మతాలకు పాలకుల మద్దతు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది.

మతవిశ్వాసాలు కలిగినవారికి సామాన్యంగా వాటికి రాజకీయాలతో ప్రమేయం లేదని అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా మంచి మనస్తత్వమూ, సత్ప్రవర్తనా కలిగినవారంతా దేవుణ్ణి నమ్ముతారు. అంతేకాక తమ మంచితనానికి మతమే కారణమని భావిస్తారు. అయితే సామాన్యంగా దీనికి వ్యతిరేకమైన కారణం ఉంటుంది. మతాల్లోని మంచిలక్షణాలన్నీ వారి స్వభావం మూలంగానే రూపొందుతాయి. మంచివాళ్ళంతా దేవుణ్ణి నమ్ముతారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళంతా మంచివాళ్ళు కానవసరంలేదు. సిసిలీలోనూ, ఇటలీలోనూ పేరుమోసిన మాఫియా హంతకులూ, నేరస్థులూ కేథలిక్ మతాన్ని గట్టిగా నమ్మినవాళ్ళే. అసలు మతాలకూ పరలోకానికీ సంబంధమేమీ లేదు. ఉన్నదల్లా ఇహలోకపు సమస్యల గురించిన గొడవే.

ఇది ఈనాడు మొదలైనది కాదు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్ట్ నాగరికతల్లో దేవాలయ వ్యవస్థలూ, అర్చకవర్గాలూ తమ బలాన్ని పెంచుకున్నాయి. అక్షరాస్యత మొదలయిన యుగంలో అది పూజారివర్గాలకే పరిమితం అయి ఉండేది. గ్రహణాలూ, రుతువులనుబట్టి కురిసే వర్షాలూ, నైల్ నదికి కాలానుసారం వచ్చే వరదలూ వీటన్నిటి సమాచారమూ లెక్కకట్టి చెప్పగలిగిన అర్చకులు అదేదో దైవికశక్తి అని సామాన్యులను నమ్మించగలిగారు. విస్సన్న చెప్పిందే వేదమన్న పద్ధతిలో వీరు రోజువారీ జీవితాలను శాసిస్తూ, పాటు పడకుండా జీవించే మార్గానికి అలవాటుపడ్డారు. గుడ్డినమ్మకాలు పామరుల్లో ఎంత ఎక్కువగా వ్యాపిస్తే తమ అధికారం అంత పెరుగుతుందని వీరు త్వరలోనే గ్రహించారు. ఈనాటికీ పూజాది కార్యక్రమాల్లో ఇతరత్రా ఎంత బలమూ, అహంకారమూ ఉన్నవారైనా, పురోహితుడి అదిలింపులకు తల ఒగ్గినట్టే ఆధ్యాత్మికశక్తి పేరుతో అర్చకులు ప్రాచీనకాలంలోనే పెత్తనం చలాయించేవారు. ప్రాచీన ఈజిప్ట్ పాలకులలో కొందరు పాత దేవతలను ఈసడించుకుని కొత్త దేవతలనో, తమనే దేవతలు గానో ప్రతిష్ఠించుకునే ప్రయత్నాలు చేశారు. కాని అవేమీ సఫలం కాలేదు. రాజ్యాధికారమూ, మతాధికారమూ చెట్టాపట్టాలేసుకుని ఉంటేనే మంచిదని అనేక సందర్భాల్లో రుజువయింది.

ఉత్పత్తి సంబంధాలూ, కుటుంబ వ్యవహారాలూ, రాజకీయాలూ, నైతికప్రవర్తనా ఇలాంటి ఇహలోకపు విషయాలన్నిటిలోనూ, దేవతలూ, దెయ్యాల ప్రమేయం ఉంటుందని మతవిశ్వాసాలు నమ్మబలుకుతాయి. ఇటువంటి ఆర్థిక, తాత్విక చింతనలు రెండూ కలిసి సమాజంలోని సాంస్కృతిక దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయి. మతధోరణులే మన అవగాహననూ, సత్ప్రవర్తననూ శాసిస్తాయని అనుకోవడం పరిపాటి. ఇదొక సంప్రదాయంగా ఏర్పడి తరవాతి తరాలకు సంక్రమిస్తుంది. సమాజంలో వర్గాలు ఏర్పడినప్పుడు ఆర్థికంగా ముందున్న వర్గాలే ఈ తాత్వికచింతనను నిర్దేశిస్తూ ఉంటాయి.
సమాజాల్లో ఆర్థికబలం ఉన్న వర్గాలదే అధికారం అవుతుంది. ఎటువంటి మతవైఖరి తమకు అనుకూలమో ఆ వర్గాలకు బాగా తెలుసు. సుమేరియన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్ మొదలైన ప్రాచీన నాగరికతలలో కొన్నివేల ఏళ్ళ క్రితమే ఇటువంటి పరిణామాలు మొదలయాయి. ఆ కాలంనుంచీ అణగారిన వర్గాలన్నీ తాము గురవుతున్న దోపిడీకి తలవొగ్గి అదేదో దైవనిర్ణయమేనని నమ్ముతూ వచ్చారు. తమ కాళ్ళకు తామే బంధం వేసుకున్న పద్ధతిలో ఎన్నో శతాబ్దాలపాటు బడుగువర్గాలేవీ ఈ ‘దైవశాసనా’లను ధిక్కరించే ప్రయత్నంకూడా చెయ్యలేదు. అలా చేస్తే దైవికశక్తులు ఆగ్రహిస్తాయని వారు నమ్మారు. ఇదంతా సహజమేననీ, సామాజికసంక్షేమానికి తప్పనిసరిగా యథాస్థితిని కొనసాగించగలిగిన నియమాలన్నీ ఇలాగే ఉంటాయనీ వారికి అనిపిస్తూ ఉండేది.

‘పర’లోకం మాట ఎలాఉన్నా, ‘ఇహ’లోకంలోని విషయాల గురించిన వైఖరి ఎలా ఉండాలో నిర్వచించవలసిన బాధ్యతకూడా మతాధికారులకు ఉండేది. సమాజంలోని వ్యక్తులు పరస్పరం ఎలా సహకరించుకోవాలో, ఎటువంటి సాంఘిక నియమాలకూ, కట్టుబాట్లకూ లోనవాలో వారే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. విభిన్న వ్యక్తులూ, విభిన్న వ్యక్తిత్వాలతో కూడిన సమాజం సజావుగా నడవాలంటే కొంత క్రమశిక్షణ అవసరమవుతుంది. స్థిరజీవితాలు గడిపే వ్యవసాయసమాజాలు ఏర్పడ్డాక దీని ప్రాముఖ్యత పెరిగింది. ప్రజల మనోభావాలను మతపరంగా శాసించగలిగిన అర్చకవర్గం సమాజంలో బలమూ, రాజకీయ అధికారమూ ఎటువంటివారు హస్తగతం చేసుకుంటున్నారో గ్రహించి, వారికే వత్తాసుపలికే ధోరణిని అవలంబిస్తూవచ్చారు. రాజే దేవుడి అవతారమనీ, అతనికి తల ఒగ్గడం దైవనిర్ణీతమనీ బోధలు చెయ్యడం మనదేశంలోనేకాక పాత నాగరికతలన్నిటిలోనూ ఉండేది. ఎప్పుడో ఆటవికసమాజాల్లో ఉన్నట్టుగా ప్రజాసంక్షేమం కోసం బాధ్యతలు చేపట్టిన కులపెద్దల కాలం ముగిసింది. గారడీలూ, తంతులద్వారా చికిత్సకులుగా, గణాచార్లుగా మొదలైన పూజారులూ, పాలకులూ అధిక సంఖ్యాకులచేత శరీరశ్రమ చేయించి వాటి ఫలాలను పొందుతూ అధికారవర్గాలుగా కొనసాగారు. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ఎటువంటి నమ్మకాలనైనా జనబాహుళ్యంలో వ్యాప్తిచెయ్యడానికి వారు వెనకాడలేదు. దేవాలయాలకూ, రాజుకూ చెందిన ఆస్తులను దొంగతనం చేస్తే మరణశిక్ష విధించేవారు. వారికి చెందిన పశువులనో, గొర్రెలనో దొంగిలించడం పెద్ద నేరం. తగిన సాక్ష్యం లేకుండా బానిసలనుంచి వెండి బంగారాలు కొన్నవారు దొంగలుగా శిక్షకు పాత్రులయేవారు. బేబిలోనియాలో క్రీ.పూ. 1728 నుంచి 1686 దాకా రాజ్యంచేసిన హమ్మురబీ కాలంలోనే ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.

హామూరాబీ

హమ్మురబీ

చరిత్రలో ఏ యుగంలోనైనా విజ్ఞాన, సాంకేతికరంగాల్లో ప్రగతి కలిగినప్పుడల్లా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ, వాటినిబట్టి సామాజిక సంబంధాల్లోనూ చెప్పుకోదగ్గ మార్పులు కలుగుతూ ఉండేవి. ప్రకృతినీ, ప్రపంచాన్నీ గురించిన అవగాహనలో కొత్త వైఖరి తలెత్తేది. పాత నమ్మకాలన్నీ కాలంచెల్లినవి గానూ, తప్పులతడకగానూ అనిపించేవి. కొత్త భౌతికఅవగాహన ఉత్పత్తిసంబంధాలను తారుమారు చేసి, ఒకప్పుడు శాశ్వతమనిపించిన పాతకాలపు భావనలను చెత్తబుట్టలోకి నెట్టేస్తూ ఉండేవి. ఉదాహరణకు గ్రీస్లో క్రీ.పూ, ఏడో శతాబ్దంనాటికే వర్తకవాణిజ్యాలు పెరగడంతో మనిషే కేంద్రంగా ఒక కొత్త తాత్వికచింతన మొదలయింది. అంతకుమునుపు దేవతలకూ, దెయ్యాలకూ ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోయి భౌతికవాదదృక్పథం ఏర్పడింది. ఈ దశలోనే నిజమైన భౌతికశాస్త్రాలకూ, ప్రకృతి పరిశీలనలకూ మూలాలు ఏర్పడ్డాయి. ఈ ధోరణివల్ల పండిన పంటలోనూ, సంపాదించిన డబ్బులోనూ కొంత శాతం దేవాలయాలకు సమర్పించడం శుద్ధదోపిడీయేనని కొందరు విమర్శించేంతదాకా వెళ్ళింది.

సమాజంలో కూలీనాలీ చేసుకుని ఆహారోత్పత్తికీ, ఇతరరకాల ఉత్పాదకతకూ కాయకష్టం చేసేవారు నిత్యమూ తమకు కనబడుతున్న అసమానతను భరించాలంటే అదంతా చట్టబద్ధమేననీ, న్యాయసమ్మతమేననీ వారికి అనిపించాలి. ఇటువంటి నమ్మకాలను నెలకొల్పడమే పూజారివర్గాల పని. ఒకవంక పాలకుల శౌర్యపరాక్రమాలను అతిశయోక్తులతో కీర్తిస్తూ, వారి అధికారానికి దైవికమైన అనుమతి ఉన్నట్టుగా ప్రజల్ని విశ్వసింపజేయడమే వారి ధ్యేయం. మరొకవంక తాము ఎంత బలవంతులైనా దైవానికీ, దేవుడికి అనుసంధానం కుదిర్చే పురోహితులకూ లోబడే ఉంటామని రాజులు బహిరంగంగా చాటేవారు. ఇటువంటి ప్రచారం యథాస్థితి కొనసాగడానికి తోడ్పడుతూ వచ్చింది.

పోప్ రెండవ పయస్

పోప్ రెండవ పయస్

సమాజం ఇతరత్రా ఎంత పురోగతిని సాధించినప్పటికీ పాతసిద్ధాంతాలు నమ్మదగినవేనని ఆధ్యాత్మికవర్గాలు చెపుతూనే ఉంటాయి. యూరప్‌లో మధ్యయుగాల్లో పోప్‌వంటి మతాధికారులు క్రైస్తవదేశాలను జెరూసలేంమీద క్రూసేడ్ మతయుద్ధాలు చెయ్యమని ప్రోత్సహించిన కాలంలో మతానిదే పైచెయ్యిగా ఉండేది. 1458 నాటి పోప్ రెండవ పయస్ వంటివారు టర్కీమీద జరిగిన క్రూసేడ్లను సమర్థించారు. కాని సంస్కృతిక పునరుజ్జీవనం మొదలై, క్రైస్తవమతంలో చీలికలు ఏర్పడ్డాక ఆ మతాధికారుల బలం క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది.

మనదేశంలో మటుకు ఆధ్యాత్మికవాదులు ఎన్ని జిత్తులకైనా పాల్పడుతూ వస్తున్నారు. పాత కాలపు తంతులకు బెదరని, ప్రభావితంకాని ఆధునికులను బుట్టలో వేసుకునేందుకు చిత్ర విచిత్రమైన వాదనలను తెస్తున్నారు. అత్యాధునిక పరికరాలద్వారా అంతరిక్షంలో ఎంతో దూరాన ఏదో గామా విస్ఫోటనం కనబడిందన్న వార్తకుకూడా ఏ భగవద్గీతలోనో సాక్ష్యం ఉందని నిరూపించడానికి వీరు విశ్వప్రయత్నం చేస్తూఉంటారు. వర్ణవ్యవస్థకూ, కులవ్యవస్థకూ వత్తాసుగా వీరు ఏ వేదాన్నో, మనుధర్మ శాస్త్రాన్నో, భగవద్గీతనో ఉదహరిస్తారు. కళ్ళకు కనబడుతున్న అన్యాయాన్ని ఎవరూ ఎదిరించే ప్రయత్నం చెయ్యకుండా పునర్జన్మ సిద్ధాంతాలనూ, కర్మను గురించిన ప్రతిపాదనలనూ తెస్తూ ఉంటారు. సైన్సును నమ్ముకుంటే లాభంలేదనీ, వైజ్ఞానిక ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయనీ, ప్రాచీన ప్రవచనాలు మాత్రం శాశ్వతమనీ చెపుతారు. సైన్సులో అంతిమసత్యాలేవీ ఉండవనీ, కొత్త సాక్ష్యాలు లభించినప్పుడల్లా అవసరమైతే ఉన్న సిద్ధాంతాలను సవరించుకోవడానికి విజ్ఞానం వెనకాడదనీ సామాన్యులకు అర్థంకాదు. జాతకాలూ, పూజలూ, శాంతులూ సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెట్టగలవనే నమ్మకం అధికారవర్గాలు బుద్ధిపూర్వకంగానూ, భావవాదులు అవివేకంతోనూ ప్రచారం చేస్తారు. సమాజాన్ని తమ చెప్పుచేతలతో ఉంచుకోవాలంటే హేతువాదాన్నీ, భౌతికవాదాన్నీ ఎవరూ నమ్మకుండా చెయ్యడమే ముఖ్యమని వీరికి బాగా తెలుసు.

————————

కొడవటిగంటి రోహిణీప్రసాద్కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to మతాలకు పాలకుల మద్దతు

  1. srinivas says:

    * సమాజాన్ని తమ చెప్పుచేతలతో ఉంచుకోవాలంటే హేతువాదాన్నీ, భౌతికవాదాన్నీ ఎవరూ నమ్మకుండా చెయ్యడమే ముఖ్యమని వీరికి బాగా తెలుసు.*
    ప్రసాద్ గారు,

    ఈ మధ్య ఇండియా లో మీరు పైన చెప్పిన సమాజాన్ని తమ చెప్పుచేతలలో ఉంచు కోవ్వలనుకున్న వర్గం పరిస్థి తెలిసినట్లు లేదు. ఒక సారి ఈ క్రింద లింకుల ను చూసేది. ఆ వర్గం వారు అంత చెప్పు చేతల లో అందరిని ఉంచు కోవనకుంటె వారిలో అధిక శాతం అంత దరిద్రం లో ఎలా ఉంటారు? ఇక నుంచైనా ఆ వర్గం మీద రాళ్ళు విసరటం మానాలి లేక పోతె ఇంకొక 10సం||ల లో ఆ వర్గం భారత దేశం లో మాయమై పోయె పరిస్థి వచ్చింది. భారత దేశ పూజారి వర్గానికి యురోప్ పూజారి వర్గానికి ఎంతో తేడా ఉంది. అది మీకు తెలియంది కాదు. ఇక్కడ మా ఉరి పల్లెలలో పూజారి కి గుడి లో జీతం కూడా నెలకు సరిగ్గా ప్రభుత్వం నుంచి రాదు . అదే మా పల్లెలో ఇప్పుడు మూడు చర్చ్లు ఉన్నాయి. ఒకటి పాతది, రెండవది గత సం || కట్టారు. మూడవది కడుతున్నారు. ఎందుకంటె వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కనుక.

    http://www.rediff.com/news/2006/may/23franc.htm

    http://www.youtube.com/watch?v=P7Xgc4ljHKM

    షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, యు.జి. కృష్ణమూర్తి,నిసర్గ దత్త మహరాజ్ వీరిలో ఎవరు ఫోని ? ఇటువంటి వారు చెప్పిందే బ్రాహ్మణ వర్గం వారు చాలామంది ఫాలో అయ్యారు. మీరు ఒప్పుకున్నా లేకున్నా మిగతా వాటి తో పొలిస్తె హిందూ మతం లో నే ఎక్కువ రిఫాంస్ జరిగాయి, జరుగుతున్నాయి, జరుగు తాయి కూడాను. going foward అభ్యుదయ వాదులు 70 సం || లా పూజారి వర్గాన్ని విమర్శించటం ఆపుతారని ఆశిస్తాను. లేక పోతె ఈ దేశ పూజారి వర్గాన్ని యురోప్ పూజారివర్గం తో పోల్చుకొని నేటి యువ పాఠకులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు.

  2. Rohiniprasad says:

    మతాల పేరుతో విస్తరించిన భావజాలం తాను చెయ్యవలసిన హాని యావత్తూ ఎప్పుడో చేసేసింది. ప్రస్తుతకాలంలో పైచెయ్యి సాధించిన బ్రాహ్మణీయ భావాలన్నీ బ్రాహ్మణవర్ణానికే పరిమితమైనవి కావని గుర్తించాలి. అలాగే పాలకవర్గాలేవీ ఒకప్పటి క్షత్రియవర్ణానికి పరిమితమైనవికావు. మహాపద్మనందుల కాలానికే (క్రీ.పూ, నాలుగో శతాబ్దం) వెనకబడ్డ కులాలు రాజ్యాధికారం పొందాయి. ఈనాడు మతాలనూ, పాలకులనూ విమర్శించడం బ్రాహ్మణులనూ, క్షత్రియులనూ విమర్శించడమని ఎవరూ పొరబడరాదు. నేటి వ్యవస్థలో వర్గాలూ, కులాలూ ఎన్నోరకాలుగా హెచ్చుతగ్గులకు లోనయాయి. జరగవలసినదంతా జరిగిపోయాక ఎన్ని సంస్కరణలు జరిగినా ఉపయోగంలేదు. తప్పుడు భావజాలం సమసిపోవాలంటే ప్రజల్లో భౌతికవాద దృక్పథం రూపొందడం తప్ప మరో మార్గంలేదు. ఇందులో ఏ కులాన్నీ కించపరచాలనే ఉద్దేశంలేదు. ఆర్థికంగానూ, సామాజికంగానూ ఎందరో కష్టాలపాలవుతున్నమాట నిజమే. వీటన్నిటికీ పరిష్కారం ప్రగతివాదశక్తుల ద్వారానే లభించాలి. కేవలం జాలిపడి లాభంలేదు.

  3. Vivekananda says:

    Sub: A NOT APPLICABLE.. OUT OF CONTEXT….article

    Helllo Sir,

    I have read the article and i dont think the discussion done is not taking the “Current” generation into consideration.

    What you talked was just like a page from a “History” book which has no value or meaning or connection to thee current happennings.

    Re write your article on how the rulers are supporting “Muslims” or “SCs” and STs just for Vote banks.

    This article is just again a “Dusty” “Crooked” and OLD “Communist” way of thoughs which doesnt apply..!

  4. Rohiniprasad says:

    Mr. Vivekananda, You are welcome to ignore ‘dusty’ articles. Pl do not direct authors to write on topics of your choice.

  5. ssdrao says:

    సమాజంలో మతం పాత్రని వస్తుపరంగా విశ్లేషించిన గొప్ప రచన. రోహిణి ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

Comments are closed.