మృతజీవులు – 28

-కొడవటిగంటి కుటుంబరావు

ఏడవ ప్రకరణం

ముసలాయన కళ్లుపైకెత్తి , తాపీగా, “క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడకాదు,” అన్నాడు.

“మరెక్కడ?”

“క్రయశాఖలో.”

“ఆ క్రయశాఖ ఎక్కడున్నది?”

“ఇవాన్ అంతో నవిచ్ బల్ల దగ్గిర.”

“ఇవాన్ అంతో నవిచ్ ఎక్కడ?”

ముసలాయన మరొక మూలగా వేలు విసిరాడు. చిచీకవ్, మానిలవ్ లు ఇవాన్ అంతోనవిచ్ దగ్గిరికి వెళ్లారు. ఇవాన్ అంతోనవిచ్ అప్పటికే ఒక్కసారి వెనక పక్క చూసి, క్రీగంట వారి కేసి చూసి మరుక్షణం తాను చేస్తున్న రాత పనిలో పరిపూర్ణంగా నిమగ్నుడై పోయాడు.

“కమతగాళ్ల కొనుగోలు వ్యవహారాలు చూసేది ఈ బల్ల వద్దనే నేమో దయచేసి తెలుపుతారా?”

ఇవాన్ అంతోనవిచ్ కి ఈ ప్రశ్న వినపడ్డట్టే లేదు. ఆయన జవాబు చెప్పకుండా తన కాగితాలలో ముణిగి పోయాడు. ఈయన అనుభవశాలి అనీ, కుర్ర గుమాస్తాల లాగా అతివాగుడూ, మంద బుద్ధీ కలవాడు కాడనీ చూడగానే తెలిసిపోతున్నది. ఇవాన్ అంతోనవిచ్ వయసు నలభైకి పైబడ్డట్టు కనబడింది. ఆయన జుట్టు నల్లగానూ, దట్టంగానూ ఉన్నది. ఆయన ముఖాంగాలు స్ఫుటంగా ఉండి ముక్కు వద్దకు దారితీస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ముఖం “కూజా మూతి” అని వర్ణించబడే లాటిది.

“దయచేసి చెప్పండి, కమతగాళ్ల కొనుగోలు వ్యవహారాలు చూసేది ఇక్కడేనా?” అన్నాడు చిచీకవ్.

కూజామూతి తిప్పి ఇవాన్ అంతోనవిచ్ “అవును” అన్నాడు. కాని తన రాతమాత్రం మానలేదు.

“అయితే నేను వచ్చిన పని వినండి. నేను ఈ జిల్లాలో అనేక మంది భూస్వాముల వద్ద కమతగాళ్లను కొన్నాను. క్రయదస్తావేజు ఇదుగో, మిగిలిన వ్యవహారాలు పూర్తి చెయ్యటమే తరువాయి.”

“అమ్మేవాళ్లు హాజరులో ఉన్నారా?”

“కొందరు హాజరులో ఉన్నారు, మిగిలిన వాళ్లు నాకు అధికార పత్రాలిచ్చారు.”

“దరఖాస్తు తెచ్చారా?”

ఆ గదిలో ఒక విశాలమైన కుర్చీ మీద అధ్యక్షుడు సూర్యుడిలాగా ఏకాంతంగా కూచుని ఉన్నాడు. ఆయన ముందున్న బల్ల మీద రెండుతలలగద్ద (జారుసామ్రాజ్య చిహ్నం), రెండు లావుపాటి పుస్తకాలూ ఉన్నాయి.
…..
వారు లోపలికి అడుగుపెట్టగానే అధ్యక్షుడు ఒంటరిగా లేడనీ జంట తలల గద్ద చాటున సబాకివిచ్ కూచుని వున్నాడనీ తెలియవచ్చింది.

“దరఖాస్తు కూడా ఉన్నది. అందుకని నేకోరేది… కాస్త తొందరలో ఉన్నాను… అందుచేత, మాటవరసకు, ఈ వ్యవహారం ఇవాళ పూర్తి అయే అవకాశం ఉన్నదా?”

“ఇవాళ !… ఇవాళ కాదు. విచారణ జరిపి, ప్రతిబంధకాలేమైనా ఉన్నాయేమో చూడాలి,” అన్నాడు ఇవాన్ అంతోనవిచ్,

“అధ్యక్షులు ఇవాన్ గ్రెగోర్యెవిచ్ నాకు ఆప్తమిత్రుడంటే ఒక వేళ పనితొందరగా అవుతుందేమో…”

“ఇవాన్ గ్రెగోర్యెవిచ్ ఒక్కరితో కూడిన పని కాదే. ఇంకా చాలామంది ఉన్నారు,” అన్నాడు ఇవాన్ అంతోనవిచ్ మొరటుగా. ఇవాన్ అంతోనవిచ్ సూచన గ్రహించి,

“ఇతరులకు నష్టం కలుగబోదులెండి. నేను ఉద్యోగం చేసిన వాణ్ణే, వ్యవహారకాండ నాకు తెలుసు,” అన్నాడు.

ఇవాన్ అంతోనవిచ్ కొంచెం మెత్తబడి, “ఇవాన్ గ్రెగోర్యెవిచ్ వద్దకు వెళ్ళి ఆర్డరు వేయించుకోండి. మాచేతిలో ఏమీలేదు,” అన్నాడు.

చిచీకవ్ జేబులోనుంచి ఒక నోటు తీసి ఇవాన్ అంతోనవిచ్ కెదురుగా ఉంచాడు. ఆయన దాన్ని చూడనైనా చూడకుండా దాని పైన ఒక పుస్తకం పెట్టాడు. చిచీకవ్ ఆయనకు దాన్ని గురించి హెచ్చరిక చేయబోయాడు, కాని ఆయన తల ఆడించి హెచ్చరిక అవసరం లేదన్నట్టు సూచించాడు.

“ఇడుగో, ఇతను మీకు ఆఫీసు చూపిస్తాడు,” అంటూ ఇవాన్ అంతోనవిచ్ తలవిసిరి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని సూచించాడు. ఈ న్యాయదేవతార్చకుడు ఎలాటి త్యాగాలు చేశాడో ఏమోగాని, ఆయన మోచేతి వద్ద కోటు చిల్లులుపడి లోపలి లైనింగ్ కనిపిస్తున్నది. ఈ త్యాగానికి బహుమానంగా ఆయనకు చర్చి రిజిస్ట్రారు పదవి ఇచ్చారు. వెనుకటికి డాంటీని వర్జిల్ తీసుకుపోయినట్టుగా ఈ వ్యక్తి మన మిత్రులను ఒక గదికి తీసుకుపోయాడు. ఆ గదిలో ఒక విశాలమైన కుర్చీ మీద అధ్యక్షుడు సూర్యుడిలాగా ఏకాంతంగా కూచుని ఉన్నాడు. ఆయన ముందున్న బల్ల మీద రెండుతలలగద్ద (జారుసామ్రాజ్య చిహ్నం), రెండు లావుపాటి పుస్తకాలూ ఉన్నాయి. ఈ కొత్త వర్జిల్ ఈ గది అంటే ఎలా బెదిరిపోయాడంటే ఆయన లోపలికి అడుగుపెట్ట సాహసించలేదు. ఆయన వెనక్కు తిరిగేసరికి ఆయన కోటు వీపు దాళ్ళుపడి చాపలాగా ఉన్నది. అందులో ఒక కోడి ఈక చిక్కుకొని ఉన్నది. వారు లోపలికి అడుగుపెట్టగానే అధ్యక్షుడు ఒంటరిగా లేడనీ జంట తలల గద్ద చాటున సబాకివిచ్ కూచుని వున్నాడనీ తెలియవచ్చింది. అతిథులు రావటం చూసి అధ్యక్షులు పెద్దగా ఆశ్చర్యం ప్రకటించి, ఎంతో చప్పుడయేలాగా తన కుర్చీ వెనక్కుతోసి లేచాడు. సబాకివిచ్ కూడా లేచి నిలబడి, అన్ని వైపులనుంచీ దర్శనమిచ్చాడు. అధ్యక్షుడు చిచీకవ్ ను ఆలింగనం చేసుకున్నాడు; గది ముద్దులతో మారు మోగింది. ఇద్దరూ పరస్పర క్షేమసమాచారాలు అడుక్కున్నారు. ఇద్దరూ నడుమునొప్పితో బాధపడుతున్నట్టు స్పష్టమయింది. తిని కూర్చోవటం వల్లనే అది కలిగిందని నిర్ధారణ చేసుకున్నారు. అమ్మకం గురించి అధ్యక్షుడితో సబాకివిచ్ అదివరకే చెప్పేసినట్టుంది; అధ్యక్షుడు మన కథానాయకుణ్ణి అభినందించాడు. చిచీకవ్ కు కొంచెం బిడియం వేసింది; ఎందుకంటే, తాను ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గిర క్రయం చేసిన పెద్దమనుషులిద్దరూ ఇప్పుడు ఒక చోటనే ఉన్నారు. అతను అధ్యక్షుడికి తన కృతజ్ఞత తెలిపి, సబాకివిచ్ కేసి తిరిగి “మీరెలా ఉన్నారు?” అన్నాడు.

“దేవుడి దయవల్ల నాకే జబ్బూ లేదు” అన్నాడు సబాకివిచ్. నిజంగా ఆయనకే రోష్టూ లేదు కూడానూ. ఇనుముకైనా శైత్యభారం చేసి దగ్గు పట్టుకోవచ్చుగాని, ఆయన శరీరతత్వం అద్భుతమైనది.

“అవును; మీ ఆరోగ్యం లోక ప్రసిద్ధం. మీ నాన్న గారు కూడా మీలాగే గట్టి మనిషి” అన్నాడు అధ్యక్షుడు.

“అవును; ఆయన ఎలుగుబంటికి జవాబు చెప్పేవారు” అన్నాడు సబాకివిచ్.

“మీరైనా ఎలుగుబంటిని ఒంటరిగా పడగొట్టగలరనుకుంటాను-తలచుకుంటే” అన్నాడు అధ్యక్షుడు.

“లేదు, నావల్ల కాదు. మా నాన్నగారు నాకంటె బలశాలి,” అని ఒక్క నిట్టూర్పు విడిచి సబాకివిచ్, “అబ్బే, ఈనాటి వాళ్ళు వెనకటి వాళ్ళకి తీసికట్టే; మాటవరసకి, నా
జీవితం తీసుకోండి. ఏమున్నాదందులో…?” అన్నాడు.

“మీ జీవితానికే మొచ్చింది?” అన్నాడు అధ్యక్షుడు.

సబాకివిచ్ తల అడ్డంగా తిప్పుతూ, “అంతా లోటే, అంతా లోటే! మీరే చెప్పండి, ఇవాన్ గ్రెగోర్యెవిచ్. నాకు యాభై ఏళ్ళు, నా జన్మలో జబ్బు చేసి ఎరుగను; కనీసం ఏ గొంతునొప్పో, నెత్తురుగడ్డో, రాచపుండో వచ్చి ఉండకూడదూ?… ఇది నా మంచికి రాలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇందుకు అనుభవించక తప్పదు” సబాకివిచ్ పెద్ద విచారంలో మునిగిపోయాడు.

“ఏం మనిషి!” అనుకున్నాడు చిచీకవ్. “ఇంకా దేనికి గునుస్తాడో?’ అనుకున్నాడు అధ్యక్షుడు.

“నేను తమకొక ఉత్తరం తెచ్చాను” అంటూ చిచీకవ్ ప్ల్యూష్కిన్ ఉత్తరం జేబులోనుంచి తీశాడు.

“ఎవరి దగ్గిరనుంచి?” అంటూ అధ్యక్షుడు సీలుతీసి, “ఓహో, ప్ల్యూష్కిన్ నుంచా! అయితే యింకా కరుడుగట్టి బతికేవున్నాడన్న మాట. ఏం గ్రహచారం! ఒకప్పుడెంత తెలివిగలవాడు, ఎంత సంపన్నుడు! ఇప్పుడు…” అన్నాడు.

“వాడు కుక్క, లుచ్ఛా! కమతగాళ్ళందర్నీ తిండికి మాడ్చి చంపేశాడు” అన్నాడు సబాకివిచ్.

“నిరభ్యంతరంగా, నిరభ్యంతరంగా! అతని తరపున వ్యవహరిస్తాను. ఈ క్రయం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడా, తరవాతనా?” అన్నాడు అధ్యక్షుడు ఉత్తరం చదివి.

“ఇప్పుడే. సాధ్యమైతే, ఇవాళే పని పూర్తి చేయించమని కూడా తమర్ని వేడుకుంటాను; ఎందుకంటే, రేపు నేను వెళ్ళిపోతున్నాను. దస్తావేజులూ, దరఖాస్తూ పట్టుకొచ్చాను” అన్నాడు చిచీకవ్.

“దానికేమీ అభ్యంతరం లేదు. కాని మీరు ఏమైనా చెప్పండి; మేం మిమ్మల్ని ఇంతట్లో వెళ్ళనిచ్చేది లేదు. ఈ వ్యవహారం ఇవాళ పూర్తి అవుతుంది. అయినా, మీరు మాతో కొంతకాలం ఉండాలి.ఇప్పుడే అర్డరు రాసేస్తాను” అంటూ ఆయన ఒక గది తలుపు తెరిచాడు. ఆ గదినిండా గుమాస్తాలున్నారు. వాళ్ళను తుట్టెలో పనిచేసే తేనెటీగలలో పోల్చవచ్చు- తేనె తుట్టెలకూ, కోర్టు వ్యవహరాలకూ పోలికే ఉండాలి గాని.

“ఇవాన్ అంతోనవిచ్ ఉన్నాడా అక్కడ?”

“అవును, ఉన్నాడు” అని అవతలినుంచి జవాబు వచ్చింది.

“దయచేసి ఇక్కడికి పంపండి.”

“కూజామూతి” ఇవాన్ అంతోనవిచ్ తో పాఠకుడికి అదివరకే పరిచయమయింది. అతను అధ్యక్షుడి గది ప్రవేశించి వినయంగా వంగాడు.

“ఇదిగో, ఇవాన్ అంతోనవిచ్, ఈ క్రయ దస్తావేజులన్నీ తీసుకుని…”

సబాకివిచ్ అడ్డం వచ్చి, “ప్రతి దస్తావేజుకూ కనీసం ఇద్దరేసి సాక్షులుండాలన్నది మరచిపోవద్దు, ఇవాన్ అంతోనవిచ్. ప్రాసిక్యూటరుకు కబురుపెట్టు. అతడికి పనేమీ లేదు, బహుశా ఇంటోనే ఉంటాడు. అతని పని యావత్తూ ముక్త్యారు జలతూల చేసి పెడతాడు-అంత దురాశాపరుడైన దుర్మార్గుడు మరి పుట్టబోడు! మెడికల్ బోర్డు ఇన్‌స్పెక్టరుక్కూడా పనేమీ లేదు, ఇంటి దగ్గిరే ఉండవచ్చు, పేకాటకు వెళితే ఏమోగాని. ఇంకా దగ్గిర్లో చాలామంది ఉన్నారు, త్రుఖాట్చవ్ స్కీ, బ్యెగూష్కిన్-భూభారమేగాని, పని ఏమీ లేని వాళ్లు!” అన్నాడు.

“అలాగే, అలాగే” అంటూ అధ్యక్షుడు, వారందరినీ పిలుచుకు రావటానికి మనిషిని పంపాడు.

“నేను మిమ్మల్ని మరొకటి కూడా కోరాలి. నేనింకొక స్త్రీ వద్ద కూడా క్రయం చేశాను, ఆవిడ వకాల్తా గల మనిషి, పెద్ద ప్రీస్టు ఫాదర్ కిరిక్ కుమారుడు, ఇక్కడే ఉన్నాట్ట” అన్నాడు చిచీకవ్.

“అవశ్యం. ఆయనను కూడా పిలిపిద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది. మీ పుణ్యం ఉంటుంది, గుమాస్తాలకు మామూళ్లివ్వకండి. నా స్నేహితులకు మామూళ్లు లేవు” అంటూ అధ్యక్షుడు ఇవాన్ అంతోనవిచ్ కి ఏదో ఉత్తరువిచ్చాడు, అది ఆ పెద్దమనిషికి నచ్చినట్టు లేదు. ఈ కమతగాళ్ల కొనుగోలు అధ్యక్షుడి ప్రాణానికి ఘనంగా కనిపించింది, ముఖ్యంగా ఆయనను అకర్షించినది లక్ష రూబుళ్లకు చేరబడిన కొనుగోలు మొత్తం. అయన చిచీకవ్ మొహం కేసి కొంతసేపు తృప్తిగా చూసి,”సాధిస్తే అలా సాధించాలంటాను, పావెల్ ఇవానవిచ్! మొత్తంమీద గట్టిపనే చేశారు!” అన్నాడు.

“నది ఉన్నది. చెరువుకూడా ఉందిమరి” అంటూ చిచీకవ్ సబాకివిచ్ మొహం కేసి చూశాడు. ఆయన మొహంలో ఏ మార్పూ లేకపోయినప్పటికీ అది, “అబద్ధాలాడుతున్నావు, అక్కడ నదీ లేదు, చెరువూ లేదు, అసలు భూమీ లేదు!” అంటున్నట్టుగా ఉన్నది.

“చేశాను మరి!” అన్నాడు చిచీకవ్.

“భేషైనపని, నిజంగా భేషైనపని.”

“అవును. ఇంతకన్న మంచిపని చెయ్యలేనని నేనే ఎరుగుదును. ఏమైనా మనిషి యొక్క ఆశయాలు స్పష్టంగా ఉండవు, ఏదో ఒక గుర్తు చూసుకుని పట్టుదలగా నిలబడాలి, అంతేగాని పసితనపు ఊహాపోహలను బట్టి పోరాదు.”

ఇలా అని అతను అవకాశం పురష్కరించుకుని యువకుల విశాల దృక్పథాన్ని గట్టిగా తిట్టేశాడు -అందులో అక్రమం ఏమీలేదు కూడానూ, కాని గమనించదగిన సంగతి ఏమిటంటే, మాట్లాడుతున్నంత సేపూ అతని మాటలలో దృఢమైన నమ్మకం లేదు, “ఒరే, అబ్బీ, అబద్ధాలాడేస్తున్నావు, జోరుగా ఆడేస్తున్నావు!” అని తనలో తాను అనుకుంటున్నట్టుగా ఉన్నది.

చూస్తే వారి మొహాలలో ఏం కనపడిపోతుందో అన్న భయంతో అతను సబాకివిచ్ కేసిగాని, మానిలవ్ కేసిగాని చూడలేదు. అయితే అతని భయానికి తావులేదు. సబాకివిచ్ ముఖంలో సంభాషణకు ముగ్ధుడైపోయి, గాయనీమణి ఫిడేళ్లతో పోటీపడి ఉచ్ఛస్థాయిలో పిట్టకన్న హెచ్చు స్వరం పలికించినప్పుడు సంగీతాభిలాషి అయిన యువకుడు ఆడించినట్టుగా, తల ఆడించసాగాడు.

“ఇంతకూ మీరు కొన్నది ఎలాటివాళ్లను ఇవాన్ గ్రెగోర్యెవిచ్ కి చెప్పరేం? ఎలాటి మనుషులను సంపాదించారని మీరైనా అడగరేం, ఇవాన్ గ్రెగోర్యెవిచ్? వాళ్లూ కమతగాళ్లంటే! రత్నాలు! మా బళ్లు తయారుచేసే మిఖేయెవ్ ని అమ్మాను తెలుసా?” అన్నాడు సబాకివిచ్.

“మీ మిఖేయెవ్ నే అమ్మేశారా? నేను మిఖేయెవ్ ని ఎరుగుదును, మంచి పనివాడు. వాడు నా చిన్నబండిని బాగుచేసి పెట్టాడు… అదేమిటి, వాడు పోయాడని చెప్పారే…”

“ఎవరు? మిఖేయెవ్ పోయాడా? పోయింది వాడి అన్న, వాడికేం వాడు పిడిరాయిలాగున్నాడు, ఇంకా మరింత బాగున్నాడు. ఆ మధ్య నాకు ఒక బండి చేసి పెట్టాడు. మాస్కోలో అలాటి బండి చెయ్యలేరు. వాడు నిజంగా జారు దగ్గర పని చెయ్యవలసిన మనిషి” అన్నాడు సబాకివిచ్ కొంచెం కూడా కంగారుపడక.

“అవును, మిఖేయెవ్ పనిమంతుడు. వాణ్ణి ఎలా పోనిచ్చారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు అధ్యక్షుడు.

“ఒక్క మిఖేయెవే అయితే బాగానే ఉండును! నా వడ్రంగి స్తిపాన్ ప్రోచ్కి. ఇటుకలు చేసే మిలూష్కిన్, బూట్లు కుట్టే మక్సీమ్ తిల్యాత్నికవ్ – అందరూ వెళ్లిపోయారు. అందర్నీ అమ్మేశాను,” అన్నాడు సబాకివిచ్. వీళ్లందరూ ఎస్టేటుకు అవసరమైన పనులుచేసే వాళ్లేగదా, ఎందుకమ్మేశారని అధ్యక్షులు అడిగితే, “ఏం చెప్పమన్నారు. నా బుద్ధి తక్కువే. ‘పోనీ అమ్మేద్దాం’; అనుకున్నాను. బుద్ధి తక్కువై అమ్మేశాను!” అంటూ విచారగ్రస్తుడిలాగా తలవం చేసి, “నా జుట్టు నెరుస్తున్నదేగాని, ఇంకా బుద్ధి రాలేదు,” అన్నాడు.

“అయితే చూడండి. పావెల్ ఇవానవిచ్. మీరు భూమి కొనకుండా కమతగాళ్ళను ఎందుకు కొంటున్నారూ? వాళ్లను మరెక్కడికైనా తరలిస్తారా?”

“అవును.”

“అలా అయితే ఫరవా లేదు. ఏ ప్రాంతానికీ?”

“ఖెర్సోన్ రాష్ట్రానికి.”

“ఓ అక్కడ బంగారం వంటి భూమి!” అంటూ అధ్యక్షుడు ఆ ప్రాంతంలో నవనవలాడుతూ పెరిగే గడ్డిని వర్ణించి, “చాలినంత భూమి సంపాదించారా?” అన్నాడు.

“ఆ నేను కొన్న కమతగాళ్లకు సరిపడినంతా ఉన్నది.”

“అక్కడ నదిగాని, చెరువుగాని ఉందా?”

“నది ఉన్నది. చెరువుకూడా ఉందిమరి” అంటూ చిచీకవ్ సబాకివిచ్ మొహం కేసి చూశాడు. ఆయన మొహంలో ఏ మార్పూ లేకపోయినప్పటికీ అది, “అబద్ధాలాడుతున్నావు, అక్కడ నదీ లేదు, చెరువూ లేదు, అసలు భూమీ లేదు!” అంటున్నట్టుగా ఉన్నది.

సంభాషణ జరిగే సమయంలో సాక్షులు ఒకరొకరే వచ్చారు. వారిలో పాఠకుడికి పరిచయంగల ప్రాసిక్యూటరూ, మెడికల్ బోర్డు ఇనస్పెక్టరూ, త్రుఖాట్చెవ్ స్కీ, బ్యెగూష్కిన్, భూభారమని సబాకివిచ్ నిర్వచించిన ఇతరులూ ఉన్నారు. వారిలో కొందరిని చిచీకవ్ ఎరగడు. సంఖ్య భర్తీకావటానికి ఆఫీసు గుమాస్తాలను కూడా చేర్చారు. ఫాదర్ కిరిల్ కొడుకేగాక ఫాదర్ కిరిల్ ను కూడా రప్పించారు, ప్రతి సాక్షీ సంతకం చేసి, తన హోదా, అర్హతలూ నమోదు చేశాడు. కొందరి అక్షరాలు నిటారుగా ఉన్నాయి, కొందరివి వాలి ఉన్నాయి, మరికొందరివి బొత్తిగా తలకిందులుగా ఉండి, రష్యను అక్షరమాలకు చెందనివి లాగున్నాయి. పాఠకుడికి సుపరిచితుడైన ఇవాన్ అంతోనవిచ్ శీఘ్రంగా పని ముగించాడు. దస్తావేజులు రాయటమూ, సరిచూడటమూ, పుస్తకంలో కాపీ చెయ్యటమూ, మిగిలిన తంతూ అయిపోతుంది. నూటికి అరవంతు ఫీజూ, గెజెట్ లో ప్రకటనకు ఖర్చులూ గుణించిన మీదట చిచీకవ్ బహుకొద్దిగానే ఇవ్వ వలసి వచ్చింది.

వ్యవహారకాండ ముగిశాక అధ్యక్షుడు, “ఇక విక్రయానికి ప్రోక్షణ చెయ్యటమే దిగబడి ఉంది,” అన్నాడు.

“నేను సిద్ధంగానే ఉన్నాను. ఫలానప్పుడని చెప్పండి. ఇలాటి మిత్రులకోసం రెండు మూడు షాంపేన్ బుడ్లన్నా మూతలు తియ్యక పోవటం భావ్యంగా ఉండదు,” అన్నాడు చిచీకవ్.

“లేదు, మీరు పొరపాటుపడ్డారు. షాంపేన్ ఖర్చు మాదీ. అది మా విధి. మీరు మాకు అతిథి, సత్కారం చెయ్యవలిసింది మేమూ. నేనొకటి చెప్పనా, ఏమర్రా? మనం ఏం చేద్దామంటే, ఈపళంగానే పోలీసు అధిపతి ఇంటికి పోదాం. అతడు ఇంద్రజాలికుడు. అలా చేపల బజారుగుండా వెళుతూనూ, సారా దుకాణం పక్కగా వెళుతూనూ ఇలా కన్ను మలిపాడంటే చాలు మనకు అద్భుతమైన విందు దానంతట అదే సిద్ధమవుతుంది. సరదాకి పేకాటకూడా వేద్దాం!” అన్నాడు అధ్యక్షుడు.

అలాటి సూచనకు ఎవరు మాత్రం కాదంటారు గనకా. చేపల బజారనేసరికే సాక్షులకు ఆకలి పుట్టుకొచ్చింది; వారంతా తమ టోపీలనూ, కుళాయిలనూ చేతపట్టుకున్నారు. అధ్యక్షుడి ఆఫీసు మూత పడింది. వాళ్ళు గుమాస్తాల గదుల మీదుగా వెళ్ళేటప్పుడు “కూజా మూతి” ఇవాన్ అంతోనవిచ్ చిచీకవ్ ను చూసి మర్యాదగా వంగి, రహస్యంగా “మీరు లక్ష రూబుళ్లు పోసి వెట్టివాళ్ళను కొని, నా శ్రమకు ఇరవై అయిదు రూబుళ్ళే ఇచ్చారు” అన్నాడు.
చిచీకవ్ కూడా రహస్యంగానే “వాళ్ళు ఎలాటి మనుషులనుకున్నారు. ఒట్టి నాసిరకం. అందులో సగం విలవ కూడా చెయ్యరు” అన్నాడు. అతను మొండిఘటమనీ, ఇంకేమీ ఇవ్వడనీ ఇవాన్ అంతోనవిచ్ కనిపెట్టాడు.

“ఆ ప్ల్యూష్కిన్ దగ్గిర మనుషుల్ని కొన్నారేం?” అని సబాకివిచ్ రెండో చెవిలో రహస్యంగా అడిగాడు.

“మీరు వరబేయ్ ని ఎందుకు ఇరికించారూ?” అన్నాడు చిచీకవ్.

“ఏ వరబేయ్?” అన్నాడు సబాకివిచ్.

“ఆడది; ఎలీజవిత్ వరబేయ్. ఆమె పేరుచివర అకారం ఎగరగొట్టేశారు కూడా.”

“లేదు. నేను వరబేయ్ నెవర్నీ ఇరికించలేదు” అంటూ సబాకివిచ్ సాగి, మిగిలినవాళ్ళను కలుసుకున్నాడు.

అందరూ కలిసి పోలీసు అధిపతి ఇంటికి చేరారు. ఆయన నిజంగా ఇంద్రజాలికుడే. కావలిసినదేమిటో తెలుసుకోగానే ఆయన పాలిష్ చేసిన ఎత్తుబూట్లుగల చురుకైన పోలీసు జవానునొకణ్ణి పిలిచి, వాడి చెవిలో రెండంటే రెండేమాటలు ఊది “అర్థమయిందా?” అన్నాడు. ఆ వెంటనే, అతిథులు చీట్లాడుతుండగా, చేపల బజారు నుంచి రకరకాల చేపలు-వండినవీ, ఎండువీ, ఊరినవీ వచ్చి దిగాయి. తరవాత వంటశాలనుంచి ఇతర వంటకాలు వచ్చాయి. ఈ పోలీసు అధిపతి ఒక విధంగా నగరానికి తండ్రి వంటివాడు, మహోపకారి. పౌరులమధ్య ఆయన తన కుటుంబం మధ్య ఉన్నట్టే మసులుకుంటూ, బజారు దుకాణాలన్నిటినీ తనవిగానే చూసుకునే వాడు. మొత్తం మీద ఆయన సరియయిన స్థానానికి సరి అయిన మనిషి, తన ధర్మాన్ని బహుచక్కగా అర్థం చేసుకున్నవాడు. ఆయనే ఆ ఉద్యోగంకోసం సృష్టి అయాడో, ఆ ఉద్యోగం ఆయనకోసం సృష్టి అయిందో చెప్పటం కష్టం. ఆయన తన విధులను ఎంత బాగా నిర్వర్తించాడంటే ఆయన రాబడి ఆయనకు ముందుండినవారి రాబడికి రెట్టింపయింది, దానితో పాటు ఆయన నగరం యొక్క ఆదరాన్ని కూడా సంపాదించాడు. ఆయనకు గర్వంలేదనీ, తమ పిల్లలకు “గాడ్ ఫాదర్” గా ఉంటాడనీ వర్తకులకు ఆయన మీద ప్రత్యేకించి ఇష్టం; ఆయన వారితో చాలా దోస్తీగా, కలుపుగోలుగా ఉండేవాడు, ఒక్కొక్కసారి వారిని ఘోరంగా పిండినా ఆ పని ఎంతో చాకచక్యంగా చేసేవాడు. ఆయన ఒక్కో మనిషిని భుజంమీదతట్టి, నవ్వి, టీ పోసి, వచ్చి డ్రాఫ్ట్స్ ఆడతానని వాగ్దానంచేసి, క్షేమసమాచారాలన్నీ విచారించి, వ్యాపారం ఎలా సాగుతున్నది, ఎందుకు ఏమిటని అడిగేవాడు. ఏ బిడ్డకుగాని సుస్తీగాఉన్నట్లు తెలిస్తే మందు చెప్పేవాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే చాలా సరదా అయిన మనిషి. ఆయన తన పందెపు స్లెడ్జిలో వెళుతూ ఉత్తరువులిస్తూ, మధ్యమధ్య వారితో, వీరితో సంభాషించేవాడు: ‘ఇదుగో, మిఖ్యేయిచ్! మనం ఏదో ఒకరోజు వీలుచూసుకుని ఆ రబ్బర్ పూర్తి చెయ్యాలి’. అవతలిమనిషి టోపీ చేతిలోకి తీసుకుని “అవును; అలెక్సేయ్ ఇవానవిచ్, పూర్తి చెయ్యాలి” అనేవాడు. “ఏమోయ్,ఇల్యా పరమోనిచ్! ఒకసారి వచ్చి నా దౌడుగుర్రాన్ని చూస్తావూ! అది పందెంలో నీ గుర్రాన్ని ఓడిస్తుంది. నీ గుర్రాన్ని పందెపు బండికి కట్టు; ఒకసారి వదిలిచూస్తాం.” దౌడు గుర్రాలంటే పిచ్చిగల ఆ వర్తకుడు ఆనందంతో చిరునవ్వు నవ్వి, గడ్డం నిమురుకుని “వదిలిచూద్దాం, అలక్సేయ్ ఇవానవిచ్!” అనేవాడు. మామూలుగా అలాటి సమయాల్లో, టోపీలు చేతబట్టుకుని నిలబడే దుకాణదార్లుకూడా “అలెక్సేయ్ ఇవానవిచ్ భలేవాడు!” అన్నట్టుగా ఒకరినొకరు సంతోషంతో చూసుకునేవారు. ఇంతకు ఆయన ప్రజాదరణ పుష్కలంగా సంపాదించుకున్నాడు. “అలెక్సేయ్ ఇవానవిచ్, తనవంతు తాను తిన్నా నిన్ను ముంచడు” అనేవారు వర్తకులు.

పోలీసు అధిపతి వంటకాలు సిద్ధంగా ఉన్నాయని గమనించి, భోజనం అయాక ఆట సాగింతామన్నాడు. అతిథుల ముక్కులకు వంటకాల వాసన కమ్మగా తగులుతూనే ఉన్నది; వాళ్ళందరూ లేచి ద్వారంగుండా భోజనాల గదిలోకి వచ్చారు – ఆ వాకిలినుంచే సబాకివిచ్ కొంతసేపుగా పెద్ద పళ్ళెంలో పెట్టివున్న స్టర్జిన్ చేప కేసి చూస్తున్నాడు. అందరూ తలా ఒక గ్లాసు ముదురురంగు వోడ్కా తాగారు; అలాటి ముదురు ఆకుపచ్చరంగు సైబీరియాలో దొరికే రత్నాలలో మాత్రమే గోచరిస్తుంది; ఆ రత్నాలను మలిచి సీల్ జంతువుల బొమ్మలు చేస్తారు. ఆ తరవాత అతిథులందరూ, చేతుల్లో ముళ్ళ చెంచాలు పట్టుకుని ఎవరి కిష్టమైన వస్తువుమీద వారు ప్రతాపం చూపించసాగారు – కొందరు ఊర చేపలమీద, కొందరు ఎండు సామన్ చేపలమీదా, మరికొందరు జున్ను అచ్చులమీదా. సబాకివిచ్ ఈ క్షుద్ర పదార్థాలన్నింటినీ విడిచి పెట్టి స్టర్జిన్ చేపదగ్గిర తిష్ఠవేసుకుని ఒక పావుగంట లోపల దాని అంతు తేల్చాడు. ఆ తరవాత పోలీసు అధిపతి, స్టర్జిన్ జ్ఞాపకం వచ్చి, “అన్నట్టు, ఈ ప్రకృతి వింతను గురించి ఏమంటారు. మహాశయులు?” అంటూ ముళ్ల చెంచాతో, ఇతరులను వెంట బెట్టుకుని దాన్ని సమీపించి, ఆ ప్రకృతివింత తోక తప్ప ఇంకేమీ మిగలలేదని తెలుసు కొన్నాడు. సబాకివిచ్ చల్లగా జారుకుని, తానేమీ ఎరగనట్లు, కొంచెం ఎడంగా ఉన్న పళ్లెందగ్గరికిపోయి తన ముళ్ల చెంచాను ఒక చిన్న ఎండు చేపలో గుచ్చాడు. స్టర్జిన్ తో కడుపు నిండిపోయి సబాకివిచ్ ఇంకేమీ తినక, తాగక, వెళ్లి ఒక వాలుకుర్చీలో కూర్చుని మొహం చిట్లిస్తూ, కళ్లు ఆర్పసాగాడు. పోలీసు అధిపతి సారా విషయంలో ఏమాత్రమూ వెనక్కు తీసేరకం కాదు; టోస్టులకు అంతు లేకపోయింది, మొదటి టోస్టు ఖెర్యాన్ భూస్వామి అరోగ్యానికని పాఠకుడు సులువుగా ఊహించవచ్చు, తరువాత అతని కమతగాళ్ల అభ్యుదయానికీ, కొత్తచోటవారి సుఖనివాసానికీ, తరవాత అతనికి భార్య కానున్న స్త్రీ రత్నానికీ తాగారు. ఈ చివరటోస్టుకు చిచీకవ్ సంతోషంతో మందహాసం చేశాడు. అందరూ అతనిచుట్టూ మూగి, మరొక్క పక్షంరోజులన్నా ఉండిపొమ్మని అతన్ని బతిమాలారు: “ఏమిటిది,పావెల్ ఇవానవిచ్! మీరేమన్నా చెప్పండి, ఇలా వెళ్ళిపోవటం వుందే, సామెత చెప్పినట్టు, ఉత్తపుణ్యానికి పొయ్యి ఆర్పుకోవటమే. గడపతొక్కీ తొక్కకుండానే తిరిగిపోవటమా? అలాకాదు, మాతో కొంత కాలం గడిపితీరాలి. మీకు సంబంధం చూస్తాం. ఇవాన్ గ్రిగోర్యెవిచ్, మనం సంబంధం చూస్తాంగదూ?”

“తప్పకుండా చూస్తాం!” అని అధ్యక్షుడు అన్నాడు. “మీరు కాళ్ళూ చేతులా కొట్టుకునేదిగాక, తప్పక పెళ్ళి చేసేస్తాం! ఇక్కడికి వచ్చేసినాక ఇక మీ యిష్టం ఏమీలేదండి! మేం ఒకంతట వదిలే వాళ్లంకాము!”

చిచీకవ్ ఇకిలిస్తూ, “కాళ్లూ చేతులా కొట్టుకోవటం దేనికీ? పెళ్లి ఏమంత… వధువే దొరకాలిగాని!” అన్నాడు.

“దొరుకుతుంది, దొరుకుతుంది! ఆ భయం ఏమీలేదు. అంతా మీకు కావలసినట్టు అమరుతుంది.”

“సరే, అయితే, ఇకనేం…”

“బ్రేవో, ఉండిపోతున్నాడు. హుర్రా హుర్రా, పావెల్ ఇవానవిచ్! హుర్రా!” అని అందరూ కేకలుపెట్టారు.

అతని గ్లాసుకు తమ గ్లాసును తాకించటానికి అందరూ చిచీకవ్ చుట్టూ మూగారు. అతను తన గ్లాసుతో అందరి గ్లాసులూ తాకాడు. “మళ్ళీ, మళ్ళీ” అంటూ కొందరు అతని గ్లాసును తమ గ్లాసులతో చాలాసార్లు తాకారు. మరికొందరు తోసుకువచ్చి మూడో సారికూడా తాకారు. అందరికీ ఉత్సాహం బాగా ఎక్కిపోయింది. నిషామీద ఉన్నప్పుడు అధ్యక్షుడు భలే సరదా మనిషి, ఆయన చిచీకవ్ ను అనేక మార్లు ఆలింగనం చేసుకుని, “నా ప్రాణం, నా వరహాలు!” అన్నాడు. ఆయన చివరకు చిటికెలు వేసి అతని చూట్టూ నృత్యంచేస్తూ, అందరూ పాడేపాట “ఇలాటివాడివి, అలాటివాడివి, కామరిన్ స్కి బైతుగాడ” అనేది కూనిరాగం కూడా తీశాడు. షాంపేన్ అయాక, వాళ్లు హంగేరియన్ ద్రాక్షసారాయి బుడ్లు కొన్ని తెరిచారు. దానితో వాళ్ళ ఉత్సాహం మరింత రెచ్చింది. ఇంకా మజాలో పడ్డారు. పేకాటమాట ఎవరికీ జ్ఞాపకం లేదు. వాళ్లు తర్కించుకున్నారు, అరిచారు, అన్ని విషయాలూ మాట్లాడారు. రాజకీయాలను గురించి, సైనిక విషయాలను గురించీ, ప్రగతిభావాలు ప్రకటించారు; అలాటి భావాలు తమపిల్లలే మరొకప్పుడు ప్రకటించినట్టయితే వాళ్ళను చితకబొడిచి ఉందురన్నమాట. ఎన్నో క్లిష్టసమస్యలను అక్కడే పరిష్కరించిపారేశారు.

చిచీకవ్ అంత ఉల్లాసం ఎన్నడూ ఎరగడు. అతను తాను అప్పుడే నిజమైన ఖెర్యాన్ భూస్వామి అయిపోయినట్టు భావించుకున్నాడు, తాను చేయదలచిన అభివృద్ధిని గురించీ, మూడుపంటల పద్ధతిగురించీ, దాంపత్య సౌఖ్యం గురించీ మాట్లాడాడు. అతను సబాకివిచ్ ముందు, షార్లెట్ కు వెర్థర్ రాసిన లేఖాగీతం చదవసాగేసరికి సబాకివిచ్ వాలుకుర్చీలో కూచుని కళ్లు ఆర్పాడు, ఎందుకంటే స్టర్జిన్ తిన్నప్పటినుంచీ ఆయనకు నిద్రమత్తుగా వున్నది. తనమీద తనకు వశం తప్పిపోతున్నట్టు గ్రహించి చిచీకవ్ వెళ్లిపోవటానికి బండి అడిగాడు, ప్రాసిక్యూటరుగారి పందెపు బండి ఇస్తానంటే సరేనన్నాడు. ప్రాసిక్యూటరుగారి బండివాడు సమర్థుడేనని దారిలో రుజువయింది. ఏమంటే, వాడు ఒకచేత్తోనే బండితోలుతూ, రెండవ చెయ్యి వెనక్కు చాచి బండిలో ఉన్న పెద్దమనిషి పడిపోకుండా పట్టుకున్నాడు.

ఈవిధంగా మన కథానాయకుడు హోటలు చేరుకున్నాడు. అతనింకా వధువును గురించీ, గులాబీరంగుగల ఆమె శరీరచ్ఛాయను గురించీ, కుడిబుగ్గలో సొట్టగురించీ, ఖెర్యాన్ లో ఎస్టేటు గురించీ, పెట్టుబడి గురించీ అర్థంలేని వాగుడు వాగుతూనే ఉన్నాడు. ఎస్టేటు నిర్వహణకు సంబంధించిన ఉత్తరువులు కొన్ని సేలిఫాన్ కు కూడా ఇవ్వబడ్డాయి. కొత్తగా వచ్చిన కమతగాళ్లందరినీ ఒకచోటికి చేర్చి రోల్-కాల్ తీసుకోమని సేలిఫాన్ ఆదేశించబడ్డాడు. వాడు మాటాడకుండా ఈ వాగుడు చాలసేపు విని, బయటికివచ్చి పెత్రూష్కతో, “నువు వెళ్లి యజమాని దుస్తులు విప్పు!” అన్నాడు. పెత్రూష్క అందుకు ఉపక్రమించి, యజమాని బూట్లు ఊడదీయబోయి, యజమానినే మంచం మీదినుంచి కిందికి లాగేసినంతపని చేశాడు. ఎలాగైతేనేం బూట్లు వచ్చాయి, యజమాని దుస్తులు విప్పటంకూడా సక్రమంగా జరిగింది. అతను అటూ ఇటూ చాలాసార్లు పొర్లాడు, మంచం ఘోరంగా కిరకిరలాడింది. చివరికతను నిజమైన ఖెర్యాన్ భూస్వామిలాగే నిద్ర పోయాడు.

ఈలోపుగా పెత్రూష్క తన యజమాని ఇజారూ, కోటూ బయటి నడవాలోకి తీసుకుపోయి, వాటిని టోపీల స్టాండుమీద పరిచి, కొట్టి, బ్రష్ చేసి నడవ అంతా దుమ్ముతో నింపేశాడు. వాడు వాటిని తీయబోతూ పిట్టగోడ మీదుగా చూసేసరికి గుర్రాలశాల నుంచి వస్తూ సేలిఫాన్ కనిపించాడు. వారిద్దరి చూపులూ కలిశాయి, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. యజమాని నిద్రపోతున్నాడు, వాళ్ళు తమపని చూసుకోవచ్చు. వెంటనే పెత్రూష్క ఇజారూ, కోటూ లోపల ఉంచి, కిందికి దిగి వెళ్ళాడు. తాము వెళ్ళే పని గురించి ఒక్కమాట కూడా అనకుండా, దారిలో యితర విషయాలను గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరారు. వాళ్ళు ఎంతో దూరం పోలేదు, వాళ్ళు వెళ్ళినది వీధి అవతలివేపున, హోటలుకు ఎదురుగాఉన్న ఇంటికే. ఒకపొట్టి ద్వారంలోని మాసిపోయిన అద్దాల తలుపుకుండా వెళ్ళి వాళ్లు దాదాపు నేలమీది గదిదాకా దిగారు. అక్కడ బల్లలవద్ద అనేక రకాలవాళ్లూ, గడ్దాలు చేసుకున్న వాళ్ళూ, చేసుకోనివాళ్ళూ, సాదా గొర్రెతోళ్ళు ధరించినవాళ్ళూ, కేవలం షర్టులు మాత్రమే వేసుకున్న వాళ్ళూ, అక్కడక్కడా బొచ్చుతో వేసిన పైకోట్లు వేసుకున్న వాళ్లూ కూచుని ఉన్నారు. అక్కడ పెత్రూష్క సేలిఫాన్లు ఏం చేశారో దేవుడికే తెలియాలి. కాని ఒకగంట అయాక మళ్ళీ కలుసుకుని, మాటా పలుకూ లేకుండా, ఒకరిపట్ల ఒకరు ఎంతో శ్రద్ధచూపుతూ మలుపులు తిరిగేటప్పుడు ఒకరినొకరు సాయపడుతూ వచ్చారు. ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా ఒక పావుగంట సేపు శ్రమించి వాళ్ళు ఎలా గైతేనేం మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకున్నారు. పెత్రూష్క తన పొట్టి మంచం దగ్గిరనిలబడి, ఎటుగా పడుకుంటే బాగుంటుందా అనుకొని నిమిషం సేపు ఆలోచించి, చివరకు మంచానికి అడ్డంగా, కాళ్లు నేలమీదనే ఉండేలాగ పడుకున్నాడు. తాను అక్కడ పడుకోరాదనీ, నౌకర్లు పడుకునే గదిలోనో, లేకపోతే గుర్రాలశాలలలోనో పడుకోవాలని తట్టక, సేలిఫాన్ కూడా ఆ మంచం మీదనే, పెత్రూష్క పొట్టమీద తలపెట్టి పడుకున్నాడు. ఇద్దరికీ ఒక్క క్షణంలోనే నిద్ర పట్టేసింది; ఇద్దరూ మంద్ర స్థాయిలో గట్టిగా గురక పెట్టసాగారు. దీనికి జవాబులాగా, పక్క గదిలో పడుకున్న వాళ్ల యజమాని ముక్కులోనుంచి సన్నని ఈలలాటి శబ్దం తెప్పించాడు. తరువాత కాస్సేపటికి అంతా మాటుమణిగింది. హోటలు సుషుప్తిలో మునిగిపోయింది. కజాన్ నుంచి వచ్చిన లెఫ్టినెంటు గదిలో మాత్రం ఇంకా దీపం వెలుగుతూనే ఉన్నది. అతనికి బూట్ల పిచ్చి ఉన్నట్టుంది, అదివరకే నాలుగు జతలు కొని ఇప్పుడు అయిదోది తొడిగి, అదేపనిగా చూసుకుంటున్నాడు. ఎన్నోసార్లు అతను వాటిని విప్పేసే ఉద్దేశంతో పక్క వద్దకు వెళ్లాడు, కాని విప్ప బుద్ధి కాలేదు. అవి నిజంగా బాగా తయారుచేసినవి. అతను చాలాసేపు కూచుని, కాళ్లు ఎత్తి చాలా అందంగానూ, కుదురుగానూ చేసిన బూటు మడమలను పరీక్షించుకున్నాడు.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.