ఈ తరానికి ప్రశ్నలు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఒక సంగతి చెప్పాలి. మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే. అయితే ఏమిటట? ఆ విషయానికే వస్తున్నా…

తెలుగు భాష, సంస్కారం, సాహిత్యం, రాజకీయాలు, సమాజసేవ ఇలాంటి సవాలక్ష విషయాలను గురించి కాస్తయినా పరిచయం పెరగడానికి పిల్లలకు ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయి? అసలు వారికి తల్లిదండ్రులతో ముచ్చటించేంత వ్యవధి ఉంటోందా? తిండీ, బట్టలూ, చదువూ, ఆరోగ్యం వగైరాలన్నిటి గురించీ బాధ్యతగా ప్రవర్తిస్తూ పిల్లలని పెంచే తల్లిదండ్రులు ఈ ‘అదనపు’ విషయాలను గురించి ఆలోచిస్తారా? పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతున్నారో గమనిస్తారా? వీటి గురించి పిల్లలకు నేర్పగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉందా?

ఈ ఏడాది నాకు 60 నిండుతాయి. జీవితమంతా ప్రవాసాంధ్రుడుగానే జీవిస్తున్న నాకు గత 4 దశాబ్దాలుగా అనేక తెలుగు కుటుంబాలను కలుసుకునే అవకాశాలు లభించాయి. వారి సాంస్కృతిక నేపథ్యాన్ని గమనించే సందర్భాలు తటస్థించాయి. అందరు మధ్యతరగతివారిలాగే తెలుగువారుకూడా సంసారసాగరంలో తలమునకలవుతూ, కిందామీదా పడుతూ, హడావిడీ హైరానాల జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా పెద్దసిటీల్లో పిల్లలకు కిండర్‌ గార్టెన్ వయసు రాకముందే చదువుల హడావిడి మొదలవుతుంది. స్కూళ్ళ గొడవతోబాటు కొన్ని కుటుంబాల్లో ట్యూషన్లూ, రకరకాల లలితకళలు నేర్పే క్లాసులూ వగైరాలతో సమయం గడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఆటలూ, టీవీ ప్రోగ్రాములతో కొంత సమయం పోతుంది. పన్నెండోక్లాసు జీవన్మరణ సమస్యగా పరిగణించబడుతుంది. ఆ తరవాత ‘గధా, ఘోడా’ తేడాలు మొదలవుతాయి. డాక్టర్లూ, ఐఐటీలూ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులూ ఇలా జీవనమార్గాన్ని నిర్దేశించే చదువుల్లో పడిపోతారు.

ఇవన్నీకాక పొట్టపోసుకునేందుకు అవసరం అనిపించని విషయాల మాటేమిటి? తెలుగు భాష, సంస్కారం, సాహిత్యం, రాజకీయాలు, సమాజసేవ ఇలాంటి సవాలక్ష విషయాలను గురించి కాస్తయినా పరిచయం పెరగడానికి పిల్లలకు ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయి? అసలు వారికి తల్లిదండ్రులతో ముచ్చటించేంత వ్యవధి ఉంటోందా? ఒకే ఇంట్లో ఉంటూ, తిని తిరుగుతున్నంత మాత్రాన, పక్కపక్కనే మౌనంగా కూర్చుని టీవీ చూసినంతమాత్రాన పిల్లలకు తల్లిదండ్రులతో సరైన కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అనుకోలేము. తిండీ, బట్టలూ, చదువూ, ఆరోగ్యం వగైరాలన్నిటి గురించీ బాధ్యతగా ప్రవర్తిస్తూ పిల్లలని పెంచే తల్లిదండ్రులు ఈ ‘అదనపు’ విషయాలను గురించి ఆలోచిస్తారా? పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతున్నారో గమనిస్తారా? మరొక సంగతి. వీటి గురించి పిల్లలకు నేర్పగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉందా?
పాత తరాలతో పోలిస్తే ఇప్పటివన్నీ న్యూక్లియర్ కుటుంబాలయిపోతున్నాయి. అమ్మమ్మలూ, తాతయ్యలూ, మేనత్తలూ, మేనమామలూ, కజిన్సూ వగైరా బంధువుల రాకపోకలూ, కుటుంబాల్లో కొంతైనా మిగిలి ఉన్న తెలుగు సంస్కారం గురించి తెలుసుకునే అవకాశాలూ పిల్లలకు బాగా తగ్గిపోతున్నాయి. నాకు ప్రత్యేకంగా అభిమానం ఉన్న సంగీతం విషయం గమనించినప్పుడు పిల్లలకు గాత్రమో, వీణో, పియానో వగైరాలో నేర్పిస్తున్న తల్లిదండ్రులుకూడా అదో మొక్కుబడిగా చేస్తున్నారు గాని సంగీతం గురించిన నేపథ్యాన్ని పిల్లలకు వివరించడం, ఇంట్లో అటువంటి సంగీతాన్ని అస్తమానం వినిపించడం, పిల్లలను కచేరీలకు వెంటపెట్టుకు వెళ్ళడం వగైరాలేమీ చెయ్యరని తెలిసింది. పెద్దవారికే లేని అవగాహన పిల్లలకెలా వస్తుంది? తండ్రి ఉద్యోగంతోనూ, తల్లి (ఉద్యోగం ప్లస్) ఇంటిపనితోనూ సతమతం అయిపోయి ఓపిక కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నారు. కాస్త అటూఇటూగా మీరు పెరిగిన వాతావరణం కూడా ఇటువంటిదేనా? మరి మీకు మొదట ప్రస్తావించిన ప్రత్యేకత ఎలా అబ్బింది?

అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట. అతను ఏ ఝార్ఖండ్‌లోనో పెరగలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్‌దాకా చదువుకున్నాడట. మద్రాసులో పుట్టి పెరిగి బొంబాయిలో 34 ఏళ్ళు గడిపిన నాలాగా కాదు. ఈ సంగతి మిత్రులకు చెపితే అతని పరిస్థితి ప్రత్యేకమేమీ కాదనీ, ఈ తరంవారు చాలామంది అటువంటివారేననీ చెప్పారు.

ఈ చొప్పదంటు ప్రశ్నలు వెయ్యడానికి కారణం ఉంది. ఈ మధ్య కొత్తగా చేరిన నా సహోద్యోగి ఒకతనితో ముచ్చటిస్తున్నప్పుడు కొన్ని విషయాలు బైటపడ్డాయి. అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట. అతను ఏ ఝార్ఖండ్‌లోనో పెరగలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్‌దాకా చదువుకున్నాడట. మద్రాసులో పుట్టి పెరిగి బొంబాయిలో 34 ఏళ్ళు గడిపిన నాలాగా కాదు. ఈ సంగతి మిత్రులకు చెపితే అతని పరిస్థితి ప్రత్యేకమేమీ కాదనీ, ఈ తరంవారు చాలామంది అటువంటివారేననీ చెప్పారు.
అందుచేత ఇది చదువుతున్న యువపాఠకులను కొన్ని ప్రశ్నలు అడగబుద్ధి అవుతోంది.
• మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
• అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
• చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
• మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
• ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం. ఇవి కేవలం నా వ్యక్తిగతసందేహాలు కావనీ, ప్రస్తుతకాలంలో తెలుగువారందరికీ సంబంధించినవేననీ మీకు తెలుసు. ఈ జవాబులు చదివినవారు వాటిని తమతమ వ్యక్తిగతఅనుభవాలతో పోల్చుకోగలుగుతారు.
వీటికి అనుబంధంగా మరికొన్ని విషయాలున్నాయి. మీకు వివిధ కారణాలవల్ల తెలుగుమీద ఆసక్తి పెరిగింది కనక మీ పిల్లలకు (లేదా మీకన్నా చిన్నవారికి) అటువంటి అవకాశాలు ఎలా కలుగుతాయో, ఏ ప్రయత్నాలద్వారా కలిగించవచ్చో చెప్పగలరా? ఏ తరానికాతరం జాగ్రత్త పడకపోతే పిల్లలు తెలుగు విషయంలో వెనకపడి పోతారు. తన సంస్కృతిమీద గౌరవం లేని వ్యక్తి ఏ సంస్కృతినీ గౌరవించలేకపోయే ప్రమాదం ఉందని పెద్దలంటారు. తెలుగు నేర్చుకోవడం అంటే కేవలం భాష, లిపి, చదవడం, రాయడం వగైరాలే కాదని వేరే చెప్పనక్కర్లేదు. ‘ఇంత ఆందోళన పడాల్సిన అవసరంలేదు. తెలుగుభాష సుబ్భరంగా ఉంది, బతికే ఉంది’ అంటున్నవారూ లేకపోలేదు. అది నిజమైతే మనమంతా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలా కాకుండా మీవంటివారు నిజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల లాభాలు పొంది ఉంటే ఆ విషయాలు అందరితో పంచుకోవడం అవసరమని నా ఉద్దేశం. దీన్ని ప్రచురించడంద్వారా తెలుగును ప్రోత్సహిస్తున్న సంపాదకవర్గానికి ధన్యవాదాలు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

40 Responses to ఈ తరానికి ప్రశ్నలు

  1. మేధ says:

    >>అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట.

    నా స్నేహితులలో చాలా మంది ఉన్నారు ఇలాంటివాళ్ళు.. ఒకమ్మాయి పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే.. ఇంగ్లీష్, హిందీ, మలయాళం చివరికి జర్మనీ అన్నిటినీ అనర్గళంగా మాట్లాడగలదు అంతకంటే ఎక్కువగా ఆ భాషల్లో కవితలు కూడా వ్రాయగలదు! కానీ, తెలుగు మాత్రం చదవలేదు, రెండు పదాల కంటే ఎక్కువ ఉంటే, చదవడానికి కనీసం రెండు నిమిషాల సమయం తీసుకుంటుంది..!!!

    >>మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    >>అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    నేను చదివిందే తెలుగు మీడియం కాబట్టి ఈ రెండు ప్రశ్నలకి ప్రత్యేకమైన సమాధానం ఏమీ లేదు

    >>చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    ప్రత్యేకమని చెప్పలేను కానీ, మా ఇంట్లో పుస్తకాలు ఎక్కువ ఉండేవి.. మా అమ్మ, నాన్నగారు ఇద్దరూ పుస్తకాలు బాగా చదివేవారు.. అదీ కాక, మా కోసం పిల్లల పుస్తకాలు తెప్పించేవాళ్ళు.. చందమామ, బాలజ్యోతి, బొమ్మరిల్లు ఇలా ఏ పిల్లల పత్రికైనా మా ఇంట్లో ఉండాల్సిందే..
    వీటన్నిటికంటే ఇంకో ముఖ్య విషయం – పేపర్ చదవడం.. మా స్కూల్ లో జనరల్ నాలెడ్జ్ క్విజ్ లు గట్రా ఎక్కువ జరుగుతూ ఉండేవి, దానికోసం పేపర్ ఏ చిన్న వార్త కూడా వదిలిపెట్టకుండా చదవడం అలవాటయ్యింది..

    >>మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    నిస్సందేహంగా అమ్మ-నాన్నగారి వల్లే.. తరువాత మా ఊరిలోను, స్కూల్లోను ఉన్న లైబ్రరీ లు…

    >>ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    ఇప్పటి పిల్లలకి చదవడం అంటే క్లాసు పుస్తకాలు చదవడం తప్ప వేరే ఏదీ ఉండడం లేదు.. అలా కాకుండా, పిల్లల కధల పుస్తకాలు, పేపర్ చదివించడం.. సెలవు రోజుల్లో దగ్గర్లో ఉన్న లైబ్రరీకి తీసుకు వెళ్ళడం, ఏదైనా సందర్భాలలో, వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలని బహుమతి గా ఇవ్వడం (పిల్లల స్నేహితులకి కూడా ఇవ్వడం) లాంటి కొన్ని..

    పఠనాభిలాష కలిగించడం చాలా ముఖ్యమైనది.. ఆ తరువాత వాళ్ళకి ఎవరూ, ఏమీ చెప్పక్కర్లేదు.. వాళ్ళంతట వాళ్ళే, మిగతా విషయాలు తెలుసుకోగలరు..

  2. Sowmya says:

    *మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    – ఇంట్లోనే కలిగి ఉంటుంది. తర్వాత స్కూల్లో పదో తరగతి దాకా ఉండేది కదా… ఓ పదిహేనేళ్ళ క్రితం స్కూళ్ళలో ఇప్పటికంటే నయంగానే ఉండేవి భాషా తర్గతులు అని నా అభిప్రాయం. కనుక, నా పరిచయాలు అక్కడే మొదలయ్యాయి.
    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    -పరిచయానికి చేయలేదు. ఇంకా ఎక్కువ తెలుసుకోడానికి చేసాను. రోజూ వారి మాటల్నూ, పాఠ్యాంశాలను దాటుకుని తెలుగు తెలుసుకోడానికి బానే ప్రయత్నించాను.
    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    -పుస్తకాలు. చాలా మంచి పుస్తకాలు, పిల్లల్లో పఠనాభిలాషను, చక్కగా రాయగల నైపుణ్యాన్నీ పెంచాలన్న తాపత్రేయం ఉన్న సాహిత్యాన్నీ, సైన్సునూ సమానంగా ఇష్టపడి, వివరించగల నాన్న సాహచర్యమూ.
    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    -తల్లిదండ్రులు, తమ్ముడు, కొందరు టీచర్లు, బంధువులు, పెద్దయ్యాక కొదరు స్నేహితులు, ప్రధానంగా ఇంట్లోని గ్రంథాలయం.
    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    – గృహమే విద్యాలయం!! ఇంట్లోనే దీనికంతా పునాదులు పడేది.

  3. >>మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    >>అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    నేను చదివిందే తెలుగు మీడియం కాబట్టి ఈ రెండు ప్రశ్నలకి ప్రత్యేకమైన సమాధానం ఏమీ లేదు

    >> చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    నిజానికి అందరికీ లభించే చిన్ని చిన్ని అవకశాలే నాకు లభించలేదు. అందుకే నేర్చుకోవాలన్న కసి పెరిగింది.

    >> మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    నాకు ప్రేరణ నేనే.నా మాతృ మూర్తి కూడా. కిరాణా షాపు వాడు చుట్టి ఇచ్చిన కాగితాన్ని కూడా చదవకుండా వదిలేదాన్ని కాదు నేను. చదవాలనే కోరిక, పట్టుదల నాకు చిన్నప్పటి నుండి అలవడినాయి. దానికి కారణం నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్తితులు.

    >> ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    తెలుగు నేర్చుకోవడం వలన ఉపయోగం ఏమిటా అని ఆలోచించడం మానేస్తే చాలు.
    అమ్మని వయసుడిగిన తర్వాత సాకడం అవసరమా అని ఆలోచిస్తామా మనం?
    మరి అమ్మ భాషని (మాతృ భాష) గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తాం?
    మరో భాషని నేర్చుకోవడం తెలివితేటలకి నిదర్శనమైతే,
    మాతృ భాషని నేర్చుకోకపోవడం అతితెలివికి నిదర్శనమని తెలిసుకోవాలి.
    తెలివి లేకున్నా పరవాలేదు. అతితెలివే ప్రమాదకరం

  4. >>మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    >>అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    నేను పదో తరగతి దాకా చదివిందే తెలుగు మీడియం కాబట్టి ప్రత్యేకమైన అవకాశం అని కాకుండా, స్వతహాగానే వచ్చేసింది.
    కాకపోతే తోటివారితో పోలిస్తే తెలుగులో ఉన్న కథలు చదవడం స్కూల్ వయసు నుంచే కాస్త ఎక్కువ ఇష్టం ఉండేది. వాళ్ళ దగ్గరా, వీళ్ళ దగ్గర సంపాదించి చందమామ లాంటి పుస్తకాలు చదివేదాన్ని. ఇంట్లో ఆంధ్రభూమి, స్వాతి వాటిల్లోని కొన్ని కార్టూన్లు, కథలు చదవడానికి ఒప్పుకునేవారు మా అమ్మ.

    >>మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    ఇంట్లో వాళ్ళతో పాటుగా.. తెలుగుని ఆసక్తికరంగా బోధించిన ఉపాధ్యాయుల వల్ల ఆసక్తి పెరిగింది.

    >>ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంగ్లీషు మీడియం అని మాత్రమే చూస్తున్నారు. తెలుగు చదవడం ఎందుకు, వేస్ట్.. దేనికీ పనికి రాదు.. ఆ టైం కూడా ఏ ఐఐటీ కోచింగో ఇప్పిస్తే సరి అని తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో మన మాతృభాష మాట్లాడకుండా, నేర్పకుండా ఉంటే.. భవిష్యత్తులో వాళ్లకి తెలుగులో ఆసక్తి లేదు అని చెప్పక మరేం చేస్తారు.?
    ఇప్పటి పిల్లలకి ఎంత సేపూ.. క్లాసు పుస్తకాలు, ఐఐటీలు, మెడిసిన్ కోచింగులూ.. అసలు అలా యంత్రాల్లాగా వాళ్ళని అవే పుస్తకాల్లో తిప్పకుండా.. వారాంతాల్లో, వేసవి సెలవుల్లో, చందమామ లాంటి పుస్తకాలు, ఇంకా వేరే చిన్న పిల్లల పుస్తకాలూ చదివిస్తే బావుంటుంది. అసలు ఒక పుస్తకం చదివారంటే.. ఆసక్తి లేదు వద్దు అనే పిల్లలు ఎవరైనా ఉంటారా?

  5. Purnima says:

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?

    నేను ఇంగ్లీషు మీడియంలో “తెలుగు” ఫస్ట్ లాంగ్వేజ్‍గా నేర్చుకోవడం వల్లానూ, మా అమ్మ చిన్నప్పటి నుండి తెలుగు అక్షరాలు నేర్పడంలో కాస్త శ్రద్ధ పెట్టినందుకుగాను, తెలుగు చదవగలుగుతున్నాను.

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    తెలుగు చదవడం స్కూల్ ఎగ్జామ్స్ భాగంగా వచ్చింది. మార్కుల కోసం పద్యాలూ, గద్యాలు, కవి పరిచయాలూ నిద్రలో లేపినా చెప్పేంతగా నేర్చుకునేవాళ్లం, మా పర్సెంటేజీలు తగ్గకూడదు కదా తెలుగు వల్ల! అయితే స్కూల్ అయ్యిపోయాక తెలుగుతో రుణం తీరిపోయినట్టయ్యింది. ప్లస్ టూ ప్రెజర్ ఎలా ఉండేదంటే కనీసం తెలుగు దినపత్రికలు కూడా కళ్ళబడేవి కావు. ఓ సారి డిగ్రీ చదివేటప్పుడు, ఈనాడు ఆదివారంలో ఏదో కథ చదువుతుంటే “క్ష” అక్షరాన్ని గుర్తించటానికి ఓ నిముషం పట్టింది. అతి కష్టం మీద అక్షరాన్ని గుర్తుపట్టాను, కానీ ఆ నిముషం పాటు గుర్తుపట్టడానికి పడ్డ వేదనుందే.. అది నన్ను ఉల్లిక్కిపడేలా చేసింది. ఇంకొన్ని రోజులు అలానే గడిస్తే, నేను “అ” కి కూడా దూరమయ్యిపోతాను అని బెంగ పట్టుకుంది. అప్పటి వరకూ ఇంగ్లీషు పుస్తకాలు చదివే నేను, మెల్లి మెల్లిగా తెలుగు పుస్తకాలు కూడా అలవాటు చేసుకున్నాను. ఈ రోజుకీ నేను ఇంగ్లీషు చదివినంత వేగంగా తెలుగు చదవలేను. ఒక తెలుగు పుస్తకాన్ని పూర్తి చేసే లోపు, కనీసం రెండయినా ఆంగ్ల పుస్తకాలు కానిచ్చేస్తాను.

    ఇక తెలుగులో రాయటం మరో ప్రహసనం. నన్ను అడిగితే, అసలు ఏ భాషలోనైనా రాయటం అంత సులభం కాదు. ఇహ నాలాంటి వాళ్ళు తెలుగులో రాయటం, అదీ కాక లేనిపోనిది ఊహించుకుని రాయటం అంటే భలే కష్టం నాకూ, చదివే వాళ్ళకీ కూడా! నా బ్లాగులో “భాష” విషయంలో సలహాలూ, సూచనలూ, తప్పులు సవరించడాలూ చాలా జరిగేవి.

    తెలుగులో మాట్లాడ్డం మాకొచ్చే మరో చిక్కు. మాట్లాడే భాష ఎప్పుడూ పరిసర వాతావరణం బట్టి ఉంటుంది. నా “స్పోకెన్ బ్రోకెన్ తెలుగు” విన్నవాళ్ళు చేసుకున్న పాపం! దీనికి నేనేం చెయ్యలేను! “నిష్కారణంగా ఓ మనిషిని..” అని నేను నా స్నేహితుల దగ్గర మాట్లాడితే కళ్ళు తేలేస్తారు. అదే.. “ఏ reason లేకుండా ఒక మనిషిని..” అంటే తెలుగులా ఉంటుంది!

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    లేవు! తెలుగు విషయంలో నాకెలాంటి ప్రత్యేక సదుపాయాలూ లేవు. ఇంకా చెప్పాలంటే కనీస సదుపాయాలు కూడా లేవు. నా స్కూల్ ఫ్రెండ్స్ లో చాలా మందికి చందమామ, బాలమిత్ర పేర్లు కూడా తెలీవు. మా బడిలో ఉన్న లైబ్రరీ పెద్దది కాకపోయినా, తెలుగు పుస్తకాలు మచ్చుకి కూడా ఉండేవి కావు!

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    నేను తెలుగంటే “ఇన్-బిల్ట్” ఇష్టంతో పుట్టినట్టున్నాను. నాకు కొన్ని భాషలంటే ఇష్టం.. అవి చదవటం / రాయటం తెలీకపోయినా! ఉదా: ఉర్దూ! తెలుగంటే ఏవగింపులేవీ లేకపోయి, కాస్త ఇష్టమూ ఉండడం చేత చేజిక్కిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. మా తెలుగు టీచర్ వల్ల ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. బడి అయ్యి పదేళ్ళూ కావస్తున్నా, నేనింకా “అటజని కాంచే భూమిసురుడు..” అన్న పద్యం అప్పజెప్పగలిగినా, దాశరధి తామసి పద్యాలూ, జాషువా గిజిగాడు రచనలూ ఇంకా అక్కడక్కడా గుర్తున్నా అది మా తెలుగు టీచర పుణ్యమే! పరీక్షలకు సంబంధించినవి మాత్రమే కాకుండా, స్వగతాలనీ, వ్యాసరచన పోటీలనీ, కథలనీ మా చేత చాలా రాయించేవారూ / చేయించేవారూ! దాని వల్లే నాకు తెలుగు రాయటం అబ్బింది. కొందరి స్నేహితురాళ్ళతో ఉత్తరాలు రాసుకోవడం కూడా కలిస్సొచ్చింది.

    నేను బ్లాగు మొదలెట్టాక కూడలిలో జతచేయటానికి నాలుగు నెలలు సంశయించాను, “నా తెలుగు చదవగలరా ఎవరైనా?” అని. ధైర్యం చేసి కూడలిలో పెట్టటం నేను గత ఏడాది చేసిన అత్యుత్తమైన పని. తెలుగు భాషను మెరుగుపరచుకోవటమే కాకుండా, ఎన్నో పుస్తకాల గురించి తెల్సుకొని చదవగలిగాను. చిన్నిచిన్ని వెర్రి ప్రశ్నల నుండీ తికమక పెట్టే ప్రశ్నల వరకూ ఏ ప్రశ్న అడిగినా ఓపిగ్గా సమాధానమిచ్చే గురువులు / స్నేహితులు ఇక్కడ దొరికారు. బ్లాగు వల్ల నా తెలుగుకి జరిగిన మేలు అంతా, ఇంతా కాదు. అందుకు అందరికీ సదా కృతజ్ఞతలు!

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    నా అనుభవాలా? చాలా పెద్దది అవుతుందేమో..

    తెలుగు అన్న పదం వినపడ్డా, అరగంట ఎండలో నుంచోబెట్టే స్కూల్ లో చదువుకున్నాం. మాకు తెలుగు భాషా, సంస్కృతి గట్రాలూ లాంటివేదీ కాదు. ఉన్న ఏడు సబ్జెక్ట్స్ లో అదీ ఒకటి. దాంట్లో వందకి ఎన్ని మార్కులు రాగలవో అన్నదే మా ఆలోచన. అప్పట్లో (నేను చదివిన చదువు, అప్పుడే “అప్పట్లో” అయ్యిపోయింది! :)) తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో వందకి తొంభై తొమ్మిది వేసేవారు కారు! అందుకే మాలో చాలా మందికి తెలుగంటే కాస్త ఎక్కువ కోపం. హింది “సరళ”మనీ, ఇంగ్లీషు “తప్పని స్నేహమనీ” మా అభిప్రాయం. తెలుగు ఎంత చదివినా, ఎంత బట్టీ కొట్టినా మార్కులు రావు. అందుకే అదంటే అక్కసు. తెలుగు టీచరు కూడా నచ్చరు మాలో చాలా మందికి. పొద్దున్నే ఒక ఐదు నిముషాలు ముందుగా వచ్చి, తెలుగు టీచరిచ్చిన హోం వర్క్ చేసేవాళ్ళం. రాత్రి పన్నెండింటి దాకా సైన్సులూ , మాథ్స్ లూ కదా మరి! ఈ ఉన్న జనంలో తెలుగును కాస్త ఇష్టంగా చూసే నా లాంటి వాళ్లని చూస్తే అబ్బురం. స్కూల్లో నా అత్యంత సన్నిహిత స్నేహితురాళ్ళు తప్పించి, మిగితా అందరూ నేను ఎమ్.ఏ తెలుగు చేసేసి, తెలుగుతో స్థిరపడిపోతాననుకున్న వాళ్ళే! సింపుల్‍గా చెప్పాలంటే తెలుగుపై ఏ మాత్రం అభిమానం చూపినా.. “here comes “pick the odd” అన్నట్టు చూపులు.

    సరే.. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా స్నేహితురాళ్ళందరూ తెలుగుకి దూరంగా హాయిగా ఆనందంగా బతికేస్తున్నారు. మా చెల్లి అదే స్కూల్లో అదే టీచర్ దగ్గర ఆరేళ్ళ తేడా తరువాత చదువుకుంది, అంత కన్నా ఎక్కువ అక్కసుతో. తెలుగనగానే ఒకలా పెట్టేస్తుంది మొహం. పాపం, తను చదివేసరికి ఈనాడు కథల స్టాండర్డ్ కూడా దారుణంగా పడిపోయింది. బ్లాగుల్లో మాత్రం తను “రెండు రెళ్ళ ఆరు” తప్ప ఇంకేవీ చదవదు. (ఆపకుండా నవ్వించగలదు కాబట్టి..) కొత్తల్లో నేను బయటకి చదివి వినిపించాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు కుదరకపోతే తనే చదువుకుంటుంది. ఓ రోజు ఏమైనా కొత్త పోస్టులున్నాయా అంటూ వచ్చింది. అప్పటికి నేను ఈమాటలో ఇస్మాయిల్ గారి గురించి చదువుతున్నాను. కొత్తవేవీ లేవు అన్న నా సమాధానం విని, నన్ను డిస్ట్రర్బ్ చేయకుండా వెళ్ళిపోతుండగా, అప్రయత్నంగానే ఇస్మాయిల్ గారి ఒక కవిత చదివేశాను పైకి. తను “వావ్” అంది. వెనక్కొచ్చి, ఇద్దరమూ చదవటం మొదలెట్టాం. అలా అర్థరాత్రి రెండు దాటినా కూర్చుండిపోయాం. “బాగున్నాయ్.. బాగున్నాయ్” అంటూనే ఉంది. కొన్ని చదివింది. మొన్న అమారావతి కథల పుస్తకం ముందేసుకుని కూర్చుని బుద్ధిగా చదువుకుంది.

    మోరల్ ఆఫ్ ది స్టోరీ: ఈ తరానికి అది పట్టదూ, ఇది పట్టదూ అని వ్యాఖ్యలు చేసి ప్రయోజనం లేదు. సరైనవి సరైన కాలంలో పరిచయం చేస్తే, వాటితో స్నేహం కుదిరి ఏ ప్రణయానికో దారి తీస్తాయి. అంతే కానీ, అప్పటి వరకూ ముక్కూ మొహం కూడా తెలీకుండా, అప్పటికీ నామమాత్రపు పరిచయ కార్యక్రమాలు కూడా జరగక్కుండా, ఆప్యాయతానురాగాలు ఒలకబోయాలంటే ఎలా సాధ్యం? ఆ – ఈ తరం అన్న భేదం లేకుండా తెలుగును పరిచయం చేయండి. అక్కడి వరకే మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ళ పాట్లూ వాళ్ళు పడతారు. ఇష్టమయినా, కష్టమయినా అది వాళ్ళిష్టం, తెలుగిష్టం. మన భాష ఒక్కసారి వింటే చాలు, “there’s some magic in your language, it sounds so sweet” అనేంత సుమధుర తెలుగుకి తన వాళ్ళ మనసు గెలవడం ఓ లెఖ్ఖా! తెలుగును నమ్మండి! దాని పని దాన్ని చేసుకోనివ్వండి.

    ఓ తరం మొత్తం “తెలుగు వద్దు.. అది కూడు పెట్టదూ” అని రుద్దినది చాలు! మళ్ళీ “తెలుగే చదవాలి, చదివించి తీరాలి” అని రెండో సారి కష్టపెట్టకండి.

    (ఇంతక మునుపెప్పుడో ఒక వ్యాసంలో మీరే అనుకుంటా రాశారు: “తెలుగు పదాలు (స్పెల్లింగ్స్) ఎలా రాయాలో కూడా తెలీని కొందరు బ్లాగులో రాస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం మంచిదే” అనో, అలాంటిదేదో! అలాంటి వాళ్ళల్లో నేనూ ఉన్నానని గుర్తించమని మనవి!అన్ని టైపోస్ కి బాధ్యత వహిస్తాను! :))

    పూర్ణిమ

  6. *మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    – ఇంట్లోనూ స్కూల్లోనూ.గవర్నమెంటు స్కూల్లో తెలుగు మీడియం చదువు.కథల పుస్తకాలు కొనుక్కోమనే నాన్న. ఎప్పుడు చదివినా అడ్డుచెప్పని అమ్మ.
    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    -ఒకవైపు తెలుగులో పాఠ్యాంశాలూ మరో వైపు తెలుగు కథలు చదివే అవకాశంకన్నా మించిన కృషి ఎప్పుడూ అవసరం కాలేదు.
    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    -చందమామ నుంచీ బుచ్చిబాబు వరకూ చదవడానికి ప్రభుత్వ గ్రంధాలయం నుంచీ వీధిచివర లెండింగ్ లైబ్రరీదాకా ఎక్కడైనా పుస్తకం తీసుకునే అవకాశం. చెడిపోతాడనే చెప్పుడుమాటలు వినకుండా ప్రోత్సహించే తల్లిదండ్రులు.
    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    -తల్లిదండ్రులు, అన్న,మా కాలేజి, కొందరు టీచర్లు,
    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    – పిల్లల్ని చదవనివ్వండి…అది చాలు.

  7. Rohiniprasad says:

    స్పందనలు పంపుతున్నవారందరికీ హృదయపూర్వక అభినందననలు, కృతజ్ఞతలు. మీరందరూ రాస్తున్న విషయాలు చాలా ఉపయుక్తమైనటువంటి అనుభవాలూ, సూచనలూను. వీటిలో కనబడుతున్న తెలుగు భాష మంచిస్థాయిలో ఉండడం చాలా మంచి సూచన.
    కొంతకాలం గడిచాక ఈ జవాబులన్నిటినీ సంపాదకులు సేకరించి పత్రిక తరఫున ఏ తెలుగు భాషాసంఘం అధ్యక్షుడికో అందజేస్తే బావుంటుందేమో ఆలోచించగలరు.

  8. రోహిణీప్రసాద్ గారు,
    మీరు “యువ” పాఠకులు అని అన్నారు. అంచేత ముందు కాస్త తటపటాయించాను. మహేష్ గారి వ్యాఖ్య చూసి, అయితే పరవాలేదు నేనూ యువకుణ్ణే అనుకొని రాస్తున్నాను 🙂

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    తెలుగు నేర్చుకోనే అవకాశం కాదు కాని, నేను తెలుగుదేశంలో పుట్టి పెరగడంవల్ల అది అవసరంగానే/సహజంగానే అబ్బింది. ఇల్లే మొదటి బడి కాబట్టి అక్కడితోనే మొదలు.

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    లేదు. స్కూల్లో అన్ని సబ్జెక్టులకీ చేసినంత కృషే దీనికీ చేసాను. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషు మీడియంలో చదివినా, ఇంగ్లీషు హిందీ (సోషలు కూడా నండోయ్!) నేర్చుకోడానికి చాలా కృషి చెయ్యాల్సి వచ్చేది.

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    తెలుగు నేర్చుకోడానికి ప్రేరణంటూ ఏమీ లేదనే అనుకుంటున్నాను. నేర్చుకోకూడదు అనే ప్రతిబంధకం లేదు కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్రేరణ అవసరం లేదు. ఇంగ్లీషు మీడియం (కాన్వెంటు) స్కూలు కాబట్టి క్లాసులో సంభాషణలు మాత్రం ఇంగ్లీషులో ఉండలనే నియమం ఉండేది. అంతే. తెలుగుకి మిగతా సబ్జెక్ట్లకిచ్చిన ప్రాధాన్యాన్నే ఇచ్చేవారు. తెలుగులో వక్తృత్వం, వ్యాస రచన పోటిలు ఉండేవి. వాటిలో పాల్గొనేవారికి తగినంత ప్రోత్సాహం ఉండేది.
    తెలుగు భాషా సాహిత్యాల మీద ప్రత్యేకమైన అభిమానం కలగడానికి మాత్రం ఇంట్లోని వాతావరణమే కారణం. మా ముత్తాతగారు (పాలంకి వేంకట రామచంద్రమూర్తిగారు) కథా రచయిత. అమ్మ తెలుగు టీచరు. అంచేత ఇంట్లో కొద్దో గొప్పో తెలుగు సాహిత్య వాతావరణం ఉండేది.
    తెలుగు మీద ప్రేమతో ఇంటర్లో (సహజంగా ఇది కూడా ఇంగ్లీషు మీడియమే) తెలుగు తీసుకున్నప్పుడు, అదృష్టవశాత్తు చాలా మంచి లెక్చరరు (సూర్యారావు గారు) వచ్చారు. అది తెలుగు మీద మరింత అభిమానం కలగడానికి కారణం.
    ఇవి తెలుగు భాషమీద అభిమానానికి ప్రేరణ కాని, తెలుగు నేర్చుకోడానికి కాదు.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    తెలుగు నేర్చుకో అక్కర లేదు/నేర్చుకో కూడదు అనే వాతావరణం లేనప్పుడు, తెలుగు దేశంలో ఉన్నవాళ్ళకి తెలుగు సహజంగానే వస్తుంది. అది ఒక అవసరమైనప్పుడు, దానికి ప్రత్యేకమైన ప్రేరణ అవసరం లేదు. పుస్తకాలు చదివే అలవాటులాంటివి తెలుగు వచ్చినవాళ్ళకి తెలుగు భాష మీద ఎక్కువ ఆసక్తి, అభిమానం కలిగించే అవకాశం ఉంది కాని, తెలుగు భాషని నేర్చుకోడానికి ఎంతవరకూ ప్రేరణ కలిగిస్తాయో నాకు అనుమానమే.
    ప్రవాసంలో ఉన్న తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోడానికి(చదవడం రాయడం) ఏదో ప్రేరణ అవసరమవుతుంది. అయితే ఆ ప్రేరణ ఎంతవరకూ ప్రయోజనకారి అవుతుంది అన్నదీ అనుమానమే.

  9. parimalam says:

    *మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    చిన్నప్పుడు నాన్నగారు ఓ టీచర్ గారివద్ద ట్యూషన్ పెట్టించారు .ఆవిడ బ్రతుకు తెరువుకోసం అన్నట్టు కాకుండా ఎంతో ప్రేమగా నా చేత అక్షరాలు దిద్దించారు . తర్వాత తెలుగు మీడియం స్కూల్ లో జాయిన్ చేసినా కూడా ..స్కూల్ ఫైనల్ వరకూ కూడా సాగలేదు.అయినా తెలుగు తప్పుల్లేకుండా చదవ గలిగినా ,రాయగలిగినా ..ఆవిడ చలవే .
    మా పిల్లలుకూడా తెలుగు పజిల్స్ నింపే స్థాయిలో ఉన్నారంటే (ఇంగ్లీష్ మీడియంలో చదివి) చిన్నతనంలో నాదగ్గర నేర్చుకున్న తెలుగు అక్షరాలే . వారి చేత తెలుగు పుస్తకాలు చదివించేదాన్ని .ఇప్పటికీ పుస్తకాలలోని పజిల్స్ నాతొ పోటీపడి నింపుతూ ఉంటారు .
    చిన్నప్పుడు ప్రత్యెక సదుపాయాలంటూ ఏవీ లేవు నాన్నగారే అప్పుడప్పుడు చూసేవారు .
    ముఖ్యంగా ఉపాధ్యాయులు కేవలం జీతం కోసం మాత్రమె కాకుండా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రయత్నించేవారు .ఇప్పటి పోటీ ప్రపంచంలో అది కరువయ్యిందనిపిస్తుంది.
    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    సలహాలిచ్చేంత అనుభవం ,పరిజ్ఞానం నాకు లేవు కాని ఒక్క మాట చెప్పాలని అనుకొంటున్నాను .తల్లితండ్రులు తమ పిల్లలు తెలుగు మాట్లాడటం ,రాయటం , తెలుగు పుస్తకాలు చదవటం చిన్నతనం గా భావించకుండా ..వారికి మన భాష మీద ఇష్టం , గౌరవం కలిగించడానికి ప్రయత్నించాలి .మన భాష మన తల్లివంటిదని గుర్తించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి .లేకపోతె దేశ భాషలందు లెస్స అనిపించుకున్న మన తెలుగు కనుమరుగై పోయే ప్రమాదం ఉంది .

  10. Rohiniprasad says:

    కామేశ్వరరావుగారూ,
    పాలంకి రామచంద్రరావుగారి కథలు తొలిదశలో చందమామలో పడ్డాయి.
    నేను భాభా అణుకేంద్రంలో పనిచేస్తున్నప్పుడు పాలంకి బాలకృష్ణగారితో పరిచయం ఉండేది. తరవాత ఆయనకి హైదరాబాద్‌కి బదిలీ అయింది. ఆయన మీకు బంధువే అయుండాలి.

  11. కామేశ్వరరావుగారూ,:-):-):-):-) నామీదపడ్డారేంటండీ బాబూ! అయినా నా వయసెంతనీ 33 ఇంతలో యువకుణ్ణి కాకుండా పోతానా?

  12. chavakiran says:

    మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    — తెలుగు మీడియం. పది వరకు.
    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    — లేదు.
    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    — లేవు. కాని పఠనాసక్తి మెండుగా ఉండేది. గ్రంథాలయంలో మా బడి పిల్లల్లో నేనే ఎక్కువగా ఉండేవాన్ని అనుకుంటాను.
    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    — తల్లిదండ్రులు, బంధువులు, టీచర్లు, లైబ్రరీ. మధుబాబుని పరిచయం చేసిన స్నేహితులు. పుస్తకాలు కొన్నా తిట్టని తల్లిదండ్రులు. అప్పుడు అర్థం కాలేదు కాని డబ్బులకు బాగా ఇబ్బందుల్లో ఉన్నా నేను ఏదో విదంగా చిన్న చిన్న పుస్తకాలు కొనే వాన్ని, పాపం ఏమనే వారు కాదు.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    — ముందు మార్కుల కోసం సంస్కృతం ఎత్తేయాలి, తెలుగు పాఠ్యం డిగ్రీ నాలుగు సంవత్సరాల వరకూ, ఇంజినీరింగ్ తో కూడా కలిపి కంపల్సరీ చెయ్యాలి. వీళ్లంతా రేపు ఉద్యోగాలు చేసేది తెలుగు సమాజానికా? మరేదైనా సమాజానికా ? వీళ్లంతా నడిచే రోడ్డులు, చదివే కాలేజీలు కట్టిన టాక్సులు తెలుగు వాళ్లవా వేరే వాళ్లవా ?

  13. Vamsi says:

    తెలుగుతో నన్ను కట్టిపట్టినవి… ఇంట్లో వాతావరణం, పదవ తరగతి వరకు తెలుగు వుండటం, పత్రికలు (ముఖ్యంగా వార పత్రికలు), పుస్తకాలు, (పాత) సినిమాలు, మరియు సినిమా పాటలు (సినిమా పాటలా అని ఏవగించుకోకండి. మాకు అది కూడా ఒక మార్గమే…)
    (చాలా వరకు ఇవే మా తరం వారికి వర్తిస్తాయి)

    ఇక మా తరువాత తరం వారి విషయానికి వస్తే,
    ఈ రోజుల్లో పాత సినిమాలు చూడరు. కొత్త సినిమాలు మన ప్రస్తుత సమజాన్నే ప్రతిబంబిస్తున్నాయి కాబట్టి వీటి వల్ల ఒరిగేదేమి వుండదేమో…
    ఇక పాటల విషయం చెప్పనవసరం లేదు.
    హార్రి పోట్టార్ చదువుతారేమో కాని బుడుగు చదువుతారా? నాకు సందేహమే…కాబట్టి పుస్తకాలను కూడా తీసేయ వచ్చు..

    ఆఖరకు మిగిలినవి.
    ఇల్లు, చదువు, మరియు పత్రికలు…

    చదువు ఎంత పాత్ర పోషిస్తుందో చెప్పలేను కాని, ఇల్లు మరియు పత్రికలు (ముఖ్యంగా వార పత్రికలు (మిగిలిన రోజులేమో కాని ఆది వారాలైతే చదవడానికి ఆస్కారం ఎక్కువ వుంది)) కీలక పాత్ర పోషించగలవేమో. కాబట్టి ఇంట్లో తెలుగు వాతావరణం మరియు పత్రికలు రెండూ వాటి పాత్రలను అవి సక్రమంగా పోషిస్తూ, వాటిని సక్రమంగా పిల్లలకు అందిస్తే.. మిగిలిన వాటిని వారే అభిరుచులననుసరించి తమంతట తామే కాల క్రమంలో అందుకుంటారనుకుంటా…

    ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఇంటర్ నెట్ ఎంత పాత్ర పోషిస్తుందో వేచి చూడాల్సిందే…

    Vamsi

  14. Meher says:

    నేనీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా మీరు ఊహించిన ప్రయోజనం నెరవేరుతుందా లేదా అన్నది అనుమానం. ఎందుకంటే, అవటానికి నేను యువకుణ్ణే గానీ, ఇష్టపూర్వకంగా ఘోడాల రేసు వదిలేసి, మొండిగా గధాల గుంపులో మిగిలిపోయినవాణ్ణి. మీరు మనసులో పెట్టుకుని రాసిన ఈ “తరం యువత” లక్షణాల మూసలో నేను సరిపోను. కానీ కాసేపు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమేదైనా ఎప్పుడూ ప్రలోభపెట్టేదే. అందుకే ఈ బహానా వదులుకోబుద్దికావడం లేదు.

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?

    మాతృభాష ఎవరికైనా అమ్మ ద్వారానే వస్తుంది. నేను ఈ విషయంలో అమ్మ ద్వారా అందరికన్నా ఎక్కువే లాభ పడ్డాను. అమ్మకి చిన్నప్పట్నించీ పుస్తకాలు చదివే అలవాటుంది. నా చిన్నప్పుడైతే పిచ్చిగా చదివేది. యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొండేపూడి నిర్మల, మాలతీ చందూర్, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, చల్లా సుబ్రహ్మణ్యం, యర్రంశెట్టి శాయి, మైనంపాటి భాస్కర్, కొమ్మనాపల్లి గణపతిరావు . . . యిలా గొప్ప దిబ్బా విచక్షణ లేకుండా నచ్చినవన్నీ చదివేది. ఆమె ఉద్యోగం చేయడం వల్ల లైబ్రరీకెళ్ళే సమయం లేక పుస్తకాల ఎంపికకు నన్ను పంపేది. పైన చెప్పిన రచయితల పేర్లు నా మెదడులో నమోదయ్యేలా పదే పదే చెప్పి పంపేది. నేను వెతికి తెచ్చేవాణ్ణి.

    ఈ ఏర్పాటు వల్ల కలిగిన లాభం ఏమిటంటే నాకు గ్రంథాలయం పరిచయం కావడం. గ్రంథాలయం ద్వారా చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి లాంటి నెలసరి పత్రికలూ; పంచతంత్ర కథలు, బొమ్మల రామాయణం, బొమ్మల భాగవతం, బొమ్మల భారతం లాంటి పుస్తకాలూ పరిచయమయ్యాయి. ప్రతీ ఆదివారం “ఈనాడు” మేగజైన్‌లో ఒక పేజీలో వచ్చే ఫాంటమ్ కథలూ, అరేబియన్ నైట్స్ కథలూ సరేసరి. అక్షరాలంటే పుక్కిట పట్టి పరీక్షల్లో తుమ్మాల్సిన చేదు మాత్రలు మాత్రమే కాదనీ, అవి ఎల్లల్లేని ఊహా ప్రపంచానికి వంతెన వేయగలవనీ ఈ పుస్తకాల ద్వారానే తెలిసింది. ఈ పుస్తకాలు చదవడంతో నా బడి పిల్లల్ని దాటుకుని నేనో పై మెట్టెక్కేసినట్టనిపించేది. ఈ పుస్తకాలు నా ఊహాలోకంలోకి ధారపోసిన కథలూ, ప్రపంచాలూ, పాత్రలూ, సన్నివేశాలతో నేనేదో ఏదో అదృశ్య సంపదకు యాజమానినై పోయినట్టనిపించేది. దాంతో—నా చుట్టుపక్కల పిల్లల్తో కలిసి ఎంత గోళీకాయలు, గూటీబిళ్ళ, కోతీకొమ్మచ్చీ, కరెంట్ షాకూ ఆడినా—నా లెవలే “వేరు” అన్న నమ్మకం అంతర్లీనంగా నాలో బలంగా వుండేది. (ఎంత బలంగా అంటే, ఓ సారి ఐదోతరగతిలో వ్యాసాల పోటీ పెట్టారు; అందులో స్కూల్లో ఎప్పుడూ మొదటి మార్కులొచ్చే కుర్రాడికే ప్రైజు ఇచ్చారు; నాకు రెండో ప్రైజు మూడో ప్రైజు కూడా రాలేదు; ఏదో గూడుపుఠాణీ జరిగిందని, నన్ను కావాలనే తొక్కేసారనీ నమ్మాను.) స్కూలు ఐదింటికి అవగానే నేనూ మా తమ్ముళ్ళూ—ఎలాగూ అప్పటికింకా అమ్మ ఇంటికి రాదు గనుక—ఓ గంటారెండుగంటలు లైబ్రరీలో గడిపి వచ్చేవాళ్ళం. ఇంట్లో తాతయ్య వుండేవారు. ఆయనకి చిన్నప్పుడు భారతం పద్దెనిమిది పర్వాలూ కంఠతా వచ్చట. ఆ విన్యాసం మాముందు ఎప్పుడూ ప్రదర్శించలేదు గానీ, ఖాళీ వున్నప్పుడల్లా భాగవత పద్యాలు పాడుతూవుండే వారు. నేనెప్పుడూ గొంతు కలపకపోయినా ఆ పద్యాలు కొన్ని ఇప్పటికీ నా నోటికి వచ్చు. పోతన పద్యాల్లో వుండే alliteration వల్లననుకుంటా, చాలా సులభంగా నోటికి వచ్చేస్తాయి. ఉత్తప్పుడు ప్రయత్నిస్తే నోటికి రాని పద్యాలు కొన్ని వున్నా కూడా, ఇప్పుడు మా తాతయ్య పాడుతుంటే తర్వాతి లైన్లు మెదడులో వచ్చి చేరిపోతాయి. “మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము పోవునె మదనములకు”, “కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగమ్మెల్ల గప్పికొనగ”… ఇలాంటివన్నమాట. (ఈ రెండో పద్యం యెప్పుడు విన్నా వళ్ళు గగుర్పొడుస్తుంది. కృష్ణుడు క్రోధంగా రథం దిగి భీష్ముని వైపుకు దూసుకుపోయే దృశ్యం కళ్ళముందు అలా బొమ్మ కట్టేస్తుంది.)

    కాబట్టి నేను తెలుగు నేర్వడానికి సగం అమ్మ సహాయపడితే, మిగతా సగం గ్రంథాలయం సహాయపడింది. నేను పెరిగిన పరిసరాల్లో నాకు తెలుగు అందకుండా ఏ అడ్డంకీ లేదు. నా చదువంతా తెలుగు మీడియంలోనే కొనసాగింది. అది కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే. సుబ్బరంగా యూనిఫారాలేసుకుని బాగ్స్ తగిలించుకుని కాన్వెంట్లలో చదివే ఇంగ్లీషు మీడియం పిల్లల్ని చూసి ఈర్ష్య, పర్యవసానంగా ఇంగ్లీషు అంటే అసహ్యంతో కూడిన భయం ఉండేవి. అయితే తెలుగు మీడియం చదువు వల్ల నా తెలుగుకి ఏమీ ఒరిగింది లేదు. నాకే గనుక గ్రంథాలయం పరిచయం కాకపోయి వుంటే, ఆ పాఠశాల చదువు వల్ల, తెలుగంటే వెగటు కూడా పుట్టి వుండేదేమో. నాకు పాఠం చెప్పిన ఏ గురువూ భాష అంటే మన లోపలి భావనాలోకాలకి వారధి అన్న సంగతి అవగతమయ్యేలా పాఠం చెప్పలేకపోయాడు.

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    “కృషి” అన్న పదంలో “ప్రయత్నంతో/ శ్రమతో కూడింది” అన్న ధ్వని ఏదో వుంది. నా విషయంలో ప్రయత్నమూ లేదు, శ్రమా లేదు. నా చుట్టూ వచ్చిపడ్డ వాతావరణం నా అదృష్టం. అంతేగాక నాలో స్వతహాగానే ఏదో జిజ్ఞాస వుండేది. అదే నన్ను చందమామ, బాలమిత్రలతో ఆగిపోకుండా ముందుకు వెళ్ళేలా చేసింది. ఏడోతరగతిలో అనుకుంటా యండమూరి “రుద్రనేత్ర”తో నవలలు చదవడం మొదలుపెట్టా. ఎందుకంటే దాని ముఖచిత్రంపై చిరంజీవి జేమ్స్‌బాండ్ తరహాలో పిస్తోలు పట్టుకుని ఓ పక్క రాధతోనూ, ఓ పక్క విజయశాంతితోనూ నిలబడ్డ ఫోటో వుటుంది. అది మొదలు; తర్వాత మా అమ్మకి ఏది తెస్తే అది నేనూ చదివేస్తూ ఉండేవాణ్ణి. (కొన్నిసార్లు రహస్యంగా కూడా.) నేనిందాక చెప్పిన జిజ్ఞాస—ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ambition—నన్ను అక్కడ కూడా ఆగనీయలేదు. అక్కణ్ణించి చలం, గోపీచంద్, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం, ముళ్ళపూడి వెంకట రమణ . . . ఇలా జీవితానికి దగ్గరగా కథలు చెప్పేవాళ్ళ దగ్గరకి సాగిపోయాను. ఇదంతా తెలుగు కోసం చేసిన కృషి కాదు. చదివేటప్పుడు భాష మీద పెద్దగా ధ్యాస పెట్టేవాణ్ణి కాదు. కానీ చదివే అలవాటు వల్ల సహజంగానే భాష నా దగ్గరికి వచ్చిచేరిపోయింది. పదోతరగతిలో చదివిన కాశీభట్ల వేణుగోపాల్ నవల “నేనూ చీకటి” మొదటిసారి భాష మీదకి దృష్టి మళ్ళించింది. ఎందుకంటే అది అంతకుముందు రచయితలెవరూ నాకు చూపించని ప్రపంచాన్ని—అంతకుముందు నేను చూడని భాషతో, వాక్యనిర్మాణంతో—అంతకుముందెన్నడూ అనుభవంకానంత స్పష్టంగా నా ముందుంచింది. నాకు కొద్దో గొప్పో కవిత్వం పరిచయమైంది ఆ పుస్తకంతోనే.

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    పైన చెప్పినట్టు నాకున్న సదుపాయాలు రెండే: పుస్తకాల చదివే అమ్మ, ఊళ్ళోని గ్రంథాలయం. రెండోది అందరికీ లభ్యం అయ్యే సదుపాయమే (కనీసం మా చిన్నప్పుడు, మా వూళ్ళో, అందరికీ లభ్యమయ్యే సదుపాయమే); మొదటిది మాత్రం అందరికీ దొరక్కపోవచ్చు. ఇక్కడే ఉపాధ్యాయులు తమ పాత్ర పోషించి పిల్లల్ని అక్షరాల విలువ తెలుసుకునే తోవలకు మళ్ళించాలి.

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    ప్రేరణ అమ్మ నుంచే వచ్చింది. కానీ నాలో అంతర్లీనంగా ఏదో ambition లేకపోతే అది మధ్యలోనే ఆగిపోయేదేమో. జ్ఞానతృష్ణ మనిషికి జన్మసిద్ధంగా వచ్చేదే. కొందరిలో బహిర్గతంగా ఏ ఉద్దీపనా దొరక్క మరుగునే వుండిపోతుంది. ఒక్కసారి ఆ ఉద్దీపన అందితే ఆ తృష్ణే మనల్ని ఈడ్చుకుంటూ పోతుంది.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    1) ఇటీవలి ప్రభుత్వాలు గ్రంథాలయలు మూసేయడంలో చూపించే ఉత్సాహం అర్థం కాదు. ఈ విషయంలో అన్ని ప్రభుత్వాల మధ్య వున్న ఐకమత్యం చూస్తే, నాకెందుకో ఇది కేవలం నిర్లక్ష్యం అనిపించదు. ఏదన్నా చీకటి ఉద్దేశ్యాలతో కూడిన నిర్మాణాత్మకమైన వ్యూహం వుందా అనిపిస్తుంది. బహుశా సాహిత్యం అంటూ మరోటంటూ యువతరం నిర్వీర్యం కాకుండా, లేదా తప్పుదారి పట్టకుండా కెరీర్‌‌పై దృష్టి పెట్టి కంపెనీలు ఆశించే ప్రత్యేకమైన నైపుణ్యాల్ని అలవర్చుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించడానికేమో. ఇదే నిజమైతే వాళ్ళు ఉద్దేశ్యం చాలా తొందరగా నెరవేరుతుంది. రానున్నకాలంలో సంస్కృతి తెలియని బబ్రాజమానాలతో తెలుగుజాతి పుష్కలంగా పరిఢవిల్లబోతోంది. నే చెప్పేదేమంటే భాష బావుండాలంటే సాహిత్యం బావుండాలి. సాహిత్యం బావుండాలంటే అది అందరికీ అందుబాటులో వుండే వ్యవస్థ బావుండాలి. గ్రంథాలయ వ్యవస్థే దీనికి సరైన సమాధానమని నా అభిప్రాయం.

    2) ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా భావించే దౌర్భాగ్యం పోవాలి. పిల్లల మనసుల్లో భాష విలువ, సారస్వతం విలువ నాటగలిగే వాళ్ళే ఆ వృత్తిని చేపట్టాలి. అలాంటి వాళ్ళని తయారు చేయగలిగేది మళ్ళీ ఆ విలువ తెలిసిన వ్యవస్థే. అదిప్పుడు లేదు; కాబట్టి ఇక ఆ ఆశ వదులుకోవాల్సిందేనేమో.

    ఇక్కడ నేను “సంస్కృతి విలువ, భాష విలువ” అని పదే పదే అంటున్నది తెలుగు మీద పక్షపాతంతో కాదు. డిగ్రీ వరకూ డిక్షనరీ పక్కన లేకుండా ఒక్క ఇంగ్లీషు పేరా చదవగలిగే వాణ్ణి కాదు. యిప్పుడు కొద్దో గొప్పో ఆంగ్ల సారస్వతంతో పరిచయం వుంది. ఇంగ్లీషు మీడియంలో చదివిన వాళ్ళకి సంక్లిష్టమనిపించే రచనల్ని కూడా చాలా సులభంగా చదివేయగలను. ముందు నా భాష గొప్పదనం నాకు తెలియకపోతే ఇంగ్లీషు భాష గొప్పదనమూ తెలిసేది కాదు. నా భాషపై ఆసక్తి లేకపోతే ఇంగ్లీషు భాషపైనా ఆసక్తి కలిగేది కాదు. ఇక్కడ భాష ముఖ్యం కాదు. పదార్థ ప్రపంచపు పరిధుల్ని మించి జ్ఞానప్రపంచాన్ని అందుకోగలిగేందుకు మొదటి అడుగు భాష. అదే భాషైనా పర్లేదు. అసలా దృక్కోణం అంటూ మొదలైతే మాతృభాషపై మమకారం సహజంగానే మొదలవుతుంది. కేవలం జ్ఞానార్జనకు by-product గా అయినా సరే.

    3) ఇప్పుడు తెలుగు భాషకి మంచి నిఘంటువు కావాలంటే అదో పనికిమాలిన పనిగా, సమయాన్ని వృథా చేయడంలా తోస్తుంది. కానీ ఇది లేకపోవడం వల్ల ఎంతో పద సంపద వాడకం లేక తుప్పుపట్టి శిథిలమైపోతుంది. దాంతో మనదగ్గర భాష వున్నా, వుందని తెలియక రచయితలు కూడా రచనల్లో చాలా నిర్లక్ష్యంగా ఇంగ్లీషు పదాల్ని వాడేస్తుంటారు. సృజనాత్మకి హద్దులు విధించడం కాదు గానీ, రచయిత మనుగడకి ఆధారం భాష. భాషలేకపోతే అతనికి మనుగడ లేదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనికి వుంటుంది. ప్రత్యామ్నయంగా ఒక తెలుగు పదం వున్నప్పుడు కూడా ఊరికే ఇంగ్లీషు పదం జోలికి పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. నేనిక్కడ రోడ్డుకి “రహదారి” అనీ, రైల్వేటైంటేబిల్‌కి “ధూమశకట గమనాగమన పట్టిక” అనీ రాయమనడం లేదు. కనీసం “అహం” ఉండగా ఈగో జోలికీ, “జీవితం” ఉండగా లైఫ్ జోలికీ పోవద్దంటున్నానంతే. ఇది కూడా కథనంలో పాటిస్తే సరిపోతుంది; సంభాషణల్లో మళ్ళీ రచయిత యిష్టం. సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రకి శిష్టవ్యావహారికంలో సంభాషణలు రాయనక్కర్లేదు.

    4) పిల్లల పత్రికలు. చందమామ లాంటి పత్రికలు తగ్గిపోవడం ఎంత లోటో ఇంకా ఎవరూ గమనించలేదనుకుంటా. ఇంగ్లీషులో ఇప్పుడు హారీపోటర్‌ని ఆసక్తిగా చదువుతున్న పిల్లల్లో కొందరైనా పెద్దయ్యాక సీరియస్ సాహిత్యం వైపుకి—కాఫ్కా వైపుకి, ప్రౌస్ట్ వైపుకి, ఇంకా మాట్లాడితే షేక్‌స్పియర్ వైపుకి—వెళతారన్న ఆశ వుంది. తెలుగులో ఇదివరకూ చందమామ లాంటి పత్రికలు ఆ పాత్ర పోషించేవి. కనీసం నావరకూ అలా తోడ్పడ్డాయి. అవి లేని లోటు ఇంకొక్క తరం పోతే చాలా తీవ్రంగా తెలిసి వస్తుంది.

    ఇక్కడ మనుషుల్లో రావాల్సిన మార్పు గురించి నేను మాట్లాడను. కానీ మనుషుల్లో మార్పు వస్తే—ఆ దిశగా వాళ్ళకి ఆసక్తి మళ్ళితే—కనీసం వాళ్ళకి ఆసరాగా నిలిచే వ్యవస్థైనా వుండాలి. అది యిప్పుడు లేదు. అందుకే నేనా వ్యవస్థ గురించి మాత్రమే సూచనలు చేయగలను. చేయగలిగాననుకుంటున్నాను. సాహిత్యానికి కనీసం యాభైశాతం ప్రాముఖ్యత ఎప్పుడూ ఏ సమాజంలోనూ లేదు. ఇవన్నీ శాతాల ప్రకారం పోయేవి. అభిరుచులనేవి ఆటుపోట్లాలాగా ఎప్పుడూ మారుతూ వుంటాయి. అనుకూలంగా మారినప్పుడు ఆ అభిరుచిని అక్కున చేర్చుకోగలిగే వ్యవస్థ వుండాలి. దానికోసమే ఆశ పడటంలో తప్పులేదనుకుంటా.

    — మెహెర్

  15. Sri Sasidhar.G says:

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    చదివింది ఇంగ్లిష్ మీడియం ఐనా చిన్నప్పుడు స్కూల్లో తెలుగు ప్రధమ భాషగా ఉండటం చేత ప్రాధమికమైన తెలుగు నేర్చుకోవడం సులభంగానే జరిగిపోయింది.

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    లేదు.ప్రత్యేకమైన క్రుషి చెయ్యకుండానే నేర్చుకున్నాను.చిన్నప్పటి నుండి మా తాతగారి దగ్గర పెరగడం చేత పద్యాలు,సామెతలు,నానా అర్థాలు ఇవ్వనీ చాలా సులభంగానే నేర్చుకున్నాను. ముఖ్యమగా దినపత్రిక
    చదవడం అనేది ఒక అలవాటుగా నా 8 ఏళ్ల వయసు నుండి ఉండడం చేత తెలుగు భాష ఒక సహజమైన
    స్నేహితగా మారిపొయింది నా విషయములో.పాత తెలుగు పాటలు వినడం కూడా ఇందుకు దోహదము చేసిందని చెప్పక తప్పదు.

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    మా తాతగారి దగ్గర ఉండడమే 🙂

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    తెలుగు మీద ఇష్టం బాగా ఏర్పడడానికి నా విషయములో లైబ్రరీ నిస్సందేహముగా దోహదం చెసింది.ఈనాడు చాలా మంది మిస్స్ అవుతున్న విషయం లైబ్రరీ.మా ఊరి లైబ్రరీ లో ఎంత లేదన్నా కొన్ని వందల పుస్తకాలు,పత్రికలు చదివాను.
    విషయ పరిజ్ఞానం పెరగడానికి,భాషాభిమనం ఏర్పడడానికి పుస్తకాలు చేసిన మేలు ఇంతా అంతా కాదు.నా చిన్నప్పుడు చదివిన మిసిమి మాస పత్రిక,ఏడు తరాలు నవల ఇంకా కొన్ని మంచి పుస్తకాల జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పదిలంగా ఉన్నాయి.
    జీవితములో జీవం నింపేవి జీవము ఉన్న ప్రాణులు కాదు,
    ప్రాణం లేని జీవులే(పుస్తకాలు).
    ఏమంటారు

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ
    ఏమిటి?
    చదవడం అనేది ఒక అలవాటుగా చిన్నపుడే మారితే చాలా మార్పు వస్తుంది,.
    మొక్కై వంగనిది మానై వంగదు కదా.

  16. lalithasravanthi says:

    మా నా చిన్నప్పుడు చాలా భయపడేదట ఇంగ్లీషు మీడియం వాళ్ళకు తెలుగు రాకుండా పోతుందేమో అని. ఆ భయం తో నాకు శతకాలు నెర్పించేది. మా నన్న గారు పాత సినిమా పాటలు పాడి దాని అర్ధం చెప్పే వారు. అది కాకుండ అష్టవధానలు మా ఇంట్లో జరిగేవి. మా నాన్న గారి స్నేహితులలో అవధానులు ఉండేవారు, వారి దయ వాల్ల నాకు తెలుగు కొంత అబ్బింది

    ప్రత్యేక కృషి అంటే శెలవుల్లో మా నాన్న గారు ఒక అవధాని గారి దగ్గర ట్యుషన్ పెట్టించేవారు. ఆయన భాగవతం లో ఒక అంశం తీసుకుని చెప్పేవారు. ఆయన తెలుగులో పరిశోధన గ్రంధం నాకు డిక్టేట్ చేసెవారు, నెను రాసే డన్ని. అలా పునాది పడింది అని చెప్పచ్చు
    ఈ ఇంటర్నెట్ మహిమ వాల్ల కొంత మంది సాహితీ మితృల పరిచయం తెలుగు మీద ఆశక్తిని ఇంకా పెంచుతోంది

    ప్రత్యేక సదుపాయాలు అంటే, మా ఇంట్లో చాలా పుస్తకాలూ ఉండేవి. ఏదైనా క్లాసులో 1స్ట్ వస్తే ఒక తెలుగు పుస్తకం కొనిచ్చేవారు. రాజకీయం, సినిమా, సాహిత్యం అన్ని మా నన్న నిద్ర పొయేటప్పుడు కథలుగా నాకు చెప్పేవారు

    ప్రేరణ కచ్చితం గా మా తల్లిదండృలు. మా గురువు గారు శ్రీ దీవి శ్రీనివసాచార్యులు గారు(ఎంతో ఒప్పిగా నాకు భగవతం చదివి చెప్పారు)

    సలహాలు నాకు తెలియదు. మన బాష ను మనం కచ్చితం గా మాట్లాడాలి అన్న ఉద్దేశం ఉండాలి,

  17. నేనూ యువకుడినే. ఇంకా నలభై రాలేదు. 🙂

    మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?

    పదవ తరగతి వరకూ తెలుగు మీడియం స్కూలులో చదివాను.

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    మా నాన్నగారు ఉపాద్యాయులు. సాహితీప్రియులు. ఇంటినిండా అనేక పుస్తకాలు ఉండేవి. అలా పుస్తకాలపై ఇష్టం పెరిగింది.

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    మా నాన్నగారు నాకు మొదటి ప్రేరణ. ఆయన ఒక ఒరేషియస్ చదువరి.
    స్కూలు అయిపోయినతరువాత మా వూరి లైబ్రేరీ కి వెళుతూ ఉండేవాడిని. అక్కడ మొదట్లో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి వంటి పుస్తకాలతో మొదలైన నా ప్రయాణం, నా డిగ్రీ పూర్తయే సరికి, చలం, కొ.కు.,శ్రీపాద, పానుగంటి వంటివారిదాకా చేరింది. ఈ రెండుస్థాయిలకు మధ్య ఒక విభజన రేఖలా యండమూరి నవలలు, మధుబాబు, షాడో, కొమ్మూరి, అపన వంటి డిటెక్టివ్ పుస్తకాలు ఉండేవి. ఇలాంటి పుస్తకాలు మావూరి లెండింగ్ లైబ్రేరీ వద్ద దొరికేవి.

    ఇక మేంచదివిన కాలేజీలోనైతే, మంచి సాహితీ వాతావరణం ఉండేది. అప్పట్లో మా సీనియర్లు ప్రతీరోజూ బోర్డుపై ఒక మినీ కవిత వ్రాస్తూండేవారు. మేమందరమూ ఈరోజు ఏమి వ్రాసి ఉంటారా అనుకొంటూ కాలేజీకి వెళ్లే వాళ్లం. మాలెక్చరర్లు కూడా వచ్చి, ఆ కవితను కాసేపు చూసి వెళ్లే వారు. ఈ ప్రక్రియను మొదలు పెట్టింది, ఈనాటి ప్రముఖ కవి శిఖామణి గారు, తరువాత తరువాత దానిని కొనసాగించింది, ఇప్పటి కవులైన శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ సి.హెచ్. రాం వంటి వారు.
    బహుసా అటువంటి వాతావరణం కూడా సాహిత్యంపట్ల నాలో చెరగని ముద్ర వేసిఉండవచ్చు.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    ఈ రోజు ఉదయం ఎన్.డి.టి.వి లో “బుక్” అనే ప్రోగ్రాం వచ్చింది. అందులో జెఫ్రీ ఆర్చర్ వివిధ పుస్తకాలను చూపిస్తూ (అతనో పుస్తకాల షాపులో నడుస్తున్నట్లు షూట్ చేసారు)వాటిని కొద్దిగా వివరించే కార్యక్రమం అది. దాని తరువాత ఈ వారం బెస్ట్ సెల్లర్ పుస్తకాలు అంటూ కొన్ని పుస్తకాల కవర్ పేజీలను ధరలను ప్రదర్శించారు. ఇలాంటి కార్యక్రమం తెలుగు చానెళ్లలో ఎందుకు చెయ్యరు అనిపించింది.
    కొద్దిరోజుల క్రితం సాక్షి టివిలో శ్రీ శ్రీ గురించి మంచి ప్రోగ్రాం వచ్చింది, చలం కధానాయికలపై మరో మంచి ప్రోగ్రాం వచ్చింది. వాటిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది.
    అలాంటి కార్యక్రమాల ద్వారా పుస్తకాలపై ఆశక్తిని ఇప్పటి తరానిని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది.
    శ్రీశ్రీ గారు ఎప్పుడో అన్నట్లు ఆంధ్రదేశంలో ప్రతి ముగ్గురిలో ఒక కవి ఉంటాడు అన్నది ఈనాడు వాస్తవం కాదు, నిజానికి ప్రతిముగ్గురిలో ఒకడు మాత్రమే చదవగలడు, మాట్లాడగలడు ఇప్పుడు.

    మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  18. పైన చాలామంది పెద్దలు వారి అభిప్రాయాలు చెప్పారు. నాకు సంబందించినవి:

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?

    నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమం లొ చదువుకున్నాను. నేను పుట్టి పెరిగింది ఆంధ్రదేశం లొ కాబట్టి

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    ప్రత్యేకంగా కృషి అంటూ ఏమి లేదు. పదో తరగతి వరకు నాకు తెలుగంటే ప్రత్యేక అభిమానం ఏమీ లేదు. కాని ఇంటర్మీడియట్ లో చాల మంది మిత్రులు రెండో భాష తెలుగు కాదని సంస్కృతం, హింది తీసుకొన్నారు. ఎందుకలా అని అడిగితే వాటిలో మార్కులు బాగా వేస్తారట. అప్పుడు కలిగింది ఏం తెలుగు లో ఎందుకు వెయ్యరు చదివితే, అన్న పట్టుదల పెరిగింది. అప్పటికే వార పత్రికలు (స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి) వాటిలొ వచ్చే నవలలు చదివే వాడిని. మాకు గ్రంథాలయం లేదు. కాని గ్రంథాలయాలు వ్యాసం మాత్రం ప్రతి పరీక్షలొ ఇచ్చేవారు (పదో తరగతి వరకు). ఇంటర్ లో మంచి మర్కులే వచ్చాయి తెలుగు భాషాభిమానం పెరిగింది. డిగ్రీ (నేను బి యస్సీ భౌతిక, రసాయన మరియు జంతు శాస్త్రాలు) ఆంగ్ల మాద్యమం. అయినప్పటికీ ఇక్కడ కూడా తెలుగే నా రెండో భాష గా తీసుకొన్నాను. డిగ్రీ కొచ్చేసరికి గ్రంథాలయం ఉంది ఇక నాకు పండగే రొజూ సాయంకాలాలు దొరికినవన్నీ చదివేవాడిని. తెలుగు తో పాటూ ఆంగ్లమూ చదివే వాడిని, తెలియనివి నిఘంటువు లో చూసి సందేహ నివృత్తి చేసుకొనేవాడిని. ఈ సందేహ నివృత్తి ఎలా ఉండేదంటే ప్రతి పదమూ చూసే వాడిని మొదట్లో ఆ తరువాత ఆంగ్లం లో కూడా మంచి పట్టే సాధించాననుకోండి.

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    ఏమి లేవు అనే చెప్పొచ్చు. కాని మా ఊళ్లో ఎండాకాలం లో ప్రతి సంవత్సరం మహభారతం నాటకాలు పద్దెనిమిది రోజుల పాటు వేశేవారు (ఒక్కో రోజు ఒక్కో పర్వం) అందులొ పద్యాలు విన్నప్పుడు ఏంటి ఇది తెలుగు లాగే ఉంది అర్థం కావడం లేదు (ఉదా:రాజు వెడెల రవితేజములెలరగా….., జండా పై కపిరాజు…. పరాబ్రహ్మ పరమేశ్వర పురుషొత్తమ ….సదానంద..) అనిపించేది. తెలుసుకొవాలన్న తపన పెరిగింది. ఆ తరువాత అర్థం అయ్యాయిలెండి.

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    తెలుగు క్షున్నంగా నేర్చుకోవాలన్న/తెలుసుకోవాలన్న ఉత్సాహమే.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    అనుభవాలు ఏమిటంటే ఇప్పటికీ నేను ఎక్కడైన క్రొత్త ఆంగ్ల పదాలు తటస్థిస్తే తెలుగులో తర్జుమా చేసుకొని తరువాత సమానాంతర ఆంగ్ల పదం వెతుక్కుంటా. ఇదెందుకు చెబుతున్నానంటే నాకు మొదలే తెలుగు రాక పోతే ఇంకే భాషలొ అర్థాన్ని వెతుక్కోను? అందుకే మాతృ భాష చాలా ముఖ్యం. ఎవ్వరైనా ఏదొ ఒక్క భాషలో పట్టు లేకపొతే ఇంకో భాష నేర్చుకొవడం దుర్లభం అని నా ఉవాచ. మన వాల్లు పుట్టింది పెరిగింది తెలుగుదేశం లో. వారికి తెలిసిన పరిసరాలు తెలుగువి, చుట్టూ ఉన్న ప్రజలు తెలుగు వారు. కాని ఇప్పటి తరం నేర్చుకుంటున్నవి మాత్రం విదేశి సంస్కృతి, సాహిత్యం, విదేశీ పరిఙానం అంతా పాశ్చాత్య పోకడలు. అది అయినా సక్రమంగా/క్షున్నంగా ఉంటుందా అంటే (ఊహుం అంత దృశ్యం…ఉండదు) మిడి మిడి ఙానం మిడిసి పడుతుంటారు. అంధ్ర లో చదివే ప్రతి ఒక్కరూ కనీసం ఇంటరు వరకు విధి గా తెలుగు ఒక్క సబ్జెక్ట్ చేర్చి చదివించాలి. వేరె భాషలు నేర్చుకోకూడదని ఎవ్వరూ చెప్పరు. అలా అని అమ్మ భాషని అశ్రద్ద చెస్తే సంపూర్ణంగా ఏ భాష నేర్చుకోజాలరు.

  19. laxmi says:

    • మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    పదవ తరగతి వరకూ తెలుగు మీడియం, ఆ తర్వాత కూడా మార్కులు తక్కువ వస్తాయి అని తెలిసినా ఇంటర్, డిగ్రీ ల లో తెలుగునే ద్వితీయ భాష గా ఎంచుకున్నా

    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?

    కృషి అంటూ ఏమీ లేదు కానీ తెలుగు సాహిత్యం మీద ఇష్టం మాత్రం ఎక్కువే. స్కూల్ లో చదివిన నల-దమయంతుల కథ, శకుంతల కథ ఎందుకో మనోఫలకం మీద అలా నిలిచిపోయి ఇంకా ఇంకా చదవాలి అన్న ఇష్టాన్ని కలుగజేసాయి

    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?

    ప్రతి నెలా చందమామ, బుజ్జాయి, బాలజ్యోతి పుస్తకాలు తెచ్చేవారు. సెలవులు వస్తే ప్రభుత్వ గ్రంధాలయానికి వెళ్ళి బాల సాహిత్యం సెక్షన్ లో ఉన్న పుస్తకాలు అన్నీ తెచ్చుకుని చదివేదాన్ని.

    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?

    అమ్మ ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదివేవారు (ఇప్పటికి కూడా అదే అలవాటు ఆవిడకి). తను ఎక్కువగా మాట్లాడేది కాదు, నేను పుట్టి పెరిగింది మొత్తం పాత బస్తీ, చుట్టు పక్కల అందరూ ముస్లింస్ ఉండేవారు, దానితో స్నేహితులు, ఆటలు అంటూ బయటకి వెళ్ళే అవకాశం తక్కువ. అన్నయ్యలు కూడా నాకంటే కొంచం పెద్దవాళ్ళే, వాళ్ళు కూడా సెలవులు వస్తే పుస్తకాలు తెగ చదివేవారు. దానితో పుస్తకాలే నా నేస్తాలుగా మారిపోయాయి. స్కూల్ లో మా కాంతమ్మా టీచర్ అద్భుతం గా చెప్పేవారు తెలుగు పాఠాలు, దానితో ఇంకాస్త మమకారం పెరిగింది తెలుగు మీద

    ఇంక జనరంజని వినటం అంటే మహా ఇష్టం ఇంట్లో అందరికీ. బాలు గళం నుండి జాలువారే ఆ పాత మధురాలు మనసులో తెలుగు మీద అభిమానం చాలా పెంచాయి.

    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?

    నా సలహా పిల్లలకంటె ముందు తల్లితండ్రులకే.

    1.తెలుగు లో మాట్లాడితే అదేదో చిన్నతనం అన్న భావన నుండి బయటపడండి.

    2.నేను స్వీట్ మ్యాంగో ని షార్ప్ నైఫ్ తో కోసుకుని తిన్నా అంటూ పిల్లలకి సంకర భాష నేర్పకండి.
    3. గొర్రే అంటే ఏమిటి? లేగ దూడ అంటే ఏమిటి? ఇవి మా పక్కన ఉన్న తెలుగు వారి ఇంట్లో నాలుగవ తరగతి లో ఉన్న పాప పరిస్థితి. ఇంగ్లీషు భాష మనకి ఉద్యోగావకాశాల కోసం అవసరమే కానీ దాని కోసం మన మాతృ భాష ని మరిచి పోవాల్సిన అవసరం లేదు
    4. ప్రభుత్వ గ్రంధాలయాలను పునరుద్ధరించాలి, చక్కటి బాల సాహిత్యాన్ని అందుబాటులోకి తేవాలి
    5. పిల్లలకి హారీ పాటర్, టింకల్ అంటూ పరభాషా పుస్తకాలనే కాదు, “అపూర్వ చింతామణి”, “పరమానందయ్య శిష్యులు” వంటి తెలుగు సాహిత్యం కూడా పరిచయం చెయ్యండి. అది కుదరదు అనుకుంటే ప్రతి నెలా కనీసం చందమామ ఐనా తెలుగు ఎడిషన్ కొనివ్వండి
    6. తీరిక దొరికినప్పుడు (తీరిక చిక్కించుకుని) వేమన పద్యాలు, సుమతీ సతకాలు వంటివి నేర్పించండి
    7. వారి పాఠ్య పుస్తకాలలో ఉన్న ఇంగ్లీషు పదాలు ప్రతీ వాటికి తెలుగులో అర్థం చెప్పండి, షీప్ అంటే గొర్రె అని చెప్పక పోతే ఎలా తెలుస్తుంది?
    8. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కింద పడితే “అమ్మా” అనే అంటాము, “ఓ మై మమ్మీ” అనో “ఓ మై గాడ్ అనో” అనము, అందుకే ముందు మన భాషలోని తియ్యదనాన్ని వారికి పరిచయం చెయ్యండి చాలు.

  20. ‘ఈతరానికి ప్రశ్నలు’ చదవగానే ఠకీఠకీమని జవాబులు రాసెయ్యాలనే అనిపించింది. ఐదు ప్రశ్నల్లో ప్రతిదానికీ ఒక సరళమైన సమాధానం. ‘1. తెలుగు నేలన పుట్టి, తెలుగు మీడియంలో ఇంటర్ దాకా చదివి, డిగ్రీలో సైతం తెలుగు చదివాను. 2. అందువలనచేత తెలుగు నాకు ఉగ్గుపాలతోనే వచ్చు, నేనేమీ కష్టపడనవసరం లేకుండా నాకొచ్చీసు. 3. నేను చిన్నప్పుడే చందమామ తర్వాత నేరుగా భాగవత పద్యాలు, అటుపైని శ్రీశ్రీనీ శ్రీపాదనీ, దోస్తవిస్కీనీ చదివేశా. అందరి వాక్యనిర్మాణాలూ నాకు తెలుసు 4. మీరు అడిగిన అందరూ నా తెలుగు పాండిత్యానికి సెబాసన్నవాళ్లే, 5. పిల్లలకు చిన్నప్పుడే నేర్పిస్తే తెలుగు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.’ అని రాసేద్దామని తెగ ఉబలాటపడ్డాను. ఉపరితలంలో ఇంత మామూలుగా కనిపించిన ప్రశ్నజవాబుల కార్యక్రమం అంతరంగంలో ఎంత చిచ్చుపెట్టిందో, ఎంత కల్లోలం రేపిందో వేరెవరూ ఎరగరు. అర్థమయ్యేలా నేను చెప్పనూలేను. ఎందుకంటే – తెలుగునాట పుట్టి, తెలుగు మాధ్యమంలోనే చదివిన నేను, తెలుగు వాక్యం కోసం, పుస్తకాల కోసం ఎంత తాపత్రయపడ్డానో కూడా మాటల్లో చెప్పలేను. లెక్కప్రకారం చూసుకుంటే ఈ వ్యాస రచయితలాగానో, మరికొందరిలాగనో ప్రవాస జీవన సౌభాగ్యమూ నాకు లేదు. తెలుగు పొలిమేరలను దాటి నేను వెళ్లిందేలేదు. అయినా తెలుగు కోసం పెనుగులాడుతూనే ఉన్నానంటే నమ్ముతారా? నేను అందుకోవాలని ప్రయత్నిస్తున్నకొద్దీ దాన్ని దూరం చేసిన పరిస్థితుల మీద కచ్చపుడుతోంది.
    ‘పేపర్లూ, పుస్తకాలూ చదవడం కాదు, క్లాసు పుస్తకాలు చదవాలి..’
    ‘పాఠాలన్నీ నాకొచ్చండి. మీరే పరీక్ష పెట్టినా రాస్తాను’
    ‘ఆహా, అయితే తర్వాత క్లాసువి చదువు’
    అని నా చేతిలోంచి ఎప్పటికప్పుడు ఖడ్గసృష్టినీ, చలం పుస్తకాల్నీ, గురజాడనీ లాగి అవతల పడేసిన పెద్దవారిని పేరుపేరునా తల్చుకునే సందర్భమా ఇది? ఒక్కరంటే ఒక్కరు ‘ఫలానా పుస్తకాలు చదువు ’ అని చెప్పి పుణ్యం కట్టుకున్నారా? పాఠ్యపుస్తకాల్లోని ముక్కల పాఠాలు కాక, పూర్తి పుస్తకాలుంటాయని తెలిసినా, కొనుక్కోవడానికి ఒక్క పుస్తకాల దుకాణమూ లేని నా పుట్టినూరిని, జిల్లానూ తిట్టుకోనా? ఎలాగోలా ఏ తెలుగు వాచకంలోనో సగం చదివిన ‘శృతిచూపన్ శ్రీవిలాసంబగు..’ అంటూ సాగిన గిరిక వర్ణన, పద్యం సొబగు నచ్చి, వసుచరిత్రను పరిచయం చెయ్యమంటే లెక్చరర్ చూసిన చూపును నేను ఇన్నేళ్లయినా మరిచిపోయానా? ‘పోవమ్మా, పోయి మ్యాథ్స్ చేసుకో, ఇలాంటివాళ్లే ఎంసెట్ ర్యాంకులు రాక మామీద పడి ఏడుస్తారు’ అని విసుగ్గా పంపేసిన మనిషిని మరిచిపోగలనా? ‘ఈనాడు’లో ఎనిమిది వేల మంది రాసిన పరీక్షలో ముచ్చటగా పాసైన ముగ్గురమ్మాయిల్లో నేనొకరయినప్పుడు ‘చూడండ్రా పప్పు, ఉట్టి తెలుగుతో బండెలా లాగించేస్తోందో..’ అన్న స్నేహితుడి వెటకారాన్ని విస్మరించగలనా? ఒక మంచి వాక్యం ఎలా రాయాలో, ఒక మంచి పుస్తకాన్ని ఎలా చదవాలో దగ్గరగా కూచోబెట్టుకు చెప్పిన మనిషి ఒక్కరంటే ఒక్కరు తారసపడని పరిస్థితిని ‘జాతకం’ అని సరిపెట్టుకోనా? తెలుగునాట పుట్టిన ప్రాణికి ఇదేం ఖర్మరా బాబూ అని ఆశ్చర్యపోనా? ఏం చెయ్యమంటారు నన్ను? వీటన్నిటికీ – ‘మీకు వాక్యంలో విభక్తులు ఎక్కడెలా ఉపయోగించాలో తెలీదు, విరామ చిహ్నాల సంగతి అడక్కండి..’ అన్న శూలం లాంటి మాట పడటం శిక్షగా చాలునా చాలదా నాకు?
    నా రానితనానికి ఎవరు బాధ్యులు? నేనేనా? కేవలం రాయడం, చదవడం, మాట్లాడ్డం మాత్రమే తెలుగనుకుంటే ఇంత అవసరం లేదు. ‘ఎంతసేపూ నీ సోదేనేవిటి? ఆయన సలహాలు చెప్పమన్నారు కదా, అవి చెప్పూ..’ అని చదువరులు విసుక్కోవచ్చు. ఇదిగో నా సలహా : మరో పదేళ్ల తర్వాతయినా ఒక పల్లెటూరున పుట్టిపెరిగిన అమ్మాయి నాలా పెనుగులాడకుండా ఉండే పరిస్థితి రావాలి. అందుకు తల్లిదండ్రులూ ఉపాధ్యాయులూ, లెక్చరర్లూ, గ్రంధాలయాలూ సాయం చెయ్యాలి. తేనెలో ముంచిన వెలుగే తెలుగంటే అని ఎవరో అనగా విన్నాను. అలాంటి తెలుగు వెలుగుల కోసం, తేనెల సోనల కోసమే నా, మనందరి ఈ తాపత్రయం.

  21. Rohiniprasad says:

    Marathi to be compulsory language in all Maharashtra schools
    http://timesofindia.indiatimes.com/Marathi-to-be-compulsory-language-in-all-Maharashtra-schools/articleshow/4585610.cms

    ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని స్కూళ్ళలో చదివినవారు తెలుగు అసలు నేర్చుకోకుండా డిగ్రీ స్థాయి వరకూ వెళ్ళవచ్చని విన్నాను. ఇది నిజమో కాదో తెలిసినవారు చెప్పగలరా?

  22. bvr babu says:

    మరి నేను మీ తరమో కాదో తెలియదు, కాని నా విషయానికొస్తే

    నేను చదివింది తెలుగు మీడియం లోనే ఇంటర్ వరకు.

    స్కూల్ లో ఉన్నప్పుడు దగ్గరలోనే ఉన్న జిల్లా గ్రంధాలయం లో ఉన్న పుస్తకాలన్నీ చదివే వాడిని . అదే నాకు ప్రేరణ .

    తరువాత డిగ్రీ లో ఉన్నప్పుడు(నెల్లూరు VR కాలేజ్ ) తెలుగు లెక్చరర్ పోలూరి హనుమత్జానకీ రామ శర్మ గారి ప్రేరణతో తెలుగు భాష మీద అభిమానం ఇంకా పెరిగింది

    అదే విధంగా తెలుగు సాహిత్యం మీదా అభిమానం పెరిగింది.

    ఇప్పటికీ నేను తెలుగు వాడిని అని చెప్పుకొడానికి గర్వపడతాను.

  23. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    రోహిణీ ప్రసాదు గారు,

    ఈ తరానికి ప్రశ్నలు వేయడానికి కారణం, ఫలాని వారెవరో విశాఖలో చదువుకున్నా తెలుగు మాట్లాడడం తప్ప చదవను, వ్రాయను తెలియకపోవడం అన్నారు. తెలుగు దేశంలో పుట్టి, తెలుగు దేశంలో పెరిగి, తెలుగువారయ్యుండి తెలుగు తెలియకపోవడం మీకు అమానుషంగా అనిపించుండొచ్చు. అయ్యో ఈ తరం కుర్రకారు ఈరకంగా తయారయితే ఇక తెలుగు భాష భవిష్యత్తేవిటి అని మీకు బాధ కలిగుండొచ్చు. జీవితవంతా ప్రవాసాంద్రులుగా గడిపిన మీరు చెయ్యగలిగిన, అతి సహజంగా చెయ్యగలిగిన ఈ చిన్న పని, అమ్మలాంటి, లాంటి కాదు అమ్మే అయిన తెలుగుని తెలుగు దేశంలో, తెలుగు కుటుంబాలు, చదువుకున్న తెలుగు కుటుంబాలు దూరంగా పెట్టటం, పిల్లలకి నేర్పించే విషయంలో నిర్లక్షం చేయటం మీకు విచిత్రంగా కనపడుండొచ్చు, అది నాకర్థమవుతుంది. ఐతే ఇక్కడ నాకొక సందేహం. మీరు మదరాసులో (చెన్నై అనాలేవో), మహరాష్ట్రలో గడిపిన వారే కదా. అక్కడ జనాభాలో ఎంత మందికి తమిళం, మరాఠీ, హిందీ మాట్లాడడం కాకుండా చదవదం, వ్రాయడం వచ్చుంటుంది. ఒక 20% కాదంటే 30% అంతకన్నా వుండరు కదా. తెలుగు దేశంలో తెలుగు రాని ఇంజినీర్లని, డాక్టర్లని, లాయర్లని వదిలెసీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ గాళ్ళని (పిల్లలకి తెలుగు బదులు హిందీ రెండో భాషగా) ప్రక్కన పెడితే, ఇప్పుడూ, ఒక వందేళ్ళ క్రితం, ఒక వెయ్యేళ్లక్రితం కూడా తెలుగు మాట్లాడనూ, చదనూ, వ్రాయనూ వచ్చిన వారు ఏ 30%, కాదంటే 40% కి మించలేదు, మించి వుండరు. అయినా తెలుగు, తమిళం, మరాఠీ,… ఆ భాషలన్నీ సలక్షణంగా వున్నాయి.

    ఏదో ముక్కున పట్టుకున్న ఆ నాలుగు లైన్ల కోడుని పదే, పదే వ్రాసుకుని మురిసిపొయ్యే మాలాటి కంప్యూటర్గాళ్ళకో, పెళ్ళాన్నో, మొగుడ్నో పట్టుకుని ఈ దేశంవచ్చి ఎమ్ . డి లయిపోయిన నా పెళ్ళాం లాంటి వాళ్ళకో, తెలుగు దేశంలో వార్తా పత్రికల్లో పేరుకోసం, తెలుగుని బ్రతికించండి అనేవాళ్లో అయితేగాని, మీరు, శాస్త్రవేత్తలు, తెలుగు సాహితీ తరంగాన్ని కనీసం పరోక్షంగానైనా అధిరోహించిన మీరు తెలుగు గురించి మాలాగా, నాలుగు కాసులకోసం, వార్తలకోసం జొల్లు కార్చే తెలుగు దేశపు తెలుగు మేధావుల్లా బాధపడిపోవటం నిజంగా ఏవీ బాగలేదండీ. వేల సంవత్సరాలు రాజ భాష సంస్కృతాన్ని, వందల సంవత్సరాలు నవాబుల రాజ భాష ఉర్దుని, ఆంగ్లాన్ని ఎదురొడ్డి నిలచిన తెలుగు (తమిలం, మరాఠీ, ….) ఈ రోజు, నలుగురు చదువరుల చేతగానితనానికి బలయిపోతాయని మీరు బాధపడడం ఏవి బాగలేదు. ఏ రోజు, ఏ దేశంలో, ఏ భాషలో చదవ, వ్రాయ, మాట్లాడగలిగిన వారు యాభయి శాతాన్ని మించారు రోహిణీ ప్రసాదు గారు?

  24. Rohiniprasad says:

    రవికిరణ్‌గారూ,

    ఈ రోజుల్లో ఏ రాష్ట్రంలోనైనా దాదాపు ఒకేలాంటి పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగు చదవకుండానే డిగ్రీదాకా చదివెయ్యచ్చనే విషయం విన్నాను. ఎంతవరకూ నిజమో తెలియదు.

    తెలుగు రాయడం, చదవడం రాకపోయినందువల్ల పెద్ద నష్టం కలుగుతుందని కాదు. మన గురించిన కొన్ని వివరాలు తెలుగులో తప్ప తెలుసుకోవడం వీలవదు. ఇది మధ్యతరగతికి సంబంధించిన సమస్య మాత్రమే.

    తెలుగు మీద ఆసక్తి లేనివాళ్ళు మా తరంలోనూ ఉండేవారు. మద్రాసులో మా తెలుగు క్లాస్‌మేట్ ఒకణ్ణి “కన్యాశుల్కం చదివావా?” అని నేనడిగితే, వాడు “చదవలేదు. ఏం అది మీ నాన్న రాశాడా?” అని ఎదురుప్రశ్న వేశాదు. (వెటకారంగా కాదు, తెలియకనే). వాడికి కన్యాశుల్కం ఎవరు రాశారో తెలియనందుకూ, మానాన్న పుస్తకం అయితే తప్ప దాని ప్రస్తావన తీసుకురానని వాడనుకున్నందుకూ నాకు ఆశ్చర్యం కలిగింది.

    తెలుగు మరుగునపడిపోతోందనే భయం అర్థంలేనిదని ఎవరైనా చెపితే నేనూ సంతోషిస్తానని నా వ్యాసంలో రాశాను.

  25. ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే ఫ్యాషన్. అంతకంటే ఏమీ లేదు. చాలామందికి తెలుగు రానట్టుగా నటించటం ఒక ఫ్యాషన్ గా మారింది. లేకపొతే రోగమా తెలుగు రాకపోవటానికి(విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ పుట్టి పెరిగి!!). ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వాడు విండోస్ పూర్తిగా తెలుగులోనే వస్తుందని చెప్పమనండి తెలుగు వచ్చిన వాళ్ళు ఎంతమంది పుట్టల్లోంచి బయటపడతారో!

    ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగం కోసరం పరీక్షలు వాళ్ళ మాతృ భాషలోనే వ్రాయాలని ఒక నిబంధన పెడితే ఈ తెలుగురాదు నాకు అని నీలిగే వాళ్ళందరూ మనం ఆశ్చర్య పొయ్యేట్టుగా తెలుగులో చక చకా మాట్లాడుతారు వ్రాస్తారు. మాబ్బయికి/అమ్మాయికి తెలుగు సరిగ్గా రాదండీ అని గొప్పలు పొయ్యే తల్లి తండ్రులు ఉన్నంతవరకూ ఈ ఫ్యాషన్ (దీనికి తెలుగేమిటి?) కొనసాగుతుందని నా అనుమానం.

    శివరామప్రసాదు కప్పగంతు
    బెంగుళూరు భారతదేశం

  26. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    తెలుగు రాకపోవటం ఫ్యాషన్ ఏవిటండి. విశాఖలోనూ, బెజవాడలోనూ పుట్టి పెరిగేరు కాబట్టే కనీసం మాట్లాడటం వచ్చు. ఏ ఆంగ్ల మాధ్యమంలోనో చదువుకునుంటే మొదటనుంచి, తెలుగెలా వస్తుంది ప్రసాదు గారు. రాకపోవటం నేరవేవి కాదు, విడ్డూరవేవీ కాదు. కాకపోతే చదువుకున్న వాళ్ళు, తెలుగులో, తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ల వల్ల కాదు తెలుగు బ్రతికుందంటే. తెలంగాణాలో, నవాబు పాలనలో ఉరుధు మాధ్యమమే ఉన్న కాలంలో తెలుగుని బ్రతికించింది, తెలుగుని కాపాడింది, చదువుకున్న వాళ్ళు కాదు, గొప్ప కవులు, కథకులు, సాహిత్యకారులు కాదు. చదవటం వ్రాయటం కూడా రాని మామూలు మనుషులు. చదువుకున్న ఇళ్లలో కూడా, మగవాళ్ళు ఉరుధులో మాట్లాడినా, వానా కాలం చదువులు చదివిన, అసలు చదవని ఆడవాళ్ళే తెలుగుని బ్రతికించారు. మీకు తెలంగాణాలో పరిచయాలుంటే, ఉరుదు తప్ప తెలుగురాని వయసుమీరిన మగవాళ్ళని (యాభై, అరవైల పైపడిన జనరేషను)తెలుగు, ఉరుదు రెండూ తెలిసిన ఆడవాళ్ళని మీరు చూడగలరు, చదువుకున్న కుటుంబాలలో. ఇక గొప్పలు పోయేవాళ్ళ సంగతంటారా, పోనివ్వండి వాళ్ళు ఏ నూటికో, కోటికో ఒకరే కదా.

  27. Language is only for communication between people. No language is neither superior nor inferior than another. ఇలాంటప్పుడు ఏ బాషలో మాట్లాడితేనేం? మా అమ్మమ్మ, తాతయ్య ఒరిస్సా నుంచి వచ్చారు. వాళ్ళు ఒరియా, తెలుగు రెండు బాషలూ మాట్లాడుతారు. వాళ్ళ మాతృ బాష ఒరియా, తెలుగా అనే విషయం తెలియదు. ఒకతను అడిగాడు “తెలుగు బాష అంతరించిపోతోంది అనేది నిజమైతే మీరు బ్లాగులు తెలుగులో ఎలా వ్రాస్తున్నారు?” అని. తెలుగు బాష అంతరించిపోయే అవకాశం లేదు. లక్ష మంది కంటే తక్కువ సంఖ్యలో మాట్లాడేవారు ఉన్న బాషలే అంతరించిపోయే అవకాశం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. తెలుగు బాష మాట్లాడేవాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో ఎనిమిది కోట్లు ఉంది. ఒరిస్సా, చత్తీస్ గఢ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుంది.

  28. chavakiran says:

    గతంలో బతికుంది కాబట్టి ఇప్పుడూ బతికుంటుందనేది తెలివిలేని వాదన.
    గతంలో ఇంత సాంకేతికాభివృద్దిలేదు. గతంలో ఏదో అదృష్టవశాత్తు బతికింది. గతంలోనూ తెలుగును బతికించటానికి తెలుగును సింహాసనంపై కూర్చోపెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. లేకుంటే సంస్కృతపురోజుల్లో తేటతెలుగులోవ్రాస్తా అని కొందరు కవులయినా అనేవారు కాదు. లేకుంటే ఆంధ్ర మహా సభ అవసరమే ఉండేది కాదు. నీళ్లు పొయ్యకపోతే ఏ చెట్టయినా ఎప్పుడో ఒకప్పుడు చచ్చి ఉరుకోక తప్పదు. మీరు ఆ నీరు పల్లెవారు పోస్తారు అని అంటున్నారు, అందరూ ఎందుకు పొయ్యకూడదు. తెలుగుని ఎవరూ కష్టపడి బతికించ అవసరం లేదు, కాని కష్టపడి చంపకుండా ఉంటే చాలు.

  29. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    చావా కిరణ్ గారు,

    తెలివిలేని వాదనలొ కనిపిస్తున్న లాజికల్ అంశాలివి.

    1.భాష అనేది ఒక వ్యక్తీకరణ సాధనం.

    సాధారణ ప్రజల జీవనంలో, వాళ్ళ రోజువారి అవసరాల్ని, ఆలోచనల్ని, ఆరాటాల్ని సులభంగా ఒకరికొకరు వివరించడానికి ఉపయోగపడే మెళుకువ. అది తెలుగైనా, తమిళవైనా, మరే భాష అయినా.

    2.సాహిత్యవనేది, ఆ వ్యక్తీకరణలో మరింతగా అభివృద్ది చెందిన, వ్యక్తి నుంచి వ్యక్తికి మాత్రవే కాకుండా, వ్యక్తి నుంచి సమాజానికి, కనీసం సంఘంలో ఒక భాగానికి ఉద్దేశించబడిన వ్యక్తీకరణ ప్రక్రియ.

    సాహిత్యం ఆ విస్రుత ప్రజానీకాన్ని చేరలేనప్పుడు అది దాని ప్రాధాన్యతని కోల్పోతుంది. సమాజంలో ఒక చిన్న భాగానికే పరిమితవైపోయిన ఆ సాహిత్య ప్రక్రియ నెమ్మది మీద తన ఉనికినే కోల్పోయి అంతవైపోతుంది. భాష జీవ నదిలా సాగిపోతూనే వుంటుంది.

    3.అయితే తెలుగు భాష కానీ మరే భాషగాని కలకాలం నిలచిపోతుందా?

    నిలచిపోదు. మార్పు అనేది సహజ సిద్దవైన గుణం. మనిషికైనా, భాషకైనా. ఆ మార్పు బతుకుని మార్చినట్టే భాషని కూడా మార్చుతుంది. ఒకానొక దశలో ఆ మార్పు మరింతగా ప్రస్పుటవై భాష తీరే మారి మరోభాషగా రూపాంతరం చెందవచ్చేవో. ఆ విధంగా బతుకు మొదలుపెట్టిందే కదా తెలుగు, ఏ ప్రాచీన ద్రవిడ భాషతోనో తెగతెంపులు చేసుకుని.

    4.గతంలో సాంకేతికాభివృధ్ధి లేదు, అందువలనే తెలుగు బ్రతికిందేవో అనే అనుమానం వెలిబుచ్చారు మీరు.

    గతంలో కూడా సాంకేతికాభివృధ్ధి వుంది. ఈ రోజుతో పోలిస్తే తక్కువే కావొచ్చు. కానీ అభివృధ్ధి ఆకాశంలోంచి రాదు. మెట్టు మీద మెట్టెక్కుతూ వస్తుంది. ఈ రోజు ఇంత అభివృధ్ధి వుందికాబట్టే మీరు, నేను, మనం ఇప్పుడు వాదులాడుకో గలుగుతున్నాం తెలుగులో. ఇన్ని ఈ- పత్రికలూ, బ్లాగులు వున్నాయి కాబట్టే మీరూ, నేనూ ఈ-తెలుగు కవులుగా, ఈ-తెలుగు రచయితలుగా మార్పు చెందేం, పాఠకులుగా ఆగిపోకుండా. ఆ సాంకేతికాభివృధ్ధి వలననే ప్రపంచ భాషలలో మరిన్ని పదాల్ని కలుపుకుని తెలుగు మరింతగా వ్యక్తీకరణకు అనువైన భాషగా మార్పు చెందుతుంది.

    ఈ మార్పు నన్నయ్యలని, తిక్కనలని, శ్రీనాధుల్ని, క్రిష్ణ శాశ్త్రుల్ని, శ్రీశ్రీ లని వెనక్కి త్రోసెస్తుందని మీ భయవయితే, మీ భయం నిజవే. ఈ మార్పు మరో క్రొత్త సాహితీ కోణాన్ని వెలికి తీస్తుందని మీకనిపిస్తే, మీ అనుమానం నిజవే. కానీ దాని వలన తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి జరుగుతున్న చెడేం లేదు. తెలుగుని మరింతగా శక్తివంతవైన భాషగా మార్చటం తప్ప. సాహిత్యాన్ని మరింతగా ప్రజాతంత్రీకరించడం తప్ప.

    కాబట్టి, లక్కీ చాన్సు వలన కాక, తెలుగు భాష చారిత్రిక, సామాజిక కారణాలవలనే బ్రతికుందనేది సత్యం.

    5.ఇక గతంలో తెలుగుని బ్రతికించి సింహాసనాలపై కూర్చో పెట్టడానికి చాలా ప్రయత్నాలే జరిగేయని చెప్పేరు మీరు.

    కానీ ఆ ప్రయత్నాలు ఎందుకు జరిగేయో, ఎప్పుడు జరిగేయో, ఏఏ కారణాల వలన జరిగేయో. ఆ కాలాల్లో తెలుగు భాషకొచ్చిన కష్టాలేవిటో మీరు చెప్పలేదు. సంస్కృతపు రోజుల్లో, తేట తెలుగులో వ్రాస్తా అని బయలుదేరిన కొందరు కవుల ప్రయత్నాలే మీ అభిప్రాయానికి ఆలంబన అని నేననుకుంటున్నాను.

    తెలుగు భాషకి, సాహిత్యానికి వున్న బేధాన్ని మీరు అవగాహన చేసుకున్నట్టు నాకనిపించటం లేదు. తెలుగు దేశంలో సంస్కృత సాహిత్య సృష్టికర్తలకి తాము సమాజంనుంచి దూరవైపోతున్నావనే అవగాహన కలిగి, వాళ్లలో (ఈ కాలం గురజాడలలాటి) నన్నయ్య లాంటి ఒకరిద్దరు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మార్పుకి పునాది వేశారని మీరంటే కాదని నేననను. కానీ ఆ మార్పు తెలుగు భాషని బ్రతికించడానికి కాక సాహిత్యాన్ని (నన్నయ్యలతో సంబంధం లేకుండా ఆ కాలపు తెలుగు సామాజంలో కావాల్సినంత సాహిత్యవే తెలుగులో వుండివుండాలి. మహాభారతం సంస్కృత రూపంలో సామాన్యుల దగ్గరకి చేరుండదు, నన్నయ్య వారు తెలుగు చేయక మునుపే భారతపు కథలు గ్రామీణ, పట్టన సామాన్యుల్లో పాపులర్ కథలే. ఇవి కాక మరెన్నో పాటలు, కథలు ఆ కాలపు తెలుగు సామాన్యాన్ని అలరించే వుంటాయి) తెలుగు బాట పట్టించి తమ వునికిని నిలుపోకోవటవే ఆ ప్రయత్నపు లక్షం.

    భాషనుంచి సాహిత్యం చావాకిరణ్ గారు, సాహిత్యం నుంచి భాష కాదు.

    6.నీళ్ళు పొయ్యకపోతే చెట్టు చచ్చిపోతుంది (కొన్ని చెట్లు).

    భాష చెట్టు కాదు, భాష అవసరం, మనిషికి, సంఘానికి అవసరం. దానికి ప్రత్యేకవైన నీళ్లవసరం లేదు. మాట్లాడే మనుషులున్నంతవరకు. మాట్లాడే మనుషులు ఎప్పుడూ వుంటారు. అయితే వాళ్ళ సాంఘీక, ఆర్ధిక, సామాజిక పరిస్తితులు మారుతూ వుంటాయి, ఆ మార్పులతో భాష కూడా మారుతూ వుంటుంది. ఆ మార్పుని చూసి భయపడిపోయి భాష చనిపోతుందనుకుంటే చెసేదేంలేదు. ఆ భయాన్ని ఉపయోగించుకుని తమని తాము ప్రమోట్ చేసుకునే సాహిత్య వీరులకీ, తెలుగు భాషా సంరక్షణ సమితి శూరులకి నే చెప్పేదేంలేదు. మీలాటి, నాలాటి సామాన్య తెలుగు ప్రజలకి మాత్రం ఆ భయం ఇర్రేషణల్ అనిచెప్పటం తప్ప.

  30. chavakiran says:

    >>.భాష అనేది ఒక వ్యక్తీకరణ సాధనం.
    Language is more than that, you simply can not ignore political, social,economical, cultural, creative aspects associated with it.
    >>భాష జీవ నదిలా సాగిపోతూనే వుంటుంది.
    అవును. కేవలం డ్యాములు కట్టనంత కాలం.
    >>మీ భయవయితే,
    నాకటువంటి భయాలేమీ లేవు.

    యథ్యధాచరతి శ్రేష్టహ్ ……

  31. @రవికిరణ్ తిమ్మిరెడ్డి: టోపీ లేపేసాను. చాలా రోజులుగా నేను అనుకుంటున్నది, ఆలోచించిందీ మీరు అక్షరీకరించేశారు.

  32. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రెండు వందల ఏళ్ళ పాటు పరిపాలించారు కాబట్టి ఇంగ్లిష్ ఇండియాలో అధికార బాష అయ్యింది. బ్రిటిష్ వాళ్ళు కాకపోతే ఇండియాని ఫ్రెంచ్ వాళ్ళో, చైనా వాళ్ళో, రష్యా వాళ్ళో ఆక్రమించుకునేవాళ్ళు. ఇండియా ఫ్రెంచ్ వారి పరిపాలన కింద చేరితే ఇక్కడ ఫ్రెంచ్ బాష అధికార బాష అయ్యేది, చైనా వారి పరిపాలనలో చేరితే చైనా బాష అధికార బాష అయ్యేది. అయినా ఇప్పుడు ఇంగ్లిష్ బాష వల్ల తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్య తగ్గలేదే. ఒరిస్సాలో కూడా తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్యని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక దేశం వాళ్ళు ఇతర దేశాలని ఆక్రమించుకోవడం వల్ల ఒక బాష పదాలు ఇంకో బాషలో చేరుతాయి. అంతే కానీ బాష పూర్తిగా చావడం జరగదు. తెలుగులో ఇంగ్లిష్ పదాలు చేరినా తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఎక్కువగానే ఉంది. బాష చనిపోతుందని భయం ఒక భ్రమ మాత్రమే.

  33. Malakpet Rowdy says:

    ఒక దేశం వాళ్ళు ఇతర దేశాలని ఆక్రమించుకోవడం వల్ల ఒక బాష పదాలు ఇంకో బాషలో చేరుతాయి. అంతే కానీ బాష పూర్తిగా చావడం జరగదు. తెలుగులో ఇంగ్లిష్ పదాలు చేరినా తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఎక్కువగానే ఉంది. బాష చనిపోతుందని భయం ఒక భ్రమ మాత్రమే.
    _____________________________________________________________________________________________

    ఈ విషయంలో మార్తాండతో ఏకీభవిస్తాను. మన జనాభాతో పాటు తెలుగు మాట్లాడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. పన్నెండు కోట్లమంది అంటే చాలా దేశాల జనాభాకన్నా ఎక్కువ.

  34. ఒరిస్సాలోని రాయగడ ప్రాంతంలో ఒకప్పుడు తెలుగు మీడియం స్కూళ్ళు మాత్రమే ఉండేవి, ఒరియా మీడియం స్కూళ్ళు ఉండేవి కాదు. రాయగడ ప్రాంతం ఒకప్పుడు రెడ్డి రాజుల పరిపాలనలోనూ, కాకతీయుల పరిపాలనలోనూ ఉండేది. రెడ్డి రాజులు, కాకతీయుల వల్ల అక్కడ తెలుగు ప్రభావం పెరిగి ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించుకున్న తరువాత అక్కడ తెలుగు మీడియం స్కూళ్ళు కట్టారు కానీ ఒరియా మీడియం స్కూళ్ళు కట్ట లేదు. ముస్లిం రాజుల పాలనలో తెలుగు బాషలో పెర్షియన్ (ఫార్సీ), అరబిక్ పదాలు చేరాయి. బ్రిటిష్ వాళ్ళ పాలనలో తెలుగులో ఇంగ్లిష్ పదాలు చేరాయి. తెలుగు బాష రూపం మారింది కానీ అంతరించిపోతుందని మాత్రం అనుకోను.

  35. Subha says:

    I am very sorry to write in English as I did not know how to get the text in Telugu script. I do not belong to this generation. But as a mother of two sons (one in 9th grade and one in 4th grade) studying in Hyd during 1980-88 can authentically tell that the deterioration of teaching Telugu language in schools started from that time. I remember taking up my frustration by arguing with the teacher how hard it is getting for the children to learn Telugu as no constructive method in teaching the language was being applied. The teacher was an young woman of 25 years and appeared confused. May be the management thought that teaching Telugu was an easy one as it is the mother tongue of the children and that grammer is not that important. The language was taught with no foundation, so naturally reached a state of decay in 25 years. It is exactly the way they taught Hindi to me when I was in school. I used to dread Hindi classes as I was not able to comprehend the change of verbs with the gender. And naturally I forgot that language once I completed high school. Now the current generation is being taught Telugu the way they learnt it and naturally they lost interest in teaching it as they themselves do not enjoy the beauty of the language. I still remember my telugu teacher and we were enthusiastically waiting for his class explaning the alamkarams, samasams and chandassu. Finding the ganas and vrithams of the poems was a thrill. My first son who was in 9th grade did not hear about them at all! So we do not have to blame the current parents and teachers for the deterioration of standard in teaching Telugu. The basic problem started 30-35 years back and people are opening their eyes once the ruin is complete.

  36. Subha says:

    Small correction:

    Now the current generation is being taught Telugu BY TEACHERS the way they learnt it and naturally they lost interest in teaching it as they themselves do not enjoy the beauty of the language.

  37. యోగి says:

    @రవికిరణ్ తిమ్మిరెడ్డి – చాలా చక్కగా చెప్పారు. ఇలాంటిదే ఒక చర్చ ఇక్కడ చూడండి: http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/3beba6a940be2e63 . ఈ లంకెలో పెడ్రో అనే అతని మెయిలు చూడండి.

  38. యోగి says:

    “గతంలో బతికుంది కాబట్టి ఇప్పుడూ బతికుంటుందనేది తెలివిలేని వాదన.” – ఓహ్ అలాగా..!

    “గతంలో ఏదో అదృష్టవశాత్తు బతికింది” – ఇది చాలా తెలివైన వాదనలాగుందే. మరి గతకాలపు అదృష్టానికీ, ఇప్పుడు హఠాత్తుగా జాతికి సంబంధించిన ఈ దురదృష్టానికీ, కారణాలేమిటిట?

    తెలుగును, ఆమాట కొస్తే ఏ భాషనూ పని గట్టుకుని ఎవ్వరూ బ్రతికించక్కరలేదు. మరణిస్తున్న భాషనొకదానిని కొందరు లింగ్విస్టులు, కథకులు, సాహితీవేత్తలు,బ్లాగరులు, గూగులు గ్రూపులు కలిసి నిర్విరామ కృషి సలిపి జీవం పోసిన సందర్భాలు ఇంతకు ముందు చరిత్రలో లేవు.”ఇంతకు ముందు లేదని ఇక మీదట ఉండదనేది తెలివి తక్కువ వాదన” అని మీరంటే… ఏం చేస్తాం! ఖండిస్తాం!!

    ఆంధ్ర మహాసభ వెనుక రాజకీయ ప్రయోజనాలుండేవి. నాకు నచ్చే విషయం ఏమిటంటే అది వారి రహస్య అజెండా కాదు!

  39. మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
    సహజంగానే తల్లిదండ్రుల నుండి వచ్చింది.
    • అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
    లేదు.
    • చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
    మా నాన్న గారిది “భాషా పరిగ్ణానం , విషయ పరిగ్ణానం” వుండాలన్న అభిప్రాయం. మాకోసం చాలా కథల పుస్తకాలు కొని తెచ్చే వారు. ప్రతీ రొజు 1 పేజి తెలుగు, 1 పేజి english వ్రాయించే వారు. అప్పుడప్పుడు english news paper లోని ఏదైనా ఒక వార్తను ని తెలుగు లోకి అనువదించ మనే వారు. తెలుగు చందస్సు కష్ఠంగా వుందంటే తెలిసిన స్నెహితురాలి చేత చందస్సు చెప్పించారు
    • మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
    నా తల్లిదండ్రులు, టీచర్లు , ఇప్పుడు కొందరు స్నెహితుల నుండి.
    • ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
    మన దేశంలో వున్న వారి సంగతెమో కానీ ప్రవాసాంద్రులు మాత్రం తమ పిల్లలకు తప్పకుండా తెలుగు నేర్పించే ప్రయత్నం చెయ్యాలి. వాల్లతో తెలుగు లో మాట్లాడాలి. “fast fast గా eat చెయ్యి ” లాంటి భాషను పిల్లలకు నేర్పించక పోతే మంచిది. పూర్ణిమ గారు అన్నట్టు “సరైనవి సరైన కాలంలో పరిచయం చేస్తే, వాటితో స్నేహం కుదిరి ఏ ప్రణయానికో దారి తీస్తాయి. అంతే కానీ, అప్పటి వరకూ ముక్కూ మొహం కూడా తెలీకుండా, అప్పటికీ నామమాత్రపు పరిచయ కార్యక్రమాలు కూడా జరగక్కుండా, ఆప్యాయతానురాగాలు ఒలకబోయాలంటే ఎలా సాధ్యం? ఆ – ఈ తరం అన్న భేదం లేకుండా తెలుగును పరిచయం చెయ్యాలి”.

  40. trao says:

    ను ఏ తరం వాడిని? నాకేం తెలుసు? నా గుండెని అడుగు. ప్రస్తుతం ఈ యుగంలో ఉన్నా, ఈ క్షణంలో రాస్తున్నా.
    1. పన్నెండు దాకా, తెలుగు మాధ్యములో చదివా. మా పక్కింటి వాటాలోంచి ప్రతిరోజు ఉదయము అమరకోశము వినిపించేది. హైస్కూలులో ఇంగ్లిషులో మొదటి బహుమతి పొందాను.తొమ్మిది వరకు తెలుగుతో సంస్కృతము కూడా నేర్చుకున్నా.
    2.ప్రత్యేక కృషి ఎందుకు? మా వూరిలో ఎన్నో ఉండేవి ఆ రోజుల్లో. అవధానము, హరికథ, పురాణము, గీతా పారాయణము, ఆ మరిచిపోయా ఆనాటి తెలుగు సినిమాలు. మా నాన్నగారి మిత్రులు శతకము రాసారు.దొరికినప్పుడు ప్రభ, భారతి, చందమామ అన్నీ చదివేవాణ్ణి.
    3. నా సాటి పిల్లలకు కూడా దొరికాయి – మామిడికాయలు, సీమచింతకాయలుతో పాటు అవకాశాలు. నేను కాలేజిలో తెలుగు ఇంగ్లిషు రెండు చదివాను. మాకు ఇద్దరు మహా పండితులు నేర్పారు. నా అదృష్టము, భాగ్యము. నా చదువు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే, ప్రభుత్వ కళాశాలలోనే.
    4. ప్రేరణ: మా చుట్టాల్లో, ఒకరు ఉభయభాషాప్రవీణ, ముగ్గురు గాయకులు. పెళ్ళిల్లలో ఎప్పుడూ ఒక పాట, ఓ వీణ, నాట్యము చూసేవాణ్ణి. వీధిలో రాత్రి త్యాగరాజ ఉత్సవాలు మట్టి నేలమీద కూచ్చొని చూసా..
    5. సలహాలు: ఎంత పెద్ద మాట! ఒక మంచి మాట, ఓ సాహిత్యము, ఓ భాష, ఓ కళ ఎవరి అదృష్టాలు వారివి, అంత తేలిగ్గా వస్తాయా మరి. నాకు వీలున్నప్పుడు, నా బ్లాగులో (వేగు పదము నాకు నచ్చలేదు, ఎందుకో ఎక్కడో రాసాను), సులేఖలో తెలుగు పాటలకి అర్ధాలు, కొత్త పద్యాలు రాస్తూ వుంటా. నిజముగా ఇంగ్లిషు (హింది, ఉర్దూ) వచ్చిన వాళ్ళకి తెలుగు మీద (మరే మాతృభాష మీదైనా) ప్రేమ, అభిమానము పెరుగుతాయి.
    This is a critical issue, the dearth of good language teachers, disappearance of Telugu from a section of urban population. But the blame lies not with the creative Telugu writers or music composers. The creative artists are racing against time, to put the essence of thought onto paper, sound, sight.

Comments are closed.