కథా మాలతీయం – 1

నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో  ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా ప్రచురించారు. ఇది చాలు, ఆవిడ  బ్లాగ్లోకంలో ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చెప్పటానికి.

పొద్దులో ఆవిడ అంతరంగ ఆవిష్కరణని ప్రచురించాలని సంప్రదించినప్పుడు దీని పట్ల పాఠకులకి ఆసక్తి ఉంటుందా అని సందేహించారు. కానీ రచయిత్రిగా, స్త్రీ గా తన అనుభవాలూ, ప్రఖ్యాత రచయితలతో సాన్నిహిత్యం వల్ల కలిగిన పరిణితి, ఖండాంతర జీ్వన విధానాల్లో పరిశీలన వీటి సారాంశం నేటి తరం పాఠకులకి తప్పక పనికొస్తాయనే  వాదనను ఒప్పుకుని ఇది రాయటానికి అంగీకరించారు.

స్వాతి(పొద్దు సంవర్గం నుండి):
ముందుగా మీ స్వపరిచయం, పుట్టి పెరిగిన ప్రాంతం,సాహిత్యాభిరుచి ఎలా ఏర్పడింది, మిమ్మల్ని నిజజీవితంలో ప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు,కథలకు సాహిత్యానికి సంబంధించి ముఖ్యమైన సంఘటనలు:

మాలతిః

మొదట పొద్దువారికి నా ఆలోచనలూ, ఆనుభవాలూ, ఆశయాలూ, కోరికలూ, (కదాచితుగా ఆవేదనలూ) అన్నీ ఒకచోట పెట్టడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరొక హెచ్చరిక. నేను ఇక్కడ రాయబోయే నా పూర్వరంగంమీద ఈనాటి ఆలోచనలప్రభావం ఎంతో కొంత వుంటుంది తప్పకుండా. అంచేత కొన్నివిషయాల్లో ఆనాడు ఇలాగే ఆలోచించి అలా చేసేను అని ఖచ్చితంగా చెప్పలేను. చెప్పడానికి ప్రయత్నిస్తాను అని మాత్రమే చెప్పగలను.

నా సాహిత్యవ్యవసాయం నావ్యక్తిత్వంలో చాలా పెద్దభాగం. నేను కూడా ఆనాటిఅందరు ఆడపిల్లల్లాగానే చాలా మప్పితంగా – పెద్దలయందు భయభక్తులతోనూ, పిన్నలయందు ఆదరాభిమానాలతోనూ – పెరిగాను. నేను మాట్లాడ్డం తక్కువా, వినడం ఎక్కువా. “నిజంగా చెప్పవలసింది లేకపోతే మాట్లాడ్డం ఎందుకూ? నోటితుప్పర్లు దండుగ”, అనీ ఆయుఃక్షీణం అనీ అనేది మాఅమ్మ. రెండోది మాటకి మాట జవాబు చెప్పకుండా, ఆలోచించుకోడం. చిన్నప్పట్నుంచీ ఆలోచించడం నా ప్రవృత్తిగా వుంటూ వచ్చింది.

తోటిపిల్లలతో ఆడుకోడం తక్కువ. విశాఖపట్నంలో మహరాణీపేటలో మాడాబామీద చాపేసుకుని వెల్లకిలా పడుకుని యారాడ కొండమీద లైట్‌హౌస్ వెలుగులు పంచలో గోడమీద మెరుస్తుంటే మెరుపుకీ మెరుపుకీ మధ్య విరామం లెక్కపెడుతూనో, పిట్టగోడదగ్గర నిలబడి సముద్రపు హోరు వింటూ, అరవిరసిన సంపెంగమొగ్గలు లెక్కపెడుతూనో గడిపిన గంటలే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చినవి.

పుస్తకాలు కూడా చదవేదాన్ని. మానాన్నగారు పుస్తకాలూ, పత్రికలూ బాగానే కొనేవారు.
నా వ్యక్తిత్వం ఇప్పుడు నేను ఉన్నట్టు రూపు దిద్దుకోడానికి కారణం కొంతవరకూ మాఇంట్లోనూ సంఘంలోనూ కూడా ఆనాటి వాతావరణమే. నాకు పదేళ్లు వచ్చేవరకూ మేం అడయారులో వుండేవాళ్లం. మానాన్నగారు థియొసాఫికల్ సొసైటీవారి స్కూల్లో లెక్కలమేష్టరుగా పని చేశారు. ప్రఖ్యాత నాట్య విదుషి రుక్మిణీ అరండేల్ ఛాయామాత్రంగా గుర్తున్నారు. ఆనీబెసెంటు అప్పటికి లేరనుకుంటాను కానీ ఆమె బొమ్మ బాగా గుర్తు. ఆ సొసైటీ తాలూకు మౌలికభావనల ప్రభావం మానాన్నగారిమీద   వుందనుకుంటాను. ఆయన గానీ మా అమ్మ గానీ ఆడపిల్ల అని నన్ను కించపరిచేవిధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మరిన్ని వివరాలకి నాబ్లాగులో టపాలు, “నేనూ, నారచనలూ”, “కథలవెనక కథలు” చూడండి. డా. వాసా ప్రభావతిగారు “నేనూ, నారచనలూ” అన్న శీర్షికతో పుస్తకరూపంలో పబ్లిష్ చేస్తున్నారు. అందులో నావ్యాసం అదే శీర్షికతో వుంది. కొన్ని మార్పులతో నేను నా బ్లాగులో పెట్టేను.

సమాజంలో ప్రతివారూ చదివి విజ్ఞానవంతులు కావాలని భారీఎత్తున పత్రికలూ, సంఘసంస్కర్తలూ ఘోషించిన రోజులు అవి. అంచేత నేను అప్పట్లో బాగానే చదివేదాన్ని. అందుబాటులో వున్న తెలుగుపుస్తకాలే కాక ఆర్ధర్ కానన్ ‌డాయిల్, అగాథా క్రిస్టీ, ఓహెన్రీ కథలూ, నవలలతోబాటు ఇతర పుస్తకాలు లైబ్రరీనించి తెచ్చుకుని చదివేదాన్ని.  మా అమ్మ చదవమందని భగవద్గీత, భక్తవిజయంలాటి మతపరమైన పుస్తకాలూ చదివేను. నేను హైస్కూల్లోనూ కాలేజీలోనూ సంస్కృతం అభిమానభాషగా తీసుకోడంచేత కుమారసంభవం, మాళవికాగ్నిమిత్రంలాటి కావ్యాలు చదివేను. యూనివర్సిటీలో ఇంగ్లీషు ఆనర్సు చేసినప్పుడు థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్ వంటి వారి రచనలమీద అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా ఆరోజుల్లో నన్ను చాలా ఎక్కవగా ఆకట్టుకున్నది బ్రిటిష్ రచయిత్రి Marie Corellie. ఆవిడ రచనల్లో వ్యంగ్యంపాలు ఎక్కువ మిగతా రచయిత్రులలో కంటే. ఈ రచనలగురించి ఇప్పుడు నన్ను అడక్కండి. ఆపేర్లు మాత్రమే గుర్తున్నాయి నాకు. కానీ వారి ప్రభావం నారచనల్లో అంతర్లీనమయి కనిపించవచ్చు.

పుస్తకాలు చదవమని ప్రోత్సహించిన మా అమ్మే ఒకోసారి, “ఎందుకలా ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటావు. బ్రెయను చెడిపోతుంది” అనేది. (మా అమ్మ బుర్ర అనకుండా బ్రెయిను అనడంవల్ల అనుకుంటాను ఈ వాక్యం నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది.) ఇప్పుడు తల్చుకుంటే నాకు అనిపిస్తుంది ఆవిడ మాటల్లో సత్యం. మెడికల్ వ్యావహారికంలో కాదు కానీ “బ్రెయిను చెడిపోలేదు కానీ బతుకు చెడిపోయింది” అనిపిస్తోంది ఇప్పుడు .  ప్రశ్నలు “అతి” అయినప్పుడు నిత్యజీవితంలో వాస్తవాలు కంటికానవు. ఒకొకప్పుడు అనర్థాలకి దారి తీస్తాయి. ఆహారం, నిద్రాలాగే మెదడుకి పెట్టే మేత కూడా మితంగానే వుండాలి జీవతం సుగమం కావాలంటే. నా ఈ సిద్ధాంతం మీకు చాలా చోట్ల మళ్లీ మళ్లీ కనిపిస్తుంది ముందు ముందు. ఎందుకంటే ఇది నాకథ కనక!

నేను కథలు రాయడం, ఏదో పత్రికకి పంపడమే కానీ ఖచ్చితంగా ఎలా మొదలయిందో చెప్పలేను. ఈమధ్యనే నా తొమ్మిదో క్లాసులో క్లాసుమేటు, శాంత, అమెరికా వచ్చి, వాళ్లస్నేహితులఇంట్లో తెలుగుజ్యోతిలో నాకథ చూసి, బ్రహ్మానందపడిపోతూ, మాలతిని నాకు తెలుసు అందిట. ఆ యింటాయన వెంటనే ఇంటర్నెట్ ఎక్కేసి, నా నెంబరు ఆరా తీసి, నన్ను పిలిచేసారు. తను చెప్పింది నేను ఆరోజుల్లో మూడు కథలు రాసేననీ, అందులో ఒక కథపేరు చాదస్తం అనీ. అందులో ఒక వైదికబ్రాహ్మణుడి చాదస్తపు అలవాటు హేళన చేస్తూ రాసేననీ, అందుకు మా ఇంగ్లీషుమాస్టారికి చాలా కోపం వచ్చిందనీ. అదే నారాతల తొలిఅనుభవం అనుకోవాలి.
“కథల అత్తయ్యగారు” అన్న టపాలో నాకు కథలయందు గల ఆసక్తిగురించి రాసేను. కానీ కథలంటే ఆసక్తిలేని పిల్లలెవరు. అయితే నావిషయంలో కాలక్రమం చూస్తే, నేను 8వ క్లాసువరకూ మంగళగిరిలో వున్నాను (1950), ఆ వెంటనే, 1951లో, 9వ క్లాసులో గుంటూరులో వుండగా మూడు కథలు రాయడం చూస్తే, అత్తయ్యగారి కథనప్రభావం కొంతవరకూ నామీద వుందనే అనుకోవాలి.  అందులో చమత్కారం ఏమిటంటే, అత్తయ్యగారు సద్బ్రాహ్మణులు. సదాచార సంపన్నులు. మరి ఆవిడ చెప్పినకథలూ, వారి ఆచారవ్యవహారాలు చూసిన నేను, ఆమెయందు ఎంతో గౌరవం, అభిమానం గల నేను, ఒక ఆచారాన్ని హేళన చేసే కథ ఎందుకు రాసేను అంటే సమాధానం అది నావ్యక్తిత్వంలో భాగమే అయివుండాలి. మా అమ్మా, నాన్నగారూ కూడా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం నాకు కల్పించేరు.

ఆతరవాత నారచనావ్యాసంగంలో చెప్పుకోదగ్గ సంఘటన 1961లో నేను ఆంధ్రాయూనివర్సిటీలో లైబ్రరీసైన్సు డిప్లొమా క్లాసులో చేరినప్పుడు జరిగింది. అప్పటికి చాలాకాలంగానే నేను కథలు రాస్తున్నా నన్నెవరు గానీ గుర్తు పడతారని అనుకోలేదు అంతవరకూ.

ఎంచేతో జ్ఞాపకంలేదు కానీ నేను మొదటిరోజు క్లాసుకి వెళ్లలేదు. రెండోరోజు క్లాసు అయిన వెంటనే, ఒకాయన నాబల్లదగ్గరకొచ్చి “మీరు నిన్న రాలేదు కదా. ఇదుగో నోట్సు” అని ఓకాయితం నాబల్లమీద పెట్టేరు.నేను అడక్కుండా ఆయన అలా నోట్సు ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది.అప్పటికింకా థాంక్సులు వాడకంలోకి రాలేదు. పేరు చెప్పడం కూడా అలవాటు కాదనే అనుకుంటాను. కానీ ఆరోజు మాత్రం నేను ఆకాయితం తీసుకుని, “నాపేరు మాలతి” అన్నాను.

ఆయన వెంటనే “నాకు తెలుసు. మీరు ఈక్లాసులో చేరబోతున్నారని రావిశాస్త్రిగారు చెప్పేరు” అన్నారు.ఆరోజు నాకు కలిగిన ఆశ్చర్యం ఇప్పటికీ అలేగే వుంది మనసులో. రావిశాస్త్రిగారు మా వీధిలోనే రెండోచివర వుంటారని నాకు తెలుసు కానీ వారింట్లో “మాట్లాడుకునేంత సబ్జెక్టుని” అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనకెలా తెలిసిందో నాకు తెలీదు.

ఇంతకీ ఆనోట్సు ఇచ్చినవారి పేరు గణపతిరాజు నరసింహరాజు గారు. (ఆయన పూర్తిపేరు చాలా పెద్దదిలెండి. పొడి అక్షరాలలో జి.వి.యస్.యల్. యన్. రాజుగారు). ఇప్పటికీ నన్ను స్నేహపూర్వకంగా పలకరించే ఆప్తమిత్రులే ఆయన.

అలా ఆరోజు “ఓహో, సుప్రసిద్ధరచయితలు నన్ను గుర్తు పట్టేరన్నమాట” అని తొలిసారిగా తెలుసుకున్నాను.
ఆ తరవాత నరసింహరాజుగారి ప్రోత్సాహంతోనే విశాఖసాహితి మీటింగులకి కూడా వెళ్లేను. కాస్త గుర్తున్నవి ఒకటి రంగనాయకమ్మగారింట్లో జరిగింది, రెండోది బలివాడ కాంతారావుగారింట్లో జరిగిందీను మూడో మీటింగు విశాఖ రీడింగురూం జరిగింది.  (అప్పటికి నావయసు ఇరవైనాలుగో, ఇరవై అయిదో) ఆ మీటింగులో నేను కాళీపట్నం రామారావుగారిని చూసి, వారికథని విమర్శించేనని ఆయనే చెప్పేరనీ రిసెర్చి స్కాలరు, బోనాల సుబ్బలక్ష్మి, చెప్పేరు 2002లో విశాఖ సాహితి మీటింగులో చెప్పేరు.

ఇంతకీ ఇదెందుకు చెప్తున్నానంటే, అప్పుడప్పుడు నాటపాలమీద వ్యాఖ్యలలో “మాకు రాయడానికి ధైర్యం లేదండి” అంటారు. నా అభిప్రాయంలో ఎవరేనా “ఒకకథకి ఎలా స్పందించేరు అన్నది చెప్పడానికి వయసు ఆటంకం కానక్కర్లేదు” అని. “చెప్పిందెవరూ అన్నమాట కంటె చెప్పింది ఏమిటి” అన్నది ముఖ్యం అని. అలాగే ఆ చెప్పినమాటకి నేను ప్రతిస్పందనగా చెప్పగలిగింది ఏమైనా వుంటే అవతలివారు పెద్దవారా చిన్నవారా అన్న అనుమానం పెట్టుకోకుండా చెప్తాను. నాకు ఈ స్ఫూర్తి కలిగించినవారు తెలుగుబ్లాగరులే.

స్వాతి: మీ సైటు,బ్లాగు పేర్ల లో ఉన్న ‘తూలిక ‘ కథ ఏమిటి?

మాలతి: అది ఎలా వచ్చిందంటే – ఇక్కడ, (మాడిసన్‌లో) ఎండాకాలంలో ఫార్మర్స్ మార్కెట్ అని ప్రతి శనివారం వుంటుంది. చుట్టుపక్కల పల్లెలనించీ రైతులు అప్పటికప్పుడు కోసుకొచ్చిన కూరలూ, పళ్లతోపాటు, ఇతరవస్తువులు కూడా అమ్మకానికి తీసుకొస్తారు. ఆరైతులు నిరాడంబరంగా, నిష్కల్మషంగా కనిపిస్తూ మన పల్లెల్లో రైతులని గుర్తుకి తెస్తారు. ఆ అనుభూతికోసం అక్కడికి వెళ్తాను. అలా ఒకసారి వెళ్లినప్పుడు నెమలి ఈకలు కనిపించేయి. (మళ్లీ తరవాత ఎప్పుడూ కనిపించలేదు, విచిత్రం.). డాలరుకొకటి చొప్పున మూడు ఈకలు కొన్నాను.

ఆ తరవాత తూలిక ప్రారంభించినప్పుడు (వివరాలకి నా టపా కథలవెనక కథలు చూడండి,) మన పూర్వకవులు గంటం పుచ్చుకు రాయడం గుర్తొచ్చింది. నేను అనువాదం చేయదల్చుకున్నవి పాత కథలు కనక, (50,60 దశకం) కనక ఆబొమ్మ బాగుంటుందనిపించింది. ఎదురుగా నెమలి ఈక కనిపించింది. సరే ఆ ఈక పుచ్చుకు, గాజులేసుకుని, మాఆఫీసులో నా స్నేహితురాలిచేత (నా డైరెక్షనులో) నా చెయ్యి ఫొటో తీయించేను. అప్పుడే నా సైటుకి తూలిక అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆతరవాత చాలామంది ఆ బొమ్మా, పేరూ కూడా బాగున్నాయని మెచ్చుకోడంతో అదే నా లోగో అయిపోయింది. ఇప్పటికీ నా బెస్టుఫొటో అదేనేమో! తూలిక గురించిన విషయాలు విస్తృతంగా రెండు టపాల్లో చర్చించేను. 1. నా సాహిత్య దృక్పథం. 2. నేనూ, నారచనలు.

సంబంధిత టపాలు.
1. నేనూ, నారచనలూ
2. నా సాహిత్యదృక్పథం
3. కథల అత్తయ్యగారు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to కథా మాలతీయం – 1

  1. మంచి ప్రయత్నం. ఓ మంచి రచయిత్రి అంతరంగం తెలుసుకునే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. స్వాతి గారికి అభినందనలు. యాదృచ్చికమో ఏమో నాకు తెలియదు కానీ ప్రస్తుతం నేను మాలతి గారి నిజానికి ఫెమినిజానికి మధ్య కథల సంపుటి చదువుతున్నాను.

  2. parimalam says:

    చాతక పక్షులు రచయిత్రిగా మా బ్లాగరులందరికీ సుపరిచితులైన మాలతి గారి అంతరంగ తరంగాలను మాముందుకు తెచ్చిన స్వాతి గారికి ధన్యవాదాలు .

  3. john hyde says:

    మాలతి గారి అంతరంగ తరంగాలను మాముందుకు తెచ్చిన స్వాతి గారికి ధన్యవాదాలు .

  4. మాలతి గారూ,
    మీతో మాట్లాడుతున్నట్లే ఉంది నాకు!మీ కథల్లో నాకు ఫేవరెట్లు బోలెడున్నాయి,విషప్పురుగుతో సహా!మళ్ళీ చెప్తున్నాను, కొడవటిగంటి, చాసోల తర్వాత ఆ స్థాయి ఫ్లో మీ కథల్లోనే కనపడుతుంది నాకు.
    ఎందుకో మొదటి రెండు రోజులూ కథా మాలతీయం నాకు ఓపెన్ కాలేదు. ఇవాళ చూసి ఆలస్యంగా రాసాను వ్యాఖ్య!

  5. Madhuravani says:

    మాలతి గారి అంతరంగాన్ని ఆవిష్కరించే బృహత్కార్యానికి పూనుకున్నందుకు స్వాతి గారికీ.. పొద్దు వారికీ ధన్యవాదాలు.
    మాలతి గారూ..
    అనుకోకుండా మీ బ్లాగు పోస్టులు చదివి.. అతి తక్కువ కాలంలో మీ బ్లాగుకు చాలా అలవాటైపోయాను నేను. మీరు రాసే శైలి, మీ చతురత, స్నేహశీలత్వం, నిరాడంబరత్వం చూసి మీరింత అనుభవజ్ఞులనీ.. మీ వెనుక ఇన్నేళ్ళ రచనా అనుభవం.. ఇంత విస్తృత సాహితీ సేవ.. ఉన్నాయని ఊహించనే లేదు. మీ గత రచనల గురించి..మీ రచనా వ్యాసంగం గురించి తెర వెనుక కబుర్లు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చర్చానుగుణంగా మీ బ్లాగు పోస్టుల లింక్స్ ఇవ్వడం చాలా బాగుంది. మీరు ‘తెలుగు తూలిక’ ద్వారా మాలాంటి వారికి పరిచయం అవ్వడం.. మీ వ్రాతలు చదివే అవకాశం కలగడం.. మా తరానికి దక్కిన అరుదైన అదృష్టమనే చెప్పాలి.
    మా అందరి తరపునా మీకివే పొద్దుముఖంగా హృదయపూర్వక అభినందనలు.

  6. ఆదిలోనే చిన్నపొరపాటు జరిగింది. నేను ప్రత్యేకించి చెప్పుకోవలసింది స్వాతికుమారికి నాధన్యవాదాలు నన్ను ఇంటర్వూ సబ్జెక్టుగా స్వీకరించినందుకు, కథామాలతీయం అన్నపేరు పెట్టినందుకు. నాకు బాగుంది.
    సిరిసిరిమువ్వ, పరిమళం, జాన్ హైడ్, మీరు ఆసక్తి చూపడం నాకు ఆనందంగావుంది
    సుజాత, కొ.కు., చాసోకీ నాకూ పోలికేమిటి కానీ నీఅభిమానానికి సంతోషం.
    మధుర వాణీ, మరీ నన్ను మీరందరూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. నేనంతటి పొగడ్తలకి తగుతాను అనుకోను.

  7. పైవాళ్ళ బాటే నాబాట కూడా,

  8. రాఘవ says:

    రెండోభాగం కూడా త్వరగా ప్రచురిద్దురూ.

  9. excellent idea.
    ఈ అవిడియా నాకెందుకు రాలేదు చెప్మా!

  10. Pingback: మా మే స్త్రీత్త్వమ్ « తెలుగు తూలిక

  11. అద్భుతమయిన ఆలోచన. రచయితల అంతరంగాలు తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం.
    అలాగే వారి రచనలను ప్రభావితం చేసిన పరిస్థితులను కూడా.
    మాలతి గారు ఎంతో చురుగ్గా, బ్లాగులో కూడా ఆవిడ ఆలోచనలను పంచుకుంటారు.
    ఈ ముఖాముఖాలో ఆవిడ బెస్టు రచనలు, వాటి వెనుక సంగతులూ ప్రస్తావిస్తే బాగుంటుంది.

  12. Vaidehi Sasidhar says:

    చక్కటి ప్రయత్నం.కధమాలతీయం అన్న శీర్షిక కూడా బావుంది.మాలతిగారికి,స్వాతిగారికీ అభినందనలు.
    అన్నట్లు,కధామాలతీయం రెండవభాగం ఎందుకో సరిగా కనిపించటం లేదు.సరిచేయగలరు.

    వైదేహి శశిధర్

  13. teresa says:

    still waiting for the second part to appear!

  14. Pingback: కథామాలతీయం -3 పొద్దులో « తెలుగు తూలిక

Comments are closed.