ఉపజాతి పద్యాలు – ౧

ఆటవెలది

— ముక్కు శ్రీరాఘవకిరణ్

నిరుడు నన్ను నేను పరిచయం చేసుకున్నాను కదా. పద్యరచనపై ప్రస్తుత వ్యాసం క్రొత్తగా వ్రాస్తున్నవారి మార్గాన్ని కొంతైనా కంటకరహితం చేసేలా, లోగడ ప్రయత్నించి విరమించినవారికి తిరిగి ప్రయత్నించడానికి తగినంత ఊతమిచ్చేలా ఉంటుందని ఆకాంక్షిస్తూ…

మొదటే ఒక ముఖ్య ప్రకటన. నేను కేవలం పద్యాల గురించే చెప్పదలుచుకున్నానీ వ్యాసంలో. కాబట్టి వ్యాకరణశాస్త్రాన్నీ అలంకారశాస్త్రాన్నీ పెద్దగా స్పృశించడంలేదు. నేను చెప్పే విషయాలన్నీ నేనెలా నేర్చానో [1], నాకెలా తోచాయో అలానే చెప్తాను. తప్పులుంటే దొడ్డమనస్సుతో మన్నించాలి.

ఎక్కడ మొదలుపెట్టాలి?

నా అనుభవంలో ఆటవెలదులో తేటగీతులో అయితే పద్యరచన ప్రారంభించడానికి మంచిది. దీనికి కనీసం మూడు కారణాలున్నై.

  • మొట్ఠమొదటి కారణం – ఆటవెలది తేటగీతుల్లో ఫలానా అక్షరం గురువవ్వాలనో ఫలానా అక్షరం లఘువవ్వాలనో (పద్యగతిని నిర్దేశించే నియమాలు) లేకపోవడం. ఇల్లాంటి నియమాలుంటే వాటిని వృత్తాలంటారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం లాంటివన్నమాట. తెలుగులో వృత్తాలన్నిటికీ యతి, ప్రాస నియమాలు పాటిస్తారు[2].
  • రెండు – ప్రాస నియమం లేకపోవటం. ప్రాస నియమం ఉండి, వృత్తాలు కానివాటిని జాతులంటారు. దీనికి కందం మంచి ఉదాహరణ.
  • మూడు – వీటిల్లో యతికి బదులు ప్రాసయతి చెల్లించుకోవచ్చు. ఇల్లాగ ప్రాసయతి చెల్లించుకోగలిగిన సౌలభ్యం ఉండి, ప్రాస నియమం లేకుండా ఉండి, వృత్తాలు కాని పద్యాలని ఉపజాతులుగా చెప్పుకోవచ్చు. ఆటవెలదులు, తేటగీతులు, సీసాలూ ఉదాహరణలు.

సీసాలు పెద్ద పద్యాలు, కాబట్టి ప్రస్తుతానికి ఆటవెలదులమీదా తేటగీతులమీదా ప్రయోగాలు చేద్దాం.

ఇక్కడ యతి గురించి చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయ్.

  • ఏ రకం పద్యమైనా సరే యతి నియమం తప్పనిసరిగా పాటించి తీరాలి. ఉపజాతులలో మాత్రం యతికి బదులుగా ప్రాసయతి వేసుకోవచ్చు.
  • యతి అంటే స్థూలంగా చెప్పాలంటే చదువుకోవడానికి వీలుగా ఉండేలా చిన్న విరామం ఇవ్వడమన్నమాట (ఎక్కడ విరామం ఇస్తామో దాన్ని యతిస్థానం అంటారు). విరామం ఇస్తున్నాం కాబట్టి మళ్లీ చదవడం ప్రారంభించేటప్పుడు ఆ పాదం మొదటి అక్షరంలాగానే పలకబడే అక్షరంతో ప్రారంభించాలన్నది నియమం. ఒకలా పలకబడాలంటే ఒకే రకమైన అచ్చై (లేదా గుణింతమై) ఉండాలి కదా. అంటే ఉదాహరణకి ఇ లాగా పలకబడే అచ్చులు ఇ-ఈ-ఎ-ఏ-ఋ-ౠ కాబట్టి ఇ తో ఇ-ఈ-ఎ-ఏ-ఋ-ౠ లకి ‘యతిమైత్రి’ చెల్లుతుంది. అలాగే అ-ఆ-ఐ-ఔ లకీ ఉ-ఊ-ఒ-ఓ లకీ యతిమైత్రి చెల్లుతుంది. అదే హల్లులైతే క-ఖ-గ-ఘ లకి, చ-ఛ-జ-ఝ-శ-ష-స లకి, ట-ఠ-డ-ఢ లకి, త-థ-ద-ధ లకి, ప-ఫ-బ-భ-వ లకి చెల్లుతుంది. అలాగే ల-ళ-డ లకీ, ర-ఱ-ల-ళ లకీ, ద-డ లకీ, అ-ఆ-ఐ-ఔ-హ-య లకీ, న-ణ లకీ యతి చెల్లుతుంది.
  • వర్గాక్షరాలలో మొదటి నాలుగు వర్ణాలకీ చివరి అనునాసిక వర్ణానికీ యతి చెల్లదు. ఉదాహరణకి ఙ కి క-ఖ-గ-ఘ లకి యతి చెల్లదు. కానీ వర్గాక్షరాలు బిందుసంయుక్తమైతే అనునాసికంతో యతి చెల్లుతుంది. అంటే సంతతి లో ంత కి నాకములో నా కి యతి చెల్లుతుంది.
  • హల్లులకి హల్‌మైత్రే కాక అచ్‌మైత్రి కూడా ఉండాలి. అంటే కి-కు యతి చెల్లదు.
  • సంయుక్తాక్షరాలైతే ఏ హల్లుకైనా యతి చెల్లించవచ్చు. ఉదాహరణకి శ్రీ (శ్+ర్+ఈ) క్షీ (క్+ష్+ఈ) లలో శకారానికీ షకారానికీ యతి చెల్లుతుంది. అలాగే శ్రీ-క్రీ లకి శ్రీ-చే లకి శ్రీ-జృ లకి యతులు చెల్లుతాయి. కానీ క్షు-సృ యతి చెల్లదు (అచ్‌మైత్రి ఉండాలి కనుక).
  • సంయుక్తాక్షరాలతో ఒకటి కంటే ఎక్కువ సార్లు యతి చెల్లించాల్సివస్తే[3] అన్నిసార్లూ ఒకే వర్ణానికి యతి చెల్లించాలి. అంటే శ్రీసతి – శీకర – రీతిని అన్నచోట యతి చెల్లినట్టుగాదు. అలాగే శ్రీధర – సిత – శీతాంబు అన్నచోట యతి చెల్లినట్టు.

అలాగే ప్రాస గురించి చెప్పుకోవాలంటే

  1. పాదంలోని రెండవ హల్లుకి ప్రాస అని పేరు. ఇంకా సరిగ్గా నిక్కచ్చిగా చెప్పాలంటే పాదంలోని మొదటి అచ్చుకీ రెండవ అచ్చుకీ మధ్యనున్న అక్షర సముదాయానికి ప్రాస అని పేరు. ప్రాస నియమం పాటించడమంటే ప్రతీ పాదంలోను ప్రథమద్వితీయాచ్చులకి మధ్యలో ఉన్న అక్షరసముదాయం ఒకటే అయ్యేలా చూసుకోవడం. ఉదాహరణకి శ్రీఘురామ … – గాగుణాభిరామ … – ర్వా కబంధ రాక్షస … – త్తాకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
  2. ప్రాసనియమంలో హల్లు మాత్రమే ప్రధానం కాబట్టి ప్రాసనియమం పాటించాల్సిన అక్షరసముదాయం ఒకే గుణింతంలో ఉన్నా ఒప్పే. అలాగే అక్షరసముదాయం[4] అన్నాం కాబట్టి అది సంయుక్తాక్షరం ఐతే దాన్ని అలాగే కొనసాగించాలి. దుష్టేతర – ఇష్టులు – అష్టమి – కష్టాలు అన్నప్పుడు ప్రాస సరిపోతుంది.
  3. పలకడం ఒకేలా ఉన్నంతమాత్రాన ప్రాస సరిపోతుందనుకోవడం పొరబాటు. కాబట్టి అమ్మా – మామా కి ప్రాస చెల్లదు.
  4. అనుస్వారం వస్తే? అంటే కండలు – వాడిని ప్రాస సరిపోతుందా? చెల్లదు. ఎందుకు చెల్లదు? కండలులో ప్రాసాక్షరసముదాయం ఏమౌతుంది? 0+డ్ కదా. ఇంకా తేలికగా అర్థమవ్వాలంటే… కండలు ని కణ్డలు అనే గదా చదువుతాం. ఇప్పుడు చెప్పండి ప్రాసాక్షరం ఏమిటో. ణ్+డ్ అంటే 0+డ్ అవునా?
  5. ఇవి కాక ల-ళ-డ లకి ప్రాస సరిపోతుంది. అలాగే శ-స లకీ, న-ణ లకీ, స-ష లకీ కూడా సరిపోతుంది.
    ఉదాహరణకి కములబోలిన పలుకులఁ రురుసలాడినను చెలువ రూపే స్మృతియై వమాయెను నా మనమని శధరబింబసమముఖినిఁ జనువునఁ దలచెన్[5].
  6. ర-ఱ లకి ప్రాస చెల్లించడం కుదరదు. కానీ పూర్వకవులు ర-ఱ ప్రాస చెల్లించిన ప్రయోగాలూ లేకపోలేదు(ట).

ఇక ప్రాసయతి:

  1. ప్రాసయతి అంటే యతి చెల్లించాల్సిన చోట ప్రాస చెల్లించడం. ఉదాహరణకి అచ్చు తప్పులుంటె – మెచ్చబోరు అన్నామనుకోండి… అందులో యతి చెల్లాల్సిన చోట అ కి మె కి యతి చెల్లట్లేదు. కానీ ప్రాసాక్షరసమూహమైన చ్+చ్ ని తీసుకుని యతి చెల్లాల్సిన చోట అచ్చు – మెచ్చ ప్రాస చెల్లించామిక్కడ. కాబట్టి ప్రాసయతి చెల్లించామన్నమాట.
  2. ప్రాసకి చెప్పిన నియమాలన్నీ ప్రాసయతికి వర్తిస్తాయ్. అంటే మండుటెండ లోన – మూడు రాదు అన్నచోట యతి ఎలాగూ చెల్లట్లేదు. ప్రాసయతి కూడా చెల్లదు.

ఇక ఆటవెలది, తేటగీతుల్లోకి వచ్చేద్దాం. అసలే పద్యమైనా వ్రాయాలంటే ముందు ఏదో ఒక విషయం కావాలి కదా. విషయాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నామో అది మన ఇష్టం (ఎంత చెప్పామో ఎలా చెప్పామో అన్నదాన్నిబట్టి వ్రాసినదాన్ని కావ్యమనో ఖండకావ్యమనో మహాకావ్యమనో ప్రబంధమనో మరొహటనో పిలుస్తారు). ఉదాహరణకి ఇప్పుడు మనం భారతదేశం గురించి నాలుగు ముక్కలు చెబుదామనుకున్నాం అనుకోండి. విషయం ఎంచుకున్నాక ఏ ఛందస్సులో వ్రాయాలో కూడా నిర్ణయించుకోవాలి కదా. ప్రస్తుతానికి ఆటవెలదిలో వ్రాద్దామనుకుంటే… మొదట తెలియవలసినది ఆటవెలది లక్షణం.

ఆటవెలది లక్షణాలు

  1. బేసి పాదాలలో 3 సూర్య గణాలు 2 ఇంద్ర గణాలు ఉంటాయ్.
  2. సరి పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయ్.
  3. ప్రాస నియమం లేదు.
  4. యతి గానీ ప్రాసయతి గానీ చెల్లించాలి (ఉపజాతి పద్యం కాబట్టి).

బేసి పాదాలంటే 1, 3 పాదాలు. సరి పాదాలంటే 2, 4 పాదాలు. (రెండు, నాలుగు పాదాలు కాబట్టి మనుష్యులూ జంతువులూను!)

అసలీ గణాలేమిటి?

సరి. మళ్లీ మొదటికొచ్చాం. హ్రస్వాక్షరాన్ని (ఒక మాత్ర) పలకడానికి పట్టే కాలంలో పలకబడే అక్షరాలు లఘువులు, లఘువులు కానివన్నీ గురువులు. ఇకమీద గురువుని U తోనూ లఘువుని I తోనూ సూచిద్దాం. ఏది లఘువో ఏది గురువో గుర్తించడంలో పలకడం ప్రధానం. కాబట్టి సంయుక్తద్విత్వాక్షరాల విషయంలో వచ్చే కొన్ని విశేషాంశాలు కూడా చెప్పుకోవాలి. సంయుక్తాక్షరమంటే రెండు వేర్వేరు హల్లుల కలయిక వల్ల పుట్టేది. క్ష లాగ. ద్విత్వాక్షరమంటే అదే హల్లు రెండు సార్లు రావడం వల్ల పుట్టేది. ల్ల లాగ.

(1) సంయుక్తద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం ఒకే పదంలోదయితే అది గురువే. “అక్షరం” లో అ గురువు. క్ష లఘువు.

(2) సమాసం జరిగితే ఈ నియమం కొంచెం మారుతుంది.

ముందు సమాసాల రకాలు చూద్దాం. రెండు సంస్కృత పదాల సమాసానికి సిద్ధ సమాసమని పేరు. రెండు సంస్కృత సమాన పదాల (తద్భవాలు) మధ్య సమాసానికి సాధ్య సమాసం అని పేరు. అచ్చ తెలుగు పదాల సమాసానికి ఆచ్ఛిక సమాసమని పేరు. ఒక సంస్కృత సంబంధి పదానికీ (తత్సమ,తద్భవాలు) ఒక అచ్చ తెలుగు పదానికీ (ఆచ్ఛికం) సమాసమైతే దాన్ని మిశ్ర సమాసం అంటారు.

సమాసపదంలో ఉత్తరపదంలోని మొదటి అక్షరం సంయుక్తాక్షరంగానీ ద్విత్వాక్షరంగానీ అయితే పూర్వపదంలోని చివరి అక్షరం (అ) సిద్ధ సమాసమైతే గురువు (ఆ) సాధ్య మిశ్ర సమాసాలైతే మనం పలకడాన్ని బట్టి గురువుగానైనా లఘువుగానైనా తీసుకోవచ్చు (ఇ) ఆచ్చికమైతే లఘువే. ఉదాహరణలు: “విఫలప్రేరణ”లో ల గురువు, “విష్ణుధ్యానము” లో ష్ణు గురువు లేదా లఘువు, “ముసలివ్యాఘ్రము”లో లి గురువు లేదా లఘువు, “సీత ప్రక్కన”లో త లఘువు.

(3) సమాసం లేకపోతే ముందుపదంలోని చివరి అక్షరమెప్పుడూ లఘువే. ఉదాహరణకి “మధువును గ్రోలు” లో ను లఘువు.
(4) పలకడం చేత సంయుక్తాక్షరమున్నా లఘువులైన పదాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. అద్రు, ఎద్రుచు, చిద్రుప మొదలైనవి.

సూర్య ఇంద్ర చంద్ర గణాలుగా వర్గీకరించడం సుళువుగా గుర్తుండేలా నేను వాడుకునే ఒక్క చిన్న టెక్నిక్ చెప్పమంటారూ?

* రెండు ‘మాత్ర’ల కాలంలో పలకబడేవి U – గ, II – లల.
* వీటికి గురులఘువులు చేరిస్తే UU – గగ, UI – గల లేదా హ, IIU – స, III – న లు వస్తాయి. ఈ గణాలలో మూడు మాత్రల గణాలైన హ, న లను “సూర్య గణాలు” అంటారు.
* అలాగే గ-లల లకి రెండేసి గురులఘువులు చేరిస్తే వచ్చేవి UUU – మ, UUI – త, UIU – ర, UII – భ, IIUU – సగ, IIUI – సల, IIIU – నగ, IIII – నల. వీటిల్లో నాల్గు ఐదు మాత్రల త, ర, భ, సల, నగ, నల లని “ఇంద్ర గణా”లంటారు.
* గ-లల లకి మూడేసి గురులఘువులు చోరిస్తే వచ్చే UUUU – మగ, UUUI – మలఘు, UUIU – తగ, UUII – తల, UIUU -రగ, UIUI – రల, UIIU – భగురు, UIII – భల, IIUUU – సగగ, IIUUI – సగల, IIUIU – సలగ, IIUII – సలల, IIIUU – నగగ, IIIUI – నగల, IIIIU – నలగ, IIIII -నలల ల్లో ఐదు, ఆరు, ఏడు మాత్రల మలఘు, తగ, తల, రగ, రల, భగురు, భల, సగల, సలగ, సలల, నగగ, నగల, నలగ, నలల అనే గణాలని “చంద్ర గణా”లంటారు.
* కాబట్టి సూర్య గణాలు (3 మాత్రలు) రెండు. అవి న, హ. ఇంద్ర గణాలు (4, 5 మాత్రలు) ఆరు. అవి నగ, నల, సల, భ, ర, త. పధ్నాలుగు చంద్ర గణాలూ మనకి ప్రస్తుతానికి అనవసరం. అసలు ఛందస్సులో వాటి వాడకమే చాలా తక్కువ.

ఆటవెలది లక్షణం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రయత్నిద్దాం. మొదటి పద్యం అమ్మపై వ్రాద్దామా? భావనలు మనకి కోకొల్లలు. ఇక పద్యం వ్రాసే పద్ధతి –

అమ్మ సూర్యగణం. అమ్మ అనగానే గుర్తొచ్చేవి… చేతి వంట, మాట, చూపు, లాలి పాట గట్రా. అమ్మ చేతివంట అంటే మొదటి మూడు సూర్యగణాలూ వచ్చేసాయ్. వంట అనటంకన్నా చేతి ముద్ద అంటే ఇంకా అర్థవంతంగా ఉంటుందేమో కదా. అమ్మ చేతిముద్ద అన్నాం, బాగానే ఉంది. తర్వాత? రెండు ఇంద్రగణాలు కావాలి. ఆపై మరో మూడు పాదాలు కావాలి. ఏం చెప్పాలిప్పుడు? అమ్మ చేతిముద్ద అందరికీ అమృతమే. అమ్మ ఏం పెట్టినా అందులో తన అమ్మప్రేమని కలిపి పెడుతుంది, అమ్మప్రేమతో పెడుతుంది. అటువంటి అమ్మచేతిముద్ద తినడం కోసం అమృతమైనా సరే వదులుకోవచ్చు.

ఇక్కడ గమనించవలసినది… అమృతములో అ గురువు కాదు. పలకడంలో అవకరాలు వచ్చి మనకిప్పుడు తేడా పెద్దగా తెలీడంలేదంతే.

సరే. అమృతాన్నికూడ వదులుకోవచ్చునన్నాం కదా. దానిని కొంచెం పదాలు మారిస్తే “అమృతమైన కూడ వదులుకోవచ్చులే“. అదృష్టం బాగుండి యతి సరిపోయింది. ఎంతైనా అమ్మ గురించి కదా! ఇది ఒక పాదం.

అమ్మచేతి ముద్ద అమ్మ ప్రేమతో కలిసి ఉంటుంది. అలా కలవడం వల్ల అమృతాన్ని మించిపోతుంది. మొదటి వాక్యాన్ని కొంచెం అటూ ఇటూ చేస్తే… అమ్మ చేతి ముద్ద అమ్మ ప్రేమ కలిసి.

అమృతాన్ని మించిపోతుంది. ఇక్కడ అమృతాన్ని అనడంవల్ల ఇంద్రగణం వస్తోంది. మనకి కావలసింది సూర్యగణం. కాబట్టి అమృతం అన్నదానికి పర్యాయపదం వాడదాం… అమృతం, సుధ, పీయూషం. సుధను మించిపోవు అన్నామనుకోండి. అప్పుడు మరో మూడు సూర్య గణాలు పూర్తయినట్టు. ఇక్కడ పూర్తిచేయడానికి మళ్ళీ యతి చూసుకోవాలి. చ-ఛ-జ-ఝ-శ-ష-స లకి ఉ-ఊ-ఒ-ఓ లకి యతి సరిపోతుంది. కాబట్టి మూడో పాదంతో కలిసిపోయేలా రెండు సూర్యగణాలు రావాలి. ఇప్పుడు ఆ రెండూ చూడబోతె ఐతే, అమృతమైన కూడ వదులుకోవచ్చులే అన్నపాదానికి కలపడానికి బాగుంటుంది.

ఇప్పుటిదాకా పూర్తయిన పద్యం…

అమ్మ చేతిముద్ద అమ్మ ప్రేమకలిసి
సుధను మించిపోవు చూడబోతె
అమృతమైన కూడ వదులుకోవచ్చులే

ఇప్పుడు పద్యంలో ఏది లోపించిందో తేలికగా తెలుస్తోంది. ప్రేమతో కూడిన అమ్మ చేతి ముద్ద కోసం అని స్ఫురించేలా ఓ వాక్యం ఉంటే సరిపోతుంది. అమ్మచేతిముద్ద అని మళ్ళీ వాడేస్తే… అమ్మచేతిముద్ద అనే అమృతం కోసం. మధువు కొరకు అని అంటే ఐపోతుంది.

పద్యం-

ఆ.వె.

అమ్మ చేతిముద్ద అమ్మప్రేమ కలిసి
సుధను మించిపోవు చూడబోతె
అమృతమైన కూడ వదులుకోవచ్చులే
అమ్మ చేతిముద్ద మధువు కొరకు

ఇప్పుడు మరొకటి ప్రయత్నిద్దామా? ముందు అనుకున్నట్టుగా భారతదేశంమీద వ్రాద్దామా?

భావనలు (మనం చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞే ఇది) –

(1) నా భారతదేశం గొప్ప సంస్కృతి కలిగినది.
(2) నేను దానికి గర్విస్తున్నాను.
(3) అటువంటి నా దేశానికి నమస్కారం.

వ్రాసే పద్ధతి –

సంస్కృతి గురించి చెప్పాలి. సంస్కృతి అన్న పదాన్ని యథాతథంగా పద్యంలో వాడేద్దాం. సంస్కృతి ఇంద్రగణం. కాబట్టి “సంస్కృతి కలిగిన” అని రెండు ఇంద్రగణాలు వాడచ్చు. ఇవి వచ్చాయ్ కాబట్టి వీటి ముందు మూడు సూర్య గణాలు రావాలి. “ంస్క” తో ప్రాసయతి కన్నా స తో యతే నయ్యం. కాబట్టి స తో యతిమైత్రి ఉన్న చ-ఛ-జ-ఝ-శ-ష-స లలో ఏదో ఒకదానితో ప్రారంభించాలి. “చక్కనైన” సరిపోతుందే… హమ్మయ్య. “చక్కనైన … సంస్కృతి కలిగిన”. ఒక సూర్య గణంతో ఖాళీ పూరించాలి. “గొప్ప” సూర్య గణమే కదా. “చక్కనైన గొప్ప సంస్కృతి కలిగిన” అని మొదటి పాదం పూర్తి చేసేసాం.

విశేషణాలు వేసేసాం సరే. మరి దేనిమీద వాడాం ఆ విశేషణాలు అన్నది కూడా చెప్పాలి కదా. ఇంకా దేని మీద? మన భారతదేశం మీదే. భారత అంటే ఇంద్ర గణం. అంటే మూడో పాదంలో మాత్రమే వాడగలం. మరి రెండో గణంలోనే వాడాలంటే ఎలా? పర్యాయపదం వెతుక్కుందాం. భారతదేశాన్ని మనం భరతమాత అని కూడా అంటాం కదా. భరతమాత అంటే రెండు సూర్య గణాలు. భలే. “భరతమాత”… తర్వాతో? నమస్కారం చెప్పాలి. నమస్కారానికి పర్యాయపదాలు వందనాలు, దండాలు, ప్రణామాలు, మొదలైనవి. వందనాలు ప్రణామాలు యతికి చక్కగా సరిపోతాయి. కానీ “ప్రణామాలు” ఐతే గణాలు సరిపోవు. కాబట్టి “వందనాలు” తీసుకుందాం. మళ్లీ “భరతమాత … వందనాలు” లో ఖాళీ సూర్యగణంతో పూరించాలి. “నీకు” తో పూరిస్తే “భరతమాత నీకు వందనాలు”. అలా ఆటవెలది మొదటి రెండు పాదాలూ ఇవిగో.

ఆ.వె.

చక్కనైన గొప్ప సంస్కృతి కలిగిన
భరతమాత నీకు వందనాలు

మిగతా రెండు పాదాలూ మీరు ప్రయత్నిస్తారా?

నియమాలన్నీ తెలియడం కన్నా ముఖ్యమైన విషయం మరోటుంది. అది చదవడం. మీకు తెలుసున్న ఆటవెలది పద్యాలన్నీ పరిశీలించండి. తర్వాత మీరే స్వంతంగా ఒక పద్యం వ్రాయడానికి ప్రయత్నించండి. పైగా ఆటవెలదిలో వేమన శతకం, తెలుగుబాల శతకం లాంటి శతకాలే ఉన్నాయ్. కావ్యాలలోనూ ఆటవెలదులు బాగానే కనిపిస్తాయ్.

నాకొక ఆటవెలది గుర్తొస్తోంది. భావకవులమని చెప్పుకునేవారిపై దేవులపల్లివారి ఛలోక్తి ఇది –

ఆ.వె.

మెరుగు కళ్లజోళ్లు గిరజాలు సరదాలు
భావకవికి లేనివేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ.

ఇందులో చమత్కారం చివర్న చెప్పడానికి వేరే విషయమింకేమీలేక, విశ్వదాభిరామ వినురవేమ అని వాడేయడం! అలాగే ఇందులో రెండు చోట్ల ప్రాసయతి వాడారాయన, గమనించండి.

అలాగే నేనూ దేవులపల్లివారి దారిలో చెప్పేదేంటంటే…

ఆ.వె.

ఆటవెలది బాగ అభ్యాసమును చేసి
పద్యమొక్కటైన వ్రాయమనుచు
చెప్పి పాఠమాపి సెలవు తీసుకొనెదఁ
విశ్వదాభిరామ వినురవేమ.

ఆటవెలది పాఠమింతటితో సమాప్తం. అన్నట్టు భరతమాత పద్యంలో చివరి రెండు పాదాలూ పూర్తిచేయడం మర్చిపోకండేం. తర్వాత ఈ పాఠంమీద మీ అభిప్రాయాన్ని, ఉన్న అనుమానాలనీ కూడా ఆటవెలదిలోనే చెప్పడానికి ప్రయత్నించండి. తేటగీతులు సీసాలు కందాలు మొదలైనవి తర్వాత నేర్చుకుందాం.

*** *** *** ***

పాద పీఠిక

[1] నేను ఛందస్సుని ఎవరి వద్దా కూడా శాస్త్రీయంగా నేర్వలేదనీ, అక్కడా ఇక్కడా చదివడం ద్వారా నాకు అర్థమైన నాకు తోచిన ఛందోజ్ఞానసంచయమనీ, దాన్నే నేను అర్థంచేసుకున్నట్లుగా మీ ముందుంచబోతున్నాననీ గమనించగలరు.

[2] పాటిస్తారు అంటే నేను లోగడ చదివిన సాహిత్యంలో పూర్వ కవులందరూ అందరూ విధిగా పాటించారనీ, వారి మార్గాన్ని అనుసరించడం మంచిదనీ అర్థం.

[3] స్రగ్ధర, తరువోజల్లాంటి పేద్ధ పద్యాలలో

[4] మళ్లీ మళ్లీ ప్రథమద్వితీయాచ్చులకి మధ్యలో ఉన్న అక్షరసముదాయం అనేం అంటాం గానీ క్లుప్తంగా ప్రాసాక్షరసముదాయం అని పిలుద్దాం

[5] ఉదాహరణకోసం వ్యాసకర్త వ్రాసినదిది

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

9 Responses to ఉపజాతి పద్యాలు – ౧

  1. కామేశ్వర రావు says:

    రాఘవగారు,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    ఒక సవరణ:
    “హల్లులకి హల్‌మైత్రే కాక అచ్‌మైత్రి కూడా ఉండాలి. అంటే కి-కు యతి చెల్లదు”. అలాగే, అచ్చు మైత్రి ఉంటే సరిపోదు, హల్లు మైత్రి కూడా ఉండాలి. యతి కుదరాల్సిన రెండు అక్షరాలలో ఒకటి అచ్చైతే, మరొకటి కూడా అచ్చే అవ్వాలి. లేదా “హ”, “య” హల్లులు మాత్రం ఉండవచ్చు. వేరే ఏ హల్లు వచ్చినా యతి మైత్రి కుదరదు (అచ్చు మైత్రి కుదిరినా). ఈ నియమం వల్ల, మీరిచ్చిన అమ్మ పద్యంలో చివరి రెండు పాదాలకీ యతి కుదరలేదు. తెలుగు వికీలో యతిమైత్రి గురించి మరికాస్త వివరణ ఉంది, ఉత్సాహం ఉన్నవాళ్ళు చూడవచ్చు.

    ఒక సూచన:
    పద్యం ఎలా రాయాలో మీరు వివరించినది బావుంది కాని అది కొత్తగా పద్యాలు రాస్తున్నవాళ్ళకే అని అందరూ గుర్తుంచుకోవాలి. పద్యాల నడక పట్టుబడే దాకా, రాఘవగారు వివరించినట్టుగా ఛందస్సుకి తగ్గ పదాలూ, ఆ పదాలకి తగ్గ భావాలూ ఏరుకొనే అవసరం ఉంటుంది. కానీ మంచి పద్య కవిత్వం రాయాలంటే ఈ జరిగే క్రమం విపరీతం (reverse) కావాలి. అంటే ముందు భావం, భావానికి తగ్గ పదాలూ, ఆ పదాలకి తగ్గ ఛందస్సు (లేదా ఛందస్సుకి అనుగుణంగా పదాలని ఒప్పించే నేర్పు), ఈ వరసలో వెళ్ళాలి.

    ఒక సమస్య:
    “యతిని తెలుసుకొనుట ధాత తరమె!” – ఈ ఆటవెలది పాదంలో యతికాని, ప్రాసయతి కాని సరిపోయిందా?

  2. రాఘవ says:

    కామేశ్వరరావు మేష్టారూ, నాకు ఇప్పటివరకూ అచ్చుకి అచ్చుయతినే (హయలను తప్పిస్తే) వాడాలన్న సంగతి తెలియదు. తప్పు సవరించినందుకు కృతజ్ఞుణ్ణి. తరువాత ఈ వ్యాసం కేవలం క్రొత్తగా వ్రాసేవారికే.

    ఇక మీరడిగిన సమస్య అంటారూ… నాకు అర్థమైనంతలో యతీ చెల్లదు, ప్రాసయతీ చెల్లదు.

  3. గిరి says:

    రాఘవా, మంచి ప్రయత్నం.

    కామేశ్వర రావుగారు, మీరడిగిన ప్రశ్నలో యతిప్రాస సరిపోతుంది అని నేననుకుంటున్నాను

  4. గిరి says:

    కామేశ్వర రావు గారు,
    ప్రాసయతి అనబోయి యతిప్రాస అన్నాను..

    తప్పిద మయ్యెను చీచీ
    తప్పని చూడక వదులుట తమరిదె పూచీ
    తప్పటడుగలని చూచీ
    చప్పున తిట్టిన పరుగిడ జాలను, सच्ची

  5. కామేశ్వరరావుగారడిగిన ప్రాసయతి విషయం లో గిరి గారు సరియగు సమాధానాన్నే యిచ్చారు.
    ఇక్కడ గల నియమాన్ని గుర్తించండి.
    యతికి అచ్ సామ్యము, హల్ సామ్యము తప్పని సరి.
    ప్రాసయతికయితే ప్రాస పూర్వాక్షర నియమం మర్చిపోకూడదు. ప్రాస పూర్వాక్షరం గురువయితే ప్రాస యతిలొ కూడా గురువే ఉండాలి. లఘువయితే లఘువే ఉండాలి. ప్రాసాక్షరం అనుస్వారపూర్వకమయితే ప్రాసయతిలోకూడా అనుస్వారపూర్వకమే అవాలి. అర్థమయేలా చెప్పగలిగేననుకొంటాను.
    చింతా రామ కృష్ణా రావు
    {అంధ్రామృతం బ్లాగ్}

  6. చంద్రమోహన్ says:

    రాఘవ గారూ,

    పద్యాలను అందరికీ పరిచయం చేయాలన్న మీ ప్రయత్నం అభినందనీయం. ఐతే పద్యరచన విషయంలో కామేశ్వర రావుగారి అభిప్రాయాలే నావి కూడా. గణాలను కిట్టించుకొంటూ, ఒక్కోపాదం ‘ఫ్రేం’లో అక్షరాలను ఇరికించితే మంచిపద్యం తయారవదు. శ్రీశ్రీ చెప్పినట్లు “బండెడు చెత్తను ఛందశ్చండముగా పోగుచేసి…” నట్లుంటుంది. కవితకు భావం ప్రధానం. ఒక రమ్యమైన భావం కవి మనసులో ఉద్భవించాలి. అది ఒక అందమైన పదబంధమై స్ఫురించాలి. ఆ పదబంధాన్ని బంధించగల ఛందస్సు మదికి తోస్తుంది. మిగిలిన పదాలు అప్పుడు పరుగెత్తుకొని రావాలి. అప్పుడు ఒక అందమైన పద్య సృష్టి జరుగుతుంది. మీరు చెప్పిన వరుస అవధానులు వాడుతారు బహుశ, ఎందుకంటే కొన్ని వెసులుబాట్లు వారికి ఉండవు గనుక.

    ఏదేమైనా మీ వ్యాసం చాలా సరళంగా, బాగుంది. ఇక మీరిచ్చిన సమస్యకు నా పూరణ ఇదుగోండి:

    “చక్కనైన గొప్ప సంస్కృతి కలిగిన
    భరతమాత నీకు వందనాలు…”

    గర్వపడెద నింత ఘనవారసత్వమ్ము
    పొందినందుకేను పుణ్యభూమి!

    అభినందనలు!

  7. రాఘవ says:

    గిరి గారూ, 🙂 భలే

    రామకృష్ణారావు గారూ, “యతినిఁ దెలిసికొనఁగ ధాత తరమె” లో ప్రాసయతి చెల్లదనే కదా. వివరణకు ధన్యవాదములు.

    చంద్రమోహన్‌గారూ, నిజమే. అందుకే ముందే చెప్పాను ఇది కేవలం ప్రారంభించేవారికి అని. నడక అలవాటైన తరువాత ఈ చట్రాలు గట్రా పైపెచ్చు ఇబ్బంది పెట్టొచ్చు కూడ. చక్కగా పూర్తి చేశారు ఆటవెలదిని.

  8. టి.వి.ఎస్.ఆర్.కె.ఆచార్యులు says:

    నమస్తే రాఘవగారు !
    నేను ఎప్పటినుండో పద్య రచన చేయాలనే కోరికతో ఉన్నాను.ఈ రోజు ఒక ఆటవెలది పద్యం వ్రాశాను.నాకు భావాలు ఉంటాయి భాష కొద్దిగా తెలుసు .మీరు ఇచ్చిన స్ఫూర్తి మాలాంటి వాళ్లకు నేర్చుకోడానికి చాలా ఉపయోగకరం.ఈ తోలి ప్రయత్నంలో లోపాలు ఏమైనా ఉంటే తెలుపగలరు
    మదిని నిలిచి యుండి మాతల్లి వాగ్దేవి
    పలుకు తేనెవాక్కు పదిలమగుచు
    సత్య నిత్య భావ సారము నామది
    రాంకి పలుకు మాట రాచబాట

    • రాఘవ says:

      తొలి ప్రయత్నమనుచు దోషరహితముగా
      వ్రాసినారు మీరు! బాగు బాగు!
      హృద్యమైన కైతలిఁకపైన బాగుగా
      వ్రాతురనుచునెంతు రాంకిగారు.

      చాల బాగుందండీ. శుభం.

Comments are closed.