కథా మాలతీయం – 2

స్వాతి:

మిమ్మల్నిప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు, సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమయిన సంఘటనలు, అబిమాన రచయితలు, వారి రచనల్లో మీకు నచ్చిన అంశాలు.

మాలతి:
నేను లైబ్రరీసైన్స్ డిప్లొమా చేస్తున్నరోజుల్లోనే, అంటే 1961లో నరసింహరాజుగారు కేవలం రచయిత్రులకథలు సంకలనంగా వేయడానికి పూనుకున్నారు “కల్పన” అన్నపేరుతో ‘62లో ప్రచురించారు. తెలుగు సాహిత్యచరిత్రలో రచయిత్రులకథా సంకలనాల్లో తొలిసంకలనం ఇదే. నాకథ సంకలనాల్లోకి ఎక్కడం కూడా అదే మొదలు.

మాయింట్లో ప్రోత్సాహం మాటకొస్తే, మాయింట్లో అట్టే మాట్లాడేరకాలు కాదని చెప్పేను కదా. ఎప్పుడు చూసినా ఎవరిపనుల్లో వాళ్లుండేవారు. నాపాట్న నేను ఏ చెట్టుకిందో, చెట్టుమీదో, డాబామీదో కాలక్షేపం చేసేదాన్ని. అంచేత మాయింట్లో ఎవరేనా నేను కాబోయే రచయిత్రిని అని పట్టించుకున్నారా అన్న ఆలోచనా లేదు, తెలిసిందీ కాదు నాకు.

కాకపోతే, ఒకసారి నాపుట్టినరోజుకి మాఅక్కయ్య readers digest చందా కట్టింది నాపేరుమీద. అలాగే మానాన్నగారు మేం గుంటూరులో వున్నప్పుడు విజయవాడలో ఆంధ్రప్రభ ఆఫీసుకి తీసుకెళ్లారు. అప్పట్లో నీలంరాజు వెంకటశేషయ్యగారు సంపాదకులు. మానాన్నగారు నన్ను పరిచయం చెయ్యడం, ఆయన అలాగా అన్నట్టు తలూపడం మాత్రమే గుర్తు నాకు.

మాఅమ్మకి కూడా నామీద ఏదో ప్రత్యేకాభిమానం వుందేమో. నేనే అలా అనుకున్నానో, అందరు పిల్లలూ అలాగే అనుకుంటారో నాకు తెలీదు. ఇదివరకే చెప్పేను, యస్సెల్సీ అయింతరవాత కొన్నాళ్లు వూరికే వున్నానని. ఆరోజుల్లో మాఅమ్మ ఎక్కడికేనా బయల్దేరితే, “పద” అనేది. నేను మాటాడకుండా, లేచి ఆవిడవెంట వెళ్లేదాన్ని. అంతే కానీ, ఈకాలప్పిల్లల్లాగ, ఎక్కడికీ, ఎందుకూ, నేను రాను అనలేదు ఎప్పుడూను.

ఆరోజుల్లో తలుచుకుంటే ముచ్చటగా అనిపించే ఒక సంఘటన – మాఅమ్మగారి గురువుగారు ఒకావిడ వుండేవారు సత్యనారాయణమ్మగారు అని. చిన్నతనంలోనే భర్త వదిలేస్తే. తమ్ముడిఇంట్లో వుండి, వేదాలూ, ఉపనిషత్తులూ చదువుకుని, ఇతరులకి బోధిస్తూ వుండేవారు. మా అమ్మ నన్ను వాళ్లింటికి వెళ్లి, ఆవిడ చెప్తుంటే, రాసుకుని రమ్మని పంపేది. అంచేత నేను సాయంత్రాలు వాళ్లింటికి వెళ్లి ఆవిడ డిక్టేషను రాసుకొచ్చేదాన్ని. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆరోజుల్లో ఒకసారి ఆవిడ ‘శ్చ’ అన్నచోట ‘చ్చ’ అని పలికేరు. నేను సంస్కృతం చదువుతున్నాను కనక ఆవిడ తప్పు పలుకుతున్నారు అని నాకు తెలిసింది. నేను ఆమాట చెప్పకుండా తలొంచుకుని రాస్తూ చ్చ కాకుండా శ్చ అని రాసేను. ఆవిడ అది చూసి, “శ్చ కాదు చ్చ, చ్చ” అన్నారు ఒత్తి పలుకుతూ. నేను రాసింది కొట్టేసి ఆవిడ చెప్పినట్టు చ్చ అని మళ్లీ రాసేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనసంస్కతిలో ప్రశ్నించడం లేదు చెప్పింది వినడమే తప్ప, మనకి మనం ఆలోచించుకోడమే కానీ “మీరు తప్పు” అని ఎదటివారిని ఎత్తి చూపడం లేదు. ఇప్పటికీ నాతత్త్వం ఇదే. ఎవరేనా ఏదైనా చెప్తే వెంటనే ప్రతివాదాలు చెయ్యలేను.

ఆ తరవాత 1956లో ఆంధ్రాయూనివర్సీటీలో ఇంగ్లీషు ఆనర్సులో చేరాను. ఆక్లాసులో విజయలక్ష్మి పరిచయం అయింది. విజయవాడనించి వచ్చి, హాస్టల్లో వుండి చదువుకుంది. అచిరకాలంలోనే మేం ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. తరుచూ మాయింటికి వచ్చేది. ఒకసారి వాళ్లమ్మ తనని చూడ్డానికి విశాఖపట్నం వచ్చారు. తను ఆవిడని మాయింటికి తీసుకొచ్చింది.

మనిళ్లలో ఆరోజుల్లో కొత్తగా వచ్చినవారికి ఇల్లు చూపడం ఒక సాంప్రదాయం. మనకి దాపరికాలు లేవు కదా. అలాగే మాఅమ్మ ఆవిడకి ఇల్లంతా చూపుతూ వంటింటిలోకి కూడా తీసుకెళ్లింది. నాకు తికమక అయింది. వాళ్లు వెళ్లిపోయనతరవాత మాఅమ్మతో అన్నాను, “వాళ్లు క్రిస్టియనులు అని చెప్పేను కదా” అని. దానికి మాఅమ్మ, “ఎవరయితేనేమిటి. శుభ్రంగా పసుపుకొమ్ముల్లా వున్నారు” అంది. శరీరచ్ఛాయమాట కాదు ఆవిడ అంటున్నది.

నేను ఎందుకలా అన్నానంటే మాఅక్కయ్యకి ఆచారాలు మహపట్టింపు. తనకి అబ్రాహ్మణ స్నేహితులు చాలామందే వున్నా వారింట పచ్చిమంచినీళ్లేనా తాగేది కాదు. వాళ్లు కూడా ఏం అనుకునేవారు కాదు. తను నన్ను హేళన చేసేది నాస్నేహితులగురించి. అంచేత నాకు భయంగా వుండేది ఈవిషయంలో.

1961లో డిప్లొమా అయింతరవాత బిలాస్పూర్‌లో ఒకసంవత్సరం మారెండో అన్నయ్య సీతారామారావు దగ్గర వున్నాను. అక్కడ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరరుగా పనిచేశాను. అప్పుడే కృష్ణమూర్తిగారితో పరిచయం అయింది. వాళ్ల తమ్ముడు ఆయనదగ్గర వుండేవాడు. తరుచూ మాయింటికి వస్తూ వుండేవాడు. వయసులో నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడు కనక తినడానికి ఏదేనా పెడుతుండేదాన్ని అప్పుడప్పుడు. ఒకసారి ఏదో తెలుగు సినిమాకి వెళ్లేడుట, మర్నాడు మధ్యాన్నం మాయింటికొచ్చి, “సినిమా చూస్తూంటే మీరు గుర్తొచ్చారండీ” అన్నాడు. ఎందుకంటే ఆసినిమాలో అమ్మాయిపేరు లతట. అందులో మరొక పాత్ర “మా లత” అంటాడు. “మాలత అనగానే మాలతి గుర్తొచ్చింది” అన్నాడు. అంతవరకూ రోజూ వచ్చిపోయే కుర్రాడు ఆమాటతో నాకు ఆత్మీయుడు అయిపోయాడు. వయసులో చిన్న అయిన అబ్బాయితో పెంచుకునే ఆత్మీయతల కథే “ఆడమనసు” కథ. అంటే అచ్చంగా అలాగే జరిగిందని కాదు. సుమారుగా అదే విషయంమీద రాసిన మరో కథ “మా మే స్త్రీత్త్వమ్”. కథల్లో వాస్తవికతమీద చెప్పవలసింది చాలావుంది. తరవాత చెప్తాను. ఈరెండు కథల్లో ప్రధానాంశంగురించి మాత్రం ఒకమాట ఇక్కడ చెప్తాను.

అందరు రచయితలూ ఏం చేస్తారో నాకు తెలీదు కానీ, నాకు కథకి సాధారణంగా ప్రేరణ ఒక్కవాక్యం, ఒక్క క్షణం స్పందన చాలు. ఆతరవాత మిగిలిన కథ అంతా కట్టుకథే. ఒక్కొక్కప్పుడు ఇతరసమయాల్లో జరిగిన ఇతర అనుభవాలూ, సంఘటనలూ ఈకథలో చోటు చేసుకోవచ్చు, పైకథలో “ఆడవాళ్లు తొందరగా ఆత్మీయతలు పెంచుకుంటారు. అది భరించడం కష్టం. అబ్బాయిలు చిన్నతనంలో అలా వుంటారు కానీ పెద్దయినకొద్దీ ఇతరవ్యాపకాలమీదకి పోతుంది వారి దృష్టి. అంచేత ఈ సౌహార్ద్రత తగ్గిపోతుంది” అని చెప్పడానికి ప్రయత్నించేను. ఇప్పుడు కొన్ని బ్లాగుల్లో కవితలు చూస్తుంటే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఆర్ద్రత నింపుకున్నభావాలు అందరికీ వుంటాయి. వెలిబుచ్చేవిధానంలోనే తేడాలు.

1962లో ఢిల్లీ వెళ్లేను లైబ్రరీసైన్సులో మాస్టర్స్ డిగ్రీకోసం. అదే మొదటిసారి నేను ఇల్లు వదిలి బయటికి వెళ్లడం. ఖర్చులు పెట్టుకోలేక, శలవులకి ఇంటికి రాలేదు మొత్తం ఏడాది చదువు పూర్తయేవరకూ. మధ్యలో మధ్యప్రదేశ్‌లో మాఅన్నయ్య వున్నాడు. తిరుగుప్రయాణంవేళ మాఅమ్మ మాఅన్నయ్యకి రాసింది, “మధ్యలో దాన్ని అక్కడ దిగమనకు, తిన్నగా ఇంటికి రమ్మను” అని. మేం అయిదుగురం అయినా, నేను ఒక్కదాన్నే మాఅమ్మవెనకే తిరుగుతూ వుండేదాన్ని సర్వవేళలా, సర్వావస్థలయందూ.

నాఢిల్లీరోజులు తలుచుకున్నప్పుడు, నాగురించి నాకు తెలిసే మరోవిషయం అందరూ చేసినపనీ, అందరూ చేస్తున్నారు కదా అనీ చెయ్యడం ఎప్పుడూ లేదు. కావలిస్తే ఉలిపికట్టె అనుకోండి. కానీ, కథలకి అదే బలం నన్నడిగితే. అందరూ చెప్పినమాట కాక ఇంకా చెప్పగలిగినది ఏదైనా వుంటేనే కథ రాయాలి అని నా నమ్మకం. లేదా, తెలిసినవిషయమే అయినా అందరూ నిర్లక్ష్యం చేస్తూంటేనూ, అలా నిర్లక్ష్యం చేయదగని విషయం అయితేనూ కథల్లో చెప్తాను. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఏడాదిపాటు ఢిల్లీలో వున్నా, తాజ్ మహల్ చూడ్డానికి వెళ్లలేదు. మీరు స్టుపిడ్ అంటే అనండి. అందరూ వేలంవెర్రిగా అదేపనిగా మాటాడుతుంటే నాకు turn off అయిపోయిందది!

మాఅమ్మ ఎక్కువ మాటాడేది కాదు కానీ, మాట్లాడినప్పుడు మాత్రం పదునుగా వుండేవి ఆవిడ భాషణలు. నాభాషలో పదును కూడా కొంతవరకూ మాఅమ్మదగ్గర్నుంచే వచ్చింది. ఈమధ్య చాతకపక్షులు నవలలో “కింద పెడితే పంటలుండవు, మీదపెడితే వానలుండవు” అన్నవాక్యం చదివి నవ్వుకున్నానన్నారు తెరెసా. అది మాఅమ్మదగ్గర్నించి వచ్చిందే. అలాగే మరోకథలో “మప్పొచ్చు కానీ తిప్పలేం” అన్నది. అలవాటు చేసేయడం తేలికే కానీ ఆ అలవాటు మళ్లీ మానిపించడం కష్టం అన్న అర్థంలో.

భాషవిషయంలో నాకు రెండో మార్గదర్శకం రావిశాస్త్రి కథలు. నేను రెండోసారి చదవగల కథలు రావిశాస్త్రివి మాత్రమే. ఆ కథల్లో ప్రతిమాటా తూచి వాడినట్టుంటుంది. చమత్కారం, ఎత్తిపొడుపూ, వ్యంగ్యం – ఏ కోణం తీసుకున్నా ఎంతో ప్రతిభావంతంగా తోస్తుంది ఆ పదవిన్నాణం. రావిశాస్త్రిగారు ఇంగ్లీషుమాటలు వాడినప్పుడు కూడా “ఈరోజుల్లో అందరూ అలాగే మాటాడతారు” అని కాక ఒక ప్రత్యేకకోణం దృష్టిలో పెట్టుకుని వాడినట్టు అనిపిస్తుంది నాకు. మరోలా చెప్పాలంటే వాడిన ప్రతిపదానికీ ఒక విలువ వుండాలి. ఒక అర్థం స్ఫురించాలి. మాటలకున్న బలం నాకు తెలిసింది వీరిద్దరిమూలానే.

ఆనర్సురోజుల్లో చదివిన ఇంగ్లీషునవలల్లో నన్ను బాగా ఆకట్టుకున్నవి థామస్ హార్డీ, మరీ కొరెల్లీ అని చెప్పేను కదా. హార్డీ కథల్లో, Mayor of Casterbridge వంటి నవలల్లో మనసంస్కతిలోగల కర్మ వేదాంతం కనిపిస్తుంది. మన జీవితం మనచేతుల్లో లేదన్న సంగతి నామనోఫలకంమీద గట్టిముద్రే వేసింది. ఇంతకాలం తరవాత తిరిగి చూసుకుంటే నాఅనుభవాలు కూడా అదే చెప్తున్నాయి. ఆయనకథల్లో మలుపులఛాయలు నాకథల్లో కనిపించొచ్చు.

కొరెల్లీ నవలల్లో నాకు బాగా గుర్తుండిపోయిన నవల Sorrows of Satan. ఇందులో ప్రథానాంశం మానవజీవితాలు మంచిచెడులమధ్య సంఘర్షణే అయినా, చెడుకి ప్రతీక అయిన Satan మనిషి చెడుని కాక మంచిని ఆశ్రయిస్తే, తాను (సాతాను) పరాజితుడయి, తనదుష్టశక్తులనుండి విముక్తి పొంది వుండేవాడనీ, అలా కాక మనిషి చెడునే ఆశ్రయించడం మూలంగా తనకి కూడా విముక్తి లేకుండా చేసాడనీ విచారిస్తాడు. ఇందులో కూడా హార్డీ కథల్లోలాగే మానవవిలువలు మనసంస్కృతిలో కంటే భిన్నంగా లేవు అనిపించింది నాకు.

ఇలాటిదే మరో నవల magnificent obsession. ఇందులో కూడా ఫలాపేక్ష లేకుండా ఇతరులకి సాయం చెయ్యడం. నిజానికి ఫలాపేక్ష వుంది కానీ ఆ ఫలం తనకి కాదు. వేరే ఎవరయినా ఆపదలో వున్నప్పుడు ఆదుకుని, అప్పు తీర్చాలి అన్న నియమం ప్రధానాంశం ఆనవలలో. మనసంస్కృతిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అప్పు తీర్చేసుకోడాలు లేవు. మనసంస్కృతిలో నిత్యజీవితంలో సాయం ఒక భాగం. ఎవరికి ఎప్పుడు సాయం కావలిస్తే అప్పుడు ఎవరో ఒకరు ఆదుకుంటారు. అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు నవనాగరీకప్రపంచంలో ఇది మారిపోయింది. ఎక్కడికక్కడే అప్పులు తీర్చేస్తున్నారు.

చెప్పొచ్చేమాటేమిటంటే, ఇలాటితర్కం నాకు భిన్నసంస్కతుల్లో భిన్నత్వాన్ని కాక అంతర్లీనంగా వున్న ఐక్యత అర్థం చేసుకోడానికి తోడ్పడింది. అమెరికా వచ్చేక ఇది మరింత స్పష్టం అయింది.

హాస్యం, శైలిలో చమత్కారం చదివి ఆనందించడానికి ముళ్లపూడి వెంకటరమణ, భమిడిపాటి కామేశ్వరరావు, మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం వంటివి చాలా పనికొచ్చేయి. ఇంగ్లీషుపుస్తకాల్లో ఓహెన్రీ, పి.జి. ఓడ్‌హౌస్ పేర్లు గుర్తుకొస్తున్నాయి.

ఓడ్‌హౌస్‌కథల్లో, ఒక కథలో తండ్రి కొడుక్కి ప్రతిరోజూ ఒకమంచి పని చెయ్యమని చెప్తాడు. ఆ అబ్బాయి సరేనంటాడు. ఒకరోజు ఏం చెయ్యడానికీ కనిపించక, తంఢ్రిబూట్లు పాలిష్ చేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే బూట్లు నల్లవి, ఎదురుగా వున్న పాలిష్ బ్రౌను. తను చెయ్యాల్సింది మంచిపనే కదా అని ఆనల్లబూట్లకి బ్రౌన్ పాలిష్ వేసేస్తాడు ఆ అబ్బాయి. అంటే ఫలితాలు సరిగ్గా చూసుకోకుండా, చెయ్యాలి కనక చేస్తున్నాను అని చేస్తే ఇలాగే వుంటాయి అంటాడు రచయిత. నాకు ఇందులో మంచిపాఠం కనిపించడంచేత ఇప్పటికీ గుర్తుంది.

స్థూలంగా చెప్పాలంటే, నేను చదివిన పుస్తకాలు ఏమిటి, ఏపుస్తకంలోంచి ఏం కోట్ చెయ్యగలనూ అని కాక, ఆపుస్తకం స్థూలంగా నామనసులో వేసినముద్ర ఏమిటి అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. నాకు చాలా విషయాలు జ్ఞాపకం వుండవు. కానీ ఆవిషయాలు నాలో విడమర్చి చెప్పలేనంతగా లీనం అయిపోయి “ఈనాటి నేను”గా అర్థం చేసుకోవాలి.

చాలామంది పండితులకీ నాకూ అదే తేడా. వాళ్లందరూ పేజీలకి పేజీలు ఒప్పచెప్పేయగలరు. పాండిత్యానికి అదే చిహ్నం అంటారు. నాకలా కాదు. నేనెంత చదివేను అన్నది కాక ఆచదువుమూలంగా నావ్యక్తిత్వం ఎలా రూపురేఖలు దిద్దుకుంటోంది అన్నదే నాకు ప్రధానం.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

8 Responses to కథా మాలతీయం – 2

  1. మాలతి గారూ, చక్కగ ఓ కథలానే చెప్పారు. మీ నేనూ నా రచనలూ, కథల వెనక కథలు, ఇవి అన్నీ కలిపి పుస్తకం వేయవచ్చు.

    అవునూ ఇవన్నీ మీ మనసు పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నారా? ఎప్పటెప్పటి జ్ఞాపకాలూ!

  2. Purnima says:

    >> ఆ విషయాలు నాలో విడమర్చి చెప్పలేనంతగా లీనం అయిపోయి “ఈనాటి నేను”గా అర్థం చేసుకోవాలి.

    Wow! I bow to you! నా మదిలో ఉన్న భావాలకి అందమైన భాష వచ్చింది మీ వాక్యంతో! 🙂

  3. రైటో! చులాగ్గా సాగుతుంది ఇంటర్వ్యూ.
    ఆసక్తికరంగా ఉంది.

  4. parimalam says:

    మాలతి గారూ ! మీ జ్ఞాపకాల్ని మాకు పంచిపెడుతూ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగుతోంది .మీ జ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోకుండా ఉండలేక పోతున్నాను .

  5. సిరిసిరిమువ్వ, పరిమళం, పుస్తకం అయేట్టే వుంది. స్వాతి ఎస్సే ప్రశ్నలు వేసేస్తున్నారు :). రాస్తూంటే గుర్తొస్తున్నాయండీ. నాకూ ఆశ్చర్యంగానే వుంది.
    పూర్ణిమా, ప్రవీణ్, – మీకు ఆసక్తికరంగా వున్నందుకు సంతోషం.

  6. teresa says:

    ఇప్పటి వరకూ మాలతి గారి తూలిక లో తూగునీ,వయ్యారాన్నే చూసి అభిమానించిన నాకు ఈ ఇంట ర్వ్యూ చదివాక ఆమెపై గౌరవం రెట్టింపయ్యింది. mAlati garu, you are amazing! Hoping to see more strokes from your brush 🙂

  7. ఇంటర్వ్యూలంటే అదీ ఇలా అంతర్జాలంలో అంటే, అడిగిన ప్రశ్నకి ఒకటి రెండు వాక్యాలలో ముక్తసరి సమాధానాలతో సరిపెట్టేవారినే ఎక్కువగా చూశాను.. మాలతి గారు, మీ సమాధానాలు ఎంతో విపులంగా ఉండడమే కాకుండా, మీరు ఎన్నెన్నో విషయాలను మననం చేసుకుంటున్న విధానం చాలా బావుంది!! నేను మీ మాటల వేలు పట్టుకుని మీ జ్ఞాపకాల వీధుల్లో తిరిగేస్తూ అబ్బురపడిపోతున్నాను..

  8. తెరెసా, తూగూ, వయ్యారమూనా, భలేవారే. మీరు వ్యాఖ్యలు దాటి కవితల్లోకి వచ్చేసారు. విడిగా కథలూ, కవితలూ రాయాలి మీరు. మీకు నాయందున్న అభిమాన మాత్రం అపురూపం.
    నిషిగంధా, నేను మాఅమ్మవేలు పట్టుకు నడిస్తే, మీరు నామాటలవేలు పట్టుకుని తిరుగుతూ ఆనందించేస్తున్నారన్నమాట. ఈసౌలభ్యం ఒక్క అంతర్జాలంలోనే సాధ్యం అనుకుంటా. ధన్యవాదాలు మీ అభిమానానికి.
    మాలతి

Comments are closed.