విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం

– రానారె

[గతభాగం]

{రాయలు}: భట్టుమూర్తీ, మీకో చక్కని చిక్కని సన్నివేశం చెబుతా
{భట్టుమూర్తి} చెప్పండి ప్రభూ
{రాయలు}: ఒక అయిదేళ్ళ పిల్లవాడు. వాళ్ళింటి పెరట్లో చెట్టు మీద పక్షి ఒకటి గూడు పెట్టింది. ఒకరోజు వీడు నిద్ర లేచేప్పటికి ఆ గూట్లోంచి రాత్రి పొదిగి బయటికొచ్చిన పిల్లల కీచు గొంతులు వినిపిస్తున్నై. ఆ సన్నివేశాన్ని కళ్ళకి కట్టినట్టు మీ అలతి పదాలతో లేత కవిత…
{భట్టుమూర్తి} చిత్తం. అదంతా ఆ బాలుడు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడయ్యా అంటే…

ఉ||

చక్కని చుక్కలో, మిసిమి |చంద్రుని చెక్కిలి తున్క లౌనొ యీ
చొక్కపు కూనలంచుఁ కడు |సుందరతన్‌ నిలువెల్ల కన్నులై
తక్కిన లోకమున్ మఱచి |తన్మయుఁడై గనుచుండె బాలుఁ డా
పక్కి సహోదరుల్ కల ర |వమ్ములు జేయుచు సందడించగన్

అంతలో ఇంట్లో నుంచి అమ్మ పిలుపు – ‘ఏఁరా చిన్నోడా, దీపావళి సద్దే లేదు! పటాకులు (టపాసులు) కాల్చలేదేఁ?’

ఊసులఁ జెప్పగ రమ్మని
ఆసగ నను బిలిచి రమ్మ నా సరి మిత్రుల్

అమ్మ – ‘బాగుంది. ఆ గువ్వ పిల్లల నెంత సేపు చూస్తావు? ముఖం కడుక్కొని దోసెలు తిందువు రా’.

దోసెలు నాకొద్దమ్మా
చూసెదనీపిచ్చుకలనె చూడగనిమ్మా

{విశ్వామిత్ర} తక్కిన లోకమున్ మఱచి |తన్మయుఁడై గనుచుండె బాలుఁ డా – బాగుంది. పక్కి సహోదరుల్ – మంచి ప్రయోగం
{గిరి} భట్టుమూర్తీ, భేష్భేష్
{పూర్ణిమ} ఆహా!
{రామకృష్ణారావు}: చాలా బాగున్నాయి.
{పెద్దన} సెబాసో!
{రాయలు}: ఉత్పలమాల అద్భుతంగా కూర్చారు. చొక్కపు కూనలు .. మురిసి ముక్కలయ్యా ననుకోండి.
{చదువరి} సన్నివేశం లాగే చక్కగా లలితంగా ఉంది!
{దైవానిక} భట్టుమూర్తి పిల్లల్లో పిల్లోడు..
{గిరి} అవును, కడు చక్కగా కూర్చబడిన ఉత్పలమాల పద్యము
{పెద్దన} ఉత్పలమాలలో ప్రాసపదాలు అద్భుతం!
{చంద్రమోహన్} ఏవీ మిగిలిన రెండు పాదాలు?
{భట్టుమూర్తి} చంద్రమోహన్ గారూ, చిన్నోడు కాబట్టి సగంసగం కందాల్లో మాట్లాడుతున్నాడన్నమాట 🙂

{రాయలు}: RK గారు .. మీది?
{రామకృష్ణారావు}: ఒక ఐదేళ్ళ పిల్లాడు మొదటి సారిగా వాళ్ళింటి చెట్లో ఒక పక్షి గూడు పెట్టడం చూశాడు..

ఉ:

పుల్లల గూడదెట్లొదవె ? ముచ్చటనా విహగంబు లచ్చటే
యిల్లును కట్టె నెట్లు ? మరి యెప్పుడు వచ్చెను క్రొత్తవైన యా
పిల్లలు ? రెక్కలేవి ? మురిపించుచు నోగిరమందియిచ్చు నా
తల్లి.. యిదేమి వింత ? మన తాతకు తెల్సును చెప్పమందునోయ్.

{గిరి} అంతా ఒకే పద్యంలో భలే ఇమిడ్చేసారండీ
{రాయలు}: అంతే కాదు, తాతా మనవళ్ళ బంధాన్ని కూడ ముడి వేశారు దాంట్లోనే
{పెద్దన} అవును అదే ఆ పద్యానికి కొసమెరుపు!
{రామకృష్ణారావు}: అల్పాక్షరంబుల అనల్పార్థ రచన చెయ్యాలన్నారు మా గురువుగారు
{దైవానిక} బాగు బాగు 🙂
{రామకృష్ణారావు}: ధన్యవాదాలు

{రాయలు}: నా అధ్యక్షతలో ఇదింక చివరి పద్యం .. విశ్వామిత్రా .. ఈ సమస్య మీకు. “నాట్యము జేసె భామ తన నాధుడు తయ్యని తాళమేయగన్”‌.
{విశ్వామిత్ర} మ్, చెప్పండి ప్రభూ

నాట్యము, నాటకమ్ములును నాతికకృత్యము లైనకాలమున్
నాట్యము నందెధ్యాసనిడి, నైష్టిక రీతుల నేర్చినట్టిదై,
నాట్యమయూరమై,తెనుగు నాటను, “అంజలి” నాయికా మణై,
నాట్యము జేస భామ,తన నాధుడు తయ్యని తాళమేయగన్

{గిరి} అంజలి దేవిని, ఆదినారాయణరావుని భలే లాగారండీ పద్యంలోకి
{విశ్వామిత్ర} గిరి, తమరునేర్పిన విద్యయే
{దైవానిక} ఇది కొంపదీసి అంజలీ దేవి కాదు కదా!
{చదువరి} కొంపదీయకుండానే! మంచి చమత్కారం.
{విశ్వామిత్ర} దైవానిక, ఆవిడ ఇంటిపేరు నాకు తెలీదు 🙂
{దైవానిక} 🙂 😀
{రామకృష్ణారావు}: చమత్కరించాలంటే మీ తరువాతే.
{సాలభంజికలు} విశ్వామిత్రా – చమత్కారం అదిరించారు. అంజలి భర్త సంగీత దర్శకుడు కదా?
{భట్టుమూర్తి} సాలభంజికలు – ఔను. భక్తతుకారాం పాటలు, రాజశేఖరా నీపై మోజు తీరలేదురా… పాట ఆయనవే.
{విశ్వామిత్ర} అవునండీ
{పెద్దన} ప్రాసకోసం పాట్లుపడక్కరలేకుండా పదాన్ని నాట్యమయం చేసారు, బావుంది!
{విశ్వామిత్ర} ప్రాసకోసం పాట్లు పడే, చివర్కి ఈ దారి తొక్కాను
{భట్టుమూర్తి} విశ్వామిత్రా, మీ చమత్కారం ఎప్పటికప్పుడు కొత్తగా వుంటూ ఆశ్చర్యపరుస్తుంది
{విశ్వామిత్ర} భట్టుమూర్తి మేనక అందం లాగానా
{భట్టుమూర్తి} విశ్వామిత్రా అలాగే అనుకోండి. మేనక అందాలు తాగినవారు తమరు. మేక పాలు తప్ప ఏమీ ఎరగనివాణ్ణి నేను. 🙂

{పెద్దన} డిశెంబరులో మొక్కుకుని మే నెల్లో తిరపతికెళ్ళి మొక్కు తీర్చుకున్న వాడి సుఖదుఃఖాలు … వర్ణన విందాం. గిరిగారూ, గుండు మొక్కుని తీర్చేసుకోండి మరి!
{గిరి} వినండి

వ. ‘పుష్యమి మాసంలో మొక్కు’

మ.కో.

నా డిశంబరు మొక్కు వేంకటనాథుడేలనొ వెంటనే
రూడి సేసెను చేసి క్లేశములూడ బెర్కెను బెర్కి నా
బోడి గుండుకి హక్కుదారయి పోయె, జుట్టును పెంచి కా
పాడి జూటము జేయు భారము పడ్డదట్టుల నా తలన్

వ. ‘పెరిగిన జుట్టు’

కం.

ఎంతటి శీతల వీచిక
లెంతటి చల్లని తొలకరు లెంతవి గానీ
కుంతల యూధపు శిరమున
కొంతయి తోచును కటకట కొరవడె సుఖమే

వ. ‘ఎండా కాలము’

కం.

మార్చేప్రిలు మే మాసపు
దోర్చేసెడి వేడిసెగల దుఃఖపు టిడుముల్
కార్చిచ్చులు పుట్టించెను
మూర్ఛాలుడనైతి నేను, మూర్ధము మాడెన్

వ. ‘జ్యేష్ఠ మాసంలో కల్యాణ కట్ట దగ్గర ముండనము’

కం.

గుండు ముఖపుటందానికి
ముండనమను తొండి మాట మొండిగ మోసే
దుండగులకు నా నుడువిది
“గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్”

అదీ గుండు పురాణం

{దైవానిక} గిరి గారు, మత్తకోకిల వ్రాసింది మీరొక్కరే అనుకుంటా గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్ 🙂
{పూర్ణిమ} గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్ – భలే! 🙂
{పెద్దన} “గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్” – ఇది గుండున్నంత కాలం నిలిచిపోయే మాట! 🙂

[గిరిగారి ఈ పద్యాలతో సభంతా నవ్వులమయమైపోయింది]

{రాయలు}: తెలుగు భారతికి నమస్కారం. సభనలంకరించి మమ్మల్ని అలరించిన కవిపుంగవులకు నమస్కారం. అభిమానంతో విచ్చేసిన అతిథులకి నమస్కారం. కవివర్యులారా, అతిథులారా, నేనిక శలవు తీసుకుంటాను. మీరు కవితాగోష్ఠియో ఇష్టాగోష్ఠియో కొనసాగించవచ్చు.
{పెద్దన} సభని రక్తిగట్టించిన రాయలవారికి అభివందనం! ఇక స్వస్తి వాక్యం పలికేద్దాము.

“శ్రీ” రాజత్ హృదయారవింద! వర రాశీభూత ధర్మావతా
“రా”! రక్షోగళ నిర్దళాస్థ శరధీ! ప్రాచేతసావిష్కృతా!
“మా”రాకార మనోహరా! హరమనో మందార పుష్పార్చితా!
“శ్రీరామా”! గుణధామ! సామనిగమా! సీతాసమేతా! హరే!

{గిరి} {చంద్రమోహన్} {విశ్వామిత్ర} అద్భుతం
{దైవానిక} జై శ్రీరామ చంద్ర ప్రభుకీ జై
{విశ్వామిత్ర} {చదువరి} {పెద్దన} జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!
{గిరి} ప్రాసపూర్వాక్షరాలలో శ్రీరాముని బాగా కీర్తించారు
{చంద్రమోహన్} అసలెన్ని అలంకారాలు కూర్చారా అని లెక్క పెడుతున్నాను. శ్రీకారం చుట్టి సభను ముగిస్తున్నారు. 🙂
{దైవానిక} ఉద్యమము జేసినవివీ,|| పద్యములా కాదు కాదు , పగడాల్, ముత్యాల్,
{గిరి} సభలో పాల్దొన్న అందరికీ ధన్యవాదాలు
{పెద్దన} Chandra_Mohan: మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని అన్నారు కదా!
{విశ్వామిత్ర} మరో సభకి శ్రీకారం అన్నమాట
{పెద్దన} విశ్వామిత్రా, బాగా చెప్పారు!

[ఈ అభినవాంతర్జాలభువనవిజయంలో వినిపించబడిన మరికొన్ని పద్యాల కోసం కవిపుంగవుల ( ఈ పదంలో కవి శబ్దం పునరుక్తిగా ధ్వనిస్తే నా తప్పేం లేదు 🙂 ) బ్లాగులను సందర్శించండి.]

{చంద్రమోహన్} సమయం ఎలా గడిచిందో తెలియలేదు
{దైవానిక} అవును .. దాదాపు ౫ గంటలు
{అందరూ} అందరికీ నెనరులు, వందనాలు!
{పెద్దన} సర్వే జనాస్సుఖినో భవంతు!
{దైవానిక} జై తెలుగు తల్లి.

**************

కృతజ్ఞతలు

ముందుగా అతిథులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

పొద్దు సంపాదకులు సిముర్గ్ సూచనమేరకు విజయదశమి సందర్భంగా మరో భువనవిజయసభను నిర్వహించాలనే తలంపుతో బ్లాగులోక పద్యకవులకు నెల రోజుల క్రితం ఆహ్వానం పలికాము:


నమస్కారమ్. గత ఉగాది పద్య సమ్మేళనం బహు రంజుగా సాగిన సంగతి మీకు అనుభవమే. ఈమారు విజయదశమి సందర్భంగా మరోమారు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. వేదిక – ‘పొద్దు’లో ఒక కబుర్ల గది. ఈ సారి కూడా మన బ్లాగు కవుల పద్య సమ్మేళనానికి అధ్యక్షత వహించవలసిందని మన రాయలవారిని సంప్రదించాను. సంతోషంగా ఒప్పుకున్నారు. మరీ సంతోషకరమైన విషయమేమిటంటే – ఈసారి భైరవభట్ల కామేశ్వర రావు గారు మనలో ఒకరు. ఇంకా బ్లాగులోక నవ కవిత్రయము రామకృష్ణగారు, చంద్రమోహన్ గారు, దైవానికగారు సభనలంకరించబోతున్నారు. ఈమారు సభలో తాడేపల్లిగారిని, శ్రీరామ్ గారి పద్యాలను కూడా చూడగలమని ఆశిద్దాము.

ఈ రెండవ భువనవిజయాన్ని సాహిత్య, సాకేంతికాంశాలలో మరింత ఆసక్తికరంగా, సౌకర్యవంతంగా జరుపడానికి సర్వం సిద్ధమయినట్లే వుంది. త్వరలో ‘సమస్యలు’ మనల్ని చుట్టుముట్టి ఆహ్లాదపరచబోతున్నాయి. బ్లాగులోక వర్తమానంలో కందమకరందానందపరీరంభులై వున్న మీరంతా “సై”యంటారనుకుంటాను.

నెనరులు,
— రానారె

రానారే రా రమ్మని || తానే స్వాగత కవనపు దారులు పరిచే …” అంటూ ముందుగా లంక గిరిధర్ గారు స్పందించారు.

ఆ వెంటనే భైరవభట్ల కామేశ్వరరావుగారు (మా పెద్దన) …

దసరా సరదా మొదలయె
పసందయిన కందపద్య బ్లాగ్ఝరితోడన్!
ఎసకమెసగ నీ పిలుపుకు
రసికులు సయ్యనకపోదురా, రానారే!
భువన విజయ దశమికి బ్లా
క్కవులకు కవయిత్రులకును(?) ఘన రాయలకున్
సవినయ వందన మిదియే
చవిచూచె(పె)దమింక పద్య సరసామృతమున్!

మా ప్రయత్నాన్ని బలపరుస్తూ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు …

కం||

సరవిన్ బ్రతి ఋతువును వ
త్సరమున కొక్కటియె, పెక్కు | సారులు రా, దీ
వర కవితా ఋతువన్ననొ
అరుదెంచును రెండు మారు | లానందమై.

తెలుగు పండితులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు …

ఆ:-

రామ నాధ రెడ్డి రమ్మని పిలిచిన
భువనవిజయమునకు సవినయముగ
రాక యెట్టులుందు?  రంజిల్లు మనముతో
సై యటంచు వత్తు.  సరస మతిరొ!

గీ:-

భువన విజయాన నిలుచుట పుణ్య ఫలము.
దశమినాడది జరుగును.  ధన్యులమయ.
కవన శరదిందు చంద్రికల్ క్రమ్ము కొనగ,
ఆత్మలానంద మగ్నమై యలరు నయ్య!

ఈ మాటలతో ఉత్తేజితుడైన నవ పద్యకారుడు పాలడుగు శ్రీకాంత్ (దైవానిక) గారి స్పందన: “ఈ భువన విజయం తలుచుకుంటేనే ముచ్చమటలు పడుతున్నాయి. ప్రశ్నపత్రం చూసాక మిడిల్ డ్రాప్ ఉంటది కదా! నాకెందుకో కాస్త భయంగా, కాస్త ధైర్యంగా ఉంది :)”

ఎప్పటిలాగే మాలో స్థైర్యాన్ని నింపుతూ తాడేపల్లివారు:

కం॥

మనకున్ మనమే కవులము,
మనకున్ మనమే చెవులము, మఱి । భయమేలా ?
వెనుకైనను ముందైనను
మనలను గని నవ్వువారు । మనలో లేరే !

కం||

వచియింతు నొక్క వాక్యము,
రుచిరంబుగ వినుఁడు, మనకు రుచి యగు శైలిన్
రచియింతము పద్యములను
వచనమొ, ఛందంబొ, మనకు వలనైనటులన్.

సాధనమున పనులు సమకూరు ధరలోన … అన్నట్లుగా నిర్విరామంగా పద్యాలల్లడాన్ని సాధన చేసి ‘విజయుడైన గిరిధరుని’కీ ప్రశంస కూడా …

కం||

గిరిగారూ ! మీ కవితా
విరచన దినదినమునకును | విస్మయకరమై
సరసమగుచున్నదండీ !
సరాళముగ సాఁగిపొండు | సత్కవి వర్త్మన్

“పొద్దు వారి కొత్త ఉపాయం బాగుంది” అంటూ ఆచంట రాకేశ్వరరావుగారు, “వెంబడి నా పద్యకుసుమం సమర్పించుకొనగల వాడను” అంటూ వికటకవి గారు వర్తమానం పంపించారు.

అంతలో చింతా రామకృష్ణారావుగారి నుండి ఈ పద్యధార …

క||

ఆహ్వానంబందినదయ.
జిహ్వాగ్రమునుండి కవిత  చిందగ,  సభకే
నాహ్వానింతును వాణిని
వాహ్వా యని మెచ్చ జనులు .వరలించెదగా !

శా||

అమ్మా! శాంభవి! నీదు పాద యుగమున్ బ్రార్థించు భాగ్యమ్ము నా
కిమ్మా! యిమ్మహి నెల్ల రూపముల నిన్నెన్నంగ, సేవింపగా
నిమ్మా జ్ఞానము.నా మనంబున సతం బిష్టంబుతో నుండుమో
యమ్మా! మాకు మనోజ్ఞ భవమౌ యాంధ్రామృతం బీయుమా!

క||

అమ్మా! ప్రార్థన వినుమా!
సమ్మానము తోడ మమ్ము సరగున గనుమా!
యిమ్ముగ నాంధ్రామృతమును
సమ్మతి గన జేయుమమ్మ! సజ్జన తతిచేన్.

ఇంకా శ్రీయుతులు తుమ్మల‌శిరీష్‌కుమార్ (చదువరి), చంద్ర మోహన్ (చంద్రిమ), చెణుకుల నిపుణులు విశ్వామిత్ర (ఊకదంపుడు) పాల్గొన్నారు. ఈ-భువనవిజయాధినేత రాయలవారిగా కొత్తపాళీగారు ఎంతో శ్రమనూ సమయాన్నీ వెచ్చించి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ అందరికీ మేమెంతో ఋణపడి వున్నాం. సభాభవన నిర్మాణ శిల్పి మరియు పర్యవేక్షకులు వీవెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.