హార్ట్ బ్రేకింగ్

-పట్రాయని సుధారాణి

కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న ప్రవీణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవెల ఇప్పటివరకూ ఎంత ప్రశాంతంగా ఉంది! ఎక్కడిదీ ఘంటానాదం… ఎవరూ కనిపించరేం? వెనక్కి తిరిగి చూసింది.

ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణ ని గాల్లో తేలుస్తోంది. ‘ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం! ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్… ఇవాళ నాదే…’

దేవుడి విగ్రహం రాయిలా నిలబడి ఉంది. రాయిలా ఉన్న తనను, తను సృష్టించిన మనిషి ఇంత అందమైన రూపంలో సృష్టించి నిలిపినందుకు గర్వపడుతూ ఒకింత దరహాసాన్ని తొణికిస్తూ ఉంది.

ఇంతకీ ఈ గంటనెవరు మ్రోగిస్తున్నట్టు?

దానికదే ఎలా మ్రోగుతోంది? ఆగదేం?

అబ్బ…బ్బ… ఎలా దీన్ని ఆపడం? చెవులు శబ్దాన్ని భరించలేక పోతున్నాయి. అంతకంతకూ ధ్వని పెరిగిపోతోంది. మెదడులో నాళాలు చిట్లిపోతాయా అన్నట్టుగా ఉందే… ఒద్దు… భరించలేను…

గట్టిగా చెవులు మూసేసుకుంది.

“ప్రవీణా, లే. టైమ్ చూడు, లేటయి పోతోందని హడావిడి పడతావ్.” పరిచయమైన గొంతు విని ధైర్యంగా కళ్ళు తెరిచి చూసింది. గెడ్డం గీసుకోడానికి సిద్ధ పడుతూ చేతిలో రేజర్, బుగ్గల నిండా సబ్బునురుగు… రవీంద్రని పోల్చుకున్నాక చటుక్కున లేచి మంచం దిగింది.

అనాలోచితంగానే గోడవేపు చూసి ‘ఏడయిపోయిందే’ అని పరుగుపెడుతున్న ప్రవీణని చూసి నవ్వుకున్నాడు రవీంద్ర.

రాత్రి రకరకాల ఆలోచనలతో పక్కమీద దొర్లగా దొర్లగా ఎప్పుడో ఏ తెల్లారుఝామునో నిద్రాదేవి కరుణించింది. ఇంతకీ ఆ కల ఏమిటి…కలలకి అర్థం ఉంటుందా ఉండదా? ఉంటే ఏమిటి ఆ కల? చెవులు రింగుమంటున్న ఆ నాదం ఇంకా మనసుని కలవరపెడుతూనే ఉంది. అసంకల్పితంగానే రోజూ చేసే పనులన్నీ చేసుకుంటోంది ప్రవీణ.

తన కన్నా ముందే నిద్రలేచిన అత్తగారు వంటింటి బాధ్యత నెత్తినేసుకున్నట్టున్నారు. కాఫీ కప్ అందుకుంటూ ప్రవీణ అడిగింది ఆవిడని. చిన్నత్తయ్యగారు వాళ్ళు ఎన్ని గంటలకి వస్తున్నారూ అని.

“ఏదీ వీడు తెమిలి వెళ్ళి తీసుకురావద్దూ? ఏ పదో పదకొండో అవుతుంది. ఏం తక్కువ దూరమా?” స్నానం చేసి వస్తున్న కొడుకునుద్దేశించి అందావిడ.

ఆవిడ చెల్లెలు, మరిది, కొడుకు, కోడలు ఏదో పెళ్లి కోసం ఈ ఊరొచ్చి ఆవిడని చూడడం కోసం ఇవాళ వస్తామన్నారు. అందుకే ఆవిడ హడావిడి. ప్రవీణకి కొత్త ఉద్యోగం. అప్పటికే పిల్లల కోసం రెండుసార్లు శలవలు వాడేసింది. మరి పెట్టడం కుదరదు. పిల్లలకి, రవీంద్ర కి శలవే కాబట్టి పని తొందరగా చెయ్యవలసిన అవసరం లేదు. అర్థం చేసుకొనే మనిషి కాబట్టి అత్తగారితో సమస్య లేదు.

రవీంద్ర వంటింట్లోకి తొంగి చూశాడు. “ప్రవీణా, నువ్వు నిద్రలో ఉండగా ఏదో ఫోన్ వచ్చింది. చూశావా? నేను బాత్రూంలో ఉన్నానప్పుడు.” చెప్పి వెళ్ళి పోయాడు.

తనని ఇంతసేపూ కలవర పరిచిన కలలోని గుడి గంటకీ, చెవి పక్కనే పెట్టుకొని పడుకున్న సెల్ ఫోన్ రింగ్ టోన్ కీ లంగరు అందింది ప్రవీణకి. మనసు తేలిక పడింది.

సెల్ తీసి మిస్డ్ కాల్స్ చూసింది. ఆశ చేసింది. ‘ఎందుకు చేసిందబ్బా?’ అనుకుంటూ ఆశ నంబరు డయల్ చేసింది.

అక్క గురించి ఏదో కంప్లైంట్ చేద్దామని వచ్చిన రాహుల్ క్షణ క్షణానికి అమ్మ మొహంలో మారుతున్న భావాలని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయాడు.

“నిజంగానా…. అవునా… ఓకే… నేను మళ్ళీ చేస్తాలే… బై…” అంటూ ఫోన్ కట్ చేసి రాహుల్ వేపు చూసింది ప్రవీణ. ఏమనుకున్నాడో మరి అమ్మతో ఏమీ చెప్పకుండానే వెళ్ళి పోయాడు, “పాలు తాగేవా నాన్నా” అన్న అమ్మ ప్రశ్నకి ఊ కొడుతూ.

ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణని గాల్లో తేలుస్తోంది. ‘ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం! ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్… ఇవాళ నాదే…’

మనసులో పదే పదే అనుకుంటూ అద్దం ముందు నిల్చొని తనలో తనే మురిసి పోతోంది ప్రవీణ.

ఒత్తైన తలకట్టు, తీర్చిన పెదవులు, సూటిగా కోటేరేసిన ముక్కు, లేత మొహం… ఇవన్నీ ఒక ఎత్తు కాగా చక్కని పలువరుస, స్పష్టమైన ఉచ్చారణ, భావగర్భితమైన మాట తీరు మరో ఎత్తు. ప్రవీణని చూసిన వెంటనే, కొద్ది పరిచయం తోనే ఎదుటి వ్యక్తిని ఆకర్షించి ఆకట్టుకోగల లక్షణాలు. ఒకప్పుడు ‘ఆ వృత్తికి అవసరం లేదేమో మరి’ అని జనం టెలివిజన్ లో చూసే వాళ్ళని గురించి అనుకునే లక్షణాలన్నీ ప్రవీణలో మూర్తీభవించి ఉన్నాయి.

ప్రవీణకి న్యూస్ రీడర్ ఉద్యోగం అనుకోకుండా దొరికింది. ఇంటిపని, పిల్లల పెంపకంలో తలమునకలయి ఉద్యోగ ప్రయత్నమే మానుకుంది చాలాకాలం. పిల్లలు కొద్దిగా పెద్దయి అత్తగారు తమ దగ్గరే ఉండడానికి వచ్చిన తర్వాత బోలెడు తీరిక దొరికింది. న్యూస్ రీడర్స్ కావాలంటూ ఓ ఛానెల్ చేసిన ప్రకటన కళ్ళబడి, అప్లికేషన్ పంపించడం, ఎందరితోనో పోటీ పడి ఉద్యోగం సంపాదించుకోవడం అనుకోకుండానే జరిగిపోయాయి.

ఉద్యోగం ప్రవీణ జీవితంలో కొత్త ఉత్సాహం నింపింది. రోజు రోజుకీ ఛానెల్స్ మధ్య పెరుగుతున్న స్పర్థ వల్ల కొత్త కొత్త సంచలనాత్మక వార్తలెన్నో వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ కి మాత్రం ఉద్యోగ జీవితంలో ఒక అసంతృప్తి ఉండిపోయింది. తను పనిచేసే ఛానెల్ లో ఇద్దరు కలిసి న్యూస్ చదువుతారు. ఒక సీనియర్ ని, ఒక జూనియర్ ని కలిపి వార్తలు ఇస్తారు. ముఖ్యమైన వార్తలన్నీ సీనియర్ కోటాలోకి వెళ్లిపోతున్నాయి. సాదా సీదా వార్తలు, షేర్ మార్కెట్ ధరలు, వాతావరణం తన ఖాతాలో పడుతున్నాయి. ఇష్టమైన వృత్తిలో ఉంటున్నా ముఖ్యమైన వార్తలని, జనం ఆసక్తిగా ఎదురుచూసే ముఖ్యాంశాలని తనే అందించాలన్న కోరిక తీరడంలేదు. ఇప్పట్లో తీరేది కూడా కాదని నిరాశ చేసుకుని ఉన్న ఈ సమయంలో వచ్చింది ఆశ ఫోన్.

ఈ రోజు తనతో పాటు వార్తలు చదవవలసిన పల్లవికి చాలా అర్జెంట్ పని వచ్చి పడిందని, సమయానికి మరెవరూ అందుబాటులో లేరు కనుక ఇద్దరి వార్తలూ ప్రవీణే చదవ వలసి ఉంటుందని చెప్పడానికే ఆశ ఫోన్ చేసింది. ప్రవీణ మనసులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారణం ఇంకోటి. వివరాలు ఇంకా పూర్తిగా తెలీక పోయినా చాలా ముఖ్యమైన వార్త బ్రేకింగ్ న్యూస్ గా రాబోతోందట. ఛైర్మన్ గారి కేబిన్ నుంచి అస్మదీయులు తస్కరించిన సమాచార మని ఆశ చెప్పిన మాట.

బ్రేకింగ్ న్యూస్ అంటే తమ ఛానెల్ ప్రయోజకత్వం వల్లనే వెలుగు చూసిన వార్తలు. వాటిని పదే పదే ప్రసారం చేస్తూ ఊదరగొడతాయి ఛానెల్స్. ఏ రాజకీయ నాయకుడు ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడు అనో, ఏ సినిమా టాప్ హీరో కూతురు ఎవడితో లేచిపోయి ఎలా పెళ్ళి చేసుకుందో, ఏ మూల బాంబులు పేలి ఎన్ని జీవితాలు హతమారిపోయాయో అనో ‘ఇవేగా బ్రేకింగ్ న్యూస్ లు? ఇవాళ ఎవరికి మూడిందో?’ అనుకుంది ప్రవీణ.

ఒక్కసారిగా ప్రవీణ ఉలిక్కి పడింది.

అదేమిటి… అబ్బా… ఛీ…. అమ్మో…. బాబోయ్…

తెరమీద ప్రసారం అవుతున్న ఒక్కో దృశ్యం ప్రవీణని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేస్తోంది.

ఏమయితేనేం, తన చిరకాలవాంఛ నెరవేరబోతోంది. పల్లవికి ఈ పూట అంత అర్జెంటు పని తగిలించిన దేవుడికి అభివాదాలు తెలుపుకుంటూ అద్దం ముందు నుంచి కదిలింది ప్రవీణ.

ప్రవీణ బయల్దేరుతుండగా అన్నారు అత్తగారు. “అందరం ఇంట్లోనే ఉంటాంగా? ఆదివారం తీరిగ్గా న్యూస్ లో నిన్ను చూడొచ్చు. నువ్వు న్యూస్ చదువుతుండగా చూడాలని మా మాలక్ష్మికి ఎప్పటినుంచో కోరిక. వాళ్ళ ఊళ్ళో మీ ఛానెల్ రాదు కదూ” అని.

ప్రవీణ గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న కోరిక తెలిసిన రవీంద్ర అభినందించాడు. పని ఎక్కువగా ఉంటే లేట్ అవచ్చని, దెబ్బలాడుకొని నాయనమ్మని, రాబోయే చుట్టాలని అవస్థ పెట్టొద్దని పిల్లల్ని హెచ్చరించి వెళ్ళింది ప్రవీణ.

* * *

“ఏమిటింతకీ న్యూస్, తెలిసిందా?” అడిగింది ఆశని ప్రవీణ.

“పూర్తిగా వివరాలు తెలీదనుకో. కాని సినిమా వాళ్ళకు సంబంధించినదనుకుంటా.”

ఆశ మాటలు వినగానే ప్రవీణ మనసు గంతులు వేసింది. సినిమా వాళ్ళ న్యూస్ ఏదయినా సరే ఛానెల్స్ కి పండగే. జనానికి ఊపిరి బిగ పట్టి వినే ఆసక్తే. ఓ హీరో తల్లి తండ్రులని తన్ని తగలేసాడనో, ఓ హీరో మరో హీరోని చితక తన్నించాడనో న్యూస్ ఛానెల్స్ కి కొద్దిగా ఉప్పందితే చాలు… పోటీలు పడి మరీ మరీ ప్రసారం చేసేస్తారు. ప్రజలు సరే… విరగబడి చూస్తారు. ‘వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి స్వంతం. పబ్లికున నిలబడితే ఏమేనా అంటాం’ అన్న మహాకవి వాక్యాలు సినీ జీవులకి మరీ అన్వయిస్తాయేమో.

అందుకే సినిమాకి సంబంధించిన సంచలన వార్తలను ఏ ఛానెల్ వదులుకోదు. ఎంత రసస్ఫోరకంగా, ఉత్తేజపరిచేదిగా ఆ వార్తను ప్రసారం చెయ్యాలా అనే పనిలోనే టివి ఛానెల్స్ అన్నీ తలమునకలవుతాయి.

ఈ మధ్య విడుదలయిన జగత్ కంత్రీ, బుజ్జిపండు, ఆటాపాటా సినిమాలకు సంబంధించినదే ఆ న్యూస్ అని తెలిసింది ప్రవీణకి. అందులో చాలా అశ్లీలమైన దృశ్యాలున్నాయని, హీరో హీరోయిన్లతో రొమాన్స్ పేరిట చేసిన విచ్చలవిడి శృంగార సన్నివేశాలు సెన్సారు కత్తెరకు బలి కాకుండా బయటపడ్డాయని, కుటుంబ సమేతంగా చూడవచ్చంటూ సర్టిఫికెట్ జారీ చేసిన బోర్డు వారిగురించి చాలా విశ్లేషణాత్మకమైన అంశాలతో వార్తా కథనాన్ని రాసాడు భరణి.

వార్త ప్రసారానికి ముందే బ్రేకింగ్ న్యూస్ అంటూ టివి తెర పై స్క్రోలింగ్ వార్త వెళ్ళింది. ముఖ్యమైన వార్త ప్రసారం కాబోతోందని, వార్తల కార్యక్రమం చూడమని ప్రేక్షకులకి పదే పదే సందేశాలు వెళ్ళాయి.

న్యూస్ చదవాల్సిన టైమ్ వచ్చింది. రికార్డింగ్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు నిర్మించిన ఆ చిత్రాలలో అసభ్యంగా ఉన్న సన్నివేశాలు, ఆడదాన్ని అంగడిబొమ్మని చేసి ఆడిస్తున్న వాణిజ్య ప్రపంచ విధానాలని తీవ్రంగా నిరసిస్తూ రాసి ఉన్న వార్తలని ఎంతో స్పష్టంగా, భావయుక్తంగా చదివి రికార్డింగ్ ముగియగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ప్రవీణ.

డెస్క్ దగ్గర ఆ రోజు హాట్ టాపిక్ అదే. అక్కలు, అన్నలు, అమ్మా, నాన్న, పిల్లలతోనే కాదు, పెద్దగా పరిచయం లేని స్నేహితులతో కూడా కలిసి చూడలేనట్టుగా తయారయింది సినిమా వినోదం అని సుష్మ వాపోయింది.

సకుటుంబంగా చూడవలసిన గొప్ప సినిమా అన్న ప్రకటనకి పడిపోయి ఉద్యోగం వచ్చిన కొత్తలో అమ్మా నాన్నతో కలిసి వెళ్ళిన శాంత సినిమా నిండా బూతు జోకులు, అక్కర్లేని బెడ్రూం దృశ్యాలు మరి చూడలేక మధ్యలోనే వచ్చేసిందిట.

హీరో హీరోయిన్ల శృంగార వీర విహారాన్ని చూడలేక చేష్టలుడిగి కూర్చుండిపోయిన అమ్మమ్మని అతి కష్టం మీద లేవదీసి తీసుకొచ్చిందిట పావని. ఒక్కొక్కళ్ళది ఒక్కో విషాద భరితమైన అనుభవం.

ప్రవీణకి కూడా ఇలాటి అనుభవాలు పిల్లలు చిన్నగా ఉండగా ఎదురయ్యాయి. అందుకే పిల్లలు ఎదుగుతున్న వయసులో వారిమీద అనవసరమైన ప్రభావాలేం పడకూడదని ప్రయత్నిస్తోంది. శలవల్లోకూడా సినిమాలకు వద్దంటుంది. కార్టూన్, యానిమేషన్ సినిమాలంటే అందరికీ ఇష్టం కనుక అవే చూస్తారు.

“అమ్మా మా ఫ్రెండ్సందరూ అన్ని సినిమాలు చూసి కథ చెప్తారే. ఎప్పుడు వినడమేనా? మేం కూడా చూడొద్దా” అని తెలివిగా అడుగుతుంది పాప. ప్రవీణ సమాధానం మాత్రం “నో…”

టివి చూసినా రిమోట్ పక్కన పెట్టుకొని ఛానెల్స్ మారుస్తూ చూడడమే ప్రవీణ పాలసీ. ఏమాత్రం అసభ్యంగా అనిపించినా సెన్సారు చేసేస్తుందని రవీంద్ర తనని ముద్దుగా కత్తెర అని పిలుస్తాడని కూడా తెలుసు.

కేవలం తన మొహాన్నే చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తుంటే ఇంట్లో వాళ్లు, చుట్టాలు ఎలా స్పందిస్తూ ఉంటారో అని ఊహల పల్లకిలో ఊరేగి దిగుతూ ఉండగా… వార్తలు ప్రారంభం అయ్యాయి టివిలో.

ఒకేసారి అన్ని టివి తెరల మీద తన బొమ్మ కదులుతూ వార్తలు వినిపిస్తుంటే అందరూ ఒకేసారి “బ్రేకింగ్ న్యూస్” అని గట్టిగా అరిచారు ప్రవీణని ఉత్సాహ పరుస్తూ. ముసిముసిగా నవ్వుతూనే వార్తలని శ్రద్ధగా వినసాగింది ప్రవీణ ఎక్కడైనా తప్పు దొర్లలేదు కదా అని.

న్యూస్ రీడర్ ముఖం పైనుంచి ఆ సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్ల ఫొటోలు, సినిమాలు చూసి వస్తున్న జనాల ప్రతిస్పందనలతో కూడిన వార్తలు వరుసగా వస్తున్నాయి. రోడ్లపైన పెద్దసైజులో తగిలించిన హోర్డింగులలో ఎలాంటి అశ్లీలమైన దృశ్యాలున్నాయో, పాదచారులకూ, వాహన చోదకులకూ అవి ప్రాణాంతకంగా ఎలా పరిణమించగలవో వివరిస్తూ, వారితోనే ఆ మాటలు చెప్పిస్తున్నారు న్యూస్ రిపోర్టర్లు. మధ్య మధ్య స్టూడియోలో ప్రవీణ ముఖం చూపిస్తూ, వార్తలు సాగుతున్నాయి.

సినిమాలలో సభ్యతను మరిచిపోయి, హద్దులు చెరిపేస్తూ, క్లాసిక్స్ తీస్తారన్న పేరున్న దర్శకులు కూడా కాసుకు బానిసలవుతూ ఎలాంటి చిత్రాలు తీస్తున్నారో, ఎంత నీచానికి ఒడిగడుతున్నారో, అందుకు కారణాలను విశ్లేషిస్తూ ఆసక్తికరంగా సాగిపోతున్నాయి వార్తలు.

ఒక్కసారిగా ప్రవీణ ఉలిక్కి పడింది.

అదేమిటి… అబ్బా… ఛీ… అమ్మో…. బాబోయ్…

తెరమీద ప్రసారం అవుతున్న ఒక్కో దృశ్యం ప్రవీణని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేస్తోంది.

“సినిమాలలో అసభ్యమైన సన్నివేశాలను తొలగించడానికి సెన్సారు బోర్డు ఉందా లేదా? ఉంటే ఏం చేస్తోంది? క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి ఉండకపోతే ఆ విషయం అందరికీ తెలిసేలా బోర్డులు తయారు చెయ్యక్కరలేదా?” అని విరుచుకు పడుతోంది మహిళాసమితి కన్వీనర్. అందరికీ నోటీసులు పంపించామని, తగిన చర్యలు తీసుకుంటామని, నిర్మాతలు, థియేటర్ యజమానులు ఎంత గొప్పవారైనా వదిలేది లేదని హామీలు గుప్పిస్తున్నారు ఎస్పీలు, డీ ఎస్పీలు.

కాని ప్రవీణ అవన్నీ గమనించే స్థితిలో లేదు.

తెరమీద క్షణక్షణానికి మారిపోతున్న సన్నివేశాలన్నీ ఆమె మస్తిష్కంలో అలజడి రేపుతున్నాయి. తెరమీదకి అనుమతించకూడనివి, సెన్సారు కత్తెరకి బలిఅయినవి, హీరో హీరోయిన్ల పై చిత్రించిన ఉద్రేకపూరితమైన దృశ్యాలు, ఐటమ్ సాంగ్ అనే కొత్త ప్రక్రియతో ఒంటిమీద రుమాలు సైజుకు మించని బట్టతో డాన్సు పేరిట గెంతులేస్తున్న నటీమణుల అర్థ నగ్న దేహ ప్రదర్శనలు ఒక్కొక్కటిగా తెర మీద ఆవిష్కరింపబడుతున్నాయి.

ఆడదాన్ని ఆటబొమ్మని చేసి ఆడిస్తున్న నేటి వ్యాపారమయ సమాజపు పోకళ్ళను నిరసిస్తూ వార్తా కథనాలు వెనక నుంచి వినిపిస్తున్నాయి. ఆ వార్తలు తమ గురించి కావేమోనన్నట్టుగా నవ్వుతూ, కవ్విస్తూ తమ అందాలను స్వేచ్ఛగా సంతోషంగా ప్రదర్శిస్తున్నారు ఆ భామలందరూ. పనిలో పనిగా అని దేశీయ చిత్రరంగం ఎంతగా చెడిపోయిందో చూపిస్తున్న దృశ్యాలతో పాటు ఏవో విదేశీ సినిమాల నుంచి సంపాదించిన క్లిప్పింగ్స్ కూడా వేయడం కనిపిస్తోంది.

ప్రవీణ బుర్ర పనిచేయడం మానేసింది. కళ్ళు మాత్రం రెప్ప అర్పకుండా ఎదుటి దృశ్యాలని చూపిస్తున్నాయి.

మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అనాగరిక వ్యవస్థనుంచి నాగరికత నేర్చుకొని ఉన్నతమైన విలువలను సామాజిక జీవన వ్యవస్థలో నెలకొల్పుకున్నాం. భారత దేశంలో ఏ చెట్టునడిగినా పుట్టనడిగినా మన సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుస్తుందే.

యుగయుగాలుగా తరతరాలుగా భారత జీవనస్రవంతిలో అతి పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్న విలువలన్నీ డబ్బుకు అమ్ముడు పోవలసిందేనా? డబ్బు తప్ప ఈ ప్రపంచానికి కావలసినదేం లేదా? సభ్యత, సంస్కారం అనే పదాలకు అర్థాలు మారిపోయినట్టేనా? కొత్తతరానికి ఈ తరం నేర్పగలిగేదేమిటి? పడిపోతున్నామని కూడా స్పృహ లేకుండా పాతాళానికి జారిపోతోందే? ఏ కొత్తవిలువలకీ ప్రస్థానం? ఏం సాధించడానికి?

చూపు బుల్లి తెరనే చూస్తున్నా తలలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ చూసిన శృంగారమయ సన్నివేశాలనే వేర్వేరు వ్యాఖ్యానాలతో చూపుతూ వస్తున్నాయి దేశీ, విదేశీ చిత్ర భేదాలు లేకుండా. వాటినే చూపిస్తున్నాయి కళ్ళు.

మరి చూడలేక పోయింది ప్రవీణ. నిర్దాక్షిణ్యంగా సెన్సారు కత్తెరకి బలి కావలసిన ఫ్రేములన్నీ చకచకమని మన ఇంట్లోకి, మన డ్రాయింగ్ రూములోకి, కుంటుంబ సహితంగా కూర్చొని ఆసక్తిగా, పనులన్నీ మానుకొని మరీ చూసే వార్తల్లోకి వచ్చేస్తున్నాయి.

అక్కడ ఇంట్లో పిల్లలు, ఇంటికొచ్చిన అతిథులు అందరూ తను కనిపిస్తుందని తప్పనిసరిగా కూచొని చూసే వార్తలు! అందరూ ఇవన్నీ చూస్తున్నారా? అమ్మో! నా పిల్లలు!! నా పిల్లలు ఏవి చూడకూడదని తాపత్రయ పడతానో, ఆంక్షలు పెడతానో అవన్నీ చూస్తూ ఉన్నారా? వాళ్ళని సినిమాలు చూడనివ్వకుండా వార్తలు తెలుసుకోండిరా అని ఎప్పుడూ వార్తలే పెట్టేది కదా? ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చూశారా? వాళ్ళ వయసుకి, వాళ్ళకి అక్కర్లేని విషయాలన్నీ తన మొహం మీదుగా, తన మాటల మీదుగా వాళ్ళ మనసులోకి ఇంకిపోతున్నాయా??

ఎక్కడో గంట మ్రోగుతోంది. టంగ్… టంగ్… గంటలు… ఒకటి… రెండు… వందలు… వేలు… టంగ్… టంగ్… అంతకంతకూ శబ్దం భరించలేకపోతోంది ప్రవీణ.

ట్రింగ్… ట్రింగ్… హాల్లో ఫోన్ మోగుతోంది. కరెంటు పోయిందని చిరాగ్గా పడుకొని ఉన్న రవీంద్ర ఫోన్ ఎత్తాడు.

“రవీంద్ర గారూ, కొంచెం త్వరగా వస్తారా? ప్రవీణగారు కళ్ళు తిరిగి పడిపోయారు. …………” రిసీవర్ మీద అతని చెయ్యి బిగుసుకుంది.

—————————

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు – హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు – ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు.

సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

14 Responses to హార్ట్ బ్రేకింగ్

  1. సమకాలీన అంశాన్ని తీసుకుని రాసిన చక్కని కథ. న్యూస్ ఛానెళ్ళు చేసే పని రెండు దశలుగా ఉంటుంది. వార్తల సేకరణ మొదటి దశ కాగా వాటిని ప్రేక్షకులకు అందించడం రెండో దశ. దురదృష్టవశాత్తూ మన ఛానెళ్ళ పనితీరు రెండు దశల్లోనూ అధమాధమంగానే ఉంది. వార్తల సేకరణలో వీరు మానవత్వం మరచి ప్రవర్తించడం గురించి కె.ఎ.మునిసురేష్ పిళ్ళై “రాతి తయారీ” అనే ఒక అద్భుతమైన కథ రాశారు. ఇది కథ 2007 లోనో, కథ 2006 లోనో ఉంది. ఇప్పుడు వార్తలను ప్రేక్షకులకు అందించడంలో న్యూస్ ఛానెళ్ళ బాధ్యతారాహిత్యాన్ని గురించి రాసిన రచయిత్రి సుధారాణి అభినందనీయులు. ఇటువంటి కథలు మరిన్ని రావాలి. న్యూస్ ఛానెళ్లవారు ఈ కథలను చదవాలి.

  2. కొల్లూరి సోమ శంకర్ says:

    కథ బావుంది.అశ్లీలాన్ని ఎండగడుతున్నమనే నెపంతో ఛానళ్ళు ప్రసారం చేసే అశ్లీల దృశ్యాల గురించి బాగా చెప్పారు. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య కూడా అని స్పష్టం చేయడంలో రచయిత్రి నేర్పు చూపారు. అభినందనలు.
    http://www.kollurisomasankar.wordpress.com/About

  3. sujata says:

    Excellent. Very convincing ! This is how the news channels work. Good Job!

  4. కె.మహేష్ కుమార్ says:

    వార్తా విలువలకన్నా, సామాజిక బాధ్యతకన్నా TRP రేటింగులు ఛానళ్ళ (ఆర్థిక)భవిష్యత్తుని నిర్ణయిస్తున్న ఈ దశలో ఈ సెన్సేషనలిజం ఇంకా పెచ్చరిల్లుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రేక్షకులు కూడా వార్తల్ని టైంపాస్ గా చూసేస్తుంటే,ఈ పరిస్థితి భవిష్యత్తులోకూడా మారే ఛాన్స్ లేదు.

    Entertainment ఛానళ్ళకి చెల్లే TRP విధానంకాక,కనీసం వార్తాఛానళ్ళకు ఒక వేరే విధమైన qualitative rating point విధానం అత్యంత అవసరం.

    కథ చాలా సారవంతంగా ఉంది. నా అభినందనలు.

  5. perugu says:

    ee amsam meeda manchi katha..inka enno ilantivi ravali
    Ram

  6. Kolluru Jagannadha Rao( Ramesh) says:

    Subject chalaa bagundi.Andaru chadavaalsina kadha.Prsent trend people tappkunda chadavali.

  7. దూర్వాసుల పద్మనాభం says:

    ఆశ్లీల దృశ్యాలను చూపించడానికి టివి వాళ్ళు ఇటువంటి అడ్డదార్లు తొక్కడం పరిపాటయిపోతోంది.ఏమైనా అంటే ఈ కాలం యూత్ ఇవి కోరుకుంటున్నారంటారు. వీటిని కంట్రోల్ చెయ్యటం ప్రభుత్వం పని కాదా?
    ఏమైనా నలుగురిని బాధిస్తున్న విషయాన్ని కధారూపంలో సున్నితంగా అందించారు.

  8. eekaatha baagaane undi. ee katha loni vishayam sadaranamainide. aina daanni inkonchem vivavraanga chepadam chalaa baagundi. ituvanti kathalu inka konni
    raavali. appudaina prabhutyam kallu terisi thagu charyulu teesukuntundane aasa chigururustundi.Racayitrilki dhanyavadamulu.

  9. కథ ఉద్వేగంగా నడిచింది. ఒక నైతిక సాంఘిక సమస్యని ముఖ్య పాత్ర వ్యక్తిగత సమస్యగా మలచి ఆ పాత్ర పొందే ఉద్వేగాన్ని పాఠకులకి సరఫరా చేశారు.
    అభినందనలు

  10. Aruna Pappu says:

    A very good story.
    Must read for all tv Lovers!

  11. satyasri says:

    topic ok. kani heroin addamlo tana andam chusukuni murisipovadam..breaking news (avela vuntayo telisi kuda) chadavadaniki sothoshpadipovadam .. adamta baga ledu.

  12. p.a valli says:

    katha n theme rendu bagunnai. Nijangane sensor annadi cinemaki matrame kadu, tv ki kuda pettali. sensational news kosam try cheyadam, aa vishayanni prekshakula medadu purtiga padayyevaraku chupinchadamu oka fashion ayipoyindi. Congrats
    Valli

  13. Madhuravani says:

    very well-written story..!
    Excellent subject and perfect treatment..!!

Comments are closed.