మగ దీపం

— ఎం. ఎస్. నాయుడు

ఒక చెట్టు,

మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో,

నదిలో కలిసే సముద్రపునీటి గాలినో

వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది.

ముడతలు లేని కొమ్మలపై వాలని
నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది.

ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు
సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే,

ఇల్లు ముక్కలైంది.

మునుపటి మొక్కలూనూ.కీటకాలూనూ.

ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది.

దారిలేని చీకటి బిందువులు అభయమివ్వవు.

భయపెట్టే అవిభాగ కపట పదాలే ఆత్మీయులు. నిద్ర ఒద్దులే.

లిప్ స్టిక్ లిపిలో దాగున్న ప్రేమలు తుడుసుకుంటున్నా,

కొన్ని మరకలు అరమరికలు లేకుండా నవ్వుతాయి.

కాగి ఎగిరే వయసే, వికృత హస్తాలతో ఆహ్వానిస్తోంది.

అందుకునే కలల పాదాలపైన ఉరితాళ్ళు.

అంతరించని పగటి ప్రగతి పులివేషాలు.

స్మరణార్ధుల సమాధుల్లో ఉండకే,

అంత్యక్రియలు లేవు వాటికి.

చీలిన కంటిపాపల్లో బొడ్డులేని కన్నీళ్ళు.

నర్తించు మూస మనుగడలో అని

చెట్టు లోపలి రాత్రి

ఒక మధ్యాన్నపు గాలిని ఎగరగొట్టింది.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

3 Responses to మగ దీపం

  1. m.s. naidu గారు తెలుగు సాహిత్య రంగంలో పేర్గాంచిన కవి. “ఒక వెళ్లిపోయాను” కవితా సంకలనంతో అలజడి రేపి తనని తాను నిరూపించుకొన్న భావుకుడు. వీరి కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు ఉంటాయి. ఒక మత్తులోకి లాక్కెళ్తాయి. భావం కనపడీ కనపడకుండా దోబూచులాడి నేను చెప్పేది ఇంతవరకే ఆపై నీ ఊహకు పనిపెట్టుకో అంటూ అదృశ్యమైపోతూంటుంది.

    ఇలాంటి కవిత్వంలో జీవితంలో ఎన్ని అసంగతాలు, మార్మికతలు, అస్ఫష్టతలూ ఉన్నాయో అన్నీ ప్రతిబింబిస్తాయి. చెప్పేది ఎంతైతె ఉంటుందో చెప్పనిదీ రెట్టింపు ఉంటుంది. అచ్చు జీవితం లానే. మరి ఇలాంటి కవిత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఏ భూషణ్ గారో చెపితె వినాలని ఉంటుంది నాకెపుడూ.

    ఇక ఈ కవితగురించయితే

    ఎత్తుగడ గొప్ప వ్యూహంలా తోస్తుంది.
    మబ్బులు ముసిరిన మద్యాహ్నం నవ్వుతో కూర్చుందట (సూర్యుడు నిద్రపోతున్నాడాయె మరి). ఇంతలో కవి మనోలోకంలో ప్రయాణం మొదలైంది. ఇక అక్కడనుంచి ఒక స్ట్రీం ఆఫ్ కాన్షయస్ నెస్ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆలోచనకీ ఆలోచనకీ పొంతనలేకపోవటం కూడా వివిధ పదచిత్రాల గొలుసుకట్టు లో ఇమిడిపోతుంది. ఏమిటటా, ఏమౌతుందీ అనుకొనె లోపే కవిత ముగిసిపోతుంది.

    దేహమనే చెట్టులోపలి రాత్రి మధ్యాహ్నాన్ని ఎగరగొట్టిందనటం ఒక నిరాశలోకి జారిపోవటమా? లేక ఆలోచనలు ఒక తీరాన్ని చేరుకొన్నాయన్న సూచనా?

    ఏది ఏమైనా కవిత్వంలో అస్పష్టత పాఠకుని అయోమయానికి గురిచేస్తుందనటంలో సందేహమేమీ లేదు. కానీ ఇలాంటి కవిత్వాలలో కనిపించే పదచిత్రాలు మాత్రం చీకటి ఆకాసంలో మెరిసే విద్యుల్లతల్లా ఉండి, (ఉదా: చీకటి బిందువులు అభయమివ్వవు, లిప్స్టిక్ లిపిలో దాగున్న ప్రెమలు, మరకలు అరమరికలు లేకుండా నవ్వటం వంటివి) గొప్ప అనుభూతిని మిగుల్చుతాయి.

    ఒక్క రసాత్మక వాక్యం కోసం శ్రమిస్తే తప్పేంటి అని ఎవరో అన్నట్టు లేదా “మో” గురించి “తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే భరిస్తాం” అని చేరా గారు అన్నట్టో – మొత్తం మీద కవిత బాగుంది.

    అంతర్జాలానికి నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. వారి బ్లాగు : http://msnaidu.blogspot.com/

  2. ఆధునిక సంక్లిష్ట జీవనాన్ని ‘మగ దీపం’ లో నాయుడు బాగా వ్యక్తీకరించారు నాయుడు పదచిత్రాలూ , భాషా(diction) విభ్రమ పరుస్తాయి
    ఐతే పద ద్వయాన్ని వాడుతూ’మొక్కలూనూ.కీటకాలూనూ’అనడం కృతకంగా వుంది

    మొక్కలూ కీటకాలూ అని గాని , మొక్కలూ కీటకాలూనూ అని గాని వాడాలి
    రెండు వేరు వేరు పదాలను కలిపి, ప్రత్యయం రెండో పదాన్తాన వాడాలి
    ఐతే ఇలాగే వాడాలనేది వెనకటి మాట .
    కాని కొత్త పదబంధాలు గజి బిజి పరచకూడదు

    ”ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు
    సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే,”

    ”లిప్ స్టిక్ లిపిలో దాగున్న ప్రేమలు తుడుసుకుంటున్నా,
    కొన్ని మరకలు అరమరికలు లేకుండా నవ్వుతాయి.
    కాగి ఎగిరే వయసే, వికృత హస్తాలతో ఆహ్వానిస్తోంది.
    అందుకునే కలల పాదాలపైన ఉరితాళ్ళు.
    అంతరించని పగటి ప్రగతి పులివేషాలు.”-

    ఈ పాదాలన్నీ జీవితాన్ని పారదర్సకపరుస్తున్నై
    ‘మగ దీపం’ పోస్ట్ మోడరన్ పద చిత్రాల మంచి కవిత

  3. arun kumar says:

    ఇప్పుడొస్తున్న కవితల్లో నాయిడు గారి కవితలు చాలా బాగుంటున్నాయి. తెలుగు కవితాలోకానికి ఓ ఆణిముత్యం నాయిడు గారు. ఇది ఇప్పుడు నేను చెబుతున్న మాట కాదు….’ఒక వెళ్ళిపొతాను ‘ తోనే ఋజువు చేసుకున్నారు. నాయిడు గారు మీ కవితల్లో క్లోరోఫాం వుంది. చదువుతుంటే ఏదో మైకం కలుగుతుంది. మైకంలో మీ మనో నేత్రాన్ని చూపిస్తున్నారు. మెలకువలేని నిద్రలో ఓ తీయటి స్వప్నం. లోలోపలే ఎన్నెనో అంతఃసంఘర్షణలు. మన్సుని ఇతగాడి కవిత్వం పట్టి కుదిపేస్తుంది. చలిస్తున్నానో జ్వలిస్తున్నానో తెలీకుండావుంది. ఏ ప్రపంచంలోకి అడుగు పెట్టామో అర్ధం కాకుండా వుంది. ఎక్కడున్నామో తెలుసుకోవాలన్న ప్రయత్నానికి వెనువెంటనే మొదలైయ్యే రెండో వాక్యం ఆలోచనల్ని గుక్క తిప్పుకోనీయడం లేదు. అందుకే నేనంటాను ఇది నాయిడు గారి అత్మ నివేదనని . కాదంటారా? కవితా వస్తువు మీకెలా దొరుకుతోంది? చాలా కాలం తర్వాత స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ని. మరొ చిన్న మాట…అంత డెప్త్ కి తీసుకునివెళ్ళి ఒక్కోసారి అకస్మాత్తుగా నిద్రలేపేస్తున్నారేమిటి?
    అరుణ్ మరపట్ల

Comments are closed.