, బల్లోజుబాబా, పప్పు అరున, సౌమ్య వాళ్లలాటి వాళ్ళకి, ముదిమి తలకెక్కని కుర్రాళ్ళకి ఆ డబ్బుని భాద్యతని అప్పగిస్తే ఏవైనా చెయ్యగలరేవో. ఆ వయసులో చెయ్యగలిగే సాహసం, చెయ్యాలనే కోరికా, చెసేదేదైనా నిజాయితీగా చెసే ఆవేశం ఆ వయసులోవాళ్ళకే వుంటుందేవో, నడివయసు సాహిత్య శార్ధుభాలకన్నా.

    ఆ మూడువేల దాలర్లతో మనవే అద్భుతాలు చెయ్యలేం. ఒక రెండు మూడు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రపు తరగతుల్ని ప్రారంభించవచ్చు. ఆ తరగతులకొచ్చే ఆర్ధికంగా వెనుకబడిన ప్రాధమిక తరగతుల విధ్యార్ధులకి విధ్యా పరంగానూ, తెలుగు భాషా భోధన పరంగానూ వారికి ఎంతో కొంత ఉపయోగ పడవచ్చు, అదే డబ్బుతో సాయంత్రం ఎంతో కొంత వాళ్ళ కడుపులు నింపే పనికూడా చెయ్య వచ్చు.

    డబ్బులు మనం సేకరించగలిగితే, ఆ మంచిచెయ్యడానికి తెలుగుమీద అభిమానవున్న కుర్రాళ్ళు (యువతులు కూడా) ముందుకొస్తారనే నమ్మకం నాకుంది. అందువలన మరింత కాలయాపన లేకుండా ఆ వందమందిని మనం కూడగట్టగలావా?

    ఏవో ఎవరు చూశారు, ఈ చిన్న అడుగే రేపొక పెద్ద మార్పుకి మొదటి అడుగు కాఒచ్చు. అదృష్టం బాగుండి, తలకాయలో బుర్ర కాయ ఉన్న నాయకులు రాజకీయనాయకులు కావొచ్చు, వాళ్ళు అదికారంలోకి రాఒచ్చు, మసిబట్టిన ఈ విధ్యావిధానాన్నే మార్చొచ్చు. లేకపోతే ఆ అద్భుతాలేవీ జరగకపోవచ్చు, కానీ, ఆ రెండు, మూడు పాఠశాలల్లో, కొంత మంది పిల్లల మొహాలపై తెలుగు చిరునవ్వులు పూయించ్చొచ్చేవో ఆలోచించండి.

  46. కొడవళ్ళ హనుమంతరావు says:

    రవికిరణ్ గారికి,

    ముప్ఫై డాలర్లు – అదీ ప్రతి నెలా, అందులోనూ భక్తికీ ముక్తికీ సంబంధించని పనికి – ఇచ్చేవాళ్ళు వందమంది ఉన్నారంటారా? నేను నడివయసు వాణ్ణి కనుక నాకు సాహసం తక్కువ, సందేహాలెక్కువ. 🙂 వందమంది ఉంటే, సంవత్సరానికి 36000 డాలర్లు పోగవుతాయి. అది కాస్త పెద్ద మొత్తమే. దానితో ప్రాధమిక విద్యని బాగుపరచలేము కాని, నాలుగయిదు చిన్న చిన్న పనులు చేయించవచ్చు.

    మన విద్యావిధానం లోపభూయిష్టమైనదే. కాని అదైనా అందరికీ అందుబాటులోకొస్తే, వాళ్ళు ఆలోపాల్ని అధిగమించడం అంత కష్టం కాదు. అందుబాటులోకి తీసుకురావడానికి రెండు మూడు బడులకి ఈ విరాళాలిస్తే సమస్య తీరదని మీకు తెలుసు. ప్రభుత్వం విస్తృతస్థాయిలో విద్యాపరంగా ఖర్చుపెట్టడమే మార్గం. మరి ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టదు అంటే, దీని గురించి ఆందోళన చేసేవాళ్ళు తక్కువ కనుక [1]. ఉద్యమాల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కూడా దీని గురించి పట్టించుకున్న ఉద్యమకారులు ఎక్కువ ఉన్నట్లు కనబడరు.

    (జనవరిలో మాఊరు వెళ్ళినప్పుడు, పక్క ఊళ్ళో వీటి గురించి కాస్త ఆలోచించే ఓ టీచరుతో చనువు కలిగి, “టీచర్ల భత్యాలు, బదిలీలకి సంబంధించిన పోరాటాల గురించి వింటానే కాని వాళ్ళు చదువు, బడుల స్థితిగతుల గురించి సమిష్టిగా ఎందుకు ఆందోళన చెయ్యరు?” అని అడిగాను. ఆ ప్రాతిపదిక మీద టీచర్స్ అసోసియేషన్ ఎలక్షన్లలో నిలబడ్డ టీచర్లకి డిపాజిట్లు దక్కలేదన్నాడతను!)

    మీరు యువ సాహితీకారులని ప్రస్తావించారు. రోహిణీప్రసాద్ గారి వ్యాసానికి స్పందించిన చాలా మంది తమకి గ్రంథాలయాలు ఎంత మేలు చేశాయో చెప్పారు. మనకి ఒకప్పుడు గ్రంథాలయోద్యమం అని ఒకటుండేది. దాని అవసరం మనకింకా తీరలేదు. మా ఊళ్ళో ఇప్పటికీ గ్రంథాలయం లేదు! నాలుగయిదేళ్ళ క్రితం, అష్టకష్టాలు పడి, పలుకుబడి ఉన్న నాయకులని పట్టుకొని, ప్రకాశం జిల్లా కలెక్టరుతో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిస్తే, “ఒంగోలు లోని జిల్లా గ్రంథాలయనికే నిధుల్లేక చస్తుంటే, మీ గ్రామానికి కొత్తగా ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వమంటారు?” అన్నారు. జన్మభూమి పథకం క్రింద బిల్డింగుకి మాత్రం కొంత మంజూరు చేస్తానని మాట ఇచ్చారు. నేను సొంతంగా నిధులు సమకూర్చుకునేటప్పటికి, అక్కడ ప్రభుత్వం మారింది, కలెక్టర్లు మారారు, మాట నిలవలేదు! ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, గ్రంథాలయాల వల్ల కాస్తో కూస్తో లాభం పొందిన వాళ్ళు వాటి సదుపాయం పల్లెటూరి వాళ్ళకి కూడా కలగడానికి ఏమైనా కృషిచెయ్యమని.

    చర్చ భాష గురించి మొదలయింది కనుక, మరో విషయం. మన భాషకి సరయిన నిఘంటువు లేదు. దాని నిర్మాణానికి కృషి చేసేవాళ్ళుంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ఏమన్నా డబ్బివ్వండి.

    ఇంతకీ పాతికమందిని పోగుచేసే సామర్థ్యం, సమయం నాకు లేవు. కాని పల్లెటూరి జనాల విద్యా వికాసాల గురించి కొంత ఆసక్తి ఉంది. మీరేదో ఒక మంచి పని తలపెట్టారు కనుక, నేను వొట్టి మాటలు కట్టిపెట్టి ప్రస్తుతానికి ఓ వెయ్యి డాలర్ల విరాళం ఇస్తాను. వీలుచూసుకొని నాకో మెయిల్ పంపండి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Basic Education as a Political Issue,” in “India: Development and Freedom,” by Jean Drèze and Amartya Sen. Oxford University Press, 2002. Page 187.

  47. పెద్దలందరూ కలిసి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే నేను తప్పక నా వంతు సాయం చేస్తాను. వ్యక్తిగతంగా, వృత్తిధర్మంలో భాగంగా.

  48. ravikiran timmireddy says:

    కొడవళ్ళ హనుమంతరావు గారు,

    ముందర విరాళవిస్తానని అన్నందుకు ధన్యవాదాలు. కానీ హనుమంతరావు గారు. ఇది పదిమంది పదిచేతులేస్తే అయ్యే కార్యం. ఒకరిద్దరు, నాలుగు చేతులేస్తే, మొదలవుతుందేవో కానీ, మొదలైన మర్రోజే ఆగి కూదా పోతుందేవోనని నా అభిప్రాయం. అందులోనూ ఇది తెలుగుదేశంలో జరగాల్సిన కార్యం. అక్కడి పనికి ఇక్కడ పగ్గాలు పట్టుకుని కూర్చోటం కుదిరేపని కాదుకదా.

    రోహిణీప్రసాదు గారి వ్యాసం నుంచి భైరవభట్ల గారి అభిప్రాయందాకా చాలా మందే తమ అభిప్రాయాల్ని వ్రాశారు. ఆవేశంగానూ, బాధతోనూ, తెలుగు తల్లి మీద ప్రేమతోనూ. వారిలో కొందరు తెలుగు గడ్డ నివాసస్తులుకాగా, మిగిలిన వారు అమెరికా కాందీశీకులు, కనీసం మానసికంగా. వీరు కాక, తెలుగు బ్లాగుల్లోనూ, చర్చావేదికల్లోనూ తెలుగు కోసం కన్నీరు కార్చే తెలుగు ప్రేమికులు చాలామందే వున్నారు, ఈ దేశంలో, భారద్దేశంలో కూడా. ఒకరిద్దరి ఉత్సాహం, ఒకరిద్దరి విరాళాలు బహుజనమంచికి కారణం కాలేవు. ఇక్కడ వున్న తెలుగువాళ్ళు, ఈ బ్లాగ్సులో కన్నీరు కార్చే తెలుగు వాళ్ళు కనీసం మెజారిటీ ఖచ్చితంగా నెలకి 30 డాలర్లని నొప్పిలేకుండా ఇవ్వగలరు. కన్నీళ్ళతోబాటు, కాసిన్ని డాలర్లని కూడా రాల్చనీండి. ఆ డాలర్లతో ఏంచెయ్యాలో అని నేనిచ్చింది సలహానే, అలాకాదు ఇలా చేద్దాం అని వాళ్ళని ముందుకి రానియ్యండి. అలాగే తెలుగు దేశం తెలుగు వారిని, ఇదిగో ఈ భాద్యత మేవుతీసుకుంటాం అని ముందుకు రానియ్యండి. నలుగిరి పట్టు మీరు విరాళవియ్యడానికి ముందుకొచ్చారు, కానీ ఇది సరిగా, సజావుగా, కొంతకాలం నడవాలంటే, పదిచేతులు ఖచ్చితంగా కావాలి.

    కన్నీరెంత కారితేనేవి,
    ప్రేమెంత పారితేనేవి,
    రూపాయి లేని రోషం
    ఎంత ఎర్రగా మారితేనేవి,
    చింత కాయలు రాలాలంటే
    పలుకు రాళ్ళు విసరాలి కదా.

  49. Rohiniprasad says:

    పబ్లిక్ కార్యక్రమాల సంగతి అలా ఉంచి, ఎక్కడుంటున్నా సరే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడేలా అలవాటు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముందు తరాల్లో తెలుగు నిలబడాలంటే ఇది తప్పనిసరిగా జరగాలి.

  50. Srinivas Vuruputuri says:

    నేను హైదరాబాదులో ఉంటాను. చొరవ తీసుకుని పదిమందిని కూడగట్టి ఓ మంచి కార్యక్రమం నిర్వహించగల శక్తి లేదు గానీ, ఓ మంచి పనికి సమయమూ, డబ్బూ ఇవ్వాలనే ఉత్సాహం ఉంది. Any takers?

  51. nasir says:

    మాతృ భాష మీద పట్టు వున్నవాడు, యే ఇతర భాష నైన చాల సులువుగ నేర్చు కొంటాడని యెక్కడొ విన్నాను, అలాగె ఇప్పుడు మన భాష తెలుగు మరచి ఫొతున్నారు లెదా ఇందులొ యే విధమైన ఉద్యొగాలకి సరి అయిన అవకాశం లేదు, అని అనె వాళ్ళు తమ మాతృ భాష లొని గొప్ప తనాని గుర్తించితె, యే భాష నైన పట్టు పట్టి నేర్చుకొవచ్చు అందులో అవకాశాలను ఇంగ్లీషు భాషలొ చదివిన వాళ్ళతొ సమానంగా పొందవచ్చు, యేమంటారు….

  52. నేనూ నావంతు “వెయ్యి”డానికి రెడీ! ఎలా ప్రొసీడవుదామో చెప్పండి.

  53. Marthanda says:

    >>>>>
    మాతృ భాష మీద పట్టు వున్నవాడు, యే ఇతర భాష నైన చాల సులువుగ నేర్చు కొంటాడని యెక్కడొ విన్నాను,
    >>>>

    అలాగనుకోను. కాన్సెంట్రేషన్ పెట్టి నేర్చుకుంటే ఏ బాషైనా సులభంగా వస్తుంది. తెలుగు దంపతులు పంజాబ్ లో స్థిరపడి ఇంటిలో పంజాబీ బాష మాత్రమే మాట్లాడితే అది విన్న చంటి పిల్లలు పంజాబీ బాషే నేర్చుకుంటారు. వాళ్ళ మాతృ బాష తెలుగు అన్న విషయం వాళ్ళకి తెలియదు.

  54. కొడవళ్ళ హనుమంతరావు says:

    ప్రతి సమస్యకీ కారణం ప్రపంచీకరణే అని మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయింది. భారతీయ గోసంతతి సంకరమయినందుకే విచారపడాలా? ఎందుకు సంకరమయిందో నాకు తెలియదు – పాలెక్కువిస్తాయని చేశారా? అయితే సంతోషపడాల్సిన విషయమే. హైబ్రిడ్ విత్తనాలతో పంట దిగుబడి పెరిగితే రైతు గర్వపడడా? ప్రకృతి ప్రసాదించే నీరు వికృత మార్కెట్ సరుకయిందని ప్రాస కలిపి విచారపడే కన్నా, మార్కెట్లని ‘దైవ సమానంగా’ చూసే అమెరికాలో అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో మంచి నీళ్ళు ఉచితంగా ఎలా దొరుకుతాయో ఆలోచించారా?

    ప్రపంచీకరణ ఇవాళ్టి విపరీతం కాదు. అనేక వందల సంవత్సరాలగా జరుతున్నదే. దానివలన ఎంతో మంచి జరిగింది, జరుగుతోంది. కలిగే చెడుని నివారించడం, ప్రభుత్వాలు తలచుకుంటే అసాధ్యమేమీ కాదు. మంచీ చెడులని విశ్లేషించకుండా మన సంస్కృతిని కాలరాస్తుందని చేసే రచనలు, చదివే వాళ్ళలో ఉద్రేకాన్ని పెంచవచ్చు కాని వివేచనని మాత్రం కాదు.

    చరిత్రలో ప్రపంచీకరణ ప్రభావం గురించి రాసిన నోబెల్ గ్రహీత ఒకాయన ఉన్నాడు. ఆయన రాతలని [1] మన పత్రికల వాళ్ళు చదివి చర్చిస్తే బావుంటుంది. ఆయన మన దేశస్తుడే కావడాన కాస్త గౌరవించినట్టూ ఉంటుంది, మనకి పనికొచ్చేదేదైనా దొరికే అవకాశామూ ఉంటుంది!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “How to Judge Globalism,” by Amartya Sen. The American Prospect, January 1, 2002. http://www.prospect.org/cs/articles?article=how_to_judge_globalism

  55. హనుమంతరావుగారు,

    మారుతున్న సంస్కృతిలో భాగంగానే తెలుగుభాష కూడా మార్పు చెందుతోంది అన్నది అందరూ అంగీకరించే విషయమే అనుకుంటాను. ప్రపంచీకరణ మన సంస్కృతి మీద ఎంత ప్రభావం చూపిస్తోంది అన్నది ప్రశ్న. అది అనివార్యమా కాదా అన్నది ప్రశ్న. ప్రపంచీకరణ వల్ల వెయ్యి లాభాలు కనిపిస్తూ ఉండవచ్చు. ప్రపంచీకరణని వ్యతిరేకించే వాళ్ళందరూ దాన్ని మొత్తంగా ఆపెయ్యాలని కోరుకోవడం లేదు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. దాని ప్రభావాన్ని మనం ఎంతవరకూ మనకి అనుకూలంగా మలుచుకోగలం అన్నది ఆలోచించాలి. దీని వల్ల జరుగుతున్న సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులని విశ్లేషించి అలాంటి మార్పులని మనం ఆమోదిస్తామా లేదా అని ఆలోచించాలి కదా. ఇలాంటి ఆలోచన మన ప్రభుత్వం చేస్తోందా అన్నది ప్రశ్న.
    ప్రపంచీకరణని వ్యతిరేకించేవాళ్ళు అందరూ అమెరికా దేశాన్ని ద్వేషించేవాళ్ళు కాదు. అమెరికాలో పబ్లిక్ ప్రదేశాల్లో నీళ్ళు ఉచితంగా దొరుకుతూ ఉండవచ్చు. దాన్ని ఇక్కడ ఎలా అమరుపరచాలో ఆలోచించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా? నీళ్ళని అమ్ముకోడానికి అనుమతిని ఇచ్చిందీ ప్రభుత్వమే. మరి అలా ఇచ్చేటప్పుడు, ఉచిత సరఫరా గురించి ఎందుకు ఆలోచించలేదు? ప్రపంచీకరణని వ్యతిరేకించేవాళ్ళు వేసే ప్రశ్న ఇది.
    ఇక, ప్రపంచీకరణ ఇవాల్టి విపరీతం కాదు. నిజమే. అది వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉండవచ్చు. అయితే? ఇప్పుడు ప్రస్తుత రూపంలో ఉన్న ప్రపంచీకరణ కలిగిస్తున్న చెడు గురించి ఆలోచించకుండా చరిత్ర తిరగేస్తే ఏమిటి లాభం?
    ఆంధ్రజ్యోతి వ్యాసం వెనకనున్న కారణం ఇటీవలే సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అనుకుంటాను. కర్ణాటక ప్రభుత్వం ఆరవతరగతి దాకా కన్నడ మీడియంని తప్పనిసరి చెయ్యడానికి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజలకి మీడియంని ఎంచుకొనే స్వేచ్ఛ ఉండాలని అన్నది. అలా అని ఊరుకున్నా కొంత నయమే. అక్కడితో ఊరుకోక, ఈ కాలంలో ఇంగ్లీషు మీడియం తాలూకు అవసరాన్ని నొక్కి వక్కాణించింది. నేను పత్రికలలో చదివినంత వరకూ ఆ వ్యాఖ్యలు నాకు శాస్త్రీయంగా కనిపించలేదు.

  56. ravikiran timmireddy says:

    ఆంద్రజ్యోతి సంపాదకీయం మీద హనుమంతరావు గారు చేసిన విమర్శ, దానికి ఆలంబనగా వారు పేర్కొన్న అమర్త్యా సేను గారి వ్యాసాన్ని, ఆంధ్రజ్యోతి సంపాదకియాన్ని చదివేను. పేరెనక వ్రాసుకోవడానికి అత్తెసరు మార్కులతో తెచ్చుకున్న డిగ్రీ తప్ప మరేవీ లేకపోయినా, నలభైఆరు సంవత్సరాల జీవితానుభవం వుందికదా. ఆ అనుభవం అమత్యా సేను గారి వ్యాసం మీద చాలా ప్రశ్నలని నా మనసులోకి తెచ్చింది. ఆ వ్యాసంలో చాలా inconsistencies వున్నట్టు నాకనిపించింది. ఈ అభిప్రాయంలో నే లేవనెత్తిన అభ్యంతరాలు ఏదో ఒక వాదం కోసం కాక, పాఠకులు ఎవరైనా ఆ వ్యాసాన్ని అర్థం చేసుకోడంలో నా లోపాల్ని సరిఅయిన తర్కంతో సరిచెయ్యగలరేవోనని నాఈ ప్రయత్నం. ఆ దిశలో వ్రాస్తున్న ఈ అభిప్రాయంలో అమర్త్యా సేను గారి వ్యాసాన్ని ఆంగ్లంలో ఉదాహరించక తప్పదం లేదు. నా వివరణ మాత్రం తెలుగులోనే వ్రాస్తాను. ఇది కొంచెం చిరాకు కలిగించే విషయవైనా తప్పడంలేదు.

    అమర్త్యా సేను గారి వ్యాసంలో మొదటి భాగం దాదాపు ఒకటిన్నర పేజీలు ప్రపంచీకరణ ఈ రోజు కొత్తగా వచ్చినది కాదని, పురాతన కాలంనించి ఉన్న విషయవేనని చారిత్రిక అధారలతో ఋజువు చెయ్యటం జరిగింది. ఆ కాలంలో తూర్పు నించి వలస వచ్చిన సైన్సు, లెక్కలు, టెక్నాలజీ మొదలైనటువంటి ఫిలొసాఫికల్ విషయాలు పడమటి సమాజాల్లో తెచ్చిన మార్పు, ఆ సమాజాల అభివృద్దిలో వాటి పాత్రను వివరించడం జరిగింది. భారద్దేశం నుంచి వచ్చిన గణితం, చైనా నుంచి వలస వచ్చిన తుపాకి మందు, అచ్చు యంత్రం, ఇంకా కొన్ని అలాటి వలసలు పడమటి రాజ్యాల విస్తరణకు, అభివృద్దికి ఎలా సహాయపడ్దాయో చెప్పడం జరిగింది. భారద్దేశపు గణితం, చైనా దేశపు పేపరు, అచ్చు యంత్రం, తుపాకి మందు లేకుండా పదమటి దేశాల పారిశ్రామిక విప్లవం వచ్చుండదు అని చెప్పకపోయినా బహుశా చాలా ఆలస్యవయ్యుండేదేవో. ఆ విప్లవం నుంచి మొదటి సారి ఒక బలవైన శక్తులుగా ఉద్భవించిన మార్కెట్లు తర్వాతి కాలంలో మూడొంతుల ప్రపంచాన్ని బానిసత్వంలోకి నెట్టిన విషయం గుర్తుతెచ్చుకోండి.

    ఆ పారిశ్రామిక విప్లవానికి మునుపు ఒక వైయబుల్ మార్కెట్లనేవి లేవు. మీకు పండిన పంటలో మీకు పోగా మిగిలినది మీరు అమ్ముకోవడం జరిగిండొచ్చు. మీరు ఉత్పత్తి చేసిన దాంట్లో మీకు కావలసినది పోగా, మీకు కావాల్సిన వాటికోసం ఇచ్చిపుచ్చుకోటాలు పోగా, మిగిలిన సరుకు మీ చుట్టు ప్రక్కల అమ్ముకోవడం, లేకపోతే వున్న కొందరు సముద్ర వర్తకులకి అమ్ముకోవడం జరిగేది. ఈ రకవైన స్థాయిలో వుండే మార్కెట్లు పడమటి సమాజాన్ని కాదుకదా, ఏ సమాజాన్ని శాశించ గలిగిన, ఏ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన, ఏ సంస్కృతిని ప్రబలంగా ప్రభావితం చెయ్యగలిగిన పరిస్తితుల్లో లేవు.

    అమర్త్యా సేను గారు ఉదాహరించిన పురాతన కాలపు ప్రపంచీకరణ is nothing but a borrowing of few philosophical concepts in religion, science and technology. They never had any power to change western society’s culture, language, life style. They had taken their own little sweet time to castigate any eastern quality they had and became local before evolving into base for technological, and industrial revolution which created the markets that were powerful and pervasive. Powerful enough to lead an onslaught into life and life styles, culture and languages of people of the world. There were no viable markets, even weak markets 1000 years before, forget about a global conglomerates. కాబట్టే అమర్త్యా సేను గారి ఉదాహరణల్లో చైనా దేశపు దుస్తులు, భారద్దేశపు పంచలు చీరలు కట్టుకున్న ఏ పడమటి సమాజాలు కనిపించవు. ఎవరో ఒకరిద్దరు, అవసరం కోసవో, కుతూహలం వలనో భారత, చీనీ భాషల్ని నేర్చుకున్న వారు తప్ప, ఆ భాషలు మాట్లాడే పడమటి సమాజాలు కనిపించవు. మిగిలిన పడమటి దేశాల్ని వదిలెయ్యండి, పురాతన కాలం నుంచి మనతో వ్యాపార సంభాదాలున్న గ్రీసు దేశంలో ఒక చిన్న గ్రామం, ఒక చిన్న గ్రామంలో భాగం కూడా మీకు పంచలు, చీరలు కట్టుకుని తెలుగు మాట్లాడే వారు కనిపించరు. కానీ తూర్పులో కూడా ఆ విషయం నిజం అని చెప్పగలరా? అందుకని ప్రాచీన ప్రపంచీకరణ, తూర్పు నుంచి పడమటకు జరిగిన ప్రపంచీకరణ, ప్రపంచీకరణ కాదేవో నని నా అనుమానం. ఏవో ఒకటి రెండు ఆలోచనల ఇచ్చి పుచ్చుకోవడవేనని నా నమ్మకం. ఆది మానవుడు పులిని చూసో మరింకోదాన్ని చూసో తన వేట మెళుకువల్ని పదును పెట్టుకునుండొచ్చు. పులి చంపిన లేడిని పులికి తెలియకుండా తస్కరించే నక్కని చూసి దొంగతనం అర్థం చేసుకుని, నేర్చుకుని వుండొచ్చు అంతమాత్రాన అది జంతువులనుంచి మనుషులకి జరిగిన ప్రపంచీకరన కాదు కదా!

    ప్రపంచీకరణ, ప్రపంచీకరణ, ప్రపంచీకరణ, ఏవిటిది. ఎక్కడిదిది. ఏవి చేస్తుందిది. ఈనాడు మనకు తెలిసిన, మనకు అనుభవవైన, మనం మాట్లాడుకునే ప్రపంచీకరణ, ఏవో కొన్ని ఆలోచనల పరస్పరమార్పిడి కాదు. మనం తినే తిండి దగ్గరనుంచి, మన భాష దగ్గరనుంచి, మన అలవాట్ల దగ్గరనుంచి, పూర్తిగా మన జీవన విధానాల్ని కదిలించి, విదిలించి మార్పు చేసే ప్రక్రియ. మన రాజకీయాలు, మన ప్రభుత్వాలు, మన ఆరోగ్యం, విధ్యా ఉద్యోగాలు, మన కుటుంబాలు, ఆ కుటుంబ సంబంధాలు అన్నిటిని ప్రభావితం చేస్తున్న, చెయ్యగలిగిన ఒక మహా శక్తి ఈ ప్రపంచీకరణ. ఎక్కడిదీ శక్తి, ఎవరు దీనికి కారణం? పడమటి ప్రభుత్వాలా, అభివృద్ది చెందుతున్న దేశాల్లో బలహీన ప్రభుత్వాలా, కోకోకోలా కంపెనీలా, ఫోర్డు మోటారు కారులా, సాఫ్టువేరు కంపెనీలా ఎవరు, ఎందుకు?

    ముందు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం వరకు ఈ ప్రపంచీకరణ మనింట్లో బిడ్డలాటిదే. వచ్చీ రానీ నడకలు, ముద్దు ముద్దు మాటలు, అక్కడక్కదా అద్భుతవైన ఆలోచనల వలసలు, కొత్త రకవైన రుచులు, కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ ముద్దు బిడ్డ పెరిగి పెద్దోడయ్యాడు. అనంతవైన శక్థిని సంపాదించాడు. రాజుల్ని, రాజ్యాల్ని ఆదేసించగల మార్కెట్లగా ప్రస్తానం చెందేడు. ఒక్క సారి ఆలోచించండి, ఇంగ్లాండు పదిహేడు, పజ్జెనిమిది, పంతొమ్మిది శతాబ్ధాల్లో ప్రపంచ శక్తిగా ఎదిగి, ప్రపంచ దేశాల్ని బానిస దేశాలుగా చేసుకోగలిగిన బలాన్ని ఎవరిచ్చారో. ఆ అవసరం ఎందుకొచ్చిందో. అంత పెద్ద సైన్యాలని, వాటికి కావాల్సిన పరికరాల్ని, అవసరాల్ని సపోర్టు చెయ్యగలిగిన మార్కెట్ల గురించి ఆలోచించండి. ఆ మార్కెట్లను వశపరచుకోవడం కోసం అప్పటి ప్రపంచీకరణ నడిపిన యుద్దాల్ని మననం చేసుకోండి. ఆ యుద్దాల తర్వాత తమ సంస్కృతిని, భాషని, పూర్తిగా తమ అస్తిత్వాన్నే కోల్పోయిన అనేక దేశాల్ని గుర్తు తెచ్చుకోండి.
    ఇరవైఒకటో శతాబ్ధపు మార్కెట్లు ఇంకా శక్తివంతవైన మార్కెట్లు, ఇంకా మరింతగా బలపడి, ఇప్పుడు తమకు తామై మార్కెట్లకోసం యుద్దాలు చెయ్యవు. ఆ అవసరం కూడా లేదు. బలహీనవైన మూడో ప్రపంచపు ప్రభుత్వాలని సామ, దాన, దండోపాయాల్తో లొంగదీసుకోగలరు. తీసుకోగలరనే, తీసుకున్న దృష్టాంతరాలనే అమర్త్యా సేను గారు తమ వ్యాసంలో ఉటంకించారు. అమర్త్యా సేను గారే ఉదాహరించిన ఈ bad side of glottalization నుంచి భారద్దేశం లాంటి దేశాలకి ఎక్కడ రక్షణ?
    ఆయన వ్యాసంలో చెప్పినట్టు “As Georgr Soros has pointed out, international business concerns often have a strong preference for working in orderly and highly organized autocracies rather then in activist and less-organized democracies, and this can be a regressive influence on equitable development. Further, multinational firms can exert their influence on the priorities of public expenditure in less-secure third world countries by giving preference to the safety and convenience of the managerial classes and of privileged workers over the removal of widespread illiteracy, medical deprivation, and other adversities of the poor.”

    మరి వీళ్ళనుంచి మనని, మన సంస్కృతిని, మన భాషని ఎవరు కాపాడుతారు. నరకం నుంచి ఆ సమవరర్తి గారు దిగొచ్చి, పవరున్న ప్రధానులుగానో, అధ్యక్షులుగానో వివిధ రూపాల్లో మూడో ప్రపంచదేశాల్లో ఎన్నికైతే తప్ప ఎవరు మనల్ని కాపాడుతారు. అమర్త్యా సేను గారి వ్యాసంలో చెప్పిన “fairness in sharing the benefits of globalization” ని ఏ దేవుడు అమలు చేస్తారు. మనకున్నది నరకం నుంచి వచ్చిన యమధర్మ రాజులు కాదుకదా, మనకున్నది నరకాసుర రాజకీయనాయకులు కదా (రాజకీయ నాయకులు మాత్రవే కాదు సార్ వాళ్ళనెన్నుకున్న మనం కూదా ఆ తానులో ముక్కలవే).

    తెలుగు భాష గురించి బాధని నేనర్ధం చేసుకోగలను. కానీ తెలుగు భాష మాత్రం మిగిలిన సమాజంతో సంభంధం లేకుండా నిలబడలేదు. ఈ రోజు హనుమంతరావు గారు అమెరికాలో నీళ్ళ లభ్యత గురించి, వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం గురించి అభిప్రాయం వ్యక్థం చేసేరు. కానీ అమెరికాలో కూడా మార్కెట్ల భీభత్సంలో ఆరోగ్య విధానం కకావికలైపోతుందని వారికి తెలియదా. నాకూ, వారికి, ఇంకా ఇది చదివే మీకు ప్రభుత్వ ఆసుపత్రులతోనూ, బడులతోనూ అవసరం లేదు. కానీ భారద్దేశం లాంటి దేశాల్లో ఆ సౌకర్యాలు అందరికీ అందుబాటులో వుండాలంటే ప్రభుత్వ వ్యవస్త తప్ప మరోదారి వుందా. ఇంతెందుకు, మన హయాం లోనే ప్రభుత్వ పాఠశాలలే మంచిగా లేకపోతే మనలో ఎంతమందివి ఈ రోజు ఇక్కడ వుండగలిగేవాళ్ళం? ప్రభుత్వం బహుజన సౌకర్యం కోసం కల్పించాల్సిన, విధ్యా, వైధ్య సదుపాయాలు, మంచినీరు, సాగు నీరు మొదలైన వాటిని ప్రవేటీకరణ చేస్తూ తమ భాద్యతలనుంచి తప్పుకోటం ఏ కారణం వల్ల నంటారు, ప్రపంచీకరణ వల్ల కాదా?

    కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రపంచీకరణ అనేది ఈ రోజు ఒక వాస్తవం. మనం బతుకు కోసం గాలి పీల్చేతంతటి వాస్తవం. ఆ వాస్తవాన్ని అవగాహన చేసుకుని దాన్ని దాని పెడదోరణులనుంచి మనల్నిమనం రక్షించుకునే దిశలోనే ఆంధ్రజ్యోతి సంపాదకీయం. ఆ సంపాదకీయంలో కొన్ని irrational and illogical తార్కికత వుంది కాదనలేం. కానీ ఆ సంపాదకీయంలో సామాన్య భారత జనాల పట్ల వ్యక్తమైన బాధ, భయం irrespective of it’s exaggerated state is true. తెలుగు భాషకి పదికాలాలపాటు బ్రతికుండడానికి అతి ముఖ్యం, తెలుగు మాట్లాడే మనుషులు. తెలుగుని రక్షించుకోవాలంటే తెలుగు మనుషుల్నికాపాడుకోవాలి కదా!

    అమత్యా సేను గారి వ్యాసం చదివిన తర్వాత నాకు వినోభాభావే గారి భూదానోద్యమం గుర్తుకొచ్చింది. భూపాల పల్లిలో మొదలైన ఆ ఉధ్యమం భూపాల పల్లిలోనే భూస్థాపితవైంది. వినోభాభావే గారి ఆశయం మనకి మంచిగానే కనపడొచ్చు, కానీ పెద్ద రైతులనుంచి భూవిని దానం తీసుకుని, అసంఖ్యాకంగా వున్న భూమిలేని ప్రజానీకానికి భూమిని పంచి వాళ్ల బ్రతుకులు బాగు చెయ్యడం ఎంత అవాస్తవికవో, ప్రపంచీకరణ లో వున్న మంచి దానిలో వున్న చెడుపైన అతి సహజంగా పట్టు సాధిస్తుందని, ఆ మంచి దేశప్రజలందరికి సహజంగానే దరిచేరుతుందని అనుకోవడం మన నాశనాన్ని మనం తెచ్చుకోవడవే. ఆ మంచి మనందరికి చేరాలంటే దాంట్లో చెడుని ప్రతిఘటించితేగానీ వీలు కాదు.

  57. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    అంతంత మాత్రం నియంత్రణ వున్న మూడో ప్రపంచదేశాల్లో ఆ నియంత్రణని కార్పొరేట్ శక్థులు ఎలా కొనెయ్యగలవో భోపాల్ మనకొక అనుభవం. కానీ అభివృద్ది చెందిన దేశాల్లో కూడా అవే కార్పొరేట్ శక్తులు, ఏవైతే ప్రపంచీకరణలో అగ్రభాగాన నిలబడున్నాయో వాటి శక్తిని అవి ఇప్పుడు మనవున్న ఆర్ధిక వెతల్లో వాటినవి నిరూపించుకున్నాయి. అవకాశం దొరికితే, తమకొక రూపాయి లాభం కనపడితే ఆదర్శాల మడిబట్టల్ని అవి ఏమాత్రం రెండో ఆలోచన లేకుండా వదిలివెయ్యగలవని మనకి ఈపాటికి విసిదమయ్యే వుండాలి. రెండు ఆర్ధిక మాంద్యాలని చవిచూసిన వాళ్ళం 2000 సంవత్సరం నుంచి. ఇక అర్ధాన్ని ప్రక్కన పెట్టండి అమెరికాలాంటి దేశంలో నాలుగుకళ్ళతో ఎఫ్ డి ఎ కంట్రోళ్ళని అమలు చేస్తున్న దేశంలో ప్రజల ప్రాణాలని బలిపెట్టి డాలర్లని ఆ ఆర్ధిక శక్తులు ఎలా పండించగలవో ఈ క్రింది న్యూయార్కు టైమ్స్ లింకు లో చూడండి. ఇక మనలాటి బడుగు దేశాల్లో మనలాటి సామాన్యుల గతేవిటి ఈ ప్రంపంచీకరణ నేపధ్యంలో?

    http://www.nytimes.com/2009/08/05/health/research/05ghost.html?_r=1&hp

  58. trao says:

    should have written this in Telugu, just being a bit lazy. Much of the discussion has been along well known cliched lines of argument so far. So, let us take a new angle, for a change –
    Obviously, a large number of businesses in AP, corporations, tuition rackets, and pseudo language outfits benefit enormously by imposing English on all the children there. Does every one in Andhra Pradesh need English for every little task from going to rest room to brake repair on car/motorcycle/bike? Does a nursery (horticulture) owner in Andhra need to know English for his business needs? Yes and No.
    The auto mechanic just needs basic skills in English, to identify a part, to read repair manual – not much. He can get by very rudimentary knowledge, few words, glancing technical diagrams. Similarly, a vendor of plants need to know only – plant care, grafting, rooting, basic vocabulary (plant name). Such workers need not waste years and thousands of rupees in learning English for ten or twelve years. Still they can eke out reasonable standard of living with their hand skills. There are many other types of vocations – other than software.
    For learning mother tongue (Telugu or any other language), one needs to love oneself first. The current generation may think that without software, English – how did earlier generations live without English. Many generations lived without all-pervading English; many nations (Japan, France) won even Nobel prizes in sciences without English medium instruction in high schools.

Comments are closed.