సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 4

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

మీ అభిమాన రచయిత ఎవరు? ‘చనుబాలు’ కథలో ప్రస్తావించినట్లు ‘కళాపూర్ణోదయం’ మీకు బాగా నచ్చిందనుకుంటాను, కారణాలు చెబ్తారా?
‘కళాపూర్ణోదయం’ నచ్చినమాట వాస్తవమే, ఉత్కంఠ కలిగించేలా కళాత్మకంగా ఎలా రచన చేయవచ్చో ‘కళాపూర్ణోదయాన్ని’ చూస్తే తెలుస్తుంది. కానీ, నాకు బాగా నచ్చిన రచయిత తిక్కన సోమయాజి. సంభాషణలుగానీ, సన్నివేశాల చిత్రీకరణలోగానీ ఎంతో నైపుణ్యాన్ని కనబరచిన రచయిత ఆయన. సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల మనస్తత్వ పరిశీలన ఆయన రచనల్లో కనిపిస్తుంది. ప్రగతిశీల భావాలతో కూడిన ఎన్నో పద్యాలు భారతం నిండా దర్శనమిస్తాయి.

మీరు రోజుకు/వారానికి సగటున ఎంతసేపు టి.వి. చూస్తారు? ఎలాంటి ప్రోగ్రాములని ఇష్టపడతారు?
టి.వి చూట్టం తక్కువే. సీరియల్సు అసలు చూడను. నెలకో, రెండు నెలలకో ఇంట్లో అందరితో కలిసి సినిమా చూస్తాను. ప్రతిరోజూ తప్పకుండా అర్థగంటకు తక్కువ కాకుండా వార్తలు చూస్తాను. చర్చాకార్యక్రమాలు, కళలు సంస్కృతులకు సంబంధించిన మంచి కార్యక్రమాల గురించి తెలిస్తే తప్పనిసరిగా చూస్తాను.

మీరు బోధనా రంగాన్ని ఎందుకు ఎంచుకొన్నారు? సాహితీ సృజనకు అవసరమైన వెసులుబాటు ఇతర రంగాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటుందా?
నేను చదివిన చదువు నాకీ బతుకుదెరువు ఇచ్చిందే గాని ఒక వ్యూహంతో నేను ఉపాధ్యాయున్ని కాలేదు. అయితే ఉపాధ్యాయుణ్నయిన తర్వాత వృత్తిని ప్రేమించాను, అందులో మమేకమయ్యాను. ప్రవృత్తిగా వున్న రచనా రంగానికి యీ వృత్తి సహకరిస్తోందే తప్ప వెనక్కి లాగటం లేదు.

సన్నపురెడ్డి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పేరు: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
పుట్టింది: 1963 ఫిబ్రవరి 16 న
కన్నవాళ్ళు: సన్నపురెడ్డి లక్ష్మిరెడ్డి, చెన్నమ్మ
చదువు: బి.యస్‌సి., బి.ఇడి.
వృత్తి: 1989 నుండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా
రచనలు: దాదాపు 60 కవితలు, 45 కథలు, 5 నవలలు
నవలలు: కాడి, పాండవబీడు, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, పాలెగత్తె.
అర్ధాంగి: ఇంద్రావతి
పిల్లలు: పావని, శ్రావణి, శ్రీనాథ్
నివాసం: పుట్టిందీ, పెరిగిందీ, ప్రస్తుతం ఉండేదీ బాలరాజుపల్లెలోనే.
చిరునామా: బాలరాజుపల్లె గ్రామం, నరసాపురం పోస్ట్,
కాశినాయన (మం) – 516 217, కడప జిల్లా.

ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం టీచర్లను బోధనేతర పనులకు ఎక్కువగా వినియోగిస్తోంది. దీనివల్ల పిల్లల చదువులు కుంటుపడటం లేదా?
ఒకప్పుడు పల్లెటూరి ఉపాధ్యాయుడంటే కేవలం పిల్లలకు చదువు చెప్పేవాడు మాత్రమే కాదు, గ్రామస్తులకు బహుళ ఉపయోగకారిగా ఉండేవాడు. ప్రోనోట్లు తేల్చేవాడు, దస్తావేజులు చూసేవాడు, జాబులు రాసేవాడు, చదివి వినిపించేవాడు, లెక్కలు తేల్చేవాడు. ఒకటేమిటి-చదువు అవసరమయ్యే ప్రతిచోటా ఆయన ఉండవలసిందే, అవసరాలు తీర్చవలసిందే. అలాగని పిల్లలకు చదువు చెప్పటం మానేది లేదు, అక్కడా న్యాయం చేసేవాడు. వృత్తి పట్ల అంకిత భావంతో పన్జేసేవాడు. నా ఉద్దేశ్యమేమంటే-పిల్లలకూ, పిల్లల తల్లిదండ్రులకూ, ఆ గ్రామానికి సంబంధించిన విషయాలయితే బోధనేతర పనులు చేయటం సబబే. అందువల్ల పిల్లల గురించీ, వాళ్ల ఆర్థిక, సామాజిక విషయాల గురించీ ఉపాధ్యాయుడు తెలుసుకున్నట్లవుతుంది. గ్రామస్థులందరితో సన్నిహితంగా మెలిగినట్లవుతుంది. ఎలక్షన్ డ్యూటీల లాంటి పిల్లలతో సంబంధం లేని పనుల్నించి ఉపాధ్యాయుల్ని తప్పించాలి. ఉపాధ్యాయునికి కొంత ఇబ్బందికరమైనా తను పనిచేసే వూరిలోనే సంసారం ఉండటం వలన వృత్తికి సరైన న్యాయం చేయగలుగుతాడు. బడికి అతను చుట్టంలా కాకుండా గృహయజమానిగా ఉన్నప్పుడే పిల్లల నడవడికలన్నీ తెలుసుకోగలుగుతాడు. బడి సమయం తర్వాత కూడా పిల్లలు ఉపాధ్యాయుని ఎరుకలో ఉంటే వృత్తికి న్యాయం చేయగలుగుతాడు. అట్లా ఉండాలంటే ఆ వూరిలోనే నివసించగలగాలి. తొంభై శాతం పైగా ఉపాధ్యాయులు అట్లా నివసించటం లేదు, బడికి చుట్టాలుగానే వున్నారు. అందుకే యీ అస్తవ్యస్తమంతా.

విద్యారంగంలో చోటు చేసుకుంటోన్న మార్పుల గురించి National Policy on Education లోని నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం విద్యావ్యవస్థలో రావలసిన మార్పుల గురించి నవల రాసే ఉద్దేశమేమైనా వుందా?
ఉంది, రాబోయే రోజులలో తప్పకుండా రాస్తాను.

‘పగటికల’ లో గిజూభాయి బగేకా చేసినటువంటి ప్రయోగాలు చిత్తశుద్ధితో చేపట్టగల ఉపాధ్యాయులు గానీ, అందుకు అనువైన పరిస్థితులు గానీ ఇప్పుడున్నాయా?
చిత్తశుద్ధి గలిగిన ఉపాధ్యాయులు అప్పుడే గాదు ఇప్పటికీ వున్నారు, వాళ్ల శాతం పడిపోయిందంటే ఒప్పుకుంటాను. ప్రయోగాలకు అనువైన పరిస్థితులు కూడా వున్నాయి.

మీ బడిలో మీరుగానీ, మీ తోటి ఉపాధ్యాయులుగానీ బెత్తాన్ని ఎంత తరుచుగా వాడుతుంటారు?
మాది పూర్తిస్థాయి గ్రామీణ వాతావరణంతో కూడిన పాఠశాల. సగం మంది మహమ్మదీయులు, సగం మంది యాదవులున్న చిన్న గ్రామానికి సంబంధించింది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. పిల్లలు చాలా వరకు మొదటి తరం విద్యార్థులు. మేం వాళ్లని కొట్టటం, భయపెట్టటం లాంటి పనులు చేయం. వాళ్ల ఇళ్లల్లో, కళ్లాల్లో, పొలాల్లోని వాతావరణం బడిలో కల్పిస్తాం. వాళ్ల మనసుల్లోని భావాల్ని అత్యంత సహజంగా మాముందు వ్యక్తపరిచేంత చనువయ్యాం. చిన్న పిల్లలయితే మరీ మామీద ఎక్కి తొక్కుతుంటారు. అందుకే సాయంత్రం బడి వదిలేసరికి మా బట్టలు మట్టిగొట్టుకుపోయి మళ్లీరోజు తొడుక్కొనేందుకు పనికిరావు.

మీ పిల్లలు ఏ బడిలో చదువుతున్నారు? ఏ మీడియం?
పెద్దపాప డిగ్రీ చివరి సంవత్సరం. ఎం.ఇ. కంప్యూటర్స్ సబ్జక్టులతో. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. డిగ్రీలో పై సబ్జక్టులు తెలుగు మాధ్యమంలో లేవు కాబట్టి ఇంగ్లీషు తప్పనిసరైంది. రెండవ పాప తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తెలుగులో ప్రి డిగ్రీ పూర్తయ్యి ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అబ్బాయి మాత్రం తొమ్మిదవ తరగతి ఇంగ్లీషు మీడియంలో. అమ్మాయిలిద్దరూ సెలవుల్లో తెలుగు కథానికలు, నవలలు బాగానే చదువుతారు. ఆబ్బాయి సెలవులంతా తెలుగు కథలకే సమయాన్ని ఖర్చుజేస్తాడు. బాల సాహిత్యంతో వాడో స్వంత లైబ్రరీ కూడా తయారు చేసుకొన్నాడు.

రచనలు చేయటంలో మీ శ్రీమతి సహకారం ఎలాంటిది?
ఆమెకు చదువు రాదు. నా కథలు రేడియోలో ప్రసారమయితే విని ఆనందిస్తుంది. పిల్లలు చదివి చెపితే సంతోషిస్తుంది. గ్రామస్థులు ప్రస్తావిస్తే ఎంతో కుశాలగా ముచ్చటిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు ఆమెకు బాగా తెలుసు. నాకు గుర్తుండని సంగతులు కూడా ఆమె వివరిస్తుంది. నా రచనల్లో వ్యవసాయ సంబంధ వాతావరణం, పైరుపచ్చల విషయాలు చిత్రించే సందర్భంలో ఆమె సహాయం తీసికొంటాను.

మీ రచనల మొదటి పాఠకులు ఎవరు?
బహుశా పత్రికల్లో కథల్ని చూసే సబ్ ఎడిటర్లయి వుంటారు. కథల్ని రాసింతర్వాత నేను నేరుగా పత్రికలకే పంపుతాను. ప్రచురించబడిన తర్వాత మిగతా వాళ్లు చదువుతారు.

వాతావరణంలో వచ్చే మార్పునుబట్టి కూరగాయల రుచిలో వచ్చే మార్పులను సైతం ఎంతో నిశితంగా గమనించి మీ రచనల్లో రాస్తారు. మీకు బాగా నచ్చే వంటకాలేవి?
నూనెలు ఎక్కువగా వాడని, మసాలాలు బాగా దట్టించని, సహజరుచుల్ని అందించే పల్లె వంటకాలు చాలా రకాలు నచ్చుతాయి. ముఖ్యంగా కాయలు, ఆకులతో దంచే రోటి పచ్చళ్లు నేనిష్టపడతాను. పచ్చిమిరప, టమోట, ఉల్లిగడ్డల్ని వాడ్చి, దంచి, తిరగమోత పెట్టిన పచ్చడి పళ్లెంలో వేసికొని, వేడి వేడి అన్నాన్ని వడ్డించుకొని, అప్పుడే నిప్పుల మీంచి తీసిన గిన్నెలోని నేతిని పచ్చడి మీద వంచినప్పుడు ‘చుంయ్‘ మని వచ్చే శబ్దాన్ని వింటూ, అన్నం పొగలు వూదుకొంటూ కలుపుకు తినటం నాకెంతో ఇష్టం. అలాగే పెసరబేళ్లు, వరిబియ్యం కలిపి వండిన పులగమన్నంలో, రెండు చుక్కలు నేయి అంటించిన చింతపండూరిమిండి కలుపుకు తింటే ఎంతో తృప్తిగా వుంటుంది. చింతచివురో, మామిడి ముక్కలో వేసి ఉడికించి ఎనిపిన కందిబేళ్ల పప్పుతో అన్నం కలుపుకు తినటం పసందుగా వుంటుంది. వేడి వేడి రాగి సంగటి ముద్దమీద కుదురు చేసి, కుదుట్లో పచ్చిమిరపల పచ్చడి వేసి, దానికి ఎర్రగా కాగిన వేడిపాల మీది మీగడని కలిపి అద్దుకు తింటే మహారుచిగా వుంటుంది. వట్టిచేపా, వంకాయా, వట్టి మిరపల్ని నిప్పుల మీద కాల్చి, ఉప్పు కలిపి బొటనవేలి దరువేసి, ఉడుకుడుకు సంగట్లో అద్దుకు తింటే రుచి చచ్చిన నాలుక మళ్లీ బతుకుతుంది. పొట్లి మాంసం వేపుడు తునకలన్నా, నాటు కోడి సియ్యల చారన్నా, కుంటముక్కలు, జల్లల పులుసన్నా, ఎండ్రకాయల చారన్నా ఎంతో ఇష్టం. ఇట్ట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇష్టాలే వున్నాయి. ముఖ్యంగా – మా వూరి గొల్లలు ఎండాకాలం గొర్లకు మేపు దొరక్క నల్లమల కొండలకు తోలుకు పోయేటప్పుడు వాళ్ల ఆడాళ్లు సజ్జ రొట్టెలు కాల్చి బత్తెం కడ్తారు. కుండ పెంకుల మీద పల్చగా ఫెళఫెళ విరిగిపోయేట్లుగా కాల్చిన సజ్జ రొట్టెల్ని అడుక్కొని మరీ మేం తినేవాళ్లం. ఆ రొట్టెల్ని తేనెలో అద్దుకు తిన్నా, లేబాకు బెల్లంలో నెయ్యి కలిపి పూసుకు తిన్నా స్వర్గం కనిపిస్తుంది. ఇంకో రహస్యం – మా ఇందిర ఎన్ని వంటలు చేసినా మా అమ్మ నూరిన ఊరిమిండి ముందు బలాదూరు కావలసిందే.

వంటల గురించి చివరగా ముక్తాయింపు – నేనెప్పుడైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నూనె, మసాలాలతో కూడిన బరువైన ఆహార పదార్థాలు నాలుగు రోజులు తిన్నాననుకోండి-నోరు సవ్వబడుతుంది. కడుపు మందగిస్తుంది. పేగులకు ఏదో జిడ్డులా అంటుకొన్న భావన ఒకటి ఉంటుంది. దానికి విరుగుడు ఏమంటే-ఇంటికి చేరుకోగానే రెండురోజులపాటు రోటి పచ్చళ్లతో ఉడుకుడుకు అన్నాన్ని తినటమే. అప్పటికిగాని నా నాలుక యథాస్థితికి రాదు, కడుపు తేలిక పడదు.

ఒక నవల రాసేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని అనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మీరెలా సేకరిస్తారు? తోలుబొమ్మలాట నవలలో తోలుబొమ్మలు ఆడించేవాళ్ల నోట వచ్చే మాటలు రావటమే సహజంగా ద్విపద రూపంలో వచ్చేస్తాయని రాసారు. ఈ సాహిత్యంతో మీకు పరిచయం ఎట్లా కలిగింది? వాళ్ల మాటలు మౌఖికము, శ్రవణమే గాని గ్రంథస్థం కాదేమో కదా! ఈ సాహిత్యాన్ని మీరెలా సేకరించారు? ఊర్లోని పెద్దల నోళ్ల ద్వారానా? పుస్తకాల ద్వారానా?
కథగానీ, కవితగానీ, నవలగానీ నేను రాసే ఏ రచన అయినా దాన్ని గురించిన సమగ్రమైన సమాచారం పిడికిట్లో వుంటేనే రాస్తాను. అది నాకు పూర్తిగా అనుభవానికి వస్తేనే రాస్తాను. కథగా రాయాలనుకున్న ఓ విషయం అది కథయ్యేసరికి ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ‘తోలుబొమ్మలాట’ నవల కూడా అంతే. 1999 నవంబరులో దాన్ని కథగా రాయాలని నోట్సు తయారుచేసికొన్నా. 2006 కు గాని అది నవలగా రాలేకపోయింది.

తోలుబొమ్మలాటతో నాకు మంచి సంబంధాలే వున్నాయి. ఊర్లోకి కళాకారులు వస్తే మా యింటికి వచ్చి మా నాన్నతో ఎక్కువ సమయం గడపవలసిందే, పురాణపారాయణంలో పాలు పంచుకోవలసిందే. వాళ్ల మాటలు, హావభావ విన్యాసాలు చిన్నతనాన్నించి నాకు ఎరుకే. నేను కథలు రాసే సమయానికంతా బొమ్మలాట ప్రదర్శన మీద జనాలకు మోజు తగ్గింది. అయినా గ్రామాన్ని ఒప్పించి ఆటాడిపోయేవాళ్లు. కథ రాద్దామనుకొన్న సంవత్సరం వూర్లో ఆటాడించాం గాని చివరివరకూ చూసింది కొద్దిమందే. వాళ్లు కూడా వృద్ధులే, వాళ్లతోటి నేనూ. తర్వాత కళాకారులు వూర్లోకి వచ్చినా ఆటాడించేందుకు గ్రామస్తులు సుముఖత చూపించలేదు. అంతో యింతో డబ్బులిచ్చి పంపుతున్నారు. అయితే 2005లో అతికష్టం మీద ఆటాడించాం. తెల్లారి పొద్దు పొడిచేదాకా ఆడే ఆటను కొన్ని గంటలకు కుదించాం. అయినా జనాలు చూడలేకపోయారు. ఆ అనుభవాల నేపథ్యంగా నేను తోలుబొమ్మలాట నవల రాశాను. నవల గురించిన సమాచారం సేకరించేందుకూ, అది రచనగా మనస్సులో ఓ రూపు దిద్దుకొనేందుకూ అంతకాలం పట్టినా, నవల రాసేందుకు మాత్రం నెలరోజుల లోపే పట్టింది.

సింగమనేని నారాయణ మిమ్ముల్ని ‘మనకాలపు మహారచయిత’ గా పేర్కొన్నారు. దానికి మీరెలా ఫీలవుతున్నారు?
ఇప్పటిదాకా నేను సింగమనేని నారాయణ గారిని గురించి చెప్పవలసిన ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన్ను గురించి మాట్లాడకుండా యీ ఇంటర్వ్యూ సమగ్రం కాదు.

కథారచనలో నాకాయన మార్గదర్శకులు. వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, వ్యవసాయ కూలీలు, పంటల గిట్టుబాటు, ఆధునిక పద్ధతులు, ప్రపంచీకరణ ఫలితాలు—–వీటన్నిటినీ అర్థం చేసికొనేందుకు ఆయన నాకు నిఘంటువులా నిలిచాడు. దృశ్యీకరణ చేసి మరీ చూపించేవాడు. నేనొక ప్రశ్న అయి ఆయనకు ఎదురుపడితే చాలు ఆయన మహా ఆనందపరవశుడయి జవాబుగా మారతాడు. అలాంటివాడు ఇప్పుడు నన్నిలా వ్యాఖ్యానించాడంటే నాకు భయమేస్తావుంది. మోయలేనంత బరువును తలకెత్తినట్లుగా వుంది. భవిష్యత్తునిండా ఆయన హెచ్చరికలే వినిపిస్తున్నాయి. నేను రాయవలసిన దానిపట్ల మరింత నిబద్ధత, అంకితభావం కలిగి ఉండవలసిన అవసరాన్ని సూచిస్తోంది. అయన నన్ను గురించి చేసిన వ్యాఖ్యలకు నాదైన అర్థం నాకుంది. నేనింకా విస్తృతం కావాలి. జీవన మూలాల్లోకి చొచ్చుకు పోయి మానవ సంబంధాల మాధుర్యాన్ని అందరికీ చాటాలి. మానవ సంబంధాల్ని మహోన్నతంగా ఆవిష్కరించాలి. ధనికులు, దరిద్రులు, భూస్వాములు, కూలీలు, అగ్రవర్ణాలు, దళితులు, ఆరోగ్యవంతులు, రోగిష్టులు—మనుషుల మద్య యీ అంతరాలన్నీ చెరిగిపోవాలంటే మానవీయత వృద్ధి కావాలి, దాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. ఆయనకు నా పట్ల వున్న నమ్మకాన్ని, ఆశల్ని నేను వమ్ము చేయను. జీవనపర్యంతం అంకితభావంతో, ప్రగతిశీల దృక్ఫథంతో రాస్తూనే ఉంటాను.

వృత్తిరీత్యా మీరు దాదాపు రోజంతా గడిపేది చిన్నపిల్లల మధ్య, ఇంకోవైపు మీ ప్రవృత్తి సాహితీసృజన, మరి పిల్లల కోసం మీరేదైనా రాశారా?
పిల్లల కోసం నేను పాటలు ఎక్కువగా వ్రాశాను. రోజూ ఒక పాటైనా రాసి, పాడి వినిపిస్తుంటాను. అలాగే కథలు కూడా చెప్తాను, కానీ వాటిని ఎక్కడా ప్రచురించలేదు.

———————-
రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

10 Responses to సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 4

  1. నాకు నచ్చిన సన్నపు రెడ్డి కథ – తమ్ముడి ఉత్తరం. సన్నపు రెడ్డితో మీ సమగ్రమైన సంభాషణ బాగుంది. మీరు మరింత మంది రచయితలను, వారి రచనలను మన మిత్రులకు పరిచయం చేయాలని ఆశిస్తూ…

  2. swarupkrishna says:

    సన్నపు రెడ్డి తో ఇంటర్వ్యూ చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. నిజానికి రచయిత సమగ్ర జీవన దృక్పధాన్ని తెలుసుకోకుండా అతని రచనలను అంచనా వేయలేము. మీ కృషికి అభినందనలు. ఈ ఇంటర్వ్యూలు ఆధారంగా సన్నపురెడ్డి కథల గురించిన పరిశోధనకు ఉపక్రమించేందుకు నాకు దారి సుగమమైంది.

  3. swatee says:

    సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.రచయిత కధలే కాకుండా అతని జీవన శైలి కధల అవగాహనకు ఎన్నిరకాలుగానో సహకారిస్తుంది.

  4. swatee says:

    సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.రచయిత కధలే కాకుండా అతని జీవన శైలి
    కధల అవగాహనకు ఎన్నిరకాలుగానో సహకారిస్తుంది.రాయలసీమ జీవనవిధానం, అక్కడి అలవాట్లు,రచయిత జీవనశైలి, కధలు ఎలా అద్దం పట్టాయో రచయిత భావాలూ అవే ప్రతిఫలించాయి సామాన్య మయిన పల్లెప్రజల జీవనం, వృత్తి పట్ల, ప్రవృత్తి పట్ల ఉన్న గౌరవం, ఓ విధమైన కమిట్ మెంట్
    రచయిత వ్యక్తిత్వాన్ని కధలు అద్దం పట్టడం గమనార్హం.
    “నా తరంతోనే అంతరించిపోతూవున్న అచ్చ తెలుగు వాడుక పదాలూ, వ్యవహారాలూ, పలుకుబళ్ళూ, సామెతల్ని సాహిత్యంలో నిక్షిప్తం చేయవలసి వుంది. భవిష్యత్తులో నా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు రాయలసీమ వ్యావసాయక పల్లెదనం ఒక తరంలో పొందిన పరిణామం స్పష్టంగా కంపించాలి. అందుకై నేనింకా కవితలూ, కథలూ, నవలల్ని విస్తృతంగా రాయవలసి వుంది.”

    ఈ బాధ్యత ప్రతి ఒక్కరిదీ కద.
    మొత్తానికి ఒక బృహత్తరమైన కార్యక్రమంగా ఇంట్ర్వ్యూ అందించిన పొద్దు వారు అభినందనీయులు

  5. ఈ ఇంటర్వూ సిరీస్ చాలా బాగుంది. రచయిత గురించి సమగ్రంగా తెలుసుకునేలా చేసింది. సంపాదక వర్గానికి ధన్యవాదాలు.

  6. మిత్రులు సన్నపురెడ్డి ఇంటర్వ్యూ విలక్షణంగా ఉంది..
    సింగమనేని వ్యాఖ్య ‘మనకాలపు మహా రచయిత’… అక్షర సత్యం..
    He deserves it..
    తెలుగు వాడు కాబట్టి ..ఆ విలువ మనకు తెలీడం లేదు..అంతే..
    – రామకృష్ణ

    [ఈ వ్యాఖ్యలో RTS లో ఉన్న వాక్యాలు తెలుగులోనికి మార్చబడ్డాయి. -సం.]

  7. gurivi reddy says:

    athanu racinatuvantivi anni kooda pallalo untdeyuvakulanu alochimpacheseviga untayu

  8. ఉష says:

    “‘నేను-తను‘ కవిత చదివి ఫణీంద్ర ‘సరిహద్దుకిరువైపులా‘ అనే కథ రాశారు” – ఇటువంటి ప్రయోగం నేను ఇదే వినటం, ఇంత సమగ్రమైన ఇంటర్వ్యూ కూడా. పొద్దు సంపాదక వర్గానికి ధన్యవాదాలు.

  9. హెచ్చార్కె says:

    ఇంటర్వ్యూ చాల బాగుంది. ఏక్కడా, దేన్నీ వదిలేసి మరొక ప్రశ్నకు వెళ్లిపోదామనిపించదు. ప్రశ్నలు, వాటికి సన్నపురెడ్డి జవాబులు పాఠకుడిని నిలబెట్టి ఆలోచింజేస్తాయి. అభినందనలు.

  10. రాంనర్సింహ says:

    ఇంటర్వూ చాలా బాగుంది.
    `బోధనేతర పనులు కూడా వ్రుత్తిలో భాగమే` అని చెప్పి “కొత్త దారి” చూపించారు….

    PUTLURIR@YAHOO.COM

Comments are closed.