నాగమురళి బ్లాగు – సమీక్ష

-రవి

Cogito, ergo sum….
ఆ లాటిన్ వాక్యానికి అర్థం, “I think, therefore I am”. సుప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్త, భావవాద (idealism లేదా essentialism) ప్రముఖుడు, నిరూపక జ్యామితి, రేఖాగణితాల (co-ordinate geometry) రూపకర్త రెనీ దె కార్తె వ్యాఖ్య అది. సరిగ్గా అదే మకుటంతో దాదాపు ఓ సంవత్సరం క్రితం (2007, నవంబరు) ఓ బ్లాగు మొదలయ్యింది. ఆ బ్లాగు నాగమురళి గారిది. కేవలం ఆలోచింపజేయటమే కాక, ఓ చక్కటి అనుభూతిని అందించగలిగిన బ్లాగుల్లో నాగమురళి గారి బ్లాగు చెప్పుకోదగింది.

నాగమురళిబ్లాగు

ఓ చిన్న విషయం.

Our thoughts jump from one conclusion to another conclusion – అంటాడు కృష్ణాజీ. అయితే చాలా కొద్ది మంది మాత్రం తమ ఆలోచనలను పరిశీలనకు ప్రాతిపదికగా ఎన్నుకుంటారు. ఓ దృక్కోణంలో భావం గ్రహించాలంటే, fixed stance ఉండనవసరం లేదు. అనుభవం వల్ల, చర్చల వల్ల మాత్రమే జ్ఞానద్వారపు కపాట విపాటనా సాధనం ఉన్నది. ఇది మురళి గారి భావం. ఈ భావాలు ఈయన టపాలలో, టపాల ద్వారా సాగించిన చర్చల్లో, ఇతర బ్లాగుల్లో పాల్గొని వ్యాఖ్యల ద్వారా చేసిన అభివ్యక్తీకరణల్లో అద్భుతంగా ప్రతిఫలిస్తాయి.

ఆ టపాలు చదివిన తర్వాత మనకూ అలాంటి వ్యక్తులతో పరిచయమైతే ఎంత బావుణ్ణు అనో, మన జీవితంలో తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించో ఆలోచన మళ్ళుతుంది.

పొద్దు సంపాదకులు ఆయన బ్లాగు మీద సమీక్ష వ్రాయమన్నప్పుడు, ఓ పక్క కుతూహలపు డ్రం బీట్సూ, ఇంకో పక్క, “అంత సీను నీకు లేదులే”అన్న అంతరాత్మ సణుగుడు రెండూ కలిసి, డీటీయెస్ ఎఫెక్ట్ లో వినిపించాయ్. ధైర్యే సాహసే సమీక్షా అని మొదలుపెట్టా. ఇది నిజంగా సాహసమే.

బ్లాగుల్లో 2 రకాలు. మొదటి రకం – వీటి గురించి పరిచయం చేయాలంటే, ఆ బ్లాగు లంకె ఇస్తే చాలు. అక్కడకెళ్ళి, ఆ లంకె బిందెల్లో ముత్యాలు ఏరుకున్న తర్వాత అవసరమైతే ఆ లంకె బిందె కంచుదా, ఇత్తడిదా అని తీరిగ్గా ఆలోచించవచ్చు. ఇక రెండవ రకం – వీటి గురించి తెలుసుకోవాలంటే మొదట ఆ బ్లాగు తాలూకు రచయిత వివరాలు, ఆయన వృత్తి, వ్యాపకాలు తదితర వివరాలు తెలుసుకోవడంతో ఉపక్రమిస్తే బావుంటుంది. ఓ చక్కని కర్ణాటక సంగీతపు కృతిని ఆస్వాదించాలంటే, కూసింత స్వరజ్ఞానం, మరింత చ(చి)క్కటి అనుభూతికి దోహదం చేసినట్టుగా.

ఆ ఉద్దేశంతోనే ఈ బ్లాగరి గురించి ఆరా తీస్తే ఈ వివరాలు దొరుకుతాయి. ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు, గత కొన్నేళ్ళుగా విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాల మధ్య జీవనం సాగిస్తున్న వాడు, పైగా 15 యేళ్ళ వరకు పాఠశాలలో సంస్కృత పరిచయం పెద్దగా లేక, హిందీని వెలగబెట్టిన ఓ వ్యక్తి, కాళిదాసు కుమార సంభవం, మేఘ దూతం , భవభూతి ఉత్తర రామచరితం, మాఘం ఉటంకిస్తూ వ్యాఖ్యానించడం, పైగా సొంతంగా సంస్కృత శ్లోకాలు రాయటం, కొండొకచో తెలుగు పద్యాలు అల్లడం, తెలుగు లాంటి సంస్కృతం మీద ఓ వ్యాసం, జ్యోతిష్యం మీద వివరణా, ఇంతలోనే సాల్మన్ రష్దీ గురించి ఓ వివరణా, తెలుగు సినిమాల మీద విసుర్లు, ….ఇన్ని ఒకే వ్యక్తి చేయగలడు, ఓ వ్యక్తిలో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయి అని ఎవరైనా చెబితే, “సరేలే విన్నాం లెండి” అని కొట్టిపారెయ్యడం కద్దు.

ఏంటి, నమ్మట్లేదు కదూ? ఓ సారి ఇక్కడకు వెళ్ళి కైలాస శిఖర దర్శనం చేసి, వస్తూ వస్తూ వీలయితే, ఈ తామర తూడోపాఖ్యానం అనుభూతిలో మునిగి రండి. ఆ తర్వాత ఈయనెవరో అసాధ్యుడిలా ఉన్నాడే అని ఓ కొత్తపాళీ అనుకున్నట్టుగా మీరూ అనుకోకపోతే నా మీదొట్టు.

ఇక ఈ బ్లాగు, కేవలం సాహిత్య చర్చే కాక సున్నితమైన హాస్యం, బాల్యంలో అనుభూతులను రంగరించిన చిక్కటి కలబోత – అన్నం, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయతో కలిపి లాగించినట్లుగా. అంతలోనే, బ్లాగరి తన అనుభవాల్లోకి వెళ్ళి, తను కలుసుకున్న విశిష్ట వ్యక్తులను గురించి మరింత విశిష్టంగా చెప్పగలరు. ఆ టపాలు చదివిన తర్వాత మనకూ అలాంటి వ్యక్తులతో పరిచయమైతే ఎంత బావుణ్ణు అనో, మన జీవితంలో తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించో ఆలోచన మళ్ళుతుంది.

తెలుగు బ్లాగర్లు – కాదు కాదు, తెలుగు “చంపిలు” (చందమామ పిచ్చోళ్ళు) ఆనందంతో, ఆన్ లైన్ లోనే కావలించుకునేంతగా ఋణపడిపోయారీయనకు. ఎందుకంటే, నింగినున్న చందమామను నేలపైకి ఎవరో తీసుకొస్తే, ఆ జాబిల్లి చిరునామాను వెతికి, ఆ వెలుగులను నలుగురికీ పంచారీయన. బహుశా, ఈ ప్రోద్బలమే కాబోలు, మరో చంపి జాబిలమ్మ తాలూకు తోకచుక్కలను, మకర దేవతలనూ క్రోడీకరించి నెజ్జన సేవ చేశాడు. అదే జావాగ్రేసరుడు మరింత ముందుకెళ్ళి, జాబిలమ్మను మన ఇళ్ళకు రప్పించుకునే మార్గం సుగమం చేశాడు. అదే స్ఫూర్తితో బాల (బాలజ్యోతి లవర్) లకు కూడా ఎవరైనా వరద హస్తం చూపిస్తారేమో అని ఓ ఆశ.

బ్లాగ్లోకానికి ఈయన ఇంకో సమర్పణ శ్రీరమణ రచనల లంకె.

ఇంకో విషయం. మంచి టపాలు రాయటం ఓ గొప్ప విషయమైతే, ఆ టపా ద్వారా ఓ స్ఫూర్తిని కలిగించి, ఇంకొక మంచి టపా రాయడానికి ప్రేరేపించడం, లేదూ కనీసం ఆలోచింపజేసే వ్యాఖ్యలను రాసేలా ప్రేరేపించగలగటం ఓ గొప్ప విషయం. బ్లాగ్లోకంలో అలాంటి స్ఫూర్తిని అందిస్తున్న కొన్ని బ్లాగుల్లో ఈ బ్లాగు ఒకటి, ఇక్కడ ఈ టపా ద్వారా బ్లాగు సన్యాస దీక్ష పుచ్చుకున్న బ్లాగ్రాజులు కూడా స్పందించడం, చక్కటి స్పందన బ్లాగ్లోకానికి అందించటం ఓ గొప్ప …(“గొప్ప” అన్నది ఇబ్బందికరం అయినట్లయితే “మంచి”) సంఘటన.

నాణేనికి అటు వైపు పరిశీలిస్తే, ఈ బ్లాగరి అభిప్రాయాలకు విరుద్ధమైన టపాలు కూడా అప్పుడప్పుడూ బ్లాగ్లోకంలో కనిపిస్తుంటాయి. అక్కడ ఈ బ్లాగరి వ్యాఖ్య కూడా దీన్ని ప్రతిబింబించడం కద్దు. అయితే అలా జరిగిన చర్చలు అన్నీ కూడాను సుహృద్భావ వాతావరణంలో ముగియడం ఓ విశేషం. అలానే ఇంకొక్క ససందర్భ ప్రేలాపన: వివిధ సందర్భాల్లో నాగమురళి గారు చేసిన వ్యాఖ్యలు (వాటికి సమాధానాలు కూడా) కొన్ని కొండవీటి చేంతాళ్ళలా గహనంగా మారాయి. బహుశా అనేక విషయాలు స్పర్శించటం వల్ల, భావాలను సాధ్యమైనంత విశదంగా చెప్పాలనే ఆరాటం వల్ల వచ్చిన చిక్కేమో. ఈ మధ్య ఈ విషయం ఆయన కూడా గమనించారనిపిస్తున్నది.

ఏతావాతా ఓ ముక్కలో చెప్పాలంటే “నాగమురళి గారి బ్లాగు చదవటం మీ ఉత్తమాభిరుచికి నిదర్శనం”. ఈ వాక్యం నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం – చదవండి. అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండండి. ఆణిముత్యాలు కూడా దొరకవచ్చు.

ముగింపు:

Cogito ergo sum – ఈ వాక్యానికి ఇంకో అర్థం కూడా ఉందట.అది ” I doubt, therefore I am”. ఇది మాత్రం ఈ సమీక్షకుడికి నప్పుతుంది. ఎందుకో చెప్పాలంటే, ఈ చర్చ ఆసాంతం చదవాలి.

అయితే, భావాలు వేరైనా, మూల సూత్రం ఒకటే అయినట్టుగా, అంత చర్చా జరిగినా, మురళి గారి మీద గౌరవం ఎక్కువయ్యింది కాని తగ్గలేదు. బ్లాగు లోకంలో ఓ మంచి చర్చలో, ఆదర్శవంతమైన చర్చాపద్ధతిలో, నేనూ (సమీక్షకుడు) భాగస్వామి అవడం నా అదృష్టం.

అయితే నావరకు ఈయన మీద కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. మురళి గారు ఆయన ప్రతిభకు తగ్గ టపాలు ఇప్పటి వరకు musings లా రాశారు. అయితే ఈయనకున్న విస్తృత పరిశీలనాదృక్కోణం, పాశ్చాత్య జీవనవిధానంతో ఈయనకున్న పరిచయం, ఆంగ్ల సాహిత్య పఠనంలో ఉన్న అభినివేశం, మిత్రులు, వాళ్ళ అనుభవాలు – వీటి క్రోడీకరణతో చక్కటి టపాలు అటు సాహిత్యానికి సంబంధించి, ఇటు భౌతిక జగత్తుకు సంబంధించి, పరిశీలనా ప్రాతిపదికగా రాయాలని నా ఆకాంక్ష.

అలానే అంతర్జాలంలో జరిగే కవితా గోష్టుల్లో ఈయన పాల్గొంటే బావుంటుంది.

అలాగే, సంస్కృత కవుల రచనా చమత్కృతి, కవిహృదయం, అప్పటి వారి రచనల్లో సమాజ పరిశీలన – వీటి మీద కూడా ఓ కన్నేయాలి.

ఇంకా …. బోల్డన్ని అభ్యర్థించవచ్చు. అయితే, ఆయన తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంతటితో ముగిస్తాను.

కొస మెరుపు : ఓ మంచి అభిరుచి గల బ్లాగరి మీద ఇంకో మంచి అభిరుచి గల బ్లాగరి స్పందిస్తే ఇలా ఉంటుంది.

******************************************

రవి

రాయలసీమలో పుట్టి, పెరిగిన రవి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. అభిరుచులు, ఆసక్తులు అనేకం ఉన్నా, సాధికారత, సమగ్రత, ఏ విషయంపైనా లేదనే రవి, ప్రతీ విషయాన్ని తరచి ప్రశ్నించే తెలుగు ‘వాడి ‘ పౌరుషానికేం తక్కువ లేదంటున్నారు. బ్లాగాడిస్తా పేరుతో బ్లాగుతూంటారు.

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

13 Responses to నాగమురళి బ్లాగు – సమీక్ష

  1. చంద్ర మోహన్ says:

    బంగారానికి తావి అద్దినట్లు, మంచి బ్లాగుపై అందమైన సమీక్ష! నాగమురళి గారి బ్లాగునుండి స్ఫూర్తిపొందిన బ్లాగడం ప్రారంభించినవారిలో నేనూ ఒకడిని.

    సమీక్షకుడిగా మీకు వందకు తొంభై మార్కులేసుకోండి!

  2. sravya says:

    బ్లాగు ఎంత బాగుందో సమీక్ష కూడా అంత బాగుంది !

  3. durgeswara says:

    naaga muraligaari

    blaagu lotulanu chaalaa chakkagaa tadimaaru.

  4. రాఘవ says:

    చక్కటి సమీక్ష. రవిగారూ, మీకూ మురళిగారికీ… ఇద్దరికీ అభినందనలు.

  5. మంచి సమీక్ష. బాగుంది.

  6. బ్లాగంతటి సమీక్ష…!బాగుంది పసందుగా!

  7. ఆటవెలది:-
    నాగమురళి బ్లాగు నయత నవ్యతలకు
    పెట్టినదియె పేరు. పేర్మి గాంచె.
    సమ్యగీక్షణమున సరస సమీక్షయు
    నద్భుతముగనుండి యలర జేసె.
    {ఆంధ్రామృతం బ్లాగ్}

  8. నా బ్లాగుని అద్భుతంగా సమీక్ష చేసిన రవి గారికి, ప్రచురించిన పొద్దు సంపాదకులకి, సహృదయంతో స్పందించిన మితృలందరికీ నా ధన్యవాదాలు.
    ఇప్పటివరకు నేను రాసినవి సమీక్షించతగినంత పరిణతి కలిగినవి కావనే నేను అనుకుంటున్నాను. అయినా నాకు ఇంత ప్రోత్సాహాన్నిచ్చారంటే దానికి మీ అందరి సహృదయత మాత్రమే కారణం.

    రవిగారి సూచనలు తప్పకుండా శిరసా వహిస్తాను. ఇంకొంచం సీరియస్ రచనలు చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

  9. parimalam says:

    రవిగారి సమీక్ష బాగుంది.నాగమురళిగారికి, అభినందనలు.

  10. రవి says:

    రామకృష్ణా రావు గారు,

    ఓ చిన్న అనుభూతి, మీ పద్యం చూడగానే.

    ఓ చంటి కుర్రాణ్ణి, మొదటి సారి పాఠశాలకు పంపేప్పుడు –
    చక్కగా క్రాఫు దువ్వి,
    కొత్త పలకా, బలపం కొనిపెట్టి,
    కొత్త చొక్కా,లాగు తొడిగి,
    నుదుటిన బొట్టెట్టి,
    బుగ్గన ముద్దెట్టి,
    స్కూలుకు పంపిన అమ్మ, ఓ ముఖ్య విషయం, అది – దేవుడికి దణ్ణం పెట్టటం, మరిచిపోయినట్టుగా….సమీక్షను సాధ్యమైనంతగా తీర్చిదిద్దినా, ఓ వెలితి. ఆ వెలితి మీరు తీర్చారు. ఓ చక్కటి ఆటవెలది పద్యంతో.

    సరస్వతీ పుత్రులయిన మీకు వందనాలు తప్ప వేరే ఏమీ సమర్పించుకోలేను.

    చంద్రమోహన్, శ్రావ్య గారు, దుర్గేస్వర గారు, రాఘవ, సుజాత గారు, సత్యసాయి మాస్టారు, పరిమళం గారు, మీకందరికిన్నీ కూడా కృతజ్ఞతాభివందనాలు.

  11. నేను కూడా మీకు లాగే చందమామ పిచ్చోణ్ణే. నా బాల్యం నుంచి గత 35 సంవత్సరాల పైగా చందమామతో జ్ఞాపకాల చిత్తడిలో తడిసి ముద్దవుతున్నవాడినే. చెన్నయ్‌లో ఓ వెబ్‌సైట్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న నేను, ఆన్‌లైన్ చందమామ పిలిచి మరీ అఫర్ ఇవ్వడంతో ఎగిరి గంతేసి మరీ ఈ జనవరిలో అసోసియేట్ ఎడిటర్‌గా చేరాక గత నాలుగు నెలలుగా చందమామ గత చరిత్ర అన్వేషణలో మునిగి తేలుతున్నాను.నాలాంటి కొన్ని వందలమంది తెలుగు నేలపై, ప్రపంచం నలుమూలలనుంచి మన జాతి సంపద అయిన చందమామను ఇంత అపరూపంగా, హృద్యంగమంగా గుండెలకు హత్తుకుంటున్న వైనాన్ని ఆన్‌లైన్ అన్వేషణలో రోజూ చూస్తూ మూగగా ఏడుస్తున్న పరిస్థితి నాది. కొకు వంటి దిగ్ధంతులు దశాబ్దాలుగా ప్రాణం పోసిన చందమామ నీడలో నిలబడి తెలుగు కథా సౌరభాన్ని కొద్ది కొద్దిగా పీల్చుకుంటున్న చిన్నవాడిని. కాని ఈ రోజు అంటే 2009 మే 8-9 తేదీల మధ్య తెల్లార్లూ నెట్‌లో మీలాంటి వారిని గాలిస్తూ, పాత చందమామలకోసం మీ ఆరాటాన్ని చూస్తూ ఉప్పొంగుతున్న భావాలను అణుచుకోవడానికి విశ్వప్రయత్నం చే్స్తున్నాను. ఆన్‌లైన్ చందమామలో నా బాధ్యతల పరిధిని దాటి చందమామ చరిత్రను, ఇంతవరకు వెబ్‌సైట్లలో చందమామపై వచ్చిన సమస్త వివరాలను, వ్యాసాలను ఒక చోట గుది గుచ్చాలనే తపనతో ఈ మధ్యే chandamamatho.blogspot.com ను రూపొందించుకుని ఒకటొక్కటిగా దొరికిన వాటిని దొరికినట్లుగా పోస్ట్ చేస్తున్నాను. నా స్పందన మీలో ఎవరయినా చూసినట్లయితే నా వ్యక్తిగత ఈమెయిల్ ఐడి krajasekhara@gmail.com కు మెయిల్ పంపండి. చందమామ ప్రింట్, ఆన్‌లైన్ రెండింటినీ పదికాలాలపాటు బతికించుకోవాలంటే మీలాంటి మంచి పాఠకులు నిరంతరం చందమామతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలను పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాత కొత్తల మేలుకలయికగానే కాక కొత్త గెటప్‌,కొత్త కంటెంట్‌తో పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామకు మీ ప్రోత్సాహం, ఆదరాభిమానాలే జవజీవాలను ఇస్తాయి. ఆర్తిక ఇబ్బందులు, తదితర పలు కారణాల వల్ల చందమామలో పనిచేసే వారి సంఖ్య కురచబడి, అన్ని బాద్యతలూ ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే మోయవలసిన పరిస్తితుల్లో అనివార్యంగా చందమామలో దొర్లుతున్న లోపాలు, అచ్చుతప్పులు తదితరమైన మీరు గుర్తించిన ప్రతి అంశానికి మేం వినమ్రంగా క్షమాపణ కోరుతున్నాం. మీరూ మేమూ కలిస్తే చందమామ పదికాలాల పాటు బతకుతుందనే కొండంత ఆశతో చెబుతున్నా. వీలైనంతమంది కొత్తవారికి, దేశ దేశాల్లోని తెలుగు మిత్రులకు ప్రింట్, ఆన్‌లైన్ చందమామను పరిచయం చేయగలరని తెలుగు జాతి సంపదను మరి కొంత కాలం నిలబెట్టుకోవడంలో కలిసి వస్తారని మనసారా విశ్వసిస్తూ..

    K.Raja Sekhara Raju
    Associate Editor
    telugu.chandamama.com
    Email krajasekhara@gmail.com
    my new blog : chandamamatho.blogspot.com
    my mobile: 9884612596 (chennai)

  12. విలక్షణమైన, విశిష్టమైన బ్లాగ్.
    మంచి సమీక్ష ..

  13. కృతజ్ఞతలు మిత్రమా…

    ఇంతవరకు చందమామ గత చరిత్ర, వ్యక్తుల, రచయితల అభిప్రాయాలు, ఇతర వెబ్‌సైట్లు, బ్లాగులలో చందమామపై వచ్చిన కథనాలు, చందమామ రచనలను పదిలపర్చుకోవడానికి మీ వంటి తెలుగు మిత్రులు పడుతున్న తపనకు సంబంధించిన వివరాలతో కూడిన దాదాపు 15 పైగా రచనలను ఇంతవరకు సేకరించాను. వీలైతే ఈ వారంలోపే వాటన్నిటినీ నా chandamamatho.blogspot.com లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకే ఒక అభ్యర్థన… బతుకుతెరువు కోసం ఒళ్లు హూనం చేసుకోవడానికి వెచ్చిస్తున్న పనిగంటలు హరించుకు పోగా మిగిలిన సమయం అంటూ ఉంటే కొంత సేపయినా తెలుగింటి చందమామ గురించి కాసేపు తలుచుకుంటారని ఆశించవచ్చా.

    మీ వంటి మిత్రులకు ఓ మంచి వార్త. చందమామ పాత కాపీలను పిడిఎఫ్ రూపంలోనో, లేదా చందమామ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం వీలు కల్పించిన ఆర్కైవ్స్ రూపంలోనో చూడటంతో తృప్తి పొందనివారికోసం, 1947 నుంచి మొదలు పెట్టి పాత సంచికలను ముద్రణ రూపంలో కావాలని కోరుకుంటున్న వారి కోసం అతి త్వరలో చందమామ print on order ప్రాతిపదికన పాత సంచికలను ముద్రించి పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఉద్యోగిలా కాకుండా, వ్యక్తిగా చందమామ పాత సంచికల ముద్రణ తొలి కాపీని నాకే ఇవ్వమని అడిగితే మా యాజమాన్యం కాస్త నవ్వేసిందనుకోండి. పాత కాపీలు మీకూ కావాలని బావిస్తే మీ వివరాలను editor@chandamama.com కు తెలుపుతూ సమాచారం పంపండి.

    గేస్ట్ రచయితలుగా మీరు సమకాలీన అంశాలకు సంబందించి (జోక్స్, ఫన్నీ ఏఎస్ఎమ్ఎస్, సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ, చరిత్ర, సంస్కృతి, లోకజ్ఞానం, మన ప్రపంచం, మీకు తెలుసా) వంటి ఏ అంశంమీదైనా సరే ఏవైనా రచనలు మీరు పంపితే మీ పేరు మీద ఆన్‌లైన్ చందమామలో ప్రచురించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉంది. (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా మీరు రచనలు, అబిప్రాయాలు పంపవచ్చు. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోనే ఆన్‌లైన్ చందమామ వస్తోంది. ఇతర భాషల్లో కూడా త్వరలోనే ఆన్‌లైన్ చందమామ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.)

    అన్నిటికంటే మించి చందమామ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో ఈమెయిల్ ద్వారా తెలియజేస్తే వాటిని తప్పకుండా నెరవేర్చడానికి చందమామ యాజమాన్యం సర్వదా సిద్ధంగా ఉంది. మీ అభిప్రాయాలను తెలుగులోనే యూనికోడ్, శ్రీలిపిలలో కూడా టైప్ చేసి పంపవచ్చు. త్వరలో చందమామ బ్లాగ్‌ను కూడా ప్రాంతీయ భాషల్లో కల్పించడానికి పథకాలు సిద్ధం చేస్తోంది. గత సంవత్సర కాలంగా టెక్నికల్‌ కారణాల రీత్యా ఆన్‌లైన్‌ చందమామలో దొర్లుతూ వచ్చిన మోతాదుకు మించిన అచ్చుతప్పులను వీలైనంత త్వరగా పరిహరించడానికి మేం తప్పక ప్రయత్నం చేస్తాం. తప్పులు లేని చందమామను కావాలని కోరుకునే మీ ఆకాంక్షలకు మేం తప్పకుండా విలువ ఇవ్వాలి.

    ఓ నిశిరాత్రి వేళ పొద్దు, తదితర మిత్రులతో ఏర్పడిన బ్లాగ్ పరిచయం చందమామ సాక్షిగా కొనసాగుతుందని ఆశిస్తూ, telugu.chandamama.com కు మీరు తప్పకుండా రచనలు, అభిప్రాయాలు, సలహాలు, విమర్శలు కూడా పంపగలరని కోరుకుంటూ

    రాజు.

Comments are closed.