సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

రాయలసీమ లోని గ్రామ పార్టీల గురించి ‘పాండవబీడు‘, కనుమరుగైపోతున్న సాంప్రదాయక కళల గురించి ‘తోలుబొమ్మలాట‘, గ్రామీణ జీవితాల్లో వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పుల గురించి ‘కాడి‘, మగ విద్వేషానికి బలయిన చారిత్రక వీరవనిత గురించి ‘పాలెగత్తె‘, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి ‘చినుకుల సవ్వడి‘ నవలలు రాసారు. తదుపరి ప్రణాళిక ఏమిటి?

పల్లె జీవితంలో విపరీతమైన మార్పులొస్తున్నాయి. ప్రపంచీకరణ వల్లా, సరళీకృత ఆర్థిక విధానాల వల్లా, మార్కెటీకరణ వల్లా పల్లె మనుగడలో పెనుమార్పులు సంభవిస్తూ వున్నాయి. రైతులిప్పుడు వ్యవసాయం చేసి బతికే పరిస్థితుల్లో లేరు. అలాగని సెంటు భూమి కూడా బంజరుగా లేదు. తరాల తరబడి బీళ్ళుగా పడి వున్న భూములన్నిట్నీ ఎక్కడెక్కడి ప్రాంతాలవాళ్ళో వచ్చి, కొని, కంచెలు నాటుతున్నారు. ‘పొరుగూరి చాకిరి, పొరుగూరి సేద్యం తనను తినేవేగాని తను తినేవి కావు’ అనే సామెతకు అర్థం లేకుండా పోయింది. పొరుగూరి సేద్యానికే రైతు భయపడుతూ వున్న కాలాన్నించి వేల మైళ్ళ దూరాన్నించి వచ్చి ఇక్కడ భూములు కొని అక్కణ్నించే సేద్దెం చేయించే పరిస్థితి ఒకటి కొత్తగా వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసికోవాలో తెలీకుండా వుంది. ఈ మార్పులన్నింటికీ మూలాలేవో వెదకే దశలో నేనింకా సాహిత్య సృజన చేయాల్సిన అవసరం వుంది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

సాహితీ వ్యవసాయంలో మీరింకా పండించదలచినవేమిటి?

ఇన్నేళ్ల నా సాహితీ వ్యవసాయంలో నేను పండించింది తక్కువే. ఒకటి రెండు మంచి పంటలు పండించొచ్చుగాక, పరిపూర్ణమైన పంట నానుంచి ఇంకా రాలేదనే నా అభిప్రాయం. నా చుట్టూ వున్న జీవితాన్ని నేను చూడాల్సిన కోణాలు ఇంకా చాలా మిగిలి వున్నాయి. వాటి గురించిన స్పష్టత నాకింకా రావలసి వుంది. నేను రోజూ చూస్తూనే వున్నా, మాట్లాడుతూనే వున్నా కొని జీవితాల్ని నేనింకా అర్థం చేసికోలేకపోతున్నాను. కూచుని దృష్టిని సంధించాల్సిన కోణమేదో అందీ అందనట్లుగా వుంది. నా తరంతోనే అంతరించిపోతూవున్న అచ్చ తెలుగు వాడుక పదాలూ, వ్యవహారాలూ, పలుకుబళ్ళూ, సామెతల్ని సాహిత్యంలో నిక్షిప్తం చేయవలసి వుంది. భవిష్యత్తులో నా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు రాయలసీమ వ్యావసాయక పల్లెదనం ఒక తరంలో పొందిన పరిణామం స్పష్టంగా కంపించాలి. అందుకై నేనింకా కవితలూ, కథలూ, నవలల్ని విస్తృతంగా రాయవలసి వుంది.

దిగంబరం‘ కథా కథనం చాలా బలంగా వచ్చింది. ఆ కథలోని కుటుంబ యజమానిలాంటి బతికి చెడిన రైతులు రాయలసీమలో చాలా మందే కనపడతారు. కానీ-ఆ రైతు చెల్లెలు, కూతుర్ల అవసరాలను, సంఘర్షణలను అంత దగ్గరగా ఎలా చూపించగలిగారు? కథలోని యీ పాత్రల నేపధ్యం మీ జీవితానుభవాల్లోనిదేనా? దాని గురించి చెప్పండి.

దిగంబరం‘ లోని పాత్రలు నేనెరిగినవే. మా యింటి పక్కవే. నేనే కాదు-రాయలసీమలో చాలా వూర్లలో ఇలాంటి పాత్రలు కోకొల్లలుగా దొరుకుతాయి. అయితే ఇందులోని చెల్లెలు, కూతుర్ల పాత్రలు కూడా నాకు తెలిసినవే కావటం విశేషం. వాళ్ల మానసిక సంఘర్షణకు దగ్గరగా వెళ్లి రాయటం నాకున్న పాత్రల అవగాహనవల్ల, పరిశీలన వల్ల సాధ్యమయింది. అయితే కొన్ని కొన్ని సంఘటనలు నేను కథలో చెప్పినట్లే ఏకకాలంలో ఒకే వేదిక మీద జరగాల్సిన పని లేదు. కథ, పాత్రలు, వాతావరణం ఆ యింటి నుంచే తీసికొన్నా, కథ చివరిలో ముసలోడి ఆవేదన మరో యింటినుంచి తీసికొని వుండొచ్చు. ఏక కాలంలో ఒకేచోట జరిగినట్లుగా చిత్రించిన సంఘటనలు వివిధ కాలాల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ పాత్రల మధ్య వివిధ సంఘటనలుగా జరిగి ఉండొచ్చు. వాటిని కూర్చుకొనే నేర్పు రచయితకు ఉండాలి.

తోలుబొమ్మలాట‘ నవలలో తల్లీ కూతుళ్ల విషయం. యవ్వనం సంతరించుకొంటోన్న రోజుల్లో తల్లి అనుభవాలు మధుర జ్ఞాపకాలు కాగా, కూతురి అనుభవాలు బాధాకరమైనవి, భయం గొలిపేవి. ఆ వూర్లోని యువత ఒక తరం మారేలోగా ఎందుకలా తయారయిందోననే ఆలోచన రేకెత్తించే చిత్రణ ఆ నవల్లో వుంది. ఆ విషయమై మీ ఆలోచనలు చెప్పండి.

గతంలో ఏదయినా సమస్య తలెత్తితే గ్రామమంతా ఒకచోట సమావేశమై చర్చించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేవారు. తాగుడు ఒక చెడు అలవాటుగా భావించేవారు. పెద్దల్ని ఎదిరించటం తప్పుగా నమ్మేవారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా గ్రామ అవసరాల కోసం సర్దుబాటయ్యేవారు. ఏవో పార్టీలున్న గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల పరిస్థితి అలాగే వుండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పార్టీలంటూ పెద్దగా లేకున్నా ప్రతి గ్రామం రెండుగా విడిపోయి ఒక వర్గం వారంటే మరొక వర్గం వారికి గౌరవాలు నశించాయి. ఆప్యాయతలూ, అనురాగాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్దల మాట ఎవరూ వినట్లేదు. ప్రభుత్వం వారు అదేపనిగా ప్రచారం చేసి మరీ మద్యం తాపుతుండటంతో ఇప్పుడు తాగటానికి ఎవడూ సిగ్గుపడటం లేదు. దాంతో విచక్షణ కోల్పోతున్నారు. గ్రామ పెద్దల అజమాయిషీ పోయింది. ఎవనికి వాడే స్వతంత్రుడై మద్యానికి బానిస అవుతున్నాడు. సమస్యలొస్తే పోలీస్టేషన్లో మాత్రమే పరిష్కారమవుతున్నాయి తప్ప గ్రామపెద్దల సమక్షంలో కాదు. రాజకీయ పార్టీల కొమ్ము కాసేవాళ్ళే ఇప్పుడు గ్రామ పెద్దలవుతున్నారు. తమ వర్గంలోని మనిషి చేజారిపోకుండేందుకు వాళ్లు తప్పు చేసినా సమర్థించుకొని కొమ్ముకాసే దశకు గ్రామపెద్దలు దిగజారిపోయారు. ఈ నేపథ్యంలో యువత అలా తయారైంది.

పదేళ్ళనాటికి, ఈ నాటికీ ‘పల్లె’ చిత్రం మారింది. బతుకుతెరువులు మారిపోయాయి. రాజకీయంగా, సామాజికంగా పల్లె నాగరికతలో వేగంగా చోటుచేసికొంటోన్న కొన్ని అనివార్యమైన మార్పులను మీరు తప్పనిసరిగా గమనించే ఉంటారు. ఈ మార్పు మీ రచనల ఇతివృత్తాల్లో ఎలా ప్రతిబింబించి ఉంటుందో మీ మాటల్లో వినాలనుంది. చెబ్తారా?

తోలుబొమ్మలాట‘ నవలలో మీరు చెప్పిన మార్పులన్నీ చాలావరకు ప్రస్తావించాను. పల్లెచిత్రం తనొక్కటే ఒంటరిగా మారలేదు. నగరాలు, పట్టణాల్లో జరిగే విపరీత మార్పులకు పల్లె కూడా స్పందిస్తోంది. ఆ మార్పులకు తన ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కొన్ని అవసరాల్ని పణంగా పెట్టి అయినా నగరాల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తోంది. ‘తోలుబొమ్మలాట‘లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాను. పట్టణాల్నించి వచ్చిన కళాకారులు ఇరవై యేళ్ళ కిందటి పల్లెను పోల్చుకొని తెగ బాధపడిపోతారు. పల్లె మారిందని చింతపడతారు. కానీ చివరకు యథార్థ భావనకు మారతారు. పట్టణాల్లోని తమ జీవితాల్లో కూడా ఊహించనన్ని మార్పులొచ్చాయి గదా! ఇళ్లల్లోకి టీవీలొచ్చాయి. వంటింట్లోకి మిక్సీలు, కుక్కర్లొచ్చాయి. చేతుల్లోకి సెల్‌ఫోన్లొచ్చాయి. పల్లెలు మాత్రం ఆ సౌకర్యాల్ని ఎందుకు అనుభవించకూడదు? అంటే వాళ్ల దృష్టిలో పల్లెలింకా దశాబ్దాల నాటి పల్లెల్లాగే ఉండాలి. ఇంకా విసరుతూ, దంచుతూ, రుబ్బుతూ, ఎంత దూరమైనా నడుస్తూ, మైళ్ల దూరాన్నుంచి నీళ్లు మోస్తూ, గోచిపంచెలు బిగించి పూరి గుడిసెల్లో ఉంటూ, ఏ వృత్తి కళాకారుడు ఆ వృత్తికి సంబంధించిన పనులే చేస్తూ, బైటి ప్రపంచం వాళ్లకి పల్లె ఒక అందమైన ఫోటో లాగా కన్పించాలా? ఇది స్వార్థపూరిత ఆలోచన కదా! వాళ్లు మాత్రం మారకూడదా? కొత్తనీరు ఉధృత ప్రవాహమైనపుడు ఇరుదరులు కోసుకుపోవడం సహజం. మార్పుకు గురవుతోన్న సమాజంలో కొన్ని అవాంఛనీయమైన ధోరణులు చోటు చేసికోవటం కూడా అంతే సహజం. సమర్థనీయం కాని పరిణామాలు కూడా చోటు చేసికోవచ్చు. అంతమాత్రాన మార్పును వ్యతిరేకించాలా?

కాడి నవలలో కూడా పల్లె వ్యవసాయ జీవితంలోని మార్పుల్ని విస్తృతంగానే చర్చించాను.

వ్యవసాయం పరిస్థితి చాలా మారింది. ఉపాధి హామీ వగైరా పథకాల వల్ల, వ్యవసాయ పనుల కాలంలో ఈ పథకాలు ప్రవేశపెట్టటం వల్ల వందరూపాయలిచ్చినా పత్తి విరుపులు వగైరా పనులకు కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడి, వ్యవసాయం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామంలో ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా రైతులంతా జాబ్‌కార్డ్‌లు సంపాదించుకొని ఉపాధి హామీ పనులకు వెళుతున్నారంటే వ్యవసాయ పరిస్థితిని అర్థం చేసికోవచ్చు.

తెలుగు మీడియమ్ స్థానంలో ఇంగ్లీష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నారు. దాని ప్రభావం తెలుగు సాహిత్యంపై ఎలా ఉండొచ్చు?

ఇంగ్లీషు మీడియమ్ వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేననుకోవటం లేదు. విద్యార్థుల వల్ల కంటే తల్లిదండ్రుల వల్లే తెలుగు భాషకు నష్టం జరుగుతూ ఉంది. తెలుగును నిర్లక్ష్యం చేసేది, ఇంగ్లీషును అరువు తెచ్చుకొనేదీ వాళ్లే. తమ తీరిక సమయాల్ని పఠనం నుంచి దృశ్యం వైపుకు మళ్లించటమే భాషా వినాశనానికి నాంది ఐంది. సంభాషణల్లో ఇంగ్లీషు పదాల్ని ఉపయోగించాలనే కృతక నాగరికత కూడా ఇందుకు తోడైంది. పల్లెల దృష్టికోణం నించే నేను మాట్లాడుతోన్నా – రెండు దశాబ్దాల క్రితమే, ఇంగ్లీషు వ్యామోహం పల్లె చదువుల మీద బలంగా వాలనప్పుడే – ఇంగ్లీషు పదాల్ని తమ సంభాషణల్లో చొప్పించేందుకు చాలామంది ఉబలాటపడటం నేను గమనించాను. మాట్లాడేదంతా తెలుగే అయినా ఊత పదాలుగా సో, బట్ లాంటి ఇంగ్లీషు పదాలు వాడటం నాకయితే అత్యంత కృతకంగా అనిపించేది.

ఆ పరిస్థితికి కూడా కొన్ని కారణాలున్నాయి. టౌనుకు వెళ్లివచ్చినపుడల్లా ఓ ఇంగ్లీషు పదాన్ని మోసుకురావాల్సిన దుస్థితి. హోటల్‌కు పోతే బువ్వ, కూర అనడం అనాగరికం. రైస్, కర్రీస్ అనాలి. బస్సెక్కినపుడు తావు అనకూడదు. సీటు అనాలి. ఏ షాపు చూసినా అక్షరాలు తెలుగులోనే ఉన్నా భాష మాత్రం ఇంగ్లీషు. అన్నపూర్ణా మిలిటరీ హోటల్, సుబ్బయ్య అండ్ సన్స్ జనరల్ మర్చంట్స్, వాణి ఫ్యాన్సీ షాపు, బ్రహ్మం మెడికల్ షాపు, శ్రీదేవి క్లాత్ ఎంపోరియమ్, శివ ఫర్టిలైజర్స్, వినాయక బ్రాంది షాపు వగైరా వగైరా అన్ని అంగళ్లూ – చివరకు టీస్టాల్, పాన్ మసాలా, కూల్‌డ్రింక్స్- చచ్చినట్లు ఇంగ్లీషు పదాల్ని అలవాటు చేసికోవలసిందే. దానికితోడు సినిమాల్లో కూడా సగం ఇంగ్లీషు పదాల వాడకం. ఏ ఆఫీసుకు వెళ్లినా.., కేవలం పల్లెజనాల కోసమే నడిచే సహకార బ్యాంకుల్లో సైతం, లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. చదువుకొన్నవాళ్లు, రాజకీయ నాయకులు వగైరాలంతా ఇంగ్లీషు పదాల్ని విరివిగా ఉపయోగించటం కూడా ఒక కారణం. ఇంగ్లీషు అనేది నాగరికతకు చిహ్నంగా జనాలు అర్థం చేసికోవటం వల్ల ఈ చిక్కు వచ్చింది. ఇంగ్లీషు పదాల్ని ఇప్పుడు ఇంట్లో కూడా వాడటం వల్లనే ఇబ్బంది వచ్చిపడింది. ఇంగ్లీషు వంటింట్లోకి కూడా చొరబడింది. మనం తినే ఆహారానికి కూడా ఇంగ్లీషు వాసనలు అద్దబడ్డాయి. ఇంగ్లీషు మీడియమ్ చదివే పిల్లలకి ఇంట్లో కూడా ఇంగ్లీషు భాషావాతావరణాన్ని కల్పించటం వల్ల ఆంగ్లభాషలో నిష్ణాతులవుతారనే కుహనా సంస్కృతి ఒకటి చాలామంది చదువుకొన్న తల్లిదండ్రుల్లో ఏర్పడింది. దీనివల్ల తెలుగు భాషకు తీవ్రమైన నష్టమే జరుగుతోంది.

పిల్లలకు ఇంగ్లీషు మీడియమ్‌లో చదువు చెప్పించినా ఇంటిని ఇంగ్లీషు మీడియమ్ చేయకుంటే చాలు. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, తెలుగు కథల పుస్తకాల్ని పిల్లలకు అందుబాటులో ఉండేలా చేస్తూ, వాళ్లని తెలుగులో కూడా నిష్ణాతులని చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మన వేషము, భాష మొరటైనవిగా, మన సంస్కృతి సంప్రదాయాలు పాత చింతకాయ పచ్చళ్లుగా పిల్లల మనసుల్లో ముద్ర పడేలా చేసి, విదేశీ వేషభాషలు, సంస్కృతీసంప్రదాయాలే గొప్పవిగా, అవి ఆచరిస్తేనే నాగరికతగా చిన్నప్పటి నుంచీ నూరిపోస్తే వాళ్లు పెద్దయింతర్వాత, విదేశాల్లో జీవనం మొదలెట్టింతర్వాత, మన భాషా, సంస్కృతుల్ని ఎట్లా పట్టించుకోకుండా వదిలేస్తారో వాటి మధ్య బతికే తల్లిదండ్రుల ఉనికినీ సంబంధాల్నీ అట్లాగే వదిలేస్తారు, తప్పదు. అందులో పిల్లల తప్పుకూడా లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా విశ్లేషించుకొని మరీ గమనించాలి.

ఇప్పుడు ఇంగ్లీషు చదువుల ప్రభావం సాహిత్యం మీద పడి తెలుగు పాఠకుల సంఖ్య బాగా తగ్గిందనటానికి – మొదట్నుంచీ సీరియస్ సాహిత్యానికి పాఠకుల సంఖ్య తక్కువే. ఆ మధ్యలో ఓ మూడు దశాబ్దాల కాలం కాలక్షేపపు కాల్పనిక సాహిత్యం తెలుగు భాషలో అడుగుపెట్టి పాఠకుల సంఖ్యను విపరీతంగా పెంచింది. అయితే ఆ పాఠకుల్ని సీరియస్ సాహిత్యం కేసి మరల్చుకోలేకపోవటం తెలుగు సాహిత్యం చేసికొన్న దౌర్భాగ్యం. టీవీ మాధ్యమం వచ్చింతర్వాత కాలక్షేపం రూపం మారింది. కాలక్షేపపు పాఠకులు కాస్తా టీవీ వీక్షకులయ్యారు. ఆ మూడు దశాబ్దాల పాఠకుల సంఖ్యతో పోల్చుకొంటే ఇప్పుడు సాహిత్యాన్ని చదివే వాళ్లు తక్కువే.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

5 Responses to సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

  1. G Ashok KNR says:

    I have had a chance to watch this site with K Bhoom reddy who informed about this page.

    Sri Sannapureddy Venkataramireddy is studying the lives of village people at Rayalaseema area in a deep concern. His opinions are very interesting to study. People who ever come across with these opinions should think seriously. I would try.

  2. Noorbasha Rahamthulla says:

    భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్‌ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌ హైదరాబాద్‌ రావటం, సివికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు: 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు. 2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు. 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.

    4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది. 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే? 6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌ నేర్వాలి. 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి. ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?: 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా? 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం. 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి? 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం. 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్‌ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది. 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006) అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు. మెదక్‌ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌ పూర్‌ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్‌ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది. తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్‌ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

  3. swarupkrishna says:

    పొద్దుకు అభినందనలు. వెంకటరామిరెడ్డి గారితో ఇంటర్వ్యూ కథలమీద పరిశోధన చేసేవాళ్ళకి గొప్పగా ఉపయోగపడుతుంది. కుటుంబరావుగారి కథల గురించి , కథానికా శిల్పాన్ని గురించి డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి పర్యవేక్షణలో పరిశోధన చేశాను. ఇది దాదాపుగా 1993 నాటి మాట. అప్పటికి కథానికా శిల్పాన్ని గురించిన విమర్శనాత్మక గ్రంధాలు కేవలం తక్కువ. వల్లంపాటి గ్రంధం నవలా శిల్పం, కథానికా శిల్పం, పోరంకి దక్షిణామూర్తి పుస్తకం, రచయితా శిల్పము అన్న రష్యన్ రచయిత ఇల్యా ఎహినోవ్ అనుకుంటా ఇవే లభ్యమయ్యాయి. కుటుంబరావు గారి కథల్లో శిల్ప విన్యాసం ఎక్కువ. అది గోప్య శిల్పఙ్ఞత. కంటికి కనిపించకుండా అంతర్గతంగా కథంతా వ్యాపించి ఉంటుంది. రచయిత జీవితము, రచయిత అలోచనలు, దృక్పథం , గొతుంక తెలియకుండా కథను విమర్శించడం జరిగితే విమర్శకు న్యాయం జరగదని నా అభిప్రాయం. సన్నపు రెడ్డి కథల గురించి ఇప్పుడు చక్కగా శోధించవచ్చు.
    కేవలం ఇతని కథలమీదే కాకుండా ఏ రచయిత కథలనైనా విమర్శించడానికి, విశ్లేషించడానికి ఈ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి పరిశోధక విద్యార్థులకు ఇంతటి మేలు చేస్తున్న “పొద్దు” నిజంగా అభినందనీయము. ఇంకా చిలుకూరి దేవపుత్ర, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, దాదా హయత్ , సింగమనేని నారాయణ వంటి కథకుల ఇంటర్వ్యూలు ప్రచురించ గలిగితే కథానికా సాహిత్యానికి ఒక గొప్ప మేలు చేస్తుంది పొద్దు. త్వరలో ఆశిద్దాం….

  4. Noorbasha Rahamthulla says:

    ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.
    నేరుగా తెలుగులోనే వ్యాఖ్యలు రాసే సౌలభ్యం కల్పించండి

  5. mallikarjunareddy says:

    very good,am fan of sannapureddy. navala language is very good. i like that language.

Comments are closed.