తొలి మానవుల మనోవికాసం

– కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మతాలూ, నమ్మకాలూ పుట్టుకురావడానికి మునుపు మనుషుల ఆలోచనలు స్పష్టతను సంతరించు కోవడానికి లక్షల సంవత్సరాల ఎదుగుదల అవసరమయింది. నరవానరాలకూ, మనుషులకూ తేడాలు ఒక్కసారిగా తలెత్తలేదు. అతినింపాదిగా జరిగిన ఈ పరిణామం మనుషులను క్రమంగా తక్కిన జంతువులనుంచి వేరుచేసింది. తత్ఫలితంగా కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు ఏర్పడసాగాయి. జంతువుల్లాగా కాకుండా మనిషికి భావప్రపంచం అనేది ఒకటుంటుంది. దీనికి కారణం మనిషి మెదడులో జరిగిన అభివృద్ధి. మనిషికి రెండుకాళ్ళ నడక అలవాటై, చేతులకు “స్వేచ్ఛ” లభించడంతో బుద్ధివికాసం మొదలైందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇందులో “ఆధ్యాత్మికశక్తుల” ప్రమేయం లేకపోవడమే కాదు; అతి సామాన్యమైన భౌతికకారణాలే ప్రేరణలుగా పనిచేశాయి.

ఆస్ట్రలోపితెకస్
ఆస్ట్రలోపితెకస్‌ జాతి

మానవజాతి ఆవిర్భావానికి తొలి దశలో ఆఫ్రికాలో సుమారుగా 50 లక్షల ఏళ్ళ క్రితం ఆస్ట్రలోపితెకస్‌ అనే జాతి ఒకటి ఏర్పడిందనీ, రెండుకాళ్ళతో నడిచిన తొలి ప్రాణులు ఆ జాతివారేననీ శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. ఆ తరవాత చాలా కాలానికి అసలు సిసలు ఆధునికులనదగిన హోమో సేపియన్స్‌ అనే మానవజాతి పుట్టి 2 లక్షల సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుందని వారి ఊహ.
సుదీర్ఘమైన ఈ వ్యవధిలో నరవానరదశను దాటిన మానవులకు మరే ప్రాణికీ లేని అనేక ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి. వాతావరణం చల్లబడి, వానలు తగ్గి, వృక్షసంపద ఒక్కసారిగా క్షీణించడంతో చెట్ల చాటు కరువైన ఈ జాతివారికి రెండుకాళ్ళ మీద నడవడం, ప్రాణరక్షణకై పరిగెత్తడం, మైదానాల్లో ఎత్తుగా పెరిగిన రెల్లుపొదల్లో నిలబడి పొంచి ఉన్న క్రూరమృగాల జాడను పసికట్టి ప్రాణాలు దక్కించు కోవడం వగైరాలన్నీ నిత్యజీవితంలో భాగాలైపోయాయి. ఈ క్రమంలోనే ముందుకాళ్ళు రెండూ చేతులుగా మారిపోయి మెదడులో అపూర్వమైన అభివృద్ధికి ప్రేరణనిచ్చాయి. ఇటువంటి మార్పులు ఇతర ప్రాణుల్లో కలగలేదు. వీరికి దాయాదులనదగిన తోకలేని వాలిడికోతులూ, మానవులుగా పరిణమించజాలని (పేరు తెలియని) ఎన్నో నరవానరజాతులూ చెట్లలోనే ఉంటూ అప్పట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండిపోవడంతో అవి ఈ రకమైన ఒత్తిడికి గురికాలేదు. ఉన్న శరీర లక్షణాలు పరిసరాలకు అనువైనవిగా ఉన్నంతకాలమూ వాటిలో మార్పు కలగకపోవడం జీవపరిణామపు లక్షణం కనక అవన్నీ కొద్దిపాటి మార్పులతో కొనసాగాయి.
ఆహారం కరువైన పరిస్థితిలో ఆస్ట్రలోపితెకస్‌ జాతివారు జంతువుల కళేబరాలను తినడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో వారికి వేటాడటం తెలియదు కనక అవన్నీ క్రూరమృగాలు తినగా మిగిలినవీ, ఇతరత్రా లభిస్తున్నవీ అయి ఉండేవి. అందువల్ల వారికి ప్రోటీన్లూ, పోషకపదార్థాలూ లభించి వారి జాతి వృద్ధి చెందసాగింది. ఈ ఆహారాన్వేషణలో చిన్నచిన్న రాతిముక్కలతో ఎముకలనుంచి మాంసాన్ని గీక్కుతినడానికి వీలుగా ఉండేది. క్రమంగా వారే చేతులతో రాళ్ళను చెక్కి పనిముట్లను తయారుచేసుకోసాగారు. చేతులనేవి ప్రత్యేక అవయవాలుగా రూపొందినది ఒక్క మానవజాతిలోనే. వారి మెదడులోనూ, అవయవాల్లోనూ అభివృద్ధి కలగడానికి అదే కారణమయింది.
ఒక్క రాతిపనిముట్ల తయారీనే తీసుకుంటే అది నరవానరానికి ఎంత క్లిష్టమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. మొదటిది అటువంటి పరికరం అవసరమనీ, భవిష్యత్తులో వాడవలసి వస్తుందనీ అనిపించడం. తరవాత దాని తయారీకి సరిపోయే రాళ్ళ గురించి ఆలోచించి, వాటికై వెతకడం. పనికొచ్చే శిలను ఒక చేత్తో పట్టుకుని మరొకచేత్తో దాన్ని గట్టి రాతితో చెక్కడం. ఒడుపుగా చెక్కి, దానికి పిడినీ, పదునైన అంచునూ తయారుచెయ్యడం. వీటిలో ప్రతి ఒక్క చర్యా మెదడును ఎంతో అభివృద్ధిపరిచి ఉండాలి. అంతేకాదు, ఈ పరికరాలవల్ల ప్రాణులకు మేలైన ఆహారం లభించి, వాటి సంతతి వృద్ధిచెంది ఉంటుంది. వాటిలో బుద్ధిహీనులకు మరణమే ప్రాప్తించి ఉంటుంది. ప్రకృతిలో ఉత్పాతాలూ, క్రమంగా కలిగిన ప్రతికూలమార్పులూ ఈ ప్రాణులను కూటి కోసమే కోటి విద్యలూ అన్న పద్ధతిలో ముందుకు నెట్టాయి. తల వెనకాల కాంతి చక్రం తిరుగుతున్న ఏ దేవుడూ వారిని కాపాడలేదు. చావుతప్పి, కన్ను లొట్టపోయినట్టు లక్షల సంవత్సరాలపాటు జరిగిన ఈ పరిణామ క్రమంలో చచ్చినవి చావగా మిగిలిన జీవాలు మెరుగైన తెలివితేటలు సంపాదించుకుని తమ సంతానాన్ని నిలుపుకోగలిగాయి.
మెదడూ, శరీరలక్షణాలూ ఎప్పటికప్పుడు మారుతూ, ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ పరిణామాలని ముందుకు నెట్టాయి. గుంపులుగా, తెగలుగా ఏర్పడి, కలిసి వేటాడుతూ, కలిసి జీవిస్తూ కొనసాగిన ఆదిమానవులకు జంతువుల స్థాయిలో కూతలూ, కేకలూ సరిపోలేదు. భాష అవసర మయింది. అవసరమే కాదు, కొన్ని పరిస్థితుల్లో అది చావుబతుకుల సమస్య అయి ఉండాలి. అందుకనే మనకు భాష ఒక సంప్రదాయంగా దక్కింది. దానితో బాటు నాగరికతా, మతాలూ అన్నీ వచ్చాయి. గమనించవలసింది ఏమిటంటే ఇవన్నీ జన్యుపరంగా రాలేదు. బాహ్యపరిస్థితుల ఒత్తిడివల్ల పుట్టుకొచ్చాయి. ఇటువంటి కష్టాలు పడని నరవానరాలన్నీ మనకు అంత భిన్నమైనవి కాకపోయినా వీటిలో ఏ ఒక్క ప్రత్యేకతనూ సాధించలేకపోయాయి. ప్రకృతినీ, ప్రపంచాన్నీ అవగాహన చేసుకుంటూ ఉండవలిసి రావడం మనిషిజాతికి మాత్రమే తప్పనిసరిగా పరిణమించింది. కోతి తరహా బతుకునుంచి వేరు పడ్డాక మనిషికిక “వెనుతిరిగే” అవకాశమే లేదు.
మనిషికి ప్రపంచాన్ని గురించి అవగాహన మొదలైన ప్రాచీనయుగంలో మెదడు పూర్తిగా ఎదగలేదనేది తెలిసినదే. బతకడమే కష్టంగా అనిపించిన ఆ తొలి యుగాల్లో మనుషులు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి తమకున్న పరిమితమైన అవగాహనతో ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ప్రకృతిశక్తులదే పైచెయ్యిగా, ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకంగాకూడా ఉండేది. చిన్నచిన్న సముదాయాలుగా జీవిస్తూ, ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, తమ అనుభవాలను పోగుచేసుకుని తరవాతి తరాలకు అందిస్తూ వచ్చారు. అనుభవమే ఆచరణకు ఆధారమైంది. జంతువుల్లాగా ఎప్పటికప్పుడు ఎదురయే పరిస్థితులకు స్పందించడంతో ఊరుకోకుండా, జరిగిన, జరగబోతున్న విషయాలను గురించి కూడా ఆలోచించగలగడం మనిషిజాతికి మాత్రమే పరిమితమైన ఒక కొత్త లక్షణంగా రూపొందసాగింది. ఈ పరిణామాలవల్ల కళ్ళకు కనబడుతున్న వస్తుగతమైన యదార్థతతో సంబంధం లేకుండా, కేవలం మనసులో పుట్టుకొచ్చి, అవ్యక్తమూ, అమూర్తమూ అనిపించే నైరూప్యభావాలు మనుషుల ఊహల్లో మెదలసాగాయి. ఇటువంటి “భావప్రపంచం”లోకి అడుగుపెట్టిన మానవజాతికిక తిరుగులేకుండా పోయింది. మొదట్లో ఇటువంటి “అసాధారణ” శక్తులు రోజువారీ జీవితానికి ఉపయోగపడ్డాయి.
సొలూత్రే
స్విట్జర్లండ్‌లోని సొలూత్రే ప్రాంతం

గుంపులుగా చేరి వేటాడసాగిన తొలి మానవులు పథకం ప్రకారంగా తమకన్నా ఎన్నోరెట్లు పెద్దవైన జడల ఏనుగులనూ, పెద్ద ఎలుగుబంట్లవంటి క్రూరమృగాలనూ మాట్లువేసి పట్టుకుని చంపగలిగారు. కొంతవరకూ ఇవన్నీ ఇతర జంతువులుకూడా చెయ్యగలవు. ఎలుక కోసం కంత దగ్గర పిల్లి కాచుకుని కూర్చోగలదు. తోడేళ్ళ గుంపులు చాకచక్యంగా వేటాడగలవు. కానీ మనుషుల విషయంలో ఇది ఉన్నతమైన స్థాయికి చేరుకుంది. స్విట్జర్లండ్‌లోని సొలూత్రే ప్రాంతంలో గుర్రాల శవాల గుట్టల ఆనవాళ్ళు కనిపించాయి. అవన్నీ ఎత్తైన కనుమకు దిగువన పడిఉన్నాయి. ఇది ఆదిమానవులు పథకం ప్రకారం చేసిన పనేనని పరిశీలకులు భావిస్తున్నారు. తమంతట తాముగా గుర్రాలు అంత ఎత్తునుంచి దూకవు కనక వాటిని వారు తరిమి ఉండాలి. వందలేసి గుర్రాలను భయపెట్టి, మరొక దారి లేకుండా చేసి, ఎత్తయిన కొండమీది నుంచి లోయలో పడేట్టుగా తరిమి చంపగలిగారంటే వారి ఊహాశక్తి ఎంతగా ఎదిగిందో అర్థమౌతుంది.

horsehunt
గుర్రాలను తరిమి చంపిన ఊహాచిత్రం

రెండుకాళ్ళమీద నడవడం ప్రారంభించిన మానవజాతికి శరీరనిర్మాణంలో అపూర్వమైన మార్పులు కలిగాయి. అప్పటివరకూ తక్కిన జంతువులకన్నా ఎక్కువ మనోవికాసం పొందవలసిన అవసరం వారికి కలగలేదు. వారి జీవనశైలి ఇతర ప్రాణులకు భిన్నమైన దిశలో సాగడం మొదలుపెట్టేసరికి ఆలోచనలకు తొలిసారిగా ప్రాముఖ్యత ఏర్పడింది. మొదట్లో అదంతా తాత్కాలికమైన ప్రాణరక్షణ కోసమే అయినా, రానురాను పరిసరాలని గమనించడం, వాటిలోని మార్పులను ముందుగా పసికట్టడం, ఏం జరగబోతుందో ఊహించుకోగలగడం, ఇవన్నీ ఉంటే తప్ప బతకడం అసాధ్యమయే పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిని గురించి అర్థం చేసుకుంటూ, అజ్ఞానం, అయోమయం, భయాలూ, అనుమానాలూ అన్నీ కలగలిసి, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే దుర్భరజీవితం గడిపిన తొలి మానవులు ప్రతిదాన్నీ వింతగా, అద్భుతంగా పరిగణించారు. తమ గురించీ, బాహ్యప్రపంచాన్ని గురించీ, వాటి రెండిటికీ ఉన్న సంబంధాన్ని గురించీ అస్పష్టమైన అవగాహనతో మొదలైన మానవజీవితాల్లో ఎక్కువ భాగం “బతికి బట్టకట్టడం”తోనే సరిపోయింది. ప్రకృతికి భయపడే స్థితినుంచి దాన్ని గురించి కొంతైనా అర్థం చేసుకునే స్థితికి ఎదగడానికే మనిషి సర్వశక్తులూ ఒడ్డవలసివచ్చింది. ఈ క్రమంలోనే వారి మనోవికాసం ప్రారంభమైంది. అందులో నిత్యజీవితాలకు ఎంతో అవసరమైన పరిజ్ఞానంతోబాటు అర్థంలేని భయాలూ, ఆందోళనలూ కూడా చోటుచేసుకున్నాయి. దేవుడూ, దెయ్యాలూ వగైరాల గురించి అప్పుడు కలిగిన కొన్ని అపోహలూ, తప్పుడు భావనలూ ఈనాటికీ కొనసాగుతున్నాయంటే మనిషి మనస్సు ఎంతగా “దెబ్బతిందో”ననిపిస్తుంది. దీనికి తోడుగా నేటి సమాజంలో అజ్ఞానాన్ని ప్రోత్సహించే శక్తులకు కొదవలేకపోవటంతో మరింత గందరగోళం ఏర్పడుతోంది.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to తొలి మానవుల మనోవికాసం

  1. parimalam says:

    సర్ ! తొలిమానవుల మానసిక వికాసం గురించిన వ్యాసం ఆసక్తి కరంగా ఉంది .వారి ఆహార విహారాదుల గురించి చదివినపుడు ఒళ్ళు జలదరించింది . గుర్రాలను తరిమి చంపిన ఊహాచిత్రం ఆశ్చర్య పరచింది .అయితే వారి మనోవికాసానికి అవసరమయ్యే పరిజ్ఞానంతోపాటు , అనవసరమైన అపోహలూ చోటు చేసుకోవడం దురదృష్టకరం .మీరన్నట్టు అజ్ఞానాన్ని ప్రోత్సహించే శక్తులు ఇప్పుడే ఎక్కువున్నారు .వారి స్వార్ధం కోసం అమాయకులను మోసం చేస్తూ పబ్బం గడుపుకునే వారు ఆదిమానవుల కంటే ఎ విధంగా నాగరికులు ? ధన్యవాదాలు సర్ !

  2. Rohiniprasad says:

    సుమారు 60 లక్షల ఏళ్ళ క్రితమే మనుషులకూ చింపాంజీ తదితర వానరాలకూ సంబంధం తెగిపోయింది. 50 లక్షల ఏళ్ళ క్రితం మొదలైన ఆస్ట్రలో పితెకస్ జాతి 20 లక్షల ఏళ్ళకు పైగా ఆఫ్రికాలో కొనసాగాక హోమో ఎరెక్టస్ జాతివారు పుట్టుకొచ్చారు. బలంగా, ఎత్తుగా ఉండే ఈ ప్రజలే ప్రపంచమంతటా సంచరించిన తొలి మానవులు. వీళ్ళు 5 లక్షల ఏళ్ళ క్రితం వరకూ బతికే ఉన్నారనీ, ఆ తరవాత ఆధునిక మానవులతోనూ, ఇతర పరిస్థితులతోనూ పోటీ పడలేక అంతరించిపోయారనీ తెలుస్తోంది. ఈ సుదీర్ఘచరిత్ర దృష్ట్యా మనుషులకు అలవడిన సాముదాయక స్వభావాలూ, జీవితం గురించిన స్థూలదృక్పథమూ ఎంత పాతవో ఒకసారి ఆలోచించాలి. క్రీ.పూ.1200 నాటి వేదాలే అన్నిటికన్నా పాతవి అనుకోవడం హాస్యాస్పదం. మనిషి మెదడు ఎలా వికాసం చెందుతూ వచ్చిందో, పర్యావరణాన్ని గమనించడంలో మనుషులు సరైనవీ, తప్పుడువీ అనిపించే అవగాహనలు ఎన్ని రకాలు చేశారో ఊహించవచ్చు. తొలి మతభావనలన్నీ విప్లవాత్మకమే; అభివృద్ధిని తెచ్చినవే. ఎటొచ్చీ కాలదోషం పట్టినప్పుడు వాటి లోపాలని గుర్తించలేకపోవడం ఆధునిక ఆటవిక లక్షణం.

Comments are closed.