అహంకారి

ఆఖరున ‘భవిష్యత్తులో జాగ్రత్తపడ’మనే సలహా యివ్వకపోతే ఎంత బాగుణ్ణు అనిపించింది. దానికి బదులుగా ‘బెల్టు’ తీసుకుని ఆ రాత్రి నా ఒళ్ళంతా పగులగొట్టివున్నా, ఆ ఏడ్పులో జరిగిందేమిటో చెప్పుకుని సమాధానపడివుండేదాన్ని.

“అయితే యింకేముంటాయి విడాకులదాకా వచ్చే కారణాలు -ఇక మిగిలినవి కోపం, విసుగూ, మొండితనం వంటి లక్షణాలు తప్ప” అన్నాను. ఈసారి నా ఈ మాటని సురేఖ తప్పకుండా ఒప్పుకుంటుందన్న నమ్మకంతో.

ఆ నమ్మకం కూడా విఫలమైంది తర్వాత, సురేఖ సమాధానంతో-

“విడాకులు తీసుకున్న తర్వాత కూడా ‘ఒసే నా బ్రతుకు నాశనం చేశావుగదే నీచురాలా!’ అన్న ఒక్కమాట కూడా అనలేని మనిషికి కోపం, విసుగూ, మొండితనం ఉన్నాయనగలమా?” ఆమె నన్నే ప్రశ్నించింది. ఫ్యాను గాలికి ఆమె మెడ దగ్గర చున్నీ పక్కకి తప్పుకుంది. అక్కడ మెడక్రిందుగా ఛాతీకి పైభాగంలో చదునుగా, బిగుతుగా వున్న చర్మంలోకి రక్తనాళాలు లేత ఆకుపచ్చరంగులో వ్యాపించుకుపోయి ఆ ప్రదేశం కాంతివంతంగా, ఆకర్షణీయంగా కన్పించసాగింది.

నాకేం అర్థం కాలేదు. నాకు తెలిసినంత వరకూ భార్యాభర్తలు విడిపోవడం వెనుక నేను చూపించిన ఇటువంటి కారణాలే నూటికి నూరుపాళ్ళూ వుంటాయి. వాటికి భిన్నమైన సురేఖ సమాధానాలు నాకు విడ్డూరంగా తోస్తున్నాయి. అందుకే నేనిక ఆమెని ప్రశ్నించదలచుకోలేదు. అందుకే-

“మీ గొడవలేమిటో నువ్వే చెప్పు సురేఖా. నాకు అర్థం కావడం లేదు.” అన్నా.

ఆ మాటకి సురేఖ నిట్టూర్చింది. ఆపైన బాధగా, “సుబ్బారావుకీ నాకూ గొడవలెప్పుడూ వుండవు. ఈరోజు ఉదయం కూడా అతడితో, బాబుతో ఫోన్లో మాట్లాడా అరగంట సేపు.” అంది.

నాకు మండింది. “ఏదీ లేకుంటే నీకు తిక్కరేగి విడాకులిచ్చేవా?” అందామనుకున్నా. మళ్ళీ ఎందుకులే ఆ సమయంలో బాధపెట్టడమని ఏమీ తోచనట్టు మౌనంగా వుండిపోయా.

నన్ను చూసి సురేఖ నవ్వింది. ఆపైన నా కళ్ళలోకి చూస్తూ, “నిన్ను బాధిస్తున్న ప్రశ్నలేమిటో నాకు తెలుసు. నా విడాకుల గురించి నేనే చెబుతాలే విను.” అంది. మళ్ళీ తనే, “అంతా విన్నాక నాకు నువ్వు నీతులు చెప్పకూడదు.” అంది -సన్నటి నాజూకైన వేళ్ళతో నన్ను వారిస్తూ.

“నేను నీతులూ చెప్పను. చెప్పదలిస్తే నువ్వు ఆపనూలేవుగానీ జరిగిందేమిటో చెప్పు!” అన్నా.

సురేఖ చెప్పడం ప్రారంభించింది.

* * *

“నాదీ సుబ్బారావుదీ అన్యోన్యమైన దాంపత్యమో కాదో నాకు తెలీదుగానీ నేనన్నా, నా రూపమన్నా పంచప్రాణాలు సుబ్బారావుకి. అలాగే, పసుపు పచ్చటి రంగుతో ఆరడుల పొడవుండే ఇంజనీరు, ముగ్దమనోహరరూపుడు సుబ్బారావుని ఒక్కసారైనా ముద్దెట్టుకోవాలని కనీసం మనసులోనైనా భావించుకోని స్త్రీ ఈ లోకంలో వుంటుందంటే నేను నమ్మను. పెళ్ళయిన ఏడాది లోపే మాకు బాబు పుట్టాడు. నువ్వడిగిన ఏ అవలక్షణాలూ సుబ్బారావులో లేవుగానీ ఎందుకో అతడి సమక్షంలో నేనెప్పుడూ ఆత్మన్యూనతా భావంలో బ్రతికేదానిని. నాకు అందని, నేను పసిగట్టలేని, నేను తెలుసుకోలేని మహత్తరమైన శక్తి ఏదో సుబ్బారావులో వుంది. అదే మమ్మల్ని విడదీసింది.” అంది సురేఖ ప్రారంభంగా.

“నీకర్థం అవడం కోసం ఉదాహరణకి ఓ నాలుగు విషయాలు చెప్తా –

బాబుకప్పుడు వయసు రెండేళ్ళు. ఆరోజు సాయంత్రం ఏడుగంటలప్పుడు సుబ్బారావు ఆఫీసునుండి ఇంటికొచ్చాడు. నాతో ఆటలాడుకుంటున్న బాబుని చూశాడు. మామూలుగానైతే రోజూ నన్ను “గుడ్ ఈవెనింగ్ రేఖా!” అంటూ విష్ చేస్తాడు. ఆరోజు మాత్రం అతడు నాతో ఏం మాట్లాడలేదు. బాబుని చూడగానే ఏదో సందేహం వచ్చిన వాడిలా కప్ బోర్డ్ లోంచి థర్మామీటరు తీసి బాబు జ్వరం చూశాడు. ఆ తర్వాత, థర్మామీటరు పక్కన పెట్టి, బాబుని భుజాన వేసుకుని కార్లో డాక్టరు దగ్గరకి తీసుకువెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత నేను థర్మామీటరు చూస్తే నూట రెండుంది బాబు ఒంట్లో జ్వరం. నేను ఆశ్చర్యపోయాను. వాడితో అరగంట నుంచీ ఆటలాడుతున్నదాన్ని, పైగా డాక్టరు వృత్తిలో జీవిస్తున్నదాన్ని, నేను గ్రహించలేకపోయిన బాబు ముఖంలోని ‘పేథటిక్ ఫీలింగ్’ అప్పుడే ఇంటికొచ్చిన సుబ్బారావెలా పసిగట్టాడో నాకిప్పటికీ అర్థంకాదు.” సురేఖ ఆగింది.

డాక్టరు దగ్గర్నుంచి వచ్చాక నన్నేమైనా అంటాడని భయపడ్డాను.

నేననుకున్నట్టుగానే అన్నాడు గానీ అయితే ఆ అనడం నన్నుగాదు. “భోజనం రెడీ అయిందా?” అన్నాడు. అయిందన్నాను. అంతే. బాబుకి టాబ్లెట్లు వేసి, తనూ సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. ఆ రాత్రి నా మనసంతా ఏదో వెలితి. ఆలోచిస్తూనే ఓ గంట తర్వాత నేనూ నిద్రలోకి జారుకున్నాను. సగం రాత్రివేళ ఎందుకో మెళకువ వొచ్చి లేచి చూద్దునుగదా నాపక్కలో బాబూ, సుబ్బారావూ ఇద్దరూ లేరు. బెడ్ రూమ్ తలుపు తీసివుంది. వెతుక్కుంటూ డ్రాయింగ్ రూమ్ లోకెళ్ళాను. అక్కడ వాలుకుర్చీలో బాబు ఒళ్ళంతా తడిగుడ్డతో చుట్టేసి, నుదుటిమీద నిముషానికో తడిగుడ్డ పట్టీ వేస్తూ, బాబుని తన గుండెలమీద పడుకోబెట్టుకుని వున్నాడు సుబ్బారావు. తప్పుచేసినదానిలా నేను అతడి సమీపంలోకి వెళ్ళి, “ఏమైంది బాబుకి?” అన్నాను.

“ఏమీ కాలేదులే కంగారు పడకు. జ్వరం కంట్రోల్ అవుతోంది. ఇందాక నూట అయిదుంది. ఇప్పుడు నూట మూడుకొచ్చింది.” అన్నాడు నా చేతికి థర్మామీటరు అందిస్తూ.

సిగ్గుపడుతూనే దాన్నందుకుని చూస్తే అతడన్నట్టు నూటమూడు దగ్గరుంది టెంపరేచర్ రీడింగు.

“మైగాడ్! మీరు మెలకువగా లేకుంటే ఏమైవుండేదండీ అన్నా.” అతడి కాళ్ళ దగ్గర నేనూ చతికిల బడుతూ.

“ఏమౌతుంది రేఖా! నేనున్నాను గనుక ఆదమరిచావు గానీ, లేదంటే జాగ్రత్త పడవూ?” సుబ్బారావు తన స్వభావరీత్యానే అన్నా ఆమాట నాకు ‘నేనున్నాను గనుక బలిసి ప్రవర్తిస్తున్నావుగానీ లేదంటే జాగ్రత్తగా వుండవూ’ అన్నట్టు తోచి, చెంప ఛెళ్ళుమనిపించినట్టయింది. మళ్ళీ నాలో అదోరకం పశ్ఛాత్తాప భావన. అలాగే సుబ్బారావు మోకాలుమీద తలాన్చి ఆరాత్రి అలా కూర్చుండిపోయా. ఇక నిద్రపోకుండా.

మరోరోజు బాబు కంట్లో ఏదో నలుసు పడింది. వాడు ఏడుస్తున్నాడు. నేనెంత ప్రయత్నించినా ఆ నలకని తీయలేకపోయా. వాడ్ని సముదాయించలేకనూ పోయా. నైటీ విప్పేసి, గబగబా వేరే డ్రెస్ వేసుకుని బాబుని డాక్టరు దగ్గరకి తీసుకుపోబోతుండగా సుబ్బారావు ఎదురయ్యాడు బయటనుండి. విషయం తెలుసుకుని “అన్నింటికీ డాక్టరేనా రేఖా? ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకురా!” అంటూ బాత్రూంలోకెళ్ళి, మౌత్ లోషన్ తో నోరు శుభ్రపరచుకొచ్చాడు. నేనిచ్చిన మంచినీళ్లు నోట్లో పోసుకుని బాబు నలుసు పడ్డ కంటిరెప్పలు తెరిచి, నీటిని కంట్లోకి వేగంగా పంప్ చేశాడు. అట్లా రెండు సార్లు చేశాడోలేదో అప్పటికి అరగంట నుండీ గుక్కపెట్టి ఏడుస్తున్న బాబు ఠక్కున ఏడ్పు ఆపేసి ఆటల్లో పడ్డాడు. సుబ్బారావు బాబుని వదిలి నావైపు చూస్తూ, “ఇదే పని మీ డాక్టర్లు సిరంజితో, రెండొందల రూపాయల ఫీజుతో పూర్తి చేస్తారు. ఔను కదూ?” అన్నాడు నవ్వుతూ.

“అవును. ఇంట్లో సిరంజి వుంది. అయినా నాకు ఐడియా రాలేదు.” అన్నా.

“భయంలో ఏదీ తోచదులే!” అంటూ షర్టు విప్పుతూ స్నానం కోసం బాత్రూమ్ వైపు నడిచాడు. మరోసారి నాలో చిన్నతనపు భావన–పదంతస్తుల భవంతి పక్కన పూరి గుడిసెలో జీవించేవాడి మనసులా.

మాకు ఇంట్లో ఉదయం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం మామూలు భోజనం, రాత్రి చపాతీలు తినడం అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను చపాతీలు తినడం గమనించి సుబ్బారావు, “ఎందుకు చపాతీలు?” అని అడిగాడు.

“డైటింగ్ చేస్తున్నా”నన్నాను.

అతడు ఆశ్చర్యపోయాడు. “నీది పలుచని శరీరం. చక్కగా, ఆరోగ్యంగా వున్నావు నీకెందుకు డైటింగ్?”అన్నాడు.

“ఏమో ముందు ముందు లావవుతానేమోనని” అన్నా.

“అయితే అందుకు తిండి మానకు. మధ్యాహ్నం కూడా భోంచేయలేదంటే నీరసపడతావు. శరీరంలో రక్తం తగ్గిపోతుంది. నీకు తెలీనిదేముంది? అసలే ఆడవాళ్ళకి రక్తం అవసరం ఎక్కువ. కావాలంటే మధ్యాహ్నం రైస్ కొద్దిగా తగ్గించి దానికి బదులుగా రోజూ ఆకుకూరలూ, ఫ్రూట్సూ తిను.” అన్నాడు.

“ఈ మామూలు వంటకాలతో పాటు ఆ ఆకుకూరలు కూడా చేయడం నావల్ల కాదు బాబూ!” అన్నా. అతడు చెప్పింది నిజమే అయినా వృత్తిరీత్యా డాక్టరునైన నాకు అతడు ఆరోగ్య సలహాలివ్వడం నచ్చలేదు. బహుశా యిటువంటి ‘ఇగో’ ఫీలింగులతోనే భార్యాభర్తల మధ్య స్ఫర్థలేర్పడతాయనుకుంటా.

ఏమనుకున్నాడో ఏమో ఆ మరుసటి రోజున నేను ఓ ఆపరేషన్ కి అటెండయి మధ్యాహ్నం యింటికొచ్చేసరికి తనే ఏదో ‘లీఫీ వెజిటబుల్ కర్రీ’ వండి, దాన్ని డైనింగ్ టేబుల్ మీద వుంచి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. నాకు సిగ్గనిపించింది. ఆ రాత్రి అదే మాట అడిగా. “ఎందుకలా వండి పెట్టార”ని.

“నీకు ఓపిక లేదన్నావుగా?” అన్నాడు సుబ్బారావు.

“అయితే మీరంత శ్రమ తీసుకుని. . .?”

“ఇందులో శ్రమేముంది రేఖా. పనిమనిషి ఆకులు తుంచి యిచ్చింది. ఉదయం పూట నేనెలాగూ ఓ అర్థగంట ఖాళీ గదా. అట్లా ఖాళీగా వుండడంకన్నా మన ఆరోగ్యం కోసం ఏదైనా చేయడం మంచిదనే చేశా. నువ్వూ బాగానే అలిసిపోతున్నావు.” అన్నాడు.

భార్యని అలా చూసుకునే భర్తలు చాలా అరుదుగా ఉంటారని నాకు తెలుసు. సుబ్బారావు నాపై తన ప్రేమను చాటుకునే ప్రతిక్షణం నాలో ఏదో వెలితి ద్యోతకమయ్యేది. ప్రతిక్షణం నన్ను అధిగమిస్తూ అతడలా చేయకుండా వుండాల్సిందనే భావన. ఆ మరుసటి రోజు నుండీ అతడికా అవకాశం యివ్వకుండా నేనే ఆకుకూరలు వండడం మొదలెట్టా.

తర్వాత, మా హాస్పిటల్ లో కో-సర్జెన్ డాక్టర్ ప్రదీప్ నాతో బాగా చనువుగా వుండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ నన్ను ‘ఎంటర్ టెయిన్’ చేస్తూండేవాడు. ఆపరేషన్లు జరిగేటప్పుడు చాలా సార్లు అతడి చేతులూ, కాళ్లూ నాకు తగిలించేవాడు. నన్ను రాసుకుంటూ, నా చుట్టే తిరుగుతూ చాలా ‘క్లోజ్’ గా మూవ్ అయ్యేవాడు. అదంతా వృత్తిలో మాకు సహజమే గనుక నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఓరోజు నేను ఓ ఆపరేషన్ కి ముందు నా ‘డ్రెస్సింగ్ రూమ్’ లో కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని వెనక్కివాలి రిలాక్సైవుండగా, ఎక్కడ నుండి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో తెలీదుగానీ డాక్టర్ ప్రదీప్ నా వెనుకనుండి వచ్చి నా ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటిమీద, చెంపలమీద గట్టిగా ముద్దులు కురిపించేశాడు. భయంతో ఉలిక్కిపడి, అతడి చేతులు వదిలించుకున్నా. చటుక్కున లేచి వెనక్కి చూసేటప్పటికి వెకిలిగా నవ్వుతూ నాకు దగ్గరగా డాక్టర్ ప్రదీప్ -అతడి వెనుక తలుపు దగ్గర నాతో పనుండి నాకేదో చెప్పడానికని సడన్ గా అక్కడికొచ్చిన సుబ్బారావు. సుబ్బారావు ముఖం పాలిపోయి వుంది. నేనా షాక్ నుండి తేరుకునే లోపలే సుబ్బారావు వెనుదిరిగి మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత, నేను డాక్టరు ప్రదీప్ గురించి హాస్పిటల్ ‘మేనేజ్ మెంటుకి’ కంప్లెయింట్ చేసి అతడ్ని మరో హాస్పిటల్ కి ట్రాన్స్ ఫర్ చేయించాను. కానీ, మా యింట్లో మాత్రం ఆరోజు మౌనం రాజ్యమేలింది. జరిగిందేమిటో నేను సుబ్బారావుకి వివరించబోయాను. అతడు నన్నేమీ చెప్పొద్దన్నట్టు వారిస్తూ, ఒకటే మాటన్నాడు.

“చూడు రేఖా! మనం మన గురించి అనుకునేప్పుడు మనం ఒక్కళ్ళమే ఒంటరి మనుషులం అనుకుంటాం. కానీ కాదు. పెళ్ళికిముందు, మనం అంటే మనం ఒక్కరమే కాదు. మన తల్లిదండ్రులూ, అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ముళ్ళూ అందరం. అంటే మన వృద్ధికి సంతోషించేవాళ్ళూ, కష్టానికి బాధపడేవాళ్ళూ అందరితోనూ మనకి బాధ్యత ముడివడి వుంటుందన్నమాట. అలాగే పెళ్ళయిన తర్వాత, మనం అంటే మన జీవిత భాగస్వామీ, మన పిల్లలూ అందరూ కలిసి అన్నమాట. ఇప్పుడు నువ్వంటే నువ్వు మాత్రమే కాదు. నేనూ, బాబూ కూడా. మా ఇద్దరి జీవితాలూ నీతోపాటు ముడివడివున్నాయి. నువ్వు తప్పు చేశావూ అంటే దాని ఫలితం మేమూ అనుభవించక తప్పదు. దీని భావం ఈ రోజు జరిగినదాన్లో నీ తప్పు ఉందని నేనంటున్నట్టు కాదు. అలాగే నాకు తెలీదు గనుక, లేదనీ అనుకోను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. ఈ సంఘటన మనిద్దరి జీవితాల్లో ఎటువంటి ప్రభావం కలిగించదు. మనం దీన్నిక్కడే ఇప్పుడే మర్చిపోతున్నాం. కానీ, మున్ముందు నీ వెనుక మేం ఇద్దరం నిల్చుని వున్నామనే విషయం నువ్వు ఎప్పటికీ విస్మరించకూడదు. సరేనా? రా భోంచేద్దాం గానీ!” అన్నాడు నా చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి నడుస్తూ.

గుండెని ఏదో బలమైన సాధనంతో పెళ్ళగించినట్టయింది అతడన్న ఆ చివరి మాట విని. అన్ని మాటలు చెప్పిన సుబ్బారావు ఆఖరున ‘భవిష్యత్తులో జాగ్రత్తపడ’మనే సలహా యివ్వకపోతే ఎంత బాగుణ్ణు అనిపించింది. దానికి బదులుగా ‘బెల్టు’ తీసుకుని ఆ రాత్రి నా ఒళ్ళంతా పగులగొట్టివున్నా, ఆ ఏడ్పులో జరిగిందేమిటో చెప్పుకుని సమాధానపడి వుండేదాన్ని.

<<మొదటి పేజీమూడవ పేజీ>>

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

17 Responses to అహంకారి

  1. Sreenivas says:

    Chala Baagundi. Thanks to the writer and Poddu

  2. @ విజయకుమార్ గారు
    చాలా బాగుందండి. అసలు సిసలైన కథా విషయం. ఈ తరం పోల్చుకోగలిగే అంశం. Original piece of work! గతంలో మనుషుల ఇష్టా ఇష్టాలకన్నా భాధ్యతలకే అందరూ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు నాది,నేను, నా పర్సనల్ స్పేస్.. వీటిని గౌరవించీ, ఎదుటి వారి పట్ల భాధ్యతాయుతంగా ఉండటం అనేది కత్తి మీద సాము లాంటిది. మనం భాధ్యతలు పంచుకోవాల్సిన సమయంలో వాళ్ళు పర్సనల్ స్పేస్లో ఉంటారు! మంచి చెడులు చెప్తుంటే తన అభిప్రాయలకి, ఇష్టాలకి వ్యతిరేకమనుకుంటారు. ఈ ఆలోచనే, మన కుటుంబ సభ్యులతో కూడా మనం నిస్సంకోచంగా,స్వేచ్చగా ఉండనినివ్వకుండా చేస్తుంది.

    నేను ఎదుటివారి పట్ల భాధ్యతగా వ్యవహరించాలా,వాళ్ళకిష్టమొచ్చినట్టు ప్రవర్తించాలా అనే సంఘర్షణకి ఎప్పుడూ గురవుతాను.భాధ్యతగ వ్యవహరించకపోతే నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేను, అంతర్ సంఘర్షణని భరించలేను. ఎదుటి వారికి ఇష్టమొచ్చినట్టు ఉండకపోతే వారికి దూరమవుతాను!

  3. వంశీ says:

    నేనో చిన్న ఐ.టి జాబ్ చేస్తునాను. ఈ రోజు ఎందుకో నెట్ లో ఏమైనా తెలుగు కథలు దొరుకుతాయేమోనని వెతికాను. దాదాపు 5 సం|| తరువాత “అహంకారి” చదివాను.

    ఒక మనిషికి వ్యక్తిత్వంతో పాటు ఎదుటివారి ఆలోచనలనికూడా గౌరవించాలన్న విషయం మరోక్క సారి “అహంకారి” తో గుర్తుచేసారు…

    చాలా రోజుల తరువాత మంచి కథ చదివిన feeling కలిగింది.

  4. Purnima says:

    మీ కథ నాకు నచ్చింది. “ఇది నా జీవితం.. పూర్తిగా నా వ్యక్తిగతం” అని అనుకుని క్షణికావేశం అయితే బంధాలను లేకపోతే మనుషులనో చంపేస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి వారు ఒక్క క్షణం ఆలోచిస్తే తమతో ఎన్ని జీవితాలు పెనవేసుకుపోయాయో తెలుస్తుంది.

    మొన్నీ మధ్య మా స్నేహితురాళ్ళతో ఎదో చర్చ వచ్చి.. “Financial Independence ఉందంటూ అమ్మాయిలూ బంధాలలో ఇమడలేకపోతున్నారు” అని నా అభిప్రాయం చెప్పా.. దానికి సరిగ్గా తూగినట్టు ఉంది మీ కథ.

    “కవితలల్లీ, రచనలు చేసీ…” అంటూ మీ నాయికను ప్రొజెక్ట్ చేయడం నచ్చింది. ఊహాలోకం అందంగానే ఉంటుంది, మనం మాత్రమే నిర్మించుకుంటాం గనుక. నిజజీవితంలో “నా”, “నీ”, “మన” అన్నింటికీ విలువ ఇవ్వాలి. అందుకే అది క్లిష్టమైనది.. అందమైనది.

    ఓ మంచి అనుభూతి మిగిల్చింది మీ కథ. అభినందనలు.

    పూర్ణిమ

  5. Sneha says:

    మీరు ఎంచుకున్న కథాంశం బాగుందండి. కాని సురేఖ పాత్ర ను చూపించిన విధానం అంతగా నచ్చలెదండి. సురేఖ మంచి సుక్ష్మగ్రాహ్యత కలిగిన స్త్రీ అని, మానసిక పరిణితి కలిగిన స్త్రీ అని ఒక దగ్గర చెప్పారు. మరి అంత లొనె తన కొడుక్కి జ్వరం వస్తే కూడ తెలుసుకొలేని డాక్టర్ అని చెప్పారు మరోచోట.

    కంట్లొ నలక పడితె డాక్టర్ అయివుండి డాక్టర్ దగ్గరికి తీసుకువెల్లడం ఎంటొ అర్థం కాలేదు. డాక్టర్ అయివుండి ఎప్పుడొ లావు అవుతానని డైటింగ్ చెయడం ఎంతొ అర్థం కాలెదు. ఈ స్త్రీ కయిన మగవాళ్ళు పొరపాటున తగలడానికి కావాలని చేతులు కాళ్లు తగిలించడానికి తేడా తెలుస్తుంది. కాని సురేఖ కి ఎందుకు తెలిదొ అర్థం కాలెదు. అంత వ్యక్తిత్వం వున్న సురేఖ దొంగతనం గా ఆపరెషన్ చేయించుకొవడం అర్థం కాలెదు.

    సుబ్బారావు అహంకారి అని చుపించడానికి డాక్టర్ అయిన సురేఖ ను మరీ అంత తక్కువ చేసి చుపించనవసరం లెదెమొ అనిపిస్తుందండి.

  6. radhika says:

    మంచి అంశాన్ని ఎంచుకున్నారు.చాలామంది అన్వయించుకోగలిగే సమస్యల్ని చూపించారు.కధ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో సురేఖ గురించి ఎందుకు ఇంత అనవసర వర్ణన అనుకున్నాను.చివర్లో లింక్ కలిపి ఆశ్చర్యపరిచారు.మొత్తమీద కధ బాగుంది.అభినందనలు.

  7. కె.మహేష్ కుమార్ says:

    చాలా మంచి కథ. ఎక్కడా value judgment ఇవ్వకుండా, కేవలం పాత్రల మధ్యనున్న మానవసంబంధాలను తెలియజెప్పడం ఒక గొప్ప ప్రయత్నం.

  8. అద్బుతంగా ఉంది విజయకుమార్ గారు. ఇంత చక్కటి కథలు రాయగలిగే మీరు ఆరు సంవత్సరాలుగా రాయకపోవటం అన్యాయం.

  9. చాలా బాగా రాశారండీ. మంచి సంక్లిష్టమైన ఇతివృత్తం. కథకుడి గొంతుని కథనానికి వాడుకున్న తీరు చాలా బావుంది. చివరి మూత్రపిండ దానం సీనుకి ముందే ఆపేసి ఉంటే బాగుండేదేమో!

  10. కడప says:

    ఈ కథలో నాకు ఏదో వెగటు తగిలింది. అయినా ఎంత వద్దనుకున్నా కథ చాలా బాగుందనే అనిపిస్తావుంది. కథాంశానికొచ్చేటప్పుటికి ఈ కథలోని నీతిని అడుగడుగునా మననం చేసుకుని ఎప్పటికప్పుడు అంతశ్శోధన చేసుకోదగినదిగా వుంది. కథలో వేలుపెట్టడానికి పూనుకుంటే మటుకు పైన స్నేహగారి వ్యాఖ్య నిశితంగా వుంది. కథన్నాక ఆ మాత్రం డ్రామా వుండాల్నేమో!

  11. వింజమూరి విజయకుమార్ says:

    @శ్రీ చావా కిరణ్ గారికి,

    ఆది బ్లాగరు మీరు ముందుగా నా కథకి వ్యాఖ్య రాయడం శుభప్రదం. నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కృతజ్ఞతలు.

    @శ్రీనివాస్ గారికి,

    కథ చాలా బాగుందన్నారు. ధన్యవాదాలు.

    @ఏకాంతపు దిలీప్ గారికి,

    మీ వ్యాఖ్య నన్ను ఆలోచింపజేసింది. నిజమే. పాత తరాలకీ, నేటి తరానికీ మీరు చూపిన వ్యత్యాసం నూటికి నూరుపాళ్ళూ నిజం. మనం బాధ్యతగా వుంటూనే, ఎదుటివాళ్లు యిష్టపడేలా నడుచుకోవడం అంటే రెంటినీ సమన్వయం చేసుకుంటూ జీవించడంలో ఈ అంతర్ సంఘర్షణ బహుశా వుండదనుకుంటా. మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు.

    @వంశీ గారికి,

    మంచి కథ చదివిన ఫీలింగ్ కలిగిందన్నారు. అంతకుమించి నాకు కావల్సిందేముంది. ధన్యవాదాలు.

    @పూర్ణిమ గారూ,

    కథ రాశాక ఈ కథకి స్త్రీలెలా స్పందిస్తారోనని భయపడ్డా. స్త్రీగా మీ మొదటి వ్యాఖ్య (ఈ కథకి) చదివి ‘అమ్మయ్య’ అనుకున్నా. మీరన్నమాటలు “Financial Independence ఉందంటూ…” నేనూ నిజమనే భావిస్తా. నా కథ మంచి అనుభూతి మిగిల్చిందన్నారు. అలాగే అదే వ్యాఖ్యని నా బ్లాగులో కూడా రాశారు. మీ వ్యాఖ్య కూడా నాకు మంచి అనుభూతినే మిగిల్చింది. మీకు రెండుసార్లు కృతజ్ఞతలు.

    @స్నేహ గారికి,

    ముందుగా మీరు వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు.

    ఎంతో తెలివైన వారైనప్పటికీ, తన కొడుకు ఒంట్లో కాదుగదా తన ఒంట్లో జ్వరం కూడా తెలుసుకోలేని డాక్టర్లు కూడా కొందరున్నారీ లోకంలో. M.D., చేసి, మరేదో specialization చేసి ఒక హాస్పిటల్లో పాథాలజిస్ట్ గా వున్న ఓ Expert Doctor తనికి నీళ్ళ విరేచనాలైతే మరో డాక్టరు దగ్గర చూపించుకోవడం మొన్నీ మధ్యనే నేను చూశాను. మీరు నమ్మినా నమ్మక పోయినా.

    ఇదే విధంగా మీరు వేలెత్తి చూపిన కథలోని ప్రతి అంశానికీ నేను వివరణ యివ్వగలను. కానీ, యివ్వను. ఎందుకంటే ఎక్కడైనా రచయిత వివరణ యావత్తూ తన రచనని సమర్థించుకునేదిగానే వుంటుందనేది అందరికీ తెలిసిందే. అయినా, మీ తర్వాత ‘కడప’ పేరుతో వ్యాఖ్య రాసిన వారన్నట్టు కథన్నాక ఆ మాత్రం డ్రామా కూడా వుండాల్నేమో అని నేనూ అంటాను. ఏమైనా మీకు కృతజ్ఞతలు.

    @రాధిక గారూ,

    నేనెప్పుడూ చెప్పుకోడానికి సందర్భం రాలేదుగానీ మీ కవితలన్నా, వ్యక్తిగా మీరన్నా నాకు గౌరవం. ఎందుకంటే మీ గురించి తోటి బ్లాగర్లను అడిగినప్పుడు స్త్రీలతో సహా ప్రతివారూ మీరు స్నేహశీలి అనీ, మంచి వ్యక్తి అనే చెప్పారు. అందుకే మీ టపాలకి ఎక్కువ సంఖ్యలో వ్యాఖ్యలొస్తాయనీ అన్నారు. అలాగే మీకు స్వంత ఊరిమీద, దేశం మీద ఉన్న మమకారం గురించి కూడా నాకు తెలుసు.

    మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష అనుకుంటా. మీ వ్యాఖ్యకి బుణపడివుంటాను.

    @మహేష్ కుమార్ గారికి,

    మీరన్నట్టు value judgment యివ్వకపోవడం మంచిదే అయింది. అయితే ఈ ఘనత నాది కాదు. పొద్దు సంపాదకవర్గం శ్రీ త్రివిక్రమ్ గారిది. ఎందుకంటే నేను కథ చివర్లో judgment యిచ్చాను. ‘పొద్దు’ వారు తీసేద్దామని నాచేత తీయించేశారు.

    @నాగరాజు గారూ,

    మీ ప్రోత్సాహానికి సదా బుణపడి వుంటాను. మీరు సూచించినట్టు తరచుగా రాయడానికి ప్రయత్నిస్తాను. అలాగే శ్రమించి రాసే మీ రచనలన్నా నాకు చాలా ఆసక్తి.

    @కొత్తపాళీ గారూ,

    అసలు మీరిచ్చిన తెల్లకాగితం ఇతివృత్తంతో నేను అప్పుడే ఇంత పెద్ద కథొకటి రాయాలనుకున్నా. సమయాభావం వల్ల రాయలేకపోయా. బ్లాగులో ప్రముఖులు మీవంటి వారి వ్యాఖ్యలు నాకు ప్రోత్సాహకరం. ధన్యవాదాలు.

    @‘కడప’ పేరుతో రాసిన వారికి,

    ఈ కథ మీకే కాదు ప్రచురణ పూర్తయ్యాక చూస్తే నాకు కూడా కొంత వెగటు తగిలింది. దానికి కారణం బహుశా తొందర తొందరగా కథ రాసేయడం. అయినా కథా వస్తువు ఇక్కడ ప్రతివ్యక్తీ self identify చేసుకునే విధంగా వుందనుకుంటా. కృతజ్ఞతలు.

  12. viswam says:

    katha maanava manastatvanni chakkaga visleshichindi.kathalo freudahamni santrupti parachagalagadam ante manaku emi kaavalo telusu kani samajam daanini amodinchademo ane bhayam edi emina avari spacelo vaaru batakadam ane kotta prayogam adbutam

  13. వింజమూరి విజయకుమార్ says:

    @ విశ్వం గారికి,

    కథ విపులంగా చదివినట్టున్నారు. కృతజ్ఞతలు.

  14. p.a valli says:

    katha lo theme bagundi. kani surekha ni anthaga degrade cheyyakkaraledomo. Na ane atmabimananike mana ane sambamdhaniki madhya sangharshana vuntune vuntundi. valli

  15. m.s.bhairim says:

    kathanu nadipinchadam bagundi kaani prolonged a lot

  16. sunnygaadu says:

    చాలా బాగుంది,చాలా రొజుల థరవాథ మంచి కథ చదివాను,థాంక్స్..
    కొథ కథలు వ్రాస్థె నా మైల్ చయంది…
    ఆల్ ది బెస్త్….

Comments are closed.