జాలంలో శ్రమదానం

-వీవెన్

ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా, మన (సామూహిక) అవసరాలను తీర్చుకోవడానికి కృషిచెయ్యడమే శ్రమదానం. ఈ శ్రమదానంలో ఓ ముఖ్య అంశమేమంటే, మన సమస్యలకు మనమే బాధ్యత వహించి, వాటి పరిష్కారానికి కార్యోన్ముఖులం కావడం.

మీ ఊరి రోడ్డు గతుకులుగా ఉంటే మీ ఊరి ప్రజలే పూనుకుని మొరం తోలి, రోడ్డుని చదును చేసుకునే కార్యక్రమం చూసే ఉంటారు. ఊరి చెరువులోనో, కాలువలోనో పూడిక తీసుకునే కార్యక్రమం కూడా గ్రామ ప్రజలే పూనుకుని చేయడం వినే ఉంటారు. వ్యక్తుల శ్రమదాన ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. చంద్రబాబు నాయుడు తన హయాంలో జన్మభూమి అని పేరు పెట్టి ఇలాంటి శ్రమదాన కార్యక్రమాలకు/పనులకు ప్రభుత్వ సహాయం కూడా అందించే పథకం అమలు పరిచాడు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారంకాని సమస్యలు కూడా ఈ శ్రమదానాల వల్ల ఇట్టే జరిగిపోయేవి. విపత్తులూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తోటి జనమంతా ఏకమై, నష్టపోయిన ప్రాంతాల్లో జన జీవనాన్ని పునరుద్దరించడానికి పాటుపడటం చూస్తూనే ఉన్నాం.

జాలంలో తీసుకుంటే, వికీపీడియా లాంటి మహా విజ్ఞానం సర్వస్వం కూడా ఇలాంటి సమిష్టి కృషితోనే సాధ్యమైంది. అలానే ఫైర్‌ఫాక్స్ విహారిణి లాంటి అనేకానేక ఓపెన్ సోర్సు మృదూపరకణాలు కూడా ఎందరో వికాసకుల శ్రమదాన ఫలితమే. కంప్యూటర్ని నడిపే క్లిష్టమైన నిర్వాహక వ్యవస్థలు కూడా ఇలా సమష్టి కృషితోనే రూపొందుతున్నాయి.

అంతిమ వాడుకరులుగా మనం ఉపయోగిస్తున్న చాలా ఉపకరణాలు, పనిముట్ల తయారీలో మనమూ పాలుపంచుకోవచ్చు. జాలం వల్ల సాధ్యపడినవాటిలో ఒకటి – భౌగోళిక హద్దులు చెరిగిపోయి, ఏ ప్రాంతం వారైనా వారున్నచోటినుండే పరస్పరం సంభాషించుకోగలిగే సౌలభ్యం. దీని వల్ల వివిధ ప్రాజెక్టులలో ఎవరైనా భాగస్వాములు కాగలిగే అవకాశం వచ్చింది.

కంప్యూటర్లలో మరియు జాలంలో తెలుగు వికాసాన్ని చూడాలనుకునే వారు చేయదగిన శ్రమదానం: పలు తెలుగు ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం. తెలుగు వికీపీడియా దగ్గరనుండి వివిధ ఉపకరణాల స్థానికీకరణ వరకూ అందరూ పాలుపంచుకోవచ్చు.

కేవలం మనలాంటి వారి శ్రమదానం వల్లే, తెలుగు వికీపీడియాలో ఇప్పటికి 40 వేల పైబడి వ్యాసాలు పోగయ్యాయి. వ్యాసాలు రాసే స్థాయి లేదనుకుంటే, అచ్చుతప్పులను సరిదిద్దడమైనా చెయ్యవచ్చు.

మనమందరం వారానికి కనీసం ఓ గంట ఈ శ్రమదానానికి కేటాయించడం ద్వారా చాలా సాధించవచ్చు.

తాజాకరణ (అక్టోబర్ 1, 2008): వివిధ ఉపకరణాలని తెలుగులో స్థానికీకరించడానికి జాలంలోని గూళ్ళు.

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

7 Responses to జాలంలో శ్రమదానం

  1. చాలా ఆలస్యంగా వెలువడింది, ఈ వ్యాసం. ఐనా ముంచుకు పోయినదేమి లేదు.
    జాలంలో, జాలం ద్వారా అందించదగిన ప్రాజెక్ట్ వివరాలుగా, అసంపూర్ణంగా నైనా ఒక నమూనా / పట్టికగా ఇచ్చి ఉంటే, ఈ వ్యాసం పరిపూర్ణత సంతరించుకున్నదిగా భావించగలిగే అవకాశం ఉండేది.
    అలాంటి నమూనా మూలంగా, ప్రతి వారు తమ అభిరుచికి తగ్గ ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి, ఒక దిశలో శ్రమదానం చెయ్యడానికి స్ఫూర్తి పొందడానికి దారి చూపించినట్టుండేది. ఇప్పటికైనా ఆలస్యం కాదు. పొద్దులోనో, కూడలిలోనో తెలుగు బ్లాగర్లందరూ ఏదో ఒక సమయంలో కలిసే చోట “శ్రమదానానికి విజ్ఞప్తి” ని వారి కళ్ళలో పడేలా గ చేస్తే వ్యాసకర్త అన్నట్టు “చాలా సాధించవచ్చు.”

  2. Prabhakar rao says:

    First visit the site and then your intrests…..automatically u will be attracted to upgrade the item or correct the previous one. Any how the openion and the advise to work atleast for one hour a week is apprciable.

  3. Kypu Audisesha Reddy says:

    మీ సూచన బాగుంది. తెలుగు వారిగా పుట్టిన మనము తెలుగు భాషకు ఆ మాత్రం శ్రమ చేయాలి.తెలుగు భాషను నలుదిశలా వ్యాపింపజేయాలి.

  4. Pingback: వివిధ ఉపకరణాల తెలుగీకరణ, జాలంలో! « వీవెనుడి టెక్కునిక్కులు

  5. veeven says:

    @netizen

    జాలంలోనే మనం తోడ్పడదగ్గ వివిధ ప్రాజెక్టుల వివరాలతో మరిన్ని టపాలు రాయాలని నా ఆకాంక్ష. వాటి లింకులను ఈ టపాలో తాజాకరణలుగా చేరుస్తుంటాను.

  6. Pingback: తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక! | వీవెనుడి టెక్కునిక్కులు

  7. అన్నాపంతుల జగన్నాధ రావు says:

    పొద్దు అంతర్జాల తెలుగు పత్రిక చాలా బావుంది.

    వాసిష్ట గారి రచన “సత్యప్రభ ” పూర్తిగా యెక్కడ దొరుకుతుంది. దయచేసి తెలియజేయగలరు. పొద్దులో నాలుగు భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

    – జగన్నాధ రావు
    హైదారాబాద్,
    ఇండియా

Comments are closed.