అస్తమించిన “ఏడో చంద్రుడు”

– సుధారాణి

రాచకొండ విశ్వనాథశాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు.

ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు.

ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు.

జులై 30 రావిశాస్త్రి గారు పుట్టిన రోజు. శ్రీకాకుళం లో 1922 లోనారాయణమూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించారు. రావిశాస్త్రి గారికి మహ దేవశాస్త్రి అనే అన్నగారు, నరసింహ శాస్త్రి, సుబ్బారావు అనే తమ్ముళ్ళు, నిర్మల అనే చెల్లెలు ఉన్నారు. తండ్రిగారు కొంతకాలం ప్లీడరుగా పనిచేసి వ్యవసాయం లోకి దిగారు. శాస్త్రి గారి చదువు విశాఖపట్టణం లో సాగింది.

రావిశాస్త్రి గారి తల్లికి సంగీతసాహిత్యాలలో గల పరిచయం పిల్లలపై ముఖ్యంగా శాస్త్రిగారిపై చాలా ప్రభావం చూపింది. సమకాలికమైన పత్రికలు, పుస్తకాలు చదవడం వలన రాజకీయ, సాహిత్య విషయాలతో పరిచయం ఏర్పడింది. సాహిత్యమే కాక సంగీతంలో కూడా రావిశాస్త్రిగారికి మంచి అభిరుచి ఉండేది.

రావిశాస్త్రి గారిని విశ్వంగా ఇంట్లోను, ఆర్వీయస్ గా కోర్టులోను, చాత్రిబాబుగా క్లయింట్లతోను, రావిశాస్త్రిగా పాఠక లోకంలోను పిలవడం చాలా మందికి తెలుసు. కానీ రాచకొండ విశ్వనాథ శాస్త్రిగా అల్పజీవి నవలారచయితగా తెలియక ముందు, శాస్త్రిగారు తన పదహారవ ఏటనే రచనలు చేశారని, చాలా కథలు అప్పటి ప్రముఖ పత్రికలలో అచ్చుపడ్డాయని కొందరికే తెలుసు.

నిజజీవితంలోనే కాక రచయిత గా కూడా రావిశాస్త్రిగారికి బోలెడు మారుపేర్లు. కాంతాకాంత, జాస్మిన్, గోల్కొండ రాం ప్రసాద్, శంకర గిరి గిరిజా శంకరం, అన్ జానా ఇలాంటి పేర్లతో ఎన్నో కథలు వ్రాశారు రావిశాస్త్రి.

రచయితగా తన రచనల తొలిదశ గురించి చెప్తూ రావిశాస్త్రి తన తొమ్మిదవ యేటనే ఒక డిటెక్టివ్ కథను, రసపుత్ర వీరుల గురించి ఒక అసంపూర్తి నవలను వ్రాశానని, కొనసాగింపు తెలియక ఆపేశానని చెప్పారు. ఆయన పదహారవ ఏట 1938 లో దేవుడే చేసాడు అన్న పేరుతో వినోదిని పత్రికలో అచ్చయిన కథ ఆయన తొలి రచన. ప్రేమ ఫలితం, ఉద్యోగం దొరక్కపోతే, మీరే ఆలోచించండి కథలు విద్యార్థి దశలో ప్రచురించబడిన కథలు.

పంజరంలో చిలక, రైలుప్రయాణం పోరుపడలేక, స్వప్నమా సత్యమా మొదలైన కథలు వ్రాసిన రావిశాస్త్రి క్రమంగా రచనా వ్యాసంగం మానుకున్నారు. మంచి కథలు రాయలేకపోతున్నానన్న నిరుత్సాహమే దీనికి కారణం అన్నారు రావిశాస్త్రి. వివాహానంతరం భార్య సోమిదేవమ్మ గారు తన భర్త రచయిత కూడానని తెలిసి ఆశ్చర్యపోతే, ఆవిడని పదే పదే ఆశ్చర్యపరచడం కోసమే కథలు వ్రాసేనన్నారు. అలా దయ్యాలకు ద్వేషాల్లేవు పేరుతో ప్రారంభించిన కథా ప్రస్థానం ఆయన చివరి నవల ఇల్లు వరకు కొనసాగింది.

రావిశాస్త్రి గారి కథలను వస్తురీత్యా గమనించినప్పుడు 1950 తరువాత వ్రాసిన కథలకు, 1970 తరువాత వ్రాసిన కథలకు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కథనం, శిల్పంలో చమత్కారాలు, వర్ణనల విషయం పక్కన పెడితే వస్తువరణలో ఈ తేడా కనిపిస్తుంది.

రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి అయ్యారే బాబారే పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక నాలుగు నెలల పాటు ధారావాహికంగా అల్ప జీవి గా పేరు మార్చి ప్రచురించింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది.

రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి అయ్యారే బాబారే పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక నాలుగు నెలల పాటు ధారావాహికంగా అల్ప జీవి గా పేరు మార్చి ప్రచురించింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది. రచయిత విశాఖ వాస్తవ్యుడని తెలిసి విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది.

విశాఖ రచయితల సంఘంలో బలివాడ కాంతారావు, కాళీపట్నం రామారావు, అంగర సూర్యారావు వంటి వారి పరిచయం రావిశాస్త్రిలోని రచయితకి కొత్తచూపునిచ్చింది. కేవలం తను రచయితగా గుర్తించబడాలన్న కోరిక మాత్రమే నేపథ్యంగా ఉన్న కథారచనకి ఒక ప్రయోజనం, నిబద్ధత ఉండాలనుకోవడంతో పరిణామం చెందింది. తనదైన ఒక దృక్పథాన్ని నిర్దేశించుకోవడానికి బీజం వేసింది విశాఖ రచయితల సంఘం.

విశాఖ నాటక కళా మండలి, సహవిద్యార్థి అబ్బూరి వరదరాజేశ్వరావు స్థాపించిన నటాలి సంస్థ నటుడిగానే కాక నాటక ప్రయోక్తగా కూడా రావిశాస్త్రిని మలిచాయి. గురజాడ కళాకేంద్రం స్థాపించి వచ్చేకాలం, నిజం నాటకాలను రచించి ప్రదర్శించారు .

1950 – 1960 మధ్య వ్రాసిన ఎన్నోకథలలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవన చిత్రణే కథావస్తువు. ఈ వర్గానికి చెందిన వారి జీవితాలలోని సమస్యలు, వాటికి కారణాలను వెతుకుతూ అందులోని జీవనవైఫల్యం, అంతర్లీనంగా ఉన్న విషాదం, మానవ సంబంధాలను ఆర్థిక కారణాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తూ సాగిన ఈ కథల పై రావిశాస్త్రి అభిప్రాయం అయ్యో అయ్యో కథలు మాత్రమే.

1960 ప్రాంతాలలో మద్రాసు ప్రొహిబిషన్ ఆక్టు ప్రకారం ఆంధ్ర దేశంలో మద్యపాన నిషేధ చట్టం అమలు లోకి వచ్చింది. ప్రభుత్వపరంగా నిషేధించబడిన సారా దొంగసారా రూపంలో విచ్చలవిడిగా స్వైరవిహారం చేసింది. మోటారు సైకిల్, రిక్షా చక్రాల ట్యూబుల దగ్గర నుంచి ఆడవారి చీరల మాటున సారా ఏరులా ప్రవహించింది. ఈ దొంగసారా రవాణాకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పడింది. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా సారా రవాణాలో ఎందరో సహకరించారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం లోని అవినీతి మద్యపాన నిషేధ చట్టం విఫలం కావడానికి ప్రధాన కారణం అయింది.

అప్పుడప్పుడే స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించి న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన రావిశాస్త్రికి జీవితంలోని మరో పార్శ్వాన్ని కొత్త కోణంలో చూడడానికి అవకాశం కలిగింది. సారా రవాణా కోసం ఏర్పడిన కొత్త వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందిన పేదలు అతి ముఖ్యమైన పాత్ర వహించారు. పోలీసుల ఆచూకిని పసిగట్టి హెచ్చరించగలిగే ఇన్ ఫార్మర్లుగా, పట్టుబడితే యజమానికి బదులుగా శిక్ష అనుభవించడానికి సిద్ధపడే వారిగా ఉంటూ వ్యాపారానికి సహకరించారు. పట్టుబడితే జరిమానా తాము కడతామని చెప్పి ఆ తర్వాత మోసం చేసిన కాంట్రాక్టర్ల వల్ల జరిమానా కట్టలేక శిక్షలు పడిన వారు, పోలీసులకు మామూళ్ళు ఇవ్వక పోవడం వల్ల అక్రమంగా కేసులు బనాయించబడిన వాళ్ళు – ఇలా ఎందరో పేద క్లయింట్లు రావిశాస్త్రిగారి సహాయం కోసం వచ్చేవాళ్లు.

రచయితగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంటున్న రావిశాస్త్రికి తానెవరివైపు నిలబడాలో, తన రచనల వలన ఆశించే ప్రయోజనం ఏమిటో తేల్చుకోవలసిన అవసరం వచ్చింది. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది అలగా జనమేనని, డబ్బు, పదవి, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పు చేసినా తప్పించు కోగలుగుతున్నారని తెలుసుకున్నారు.

రచయితగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంటున్న రావిశాస్త్రికి తానెవరివైపు నిలబడాలో, తన రచనల వలన ఆశించే ప్రయోజనం ఏమిటో తేల్చుకోవలసిన అవసరం వచ్చింది. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది అలగా జనమేనని, డబ్బు, పదవి, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పు చేసినా తప్పించు కోగలుగుతున్నారని తెలుసుకున్నారు.

ఏ పాపం ఎరగనివాళ్లు జెయిళ్ళలోను, బయటా కూడా మగ్గుతూనే ఉన్నారు. పాపంలా పెరిగిన పెద్దవారు ఎన్ని పాపాలు చేసినా వారే పెద్దవారిగా ప్రభువులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు గాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికి అవకాశం లేదు కాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది – అని తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రావిశాస్త్రి రచనలలో చాలా మార్పు వచ్చింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతపు ప్రజల జీవన విధానాలు, మానవ మనస్తత్వాలు ప్రధానంగా చిత్రిస్తూ వచ్చిన తెలుగు కథా ప్రపంచానికి పట్టణ జీవితపు అధోః జగత్తుని విభిన్న కోణాలలో చిత్రిస్తూ సాగిన సారా కథలు ఒక కొత్తలోకాన్ని పరిచయం చేసాయి. మనతోనే ఉంటూ మనం రోజూ చూస్తున్నవారి జీవితాలలో ఎంత విషాదం ఉందో, పేదరికం వారి మధ్య పరస్పర సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించాయి. సంఘంలో నాగరిక జీవనం కోసం ఏర్పరచుకున్న నీతి సూత్రాలన్నీ పేదరికం ముందు బలాదూర్ అయిపోతాయి. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలు పెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే, అసహాయులే అని రావిశాస్త్రి కథలు నిరూపించాయి.

రావిశాస్త్రి మధ్య తరగతి విషాదాన్ని ఆవిష్కరిస్తూ సాగిన అయ్యో అయ్యో కథలు సారో కథలైతే, అధో జగత్తుకు చెందిన వారి బ్రతుకు పుస్తకాలను తెరిచి చూపించినవి సారా కథలు.

ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపచేసే కళాఖండాలని, అటువంటి రసానుభూతినే తాను రసన అంటానని, రావిశాస్త్రి రచనలు రసనను సమృద్ధిగా ఆవిష్కరించగలుగుతున్నాయని మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్నాయి రావిశాస్త్రి రచనలు.

తనని ఉర్రూతలూగించిన శ్రీశ్రీ మీద గౌరవంతో శ్రీశ్రీ కావేవీ కవితకనర్హం అంటూ చెప్పిన కవితా వస్తువులను కథా వస్తువులుగా స్వీకరించి కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, బల్లచెక్క, అరటితొక్క, తలుపుగొళ్లెం, హారతి పళ్లెం, గుర్రపు కళ్ళెం పేరుతో కథలు వ్రాసారు. చివరి గుర్రపు కళ్ళెం మాత్రం కథ పరిధులను మించిపోయి నవలగా రూపాంతరం చెంది మరిడీ మహాలక్ష్మమ్మ కథ, లేదా గోవులొస్తున్నాయి జాగ్రత్త పేరుతో కనిపిస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినా దాని ఫలాలను అందుకోలేకపోయిన ప్రజల జీవితాలలోని దుర్భరత 1970 లో నక్సల్బరీ ఆందోళనగా వెల్లడయింది. రచయితలారా మీరెటువైపు అంటూ విద్యార్థి లోకం తమ కరపత్రం ద్వారా రచయితలను, కవులను నిలదీసింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. రావిశాస్త్రి ఉపాద్యక్షుడిగా ఉన్నారు. జీవితాన్ని కేవలం చిత్రించడమే కాకుండా పోలీసులు తుపాకులు పేల్చినప్పుడు నిబ్బరంగా నిలబడే గుండె ధైర్యాన్ని జనానికి తమ రచనల ద్వారా విప్లవ రచయితలు కలిగించాలి. విరసం లక్ష్యం, ధ్యేయం అవే అని, భయం అనే ఈ అడ్డుగోడను భేదిస్తే విప్లవం వస్తుంది, ప్రజలకు జ్ఞానోదయం కలిగించి భయాన్ని నిర్మూలించడమే రచయితల కర్తవ్యం అని త్రికరణ శుద్ధిగా నమ్మి రావిశాస్త్రి ఆ ఆశయ సాధన కోసమే రచనలు చేసారు.

వేతనశర్మ, షోకుపిల్లి, పిపీలికం మొదలైన కథలన్నీ విరసం నేపథ్యంలో వ్రాసినవే. బాకీ కథలు పేరుతో ఈ కథలన్నీ సంపుటిగా వచ్చాయి.

ఏనాడో బ్రిటిష్ ప్రభుత్వంవారి హయాంలో ఏర్పరుచుకున్న కోర్టు విధానాలు, జైళ్ళ పరిపాలన వ్యవహారాలు స్వతంత్రం వచ్చాక కూడా మార్చుకోకుండా కొనసాగించడం జరిగింది. జైలుశిక్ష పడినప్పుడు, విడుదల కావడానికి అనుసరించవలసిన విధి విధానాలు, స్టాంపులు అంటించడం లాంటి చిన్న విషయాలు తెలియకపోయినందుకు నిరక్షరాస్యులైన పేదలు జైళ్ళలో మగ్గి పోవడమే కాక తమ ఆస్తులు సహితం ఎలా కోల్పోవలసి వస్తుందో వివరించిన నవల సొమ్ములు పోనాయండి.

రెండుసార్లు తన రచనా కళకు దక్కిన ప్రభుత్వ గౌరవాలను, కళా ప్రపూర్ణ బిరుదునూ తిరస్కరించారు రావిశాస్త్రి తాను నమ్మిన సిద్ధాంతాలకు గౌరవం ఇస్తూ.

1975 లో ఎమర్జెన్సీ లో అరెస్టు కాబడి తీవ్ర అనారోగ్య పరిస్థితుల వలన విరసానికి రాజీనామా చేసి, ప్రభుత్వం విధించిన షరతులకు లొంగి పోయారు. కానీ 1980 లో దశాబ్ది ఉత్సవాలకు హాజరై విరసం కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర వహించారు రావిశాస్త్రి. జైలు జీవితంలో ప్రారంభించిన నవల రత్తాలు రాంబాబు. రాజు మహిషి, మూడు కథల బంగారం నవలలు వ్రాసిన రావిశాస్త్రి దశాబ్దకాలం పాటు స్తబ్దుగా ఉండి 1993 లో కొందరికి ఉండవలసిన గూడు అయిన ఇల్లు మరికొందరికి పొందవలసిన ఆస్తిగా ఎలా మారుతోందో చెప్పే కథావస్తువుగా తీసుకొని ఇల్లు నవల వ్రాసేరు. ఏడోచంద్రుడు పేరుతో నవల ప్రారంభం చేసినా పది పేజీలు కూడా వ్రాయకుండా అనారోగ్యం ఉక్కిరి బిక్కిరి చేసింది. శలవంటూ ఈ లోకాన్ని, సాహితీ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు రావిశాస్త్రి.

నవంబరు పది
రాచకొండ వారి విశ్వం
అబ్బూరి వరద గారి శాస్త్రి
సాహితీ లోకం వారి రావిశాస్త్రి
సర్వులకూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి

ఏడో చంద్రుడు ఉదయించక ముందే అస్తమించాడు. ఏడోచంద్రుడు పూర్తయి ఉంటే సాహిత్యానికి ఎంత అద్భుతమైన కానుక అయిఉండేదో.

(కాళీ పట్నం రామారావు)

ఇక కథ లేదు
వ్యథ
దారిలేదు, ఎడారి ఎడారి
అడుగడునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అప శబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ, పొగ

(అజంతా)

అని రచయితలు రావిశాస్త్రికి అంజలి ఘటించారు.

—————————

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు – హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు – ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు.

సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

5 Responses to అస్తమించిన “ఏడో చంద్రుడు”

  1. కొల్లూరి సోమ శంకర్ says:

    రావిశాస్త్రి గారి గురించి వివరాణాత్మకమైన వ్యాసం అందించినందుకు పొద్దు కు కృతజ్ఞతలు.
    సుధారాణి గారికి నెనరులు
    కొల్లూరి సోమ శంకర్
    http://www.kollurisomasankar.wordpress.com

  2. Rohiniprasad says:

    ఆధునిక తెలుగు వచనసాహిత్యంలో రావిశాస్త్రిగారిది ప్రముఖస్థానం. ఆయన నిజాయితీకీ, అద్భుతరచనాశైలికీ ప్రభావితం కాకుండా ఉండడం చాలా కష్టం. తొలిరోజుల్లో ఆయన రాసిన నల్లమేక వంటి కథల్లో హాస్యం ఎక్కువగా ఉండేది. జీవితానుభవంతో బాటు ఆయన రచనల్లో bitterness క్రమంగా పెరిగిందనిపిస్తుంది. ఆయన రచనలను చదవనివారెవరైనా ఈ తరంలో ఉంటే అర్జంటుగా ఆయన పుస్తకాలు కొని చదవమని నా సలహా.

  3. Excellent article, print out తీయుంచుకుని దాచిపెట్టుకున్నా.. సుదారాణీ గారికీ, ప్రొద్దూ వారికి అభినందనలు

  4. రావి శాస్రి గారు my favourite రచయిత. రత్తాలు-రాంబాబు పుస్తకం ఒక 4,5 సార్లు చదివానేమో. వారి రచనల గురించి నేను కూడ చిన్న ఆర్టికల్ వ్రాయాలని చాలా రొజులుగా అనుకున్నా. రావిశాస్త్రి గారి పై ఇంతమంచి వ్యాసం వ్రాసిన సుదారాణీ గారికీ, సుధారాణి గారి వ్యాసం అందించినందుకు పొద్దు కు కృతజ్ఞతలు.

  5. kathallo aaru sara kathalu navalallo rattalu raambabu ee rendu naaku caala baaga naccayi. avi eppudoo cadivinavi. ee vyasam cusi raaca konda viswanatha sastri garini vari rachalanalanu gurthu chesinanduku meeku caala danyavadamulu.

Comments are closed.