తూర్పూ పడమరల కబుర్ల కబుర్లు

-సత్యసాయి
త్రివిక్రమ్ గారు నాకు ఫోను చేసి కొపా గారితో చాటింగు చేస్తే ఆ సంభాషణని పొద్దులో ప్రచురిస్తామనగానే ఏనుగెక్కినట్లైంది. కొద్దిగా సంకోచించినా- అవతలున్నది అతిరథుడు కదా- పొద్దు వార్షికోత్సవాలలో నేనూ భాగస్వామిని కాగల అవకాశం వదులుకో దలుచుకోలేదు. మా సంభాషణ 2 దఫాలుగా సాగినా మొదటిది కొపా గారికి నచ్చక పోవడం, ఆఫైలు నిండా ఆ ఆ ఆ ఆ మాత్రమే మిగలడంవల్లనూ మూడవ దఫా చాటింగ్ చేయాల్సి వచ్చింది. అందుకే అనుకున్నదానికన్నా ఆలస్యం అయింది. అదీకాక వారానికొకసారే మాఇద్దరికీ అవకాశం దొరికేది. ఒకవారం కుదరకపోతే (రెండు సార్లు నా ఇంటర్నెట్ మొరాయించింది) మళ్ళీ ఇంకోవారం ఎదురు చూపులే శరణ్యం. .

తెలుగులో అంతర్జాల మాధ్యమంలో కబుర్లు చెప్పుకోవడం ఆనందదాయకమే అయినా కొద్దిగా కష్టమే అని చెప్పాలి. కొత్త యాహూ మెస్సంజర్ లో తెలుగులో మన బ్లాగులే మాదిరే చాటింగు చేయచ్చు. కానీ ఆంగ్లటైపింగంత వేగంగా తెలుగులో చేయలేకపోవడం సాంకేతికపరమైన ఇబ్బంది. తప్పనిది. మొదటి దఫా కాస్త కష్టమైనా రాను రానూ – దగ్గీ దగ్గీ సులభంగా దగ్గగలిగనట్లు – చాటింగు వేగం పెరిగింది. అదీకాక, మొదటి సారి చాటింగు పూర్తయే సరికి మాఇద్దరి మధ్యా మంచి అవగాహన కూడా ఏర్పడింది.

ఏం మాట్లాడుకోవాలన్న విషయం పొద్దు పూర్తిగా మాఇద్దరికే వదిలేయడం ద్వారా బాధ్యత పెరిగింది. కొపాగారు సూచించినట్లు నా తూర్పు, ఆయన పడమర అనుభవాలను కలబోయడంతో ప్రారంభించి, అనేక విషయాలు మాట్లాడుకున్నాం. చివరకి సంగీతం మీదకి, అక్కడినుండి బ్లాగుల మీదకి మళ్ళిన మా సంభాషణని పొద్దు కల్పించిన అవకాశానికి నెనర్లు చెప్పడంతో ముగించలేక, ముగించలేక ముగించాం. ఒకందుకు పోస్తే ఒకందుకు తాగామన్నట్లుగా పొద్దు ఒకందుకు మాకీయవకాశమిస్తే, మామధ్య మంచి స్నేహమేర్పడందులకు మాకు పనికొచ్చింది.

ఇద్దరు బ్లాగర్ల మధ్య సంభాషణ వేరేవారికి ఏరకంగా పనికొస్తుందన్న సందేహం మొదట నాకు కలగక పోలేదు. ఇదే సందేహం విజ్ఞులకీ కలిగే అవకాశం ఉంది. కానీ, ఒకసారి పరికించి చూచిన మీదట మామధ్య దొర్లిన విషయాలు వ్యక్తిగత అనుభవ జన్యాలైనా ప్రాక్పశ్చిమ దేశాల మధ్యనున్న సారూప్య, వైవిధ్యాలను – అన్నిటినీ స్పృశించలేక పోయినప్పటికిన్నీ – మా సంభాషణ బయల్పరచిందని అర్ధమైంది. అన్నింటినీ మించి, కనీసం వేరే వ్యక్తులు ఏంమాట్లాడుకున్నారోనన్న ‘కుతూహలాన్ని‘ తీరుస్తుందని నమ్ముతున్నా. :)) మీరందరూ గమనించే ఉంటారు- చాటింగులో మన భావాలు మెదిలేంత వేగంగా మన వేళ్ళు అక్షరాలని పేర్చలేవు. అందుకని ప్రశ్న, జవాబు పక్కపక్కన ఉండవు. ఒక సినిమాలో తుత్తి సుబ్రహ్మణ్యం అనే హాస్యనటుడు ఎదుటివాళ్ళు వేసిన ప్రశ్నకి ఒక ప్రశ్నాకాలం ఆలస్యంగా సమాధానం చెప్తోంటాడు. దాంతో ప్రతీ ప్రశ్నకీ జవాబు సరిగ్గా జోడించకపోతే కొంపలు మునిగే సమాధానాలొస్తుంటాయి. ఇక్కడా అంతే. ఉదాహరణకి మామధ్య జరిగిన సంభాషణ తునక చూడండి (దుడ్డు అక్షరాలు నా వ్యాఖ్యలు).

kotta pali: నగరంలో కార్లు విపరీతంగా ఉంటాయా? ప్రతి వాళ్ళకీ కారుంటుందా?

satyasaik: నేను చాలా వాటిని చూసా (నేను చూసినవి కార్లు కాదు – ఈసమాధానం ముందడిగిన ప్రశ్నది)

kotta pali: బౌద్ధాన్ని జనం ఇంకా ఫాలో అవుతున్నారా? సంతోషం.

satyasaik: ప్రతీ ఇంటికీ రెండు, మూడు కూడా (ఏంటీ రెండు, మూడు బౌద్ధాలా?)

అందువల్ల, మా సంభాషణని కొద్దిగా అటూనిటూ అమర్చి, అక్కడక్కడ దొర్లిన ముద్రారాక్షసాలని సవరించి ప్రకటించాల్సి వచ్చింది. కొపా గారు కూడ ఈ కూర్పులని హర్షించారు.

సత్యసాయి కొవ్వలి

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.