కథా మాలతీయం – 5

అమెరికా వచ్చినతరవాత తాను గ్రహించిన విశేషాలూ, తన వెబ్‌సైటు, బ్లాగుల ద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ.. ఈ విషయాలమీద పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతికుమారి అడిగిన ప్రశ్నలకు ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి అంతరంగ కథనం చదవండి.

*పాఠకులతో ఏర్పడిన సాన్నిహిత్యం -బ్లాగు మొదలు పెట్టకముందూ, తరవాతా, తూలిక.నెట్ ద్వారా, రచయిత్రిగా..

ఇంగ్లీషు తూలిక.నెట్ ద్వారా పరిచయాలు: తెలుగుతూలికకి ముందే, పరిచయమయినవాళ్లు తూలిక.నెట్ ద్వారా సుజాత (మనసులోమాట), కల్పన రెంటాల. అంతేకాక తెలుగు చదవడం రాని తెలుగు అమ్మాయి రాధిక యేల్కూర్ (బెంగుళూరు), తూలిక మూలంగా తనకి తెలుగుకథలగురించి చాలా విషయాలు తెలుస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతూ ఈమెయిలిచ్చింది. మేం కొంతకాలం ఈమెయిళ్ళలో చర్చించుకుంటూ వుండేవాళ్లం కూడా. నేను 2003లో ఇండియా వచ్చినప్పుడు బెంగుళూరునించి నన్ను కలుసుకోడానికి హైదరాబాదు వచ్చింది ఆ అమ్మాయి.

అలాగే ప్రొఫెసర్ రాధిక గజ్జెల (అయొవా) కూడా ప్రోత్సాహకరంగా రాస్తూ వుండేవారు. అలాటి స్పందనలమూలంగా తూలిక.నెట్ సఫలం అని నాకు అర్థమయింది. అయితే అలాటి పరిచయాలు అట్టే కాలం నిలవలేదు. విజయనగరంలో వున్న సాయిపద్మ కూడా తూలికమూలంగానే పరిచయం. పూనుకుని నా తెలుగుకథలు సంకలనంగా ప్రచురించింది, వాళ్ల నాన్నగారి ఫౌండేషన్‌‌ద్వారా. ఉషారాణి (మరువం) – తూలిక.నెట్‌ద్వారానే పరిచయం. ఇంకా హైదరాబాదులో, మంచి స్నేహితులయిన వారిలో వాసా ప్రభావతిగారూ, నాయని కృష్ణకుమారిగారు, పోరంకి దక్షిణామూర్తిగారూ .. ఇలా చాలామంది వున్నారు.

అయితే తూలిక.నెట్ అమెరికాలో తెలుగు సంఘాలు గుర్తించకపోవడం మాత్రం నాకు అర్థం కాదు. ఒక్క వంగూరి పౌండేషన్ వారు తప్పిస్తే, మిగతా సంఘాలలో హేమాహేమీలు రాసే వ్యాసాల్లో ఎక్కడా తూలిక ప్రసక్తి వుండకపోవడానికి కారణాలు వారే చెప్పాలి.

నేను తూలిక మొదలుపెట్టేక. అలాటి వ్యాఖ్య నాకు రావడం అదే తొలిసారి. నిజానికి అదే ఆఖరు కూడాను. నా అనువాదాలు నచ్చనివారు చదవరు. అంతేకానీ పని కట్టుకుని నాకు రాయరు.

తూలికతో సంబంధం లేకుండా, నా రచనల మూలంగా పరిచయాలు: బ్లాగుమూలంగా కాక, నా రచనలమూలంగా పరిచయమయి, ఆప్తులు అయినవారు కల్పన రెంటాల, వైదేహీ శశిధర్. కల్పన మాడిసన్లో వున్నంతకాలం తరుచూ మాటాడుకుంటుండేవాళ్లం. తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకానికి మంచి ముందుమాట కూడా రాసింది తను. ఇప్పుడు టెక్సస్‌లో వుంది. అప్పుడప్పుడు మాటాడుకుంటుంటాం. వైదేహి ఈమాట.కాం లో నాకథ, “రంగుతోలు” చూసి, నచ్చడంచేత వాళ్ల తెలుగుజ్యోతికి కథ రాయమని అడగడంతో మొదలయింది మా పరిచయం. మావూళ్లో లేకపోయినా, దాదాపు ఒకేవూళ్లో వున్నంత స్నేహం. ఈనాడు వస్తున్న కథలూ, కవితలగురించి తరుచూ చర్చించుకుంటుంటాం.

అనువాదాలమూలంగా పరిచయమయినవాళ్లలో సౌమ్యతో నాస్నేహం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథ. తన పరిచయం కూడా బ్లాగుకంటే ముందే సూచనప్రాయంగా జరిగింది. అంతకుముందు ప్రశాంతి నా కవిత ఒకటి చూసి, తెలుగపీపుల్.కాంకి రాయమని కోరడంతో ప్రారంభమయింది ప్రశాంతితో పరిచయం. తరవాత, 2006 ఏప్రిల్లో నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఇద్దరూ – ప్రశాంతీ, సౌమ్యా – కలిసి వచ్చారు మాఇంటికి. కానీ ఆరోజు సౌమ్య ఏమంత మాటాడలేదు. ఆ తరవాత, నేను అమెరికా వచ్చేక, నా తూలిక.నెట్‌లో “మీ అనువాదాలు ఏం బాగులేవు” అంటూ ఈమెయిల్ ఇచ్చింది నాకు. అప్పటికి అయిదేళ్లయింది నేను తూలిక మొదలుపెట్టేక. అలాటి వ్యాఖ్య నాకు రావడం అదే తొలిసారి. నిజానికి అదే ఆఖరు కూడాను. నా అనువాదాలు నచ్చనివారు చదవరు. అంతేకానీ పని కట్టుకుని నాకు రాయరు. సరే, నేను నా అనువాదాలలో భాషకి కారణాలు వివరించడానికి ప్రయత్నించేను కొంతవరకూ. కానీ తను ఒప్పుకోలేదు. “ఏమో, నాకు మాత్రం బాగులేవు” అంటూ మెయిలిచ్చింది. సరే ఏంచేస్తాను. 🙂 నీఇష్టం, అలాగే కానీ అని జవాబిచ్చి వూరుకున్నాను :). ఆతరవాత మరో రెండు నెలలకి కాబోలు మళ్లీ తనే మరో ఈమెయిలిచ్చింది అనువాదాల గురించి వేరేవారి అభిప్రాయాలతో. కొంతకాలం అనువాదాలమీద చర్చించుకుంటూ వచ్చేం. క్రమంగా ఆత్మీయులం అయిపోయేం. ఎప్పుడు ఎలా జరిగిందో నేను చెప్పలేను. మరి తను చెప్పగలదేమో నాకు తెలీదు.

బ్లాగు మొదలుపెట్టేక నాయందు అభిమానం చూపినవారు చాలామందే వున్నారు. అందరిపేర్లూ రాయాలంటే అదే రెండు పేజీలవుతుంది. నాబ్లాగులో వ్యాఖ్యలు తరుచూ రాసేవారు రాజేంద్రకుమార్, రాధిక, సిరిసిరిమువ్వ, మధుర వాణి, కొత్తపాళీ, నిషిగంధ, మహేష్‌కుమార్, చదువరి, దీప్తిధార సిబిరావు – ఇలా కొందరయితే, “నేను మీ వీరాభిమానిని” అంటూ ఒక్క మెయిలుతో సరిపుచ్చినవారు మరి కొందరు. వీరందరి అభిమానమూ నాకు గణనీయమే. ఈవిషయాన్నే ఒకావిడ ఎంతో ఆర్ద్రంగా వాచ్యం చేసేరు, “ఎంతకని చెప్పను ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుందని. మీకథలన్నీ నాకు ఇష్టం” అన్నారు. మీరు కూడా అంతే కదా. నాతో తరుచూ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినా జరపకపోయినా, రచయిత్రిగా నాకు ఒక ప్రత్యేకస్థానం ఇచ్చి గౌరవిస్తున్నవారు బ్లాగరుల్లో లెక్కకు మిక్కిలిగా వున్నారు అనుకుంటాను. తలుచుకుంటే నాకు కనులు చెమరుస్తాయి. నామటుకు నాకు ఈ ఆదరాభిమానాలే సత్యమయినవి అనిపిస్తుంది. ఎంచేతంటే ఇందులో “ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయినం” టైపు లేదు. నెట్వర్కింగు లేదు. వుంటే నాదాకా రాలేదు అంటే నాకు అలాటి అభిప్రాయాన్ని కలిగించలేదు ఎవరూ కూడా. ఏరచయితకి కానీ అంతకంటే ఏంకావాలి?

ఇక్కడే మరోమాట కూడా చెప్తాను. నేను అంతర్ముఖిని. త్వరగా ఎవరితోనూ స్నేహాలు చెయ్యను. అంచేత బ్లాగు మొదలుపెట్టకముందు ఎవరైనా నేను ఇంతటి అభిమానాలకి పాత్రురాలిని కాగలను అంటే నమ్మివుండేదాన్ని కాదు. ఇది నాకు ఒకవిధంగా కనువిప్పు అనే చెప్పాలి. ఈవిషయంలో సూక్ష్మదృష్టికి మరి కొన్ని తేడాలు కూడా కనిపిస్తాయి. రచయితలు అప్పడప్పుడు కలుసుకుని స్నేహాలు పెంచుకోడం వేరు, కేవలం రచనల ఆధారంగా ఒక రచయితని అభిమానించడం వేరు. కానీ ఇలా దేశ, కాలాలనీ (తరాలలో అంతరాలూ), అధిగమించిన స్నేహాలు ఏర్పడడమే నాకు విభ్రాంతి కలిగిస్తోంది.

శైలిలో పరిణతిలో మార్పు వచ్చిందని ఎందుకు అన్నానంటే.., ముందు శైలిమాట చెప్తాను. నేను కథలు రాయడం మొదలు పెట్టిన రోజుల్లో శైలి గురించిన ఆలోచన లేదు. నాకథలు పత్రికలలో ప్రచురణ మొదలయేవేళకి నాకు పదిహేనో పదహారో.. నేను చెప్పాలనుకున్నది నాకు వచ్చినభాషలో రాయడమే చేసాను అప్పట్లో. పత్రికలు, నేను పంపినవి పంపినట్టు వేసుకున్నాయి. ఈవిషయంలో మీరు చారిత్రిక నేపథ్యం కూడా గమనించాలి. ఆరోజుల్లో స్త్రీలని చదవమనీ, రాయమనీ ప్రోత్సహించడం పత్రికలు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి. శిల్పం, పాత్రచిత్రణ, శైలి వంటి విషయాలు నేను – నిజానికి ఆనాటి రచయిత్రులెవరూ – అంతగా పట్టించుకోలేదు. అంటే సంపాదకుల జోక్యం అస్సలు లేదని అనను. నేను నా “చిరుచక్రం” కథకి నేను పెట్టినపేరు “లోచక్రం” inner wheel అన్న అర్థంలో. సుబ్రహ్మణ్యశర్మగారే కావచ్చు దాన్ని చిరుచక్రంగా మార్చింది. సంపాదకులు ఇలాటి చిన్న మార్పులు చేసేరేమో కానీ, ఈనాడు కొందరు చెప్తున్నట్టు మొత్తం తిరగరాయండి అని ఎవరూ ఎప్పుడూ అనలేదు. వారికి నచ్చకపోతే ప్రచురించరు, అంతే. ఈవిషయంమీద వేరే మళ్లీ రాస్తాను.

బ్లాగు మొదలు పెట్టేక పాఠకులు స్పందించడమే కాక, ఏమాటకి, ఏవాక్యానికి స్పందిస్తున్నారో కూడా సత్వరమే తెలియడం మూలాన, ఈనాటి పాఠకుల ఆలోచనాధోరణి తెలుస్తోంది. అంచేత నేను ఎప్పటికప్పుడు నారచనలు తిరిగి చూసుకోడానికీ, కొత్తగా రాస్తున్నవి తదనుగుణంగా తీరిచి దిద్దుకోడానికీ పనికొస్తున్నాయి.

నేను 1972లో కథలసంకలనం ఒకటి వెయ్యాలనుకున్నప్పుడు, పురాణం సుబ్రహ్మణ్యశర్మగారిని ముందుమాట రాయమని అడిగాను. అందులో ఆయన “మాలతికి ఇంకా సొంతగొంతు ఏర్పడలేదు” అని రాసారు. అదే అనుకుంటాను మొదటిసారిగా ‘సొంతగొంతు’ అన్నమాట వినడం నేను. కానీ ఆనాటి నాకథలు చూసుకుంటే అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించదు. మరొక మాట- అంతకుముందు, 1970, 71లలో వరసగా రెండుకథలకి బహుమతులు ఇచ్చింది కూడా ఆ ఆంధ్రజ్యోతివారే! మరి అప్పటికి ఆయన ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్.

పాఠకులస్పందన: నారచనల్లో పరిణతి పాఠకుల స్పందన విషయానికి వస్తే. ఆరోజుల్లో పత్రికల్లో పాఠకుల అభిప్రాయాలు పత్రికలో కనిపించడానికి మూడు నాలుగు వారాలు పట్టేది. అప్పుడయినా స్థలాభావం అనో, తమ పాలసీలకి అనుగుణం గాదనో రెండో మూడో అభిప్రాయాలు మాత్రమే ప్రచురించేవారు. ఇలా సంపాదకులు ఒకవంక ప్రోత్సాహం చూపుతూ, మరొకవంక తమకి అవి నప్పుతాయో లేదో కూడా చూసుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా నాకు పాఠకులస్పందన గురించిన స్పృహ లేదు అప్పట్లో -అని మాత్రం చెప్పగలను. బ్లాగు మొదలు పెట్టేక పాఠకులు స్పందించడమే కాక, ఏమాటకి, ఏవాక్యానికి స్పందిస్తున్నారో కూడా సత్వరమే తెలియడం మూలాన, ఈనాటి పాఠకుల ఆలోచనాధోరణి తెలుస్తోంది. అంచేత నేను ఎప్పటికప్పుడు నారచనలు తిరిగి చూసుకోడానికీ, కొత్తగా రాస్తున్నవి తదనుగుణంగా తీరిచి దిద్దుకోడానికీ పనికొస్తున్నాయి. ఊసుపోక మొదలు పెట్టినప్పుడు ఇంతకాలం ఆ శీర్షికను పొడిగిస్తానని నేను అనుకోలేదు.

పరిణతి మాట.. తూలిక మొదలు పెట్టకముందే, 1980లో పి.హెచ్..డీ చెయ్యడానికి కొంత ప్రయత్నం చేసాను. అరవయ్యవ దశకంలో తెలుగురచయిత్రులకీ, 20వ శతాబ్దం పూర్వార్థంలో అమెరికన్ రచయిత్రులకీ మధ్యగల సామ్యాన్ని సామాజిక నేపథ్యంలో పరిశీలించాలనుకున్నాను. అది సాగలేదు. కానీ, అందుకోసం చదివిన పుస్తకాలు ఒకరకమయిన సాధారణ అవగాహనకి తోడ్పడ్డాయి. ఈమధ్య నేను తెలుగురచయిత్రులమీద ఇంగ్లీషులో ప్రచురించిన పుస్తకం ఆనాటి విఫలప్రయత్నమే! తూలిక.నెట్‌లో అనువాదాలవిషయంలో అమెరికనులతో పరిచయాలమూలంగా కూడా నాదృక్పథంలో కొంత స్పష్టత ఏర్పడింది.

రెండోది, నేను అమెరికా మెయిన్‌ స్ట్రీమ్‌లో కలవలేదు కానీ, టీవీలో న్యూస్ మేగజైనులు నిశితంగా పరిశీలించడంవల్ల నా ఆలోచనాధోరణి మెరుగు పడిందని అనుకుంటున్నాను. ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా రాబట్టాలీ అన్నది, ఏప్రశ్నకి సమాధానం ఎలా వుంటుంది లాటివి meet the press, 60-minutes లాటి న్యూస్ మేగజీన్స్‌‌ వల్ల తెలిశాయి నాకు. నన్ను అలరించిన మరొక విషయం – నేను పూర్వం, అంటే 1950, 60 దశకాల్లో, ప్రచురించిన కథలు మళ్లీ ఇప్పుడు తెలుగుతూలికలో పాఠకులని ఆకర్షించడం. అంటే ఆకథలు పాతబడిపోలేదు. వస్తువో, శైలో – ఏకారణంగానో నాకు తెలీదు కానీ ఆకథలు ఈనాటి పాఠకులదృష్టిని కూడా ఆకట్టుకున్నాయి. అది నేను చాలా గొప్పపడిపోయే విషయం. పాఠకులతో ప్రత్యక్షంగానూ (అంటే ఆన్లైనూ, ఫోనూ మాత్రమే) పరోక్షంగానూ కలిగిన సంబంధాలమూలంగా నాకు సాధకాలే కానీ బాధలేమీ కనిపించడంలేదు. బాగా ఆలోచిస్తే నాకు కలిగిన ఒక సందేహం – ఈ బ్లాగుల్లో ప్రచురణలు కాలానికి నిలుస్తాయా అన్నది. నేను నిజంగా తెలుగుతూలిక మొదలు పెట్టడానికి కారణం నారచనలు అన్నీ ఒకచోట వుంచుకుందాం అని మాత్రమే. పాఠకులస్పందన ఇలా వుంటుందని నాకు అప్పుడు తెలీదు. అయితే, ఒక రెండేళ్లు నాబ్లాగు అలా వదిలేస్తే ఏం అవుతుంది అన్నది నాకు తెలీడంలేదు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

12 Responses to కథా మాలతీయం – 5

  1. రాధిక says:

    “ఇది కథామాలతీయం శృంఖల లోని 4 భాగాలలో 5 వది.” —???

  2. మాలతి says:

    సంపాదకులకూ, స్వాతికుమారిగారికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

  3. మాలతి says:

    ఈభాగంలో తూలిక.నెట్ ద్వారా పరిచితురాలయి, స్నేహితురాలయిన శారద (ఆస్స్ట్రేలియా)ని తాత్కాలికంగా మరిచినందుకు ఆమెకు నా క్షమాపణలు. ఆమె తూలిక.నెట్ సైటుకి క్రియారూపంలో మద్దతు ఇస్తూ స్నేహితురాలయిపోయింది. మొదట్లో పి.హెచ్.డీ స్కాలరు. ఇప్పుడు డాక్టరేటు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడింది. చదువూ, సంసారం చూసుకుంటూ, ఇప్పటికి తొమ్మిది అనువాదాలు చేసి ఇచ్చింది తూలికకి. తూలికలో నాతరవాత ఇన్ని అనువాదాలు చేసిన రచయిత్రి ఆమె ఒక్కరే.
    శారదా, మరొకసారి, sorry for missing your name.

  4. radhika says:

    మాలతి గారూ నేనొకటి కనిపెట్టేసా.రాధిక లకి మీరంటే ఇష్టమో,మరి మీకు రాధికలంటే ఇష్టమో తెలియదు గానీ మీ చుట్టూ రాధికలు చాలా మందే వున్నారు 🙂

  5. మాలతి says:

    🙂 అవును, రాధికా. నాకు రాధికలంటే ఇష్టమే!

  6. మాలతి గారు, పాఠకుల స్పందన ఎప్పటికప్పుడు తెలియడం వలన వారి అభిప్రాయధోరణికి అణుగుణంగా మీ కొత్త రచనలను మార్చినప్పుడు అసలు ముందు అనుకున్న భావమే మారిపోయిన సందర్భాలేమన్నా ఉన్నాయా?

    btw, మనిద్దరికీ బ్లాగర్ కాని ఒక కామన్ ఫ్రెండ్ ఉంది 🙂

  7. మాలతి says:

    నిషిగంధా, భావాలు మారిపోవు కానీ చెప్పేవిధానంలో కొంత మార్పు వుంటోంది. ముఖ్యంగా తెలుగు నానుడి, జాతీయాలు చాలామందికి నచ్చుతున్నట్టుంది. అంచేత ప్రయత్నపూర్వకం అవి వెతికి పట్టుకుని, నాకథల్లో పెట్టేస్తున్నాను :). మౌలికంగా నాకున్న నమ్మకాలలో మార్పు వుండొచ్చు కానీ చాలా చాలా తక్కువ.
    🙂 అవును, ముగ్గురం మూడుమూలల్లో వున్నాం కదూ!

  8. parimalam says:

    “రచయిత్రిగా నాకు ఒక ప్రత్యేకస్థానం ఇచ్చి గౌరవిస్తున్నవారు బ్లాగరుల్లో లెక్కకు మిక్కిలిగా వున్నారు అనుకుంటాను. తలుచుకుంటే నాకు కనులు చెమరుస్తాయి. నామటుకు నాకు ఈ ఆదరాభిమానాలే సత్యమయినవి అనిపిస్తుంది.”చదువుతుంటే …బ్లాగు లోకం …ముఖ పరిచయమైనా లేని మిత్రుల ఆదరణ గుర్తొచ్చి నాకళ్ళు తడిశాయి మేడం !

  9. శారద says:

    మాలతి గారూ,
    మీరు నా పేరు ప్రస్తావించకపోయినా, మీకు నామీద వున్న అభిమానం నాకు బాగా తెలుసు. 🙂
    శారద

  10. “ముఖ్యంగా తెలుగు నానుడి, జాతీయాలు చాలామందికి నచ్చుతున్నట్టుంది.”
    ఎందుకని అనుకుంటున్నారు?

  11. మాలతి says:

    @శారదా, సరే. 🙂
    @నెటిజన్, మీకు నాకథలలో నచ్చిన అంశాలు ఏమిటో చెప్పండి. (ఏవో వున్నాయని అనుకుంటున్నాను).

  12. మాలతి says:

    @పరిమళం, నామాటలమూలంగా మీకు మీ ఆప్తులు గుర్తు రావడం సంతోషంగా వుంది. అదేనేమో రచనకి ప్రయోజనం.

Comments are closed.