నా మదిలో … లిరిల్ తాజాదనం!

-రానారె

బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగును ఈ నెల మీ ముందుకు తెస్తున్నాం. చాలా చురుకుగా తరచుగా రాసే కొద్దిమంది బ్లాగర్లలో ప్రవీణ్ ఒకరు. ఈ వ్యాసం కోసం బ్లాగులోని అన్ని టపాలనూ చూడటం సాధ్యం కాలేదు – ముఖ్యంగా ఈ సంవత్సరారంభం నుండి యిటీవలివరకూ వచ్చినవాటిని.

బ్లాగన్నది బ్లాగరును ప్రతిఫలించాలన్న నిర్వచనాన్ని మీరు నమ్మేవారయితే, తెలుగు బ్లాగావరణం నుండి మీరుదహరించగల కొన్నిటిలో సిసలైన బ్లాగు – ఉపశీర్షికలో అన్నట్లుగానే తన ‘మదిలో రేగే ఎన్నో ఆలోచనలను మీతో పంచుకోవడానికి’ ప్రవీణ్ గార్లపాటి వ్రాస్తున్న ‘నా మదిలో…‘.

తెలుగుబ్లాగు గుంపులో చురుకైన సభ్యునిగానూ, తన బ్లాగు ద్వారానూ, అంతర్జాలంలో తెలుగుభాష వ్యాప్తికోసం జరిగే సాంకేతికాంశాల సహాయాల చర్చలలోనూ, ఇటీవలి బ్లాగుపుస్తక రూపకర్తగానూ పాఠకులు నేడెరిగిన ప్రవీణ్, యేడాదిన్నర క్రితం “నేనో గుంపులో గోవిందయ్యని” అంటూ బింకంగా బ్లాగావరణంలో ప్రవేశించారు. “నీ బ్లాగు 3 పోస్ట్‌లతో 6 వ్యాఖ్యలతో (comments) తో కళకళలాడాలి” అన్న ‘అన్నగారి’ ఆశీర్వాదంతో పాటు నెజ్జనుల స్వాగతాన్నీ అందుకున్నారు. ఇక్కడో చిన్న తమాషా వుంది. తెలుగుబ్లాగును ప్రారంభిస్తూ మొదటి టపాలో ఇతనుపయోగించిన తొలి పదం ఏమిటంటే… “ఆఖరికి”.

తొలి టపాకు అందిన వ్యాఖ్యల్లోని సూచనో, లేక అంతకుముందే తీసుకున్న నిర్ణయమో – సమాచార సాంకేతికాంశాలను తొలిసారిగా తెలుగులో చర్చిస్తూ వచ్చిన బ్లాగు ‘నా మదిలో …‘. ప్రవీణ్ వ్యక్తీకరించదలచిన సాంకేతికవిషయాలు వార్తాప్రకటనల్లా చప్పగా కాకుండా స్వీయానుభవంగానో, అభిప్రాయంగానో, జనాభిప్రాయాన్ని తెలుసుకోగోరుతున్నట్లుగానో వుండి, కాస్త చమత్కారాన్నీ మితిమీరని ఉత్ప్రేక్షనూ కలిగిన భాషలో పాఠకుల ముందుకు వస్తాయి. సాంకేతికాంశాల ప్రస్తావన, వాటి గురించిన వివరణ, చర్చల వంటివాటిని పాఠకులతో నేరుగా మాట్లాడుతున్నట్టు ఆసక్తికరంగా నడిపించడంలోని ఒక ప్రత్యేక శైలిని ఈ బ్లాగులో గమనించవచ్చు. “ఈరోజు ఎంత సంతోషంగా వుందో చెప్పలేను” అంటూ మొదలుపెట్టి ఈ కుబుంటు కుటుంబీకుడు చెప్పిన సంగతేమిటో చూచిరండి. “గూగుల్ అంటే నాకు తగని ఇష్టం, గౌరవం…” అనే మాటతో టెక్కీవీరులను స’మావేశ’ పరచిన వైనం కూడా ఈ కోవలోనిదే.

నా మదిలో ...

మైక్రోసాఫ్ట్, యాహూల సమీకరణం గురించి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చిన టపా, ఈ బ్లాగును నిశితంగా చదివే ఒక నెజ్జనుడన్నట్లు, తెలుగు బ్లాగులలో టెక్నికల్ జర్నలిజం మొదలయ్యిందనడానికి ఉదాహరణ. ఈ టపాను వెతికి పట్టుకుంటే పట్టుచీర లేక పట్టుపంచె యిచ్చేటటువంటి పోటీ పెట్టే వుద్దేశం వుందేమో! లేకపోతే పాతటపాల (ఆర్కైవుల)ను ప్రవీణ్ ఎందుకు దాచేసినట్లు? 🙂 “విహరిణుల విపణిలో అండర్ డాగ్” అంటూ ఒపెరాను, “ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీలకు అంకురార్పణ జరుగుతోంది” అంటూ డెస్క్‌టాప్ మీద వెబ్ అప్లికేషన్లని మాష్ చెయ్యగలిగే అవకాశాన్ని కల్పించే అడోబ్ వారి అపోలో, మైక్రోసాఫ్ట్ వారి సిల్వర్లైట్, JavaFX మొదలయినవాటిని పరిచయం చేయడం కూడా టెక్నికల్ జర్నలిజం కోవలోకే వస్తాయని చెప్పవచ్చు.

‘ఓపెన్ సోర్సు’ అభిమానిగా, ఉబుంటు కుటుంబీకునిగా (1 2 3), కంప్యూటర్లలో సమాచారభద్రతపై (1 2 3) ప్రవీణ్ రాసిన టపాలు ఈ విషయాలపై అతని ఆసక్తిని తెలుపుతాయి. ఇంకా చాలా వ్యాసాలే వున్నాయి. వీటన్నిటినీ ట్యాగుల ద్వారానో మరోవిధంగానో విషయానుగుణంగా వర్గీకరించి క్రమబద్ధీకరిస్తే ఈ బ్లాగు ఒక మంచి రిఫరెన్సులా పనికొస్తుంది, తెలుగు గీకువీరులంతా పిచ్చాపాటి మాట్లాడుకునే ‘చర్చబండ’గా మారుతుంది.

మాతృభాషాభిమానానికి సాంకేతికవిద్య, ఉత్సాహము తోడుగా కలిగిన ప్రవీణ్ కొన్ని మంచి ప్రయత్నాలు చేశాడు. బార్ కాంప్ లలో “కుదిరితే తెలుగుబ్లాగుల గురించి, స్థానికీకరణ గురించి మాట్లాడాల”నే ప్రయత్నం, ఉబుంటు స్థానికీకరణ యత్నం, తెలుగు ఎనేబులర్ తయారీ యత్నం వీటిలో కొన్ని. అంతర్జాలంలో తెలుగుకోసం, నేపథ్యంలో టూల్సు (పరికరాలు), సాంకేతిక వనరులు కూర్చటం వంటివాటిల్లో చాలా అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఈ వ్యాసం కేవలం అతని బ్లాగును గురించి కాబట్టి, మిగతా విషయాలను ఇక్కడ ప్రధానాంశాలుగా చూపించడం సందర్భం కాదేమో.

టెక్కు విషయాలనే కాదు, పెక్కు సరదా విషయాలను కూడా వాటి తాజాదనం ఏమాత్రం తగ్గనీయకుండా చెబుతూ వుంటాడు. రాసినవి రాసినట్టుగా కాదు, నేరుగా చెబుతూవున్నట్టు వుంటాయి. వీడియోలు ప్రతి విషయాన్నీ కళ్లకు కట్టలేవు. కొన్ని సంగతులు మాటల్లోనే వినాలి/చదవాలి. తన మొదటి స్టేజి ప్రదర్శన గురించి చెబుతూ, “మాంచి ఊపు మీద స్టెప్పులేసేస్తున్నాం. లెక్చరర్లందరూ ఆ అని నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు, వీళ్ళేసే సాంగులేంట్రా అని. ఇంతకూ మేము డాన్సులేసింది – మొదటి పాట …” ఏమిటి? ఆ నాట్యప్రదర్శనను మీరే తిలకించండి/ఆలకించండి. ఈ ప్రదర్శనకు రెండేళ్లముందరి తన పరిస్థితిని వినిపిస్తూ, “అదో గడ్డు కాలం. ఎందుకో నాకు సడన్ గా చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అందరూ IIT లకి ప్రిపేర్ అవుతుంటే నేను లైట్ గా తీసుకున్నాను. అందుకే ఎంసెట్ ఎగిరింది.” ఫక్తు ఇంజనీరింగ్ విద్యార్థుల తెలుగుమాటలతో తన క్రికెట్ కెరీర్ను వర్ణిస్తూ రాసిన ఈ టపాతో పాతజట్టు మళ్లీ తయారయినా ఆశ్చర్యంలేదనిపిస్తుంది.

తల్లి సాన్నిహిత్యంలో ప్రతివాళ్లూ చిన్నపిల్లలే కదా! అలాంటి పిల్లలు డైరీ రాస్తే, అందులో ఒక పేజీ ఎలావుంటుందో ఊహించండి. వీళ్ళు ఒకోసారి డైరీ రాయడం మానేస్తామని బెదిరిస్తారు కూడా! 🙂 ఒకోరోజు పనికి ఎగనామం పెట్టేస్తారు. ప్రయోజనకరమైన కవితాత్మకత తొంగిచూసే రచనలు చేసినా, యాభైయైదు మాటలతో కథ వంటి ప్రయోగాలు చేసినా, ఉత్కంఠభరిత కథనాలను నడిపించగలిగినా, చక్కని విశ్లేషణలతో పాఠకుల ప్రశంసలందుకొన్నా, ఆరోగ్యకరమైన విజ్ఞానదాయక చర్చలతో ఔత్సాహిక టెకీలను కూడగట్టినా, సరదాగా సినీనటుల డాన్సులపై విశ్లేషణ చేసినా, “నాకెదురయిన సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, షెర్లాక్ హోంస్, రాబిన్ కుక్ ఏదీ వదిలిపెట్టను” అనే పాఠకునిగా పరిచయం చేసుకున్నా, సగటు అభిమానిగా చిరంజీవిని చిరంజీవిగా వర్ధిల్లమని దీవించినా, హ్యారీపోటర్ పుస్తకశృంఖల ఆగిపోయిందని చింతించే పాఠకునిగా “హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్” ను పరిచయం చేసినా, ఒక జ్ఞాపకంవంటి చిన్న ట్రావెలాగ్ రాసినా… ‘లిరిల్ తాజాదనం’ లాంటి అనుభూతిలో బ్లాగులోకాన్ని అలవోకగా ముంచివేయగల సమర్థత ఈతని రచనల్లో కనిపిస్తుంది. మనసులోని అనుభూతిని మార్పేమీ లేకుండా మనకు చేరవేసే రచనా శక్తి ఈ బ్లాగులో పుష్కలంగా కనిపిస్తుంది దాదాపుగా అన్ని టపాల్లోనూ. “23 ఏళ్ళ జీవితాన్ని కేవలం 40 లైన్లలో చూపించడ”మంటే మాటలా? ఔను మాటలేనని మీరూ అంగీకరిస్తారు – పై లంకెలననుసరించి ఒక్కసారి అలా ఈ బ్లాగరు మదిలోనికి చూసిరండి.

విషయం సాంకేతికమైనా, సామాజికమైనా, వ్యక్తిగతమైనా వ్యాసాల నిడివి మాత్రం ఒకటి రెండు పుటలకు మించదు. వారానికి కనీసం ఒక కొత్త టపానయినా ఈ బ్లాగునుంచి ఆశించవచ్చు. ఇంతా చెప్పాక, విషయ వైవిధ్యానికి ఈ బ్లాగులో లోటేమీ వుండదని చెప్పడం పునరుక్తే అవుతుంది.
ప్రవీణ్ గార్లపాటి

ప్రవీణ్ రచనల్లో మంచి హాస్యంకూడా అంతర్లీనంగా వుంటుంది. “మా అమ్మ నాకు దిష్టి తీసింది. ఎప్పుడూ లేంది వీడు ఇంటికి రాగానే సుబ్బరంగా తిని కంప్యూటర్ తెరవకుండా పడుకుంటున్నాడేంటబ్బా? అని. తర్వాత చెప్పా డాన్సు చేస్తున్నా అని. ఆ.. అని కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము అనే లుక్కించింది.” ఇలా ఒకోసారి హాస్యం అంతర్లీనంగా వుండదు. నేరుగా కనిపించి నవ్విస్తుంది. అన్నట్టు ‘హాథీకా అండాలా’ అంటే యేమిటో మీకు తెలుసా? 🙂 తెలిస్తే చెప్పండి.

ఓపెన్ సోర్స్ ఉచితమా? అనే టపాకు ఒక పాఠకుడు స్పందిస్తూ “… ఇన్నాళ్లూ భ్రమలో వున్నాను. నా కళ్లు తెరిపించినందుకు…” అంటూ చేసిన వ్యాఖ్య, దానికి స్మైలీతో ప్రవీణ్ సమాధానం, ఆ సమాధానమిచ్చేటప్పుడు అతని మనః స్థితిని ఊహిస్తే మీకు చిరునవ్వు రాక మానదు. నాకు యాదృచ్ఛికంగా కంటబడిన మరో రెండు ఆరాధనాపూర్వక ప్రశంసలు ఇవి: (1 2). వంద టపాలు పూర్తయిన సందర్భంగా అందరూ కలిసి ఈ బ్లాగుకు శతటపోత్సవం నిర్వహించారు. అందులో చూడండి ఈ బ్లాగును ప్రారంభింపజేసిన నవీన్‌గారు మరియు క్రమంతప్పకుండా చదివిన పాఠకులూ ఏమన్నారో…!!

నేను నేనే! (1), ఈ జెనరేషన్ తప్పేంటి? (2), ఇంజినీరూ డాక్టరేనా? (3), నువ్వెంత? నేనెంత? (4), ఆయ్… మేమంటే అంత చులకనా!? (5), ఏమిటిది??? (6), రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుంది అంటే నేను అసలు ఒప్పుకోను (7), ఐఐటీలూ మేథోవలసలూ (8), ఎప్పటికయినా రిజల్యూషను చేసుకోవాలని ఒక రిజల్యూషను చేసుకోవాలేమో 🙂 (9) …. ఇలా … ‘కుఱ్ఱతనం’ అని పెద్దలతో అనిపించే మాటలు, ప్రశ్నలు, సందేహాలు, ఒకింత పొగరున్నట్టు కనిపించే స్టేట్మెంట్లు, అభిప్రాయాలు, మనసులోని మధనాలు, జీవితానికి అర్థం వెతుక్కునే ప్రయత్నాలు ఇంకా చాలానే చూడవచ్చునిక్కడ. ‘యువత’ అనే మాటకు ఒక రూపం చూడాలంటే ఈ’ మదిలో‘నికి తరచిచూడండి. ఆఫ్టరాల్, బ్లాగన్నది వ్యక్తి తన వాణిని వినిపించడానికే కదా వున్నది!

తెలుగులో పేరొందిన మిగిలిన బ్లాగులనన్నిటినీ – సుమారుగా, ‘రచయితల బ్లాగులు’ అని వర్గీకరించవచ్చు. అవి వ్యక్తుల బ్లాగులు కావు. అంటే, వారు ఏదో ఒక ప్రత్యేకాంశానికి పరిమితమైపోయారు. బ్లాగన్నది బ్లాగరును ప్రతిఫలించాలన్న నిర్వచనాన్ని మీరు నమ్మేవారయితే, తెలుగు బ్లాగావరణం నుండి మీరుదహరించగల కొన్నిటిలో సిసలైన బ్లాగు – ఉపశీర్షికలో అన్నట్లుగానే తన ‘మదిలో రేగే ఎన్నో ఆలోచనలను మీతో పంచుకోవడానికి’ ప్రవీణ్ గార్లపాటి వ్రాస్తున్న ‘నా మదిలో…‘.

—————————–
రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

8 Responses to నా మదిలో … లిరిల్ తాజాదనం!

  1. సముచిత సమీక్ష. టెక్కీ టాపిక్కులంటే ఆలోచించి చదివే నేను ప్రవీణ్ టపా చూస్తే దూకి చదువుతా. ఆయన బ్లాగుకో వ్యక్తిత్వం ఉంది. అభినందనలు.

  2. ramya says:

    నా మది లో నేనూ ఇష్టం గా చదివే బ్లాగు. సాగదీయకుండా క్లుప్తంగా టపాలు బాగుంటాయి. సాదా సీదా బాష హాయిగా ఉంటుంది.పూలదండ లో దారం లా హాస్యం.

  3. రమ్య says:

    నేనూ ఇష్టం గా చదివే బ్లాగు. సాగదీయకుండా క్లుప్తంగా టపాలు బాగుంటాయి. సాదా సీదా బాష హాయిగా ఉంటుంది. పూలదండ లో దారం లా హాస్యం.

  4. radhika says:

    నేను సాంకేతిక బ్లాగులు అట్టే చదవను.కానీ ప్రవీణ్ బ్లాగు నుండి పోస్టు వచ్చిందంటే తప్పక చదువుతాను.అవి నాకర్ధం కానీ టెక్నికల్ విషయాల గురించయినా సరే.ఎందుకంటే నాలాంటి నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా కాస్త అర్ధమయ్యేలా చెపుతారు కాబట్టి.నేను ఆర్చివ్స్ గురించి ప్రవీణ్ గారికి రాద్దామని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను.ఏదన్నా పోస్టు చూడాలనుకుంటే వారి సెర్చ్ బాక్సులో వెతుక్కోవాల్సి వస్తుంది.నాలాంటి వారికి వీలుగా ఆర్ఖీవ్స్ పెడితే బాగుంటుంది.రానారేకు అభినందనలు.క్లుప్తం గా బ్లాగు మొత్తం అందించారు.

  5. నా బ్లాగుని అంత దగ్గరగా చూసి, ఓపికగా టపాల లంకెలతో సహా రాసిన రానారె కి కృతజ్ఞతలు.

    నా జీవితంలో నాకెంతో తృప్తినిచ్చినవి తెలుగు బ్లాగులు. నా సహ బ్లాగరుల వ్యాఖ్యలు, స్నేహం నాకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తాయి.
    మీ అందరి వ్యాఖ్యలకూ ధన్యవాదాలు.

    అన్నట్టు ఈ సమీక్షలో నాకు బాగా నచ్చింది నా బ్లాగు లోని ఎసెన్సు సరిగా పట్టడం. 🙂

    పొద్దుకి నా కృతజ్ఞతలు.

  6. చాలా చక్కని సమీక్ష.. Great job రానారె గారు!!

    నేను బ్లాగ్ప్రపంచంలోకి కాలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఫేవరెట్స్ లో యాడ్ చేసుకున్న బ్లాగ్ ‘నా మదిలో’.. ఎంతో సరళంగా, హాస్యంతో నిండి ఉండే ప్రవీణ్ గారి టపాలు ఇట్టే ఆకట్టుకుంటాయి.. ‘మన్మధుడు మళ్ళీ చూశాను ‘, ఇంకా మొన్న మొన్న రాసిన ‘మీరు సినిమాలు చూస్తారా?..’ టపాలు చదువుతుంటే నా మనసులోని ఆలోచనలు ఈయనకెలా తెలిసాయబ్బా అన్న ఫీలింగ్.. అంత దగ్గరగా అనిపిస్తాయి ఆయన భావాలు!! Please continue the great work..

  7. Vijay kumar says:

    నా మదిలో అన్న మీ బ్లాగు చాలా బాగుంది.ప్రతి ఒక్కరికి సులభంగా అర్థం చేసుకునేలాగ వుంది. మీరు రాసే ప్రతి ఆర్టికల్ ను నాకు మెయిల్ పంపండి. అలాగే మీకు సమయం ఉంటే కొంచం నా బ్లాగును కూడ చదివి మీ సలహాలు ఇవ్వగలరని మనవి.

  8. Vijay kumar says:

    నా మదిలో అన్న మీ బ్లాగు చాలా బాగుంది.ప్రతి ఒక్కరికి సులభంగా అర్థం చేసుకునేలాగ వుంది. మీరు రాసే ప్రతి ఆర్టికల్ ను నాకు మెయిల్ పంపండి. అలాగే మీకు సమయం ఉంటే కొంచం నా బ్లాగును కూడ చదివి మీ సలహాలు ఇవ్వగలరని మనవి.
    http://loveisgreat.mywebdunia.com

Comments are closed.