దాపుడు కోక

— కేతు విశ్వనాథ రెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి

గత జనవరిలో కేతు విశ్వనాథరెడ్డి గారికి అజో-విభొ ప్రతిభామూర్తి పురస్కార ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా పొద్దులో కేతు దంపతులతో ఇంటర్వ్యూ ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. విశ్వనాథరెడ్డి గారి కథల్లో తనకు బాగా నచ్చిన కథ దాపుడుకోక అని శ్రీమతి కేతు పద్మావతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కారణంగా ఆ కథను పొద్దు పాఠకుల కోసం పునఃప్రచురిస్తున్నాం.

ఐతే ఈ కథ ప్రాధాన్యత అదొక్కటే కాదు. స్త్రీల సమస్యలను, స్త్రీ పురుషుల అసమానతలను మొదటి నుంచీ తన రచనల్లో బలంగా చిత్రిస్తూ వస్తున్న కేతు విశ్వనాథరెడ్డి గారు మహిళల సమస్యలను సహానుభూతితో చిత్రించడంలో ఎక్కిన మొదటి మెట్టు1972లో రాసిన దాపుడుకోక కథ.

1974లో తన మొట్టమొదటి కథల సంపుటి ‘జప్తు’లోని కథల గురించి “ఈ కథల్లో యితివృత్తం వాస్తవికంగా లేకపోతే, జీవిత వైరుధ్ధ్యాలు నాకింకా స్పష్టపడలేదని అర్థం. కథల ద్వారా నేనాశించిన ప్రభావం పాఠకుని మీద పడకుంటే శిల్పం నా చేతుల్లో వొదగలేదనే అర్థం.” అని ప్రకటించిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఈ కథ రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గార్ల నుంచి సాధారణ పాఠకుల దాకా ఎందరో బాగా ఇష్టపడినది. ఐతే కేతు విశ్వనాథరెడ్డి గారి చిరకాల మిత్రుడు, ఉత్తమ కథారచనకు గుర్తింపుగా రావిశాస్త్రి రచనా పురస్కారం పొందిన ప్రసిద్ధ కథారచయిత అయిన సొదుం జయరాం గారు అదే కథాసంపుటికి రాసిన ముందుమాటలో “దాపుడు కోక లో ఎమోషన్ సూపర్‌ఫ్లుయస్ స్థాయికి చేరుకుంది. ఆ ఎమోషన్ కూడా situation ను ఆశ్రయించి ఉత్పన్నం కాక, పదాల ద్వారా ఉత్పన్నమయింది. ఇది ఒక రకం శిల్పసంబంధమైన లోపమే.” అన్నారు.

ఎ.బి.కె. ప్రసాద్ గారన్నట్లు నేటి కథా-నాయకుడు కేతు విశ్వనాథరెడ్డి. ఆయన పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే కథలు కొన్ని ఉన్నాయి – నమ్ముకున్న నేల, కూలిన బురుజు, అమ్మవారి చిరునవ్వు, రెక్కలు, పీర్ల సావిడి, జప్తు, దాపుడుకోక, … ఇలా. ఐతే ఆయన రాసిన కథల్లో మీకు బాగా నచ్చినవి, ప్రత్యేకించి అధ్యయనం చేయదగ్గవైనపటికీ మిగతా కథలంతగా ప్రసిద్ధం కానివి అయిన కథల గురించి తెలిపితే వాటిని ముందుగా పరిచయం చేస్తాం.

~~~~~~~~~~~~~~~~~~~~~~

“సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా” అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.

“నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు.” చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.

“అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!”
పద్దెనిమిదేళ్ల పల్లెటూరు చెన్నమ్మ సీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది.
వుట్టి పాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంలో హొయలు లేవు. వొళ్లో పైట మరుగున పాలు తాగుతున్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్లోంచి జారి పోతూ కెవ్వు మంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.

* * * * *

నాయనా! నాకోక! దాపుడు కోక!
చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరుస్తున్నదో అర్థం కాకపోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఆడవాళ్ల సీట్ల వైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడి వున్నవాళ్ల తలల మధ్య నుంచీ నిక్కి చూస్తూ “యేంటమ్మా, యేంజరిగింది?” అన్నాడు. చెన్నమ్మకు వాళ్లనాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగుమింగుకుంటూ అవమానభారంతో పైటలాక్కుంటూ అంది.

“మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నాగుడ్డల మూటె- దాపుడు కోకున్న మూటె మర్చిపోయినా”

టిక్కెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్లనూ, మొరటువాళ్లనూ అదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్ చెన్నమ్మ అరుపులకు మండిపడ్డాడు. ‘కూచో’ అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు. గొర్రెపిల్లను రక్షించటానికి వచ్చిన గొర్లకాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలిమీద లేచాడు.

“యేందయ్యా మీ గోల. వూరిదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంది? ఆ మూటేదో తెచ్చుకునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మంట్లేదు. నీకోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డీయస్సీవా? బ్రేకినిస్పెక్టరువా?”

కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డీయస్సీ కాదు. బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు. బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.

“ఆమాత్రం జాగ్రత్త అఖ్కర్లా? ఆ మూటను యాడమర్చిపోయినావు? ఆ మాటెలో యేమున్నాయి?”

“మనూర్నుంచి వచ్చిన బస్సులో మర్చిపోయినా, అంత గుంపు దోసుకొస్తుంటే దిక్కుతెలీట్లేదు నాయనా? వూపిరాడక పిల్లోడు యేడ్చినాడు. తొందరగా దిగడంలో మర్చిపోయినా. దిగి మళ్లా ఆ బస్సులో యెదికితే దొరుకుతాదేమో?”

తండ్రి వైపూ, కండక్టరు వైపూ దీనాతిదీనంగా చూస్తూ, చుట్టూ వున్న వాళ్లను సిగ్గుతో చూస్తూ చెన్నమ్మ సంజాయిషీ చెప్పింది.

“యే బస్సులో యేం?” కండక్టరు కరిచాడు.

“కడబ్బస్సులో” చెన్నమ్మ బెరుకుగా సమాధానమిచ్చింది.

“పెద్ద పెద్దయి మర్చిపోయినోళ్లతో కూడా మాకిబ్బంది లేదు. మీరు మా దుంపదెంచుతారు – నానా రకాల మూటల్తో వచ్చి.”

తనేమిటో మర్చిపోయి కండక్టరు విసుక్కున్నాడు. కండక్టరు విసుక్కోకపోవడానికి చెన్నమ్మ ఖరీదైనది కాదు. సానుభూతితో పరామర్శించడానికి చెన్నమ్మ అందమైనది కాదు. మర్యాదగా మాట్టాడానికి చెన్నమ్మ బస్సు వోనర్లతో సంబంధముండే యే అధికారి భార్యా కాదు. బంధువూకాదు. బస్సులోని వారెవరో సానుభూతి ప్రకటించారు.

“పోనీలే పాపం, బస్సు నిలబెట్టు, వాళ్లు దిగుతారు. మూటె దొరుకుతుందేమో. అది నైటాల్టు బస్సేకదా? అక్కడే వుంటుంది.”

వీరయ్య కొంత ధైర్యం తెచ్చుకొని బ్రతిమాలాడు.

“నీకు పుణ్ణెముంటుంది. మా టిక్కెట్టు డబ్బులు వెనక్కి యిచ్చి యిక్కడ దించు. మూటె దొరికితే యేరే బస్సులో వస్తాం.”

“నీకేమన్నామతిబోయిందా? టికెట్టు రాసినాం. బస్సు వూరు దాటి రెండు మైళ్లొచ్చింది. యిప్పుడు టికెట్టు డబ్బులడుగుతావా? యింకా పొద్దుటూరు చేరినాకా అడగాలా? నీదేం బోయింది? యిట్లా అయితే మేమూ, మావోనరూ దివాలా తీయాల్సిందే.” కండక్టరు స్వామి భక్తిని ప్రకటించాడు.

వీరయ్య ప్రాధేయ పడ్డాడు. “మళ్లా రావడానికి డబ్బుల్లేవు. నీకు పున్నెముంటుంది. ఇక్కడే దించి డబ్బులీ, దిగిపోతాం బాబ్బాబూ”

“డబ్బుల్లేవు డబ్బుల్లేవు యిదొక తంతయింది. నీకేం మా చెకింగు పట్టుకున్నాడంటే నా ఉద్యోగం వూడ్తుంది. డబ్బు వాపసేమీ రాదు. కావాలంటే దిగండి.” కండక్టరు చీదరించాడు.

వీరయ్య కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. “దిగితే మళ్లా సార్జీలకు లేదు. పోతే పోనీలే మన కరమ.”

“నా దగ్గర మూడు రూపాయలుంది. సార్జీలకు సరిపోతాది. దిగుదాం”, చెన్నమ్మ కండక్టరు వైపు భయంతో చూస్తూ అంది.

కండక్టరు “దరిద్రపు రూటని” వదరుకుంటూ “హోల్డాన్” అని కేక వేశాడు. బస్సు ఆగింది. వీరయ్యా, చెమ్మన్నా దిగారు. చంకలోంచి జారిపోతున్న కొడుకును పైకి లాక్కుంటూ త్వరత్వరగా అడుగులు వేస్తూంది చెన్నమ్మ. వీరయ్య దిగులుగా అనుసరిస్తున్నాడు.

నాకోక
దాపుడు కోక
ముప్పయి రూపాయల కోక
పేటలో కొనుక్కున్న కోక
కలుపు తీయటానికి పోయి
నిమ్మసెట్లలో పాదులు తొవ్వటానికి పోయి
కట్టపడి డబ్బు కూడబెట్టుకుని
కొనుక్కున్న కోక
తనకెంతో ఇష్టమైన కోక
అరచేతి వెడల్పు నల్లంచు యెర్రకోక
మొగుడికి సానా యిష్టమైన కోక
యీ కోక కట్టుకుంటే సినిమాల్లో సావిత్రిలా వుంటావని మొగుడంటే
రోజూ కట్టుకోబుద్దయే కోక కానీ
వుతకలకు కట్టుకుంటే సిరిగి పోతుందని భయపడి
రోజూ కట్టుకోని కోక
పిల్లోడు పుట్నెప్పున్నించీ కట్టుకోని కోక
పిల్లోన్ని సంకలో యేసుకున్నప్పుడు వాడుచ్చలు పోస్తే పాడయిపోతాదని కట్టుకోని కోక
నలుగురూ మెచ్చుకున్న కోక
తన దాపుడు కోక
కరమ యెవడన్నా యెత్తకపోయినాడేమో!
పుట్టింట్లో అందరికీ సూపియ్యాలనుకున్నానే
తిరిగి వూరికి పోయినప్పుడు మొగుడేవంటాడోని
పుట్టింట్లో సెల్లెలికిచ్చి వచ్చినావని అరుస్తాడేమో!
ఆ కోకలేకపోతే
సినిమాలకు పోయేదెట్లా?
పండగలకెట్లా
రామేశ్వరం తిర్నాలకెట్లా?
పెండ్లిండ్లకెట్లా?
నలుగుర్లో తిరిగేదెట్లా?
మళ్లా కొత్తది కొనేదెట్లా?
ముప్పై రూపాయి కట్టం
సీరె కోసం కట్టంలో
నిమ్మ సెట్ల పాదులు తొలికెతో తొగీ తొగీ
సేతులు కాయలు కాసినాయి.

చెన్మమ్మ మనసు బాధతో నిండిపోయింది. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు. కష్టం తెలిసిన కన్నీళ్లు. పేద కోరిక కారుస్తున్న కన్నీళ్లు.

“సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా” అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.

“నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు.” చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.

“పిల్లోంతో నువ్వేం బాధ పడతావు గాని, అదిగో అక్కడుండు. నేను యెదికి తెస్తా.” వీరయ్య చెన్నమ్మను వో బంకు నీడలో వొక పక్కగా నిలబెట్టి బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సంతా వెతికాడు – సీటు సీటు పైనా కిందా – కన్పడలేదు. బస్సులో చెత్త వూడుస్తున్న కుర్రవాణ్ణి అడిగితే “అట్లాంటి మూటే కనపళ్లే”దన్నాడు. బస్సు దగ్గర వున్న వొకరిద్దర్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవరునూ, కండక్టరునూ అడుగుదామనుకున్నాడు. కానీ డ్రైవరు యింటికి పోయినాడట. కండక్టరు కలెక్షను డబ్బులు వోనరు కివ్వడానికి పోయినాడట – బస్సు క్లీనరు చెప్పాడు. వీరయ్య హతాశుడై తిరిగి వచ్చి కూతురును వోదార్చటానికి ప్రయత్నిస్తూ వేదాంతం చెప్పాడు.

“దొరకలా, యెంతెతికినా దొరకలా, యాడెతికినా దొరకలా, యెవర్నడిగినా దొరకలా, పొద్దున్నే యెవల్ల మొకం చూసి బయల్దేరినామో, మన కరమ, యేం సేస్తాం. యెవడో యెత్తకపోయినాడు. మనకంటే దరిద్దరం ముండా కొడుకు. అయినా మనలాంటోళ్లం జాగర్తగా వుండాల. యేందన్నా పోగొట్టుకుంటే తిరిగి సంపాయించుకునే గతి లేదు. పోతే పోనీలే వూరికి పోయినాక చూస్తాం”

బస్సులో పడిన అవమానాన్ని తలచుకుంటూ, నడిచి వచ్చిన శ్రమను అనుభవిస్తూ, మరొక చీర అట్లాంటి చీర – కొనలేం. దరిద్రాన్ని తలపోసుకుంటూ, అల్లుడేమనుకోకుండా అట్లాంటిదే మరొక చీరను కొని కూతురు కిచ్చే వుపాయాన్ని ఆలోచిస్తూ వీరయ్య కూతురును వోదారుస్తున్నాడు. అంతలో వాళ్లకు కొంచెం దూరంలో వొక తాగిన వాడు బండ బూతులు తిడుతూ తూలుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వాడి చేతిలో యేదో యెర్రటి బట్ట. వాని వెంట మరొకడు తరుముతూ వస్తున్నాడు.

“వొరే యెదవ నాకొడకా, యాడకు బోతావురా. గొంతుదాకా వుద్దర సారాయి తాగుదామను కున్నావా?”
సారాయి తాగిన వాడి చేతిలో వున్న వస్తువును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సారాయి తాగిన వాడు గట్టిగా పట్టుకున్నా, కొంత సడలి బట్ట అంచులు జారినాయి.

“నాయనా! అదిగో అదే నాకోక, నాదే ఆకోక, అదే నా దాపుడు కోక.”

చెన్నమ్మ తండ్రితో బిగ్గరగా చెప్పి వాళ్ల దగ్గరకు ఆదుర్దాతో పరుగెత్తుతోంది. వీరయ్య గాబరా పడుతూ వాళ్ల దగ్గరకు చేరాడు. వాళ్లింకా పెనుగులాడుతూనే వున్నారు. సారాయి తాగిన వానితో పెనుగులాడుతున్న వాడంటున్నాడు.

“రేయి నాదగ్గర టోకరా యేస్తావా? తాకట్టు పెట్టినట్టు పెట్టి పనికి రానివన్నీ నామీదేసి యీ కోక లాక్కొని పోతావా – నదురుగా వుందని. తాగిన పద్దరాములు సారాయైనా కక్కు, లేదా యీకోక నాకివ్వు. తోత యీరా దొంగ నాకొడకా”

“నాకోక, నాదే దాపుడు కోక మిగతా పిల్లోడి గుడ్డలూ అయ్యి యాడ్నో?” చెన్నమ్మ దీనంగా గొణుగుతోంది.
వీరయ్య వాళ్ల దగ్గరకు భయం భయంగా వెళ్లి అన్నాడు.

“యీ కోక మాయమ్మిది. బస్సులో మరిసిపోయింది.”

“అదే నేననుకుంటాండ, యా నాకొడుక్కు కోకెక్కడిదీ అని, బస్సులో కొట్టేసినాడన్నమాట! వొరేయి యిడవరా కోక.”

సారాయి తాగిన వాడు నంగి నంగిగా అన్నాడు “ర్రేయి నాసంగతి తెలీదా. యిడు. యిది నా కోక. నా పెండ్లాందిరా.”

యిద్దరూ గట్టిగా పెనుగులాడుతున్నారు. అరుపులు, తిట్లతో. వీరయ్య చీరను విడిపించడానికి తానూ ప్రయత్నించాడు. పెనుగులాటలో చీర పర్రున చిరిగింది. చెన్నమ్మ యెర్రకోక, నల్లంచు యెర్ర దాపుడు కోక చిరిగి పీలికలైంది. లభస యింకా ఎక్కువైంది. వాళ్లు కొట్టుకుంటున్నారు. వీరయ్య చిరిగిన చీర వంక నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు.

చెన్నమ్మ కలలకూ, ఆశలకూ, ప్రేమకూ, గర్వానికీ, ఆనందానికీ నిలయమైన దాపుడు కోకను, చెన్నమ్మ గుండెకు ప్రతిరూపమైన యెర్ర కోకను వాళ్లది కాని చెన్నమ్మకోకను వాళ్లు నిర్దాక్షిణ్యంగా చించి పారవేశారు. చెన్నమ్మ దాపుడు కోక పీలికలైంది.
“నా దాపుడు కోక”

చెన్నమ్మ కిందపడిన పీలికల్ని పట్టుకొని రోదిస్తోంది. చంకలో పసివాడు అమ్మ వెక్కిళ్లకు శృతి పెడుతున్నాడు.

* * * * *

కథాంతరంగం

నాకు నచ్చిన కథ అంటే చెప్పలేను. అయితే రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మగార్లు బాగా ఇష్టపడ్డ నా కథ ‘దాపుడు కోక’. యిందులో నూటికి నూరుపాళ్లు నా అభిప్రాయాలు ప్రతిఫలించకపోయినా చాలా మంది మెచ్చుకున్న కథ ఇది. మా ఊరు వెళ్లడానికి ఎర్రగుంట్లలో బస్సెక్కాను. అదే బస్సులో మా వూరి యాదవుల అమ్మాయి ఉంది. ఆమె తన చీరల మూటతో ఎక్కుతుండగా ఎవరో ఆమూటను దొంగలించారు. ఆమె చాలా హృదయవిదారకంగా ఏడ్చింది. ఈ సంఘటన నన్ను సుమారు పాతికేళ్లు వెంటాడింది. దీనినే 1972లో కథగా రాశాను. — కేతు విశ్వనాథ రెడ్డి

————————-

“కేతు విశ్వనాథ రెడ్డి” ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త మరియు పత్రికా సంపాదకుడు. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథ రెడ్డి కథలు (1993-2003) కథాసంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి, క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటినవల.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

8 Responses to దాపుడు కోక

  1. aruna says:

    Very very touching..i mean very natural..

  2. ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారి ” దాపుడు కోక ” కథ ప్రచురించి పొద్దు సంపాదకులు తమ విలక్షణ సాహిత్యాభిరుచిని చాటుకున్నారు. మానవీయత ఉట్టిపడే విశ్వనాథ రెడ్డి గారి అనేక కథల్లొ ఇదొక గొప్ప కథ. రచయితలకు ఉండాల్సిన సామాజిక దృక్పథాన్ని బలంగా ప్రతిఫలింపచేస్తూ కొత్తగా రాసే వారికి ఈ కథ దిశా నిర్దేశం చేస్తూ ఉంటుంది.

  3. కేతు విశ్వనాథ రెడ్డి గారి lecture వినే అదృష్టము మొన్న Dallasలో కలిగినది. అలాగే నా కవిత గూడా ఆయనకు వినిపించటము జరిగినది.

    ఈ కధ శైలి ఆయన ఉపన్యాసములో చెప్పిన pattern లోనే నడిచినది. కధ అందించినందుకు ధన్యవాదములు.

    -సురేష్

  4. mudigalsrinath says:

    ilaanti kathalu 10th class students ki telugu patya pusthakam lo prachurinchadaniki govt. recomond cheyaali. katha chaala bagundi

  5. krk rao says:

    The story is native and touching

  6. చేవవున్న ఇలాంటీ పాతకథలు పునర్ముద్రించడం చాలా మంచి విషయం.

  7. I don’t know why some writers end stories in negative trend. The diction is good but arousing sympathy on the heroine (so called) and thereby popularising the story is a bad concept.

    If at the end the lady getting her sari back in good condition and showing her delight in her words and expressions after regaining it might have added colour and odour to the story.

  8. bhavani says:

    dapudukoka kadha very natural and touching. adi chala manchi kadha

Comments are closed.