మురళి ఊదే పాపడు

-దాదా హయత్

ఆవులు ఆనందంగా గడ్డి మేస్తున్నాయి.

కొంతదూరంలో ఒక పిల్లవాడు చెట్టు కొమ్మమీద కూర్చొని పిల్లనగ్రోవి ఊదుతున్నాడు. ఆవులు పాట వింటూ తలూపుతున్నాయి. గాలిలో తేలిపోతున్న పిట్టలు ఎగరడం ఆపి ఆ చెట్టు కొమ్మల మీద వాలుతున్నాయి. ఆకాశంలో ప్రయాణం చేస్తున్న మేఘాలు పాట కోసం దిగొచ్చి, సన్నని చినుకులు రాలుస్తున్నాయి.

ఒక అమ్మాయి బండెక్కి వెళ్తున్నదల్లా అగి పరుగెత్తుకుంటూ వచ్చింది.

“నే నెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీవాళ్ళు నరికిపారవేశారు. రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకూ, నా మురళికీ ఇంకేం పనిలేదు. అది చెప్పడానికే ఉన్నాను. ఇంక నేను వెళతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

పిల్లవాడు మురళి ఊదడం ఆపి ఆమెవంక చూశాడు.

“పాపడా, పాపడా నువ్వెవరివి?” అడిగిందా అమ్మాయి మెరిపించే కళ్ళతో.

“నేనీ ఆవులు కాసే పిల్లవాణ్ణి” కొమ్మమీంచి చెప్పాడు మురళి ఊదే పిల్లవాడు.

“పాపడా, పాపడా, ఆవుల పాపడా పాట ఎందుకు ఆపావు?” అందా అమ్మాయి.

“సూర్యుడు పడమట కుంగిపోతున్నాడు. ఆవులు మళ్ళించే వేళయింది”, అన్నాడు మురళి ఊదే పిల్లవాడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నా కోసం మళ్ళీ ఆ పాట పాడవూ?” అందా అమ్మాయి.

ఆవుల పాపడు మళ్ళీ మురళి పాట పాడాడు. ఆ అమ్మాయి పాట విన్న ఆనందంలో మైమరచి ఆడింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా రేపు మళ్ళీ వచ్చి పాట పాడతావా?” అడిగిందా అమ్మాయి.

“రోజూ ఇక్కడికొస్తాను. ఈ చెట్లలో పుట్టల్లో ఆడతాను. గడ్డి బయళ్ళలో ఆవుల్ని మేపుతాను. ఈ కొమ్మ నెక్కి మురళి పాట పాడతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, అయితే రేపు మళ్ళీ వస్తాను” అందా అమ్మాయి.

మర్నాడు ఆ పిల్లవాడు అదే చెట్టు కొమ్మ మీద మురళి పాట పాడుతున్నాడు.

బండి మీద ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా కొత్తపాట పాడు” అంది.

మురళి ఊదే పాపడు ఆమె కోసం కొత్త పాట పాడాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెట్లలో, పుట్టల్లో ఆడుకున్నారు. పచ్చిక బయళ్ళలో పరుగులు తీశారు.

సాయంత్రం మురళి ఊదే పాపడు చెట్టు కొమ్మనెక్కి మళ్ళీ మురళి పాట పాడాడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నేను రోజూ వస్తాను. రోజూ నాకోసం నువ్వో కొత్త పాట పాడు” అందా అమ్మాయి.

ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి మురళి పాట కోసం ప్రతిరోజూ అక్కడికొస్తోంది. మురళి ఊదే పాపడు రోజూ ఆమెకో పాట వినిపిస్తాడు. ఇద్దరూ చెట్లల్లో, పుట్టల్లో, పచ్చిక బయళ్ళలో మళ్ళీ మళ్ళీ ఆడ్తారు. మళ్ళీ మళ్ళీ మురళి ఊదే పాపడు అ అమ్మాయికి పాట పాడి వినిపిస్తాడు.

వసంతం వెళ్ళిపోయింది,. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వెళ్ళిపోయింది. వానాకాలం వచ్చింది.

వానాకాలం వచ్చింది, వానలు మాత్రం రాలేదు.

ఆవులు ఆకాశం వంక చూశాయి. వానలు మాత్రం రాలేదు.

పచ్చికబయళ్ళు వట్టిపోయాయి.వానలు మాత్రం రాలేదు.

ఒకరోజు అమ్మాయి ఎప్పట్లాగే బండి మీద వెళ్ళింది.

మురళి ఊదే పాపడు గమ్మున కూర్చున్నాడు. అతని చేతుల్లో మురళి జాలిగా చూస్తోంది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా, ఎందుకు ఊరికే కూర్చున్నావు?” అడిగిందా అమ్మాయి.

“గడ్డిబయళ్ళు వట్టిపోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోయాయి. నే నింక పాడలేను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా ఎందుకు గడ్డిబయళ్ళు వట్టిపోయాయి? ఎందుకు ఆవుల డొక్కలు ఎండిపోయాయి?” అడిగిందా అమ్మాయి.

“వానాకాలం వచ్చింది. వానలు మాత్రం రాలేదు. నేల నెర్రెలు చీలింది. వానలు మాత్రం రాలేదు. గడ్డిబయళ్ళు వట్టిపోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోయాయి. నాచేతి మురళి మూగవోయింది. నాపాట కూడా ఆగిపోయింది.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, గడ్డిబయళ్ళు వట్టిపోతే పోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోతే పోయాయి. నువ్వు మాత్రం పాట ఆపకు” అందా అమ్మాయి.

“ఆవుల డొక్కలు ఎండిపోతే నా మురళి కూడా మూగవోయింది. నా పాట కూడా ఆగిపోయింది. నువ్వు మళ్ళీ రావద్దు. పాట పాడమని నన్నడగొద్దు.” అన్నాడు మురళి ఊదే పాపడు.

ఆ అమ్మాయి చిన్నిగుండె బాధతో నిండిపోయింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నేల ఎందుకు చీలింది? వాన ఎందుకు రాలేదు?” అని అడిగింది.

“చెట్లూ పుట్టలూ నరికేస్తున్నారు. మబ్బుకు అలక తెప్పిస్తున్నారు. వానలు అందుకు రామంటున్నాయి. నేలలు అందుకు చీలిపోతున్నాయి.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా చెట్లూ పుట్టలూ ఎందుకు నరికేస్తున్నారు? మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు?” అని అడిగిందా అమ్మాయి.

“అదేమో నాకేం తెలుసు? అది మీవాళ్ళనే అడుగు. చెట్లూ పుట్టలూ వాళ్ళే నరుకుతున్నారు. మబ్బుకు కోపం తెప్పిస్తున్నారు.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“అయితే మరి వాళ్ళేనా పాపడా, పాపడా మరేం దిగులు పడకు. వాళ్ళంతా నావాళ్ళే. మా నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు. ఆయనతో చెప్పి చెట్లూ పుట్టలు నరకడం ఆపిస్తాను. నువ్వేం దిగులుపడకేం” అని చెప్పి అమ్మాయి తన ఊళ్ళేలే నాన్నగారి దగ్గరికి వెళ్ళింది.

“నాన్నగారూ, నాన్నగారూ, ఊళ్ళేలే నాన్నగారూ చెట్లూ పుట్టలు ఎందుకు నరికేస్తున్నారు? మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు?”అని అడిగింది.

“ఎందుకు చెట్లు? ఎందుకు పుట్టలు? భవనాలు కడితే బోలెడు డబ్బొస్తుంది. చిట్టితల్లికి వంటినిండా బంగారం వస్తుంది” అన్నారు ఊళ్ళేలే నాన్నగారు.

“నాన్నగారూ నాన్నగారూ ఊళ్ళేలే నాన్నగారూ నాకు భవనాలొద్దు. నాకు బంగారం వద్దు. చెట్లు నరకడం ఆపించండి. మళ్ళీ వానలు కురిపించండి.” అందా అమ్మాయి.

“ఇలాంటివి చిన్నపిల్లలకు తెలుస్తాయా?నాలుగు చెట్లు నరకనందుకే మబ్బులు మెచ్చి కురుస్తాయా? మబ్బుల విషయం ఆలోచించకు. వెళ్ళి ఆడుకో, ప్రశ్నలు వేయకు” అన్నారు ఊళ్ళేలే నాన్నగారు.

ఆ అమ్మాయి వెళ్ళి ఆడలేదు. విచారపడడం మానలేదు.

మర్నాడు ఆమె వెళ్ళేసరికి మురళి ఊదే పాపడు ఎక్కడికో బయలుదేరుతున్నాడు.

“పాపడా, పాపడా మురళి ఊదే పాపడా ఎక్కడికి నువ్వు వెళుతున్నావు” అనడిగిందా అమ్మాయి.

“నే నెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీవాళ్ళు నరికిపారవేశారు. రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకూ, నా మురళికీ ఇంకేం పనిలేదు. అది చెప్పడానికే ఉన్నాను. ఇంక నేను వెళతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వెక్కడికీ వెళ్ళకు. నువ్వు మరి వెళ్ళిపోతే నాతో ఆడేదెవరు? మురళి పాట పాడేదెవరు” అందా అమ్మాయి.

“చెట్లలో పుట్టల్లో పచ్చిక బయళ్ళలో గాలిమీద సాగుతూ తేలిపోయే నా పాట రాతి గోడలకేసి తలబాదుకోలేదు. నువ్వు నన్నాపకు” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు?” కన్నీళ్ళతో అడిగిందా అమ్మాయి.

ఆ అమ్మాయి ఆ రోజు పిల్లనగ్రోవిని దగ్గర పెట్టుకు పడుకుంది. మబ్బు తునక కోసం ఆకాశం కేసి చూసింది. చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళముందు ఒక్కసారిగా తెరుచుకుంది. ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికెంతో అవతల ఒక సుందరవనం ఆమె కళ్ళకు కనిపించింది.

“చెట్లూ చేమలతో ఈ నేలంతా మురిసిపోవాలి. ఆకాశంలో సాగిపోయే మబ్బులు కిందికి దిగిరావాలి. వానజల్లుతో ఈ నేల తడిసి పునీతం కావాలి. అప్పుడే మళ్ళీ వస్తాను. నా పాట నీకు వినిపిస్తాను.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా పాపడా నన్ను మాత్రం మరచిపోకు” చెయ్యి ఊపుతూ అందా అమ్మాయి.

నేలమీద చెట్లూ పుట్టలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఏ వైపు చూసినా రాతిగోడలు వెలిశాయి. ఊళ్ళేలే నాన్నగారికి డబ్బులు చాలా వచ్చాయి. అమ్మాయికి వంటినిండా బంగారు నగలు తెచ్చాయి.

అమ్మాయి మాత్రం వాటిని తొడగలేదు. దూరంగా నగలు విసిరేసింది.

రోజూ ఆమె ఇంటి మేడమీద పడుకుని ఆకాశం వంక విప్పారిన కళ్ళతో చూస్తుంది. ఒక్క మబ్బు తునకైనా లేదు. ఒక్క వానచినుకైనా రాదు.

వానాకాలం వెళ్ళింది. మళ్ళీ వానాకాలం వచ్చింది. ఆ వానాకాలం వెళ్ళింది. ఇంకో వానాకాలం వచ్చింది. వానలు మాత్రం రాలేదు. మురళి ఊదే పాపడి జాడ లేదు.

ఒకరోజు ఊళ్ళేలే నాన్నగారు కూతురికి ఇష్టమని ఒక పిల్లనగ్రోవి పట్టుకొచ్చారు.

అది చూస్తూనే ఆ అమ్మాయి “వచ్చాడా?” అంటూ ఆత్రంగా గుమ్మంవైపు పరుగెత్తింది.

ఊళ్ళేలే నాన్నగారు ఆమెను పట్టుకున్నారు.

“ఎక్కడికలా పరిగెడతావ్? పరిగెడితే పడిపోతావ్. ఇదిగో పిల్లనగ్రోవి. ఇది చూసైనా దిగులు మానుకో. పారేసిన నగలు తీసి వంటి నిండా పెట్టుకో.” అన్నారు.

ఆ అమ్మాయి ఆ రోజు పిల్లనగ్రోవిని దగ్గర పెట్టుకు పడుకుంది. మబ్బు తునక కోసం ఆకాశం కేసి చూసింది. చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళముందు ఒక్కసారిగా తెరుచుకుంది. ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికెంతో అవతల ఒక సుందరవనం ఆమె కళ్ళకు కనిపించింది.

ఆ నందనవనం నిండా ఎన్నో చెట్లు, ఎన్నో పూలు, ఎన్నో పక్షులు, మురళి ఊదే పాపడు ఒక చెట్టు కొమ్మమీద కూర్చుని మురళి ఊదుతున్నాడు. చుట్టూ కొన్ని వందల వేల ఆవులు పాటకు తలూపుతూ పచ్చిక మేస్తున్నాయి.

అది చూస్తూనే “పాపడా, మురళి ఊదే పాపడా” అని అమ్మాయి కేక వేసింది.

మురళి ఊదే పాపడు పాట ఆపి అమ్మాయి వంక చూశాడు. అతని పెదవుల మీద ఎంతో అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది. దివ్య తేజస్సుతో అతను వెలిగిపోతున్నాడు. “పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వక్కడ ఆకాశంలో ఏం చేస్తున్నావు” అని అడిగిందా అమ్మాయి.

“ఇది ఆకాశం కాదు. ఆకాశం కంటే ఇంకా ఎంతో దూరం. ఇక్కడ రాతిమేడలు లేవు. ఎటుచూసినా చెట్లు. ఎటు చూసినా పచ్చికబయళ్ళు. ఇక్కడ మబ్బులు అలగవు. రోజూ అమృతం కురుస్తూ ఉంటుంది. ఇదొక అద్భుతమైన చోటు” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా, అక్కడికి నువ్వెలా వెళ్ళావు?” అని అడిగిందా అమ్మాయి.

“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. ఇదే నా చోటు. ఇంకెప్పుడూ నేను మళ్ళీ అక్కడికి రాను. కలకాలం ఇక్కడే మురళి పాట పాడుకుంటాను” అంటూ మురళి ఊదే పాపడు మళ్ళీ పిల్లనగ్రోవి అందుకున్నాడు.

ఆ మధురమైన సంగీతానికి మళ్ళీ ఆవులు తలూప నారంభించాయి. మళ్ళీ పిట్టలు గంతులేస్తూ ఎగర నారంభించాయి. మబ్బులు అమృతం కురిపిస్తున్నాయి.

“పాపడా పాపడా నేనూ అక్కడికి వస్తాను” కేకేసిందా అమ్మాయి.

సరిగ్గా అదే సమయంలో ఆకాశం మళ్ళీ మూసుకుపోయింది. పాట మళ్ళీ ఆగిపోయింది.

“పాపడా” అని అరుస్తూ ఆ అమ్మాయి చేతులు చాచి ముందుకు పరుగెత్తింది.

ఆ మర్నాడు ఊళ్ళేలే నాన్నగారు చూసేసరికి ఆ అమ్మాయి రాతిగోడల మధ్య నిర్జీవంగా పడుంది.

ఆమె విసిరేసిన బంగారు నగలు వెలవెలబోయి చూస్తున్నాయి.

ఊళ్ళేలే నాన్నగారు నేల మీద కూలబడ్డారు. ఆ అమ్మాయిని సమాధి చేసిన చోటనే చిత్రంగా ఒక అందమైన చెట్టు మొలిచింది. వానకారు అవసరం లేని చెట్టు. అమృతంతో పెరిగే చెట్టు.

భూమండలం మీద మిగిలిన ఒకే ఒక చెట్టు.

ఆ చెట్టు నీడలో విశ్రమించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూంటారు.

అలా విశ్రమించిన వారికి రహస్యంగా ఒక పిల్లనగ్రోవి పాట వినిపిస్తుందని చెబుతారు.

———————–
దాదా హయత్
దాదా హయత్ ప్రసిద్ధ తెలుగు కథారచయిత, అనువాదకుడు, సమీక్షకుడు మరియు కవి. 1960 అక్టోబరు 10 న కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన దాదాహయత్ విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో సాగింది. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరులోనే న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. “మొదట్లో రాయించింది రచనా కుతూహలం – ఇప్పుడు రాయిస్తున్నది మనిషి జీవితం” అనే దాదా హయత్ 1983లో ‘అహింస’ కథతో రచనావ్యాసంగం ప్రారంభించాడు. తొలి కథతోనే మంచి రచయితగా ప్రసిద్ధి పొందాడు. ఆ కథ ఇతరభాషల్లోకి కూడా అనువాదమైంది. సున్నితమైన భావవ్యక్తీకరణతో జీవితానుభవాలను కథలుగా మలచడంలో హయత్ సిద్ధహస్తుడు. ఇప్పటిదాకా 60 కథలు, 10 కవితలు, అనేక పుస్తక సమీక్షలు రాశాడు. 20కి పైగా కథలను అనువదించాడు. ఈయన రాసిన చాలా కథలు తెలుగులో వచ్చిన ప్రసిద్ధ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అహింస, మసీదు పావురం, ఎల్లువ, ఏటిగట్టు చేపలు, సెగమంటలు వాటిలో కొన్ని. మురళి ఊదే పాపడు కథను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన రచయితకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కథను అందిస్తున్నాం.

About దాదా హయత్

దాదా హయత్ ప్రసిద్ధ తెలుగు కథారచయిత, అనువాదకుడు, సమీక్షకుడు మరియు కవి. తండ్రి ఉద్యోగ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసిన దాదాహయత్ స్వగ్రామం ప్రొద్దుటూరు. 1960 అక్టోబరు 10 న ప్రొద్దుటూరులో జన్మించాడు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోనే న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. "మొదట్లో రాయించింది రచనా కుతూహలం - ఇప్పుడు రాయిస్తున్నది మనషి జీవితం" అన్న దాదా హయత్ 1983లో 'అహింస' కథతో రచనావ్యాసంగం ప్రారంభించాడు. తొలి కథతోనే మంచి రచయితగా ప్రసిద్ధి పొందాడు. ఆ కథ ఇతరభాషల్లోకి కూడా అనువాదమైంది. సున్నితమైన భావవ్యక్తీకరణతో జీవితానుభవాలను కథలుగా మలచడంలో హయత్ సిద్ధహస్తుడు. ఈయన రాసిన చాలా కథలు తెలుగులో వచ్చిన ప్రసిద్ధ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈయన రాసిన ఇతర కథలు కొన్ని: మసీదు పావురం, ఎల్లువ, ఏటిగట్టు చేపలు, సెగమంటలు (http://prajakala.org/mag/2007/03/segamantalu). ఇప్పటిదాకా 60 కథలు రాశాడు. 20 కథలను అనువదించాడు. 10 కవితలు, అనేక పుస్తక సమీక్షలు రాశాడు.
This entry was posted in కథ and tagged , , . Bookmark the permalink.

8 Responses to మురళి ఊదే పాపడు

  1. చక్కటి కథ, చాలా బాగుంది. పొద్దు సంపాదక బృందానికి, రచయితకి అభినందనలు

  2. రాఘవులు says:

    చీకటి ఖండమని చిన్న చూపు చూసినా,ప్రపంచం లోని దరిద్రాలన్నీ అక్కడే
    తిష్టవేసినా,ఆఫ్రికా ఖండం మెల్లగా తన మూలాలను
    వెతుక్కుంటూ,వ్యవస్తీకరిస్తూ,వ్యక్తం చేసుకుంటూ,విశ్వవ్యాప్తంగా ఈ నాడు
    ఎందరికో దోవ చూపుతుంది.తన అతిప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని
    పునఃప్రతిష్టించుకునే క్రమంలో అఫ్రికనులు ఆవిష్కరించుకున్న బ్రహ్మాండమైన
    ఆయుధం ఓరల్ టేల్స్.
    తండాలుగా,గుంపులుగా,చిన్నచిన్న సమూహాలుగా ఇప్పటికీ జీవనం సాగిస్తున్న
    అఫ్రికను సమాజం ఎన్నో రుగ్మతలపట్ల అవగాహన,చైతన్యం
    సృష్టించేందుకు,ముఖ్యంగా,ఎయిడ్స్,పర్యావరణ సంరక్షణలకు ఈ నోటి కధలు చాలా
    శక్తివంతంగా ఉపయోగపడుతున్నాయి.
    దాదాహయత్ రచించిన మురళి ఊదే పాపడు కధ,చదువుతున్నప్పుడు ఆ కధయొక్క లక్షిత
    ప్రేక్షకులూ,రేపటి ప్రపంచవారసులూ అయిన చిన్నారులు అనిపించింది.ఈ కధనూ ఒక
    చక్కని స్వరంతో వినిపిస్తే మరింత శక్తివంతం గా,మనసులకు హత్తుకు పోయేది
    అనిపిస్తుంది.ఎవరన్నా ఆప్రయత్నం చేయగలరా??

  3. Lalithasravanthi says:

    చాలా కాలం తరువాత ఏకబిగిన చదివిన కథ
    చాలా బాగుంది

  4. dadahayath is a famous writer and his ahimsa is also a very good story.please kindly publish it in the coming issues.your poddu is very good and very interesting.keep it.congrates.
    D.Ramachandra Raju
    Tirupati

  5. సుధాకర బాబు says:

    ఈ కధ చదువుతుంటే ఒక దృశ్వ కావ్యం చూస్తున్నట్లు అనిపించింది. ముగింపులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కధ (అనుకొంటాను) “గులాబీ అత్తరు” గుర్తుకొచ్చింది. మన టీవీ ఛానళ్ళ వారు (థూ.. యాక్..) ఇలాంటి ఒక్క కధను కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయరు గదా! అదేమంటే ప్రజలు చూడరంటారు. అసలు వాళ్ళు వేస్తే కదా చూస్తారో లేదో తెలవడానికి?

  6. kishore says:

    కథ చదువుతున్నంత సేపు నిజంగానే ఆ పాప పక్కన కూర్చుని తనే చెప్పుతుంటె వింటున్నట్టు ఉంది. రియల్ ఎస్టేట్ రణరంగం లో అసువులు బాస్తున్న చెట్లు చేమలు ఎన్నో ఎన్నెన్నో! మొన్న ఆ మధ్యన చదివిన ఒకానొక కథలొ ఈ భుమ్మీద మిగిలిపొయిన చివరాఖరి పిచ్చుక గోడు చదువుతున్నప్పుడు కూడ ఎంతో దిగాలుగా అనిపించింది… కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది అని శ్రీ శ్రీ గారు అన్నట్టు ఇలాంటి మరెన్నొ కథలు కవితలు జగమంతా చైతన్యాన్ని నింపాలని కాంక్షిస్తు…

    పొద్దు కు దాదా హయత్ గారికి

    అభినందన అభివందనాలతో

    కిషొర్

  7. కథ చదువుతున్నంత సేపు దృశ్యం చూస్తున్న భావన. కథ చాలా బావుంది . పర్యావరణ పరిరక్షణ అందరి ఆవశ్యకత అని గొప్ప సందేశం ఉంది . బాగా నచ్చింది

Comments are closed.