తామస విరోధి- ఐదవ భాగం

సాహితీ మిత్రులకు నమస్కారం!
తామస విరోధి కి ఒక కవిత పంపుతున్నాను..
చూడండి.
-తవ్వా ఓబుల్ రెడ్డి

ప్రభాతవేళ …..!
పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి
ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె
వేట కోసం లేచిన వేకువ పిట్టలు
వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి
తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా
పల్లె నలు చెరుగులా కోడి కూతలు
రాత్రంతా మొరిగి మొరిగి ఏ అరుగుల కిందో
కునుకు తీస్తుంటాయి కుక్కలు
ఏమరు పాటే ఎరుగని ఏరువాక గువ్వ
ఎగిసి ఎగిసి కూస్తూ ఉంటుంది
ఎద్దుల మెడార్ల గంటలు
శ్రావ్యంగా తాళం వేస్తుంటాయి
వాటి గిట్టల చప్పుడు ముందర
తబలా వాద్యమైనా బలాదూరే అన్నట్లుంటుంది
తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
వాయులీనం మోగిస్తూ ఉంటుంది
మంచినీటి బోరు బొంగురు గొంతుతో
మూలుగు పాటను పాడుతూంటుంది
రాత్రంతా ఎక్కడ తిరిగాయో ఏమో
వేకువ జామున్నే పిల్లుల కాట్లాట
వామి దొడ్లోని చిటారుకొమ్మన
పక్షుల కువకువలు వినిపిస్తూ ఉంటాయి
పడమటి కోన నుంచీ సాగివచ్చే జాజిపూల గాలులు
వీధులకు సుగంధాలను అద్దుతూ
తూరుపు కొండల దిశగా సాగిపోతుండగా
చీకటి నుంచి వెలుతురులోకి
పల్లె సమాయత్తమవుతూ వుంటుంది

-తవ్వా ఓబుల్ రెడ్డి

బాబా: ఒక లాండ్ స్కేప్ పెయింటింగ్ లాగ ఉంది మీకవిత.

ఒక్కొక్క పదచిత్రాన్ని మదిలో ఆవిష్కరించుకుంటూంటే, ఒక గొప్ప పల్లె చిత్రం, మల్లీశ్వరిచిత్రంలోని పాటలా ” మనసున మల్లెల మాలలూగెనే” అన్న రీతిలో తారాడుతుంది. నాస్టాల్జిక్ కవితలన్నీ చాలా చాలా లోతుగా గుచ్చుకుంటాయి. (పల్లెలనేవి, ఇలా తెరపై అక్షరాలు చదువుకునేవారికందరికీ ఒక నాస్టాల్జియానే) మీ కవిత కూడా.

కొన్ని పదచిత్రాలు ఎన్నో జ్ఞాపకాలని రేకెత్తిస్తుంది. నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు:

వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి

ఇక్కడ ఈదుతూ అన్న ప్రయోగమే ఈ వాక్యానికి అందాన్నిచ్చింది.

పల్లె నలుచెరుగులా కోడి కూతలు శభాష్ నలుచెరగులా అనటం మంచి ఊహ.

తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
వాయులీనం మోగిస్తూ ఉంటుంది

పై వాక్యం వద్ద చూపు చాలాసేపు నిలిచిపోయింది. ఫక్తు గ్రామీణ పదచిత్రం. ఎంతగొప్పగా ఉందంటే, గోరటి వెంకన్న ఒక చోట అంటాడు -”ఎద్దుల కాలి గిట్టలు చేసిన గుంటలలో చేరిన నీటిని పిట్టలు ముక్కులతో తాగుతున్నాయి” అని.
– ఈ వర్ణన కూడా అంతే గొప్ప చిత్రం.

మంచినీటి బోరు బొంగురు గొంతుతో : అవును మరి, ఆ టైములోనే కదా ఉచిత విద్యుత్ ఇచ్చేది. 🙂
పిల్లుల కాట్లాట పక్షుల కువకువలు – కువకువలు కంటే కలకలం అని ఉంటే ఆ రెంటి దృశ్యాల మధ్య సమన్వయం బాగుండేది. మొత్తంమీద కవితలో మరికొంత క్లుప్తత ఉంటే బాగుండేదనిపించింది. మంచి కవిత.

భూషణ్:
మంచి భావుకత ఉంది.ఇంకా బాగా రాయగలరు మీరు. విశేషణాల విషయంలో ఇబ్బంది లేదు
(ఈ విషయం బాగా తెలియాలంటే శివారెడ్డి కవిత్వం చదవాలి;తెలుగులో విశేషణాల వాడుక తెలియని కవుల్లో శివారెడ్డిది అగ్రస్థానం)

పేరు మార్పు: తెల్లవారింది
కలం పేరు : అవసరం.

———————————————————————————————————————-
ప్రభాతవేళ
పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి
ముద్దగా ముడుచుకుని [ఉంటుంది] పల్లె
వేట కోసం లేచిన వేకువ పిట్టలు
వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ [ఉంటాయి ]
{ తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా }
పల్లె నలు చెరుగులా కోడి కూతలు
రాత్రంతా మొరిగి మొరిగి ఏ అరుగుల కిందో
కునుకు తీ [స్తుంటాయి}1 కుక్కలు
ఏమరు పాటే ఎరుగని ఏరువాక గువ్వ
^ఎగిసి ఎగిసి కూ[స్తూ}3 [ఉంటుంది ]
ఎద్దుల మెడార్ల గంటలు
^(శ్రావ్యంగా) తాళం వే[స్తుంటాయి }2
వాటి గిట్టల చప్పుడు {ముందర
తబలా వాద్యమైనా బలాదూరే అన్నట్లుంటుంది }
తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
^వాయులీనం మో[గిస్తూ }4 [ఉంటుంది ]
మంచినీటి బోరు బొంగురు గొంతుతో
మూలుగు పాట[ను పాడుతూంటుంది ]
రాత్రంతా ఎక్కడ తిరిగాయో ఏమో
వేకువ జామున్నే పిల్లుల కాట్లాట
వామి దొడ్లోని చిటారుకొమ్మన
పక్షుల కువకువలు [వినిపిస్తూ ఉంటాయి ]
పడమటి కోన నుంచీ సాగివచ్చే జాజిపూల గాలులు
వీధులకు సుగంధాలను అద్దుతూ
తూరుపు కొండల దిశగా సాగిపోతుం[డగా }5
చీకటి నుంచి వెలుతురులోకి
పల్లె సమాయత్తమవు[తూ వుంటుంది}6
——————————————

విశ్లేషణ
——————————–
() బ్రాకెట్లో ఉన్నవి అమూర్త విశేషణాలు:ఇవి ఎంత తగ్గితే అంత
చిక్కబడుతుంది కవిత్వం.
[] బ్రాకెట్లో ఉన్నవి ద్రుత పదబంధాలు:ఇవి తొలగిస్తే పాఠకుల ఊహకు పదును
కలుగుతుంది.
{}బ్రాకెట్లో ఉన్నవి వ్యాఖ్యానాలు :కథ చివరలో నీతి,కవితలో వ్యాఖ్య
వర్జ్యం.
[}బ్రాకెట్లో ఉన్నవి ప్రతిక్షేపాలు :క్రియలు మార్చాలి (ఉదా:
[స్తుంటాయి}1,2 –>[ సే }
[స్తూ}3 —> [ సే }
[గిస్తూ} —>[ గించే}
[డగా}5 —> [ టే }
[తూ వుంటుంది}6 —> [ తుంది}

వాక్య క్రమం
————————————–
^ ఈ వాక్యం పైకి

మూలా సుబ్రహ్మణ్యం:
మంచి కవితలతో, అద్భుతమైన విశ్లేషణలతో సాగుతున్న కవితా ఝరిలో నావి కొన్ని
హైకూలు/పదచిత్రాలు.

1.

కొలనులో చంద్రుడు
తుళ్ళి పడ్డాడు
తూనీగ రెక్క తగిలి

2.

ఒకే తోటలో చెట్లు
కొన్ని పొట్టి
కొన్ని పొడుగు

3.

తట్టలో చూసే కాయలు
చెట్టుకే చూడ్డం
ఎంత బావుంది!

4.

పిల్ల కాలువని
మీటుతున్నాయి
మర్రి ఊడలు

5.

తామరాకుల కింద
దాక్కుంది
కొలను.

6.

దట్టమైన అడవి
ఒకటో రెండో
సూర్య కిరణాలు

7.

ఈ సెలయేరు
క్షణం క్రితం
జలపాతం!

8.

పావురాళ్ళకి మేత
వాటి కడుపు నిండుతుంటే
నా గుండె నిండుతోంది

9.

ఖాళీ బాల్చీ
నిండుతున్న సవ్వడి
ఏదో చెప్తోంది

10.

జలపాతానికి
రంగుల ముఖద్వారం
ఇంద్రధనస్సు!

రాకేశ్వర రావు:

చాలా బాగున్నాయండి. మొదటిది చదవగానే, నేను ఒక్క క్షణం స్తంభించిపోయాను. అదే హైకూల లక్ష్యం అనుకుంట కదా.

ఆపై, నేను చేసిన పొరపాటు ఏంటంటే, మొదటిదాని మాయలోనుండి బయటపడకుండానే రెండవది చదివేయడం. అలా అన్ని అనుభూతులూ కలగాపులగం అయ్యిపోయాయి. కాబట్టి మీరు తరువాతిసారి నుండి ఇలాంటి అద్భుతమైన హైకులు పంపేటప్పుడు రోజుకొక్కటిగా పంపగలరు 🙂

Jokes apart, అన్నీ, చాలా బాగున్నాయి. అదీను నేనీమధ్యన చేలమ్మట చెఱువులమ్మట బాగా తిరగడం వలన ఇంకా బాగున్నాయి. నేనూ కొన్ని హైకూలు వ్రాస్తే పోతుందేమో అని నిన్నటి వరకూ అనుకున్నాను కానీ, మీవి చూసిన తరువాత నేను నా ప్రయత్నం విరమించుకున్నాను. హైకులు అనుభవించగలిగితే అదే మహాభాగ్యం కదా.

మీరు బెంగుళూరిలాంటి పంకపల్లెలోనుంటూ ఇలాంటి పంకజాలు పుట్టించడం అద్భుతం. ఎనిమిదోనెంబరుది కాస్త odd గా తట్టింది నాకు. మీ ఆత్మప్రస్థావన వలన అనుకుంట. నాకంటే పెద్దల అభిప్రాయం పొందగలరు.

రవిశంకర్:
పదచిత్రాలు చాలావరకు చక్కగా కుదిరాయి. ఒక మూడు మాత్రం (7,8,9) తొలగించి ఉండవచ్చుననిపించింది. పదాలతో పటం కట్టటంలో కవికున్న అనుభవం తెలుస్తోంది.

భై. కామేశ్వర రావు:
పదచిత్ర కవితల గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. వీటి గురించి మీ ఆలోచనలని కోరుతున్నాను. దీని కోసం సుబ్రహ్మణ్యంగారి కవితలని ఉదహరణలుగా తీసుకుంటున్నాను, అతను మన్నిస్తారన్న ధీమాతో.
1. కేవలం పదచిత్రాలు కవిత్వం అవుతాయా?
ఉదాహరణకి “కొలనులో…” అన్న మొదటి కవిత, “ఒకే తోటలో…” అనే రెండో కవిత. ఇందులో మొదటి దాన్లో సాధారణంగా మనిషి చూడని, చూసినా పట్టించుకోని, పట్టించుకున్నా అలా అన్వయించుకోని ఒక పద చిత్రం. ఇది దృశ్యాన్ని చూపించి
అనుభవించమని ఊరుకుంటుంది. అదే రెండో దాన్లో ఎప్పుడూ చూసే దృశ్యమే, ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది. కాని అందులోంచి కవికి ఏదో అర్థం స్ఫురించి ఉండాలి. అందుకే దాన్ని కవితకి అర్హమైనదిగా భావించాడు. అదేమిటో పాఠకుల ఊహకి వదిలేశాడు. ఒకోరు ఒకోలా ఊహించుకోవచ్చు.
ఈ రెండిటిలో నాకు మొదటిది మాత్రమే కవిత్వం అనిపిస్తోంది. రెండోది సాధారణ పదచిత్రం (ఒక దృశ్యాన్ని మనకి చూపించే పద సమూహం అని దీనికి నేనర్థం చెప్పుకున్నాను). నేనకున్నది సరా కాదా? అలా అనుకుంటే, పదచిత్ర కవితలు (మొదటి తరహాకి చెందినవి) చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. అలా కాకపోతే, మామూలు దృశ్యాల చిత్రణ నుంచి కవిత్వాన్ని ఎలా వేరు చెయ్యడం?
2. ఈ రెండో అనుమానం పదచిత్ర కవిత ప్రయోజనం గురించి. దీని గురించి ఆలోచిస్తే, అసలు కవిత్వం ప్రయోజనమేమిటన్న ప్రశ్న వస్తుంది. నా ఉద్దేశంలో అన్ని “రకాల” కవిత్వాలకీ ఒకటే ప్రయోజనం ఉండాల్సిన అవసరం లేదు. కవిత్వాన్ని రకాలుగా విభజించడం కొందరికి నచ్చదు. కాని విశ్లేషణకి, విమర్శకి అది అవసరమని నా ఉద్దేశం. పదచిత్ర కవిత్వం విషయానికొస్తే, అలాంటి ఒక కవిత ప్రభావం పాఠకుని మీద ఎంత సేపు, ఎంత తీవ్రంగా ఉంటుంది? ఇది ఖచ్చితంగా పాఠకుల మీద కూడా ఆధారపడి
ఉంటుంది. అయితే వీటిని ఆనందించాలంటే పాఠకునికి ఎలాంటి నేపథ్యం కావాలి?

త.య.భూషణ్:

1. కేవలం పదచిత్రాలు కవిత్వం అవుతాయా?
అద్భుతమైన ప్రశ్న;కావనే సమాధానం.

పదచిత్రాల సమూహం కవిత్వం కాబోదు.అది కవిత్వాన్ని దసరా బొమ్మలకొలువు స్థాయికి దించి వేస్తుంది.తనలో కదిలిన ఉద్వేగానికి తగిన పదచిత్రాలు ఎన్నుకొనడంలోనే ఉంది కవి ప్రతిభ.ప్రతి పదచిత్రం హైకూ కాదు,అలాగే ప్రతి పదచిత్రాల సముదాయం కవిత్వం కాదు. కవిత్వం డిజిటల్ ఫొటోగ్రఫీ స్థాయికి దిగజారి పోరాదు.నీలోని ఉద్వేగాన్ని పదచిత్రం పట్టుకురాలేక పోతే అది వృధా. పదచిత్రాలను బంధించే అంతస్సూత్రం కవిలోని ఉద్వేగం.

2.మీ రెండవ ప్రశ్న నాకు అర్థమైనంత మేరకు సమాధానమిస్తాను. పదచిత్రాల కవిత్వం అధికంగా తూర్పు దేశాల నుండి బయల్దేరింది.
చైనీస్  కవిత్వాన్ని ఎజ్రా పౌండ్ అనువాదం చేసేదాకా పడమటి దేశాల్లో ఎక్కువ మందికి తెలియదు. అన్ని భాషలు ఒకే స్థాయిలో లేవు.ఆంగ్లంతో పోలిస్తే చైనీస్ ఎంతో నాగరకమైన భాష (ఇదే కోవలోకి వస్తాయి మన సంస్కృతం,గ్రీకు ; నేను ఈ విషయం మీద ప్రత్యేక వ్యాసం రాసి ఉన్నాను,కావలసిన వారికి పంపించ గలను ;కాబట్టి ఎక్కువ వివరాల్లోకి పోవడం లేదు)

ఈ ప్రత్యేకమైన పదచిత్ర కవిత్వాలు వారి భాషల్లో ఒదిగినంత అందంగా ఇతరభాషల్లో ఒదగవు.ప్రాచీన జపనీస్ కవులు విధిగా చైనీస్ కావ్యాలు చదువుకున్నారు,మన ప్రాచీన తెలుగు కవుల సంస్కృత కావ్యాలు పఠించినట్టే.అక్కడితో ఆగకుండా ,పదచిత్ర కవిత్వాలకు పరాకాష్ట అనదగ్గ హైకూ కవిత్వం సృష్టించారు. హైకూ ( హైకూలు అనడం తప్పు) చాలా కష్టమైన ప్రక్రియ. హైకూ రచనకు జపనీయ కవిసమయాలు చాలా గొడవ ఉంది.

నీ అనుభవాన్ని పదచిత్రంలో ఒడిసి పట్టుకోవాలి. ఝటితిస్ఫూర్తి చెడకుండా ,భాషా మర్యాదలను అతిక్రమించకుండా ఆ అనుభవాన్ని అందివ్వాలి. అది నీ అనుభవమే అయిఉండాలి,వెఱ్ఱి ఊహ కానే కాదు.చమత్కారానికి స్థానం లేదక్కడ.

ప్రకృతితో మమేకమైతే గాని అటువంటి సిద్ధి కలగదు.ప్రకృతిలో ప్రతి కదలిక నీకు తెలియాలి. మారే ఋతువులు రంగులు జీవజాలంపై వాటి ప్రభావం ప్రతి సూక్ష్మ విషయం నీకు తెలియాలి.

అప్పుడుగాని నిక్కమైన నీలం లాంటి హైకూ నీ హృదయంలో వెలగదు; అదే కాంతిని ఇతరుల హృదయాల్లో వెలిగించదు.

అనుభవాన్ని అనుభవంగా అందించడమే కవిత్వ పరమ ప్రయోజనం. బుద్ధిమార్గంలో తెలుసుకున్నవి నీ అనుభవాల్లో కలిసిపోలేవు.అతి
తేలికగా మరపుదారిలోకి జారిపోతాయి.కాబట్టే,మనం కవిత్వానికి అంత విలువ ఇచ్చుకుంటాం.

హైకూ కవిత్వాన్ని లేదా పదచిత్ర కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సూక్ష్మ విషయాలన్నీతెలిసి ఉండాలి.ముఖ్యంగా మన కవిత్వ
సంప్రదాయం స్పష్టంగా తెలిసి ఉండాలి.దానికి తోడు మన ధ్వని / రస సిద్ధాంతం (భావం /స్థాయీభావం/సంచారీ భావాలు/రసం- వీటి చర్చ) ఉపకరిస్తుంది. చాలామంది ఆధునికులు ప్రాచీన కావ్యాలు చదవకపోవడం ఒక యోగ్యతగా భావిస్తారు.పాతకు ,కొత్తకు
మధ్య ఎటువంటి  వ్యతిరేకత లేదు.పాతకవిత్వాల మీద మనకున్న అవగాహన కొత్త కవిత్వాలను అర్థం చేసుకోవడానికి చాలా సహాయకారి.

ఇక అసలు విషయానికొస్తే :మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

1.
కొలనులో చంద్రుడు
తుళ్ళి పడ్డాడు
తూనీగ రెక్క తగిలి
2.
ఒకే తోటలో చెట్లు
కొన్ని పొట్టి
కొన్ని పొడుగు

1. ఎన్నదగినది  2.విడువదగినది.
(ఒకటవ దాని విషయంలో కూడా నాకు కొన్ని సందేహాలు: తూనీగలు రాత్రి వేళ తిరగవు.ఏ చెట్టు మీదో పడుకుంటాయి.
లేదా తూనీగలాంటి వేరే కీటకమా ?? )

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to తామస విరోధి- ఐదవ భాగం

  1. ప్రభాతవేళ బావుంది.
    ఎందుకు అని అడిగితే చెప్పలేను కాని,
    “వేట కోసం లేచిన వేకువ పిట్టలు”
    అన్న ఒక్క ఉక్తే కొంచెం నచ్చలేదు

Comments are closed.