అలివేలు మంగమ్మకొక దండం

-నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

మా ఇంటి ముందర చేపల గంప దింపించినా.

మడికాడికి ఆవును తోలకపోతా వుండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా వుండిన నీలావొతీ అందురూ చేపల గంప చుట్టూరా వుడ్డజేరి పొయ్‌నారు.

“నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు!

చేపలు తెచ్చిన ఆడ మనిసి – రాయలచెరువు పేట ముండమోపి.నాకు చిన్న తమాస చేద్దామనిపించింది.

నేను చేపల గంపలో చెయ్యిబెట్టి, “ఇవి గెరిగేన్లు గదా, బలే వుండాయ్, తెల్లారుజామున్నే పట్టినట్టుండారు, కొన్ని ప్రాణాల్తోగూడ వుండాయే! కండ్లు మూస్కోని కొనుక్కోవచ్చు – కేజీ ఇరైఅయిదు రూపాయల్లెక్కన. మ్మో, మాకొక కేజీ తూంచు!” అన్నా కేజీ తక్కిడ చేపలామె చేతల్లోబెట్టి.

అంతే ఆ నిమిసంలోనే అక్కడంతా గలాంబులాం అయిపొయ్యింది.

అంతమంది ఆడోళ్లముందర నన్ను పట్టుకొని కొట్టలేక నా పెళ్లాం పండ్లు పటపట కొరికి, “నువ్వు ఏమిటి మొగోడుగా వుందువు? వూళ్లో ఇంతమంది మొగోళ్లుండారు, వొక్కడన్నా చేపల గంప కాడికొచ్చినాడా? మొగోడికి బేరం జెయ్యనొచ్చా? అసలవి కొరమేన్లన్నా కావే. గెరిగేన్లకు ఇరై అయిదు రూపాయలు పెడతారా ఎవురన్నా? ఆడోళ్లు బేరం చేస్తారు. నువ్వు నోర్మూస్కోని ఇంట్లేకి పో. అరకేజీ ఎత్తుకుని నీ గుంత మింద యేస్తాన్లే!” అనింది.

ఆడోళ్లు గూడ ఒక్కొక్కరే నా మిందికి తగులుకోబోతుండగా నేను గూడా నోరడ్డం యేస్కోని, “ప్రబావొతీ, నువ్వు ఇంట్లో ఒక మూల కుచ్చునే ఆడదానివి. నీకు లోకం ఏం తెల్చు చెప్పు? నేనంటే పదిమందిలోకి పొయ్యేవోణ్ణి వొచ్చేవోణ్ణి. పదూళ్లు తిరిగినోణ్ణి. మొన్న తిరప్తిలో రెడ్డమ్మ మెస్సులో చేపను పెట్టించుకోని తిన్నా. అది ప్లేటులో చేప తలకాయి, తోకా పెట్టి – అందుగ్గాను ఏడ్రూపాయలు వొసూల్జేసింది! ఆ లెక్కన లెక్కేస్కో. అంతెందుకు గంగిరెడ్డిపల్లిలో మేకను కోసి మేకపోతన్జెప్పి పొట్టతోళ్లూ, ఎనికలూ యేస్తే కేజీ కూరెంత? ముప్పైయ్యార్రూపాయలు. అందునా ఇవి మన చెరువు చేపలు. తేనె వున్నట్టుంటాయి. నీకేం తెల్చే లంజా, ఒక కేజీ చేపలు తీస్కో!” అన్నా.

నా పెళ్లాం వొళ్లు మరిచిపొయ్, “చూడమ్మా, ఆ మొగోణ్ణి ఏం జేస్తే కర్మ తీరునుమా?” అనడిగింది కర్రెక్కను.

కర్రెక్కా కడుపక్కా నీలావొతీ ముగ్గురూ ఒకే దపా మాటల్తో నామిందికి రాబోతుండగా నేను వూరెత్తకపొయ్యేటట్టు గొంతుపెంచి, “నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు! ఇంక మీ యబ్బతోడు, వూరు గాబట్టి ఇరై అయిదు ఇయ్యొచ్చు!” అనేసి నేను కడగా వొచ్చి తిన్నెమింద కుచ్చునేసినా.

ఇంతసేపుటిగ్గానూ చేపలామె నోరు తెరిచి, “ఆయన్న కరట్టుగా మాట్లాడినాడు. తప్పు రూంత గూడా మాట్లాళ్లా. నేనూ కాలిక్కాలికి కొట్టుకుంటా రాయల్చెరువు పేట నుంచి తెచ్చినాను గదమా. అక్కణ్ణే నేను కేజీ ఇరై రెండు లెక్కన తెచ్చినా. నాకు కాలి తిప్పట కన్నా కూలి దక్కద్దా? ఆయన్న చెప్పినట్టు ఇరై అయిదు గాక పొయ్‌నా ఇరై మూడు పెట్టుకోని ఎత్తుకోండి. చేపలు బాగుండాయి. తిరప్తిలో మొన్నంతా కనాగష్టం ఎరగడ్డలు కేజీ పన్నెండు రూపాయలు అమ్మలేదంటమ్మా?” అని లాపాయింటు తీసింది.

చేపలామె మాటలినిన కడుపక్కకు వొళ్లు మండిపొయ్, “మ్మో నువ్వు గూడ బాగ దొబ్బేదానివిగా వుండావే! ఆ నాబట్టకు బేరం జేసేది తెల్చునా? వాడు మూడు మొకాల్ తెలవనోడు. గెరిగేన్లను మేమెప్పుడూ తీస్కోలేదా, తిన్లేదా? కేజీ పదార్రూపాయల్లెక్కన పెట్టుకో. తలా కేజీ తీస్కుంటాం. మద్యానానికంతా నువ్వు ఇల్లు జేరిపోతావు.” అనింది.

నేను నేరుగా ఇంట్లేకిపొయ్ ఇరై అయిదురూపాయలు బొడ్లో దోపుకొని బైటకొచ్చి, బోకునొకదాన్ని చేపలామె చేతికిచ్చి, “మ్మో కేజీ తూంచు. ఇరై అయిదు రూపాయలకే తూంచు. నాకు నీ కష్టం వొద్దు తల్లా! ఎవురెవురి కష్టమో తిని ఈ జల్మ ఎత్తినాం. మళ్లా నీ కష్టం తిని నీకు పుట్టి రుడం తీర్చుకోలేను.” అన్నా.

నా పెళ్లాం నన్ను వడేసి పట్టుకోబొయ్ వీలుగాక నా చేతల్లో వుండే ఇరై అయిదును పెరుక్కుందామని జూసింది.

‘నన్ను ఇజీవాడకు తొడకపో, నేను కనకదుర్గ గుడి జూడాల’ అని నన్ను చంపతా వుంటావు గదా! ఇందాక మనింటి ముందరికి చేపలు తెచ్చిందెవరనుకున్నావు? దుర్గమ్మ తల్లే!

చేపలామె కేజీ తూంచి బోకులో పోసింది. నేనే డబ్బును గంపలో యేసేసి ఆ బోకునెత్తుకుని ఇంట్లేకి పొయ్‌నా. నాపెండ్లాం – ఇంక ఎక్కువ మాట్లాడితే వూళ్లోవోళ్లు నవ్వుకుంటారన్జెప్పి గమ్మనుండి పొయ్యింది.

నా తమాస చూస్తా బొమ్మలాల నిలుచుకునిన ఆడోళ్లు కడాకు నోళ్లు తెరిచి, “వొరె, కోతి నాబట్టా!” అనేసి పూడ్సినారు.

ఇంట్లో నేనూ, ఇంటి ముందర నా పెళ్లాం మిగిల్నాం. ఇంక ఎంత యిద్దం జరగబోతాదో!

ఈ చేపల్ని ఎప్పుడెప్పుడు తోమి – తినేద్దామా అన్నట్టు నా పెళ్లాం గూడా తపన్లో వుండాది. నేనిదే చాన్సనుకోని, “ప్రబావొతీ! మూతి మూరడు పొడుగు పెట్టుకోవద్దమ్మా! నా బుజ్జి గదా! నువ్విప్పుడు నవ్వతావు. నవ్వకుంటే నేను చచ్చినట్టు!” అని నెత్తిన చెయ్యి పెట్టుకున్నా.

ప్రబావొతి నవ్వి నా నెత్తిన చెయ్యి తీసేసింది.

నేనూ నా పెళ్లాం పెళ్లో చేరి బూడిద ముందర పోస్కోని చేపలు తోమేదానికి పెట్టుకున్నాం.

“నువ్వెన్నన్నా అను ప్రబల్ కన్నా! నాకు ముండమోపులంటే బలే యిష్టిం!” అన్నా.

“అవున్లే వాళ్లకైతే మొగుళ్లుండరు. ఇష్టమొచ్చినట్టు ఆడించొచ్చని నీ ప్లాను!” అనింది నన్ను జడతో వొకటి కొట్టి.

“అంత వక్రంగా అంటే నేనేం జెప్పేది? ఇప్పుడా ముండమోపి ఆడమనిషి నిద్దర్లేచి రాయలచెరువుపేట నుంచి పదికేజీల చేపల్ను మారు బేరానికి తెచ్చుంటాది. అక్కణ్ణే పదైదు రూపాయలు పడుంటాయి కేజీ. ఇంక వూళ్ల మింద పడి తిరిగితే కేజీ మింద రెండ్రూపాయలు ఇయ్యబోతారు మహా అయితే. అంటే ఆమె దినుమంతా కష్టిపడితే ఇరైరూపాయలు. చెరువెండిపోతే ఆ ఆదాయికమూ వుండదు. నేను ఆంద్రజోతిలో ప్యానుకింద కూచ్చోని నెలకు రెండున్నర వేలు తెస్తుండానే! ఆ డబ్బు మదంతోనే నీకిప్పుడు బాదలనేవి తెలవ్వు. ఒకేళ నేను మర్‌గయా అయినాననుకో. నువ్వు నీ బిడ్డల్ను సాక్కునే దానికి ఏం జేస్తావు – వూళ్లో నాలుగు లీటర్లు పాలు పట్టుకోని పెరుగు జేస్కోని పెరుగ్గంపెత్తుకోని తిరప్తికి పొయ్ ఈదీదీ తిరగతావు. ఎంత కష్టమో చెప్పు -” నన్నింకేం చెప్పనీకుండా నోరు మూసేసింది. ఈ సందులోనే –

ఎగవీది నుంచి ముగ్గురాడోళ్లు,
“నువ్వంత మహరాజు నాబట్టవా?”
“నీ ఇంట్లో చెట్టుకు రూపాయలు కాస్తుండాయా?”
“గెరిగేన్లకు ఇరై అయిదు రూపాయలిచ్చినావా? మా మొగోళ్లు నీకన్నా ముఠాలి ఎదవలే! ఇరై అయిదిచ్చి తీస్కోమని పోరతా వుండారే! ఆ చేపలది ఎంతసేపూ – దిగవీధిలో ఒకన్నకు ఇరై అయిదు లెక్కనిచ్చినా – అని పాట పాడుతుండాది!” అంటా వొచ్చినారు.

“ఎగవీధి అత్తలాలా! నేను గెరిగేన్లను ఇరై అయిదుకే తీసుకున్నా. నా లెక్క పకారం వాటికి ముప్పై ఇయ్యొచ్చు.” అని చెప్పి పంపించినా.

సడే. నా పెళ్లాం బమ్మాండంగా జేసింది చేపలకూర – దండిగా చింత పులుసు పోసి. సంగటేస్కోని తింటావుంటే-

ఎవురో ఒకామె పొరక్కట్టలు ఎత్తకొచ్చి, “జత నాలుగు రూపాయలు. కావాల్నా?” అనడిగింది.

నా పెళ్లాం ఆమె నోటి మాట నోట్లో వుండంగానే కతక్కన, “మాకేం పన్లా. మొన్ననే తీస్కున్నాం. నువ్వు పద!” అనేసింది.

“సరే, అంత సంగటి తినేసి పోదువు రామ్మా! మీది ఏవూరో ఏమో-” అని పిలిచినా, నా పెళ్లాం నాకల్లా వురిమి చూస్తుండినా పట్టించుకోకుండా.

పసి పిలగాడికి మిఠాయిస్తే చెయ్యి జాపినట్టుగా, పాపం ఆమె నా మాటతో గూడా నెత్తి బరువు మా తిన్నెమింద దించి ‘హమ్మ’ అని నోటి గుండా గసొదిలి కూలబడింది.

“ఏ వూరమ్మా మీది?” అన్నా.
“పీలేరు.” అనిందాయమ్మ. ఆయమ్మ ముండమోపిదే, ముప్పై అయిదేండ్లుంటాయి మహా అవితే!

నా పెళ్లాం నన్ను నడవింట్లోకి పిలిచి, “ఏం నువ్వాడే ఆట? దినామూ ఒక మనిసికి సంగటెయ్యాలంటే జరిగే పనేనా? పొరక్కట్టలమ్మే ఆడది కనబడగూడదు, గాజులామె కనబడగూడదు, ముంతమాడి పొండ్లు తెచ్చే ముసిల్ది కనబడగూడదు – నువ్వీ రకంతో దినానికొకర్ని సంగటికి పిలస్తా వుంటే నీకూ నీ పిలకాయలు వుండారు నాయినా! గుర్తు బెట్టుకో!” అని నసకు తగులుకొని మూతి మూరడు పొడుగు బెట్టింది.

“సంగటి తింటావా అనడగంగానే బేదం బెట్టుకోకుండా మన పంచన కుచ్చొనింది. ముద్ద సంగటి, తిన్నన్ని చేపలూ బెట్టు. మనకు మంచిది! ‘నన్ను ఇజీవాడకు తొడకపో, నేను కనకదుర్గ గుడి జూడాల’ అని నన్ను చంపతా వుంటావు గదా! ఇందాక మనింటి ముందరికి చేపలు తెచ్చిందెవరనుకున్నావు? దుర్గమ్మ తల్లే! మన పెండ్లిరోజు వొచ్చినప్పుడల్లా చిత్తానూరు గుడికి పొయ్ దండం బెట్టుకుంటాం గదా! ఏదీ, కండ్లు బాగా తెరిచి చూడు – ఇప్పుడు మనింటి ముందర కుచ్చోనుండే ఆ ఆడామె అలిమేలు మంగమ్మ కాదేమో చెప్పు?”

ఇంతే సంగతులు కింద నా చేవ్రాలు –

————

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరుజిల్లా తిరుపతికి దగ్గరలోని మిట్టూరు అనే గ్రామంలో జన్మించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో కొన్నేళ్లు ఉపసంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. గణితశాస్త్రంలో M.Sc పట్టభద్రులు. 1980-90 ప్రాంతాల్లో ఆయన చేసిన ‘పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పాల పొదుగు’ రచనలు నవీన తెలుగుసాహిత్యంలో విశిష్ఠమైన స్థానం సంపాదించుకున్నాయి.

రోజూ చూసేబతుకులో మీకు ఇంతటి అందం, చమత్కారం కనబడుతోందంటే అది దేవుడిచ్చిన వరం. అది మీ ద్వారా మేం కూడా పంచుకోగలగడం మా అదృష్టం. మీకు ఎల్లప్పుడూ ఈ గొప్ప చూపూ, ముఖ్యంగా sense of humour వుండాలని రాముణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు ఎంత సాధారణ విషయమైనా అసాధారణంగా రాస్తారని తెలుసు. దేవుడు అంతటా వుంటాడని తెలిసినా అపుడపుడు తిరపతో భద్రాద్రో అన్నారమో వెళ్ళి ప్రత్యక్షంగా ఓ దణ్ణం చెప్పుకుంటాం. మీకీ వుత్తరం అలాటిదే.

జగద్విఖ్యాత చిత్రకారుడు, సాహితీప్రియుడు -బాపు, మిట్టూరోడి పుస్తకానికి స్పందిస్తూ నామిని సుబ్రహ్మణ్యం నాయుడుకు రాసిన ఉత్తరంలోని భాగం ఇది; ఒక రచయితకు లభించిన గొప్ప గౌరవం.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

3 Responses to అలివేలు మంగమ్మకొక దండం

  1. durgeswara says:

    నేనెప్పుడో చదివిన సినబ్బకథలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి. thanks

  2. viswam says:

    kastapadevalla manastatvanni adavalla beramade nypunyanni enta chakkaga vivarincharandi.mottam meedasamanyuluni asamanyuluga teerchididdinandulaku krutajnatalu naminigaru

  3. vinay chakravarthi says:

    very goodone……………..

Comments are closed.