‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

–స్వాతీ శ్రీపాద.

విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత ఇతని కథల్లో కుతకుతలాడుతుంది. ఆవేశపడకుండా ఆవేశాన్ని కలిగించే కథన చాతుర్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి. అతడు రాసిన కొత్త దుప్పటి, తడి, గిరిగీయొద్దు, చనుబాలు, కన్నీటి కత్తి లాంటి కథలు అతని కథన చాతుర్యానికి, జీవిత దృక్పథానికి మంచి నిదర్శనాలు. ఇతడు తెలుగు కథకున్న భవిష్యత్ ఆశల్లో నిస్సందేహంగా ఒకడు. – కీ.శే. వల్లంపాటి వెంకటసుబ్బయ్య

తరాలు మారే కొద్దీ వెనక తరాల విలువలను నిర్లక్ష్యం చేయడం, ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు పలుచనైపోవడం గమనిస్తున్నాం. శ్రమైక జీవన సౌందర్యాన్ని మరచి కృత్రిమ ఆడంబరాలకు దాసోహమనే ఆధునిక జీవనశైలిని సున్నితంగా విమర్శిస్తూనే వెనకతరాలవారి పని విలువలను గుర్తించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పే కథ గిరిగీయొద్దు.నేర్చుకో‘ వలెనే మళ్ళీ ప్రథమ పురుషలో సాగుతుందీ కథ . శరీరమంతా సముద్రమవడం – లాంటి కవిత్వ శైలితో ఆరంభమవుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, బుల్లి మెదళ్ళ మీద ఎర్రగాలుల్ను లేపే గద్ద రాకను చూసి కకావికలమైన కోడి పిల్లల మనసులనూ సవివరంగా వివరించడంలో, తల్లిలేని వాటి ఒంటరి తనాన్ని చూసి కథకుడి గుండె ద్రవించడం, గొణుక్కుంటూ అతని తల్లి వాటికి నూకలు చల్లడం… ఈ విశదీకరణలోనే రచయిత మనస్తత్వం అర్థమవుతుంది.

కోడి ప్రాణం పోవడంతో మొదలయిన కథ అనూహ్యంగా దాని కారణాలను శోధించాక గాని మానవ మనస్తత్వాల విశ్లేషణగా తెలుసుకోలేము.

గ్రామీణ జీవనంలో కోళ్ళకూ కోడి పిల్లలకూ ఇచ్చే ప్రాధాన్యత, వాటికి పంచే ప్రేమ ఈ నాటి నగర జీవనంలో మనం కోల్పోతున్నదేమిటో స్పష్టంగా తెలియజేస్తుంది.

ఇంట్లో ముసలివాళ్ళ ప్రవర్తన గురించి కోడలు అసహనం ప్రదర్శించడం, నిమిత్తమాత్రుడిలా మౌనం వహించిన కథకుడు-అత్యంత సహజంగా అగుపిస్తాయి.

వయసుడిగి పోయినా తిని కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఆరోగ్యకరమైన విషయంగా కొత్తతరం గుర్తించకపోవడం దురదృష్టకరమైన విషయం.

సజీవ చైతన్య పూరిత జీవనశైలి నుండి ఒక్కసారి స్తబ్ధతలోకి నెట్టేస్తే, ఇంట్లో పడుండమంటే జరిగేదేమిటో వివరించే వాస్తవం ఈ కథ.

వీధుల్లో తన ఇంటిముందు పేడ తీసేందుకు లేదు.
కళ్లాల్లో కసవెత్తేందుకు లేదు
పన్జేయలేని సోమరిపోతులను మందలించేందుక్కూడా లేదు
ఇంట్లోనే కూచుని ఉండాలి

ఇదీ పక్కింటి రామయ్య పరిస్థితి. ఇంట్లో వాళ్ళంతా ముసలోణ్ణి బాగా అదుపు జేసారు. పక్కింటి వారిని జూసి ఈ ఇంట్లో నస… ‘ముసలి తల్లిదండ్రులను కట్టడి చెయ్యమంటూ ‘
కథకుడు ఆ విషయమే తండ్రి వద్ద ప్రస్తావించి – నా పరువుబోదూ అన్నప్పుడు

“యాన్నించొచ్చిందబ్బీ నీకు పరువు మా బతుకంతా మట్టిలో మునిగినం. పేడలో పొర్లాడినం. కసవులో మెసలినం. మట్టే మాకు దేవత. పేడే పరమాత్మ. మట్టిలో మా సెమట కలిస్తే ఇంత తిండి పుట్టింది. నిన్ను సదివించే సత్తువ పుట్టింది. నువ్వు సదూకున్నవ్. సుఖంగా బతికే
ఉద్యోగం సంపాదించుకున్నెవు. నా కొడుకుని ఇంతోన్ని జేసిన మట్టిని నేనెట్లా మరువాల? ఈ పేడను మరిస్తే మా అమ్మను మరచినట్టే గదొరే ” ఉద్వేగపూరితమైన ముసలి తండ్రి ఆవేదనలో ఎన్ని అక్షర సత్యాలు?

అయితే ఆక్రోశం పట్టలేని పక్కింటి రామయ్య ప్రవర్తన చూసాక అణచిపెట్టిన స్ప్రింగ్ అంతే వేగంగా పైకి వస్తుందని గ్రహించాక వాటి పర్యవసానాలు బేరీజు వేసుకున్నాక స్వేచ్ఛను కోల్పోయిన మనిషి వివేకాన్నీ కోల్పోతాడని గ్రహించాక తన తలిదండ్రుల చుట్టూ గిరిగీయొద్దని కథకుడు ఒక దృఢ నిశ్చయానికి వస్తాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే గొప్ప కథ.

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *