అభినవ భువనవిజయ దశమి

ప్రియమైన పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు.

గడచిన ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి రసజ్ఞులు మాకందించిన ప్రోత్సాహంతో ఈ విజయదశమి నాడు మరో రసవత్తరమైన కవిసమ్మేళన అంతర్జాలసభా విశేషాలను విజయవంతంగా మీకు సమర్పిచ గలుగుతున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. ఈ శుభ కార్యాన్ని సుసాధ్యం చేసిన కవివర్యులు, సాంకేతిక నిపుణులు, సారధులు, అతిథులూ మీకు చిర పరిచితులే. పరిచయాలు త్వరలో…

ఈలోపున ఈ అభినవ భువనవిజయ సభా విశేషాలను ఆస్వాదించండి …

{రాయలు}: విఘ్నేశ్వర ప్రార్ధనతో మొదలు పెట్టమని విశ్వామిత్రులను కోరుతున్నాను
{విశ్వామిత్ర}: ధన్యోస్మి

అగరాజసుతాసుతునకు
నిగమాగమపెన్నిధికిని, నేమ్రొక్కెద, వి
ఘ్నగణాధిపునకు, జాలపు
జగతి, నవభువనవిజయము జరుగుట వేడ్కన్.

{రాయలు}: బాగు బాగు. పాదపు అంచున విఘ్నం నడుము విరిచారు
{పెద్దన}: విఘ్నాలు విరిగినట్టే, భేష్!
{చదువరి}: పద్యం బావుంది, విఘ్నాన్ని విరిచారన్న ప్రశంస కూడా బావుంది.
{విశ్వామిత్ర}: సామవేదం షణ్ముఖ శర్మ గారు ” అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ ” అన్నారు .. అదే అర్ధం స్పురింపించటానికి ప్రయత్నించాను

{రాయలు}: తాడేపల్లి లలిత కవీశ్వరా .. సింహాసనస్థ యై కిరీట ధారిణియైన రాజరాజేశ్వరిని మా మనసుల్లో ప్రతిష్ఠించండి
{తాడేపల్లి}:
ఉ॥

శ్రీ విలసన్మనోజ్ఞ నిజ । శీర్షమునన్ బహురూప చిత్ర ర
త్నావళి గుంఫితాగ్ర మకు।టంబు సెలంగ వెలుంగుచున్
సహృద్ భావ విధాయకోజ్జ్వల శు।భాక్షులఁ జూచు జగజ్జనిత్రి యా
దేవి మతల్లి దుర్గ మముఁ । దేల్చుత దివ్య కటాక్ష వారిధిన్.

{రాయలు}: సెబాసు. తల్లి ఠీవికి తగిన పదజాలంతో పొగిడారు
{పెద్దన}: “శుభాక్షులతో” చూసే తల్లి “కటాక్షాన్ని” కోరడం సమంజసంగా ఉంది!
{రాయలు}: ఇక్కడ విలసన్మనోజ్ఞ అంటే …? విలసత్ + మనోజ్ఞ అని పదఛ్ఛేదం చేసుకున్నాను.
{తాడేపల్లి}: విలసత్ అనే విశేషణాన్ని దానికి ముందున్న శ్రీతో కలిపి చదువుకోవాలి. శ్రీ అనగా ఐశ్వర్యము, వైభవము. దానితో విరాజిల్లు మనోహరమైన నిజ (తన) శిరస్సునందు.. అని. అంటే లక్ష్మీ విలాసం లాగా ..
{వికటకవి}: దేల్చు”త” కూడా కాస్త వివరిస్తారా
{తాడేపల్లి}: ఇది తేల్చుతన్. దీన్ని దివ్యకటాక్ష వారిదితో కలిపి చదువుకోవాలి
{వికటకవి}: ఓ అదా సంగతి,
{తాడేపల్లి}: దివ్యమైన = పవిత్రమైన ; కటాక్ష = ఓరచూపులు అనే ; వారిధి = సముద్రమునందు తేల్చవమ్మా ముంచకు అని అర్థం
{పెద్దన}: దేవి కటాక్షవారిధిలో మునిగిపోయినా పరవాలేదు!
{రాయలు}: పెద్దన: బాగా సెలవిచ్చారు
{తాడేపల్లి}: మునిగిపోతే ఆవిడలో లీనమైపోతాం. ఆవిడ గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉండదుగా

{రాయలు}: ఆ నోటితోనే తెలుగు భారతిని కీర్తించండి పెద్దనార్యా
{పెద్దన}: చిత్తం, సిద్ధం

ఉయ్యాలనూపు తాతయ్య జోలలలోన
తొలిసారి నిను వింటి పలుకులమ్మ
ఆకలో! అర్మిలో! “అమ్మా” అనిననాడు
తొలిసారి నిను నంటి పలుకులమ్మ
ఒడిబెట్టి నాన్నారు ఓనమాల్ దిద్దింప
తొలిసారి నిను రాస్తి పలుకులమ్మ
బడిలోన పాఠాలు పంతులమ్మలు నేర్ప
తొలిసారి నిను చూస్తి పలుకులమ్మ
ఎన్ని పద్యాలు వినిపిస్తి వెన్ని తీపి
పాటలను పాడితివి యెన్ని బతుకు కతలు
చెప్పితివి అమ్మరో, నన్ను చేర దీసి!
ఎన్ని నేర్చినగాని నే నెన్నటికిని
చంటిపాపాయినే నీకు చదువులమ్మ!
నన్ను, నావంటి తెలుగింటి చిన్నవాళ్ళ
దెలుగు పాలిచ్చి పెంచవే పలుకులమ్మ!

{రాయలు}: భలే భలే

{చంద్రమోహన్}: హమ్మయ్య! ఇప్పటికైనా పాలు మాకూ ఇప్పించారు, మీరొక్కరే తాగెయ్యకుండా 😉
{వికటకవి}: వింటి,నంటి,రాస్తి,చూస్తి….బాగుంది, సరళంగా
{దైవానిక}: ఆకలో! అర్మిలో .. ఇది కాస్త వివరిస్తారా??
{పెద్దన}: అర్మిలి అంటే ప్రేమ, అనురాగం.
{రాయలు}: పెద్దన: ఈ పదం బహు సుందరంగా ఉంది
{చదువరి}: సంస్కృతమేమీ లేకుండా అచ్చ తెలుగు పదాలే కదా!?
{గిరి}: బహు బాగ చెప్పారు పద్యాన్ని పెద్దన, …. వినినంత మరికొంత వీను లడిగె
{చివుకుల}: ఈనాటి తెలుగింటి చిన్నవాళ్ళకు డబ్బాపాలే ప్రాప్తం.
{రాయలు}: చదువరి: అసలే “చంటి” వాడు కదా కవి!
{దైవానిక}: అచ్చ తెలుగులో అందంగా చాలా బాగుందండి
{పెద్దన}: నెనరులు
{రాయలు}: చివుకుల: అందుకే ఆ తెలుగు భారతిని కోరుకోవడం
{చివుకుల}: పెద్దన చిన్నపదాలలో చెప్పడం …
{పెద్దన}: సంగీతమపి సాహిత్యం…అన్నారు కదా!
{చదువరి}: నాకెంతో నచ్చిందీ పద్యం పెద్దనార్యా
{రామకృష్ణారావు}:

చదువుప్పాయి పెద్దన చవినిజూపె.
పలుకులమ్మను మనముందు నిలిపినారు
పలుకు పలుకున ముత్యాలు వొలుకు నటుల
పలుక నేర్చిరి మీరు పల్కులుకుజూపి

{రాయలు}: భలే రామకృష్ణగారూ
ఉ.

అమ్మల గన్న యమ్మ, సులభమ్ముగ దీర్తువు కోర్కెలెల్ల సా
రమ్ముగ మాకు నేడు జన రంజకమౌ కవితా ఝరీ స్వరా
లిమ్ము సరస్వతీ, పలుకు లింపుగ సొంపుగ జాలు వార, మా
యమ్మవు నీవె, నీకును ముదమ్ముగ బల్కెదమీ సభాస్థలిన్!

{తాడేపల్లి}: చాలా బావుంది
{రాయలు}: మిగతా ప్రార్ధనలన్నీ మనం సభ నడుస్తుండగా మధ్య మధ్యలో విందాము.

{పెద్దన}: భేషో!
{చదువరి}: రాయలవారూ, భేష్!
{చంద్రమోహన్}: చప్పట్లు కూడా!
{రాయలు}: వినమ్రంగా తల వంచుతునాను

{రామకృష్ణారావు}: రాయలవారి పల్కులవి రంజిలజేయుచ్నుడెనీడ
{గిరి}: రాయల వారి రాజసం వల్ల తల సరిగా వంగలేదు (వంచు తునాను అన్నారు కాబట్టి)
{చదువరి}: గిరి 🙂
{రాయలు}: గిరి: లేదండీ, కిరీట భారం వల్ల తల మరీ వంగి పోయి, వొత్తు సరిగ్గా బయటికి రాలేదు
{విశ్వామిత్ర}: నమ్రతా శిరోద్కర్ ఒప్పుకోదేమోనని ఆగి ఉంటారు
{పెద్దన}: విశ్వామిత్రా మీకెప్పుడు కాంతలమీదా, చుక్కలమీదనే దృష్టి 🙂
{దైవానిక}: విశ్వామిత్ర, మహేశ్ కూడా ఒప్పుకోడు 🙂
{రాయలు}: దైవానిక: విశ్వామిత్ర .. సభ్యులు కొంచెం ఓపిక పట్టాలి .. మహేశ్ బాబు ప్రేమాయణం ఈ సభలోనే ఆవిష్కృతమవుతుంది త్వరలో
{తాడేపల్లి}:
కమ్రముగాఁ గవనించియు
నమ్రముగా శిరము వంప నక్కఱ కలదే ?
{రామకృష్ణారావు}:
పద్యము రాసిరి మీరలు
హృద్యంబుగ వ్రాసినారు హృదయాంజలులోయ్
{గిరి}: తాడేపల్ల గారు, రామకృష్ణ గారు – ఆశుపద్య ధారలు కురిపిస్తున్నారు
{రాయలు}: గిరి: మీరూ పక్కన ఒక పలక తెరిచి ఉంచండి .. సందర్భోచితంగా ఆశుధార అదే ఊరుతుంది
{దైవానిక}: రాయలు గారు, అయితే ఒక పద్యహారం వేద్దామని ఉంది, కాని పలుకులు రావట్లేదు
{వికటకవి}: పలుకులమ్మని కీర్తించే పలుకులన్నీ బాగున్నాయ్
{రాయలు}: మిమ్మల్నందర్నీ సమస్యల్తో, ప్రశ్నల్తో సవాలు చెయ్యడమే ఈ సభకి నాపని అనుకున్నాను గానీ, నేనే పద్యం రాస్తానని అనుకోను కూడా లేదు
{రాయలు}: రామకృష్ణగారూ తయారుగా ఉండండి .. మొదటి సమస్య మీకే. సరసిజ నాభుడే కుసుమ సాయక బాధితుడయ్యె చూడగన్ … ప్రారంభించండి.
{రామకృష్ణారావు}:
చ||

తిరుమల వాసుడైన మన దేవుడు వేంకట నాయకుండు తా
తిరుగుచు నొక్క చోట నట దీపిత నా యలమేలుమంగనే
మరులుకొనంగ చూచెనయ. మానవ లోక మహాత్మ్యమేమొ? యా
సరసిజ నాభుడే కుసుమ సాయక బాధితుడయ్యె చూడగన్.

{విశ్వామిత్ర}: అయ్యా పెద్దనామాత్య, ఇప్పుడు తెలిసిందా, నాదృష్టి తప్పుకాదు, ఆ సరసిజ నాభునికే తప్పలేదని
{రాయలు}: అవును మరి .. అలకల కులుకుల యలమేల్మంగ కదా
{విశ్వామిత్ర}: నట దీపిత అంటే ఎవరినా హీరోయిన్నా లెక హృదయేశ్వరేనా
{గిరి}: రామకృష్ణ గారు, చాల బావుంది.
{పెద్దన}: విశ్వామిత్రా సరసిజ నాభుడే కాదు, ఆ శంకరుడుకూడా మీ కోవకు చెందినవాడే లెండి 🙂
{రాయలు}: పెద్దన: అది కూడ వస్తోంది త్వరలో
{విశ్వామిత్ర}:రామకృష్ణ గారు, చాల బావుంది.బ్రహ్మోత్సవాలలో ఆ స్వామిని తలంపుకు తేవటం.
{రాయలు}: విశ్వామిత్ర: సందర్భోచితమైన మెచ్చుకోలు. సెబాసు.
{చంద్రమోహన్}: పుత్రాధిచ్చేత్ పరాజయం
{రాయలు}: చంద్రమోహన్: బాగా చెప్పారు
{తాడేపల్లి}: సరసిజ నాభుడంతటివాడు కుమారుడి చేతనే బాధించబడడం, కలికాల మహిమ !.
{రాయలు}: ఇంకో సందర్భంలో ఆ చక్రి కొడుకు చేత దెబ్బలు తినడం చూద్దాము తాడేపల్లి వారి పద్యంలో. తాడేపల్లి వారూ ..
{తాడేపల్లి}: చిత్తం రాయా !
చం॥

సురలసురుల్ సుధార్థమయి । సుస్థిర మైత్రిని క్షీరసింధువున్
వరమగు పాత్రగా మఱియు । వాసుకి త్రాడుగ మందరాచలం
బురు మథికాష్ఠగాఁ దఱువ । నుద్భవమందిన లక్ష్మిఁ గాంచి యా
సరసిజ నాభుడే కుసుమ । సాయక బాధితుడయ్యె చూడగన్.

{పెద్దన}: లోటులేకుండా రెండో ఆవిడనికూడా కట్టబెట్టేసారా సరసిజనాభునికి, బావుంది! నారీ నారీ నడుమ మురారి!
{విశ్వామిత్ర}: రకార పునరుక్తి ఆ మధనాన్ని కళ్లకు కట్టిస్తోంది
{గిరి}: తాడేపల్లి గారు, సుస్థిర మైత్రి ఏమిటో కాస్త వివరించండి
{తాడేపల్లి}: సురల్ అసురుల్ – వీరిద్దఱికీ మైత్రి లేనేలేదు. కానీ అమృతం కోసం సుస్థిర మైత్రిని అభినయించారన్నమాట.
{పెద్దన}: ఇప్పుడు తెరాసా, సీపీయమ్మూ కలిసినట్టన్నమాట!
{విశ్వామిత్ర}: ఎంతైనా దాయాదులు కదా – అభినయించారన్నమాట
{తాడేపల్లి}: అవకాశవాద పొత్తులు కృతయుగం నుంచి ఉన్నాయి
{చంద్రమోహన్}: సుస్థిరంగానే ఉండేదేమో, మీ సరసిజ నాభుడు అస్థిర పరచక పోయి ఉంటే
{దైవానిక}: పెద్దన గారి పన్ను బాగుంది 🙂
{తాడేపల్లి}: అంత విసత జరగ్గా లేనిది సరసిజనాభుడు మన్మథబాధకు లోనుకావడం ఏమాశ్చర్యం ?
{రాయలు}: బ్రహ్మాండంగా ఉంది లలితకవీశ్వరా
{రామకృష్ణారావు}:

క్షీర సాగర మదనంబు దృష్టి నిలిపి
పలికినారయ మీరలు ప్రస్ఫుటముగ
భావ గాంభీర్య మొప్పుచు పద్యమ్ముననె
పూరణంబును చేసిరి పుణ్య పురుష.

{తాడేపల్లి}:

సహృదయ రసిక వరేణ్యులు
సహనముతోఁ బ్రోత్సహింప సంకోచంబుల్
విహతములై చనుఁ గాదే ?
అహమహమికలు చెలరేఁగు నద్భుతరీతిన్

{రాయలు}: అందుకే .. అన్ణాడు ఆనాటి పెద్దన అర్ధం తెలిసి మెచ్చే పాఠకులు కావాలని
{వికటకవి}: వాగ్దేవి మీ నాలుకలపై చేస్తున్న నాట్యం ఇక్కణ్ణించే చూస్తున్నాం, ఆనందిస్తున్నాం
{చంద్రమోహన్}: గహనమగుమీదుప్రౌఢిమ
{విశ్వామిత్ర}: సహకవులెల్లరు మిముగని సంభ్రమ మొందన్
{చదువరి}: విశ్వామిత్ర – మంచి చేర్పు
{చంద్రమోహన్}: సరిగ్గా పూరించారు

{రాయలు}: సరే ముందుకి సాగుదాం. ఇక్కడ ఒక యువ కవిమిత్రుణ్ణి పరిచయం చేస్తాను. దైవానిక పేరుతో సభకేతించిన పాలడుగు శ్రీకాంతుడు, ఇటీవలే, బ్లాగుల్లో రాకేశ్వరుడు, రానారె ఇత్యాదులు చేస్తున్న పద్యచాలనం చూసి సమ్మోహితుడై తానూ గంటం చేతబట్టాడు.
{రాయలు}: శ్రీకాంతా, మీరు రాసిన మంగళ గౌరి ప్రార్ధన పద్యాన్ని వినిపించమని కోరిక
{దైవానిక}: సరే
కం.

వందనములందుకొని మ
మ్మందరినీ కావవమ్మ మంగళ గౌరీ,
సుందరమగు పదములతో
కందపు నైవేద్యమిదిగొ కానుక నీకున్

{చివుకుల}: పాలడుగు వారు పాలనైవేద్యం అందించారు.
{రాయలు}: సీసాలతో వృత్తాలతో దేవికి అజీర్తి చేస్తుందని ముచ్చటగా కందపు నైవేద్యం పెట్టారు
{పెద్దన}: కందనైవేద్యం కడు పసందుగా ఉంది!
{వికటకవి}: నైవేద్యం బాగా ఇచ్చారు, మరి మా ప్రసాదమో?
{రాయలు}: వికటకవి: సభ పూర్తయినాక
{తాడేపల్లి}: కంద నైవేద్యం – దురద ప్రసాదం
{గిరి}: తాడేపల్లి గారు 🙂

{రాయలు}: కందం ఎలాగూ వచ్చింది కాబట్టి .. ఒక చిన్న కంద సమస్య వేసుకుందాం .. శనివారం కూడానూ ..
{రాయలు}: శనికిన్ భయమందనట్టి చతురుండితడే .. చంద్రమోహన్ కవివర్యా .. మీ వంతు

**********
{చంద్రమోహన్}: చిత్తం

వినికిడి లోపము గలదని
వనితా నీ మగని మీద వగపెందులకే
విన భీతి గొల్పునట్టి, య
శనికిన్ భయమందనట్టి చతురుండితడే!

{తాడేపల్లి}: అదిరింది
{వికటకవి}: భళీ
{రాయలు}: భలే భలే
{పెద్దన}: బలే చెప్పారండీ, భర్తలకి చెవుడే పెద్ద వరం!
{రాయలు}: peddana: హ హ హ

{చదువరి}: ఓహో, చెవుడు వల ఉపయోగం కూడా ఉంణ్దన్నమాట!
{దైవానిక}: చెవిటివాడిముందు శంఖమూదితే, “అది కొరికి విరగ్గొట్టడానికి నీ తాతలు దిగిరావాల”న్నాడంట ఇలాంటి ‘చెతురుడే’!
{చదువరి}: దైవానిక 🙂 🙂 🙂
{రాయలు}: daivAnika: హ హ హ
{తాడేపల్లి}:

చెవిలేనివానికెప్పుడు
కవుల వలన కవిత వలన కష్టము సున్నా

{భట్టుమూర్తి}: తాడేపల్లిగారూ పద్యానికి మీ పైపద్యం భలేవుంది!
{రాయలు}: తాడేపల్లి, నేనూ సరిగ్గా అదే అనబోతున్నా
{రాయలు}: భట్టుమూర్తి కవిరాయా .. మీ పూరణ ఉన్నట్లుంది?
{భట్టుమూర్తి}: ఔనండి వుంది వినిపిస్తా

అనిమిషుడు గాడు మనుజుడె
పనికిని వెరువంగ నట్టి పథికుం డితడే
కునుకున శిశువుల పోలిక
శనికిన్ భయ మందనట్టి చతురుండితడే

{రాయలు}: బాగుంది .. శ్రమ ని నమ్ముకున్న వాడు శనికైన బెదరనక్కర్లేదని మంచి సూత్రం చెప్పారు
{చదువరి}: చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి – అవును ఇక శనికి చోటెక్కడ? బావుంది, భట్టుమూర్తీ!
{పెద్దన}: సత్యం చెప్పారు భట్టుమూర్తి!
{గిరి}: వెరు వంగ నట్టి – భయపడి వంగడన్న మాట
{తాడేపల్లి}: పని – నిద్ర – ఇవి శని లక్షణాలే. ఇప్పటికే శనికింద ఉన్నవాడికి మఱింక శని గుఱించి భయమేంటని ఈ పద్యభావంలా ఉంది
{చంద్రమోహన్}: భట్టుమూర్తిగారి కవితలన్నీ శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
{భట్టుమూర్తి}: ధన్యవాదాలు.

{రామకృష్ణారావు}: రాయల వారు అనుమతిస్తే నేనూ పూరిస్తా.
{రాయలు}: RK గారూ కానివ్వండి
{రామకృష్ణారావు}: కం||

శని వారము నాడితనికి
శనికని తిల దాన మీయ చక్కగ గొనునోయ్.
శనియే భయపడు నితనికి
శనికిన్ భయమందనట్టి చతురుం డితడే.

{రాయలు}: హ హ హ బాగుంది
{విశ్వామిత్ర}:
అహరహరముకృషి సలిపిన
మహినిట్టికవనము వ్రాయ మాకును సులువే
{రామకృష్ణారావు}: అహరహము”ను” కృషి సలిపిన అంటె సరిపోతుంది.
{రాయలు}: సులువే! ఎందుకంటే .. మీరూ మంచి పద్యాలు వ్రాశారు!!
{చివుకుల}: స్వర్గాన్నే సృష్టించినవారికి పద్యాలొక లెక్కా?
{రాయలు}: ఈ శని భయం సమస్య మీద మీ అభిప్రాయం వెల్లడించండి
{రాయలు}: తరువాతి వంతు విశ్వామిత్రులది
{విశ్వామిత్ర}:

ఘనయోగపుజాతకుడవు,
గనగా చెడునది వివాహ కారణమన, “కే
తు”నిలచె తోడని సప్తమ
శనికిన్ భయమందనట్టి చతురుండితడే!!!

{తాడేపల్లి}: బహుజనమునకందునటుల, రహించు | కవనముల జెప్ప నదియే మహిమౌన్
{చంద్రమోహన్}: వారు అహాన్ని వదిలేసి రహాన్నే కృషి చేస్తారేమో 🙂
{దైవానిక}: విశ్వామిత్రా, సూపరు
{విశ్వామిత్ర}:సప్తమం కళత్ర స్థానంట.
{విశ్వామిత్ర}:అక్కడ శని కూచుంటే ఏమౌతుందో చెప్పక్కర్లేదనుకుంటాను
{చదువరి}: ఓహో సప్తమకు అర్థం అదన్నమాట! బాగుంది పద్యం!!
{రామకృష్ణారావు}: సృష్టికి ప్రతి సృష్టి చే య సమర్ధులు.
{రాయలు}: విశ్వామిత్రుల పద్యలోనూ, పైన తాడేపల్లి ఘారి వ్యాఖ్యలోనూ చక్కని జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం కనబడుతోంది
{విశ్వామిత్ర}:ఆ శనికి తోడు కేతువు జేరితే బ్రహ్మచర్య యోగం
**********

{రాయలు}: కాసేపు మహేశుని ఆట పట్టిద్దాము. అష్టాచమ్మా సినిమా గురించి వినో చదివో ఉంటారు గదా
{దైవానిక}: చూసాం తరించాం.. మహేశ్ ని చూసి కుళ్ళుకున్నాం కూడా
{రాయలు}: లావణ్యకి మహేశ్ బాబు నించి ప్రేమ లేఖ అందితే పరిస్థితి ఎలా ఉంటుంది?
{విశ్వామిత్ర}:దంసప్పు సీసా గిరాటేస్థారా ఏమి
{భట్టుమూర్తి}: ఆయనకి పెళ్లైపోయిందిగా … ఇంకా రాస్తున్నాడా లేఖలు?
{గిరి}: పెళ్ళైయ్యాక లేఖలు వ్రాయకూడదా ఏం
{చదువరి}: మహేశు పార్టీ మార్చాడట!
{చివుకుల}: పెళ్ళీ, ప్రేమా వేరు – కావాలంటే ఈ మహేషుని అడగండి.
{గిరి}: పెళ్ళానికి కాకపోతేనే కష్టం
{రాయలు}: గిరిధర కవిని ప్రారంభించమని కోరుతున్నాను
{గిరి}: చిత్తం
{గిరి}:
వ. “మేడం, మహేశ్ బాబు నుండి మీకో ఉత్తరం”

సీ.

ప్రియమైన లవ్వుకి ప్రేమతో వ్రాయుచు
న్నానని నాకు పంపేను లేఖ
ముద్దుగా లవ్వని మొదలు పెట్టినవాడు
నడుమ నపుడపుడు ‘నమ్మి’ యనెను
పేరులో నేముంది ప్రేమ ముఖ్యముగాని
అంతటి ఘనుడునా కందునపుడు
మేకప్పు కీసారి బాకప్పు నైనుప్డు
కనుగొందు నెందుకట్లనెనొ నన్ను

తే.గీ.

జాతి నక్కని త్రొక్కి వచ్చాను నేను
ప్రిన్సుడంతటి వాడు నా ప్రియుడు కాద?
చలన చిత్రాల ప్రేమలు కలలె యనుచు
నూరి పోసెడి వారికి నోటి మూత

వ. “ఓ మేకప్పుసానులూ, ఇక్కడికి రండే”

ఉ.

రాజకుమారుడే , అతిథిలాగ మనస్సున జొచ్చినాడె, యువ్
రాజును, నాని (బాబి), పోకిరి మురారియు నాతడె, నన్ను గెల్చినా
డా జయుడొక్కడే చిలిపి టక్కరి దొంగ నిజమ్ము నమ్ముడీ
రాజసమొల్కు వాడు మరులాడుచు నా వరడౌను చూడుడీ

వ. “మేడం, ఆ ఉత్తరం మీది కాదు, సారీ.”

వ. ఢామ్మని ఓ గుండె పగిలింది, ఛెళ్ళుమని ఓ చెంప పేలింది.

{చివుకుల}: మళ్ళీ మాట్లాడకుండా రెండుసార్లు మూతవేసారు గిరిధర కవిగారు…
{గిరి}: నమ్మి అంటే నమ్రత అయిఉండవచ్చు
{రాయలు}: గిరీ 🙂
{పెద్దన}: గిరిగారు, అది “నమ్మి” కాకుండా “అమ్మి” కూడా అవ్వొచ్చు, ఏ అమ్మికైనా అవ్వొచ్చు!
{గిరి}: లవ్వు అంటే లావణ్య కాకపోయి ఉండవచ్చు
{రాయలు}: వరుడౌను చూడుడీ
{విశ్వామిత్ర}:ప్రేమలో ఉండగానే “కందు”, యుగ ధర్మం
{దైవానిక}: జాతి నక్క, వాడుక బాగుంది 🙂
{రాయలు}: వరడు అంటే .. అదో రకం గుంట నక్క 🙂
{చంద్రమోహన్}: వరు’డౌను’ ఐతే గుండె ఢామ్మనదా మరి!
{చివుకుల}: దక్కితే వరుడు – దక్కకపోతే వరడు..
{రాయలు}: చివుకుల, హ హ హ
{చదువరి}: చివుకుల, 🙂
{గిరి}: వరు డౌను’ చూడుడీ
{తాడేపల్లి}: ఇది బావుంది
{పెద్దన}: ఇంతకీ ఆ లేఖ ఎవరికో?
{గిరి}: పెద్దన గారు, మహేశ్ నమ్రతకి వ్రాసిన లేఖ లావణ్య అనబడే మేకప్పార్టిస్టు చేతబడింది – లవ్వు ని ఆ అమ్మాయి లావణ్య అనుకుంది

{రాయలు}: రామకృష్ణారావుగారూ, మీ లావణ్యని ప్రవేశ పెట్టండి
{రామకృష్ణారావు}: ఈ విషయంలో ఆ లావణ్య మాటలనే విందాం మనం .
“ఇదిగో నాయనా! నేను లావణ్యని. అసలేంజరిగిందోతెలుసామీకు? వినండి.

శా:-

బ్యూటీ పార్లరు నుండి వచ్చితి. ననున్ ముద్దాడగా జూచె.నా
వాటంబున్ గని కన్య నౌదునని తా భావించె కాబోలు. నీ
యేటన్ నాకగు షష్టి పూర్తి . యకటా! యేమందు మాహేషునిన్.
మాటల్ లేఖగ వ్రాశి ప్రేమ తెలిపెన్. మామ్మ్మ్మ్మన్ ననున్ గోరె నో…..చ్..

చూచారా ఈ వయసులో నా కెంతటి అదృష్టం కలిగిందో!

{రాయలు}: హ హ హ .. బ్యూటీ పార్లరు మహిమా? లేక మందు మహిమా? “మందు” మహేషునిన్! హ హ హ… విశ్వామిత్రా వింటున్నారా? ఇక్కడక్కూడా ఒక తూగులయ్య వచ్చేశాడు
{విశ్వామిత్ర}:డోసు కూడా కాస్త ఎక్కువైనట్టే ఉంది 🙂
{పెద్దన}: అది కృష్ణనుంచి వచ్చిందేమో, సరిగా చూసుకోండి లావణ్యగారు 🙂
{దైవానిక}: నిజమయిన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అన్న సినీ ప్రేమా ఏంటి?
{భట్టుమూర్తి}: బ్యూటీపార్లరు అనే పదంతో ఒక శార్దూలం మొదలౌతుందని, ఇంత చక్కగా సాగుతుందనీ నా ఊహకు అందేది కాదు మీరీ పద్యం చెప్పకపోయుంటే!
{చదువరి}:

పర్ణశాల యందు పరగు మహేశుడు
ఇచటె నుండి నాడు ఇంతులార
పలుక డేమి యతడు పరమ యోగి వలెను
పలుక రాలునేమొ ముత్య రాశి!

{భట్టుమూర్తి}: చదువరి గారూ భేష్!!
{రామకృష్ణారావు}: పలుక రాలునేమొ ముత్య రాశి లో అచ్ సామ్యం సరిపోతే ఇంకా బాగుండేది.
{చదువరి}: అవునండి
{రాయలు}: చదువరి, ఎటుపోయి నోరు తెరిస్తే ఎటు పీక మీదికొస్తుందేమోనని కావచ్చు .. Mahesh, any statement? 🙂
{మహేశ్}: హమ్మో..నేనే…!! పద్యాలతోనే నేను తెలుగునుంచీ పారిపోయానండీ..ఇప్పుడిక్కడ చదువుతుంటే, నాకు తెలుగు అంత ఛండాలంగా చెప్పిన మా టీచర్ని కసితీరా తిట్టుకోవాలనుంది.
{రామకృష్ణారావు}: ధన్యవాదాలు.. మీ వ్యాఖ్యలకి.
{తాడేపల్లి}: ఇటువంటి తాజాకరణలు లేకపోతే ఈ ఇంగ్లీషు మాధ్యమపు తరానికి తెలుగు పద్యాల మీద రుచి పుట్టదేమో !
{గిరి}: తాడేపల్లి గారు, ఒప్పుకుంటాను
{రాయలు}: ముందుకి వెళ్దాం

**********

{రాయలు}: పెద్దనగారూ, మీ పేరు సార్ధకం చేసుకునే సమయం వచ్చింది. ఇది మీరే పూరించాలి
{పెద్దన}: చెప్పండి రాయా!
{రాయలు}: నిన్న రాత్రి కలలో ఏవేవో వింత ధ్వనులు వినిపించినాయి. సల్మాన్, అమీర్, సచిన్, సెహ్వాగ్ .. నాకైతే ఏమీ అర్ధం కాలేదు. ఈ శబ్దాలని అర్ధవంతంగా ఒక శార్దూలంలో ప్రయోగించండి చూద్దాం!
{పెద్దన}: రాయలవారికి మహేశ్ తెలుసుకాని, సల్మాను తెలీదా 🙂
{చివుకుల}: పెద్దనా – అదిరింది.
{చదువరి}: తెలుగు విభుడు కదా!
{చివుకుల}: చదువరి – ఇదింకా సూపరు.
{రాయలు}: చదువరి, బాగా కనిపెట్టారు .. నేను నిజంగానే బాలీవుడ్ సినిమాలు చూడను
{గిరి}: రాయల వారి దృష్టి సల్మా ల మీదే కాని సల్మాను మీద కాదు
{పెద్దన}: అవధరించండి!

హింసల్ మానుట యెన్నడోయి మనిషీ? యీ యుద్ధముల్ ద్వేషముల్
ధ్వంసోన్మత్త జిఘంస, యీ విలయ మీ రక్తౌఘముల్! మానవో
త్తంసా! నీకుచితంబె? శాంతిరస చింతన్ బూనరావే! ధరా
హంసన్ దుస్సహ వాగురవ్యధిత సిద్ధార్థుండవై కావవే!

{చివుకుల}: పెద్దనగారు పెద్దపదాలు వాడారు – అదిరింది.
{తాడేపల్లి}: చాలా బాగా చెప్పారు. ఇంత కష్టమైన సమాసాలతో హింసించాక వాడు హింస మానకుండా ఉంటాడా?
{భట్టుమూర్తి}: సెహవాగు సహవాగైతేనేమి, మంచి భావమున్న పద్యం. కరుణశ్రీ పద్యాలను భావస్ఫోరకంగా పాడేందుకు వీలుగా ఛందస్సునే ఒకింత కాదన్నారు కదా ఘంటసాల! అభినవ భువన విజయపు పెద్దనామాత్యులకు అభివాదాలు.
{గిరి}: పెద్దన గారు, భలె బాగా ఇరికించారు నలుగురినీ మీ పద్యంలో – సల్మాన్ని కనీసం మన న్యాయస్థానాలు బంధించలేక పోయినా మీరు పద్యంలో బంధించారు చాలు
{చంద్రమోహన్}: అమోఘమైన శబ్దధార!
{రాయలు}: పెద్దను బోలు సత్కవీంద్రులు లేరనిపించారు
{భట్టుమూర్తి}: నరవర నినుబోలు లలనామణినెందును గానమీ యిలన్ — గుర్తొచ్చింది — రాయలవారి మాట వినగానే

{రాయలు}: మోహన్ గారూ .. అమ్మవారి మీద మీ ప్రార్ధనా పద్యం వినిపించండి.
{చంద్రమోహన్}: చెప్పండి రాయలవారూ
{చంద్రమోహన్}: చిత్తం. అవధరించండి
సీ.

ఆదికవి తొలుత యావాహనము సేయ ||
తెలుగు తల్లిగ నీవు వెలసినావు
‘వాణి నారాణ’న్న పినవీర భద్రుని ||
కరుణతో క్షమియించి గాచినావు
సింగ భూపాలుని సాంగత్యమిప్పించి ||
శ్రీనాధు కవిరాజు జేసినావు
నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న ||
పోతనామాత్యుని బ్రోచినావు

తే.గీ.

అమ్మ! వారందరిని బ్రోచినట్లు గానె
నిను గొలుచు చిఱుకవులమేము నడిపించు
భువన విజయపు సభ నీవు గావుమమ్మ
తెలుగు భారతి వందనమ్ములివె నీకు

{విశ్వామిత్ర}:నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న— చాలా బావుంది
{చివుకుల}: చంద్రకవిగారు చిరుకవులమంటూనే మెగాపద్యం చెప్పేసారు…
{దైవానిక}: పోతరాజుని శ్రీనాథుని మొత్తానికి తలుచుకున్నాము..
{గిరి}: పోతనామాత్యుని గురించి చెప్పిన ‘నిను నమ్మ” పాదం చాల బావుందండీ
{దైవానిక}: అచ్చ తెలుగు స్వచ్చతని చూపారండి. వేసుకోండి వీరతాళ్ళు
{రాయలు}: ఇంకా నాక్కూడ ఒక జ్ఞాన పీట వెయ్యమని అడుగుతున్నారేమో ననుకున్నా 🙂
{తాడేపల్లి}: అద్భుతం ! నంది తిమ్మన చెప్పిన “మనమున ననుమానము నూనను” అనే ద్వ్యక్షర పద్యం గుర్తుకొస్తోంది
{చదువరి}: నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న – గొప్పగా ఉంది!
{భట్టుమూర్తి}: అద్భుతమైన పద్యం. నాకు చాలా చాలా చాలా నచ్చింది.
{వికటకవి}: చంద్ర గారు. చాలా బాగుంది
{రామకృష్ణారావు}: చంద్రంగారూ చాలా చక్కగా వుందండీ.
{చంద్రమోహన్}: ధన్యోస్మి!

**********

{రాయలు}: తాడే పల్లి గారూ .. మీకో సమస్య
{తాడేపల్లి}: చిత్తం సార్వభౌమా !
{రాయలు}: కందకు లేనట్టి దురద కత్తికి ఏలా?
{తాడేపల్లి}: ధన్యోస్మి
కం॥

ఎందఱు టిబెట్టుఁ గూఱిచి
నిందించినఁ జైన కదల।నిది, వామస్థుల్
కొందఱిట కొందలపడిరి
కందకు లేనట్టి దురద । కత్తికి నేలా?

{గిరి}: బావుంది తాడేపల్లిగారు
{రామకృష్ణారావు}: ఇది ప్రేక్షకులకే సమస్యలా వుంది.
{తాడేపల్లి}: క్లిష్టప్రాసలాగా ఇది క్లిష్టసమస్య అనిపించింది మొదట !
{పెద్దన}: మంచి “సామాజిక స్పృహ” ఉన్న పూరణ 🙂
{గిరి}: చైనాని జైనులకి ముడిపెట్టినంత పనిచేసారు
{చదువరి}: పూరణ బాగుంది!
{చంద్రమోహన్}: కొందలపడని వారిని దక్షిణస్థులనొచ్చా మరి? 🙂
{తాడేపల్లి}: టిబెట్టు చైనా యొక్క అంతర్గత సమస్య అని కొందఱు లెఫ్టిస్టులు అనడం దగ్గఱ నాకు బాధ కలిగింది
{రాయలు}: Beautiful
{రాయలు}: చైనా, వామస్థులు పొదిగిన తీరు అద్భుతం
{రమణి}: రాయలవారు ఆంగ్ల భాష??
{భట్టుమూర్తి}: రమణిగారూ, దేశభాషలందు … అన్నారు కదా రాయలు … అంటే ఆయనకు అన్నీ వచ్చని అర్థం
{రాయలు}: భట్టుమూర్తీ, బాగా చెప్పారు .. ఎల్లనృపులు గొల్వ నెరుగవే బాసాడి .. 🙂
{రమణి}: భట్టుమూర్తి గారు, హ్హ హ్హ హ్హ

{విశ్వామిత్ర}:రాకేశుడేడీ
{దైవానిక}: రాకేశుడింటికాడ వంటలు చేయుచున్నాడు 🙂
{భట్టుమూర్తి}: దైవానిక మీరుచెప్పిన మాట ఏదో పద్యపాదంలాగుంది
{రమణి}: రాకేశు పాకమా?? దైవానికగారు
{చివుకుల}: రాకేశుడు – రాక, ఈశుడైనాడు.
{దైవానిక}: చివుకుల, మీ పన్ను బాగుంది 🙂
{రమణి}: చివుకుల గారు: ఆమెన్ 🙂

{రాయలు}: చివుకుల, హ హ హ
{పెద్దన}: రా “కేశుడౌతాడా” మరి 🙂
{చివుకుల}: ఏసుడు కాకుంటే చాలు.
{విశ్వామిత్ర}:ఏ సుడి ఉందో వారికి, ఎవరికి తెలుసు
{రాయలు}: కేశుడే మరి .. ప్రొఫైలు బొమ్మలో ఐతే గడ్డం మీసం ఉన్నాయి!
{గిరి}: విశ్వామిత్ర, మీ నుడి బావుంది
{భట్టుమూర్తి}: పన్ను’లు తళతళలాడుతున్నాయి … ఆపన్నుడేమో రాకేశుడు.
{దైవానిక}: ఇవన్ని రాసుకొని ఇంటికి వెళ్ళి వినిపించాలి .. ఎంత మిస్సయ్యాడో తెలుస్తుంది
**********

{రాయలు}: మీ అందరి శ్రద్ధ వేడుతున్నాను. ఈ తరువాతి సమస్యకి చాలా పూరణలు వచ్చాయి .. దీని ప్రసిద్ధి దృష్ట్యా, అన్ని పూరణలూ వినిపించాలి అనుకున్నాను. అంచేత మధ్యలో సరస సంభాషణకి కాస్సేపు కళ్ళెం వేసి చకచకా పద్యాల్ని నడిపిద్దాము
{చివుకుల}: రాయలవారు వేడడమా…డిమాండాలిగాని.
{రాయలు}: Chivukula: వేడికోలులోని వేడిని గమనించాలి 🙂
{రామకృష్ణారావు}: రాయలవారూ, ఇంతకీ సభలో నేనున్నట్టా లేనట్టా?
{విశ్వామిత్ర}:రామకృష్ణులు లేకపోతే, రాయలవారికి ఆనందమెక్కాడ? మీరు ఇక్కడే ఉన్నారు
{రాయలు}: “చిరు”తరు వింక పూచి వికసించి ఫలమ్ములనిచ్చి కాచునా? ఇదీ మేమిస్తున్న సమస్య. పూరణ – రాజకీయాల్లోకి చిరంజీవి ప్రవేశానికి సంబంధించి ఉండాలి. పూరించండి రామకృష్ణారావుగారూ!
{చివుకుల}: పూచేది ఎవరికో..కాచేది ఎవరికో…ఫలమ్ములెవరికో…
{రామకృష్ణారావు}:
చ:-

చిరు తరు వెట్టి గాలికిని తృళ్ళదు.నిశ్చల భక్తు పోలికన్.
తరువుల కల్పకమ్మనుచు దానిని నిల్పిరి. చూచు చుండుడా
చిరు తరు వింక పూచి వికశించి ఫలంబుల నిచ్చి గాచు, నా
చిరు ఫలముల్ కనుంగొనగ చేరువనే కలదయ్య కాలమున్.

{చివుకుల}: ఇదేదో అల్లువారు చెప్పిన పద్యంలాగుంది.
{గిరి}: కాస్తుంది అని నిర్ణయించేసారు, రామకృష్ణ గారు
{భట్టుమూర్తి}: చూచుచుండుడు …!! వచ్చినవాడు ఫల్గుణుడు అన్నట్టుంది.
{పెద్దన}: రామకృష్ణగారు చాఆఆ..లాఆఆ… ఆశావాది 🙂
{తాడేపల్లి}: “కాచునా ?” అని ప్రశ్నించడం వారికి రుచించలేదులా ఉంది. అందుకనే అంత ఖచ్చతంగా తేల్చారు.
{రాయలు}: హ హ్హ హ్హ
{రామకృష్ణారావు}: ఆశయా బధ్యతే లోకః కదండీ?
{గిరి}: మీ ఓటు ఎవరికో తెలిసింది లెండి 🙂
{చంద్రమోహన్}: ఇందులో కూడా పూరణ వాక్యాన్ని మూడవపాదంలో ఉంచి చమత్కారం చేశారు.
{చదువరి}: చిరు తరువు కాదది వటవృక్షం!

{రాయలు}: గిరి గారూ .. తరులకు రాజభోగముల .. ప్రారంభించండి
{గిరి}: చిత్తం

తరులకు రాజభోగముల తంతుల జూచిన విత్తనంబు తొం
దరపడి వచ్చివాలెను స్వధర్మము వీడి యెడారి బీడులన్
పరుగిడి పాలుత్రావ నెగ బ్రాకిన బీజము మొక్కపోవునా?
చిరు తరువింక పూచి వికసించి ఫలమ్ములనిచ్చి కాచునా?

{భట్టుమూర్తి}: గిరిగారు “పరధర్మో భయావహః” అంటున్నారు 🙂
{తాడేపల్లి}: చిరంజీవికది తగిన రంగము కాదంటున్నారు
{పెద్దన}: భేష్!
{రామకృష్ణారావు}: వ్వహవా!
{రాయలు}: తొందర పడిందంటారా .. ఇప్పటికే రైలు బోలెడు ఆలస్యం అయిదని అందరూ అనుకుంటుంటే
{చదువరి}: తొందరపడి.. 🙂 రాయలవారూ, నా ఉద్దేశ్యమూ అదే!
{రాయలు}: కానీ సరైన పునాది వేళ్ళు పాతుకోకుండా ఎదగ జూస్తోందని మాత్రం అనిపిస్తోంది
{గిరి}: తొందరపాటు రాజసమందుకోవడం కోసం – దాని అమలు ఆలస్యం
{వికటకవి}: ఇది నాకు చాలా నచ్చింది గిరి గారు

{చంద్రమోహన్}: ఒకటి నిశ్చయాత్మకం. మరొకటి సంశయాత్మకం. మరి మూడవదేమిటో!
{రాయలు}: మూడవది తాడేపల్లి గారిది
{తాడేపల్లి}: చిత్తం ! ఈ సమస్య వాస్తవ జీవితంలో కూడా సమస్యే . ఎందుకంటే చిరుతరువు చుట్టూ పెను-చీడలున్నాయని నా అనుమానం. అయినా అవకాశం లేకపోలేదు.
{దైవానిక}: అవునో కాదో ఈ సారి విజయదశమికి తేలుతుంది
{తాడేపల్లి}: ప్రారంభిస్తున్నాను.

చం॥

సురుచిర గౌతమీ తట వి । శుద్ధ వసుంధర నంకురించె, దు
ర్భర విలయ ప్రవాతక ని । భంబగు నైక విపత్పరంపరన్
సరవిని దాఁటి నిల్చె, బహు । శాఖల నెల్లెడ విస్తరించె, నీ
“చిరు”తరు వింక పూఁచి విక । సించి ఫలమ్ముల నిచ్చి కాచునా?

{గిరి}: మూడవది కూడా సంశయాత్మకంగానే ఉన్నది
{రాయలు}: పాత విజయాల్ని స్మరించుతూ ఈ కొత్త ప్రయత్నం జరుగుతుందా అంటున్నారు
{తాడేపల్లి}: పూర్వవిజయాల్ని బట్టి జరగాల్సి ఉందని ధ్వని
{గిరి}: తాడేపల్లి వారు, చిరంజీవి పూర్వ వైభవం తెలుపారు మీ పదాలలో
{పెద్దన}: బావుంది. ఈ చిరుతరువు “ఫేను” గాలికి ఎంతవరకూ వికసితుందో వేచి చూడాలి.
{చివుకుల}: చిరుతరువు వికసించకపోతే – అల్లువారు అల్లనల్లన ఏడవరూ?
{భట్టుమూర్తి}: తాడేపల్లిగారి పద్యంలో ఆశావాదం వుంది
{వికటకవి}: ఎంతైనా చిరు గారి గూర్చి ఎన్నో టపాలు వ్రాసిన వారు కదా! ఈ పద్యం వారికి అలవోకగా వచ్చి ఉండాలి.
{చంద్రమోహన్}: విస్తరణ పూర్తయింది. ఇక పూచి వికసించి ఫలమ్ములనీయడమే మిగిలిందన్నమాట.
{రామకృష్ణారావు}: తాడేపల్లివారికి తాడేపల్లివారే సాటి.

{రాయలు}: దైవానిక, మీ పూరణ ఉన్నట్లుంది ..
{దైవానిక}: చిత్తం, నేను కాస్త మార్చి సీసం చేసాను .. యువకవిని, వృత్తాలు వ్రాయుట నేర్వలేదింకా
ఆ:

ఓడిపోదువన్న వాడిని వురికించి,
ఫ్యానులమని జెప్పి పరువు దీసె
దత్తకూతురనగ దండెత్తి వచ్చి మా
పిల్లనివ్వమనుచు లొల్లి బెట్టె

సీ:

పేరుబెట్టను జూస్తె పేరింకొకడదయ్యె
బ్రతిమాలి వొప్పించి బయట పడెను
మొదలుపెట్టక ముందె మొదలాయె కష్టాలు
ఊరకున్ననుగాని యుడుగు లేదు
సర్వపార్టీలు విగుర్వించి దుమ్మెత్తి
పోస్తుండగా యెదురస్తు నిలచి
చిరుతరువింక పూచి వికసించి ఫలమ్ము
లనుయిచ్చి కాచునా! రంది లేక!

ఆ:

విషయముంది గనుక విరసములిన్నియు
బాధలెన్నియున్న భయపడకను
యిట్టి కష్టములను యెదురొడ్డి నిలచిన
ముఖ్యమంత్రి పదవి ముందరుండు

{రామకృష్ణారావు}: వాహ్ వాహ్ దైవానికా! చాలా బాగుంది.
{భట్టుమూర్తి}: దైవానిక పద్యం ఒక ఆశీర్వాదంలా లేదూ!
{వికటకవి}: అవునవును
{గిరి}: ఉంది
{చదువరి}: భట్టుకవీ.. అలా అనిపించిందా!?
{తాడేపల్లి}: లక్షలాదిమంది ఆశీర్వాదాలు చిరంజీవిగారికున్నాయి.
{దైవానిక}: కొంచెం సందేహం .. కొంచెం హోప్
{రమణి}: వీరాభిమాని ఆశీర్వాదంలా ఉంది
{చివుకుల}: ట్రైలేద్దాం కొండ కొనకు – పోయేదేముంది మనకు – ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు…
{రాయలు}: చివుకుల, ఇది కూడా ఏదో సీస పాదంలా ఉందే!
{వికటకవి}: కానీ అయ్యవారు బోల్తాపడ్డా నేనాశ్చర్యపోను
{తాడేపల్లి}: కానీ ఆయన కోరికోరి అనేక అపశకునాలతో పార్టీని ప్రారంభించడమే బాధగా ఉంది
{చదువరి}: ఆది లోనే హంసపాదు అని చెబుతున్నారు.
{దైవానిక}: అవును .. ఈ ఆడ్డులన్ని ఎదుర్కోంటే, విజయం చిరుదే

{రాయలు}: భట్టుమూర్తి, మీ పూరణ …
{భట్టుమూర్తి}: నా పూరణ ఒక చంపకమాల … అవధరించండి

పరువును మాసి శాసన స|భాంతరమందు వృధా ప్రసంగులై
కరతలు జేయు నాయకుల|కాలము యింతటితో సమాప్తమై,
చరితలు మారగా, ప్రజలె |చల్లగ రాజ్యము చేయునట్లుగా
చిరు తరువింక పూచి విక|సించి ఫలమ్ముల నిచ్చి కాచునా!

{చదువరి}: ఇదీ.. ఆశావాదం!
{వికటకవి}: మరో ఆశావాదం భట్టుమూర్తి గారిది కూడాను
{పెద్దన}: మీదీ మంగళాశాసనం లానే ధ్వనిస్తోంది భట్టుమూర్తీ!
{భట్టుమూర్తి}: ఔనండీ పెద్దనగారూ, నేను ఆశావాదినే
{చంద్రమోహన్}: నిజంగా ప్రజలే రాజ్యం చేస్తారంటారా?
{చదువరి}: ప్రజారాజ్యం చేస్తుంది!
{రమణి}: భట్టుమూర్తి గారు కూడ ఆశపడ్తున్నట్లే ఉంది
{దైవానిక}: ఆశలేని బ్రతుకు బ్రతకగనేల??
{రాయలు}: ఎంతైనా “భట్టు కవి కదా 🙂
{రామకృష్ణారావు}: భట్టుకవి తెల్పె మరి కాస్త గుట్టు మనకు

{రాయలు}: అరె, జ్యోతి గారు కూడ వచ్చారే .. అందుకే సభలో ఇంత వెల్గు ఒక్కసారిగా
{జ్యోతి}: అనువుగాని చోట కాస్త అణకువగా ఉండాలని ఊరుకున్నాను
{తాడేపల్లి}: పద్యరచనని అందఱికీ అనువుగా చెయ్యాలనే మా తాపత్రయం జ్యోతిగారూ.
**********

[సశేషమ్]

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

8 Responses to అభినవ భువనవిజయ దశమి

  1. అద్భుతం. ఈ భువనవిజయాన్ని మిస్సవ్వడం నా దురదృష్టం. అందరికీ అభినందనలు.

  2. బాగు బాగు మీ భువన విజయము.

    మీరందరూ ప్రైవేటు గా చేసుకొన్నారా? నన్ను సాహసముతో వెలివేసితిరి గదా. అట్లే కానివ్వండి.

    — విహారి

  3. నాగమురళి, విహారిగార్లకు –

    మీ ప్రోత్సాహానికి మిగుల కృతజ్ఞతలు. మీవంటి రసజ్ఞుల సమక్షంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటే అవి మరింత శోభిస్తాయనీ సంతోషాన్నిస్తాయనీ తెలిసి కూడా, అందుకు తగిన సాంకేతిక ఉపకరణాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా పరిమితం కావలసివచ్చినందుకు బాధపడుతున్నాం.

    – పొద్దు సం.

  4. అయ్యో విహారీ, మిమ్మల్ని మిస్సైపోయాం! ఈసారికి మీకూ ఒక జరీకుచ్చు తలపాగా చుట్టించేస్తాము లెండి.

  5. చాలా మంచి అనుభూతి కల్గించింది.

  6. lachhimi says:

    మరి మా లాంటి చిన్నపిల్లలకి ఎవరు చెప్తారు ఈ పద్యాలన్నీ?
    ఎంత బాగున్నాయో చదువుతుంటే……
    భలే భలే! నాకు కూడా పద్యాలు రాయడం వస్తే బాగుణ్ను అనిపించింది.
    తెలుగు భాషాభిమానులందరికీ ఆనందదాయకం ఈ కార్యక్రమం.

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోకి మార్చబడింది. -సం.]

  7. swarupkrishna says:

    స్వతహాగా నేను తెలుగు ఉపన్యాసకున్ని కావడం చేతనో, పద్యం మీద నాకు అమితమైన ప్రేమ ఉండబట్టో తెలీయడం లేదు గానీ, మీ భువన విజయము నిజంగా ప్రశంసనీయము. ఇప్పటికి నాకనిపిస్తోంది…. చీకట్లు కమ్మిన తెలుగు పద్య కవిత కారడవిలో మళ్ళి పొద్దు పొడుస్తోందని. ఈ పొద్దు రేకలు దిగ్దిశాంతములై సాహితీ వెలుగులు విరజిమ్మాలని సాహితీ ప్రియులందరి ఆకాంక్ష.

  8. Pingback: పద్యం.నెట్ » Blog Archive » శివ తపోభంగము

Comments are closed.