తోటరాముడితో ఇంటర్వ్యూ

గౌతమ్ (తోటరాముడు)

“తోటరాముడు” – పాతాళ భైరవిలో ఎన్.టి.ఆర్ పోషించిన పాత్ర పేరట. ఓ పదేండ్ల ముంగట గదే పాత్రను తనికెళ్ళభరణి డిసైడ్ చేసిండంట. సినిమా పరిజ్ఞానం బాగా ఉండి కూడా, “తోటరాముడ”నగానే బ్లాగ్లోకులకు గుర్తొచ్చేది మాత్రం “రెండు రెళ్ళు ఆరు” బ్లాగుకర్త డి.ఎస్. గౌతమ్. ఎక్కడా ఎక్కువగా కనిపించని గౌతమ్, పలకరించగానే ఎన్నో అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. విశేషాభిమానాన్ని చూరగొన్న ఈ బ్లాగరి అంతరంగం -కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులుగా!

తోటరాముడు తోటరాముడెలా అయ్యాడు?

జంధ్యాల గారి తర్వాత, తివిక్రమ్ వచ్చే ముందు తెలుగు సినిమాలో కొద్దో గొప్పో హాస్యాన్ని పండించింది దివాకర్ బాబు అనీ ఒక మాటల రచయిత. యమలీల సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర “తోటరాముడు” వీరి సృష్టే. ఆ సినిమాని కేవలం తోటరాముడి కోసం రెండు మూడు సార్లు చూశాను, కృష్ణ డాన్స్ ఉన్నా సరే! నేను స్కూల్లో ఉండగానే వచ్చినదనుకుంటా, బ్లాగు పెట్టినప్పుడు “తోటరాముడు” ఉండాల్సిందే అనుకున్నాను. అలా పెట్టాను.

ఇప్పుడు గౌతంగా కన్నా మీరు “తోటరాముడు”గానే వ్యవహరించబడుతున్నారు.. తెలుసా?

హుమ్మ్.. తెలుసు. ఆ పేరు పెట్టిందే అందుకు.

“రెండు రెళ్ళు ఆరు” అని పెట్టడానికి కారణం..?

నా బ్లాగు టెంప్లేటూ అవీ సెట్ చేసుకుని, ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా “రెండు రెళ్ళు ఆరు” సినిమా డీవీడీ కనిపించింది. అంతే.. పెట్టేసాను, ప్రత్యేక కారణాలు లేవు.

జంధ్యాల అభిమానిలా అనిపిస్తారు.. మీ బ్లాగు పేరు కూడా వారి ప్రముఖ సినిమాల్లో ఒకటి. మీమీద వారి ప్రభావం గురించి చెప్పండి.

జంధ్యాల ఒక్కొక్క సినిమా మీరు ఎన్ని సార్లు చూసారో నాకు తెలియదుగానీ.. నేను తప్పకుండా మీకన్నా ఓ నాలుగైదు సార్లు ఎక్కువే చూసుంటాను. ఆయన రాసిన ప్రతి సంభాషణ నేను నవ్వుకోవటానికే రాసారేమో అన్నంత సాన్నిహిత్యం ఏర్పడిపోయింది ఆయన రచనల/సినిమాలతో! అడిగారు కాబట్టి, ఏదో రెండు ముక్కలు చెప్పడానికి ప్రయత్నించానుగానీ, లేకపోతే ఓ పది టపాలయినా పడుతుంది, ఆయన గురించి నా అనుభవం చెప్పాలంటే.
(నవతరంగం వాళ్ళు వింటున్నారా? ;-))

అసలు బ్లాగెందుకు పెట్టాలనిపించింది?

నేను ఇంగ్లీషులో బ్లాగులు గత మూడేళ్ళుగా చదువుతూ ఉన్నాను. అప్పటిలో నా ఫ్రెండ్స్ సర్కిల్ కోసం కొన్ని కథలు రాసేవాడిని. ఇంటర్నెట్లో తెలుగులో రాయటానికి ఏవఁయినా avenues ఉన్నాయేమో వెతుకుతుండగా కొన్ని బ్లాగులు దొరికాయి. నేను మొట్టమొదటిసారి చూసిన బ్లాగు పేరు – “మూసుకు కూసోరా పూలసొక్కా”! ఆ బ్లాగు ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, ఎవరు రాసేవారో కూడా గుర్తు లేదు. (ఆ బ్లాగు ఇక్కడ -http://www.mkps.org/cgi-bin/blosxom.cgi- ఉండేది. ప్రస్తుతం ఈ లింకు వేరే సైటుకు పోతోంది. -సం) ఆ తరువాత తేనెగూడు, కూడలి పరిచయమయ్యాయి…తెలుగులో కూడా బ్లాగులు ఉన్నాయి అని తెలుసుకున్న తరువాత తెలుగులో స్క్రిప్టు ఎలా రాయాలో తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాను. ఇక్కడ నేను చెప్పదలచుకున్న ముఖ్య విషయం – తెలుగులో బ్లాగు అనే కాన్సెప్టు ఇంతగా వృద్ధి చెందటానికి కారణం లేఖిని అని నేను నమ్ముతాను..I tip my hat to Veeven!

తెలుగు సాహిత్యంతో మీ అనుబంధం? ప్రత్యేకించి హాసం పత్రికతో?

నేను తెలుగులో మొట్టమొదట చదివినది నా చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను తిడుతూ రాసిన పద్యం. నేను చిన్నప్పుడు, సాహిత్యం అని చెప్పను గాని, బాలమిత్ర, బాలజ్యోతి ఒక addict లాగా చదివేవాడిని. వీటి తరువాత తెలుగు చదివింది హాసం ద్వారానే! ఆందులో నా జీవితానికి lifeblood లు అయిన సంగీతం, హాస్యం, సినిమాలు కలబోసి ఉండేవి. దానికితోడు రావికొండలరావు, ఎమ్బీయెస్ ప్రసాద్, తనికెళ్ళ భరణి లాంటి దిగ్గజాలు తరచుగా రాసేవాళ్ళు. తెలుగు సాహిత్యం అంటూ చదవటం ప్రారంభించింది ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే. నిజం చెప్పాలంటే నేను బ్లాగు ప్రారంభించాకే తెలుగులో విరివిగా చదవటం జరిగింది. చదివిన వాటిల్లో మహ్మద్ ఖదీర్ బాబు రాసిన పోలేరమ్మబండ కథలు, నామిని రాసిన ‘పచ్చనాకు సాక్షిగా ‘ నాకు అత్యంత ఇష్టమైనవి. అఫ్‌కోర్స్, ముళ్ళపూడి రమణ గారి సాహితీ సర్వస్వం నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్…అన్నీనూ.

మీ బ్లాగును హాస్యరచనకే పరిమితం చేయడానికి గల కారణాలు..

నాకు సీరియస్ చర్చలపై పెద్ద నమ్మకం లేదు. నేను ఏదో వాదిస్తుంటే, అవతలి వాడు వాడిదే పట్టు అని కూర్చుంటే, దాని వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటాను. Not that I don’t have strong opinions about anything. కానీ నా బ్లాగు అందుకు సరైన వేదిక కాదని నమ్ముతాను.

“రెండు రెళ్ళు ఆరం”టే మీ దృష్టిలో ఏంటి?

చాలా వ్యక్తిగతమైన సన్నిహితమైన స్నేహం. నేను నా అప్తులతో, సన్నిహితులతో ఒక వ్యక్తిగా ఎలా (సరదాగా) ఉంటానో నా బ్లాగుతో కూడా అంతే.

దినకర్ పాత్రను(?) ఎలా మలిచారు? ఆ పాత్రపైనే అధికంగా ఆధారపడుతున్నారన్న విమర్శకి మీరెలా స్పందిస్తారు? (స్పందిచాలనుకుంటే.. )

నాకున్న అత్యంత సన్నిహితుల్లో దినకర్ ఒకడు. వాడి పాత్రను ఎలా మలచానూ అంటే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను అది కాన్షస్‌గా చేసినది కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను దినకర్ గురించి రాసే విషయాలకు వాడు బాధపడడా అని అసంఖ్యాకమైన ఉత్తరాలు వచాయి నాకు (అసంఖ్యాకమైన=1). నేను రాసినవి అందరికన్నా ఎక్కువ ఆస్వాదించేది వాడే (వాడికి అర్థం కాకపోయినా). వాడు పని చేసే కంపెనీలో భాషా భేదం లేకుండా వాడికి తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డు చేస్తాడు నా టపాలు. సో, నా బ్లాగులో వాడి ఫొటో పెట్టినా బాధపడడు.

ఎంతో మంది ప్రశంసిస్తున్న ఈ బ్లాగు మీ మీద ఒత్తిడి పెంచిందా? మీకొస్తున్న ప్రశంసల వెల్లువను గమనించినప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే స్థాయిలో ప్రతి టపా ఉండాలంటే, అందులోనూ హాస్యం అంటే, కష్టమనిపించదూ!?

నేను నా బ్లాగులో వచ్చిన కామెంట్స్‌కి రెస్పాండ్ అవ్వకపోవటానికి కారణం.. ఎలా ఇవ్వాలో, ఏం చెప్పాలో తెలీకపోవటమే! “థాంక్స్ అండి” అని చెప్తే నన్ను నేను మెచ్చుకోవటమల్లే అనిపిస్తుంది. అందుకే బదులివ్వను. నేను రాయడానికి కూర్చున్నప్పుడు, నా మూడ్, నా సెన్సిబిలిటీస్ బట్టి రాస్తానే తప్ప, అంతకు ముందు ఎవరేం అన్నారన్నదాన్ని బట్టి రాయలేను. అందుకే నా ప్రతీ టపాలో ఎవరో ఒకరు, “ఇంకా బాగా రాయండి, మునుపటి వాటంత బాలేవివీ” అని చెప్తూనే ఉంటారు. ఒత్తిడన్న సమస్యే లేదు.

ఈ ఏడాది బొత్తిగా మూడే టపాలు రాయడానికి కారణాలు?

కేవలం నా సోమరితనం..అంతే!

ఇంతిలా ఎలా రాస్తారండీ బాబూ…!?

I DON’T KNOW

బ్లాగ్లోకంలో హాస్యాన్ని ఇంతగా విరగ పూయిస్తున్న మీకు, సినీ, సాహిత్య రంగాల్లో ప్రవేశించే ఆలోచన ఉందా? -ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హాస్యపులోటుని భర్తీ చేయడానికి?

రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకోవటం గురించి ఇంత వరకు ఆలోచించలేదు..మీరు అడిగిన “హాస్య విభాగంలో కొరతలు పూర్తి చెయ్యటం” లాంటి పెద్ద విషయాల గురించయితే ఖచ్చితంగా ఆలోచించలేదు. నాకు ప్రతి రోజూ రాయాలని ఉంటుంది, కానీ పేపర్ మీద పెన్ను పెట్టటం అనేది ఎప్పుడు, ఎందుకు చేస్తానో నిజంగా తెలియదు.

మీరు ఇష్టపడే బ్లాగులు, తెలుగులో లేక ఇంగ్లీషులో?

చాలా చదువుతాను. ఇంగ్లీషులో greatbong.net, bosey.co.in, dilbert.com/blog. తెలుగులో రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి. ఈ మధ్యకాలంలో వచ్చిన బ్లాగుల్లో చేగోడీలు, అశ్విన్ బూదరాజులవి చూస్తాను. ఈ క్షణాన గుర్తు వచ్చిన బ్లాగులివీ, ఇంకా కూడా చదువుతాను. ( రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన.)

మీ బ్లాగులో మీ కత్యంత ఇష్టమైన టపా?

నా మొదటి టపా.. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో రాశాను దాన్ని.

తోటరాముడి బ్లాగులో మరిన్ని నవ్వుల పండుగలు జరగాలని కోరుకుందాం!

————————

ఇంటర్వ్యూ చేసినవారు: పూర్ణిమ తమ్మిరెడ్డి

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

31 Responses to తోటరాముడితో ఇంటర్వ్యూ

  1. Srujana says:

    నాకు రచయతల రచనలే కాని రచయతలతో సంబంధం లేదు అని ఎప్పుదో ఎనిమిధెళ్ళ క్రితమే తీర్మానించేసుకున్నన్ను….
    వారిలోని విద్వత్తు…కళ…మాత్రమే నాకు ప్రీతి పాత్రం..ఆ మనిషి కాదు అని నొక్కి వక్కానిస్తూ ఉంటా ఎప్పుడూ….
    కాని నూటికో కొటికో ముల్లపూడి వెంకట రమణ గారి లాంటి ఒక రచయిత మాత్రం నాకు ఈ రచయత అంటే కూడా బోల్డంత అభిమానం..ఆయన రచన వల్లే కాదు ..ఆయన వ్యక్తిత్వం వల్ల, అనిపించేలా ఉంటారు…
    అటువంటి వారిలో గౌతం ఒకరు….
    ఆయన బ్లాగ్..ఆయన పండించే హాస్యం….ఆయన కి ఉన్న పేరు..ఆయనకి చెందిన ప్రసంశలు ఇవన్నీ పక్కన పెడితే
    నాకు ఉన్న అతి తక్కువ పరిచయం లోనే ఒక వ్యక్థి గా తన Attitude తో తన sensibility తో మా ముల్లపూడి వారి పక్కన చేరిపొయారు….

    అంతగా మెప్పించిన ఆ Attitude కి మచ్చుతునక ఈ సమధానం

    నా మూడ్, నా సెన్సిబిలిటీస్ బట్టి రాస్తానే తప్ప, అంతకు ముందు ఎవరేం అన్నారన్నదాన్ని బట్టి రాయలేను. అందుకే నా ప్రతీ టపాలో ఎవరో ఒకరు, “ఇంకా బాగా రాయండి, మునుపటి వాటంత బాలేవివీ” అని చెప్తూనే ఉంటారు. ఒత్తిడన్న సమస్యే లేదు.

    సార్ వేసుకొండి వీర తాడు

  2. రాఘవ says:

    నేను చాలా ఎక్పెక్ట్ చేస్తేనో… చాలా తేలికగా లేపేశారే ఇంటర్వ్యూని! ఉన్నవి తక్కువే ఐనా చెణుకులు బావున్నై.

    రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన. హహ్హహ్హ 😀

    వామ్మో. దినకర్ నిజంగానే ఉన్నారా? నమ్మశక్యంగా లేదు.

    నిజమే. ఇన్‌స్క్రిప్ట్‌లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు బ్లాగులు అనే శరీరానికి లేఖిని కిడ్నీ 😉

  3. గౌతం గారిని పట్టి మా అందరికీ పరిచయం చేసిన పూర్ణిమ కి అభినందనలు…
    గౌతం గారూ, మీకున్న అసంఖ్యాకమైన అభిమానుల్లో నేను ఒక్కడిని 🙂

  4. ప్రపుల్ల చంద్ర says:

    మరీ చిన్న ఇంటర్వ్యులా అనిపించినా, చాలా బాగుంది. తన బ్లాగ్ లో తప్ప ఎక్కడా కనపడరు కాబట్టి ఇంకా కొద్దిగా ఉంటే బాగుంటుందనిపించింది అనుకుంటాను!!!
    తోటరాముడు గారు… మీరు మరీ తక్కువ టపాలు వ్రాస్తున్నారు… మీ అభిమానులం చాలా ఎదురు చూస్తూ ఉన్నాం..
    కష్టపడి ఇంటర్వ్యూ చేసినా పూర్ణిమ గారికి ధన్యవాదాలు….

  5. మనోహర్ says:

    మంచి ఇంటర్వ్యూ….

  6. అయ్యో.. అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా.. 🙁
    ఎదురు చూసినంతసేపు పట్టలేదు 🙁
    గౌతం గారూ.. మీకెప్పుడు రాయాలనిపిస్తే అపుడే రాస్తారు కాబట్టి.. మీకు రాయాలనీ తరచుగా అనిపించాలని కోరుకుంటాం మేమందరం.
    ఇప్పటి దాక ఎంతోమంది చెప్పి ఉంటారు మీకు. అయినా మళ్ళీ చెప్తున్నాను. మీ పోస్ట్స్ చదివీ చదివీ.. కడుపులో నొప్పి వస్తుందండీ బాబూ 🙂
    జంధ్యాల గారి సినిమాలు ఇక రావు అన్న లోటుని మీ రెండు రెళ్ళ ఆరు తీరుస్తుందని ‘పొద్దు’ ముఖంగా మీకు తెలియజేస్తూ…
    మీకు అభినందనలు, ధన్యవాదాలు..
    పూర్ణిమ గారికి స్పెషల్ థాంక్స్.. ఈ ఇంటర్వ్యూ ని మాకు ప్రసాదించినందుకు..

  7. sujji says:

    Wow..! Goutham gari photo tho interview.. !! aepppudu comments ki reply kooda evvani, goutham gari tho interview chesina purnima ki modhata thanks.
    Goutham garini pogidee anta saahasam nenu cheyyanu. kani, he is one of the best telugu blogger.

  8. నాకు చాలా ఇష్టమైన బ్లాగులలో రెండు రెళ్ళు ఆరు బ్లాగు ఉంటుంది. గౌతంగారిని చూడాలన్న కోరిక ఈ రోజు తీరింది. 🙂
    పూర్ణిమగారు .. మీకు చాఆఆఆఆఆఅలాఆఆఆఆ thanksఅండీ !

  9. krishna says:

    పూర్ణిమ గారూ బావుంది ఇంటర్వూ కానీ దినకర్తో చెయించి వుంటె దివాలీ ధమాకా ,సంక్రాంతి బొనానzaa లాగా వుండేవేమో..

  10. ముఖాముఖి కూడా చాలా బాగుంది గౌతంగారి పోస్ట్ వలె . దినకర్ ని కూడా చూడాలనుకుంటున్నాము . కొన్ని మంచి బ్ల్లాగు లింకులు ఇచ్చినందుకు గౌతం గారికి దన్యవాదాలు .పూర్ణిమ గారూ బావుంది ఇంటర్వూ.

  11. నరహరి says:

    “రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన…”

    అదిరింది………సూపర్ ………..

  12. గౌతం గారు నేను మీ టపాలన్నీ ప్రింటౌట్ తీయుంచుకుని దాచుకుంటాను. ముఖ్యంగా మల్లెపూలు మస్సాలవడ. టపా మాత్రం నా భూతో నా భవిష్యత్. ఇప్పుడా ప్రింటౌట్ తీసేదానిలో మీ ఫొటో పట్టుకుని మిమ్మల్ని వెతుకుతా.

    పూర్ణిమ గారు మీరు spcl తాంక్స అండి

  13. మధు says:

    అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించింది.
    గౌతం గారూ మీరు ఫోటొతో దర్శనమిచ్చారు, మీకు ఇంక Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే :))

    పూర్ణిమ గారూ మీకు స్పెషల్ థాంక్స్!!

  14. krishna rao jallipalli says:

    నిజం వింటర్ వ్యూ కొంచం సేరియస్ గ ఉంది. ఎలాగయితేనేం చాలా వీజీగా 5000 రూపాయిలు సంపాయించారు. (ఇంతకీ చేతికి వచ్చాయా??) best wishes.

  15. Shashank says:

    @మధుర వాణి గారు – ఎదురు చూసినంత సేపు అంటే ఒక పెద్ద నవల రాయాసి వస్తుంది… అది ఈ సారి గౌతం గారు తన ఆటో నో బస్సో బయాగ్రఫీ రాసినప్పుడు తాపీ గా చదువుకుందురు..

  16. మిమ్మల్నెక్కడో చూసినట్టుంది… నిజ్జంగా! మా ఏరియాలోనే తిరుగుతుంటారనుకుంటా 🙂
    మొత్తానికి తోటరాముడు బ్లాగుకొక ఫేసు జోడయింది.

  17. satya says:

    రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన. 😀

    పూర్ణిమ గారు,
    ఇంతకీ ఇంటర్వూ కి ఎంత తీసుకున్నారు గౌతం గారు? ప్రశ్న కి ఇంతని వసూలు చేసారా? మరీ చాలా తక్కువే ఉన్నాయి. 🙂

  18. గౌతం గారు,

    ఆ విధంగా ఇవ్వాలన్నారా? మనం కళ్యాణ్ డాం దగ్గర ఆ విధంగా ‘ముగ్గు’ వేసుకుని 5,000 ఖర్చు పెట్టుకుందామనుకున్నాం కదా?
    అది సరే పొద్దు దగ్గర్నుండి ఆ 10,000 రాబట్టండి. ఈ టపా కే చాలా ఎక్కవ హిట్లు వచ్చుంటాయనుకుంటా.

    — తోట విహారి

  19. శ్రీ says:

    బాగుంది ఇంటర్వ్యూ. అల్లరి అల్లరి టపాలతో తోటరాముడు ఒక గిల్లరే చేస్తున్నాడు.

    తోటరాముడికి నేను ఫాను కంటే ఎక్కువ, ఏ.సీ అనుకోండి!

  20. Varunudu says:

    మీ పేరు అందరూ గౌతమ్ అంటున్నారు కానీ, నిజం చెప్పండి. మీ అసలు పేరు దినకర్ కదా..:)

    గౌతమ్ గారూ, మీ రచనలు అన్నీ చాలా హాయిగా వున్నాయి. హాస్యం అపహాస్యం పాలు అవుతున్న ఈ రోజుల్లో, మనసారా, తనివితీరా నవ్వుకొనే రచనలు కరువై పోయిన ఈ కాలం లో మీ బ్లాగు ఎడారి లో ఒయాసిస్సులా సేదతీర్చింది. మామూలుగా దైనందిన జీవితం లో వున్నమన మధ్య లో జరిగే సన్నివేశాల్ని రసవత్తరంగా వ్రాస్తున్నారు. మీ బ్లాగ్ చదూతున్నంత సేపు నాకు మీ రచనలను దేనితో అయినా పోల్చాలి అంటే అది మళ్ళీ మీ బ్లాగు లోని రచనే అయ్యుంటుంది. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకడు ఒక హాస్య కథ వ్రాద్దాం అనుకొని మొత్తం వ్రాసాక చూస్కొంటే విపరీతమైన సెంటిమెంట్ కథ గా తయారై అతనికే కన్నీరు కార్చే పరిస్థితి కల్గింది. ఎందుకు చెప్పాను అంటే హాస్యం అదీ సునిశితమైన హాస్యం, గిలిగింతలు పెట్టగలిగే హాస్యం వ్రాయడం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం. అలా వ్రాయడం అప్పట్లో తెనాలి రామకృష్ణ అని ఒక కవి చేశాడుట , మళ్ళీ ఇదిగో ఇంత కాలానికి ఆ రామకృష్ణుడే గౌతముడై ఇలా నవ్వులు విరబూయించడానికి తోట రాముడి రూపం లో వ్రాస్తున్నాడు అంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఎన్ని సార్లు చదివినా, చదివిన ప్రతీ సారీ ఏదో ఒక సన్నివేశం లో నవ్వు పుట్టించ గలుగుతున్నారు అంటే మీరు సామాన్యులు కారు (చాలా పొగి డేసాను .. మీకు అందిన ఆ 5000 రూపాయల్లో ఒక వెయ్యి ఇటియ్యండి).

    మీ నుండి మరిన్ని రచనలు ఆశిస్తూ .. మీకు బాగా తీరిక దొరకాలనీ… బద్ధకం అసలు మీ జోలికే రాకూడదని మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. అలా జరిగితే దినకర్ తలనీలాలు ఆ వెంకన్నకు సమర్పిస్తాను అని మొక్కుకొంటూ … చివరగా ఒక చిన్న మాట.. “నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం” అన్న జంధ్యాల గారి మాట మీకు మరింత స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిస్తూ .. భవదీయుడు నీల్ విజయ్

  21. venkat says:

    >>ఆ సినిమాని కేవలం తోటరాముడి కోసం రెండు మూడు సార్లు చూశాను, కృష్ణ డాన్స్ ఉన్నా సరే!
    >>అసంఖ్యాకమైన=1
    >>రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన

    U are wonderfullllllll…. 🙂

  22. రిషి says:

    దినకర్ అనే ఒకాయనవచ్చి మీరిమ్మన్నారని చెప్పి 5000 కి సోడెక్సో కూపన్స్ పట్టికెళ్ళారు…మీకు అందివుంటాయని తలుస్తాను 🙂

  23. chandra says:

    గౌతంగారూ..మీ టపాలు చదువుకుని నవ్వుకున్న ప్రతీసారీ ‘మీరు ఎలావుంటారో’ అనుకునేవాన్ని. ఇప్పుడు ఫొటొ చూస్తే నిజంగా ఎక్కడో చూసినట్టే వుంది.. మీరు మడివాలాలోగానీ ఉండరు కదా 🙂
    మీరు మరింత తరచుగా టపాలు వ్రాసి మమ్మల్ని నవ్వించాలి…waiting for your nextpost.

  24. తోటరాముడికి ఇంకా పెళ్లైన్నట్లు లేదు, ఫోటోలో నవ్వులు విరజిమ్ముతున్నాడు. దినకర్! ఇంతకంతా కసి తీర్చుకోవాలనుకొంటే ఒక యువరాణిని పట్టుకురా,లేదా ఓ టపా కింద వ్యాఖ్యలో మా తోటరాముడికి ఇంకా పెళ్లి కాలేదోయ్! అని రాసేయ్, ‘కాగల కార్యం కిన్నెరలే’ చూసుకొంటారు:-) Interview is hilarious, esp. Yamaleela for Krishna dance… పడీ పడీ నవ్వాను.ఇంత మంది ఆరోగ్యాన్ని పెంపొదిస్తున్న మీరు నిజమైన నవ్వుల డాక్టర్!

  25. ఇంటర్వ్యూ చిన్నగా ఉన్నా చాలా బావుంది.. తోటరాముడి ముసుగు తీసి మాఅందరికీ పరిచయం చెసిన పూర్ణిమకు కృతజ్ఞతలు.. వెంటనే ఈ ఫోటో ప్రింట్ చేసి మా ఆఫీసులో వాళ్ళకి చూపించి “నేను రెండు మూడు నెల్లకోసారి హిస్టీరియా వచ్చినట్లు నవ్వేది ఇతని వల్లేనోచ్” అని చెప్పాలనుంది 🙂

    వరూధిని గారన్నట్లు హాస్యం రాయడం చాలా కష్టమైన పని.. అదీ ఎలాంటి అసభ్యతా లేకుండా!! గౌతమ్ గారు హేట్సాఫ్ టు యు!!

  26. క్రిష్ణ పాట వున్నా కూడా, 🙂
    అసంఖ్యకమైన = 1 😉

    గౌతం, బ్లాగులో టపాలా ఈ ఇంటర్వ్యూ కూడా బాగా పేలింది. అన్నాట్టు దినకర్ ఫొటో కూడా వేస్తే మరింత బావుండేది.

    (మనం మాట్లాడుకున్నట్టు, నేను వాఖ్య రాస్తే పంపుతానన్న 1500/- పంపగలవు. సోడెక్సొ పాసులు వద్దు)

    ప్రసాదం

  27. ఫణీంద్ర says:

    నేనివ్వను. మనం ముందుగా అనుకున్న ప్రకారమైతే నా బ్లాగు పేరే ఆరు సార్లు చెప్పాలి కదా!

  28. చాలా బావుంది. ఇంటర్వ్యూ చేసిన పూర్ణిమ గారికీ, ఇచ్చిన గౌతమ్ గారికీ ధన్యవాదాలు.
    గౌతమ్ గారూ,
    నవతరంగం వాళ్ళు విన్నారు…మీరెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు….

  29. ఇది సెన్సేషనల్ టపా.గౌతం మీరెక్కడి తోటరాముడండి?కోట దాటి రారు.ఎలాగయితేనే పొద్దువారు తోట రాముణ్ణి పట్టారు.అభినందనలు.పూర్ణిమా మరీ అన్యాయం గా ఇంత చిన్న ఇంటర్వ్యూనా?ఎక్కువ ప్రశ్నలడిగితే దినకర్ ని పిలుస్తానన్నారా ఏమిటి?

  30. ఇంటర్వూ బాగుంది. మూసుక్కూర్చోరా పూలచొక్కా బ్లాగరు ఇతనే http://bhaskar.net.in/.

  31. Dinakar says:

    interview adurs…nenu meerandaru anukune Dinakar ni kadandi…Mee Dinakar gari abhimanini…

Comments are closed.