తెల్ల కాగితం

కొల్లూరి సోమశంకర్


కొత్త పాళీ గారు తన బ్లాగులో సూచించిన కథలపోటీకి ప్రతిస్పందనగా కొల్లూరి సోమశంకర్ గారు పంపించిన కథ ఇది.


“బాబూ, అన్నం తిందూగాని రా”
అమ్మ పిలుస్తోంది. వంటింట్లోకి వెళ్ళాను. కంచంలో చూసాను. అది పేరుకే అన్నం. కానీ మేము తినేది ఉడికించిన నూకల ముద్ద. నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో బియ్యం ఉండవు. కూరగాయలు కూడా రెండు వారాలకొకసారి కొంటాం. ఎక్కువగా ఆకుకూరలే తింటాం. రెండు రోజుల నుంచి అమ్మ ఆకుకూరలు కూడా కొనడం లేదు. నూకల జావలో ఉల్లిపాయ ముక్కలు నంచుకోడం.. లేదంటే నూకల ముద్దని పచ్చికారంతో తినడం. ఇదే మా భోజనం!

నాకేడుపొస్తోంది. ఓ పదిరోజుల నుంచి మా ఇంట్లో అందరం కలిసి తినడం లేదు. నాకు, చెల్లికి పెట్టాక, మమ్మల్ని పడుకోబెట్టి అప్పుడు తింటున్నారు అమ్మానాన్న…! నిజంగా తింటున్నారో లేదో నాకు తెలియదు. చెల్లి గబగబా తినేసి, గ్లాసుడు నీళ్ళు తాగేసింది. నేను కూడా అదే చేసాను. కారంగా ఉన్నా తప్పలేదు.

స్కూలు తెరచి నెల రోజులవుతోంది. మేము ఇంకా పుస్తకాలు కొనుక్కోలేదు. టెక్స్ట్ బుక్స్ అయితే సెకండ్ హాండ్ వి కొంటాం. లేదంటే ఎవరైనా పై తరగతి కుర్రాడిని బతిమాలి తీసుకుంటాం. ఇప్పటికి ఒక్క లెక్కల పుస్తకం తప్ప, మిగిలినవన్నీ దొరికాయి. అయితే కొన్నింటికి ముందు పేజీలు, మరికొన్నింటికి వెనుక పేజీలు లేవు. టెక్స్ట్ బుక్స్ కొత్తగా కొనుక్కున్న వాళ్ళని అడిగి ఆ పేజీలు జిరాక్సు తీయించుకుందాంలే అని నాన్న అన్నాడు. ఇంక నోట్ బుక్స్ సంగతి చూడాలి.

నాకెప్పుడూ కొత్త నోట్ బుక్స్ ఉండవు. నాన్న ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ ఆఫీసులో ప్రింటర్ కి కార్బన్ పెట్టి ఉపయోగిస్తారట. వాడి పడేసిన ఆ కాగితాలను తెచ్చి పుస్తకంలా కుట్టి ఇచ్చాడు. ‘ప్రస్తుతానికి దీంట్లో రాసుకో. మెల్లిగా నోటుబుక్సు ఏర్పాటు చేస్తాను’ అని చెప్పాడు. నాన్న ఇంటికి వచ్చాక అడగాలి.

ఇంతలో యూనిఫాం సంగతి గుర్తొచ్చింది.
“అమ్మా… యూనిఫాం…”
“నాన్న వాళ్ళ ఫ్రెండు కొడుకు గిరి మీ స్కూల్లోనేగా చదివేది. ఆ అబ్బాయికి ఈ సారి కొత్త యూనిఫాం కుట్టిస్తున్నారట. పాత యూనిఫాంని నీకివ్వమని అడిగారు. వాళ్ళు ఒప్పుకున్నారట”
“అది కాదమ్మా… గిరన్నయ్య రెండేళ్ళు వాడాడు ఆ యూనిఫాంని….”
“అయితేనేం, ఎక్కడా కొంచెం కూడా చిరగలేదట. ప్రస్తుతానికి అది వాడుకో. పండగకి కొత్త యూనిఫాం తీసుకుందాం” అంటూ అమ్మ నన్ను బుజ్జగించింది.
ఇంతలో నాన్న రావడంతో, నన్ను పడుకోమని చెప్పి అమ్మ అక్కడ్నించి కదిలింది.

* * * * * *ఓ వారం రోజులు గడిచాయి. లెక్కల టెక్స్ట్ బుక్ దొరకలేదు. యూనిఫాం మాత్రం వచ్చింది. అమ్మ దాన్ని శుభ్రంగా ఉతికిచ్చింది. నోట్ బుక్స్ కోసం నాన్న ఓ ఆలోచన చేసాడు. పరీక్షలు పాసయి, పై తరగతికి వెళ్ళిపోయిన పిల్లలు అమ్మేసిన నోట్సులలో మిగిలిపోయిన తెల్లని పేజీలన్నింటిని తిరిగి కొన్నాడు. వాటిని పుస్తకాలుగా కుట్టి అట్టలు వేసి ఇచ్చాడు. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలన్న నా కోరిక తీరనే లేదు.
ఈ పూట స్కూలు ఆయిపోయి సాయంత్రం ఇంటికొచ్చాను. లెక్కల పుస్తకం ఎలా సంపాదించాలాని చూస్తున్నాను. అమ్మ తెలిసున్న వాళ్ళింట్లో అడిగిందట. అందరూ తమ చుట్టాల పిల్లలకి ఇచ్చేసామని చెప్పారుట. నాకేడుపొచ్చింది.
“అమ్మా, పుస్తకం తీసుకెళ్ళకపోతే మాస్టారు కొడతారేమో…” అన్నాను.
” ఏం కొట్టరులే. రేపు నేనొచ్చి చెబుతాను” అంది అమ్మ. కానీ నాకు భయం పోలేదు.
అప్పుడు అమ్మ నన్ను, చెల్లిని దగ్గరికి తీసుకుని, బోలెడు కథలు చెప్పింది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. “మీకు ఓ పద్యం నేర్పుతాను” అంటూ అమ్మ ఈ పద్యం చెప్పింది.

ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభాంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, యశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్

తర్వాత దాని అర్థం వివరించింది. ఇలా అమ్మ మాకు చాలా పద్యాలు నేర్పింది. వాటిల్లో నాకు చాలా వరకు కంఠతా వచ్చు.

* * * * * *మర్నాడు లెక్కల పీరియడ్లో మాస్టారు పుస్తకం గురించి అడగనే అడిగారు. నేను భయం భయంగా అమ్మ వచ్చి మాట్లాడుతుందని చెప్పా. ఆయన నాకేసి ఉరిమి చూసి, ‘ ఏడిసావు లే పో’ అని అన్నారు. కాసేపటికి మా అమ్మ వచ్చింది. ఆయనతో మాట్లాడి, ఆయన చేతిలో ఉన్న కొత్త లెక్కల పుస్తకాన్ని తీసుకుని బయటకి వెళ్ళింది.

తర్వాత తెలుగు పీరియడ్. మాస్టారు పాఠం చెబుతుండగా ఓ నోటీసు వచ్చింది. అవతలెల్లుండి డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని, పిల్లలందరూ శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకుని, అన్ని పుస్తకాలు తీసుకుని స్కూలికి రావాలని సందేశం. తెలుగు మాస్టారు ఇవన్నీ మాకు చెప్పి, ” ఒరే పిల్లలూ, వచ్చే డి. ఇ. ఓ గారు మిమ్మల్ని ఏదైనా వ్యాసం రాయమని అడగొచ్చు. ఓ ఠావు తెల్లకాగితం తెచ్చుకోండి. గుండ్రటి దస్తూరితో చక్కగా రాయండి” అంటూ మమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మిగతా మాస్టార్లందరూ కూడా ఇదే మాట చెప్పారు. ఏ పీరియడ్లోనైనా డి. ఇ. ఓ గారు రావచ్చని, కాబట్టి అప్పటివరకూ చెప్పిన పాఠాలన్నింటిని బాగా చదువుకుని రావాలని చెప్పారు. లెక్కల మాస్టారు నా టెక్స్ట్ బుక్ గురించి మళ్ళీ గుర్తు చేసారు.

ఇప్పుడు నా సమస్యలు రెండు. ఒకటి లెక్కల పుస్తకం, ఇంకోటి తెల్ల కాగితం…..
‘లెక్కల పుస్తకం సంగతి అమ్మ చూస్తానంది. ఠావు తెల్ల కాగితం నాన్నని అడగాలి’ అని అనుకుంటూ ఇల్లు చేరాను. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక తెల్లకాగితం గురించి అడిగాను. గడువు చెప్పేసాను. ఆయన ‘చూద్దాంలే’ అని అన్నాడు. నేను హాయిగా నిద్రపోయాను. ఆ రాత్రి మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చూస్తే, అమ్మ ఏదో రాస్తూ కూర్చుంది. తెల్లారింది. నేను స్కూలుకు, నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయాం. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, అమ్మ ఇంకా రాస్తూనే ఉంది. మమ్మల్ని చూసి, రాయడం ఆపి, పుస్తకాలు పక్కనబెట్టింది.
“కాళ్ళు చేతులు కడుక్కుని రండి, కాసిన్ని బఠానీలు తిని పాలు తాగుదురుగాని” అని అంది. అమ్మ కుడిచేతి వేలొకటి వాచిపోయి కనబడింది.
“ఏమైందమ్మా?” అని అడిగాను.
“ఏం లేదురా, చాలా సేపటినుంచి రాస్తున్నా కదా, అందుకే ఇలా అయ్యింది”
ఏం రాస్తోందో అని పరిగెత్తుకు వెళ్ళి గూట్లో పెట్టిన పుస్తకాన్ని చూసాను. నా లెక్కల టెక్స్ట్ బుక్ ని మక్కీకి మక్కీ తిరిగి నోట్సులో రాస్తోంది అమ్మ. దాదాపుగా అయిపోయింది. నేను అమ్మని చుట్టేసుకుని ఏడ్చేసాను.
“ఏడుపెందుకురా? డబ్బులు పెట్టి ఎలాగు పుస్తకం కొనలేకపోయాను. కనీసం చేత్తో అయినా రాసిద్దామని అనుకున్నాను….” అంటూ నన్ను ఓదార్చింది, తన కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా.
రాత్రి నాన్న వచ్చాక, తెల్ల కాగితం గురించి అడిగాను. ‘మర్చిపోయానురా, రేపు తెస్తాలే’ అని అన్నారు. నాకు నీరసం ముంచుకొచ్చింది. చెప్పిన గడువులోగా తెల్లకాగితాన్ని సంపాదించగలనో లేదో తెలియదు. ఇలాగే ఇంకో రోజు కూడా గడచిపోయింది. అమ్మ లెక్కల పుస్తకాన్ని పూర్తిగా రాసేసి, మాస్టారికి తిరిగిచ్చేసింది. అంత లావు పుస్తకాన్ని రెండు రోజులలో చేత్తో పూర్తిగా రాసేసినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. అమ్మ ఆయనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.

మొత్తానికి నాన్న నాకీ పూట ఓ ఠావు తెల్లకాగితం తెచ్చిచ్చాడు. వాళ్ళ ఆఫీసునుంచి తెచ్చాడట. ఇలా కొత్త కాగితాన్ని ఆఫీసునుంచి తీసుకురావడం నాన్నకి అస్సలిష్టం లేదట! కానీ నా గోల భరించలేక తెచ్చానని అమ్మతో అంటుంటే విన్నాను.
ఏమైతేనేం, నేనిప్పుడు బడికి ధైర్యంగా వెళ్ళగలను.

* * * * * *మర్నాడు ఉత్సాహంగా బడికి వెళ్ళాను. డి. ఇ. ఓ గారు వచ్చే రోజిది. ఆయన ఎప్పడొస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు పీరియడ్ మొదలైంది. మాస్టారు కంగారు పడిపోతున్నారు. పిల్లలందరినీ హెచ్చరిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయనకేదో గుర్తొచ్చింది. “ఏమర్రా? తెల్ల కాగితం తెచ్చుకున్నారా?” అని అడిగారు.

నేను తప్ప మిగిలిన అందరూ ‘తెచ్చుకున్నాం సార్’ అంటూ అరిచారు. ” ఏరా నువ్వెందుకు తెచ్చుకోలేదు?” అని గద్దించారు మాస్టారు. నేను ఏదో చెప్పబోయేలోగా, నా దగ్గరికి వచ్చి, నా నడ్డి మీద ఒక దెబ్బ వేసారు. అప్పటికిగాని ఆయన కోపం చల్లారలేదు.
తెల్ల కాగితం ఎందుకు తెచ్చుకోలేదని మళ్ళీ అడిగారు.

“తెచ్చుకున్నాను సార్! కాని ఇంటర్వెల్లో నాలుగో తరగతి చదువుతున్న శీను ఏడుస్తూ కనిపించాడు. ఎందుకేడుస్తున్నాడో అడిగాను. మీరు వాళ్ళ క్లాసులో కూడా చెప్పారట కదా సార్ – తెల్ల కాగితం తెచ్చుకోమని! ఎంత ప్రయత్నించినా వాడికి తెల్ల కాగితం దొరకలేదట. అందుకని నా తెల్లకాగితం వాడికిచ్చేసాను. నా దగ్గర కనీసం ఒక సైడు వాడిన కాయితాల పుస్తకం ఉంది. వాడికి అది కూడా లేదు సార్….” అని చెప్పాను.

మాస్టారు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏదో అనబోతుండగా హెడ్ మాస్టారు, డి. ఇ. ఓ గారు మా క్లాసులోకి వచ్చేసారు. పిల్లలందరూ ఆయనకి నమస్కరించి, తెల్ల కాగితాలు ముందేసుకుని ఆయన ఏదైనా చెబితే రాయడానికి సిద్ధమైపోయారు.
“పిల్లలూ, ఇది తెలుగు పీరియడ్ కదా, మీకెవరికైనా ‘ఏఱకుమీ కసుగాయలు’ అనే సుమతీ పద్యం వస్తే లేచి చెప్పండి. పద్యం చెప్పి అర్థం కూడా వివరించాలి…” అన్నారు డి. ఇ. ఓ గారు. నాకా పద్యం తెలుసు. అమ్మ ఎప్పుడో చెప్పింది. వెంటనే నేను లేచి ఆ పద్యం చదివి దాని అర్థం వివరించాను. వెంటనే ఆయన ‘శభాష్’ అని అన్నారు. హెడ్ మాస్టారు, తెలుగు మాస్టారు నాకేసి మెచ్చుకోలుగా చూసారు. కొన్ని క్షణాల తర్వాత డి. ఇ. ఓ గారు, హెడ్ మాస్టారు గారు మా గదిలోంచి వెళ్ళిపోడంతో వాన వెలసినట్లయ్యింది.

* * * * * *ఇప్పుడు నా దగ్గర రెండు వందల పేజీల తెల్ల కాగితాల లాంగ్ నోట్ బుక్స్ ఆరు ఉన్నాయి. మా తెలుగు మాస్టారు నాకు వాటిని బహుమతిగా ఇచ్చారు.

(సమాప్తం)

————————–

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 44 అనువాద రచనలు, 20 దాకా స్వంత రచనలూ చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 x 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

29 Responses to తెల్ల కాగితం

 1. radhika says:

  మీలాంటి చేయితిరిగిన రచయితలు కూడా పోటీకి వస్తే ఎలాగండి? :)

 2. చాలా బాగుంది, సోమశంకర్.
  రాధికా, మీరు పోటీలో లేరనుకున్నానే? :)
  పోటీ చేస్తున్న వాళ్ళ తరపున వకాల్తానా?

 3. గిరి says:

  చాలా బావుందండి..చిన్నప్పుడు కుట్టుడు పుస్తకాలు, పైతరగతుల వారి వాడిన పాఠ్యపుస్తకాలు వాడడం రివాజుగానే ఉండేది..అబ్బాయి తల్లి లెక్కల పుస్తకాన్ని కాపీరాయడం హైలైటు. తెలుగు మాస్టారు పల్లాడి నడ్డి చరిచి వాడి సమాధానం విన్నతర్వాత ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోవడం – అక్కడ మీ పట్టులో పడ్డాను చదువుతున్నప్పుడు, ఏ విధంగానైనా డిఇఓ గారి రాకని ఇంకొంచెంసేపు ఆపి, సన్నివేశంలో మరింత కరుణారసం జొప్పించి ఉంటే కంటతడి ఖాయమయ్యేది..

  ఏమైనా చాలా బావుందండి..

 4. వింజమూరి విజయకుమార్ says:

  ఎంత అతిశయోక్తి ఉందనుకున్నా అమ్మ లెక్కల పుస్తకం రాయడం కంట తడి పెట్టించింది. కథ బాగుంది. భేషజం లేకుండా కొత్తవారితో కలసి మీరూ కథ రాయండం ప్రశంసించదగినదే అయినా, రాధిక గారన్నట్టు మీరు వాళ్ళతో పోటీకి వెళ్ళడం అన్యాయం సార్.

 5. @రాధిక గారు, కొత్తపాళీ గారు, గిరి గారు: నెనరులు.
  @విజయకుమర్ గారు,
  అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నా చిన్నప్పుడు నిజంగానే కొన్ని రోజులు మేము పచ్చి కారంతో అన్నం తిన్నాము. నా 6వ తరగతిలో మా అమ్మ నా లెక్కల టెక్స్ట్ బుక్‌ని as it is గా చేత్తో రాసిచ్చింది. కొత్తపాళీ గారు ఇతివృత్తం చెప్పినప్పుడు నాకీ విషయాలు మరో సారి గుర్తొచ్చాయి. వాటినే కథగా మలిచాను అంతే.
  ఇక పోటీ విషయం అంటారా,అది కేవలం కొత్త రచయితల కోసమే కాదుగా? ఆసక్తి ఉన్న అందరూ పాల్గొనవచ్చని చెప్పారుగా. బహుమతి కోసం కాకపోయినా, అనువాదాల మీద నుంచి కాస్తంత దృష్టి మరల్చడానికే ఈ కథ.
  మీలాంటి సాహితీ మిత్రుల ప్రశంసే నాకు నిజమైన కానుక.

 6. somasankar says:

  “anonymus” ani ela vachchimdo ardham kaaledu. pai comment rasimdi nene. Soma Sankar

 7. సోమశంకర్ గారూ, మాకూ అర్థం కాలేదు. పేరు మార్చాం!

 8. rama says:

  కధ మటుకు నిజంగానే కంట తడిపెట్టించింది. అప్పుడు చదువుకోడం కోసం ఎంత కష్టపడ్డామో ఇప్పుడు చదువు”కొనడం” కోసం అంత కష్టపడ్తున్నాము.

 9. lalitha says:

  తెల్ల కాగితం ఎన్నో రంగులు నింపుకుంటూ పోతోంది.
  ఇలా అందరూ పాల్గొనడం ఈ బ్లాగు కమ్యూనిటీకి ఒక అందం, అర్థం కలగచేస్తోంది.
  సౌమ్య రాస్తున్నాననడం గుర్తుంది. ఎదురు చూస్తున్నాను.

 10. రమ్య says:

  ఒక్క తెల్ల కాగితం పై ఇన్ని కథలు చదవటం చాలా బాగుంది.
  ఇది ఐదవ కథ. ఇంకా కథలకోసం నేనూ ఎదురుచూస్తున్నాను.

 11. kasturimuralikrishna says:

  the story by somasankar is realistic.it is a good story.anystory which ahs roots in real life touches the heart of readers.welldone.regarding his participation in the story competetion i think competetion is a must for honing ones skills.by competeting eith novices a seasoned writer can understand where he stands and also show new writers the skill and tecniques required to become a good writer.

 12. lalitha says:

  రాధిక గారు సరదాగా అని ఉంటారు. అది అంత సీరియస్ గా తీసుకోక్కర్లేదనుకుంటా.

 13. sandeep says:

  Don’t misunderstand me sir, but i think i have read this concept of writing the text book with own hands in yandamoori’s “ANANDOBRAHMA”. buT I am sure its a coninsidence.

  Anyway, its a nice story.

 14. radhika says:

  కొత్తపాళీ గారూ నేను పోటీలో లేనండి.ఆ మాట సరదాకి అన్నాను.
  కళకి కొత్తా పాత ఏముంటుందండి.కొత్తవాళ్ళయిన రమగారు,లలితగారూ,మయూఖగారూ ఎంత బాగారాయలేదు.
  నేను ముందు కామెంటులో రాసిన మాటలు ఎవరినయినా బాధించి వుంటే క్షమించగలరు.

 15. రమ్య says:

  రాధిక గారు నేనూ కొత్తేనండీ నన్ను మర్చి పోయారు.

 16. బాగుంది..కొత్తపాళీ గారి స్పూర్థిని బాగా మీ కథలో జోడించారు :)

 17. సోమశంకర్ గారు
  ఎందుకో అసంతృప్తి గా ఉందండి కథ చదివాక
  నేను చాలా expect చేసానేమో మరి
  తెల్లకాగితానికి అంత మొహం వాచాలా అనిపించింది మొత్తం చదివాక
  మిమ్మల్ని విమర్శించే అర్హత నాకు లేదు
  క్షమించాలి

 18. శ్రీ says:

  బాగా ఉంది కథ! “లెక్కల పుస్తకం తిరిగి రాయటం” చాలా బాగా నచ్చింది.

 19. రంగారెడ్డి says:

  నమస్తే సార్ ,మీ రచన బావుంది

 20. kolluri somasankar says:

  మొదటగా, నేను ఆరు రోజుల పాటు ఊర్లో లేక పోడం, నెట్‌కి దూరంగా ఉండడంతో మీ వ్యాఖ్యలు చదవలేకపోయాను.
  @సందీప్ గారూ,
  మీరన్నట్లుగా అది “కో-ఇన్సిడెన్స్” మాత్రమే.
  @లలితా స్రవంతి గారూ,
  మీరు మీ అభిప్రాయం చెప్పారు. దాన్ని నేను విమర్శగా భావించడం లేదు. ఇక తెల్ల కాగితం కోసం అంతలా మొహం వాచిపోవాలా అంటే,కథకి ఇతివృత్తమే అది అయినప్పుడు తప్పదు మరి.
  @శ్రీ గారూ,
  నెనరులు

 21. venkateswararao says:

  మీరు వ్రాసిన కథ చాలాబాగుంది. నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి.నేను తెలుగు బ్లాగు చూడటము ఇదే మొదటిసారి. స్వచ్ఛమైన తెలుగు రచనలు చదివానని సంతృప్తిగా ఉంది. నాకు తెలుగు వ్యాసాలు అన్న చాలా ఇష్టము. నా అభిప్రాయాన్ని వ్రాయటానికి చాలా టైము పట్టినది, .
  నాకు కూడా ఇలాటి బ్లాగు వ్రాయటము గూర్చి తెలుపరూ. ధన్యవాదములు

 22. @రంగారెడ్డి గారూ,venkateswararao గారూ
  నెనరులు

 23. G.Sreenivasa Rao says:

  Many children should read this story just to know how their parents were survived, fought and winning the game of life. Most children some how assume every thing is birth right.
  Keep it up Soma Sankar.
  Although I desire to express in Telugu, my computer typing in Telugu is dangerous.

 24. chandrasekhar says:

  Dear Somasankar, పిల్లవాడు ఏ తరగతి? మిగిలిన తెల్ల కాగితాలు తిరిగి కొనడమేమిటి? i am asking about your sentence, but not about the meaning which I can understand. తండ్రి transport co.లో ఏం ఉద్యోగం చేస్తున్నాడు? దీన్ని బట్టేకదా వాళ్ళ ఆర్థిక స్థితి తెలిసేది. Don’t say you have no space.

 25. chandrasekhar says:

  అచ్చు తప్పులు కూడా ఉన్నాయి, పద్యంలో ఒకటుంది.

 26. @చంద్రశేఖర్ గారూ,
  మొదటగా అక్షర దోషాలకు – క్షమాపణలు.
  ఈ కథ ముందే ప్రతిపాదించిన అంశాలతో అల్లిన కథ అని మీరు గ్రహించే ఉంటారు. కొత్తపాళీ గారు ఈ క్రింది ఇతివృత్తం కథా వస్తువుగా ఇచ్చి దానితో కథ అల్లమని బ్లాగరులని అడిగారు.
  —————————————————
  ” తెల్ల కాగితం
  పల్లెటూరిలో ఒక పదేళ్ళ పిల్లాడు. భయంకరమైన పేదరికం.
  వాడు ప్రాథమిక పాఠశాలలో నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుకుంటున్నాడు. వాడికెప్పుడూ రాసుకునేందుకు ఒక సైడు వాడిన కాగితాలు కుట్టిన పుస్తకాలే. ఎప్పుడూ కొత్త నోటు బుక్కు కానీ తెల్లకాగితం కానీ వాడిన పాపాన పోలే. ఒకసారి ఎవరో ఆఫీసర్లు వచ్చి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసరు ఫైల్లోంచి జారి పడిన తెల్ల కాగితం వాడికి దొరికింది. వాడి మనసు ఉప్పొంగి పోయింది ఆనందంతో.
  దాన్ని భద్రంగా దాచుకున్నాడు. ఏ సందర్భంలో చివరికి దాన్ని ఉపయోగించాల్సి వచ్చింది?

  ఈ ఇతివృత్తంతో ఒక చక్కటి కథ రాయండి. గడువు మార్చి 16 ఆదివారం.

  రాసిన కథని మీ బ్లాగులో పెట్టినా సరే, ఏదన్నా వెబ్జీను (ఈమాట, పొద్దు, ప్రాణహిత)కి పంపినా సరే, లేక సరాసరి నాకు పంపినా సరే – మీ యిష్టం. ఏదేమైనా నాకో మెయిలు పంపడం మరిచిపోకండి.

  నాకు నచ్చిన కథకి ఒక మంచి తెలుగు కథల పుస్తకం బహుమతి ఇస్తాను.

  సూచన: కథ చెప్పటం పిల్లవాడి గొంతులో పూర్తిగా పిల్లవాడి దృక్పథం నించి చెబితే బాగా బలంగా వస్తుందని నాకనిపిస్తోంది. కానీ అలాగే రాయాలని ఏం లేదు. తెల్లకాగితం అని నేనూరికే ప్రతిపాదిస్తున్నా. మీకిష్టమైన పేరు పెట్టొచ్చు”
  ——————————————————

  కథలో ఆ కుటుంబం పేదదనీ, కుర్రాడు 4 లేద 5 క్లాసని ముందే ప్రతిపాదించుకున్నాం కాబట్టి నేనా కుర్రాడు 5వ తరగతని అనుకున్నాను. కానీ మీరన్నట్లు కథలో ఎక్కడ ఆ ప్రస్థావన లేదు. నాల్గో తరగతి కుర్రాడికి తన తెల్ల కాగితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ కుర్రాడు అంతకంతే పెద్ద తరగతే అని పాఠకులు గ్రహిస్తారని నేను అనుకున్నాను. పిల్లాడి తండ్రి ట్రాన్స్‌పొర్ట్ కంపెనీలో ఉద్యోగం అని అన్నా, కావాలనే కేడర్ మెన్షన్ చేయలేదు. సరుకుల loading, unloading నమోదు చేసే గుమాస్తా అని నా ఉద్దేశ్యం. నా మొదటి చిత్తు ప్రతిలో అలాగే రాసుకున్నాను. కథని టైప్ చేస్తున్నాప్పుడు, అతడి పోస్ట్‌ని మెన్షన్ చేయకుండా చదువరుల ఊహకే వదిలేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఈ రెండు విషయాలలో అస్పష్టత గోచరిస్తే అది నా లోపమే.
  “పరీక్షలు పాసయి, పై తరగతికి వెళ్ళిపోయిన పిల్లలు అమ్మేసిన నోట్సులలో మిగిలిపోయిన తెల్లని పేజీలన్నింటిని తిరిగి కొన్నాడు” ఈ వాక్యం లో మిగిలిపోయిన తెల్లని పేజీలంటే నా ఉద్దేశ్యం ఏదీ రాయకుండా ఉన్న పేజీలని. నా చిన్నప్పుడు పాత పేపర్లు, పుస్తకాలు కొనేవాళ్ళు ఇలా నోట్‌బుక్స్‌లో రాయకుండా ఉన్న పేజీలని చించి, చాలా తక్కువ ధరకి అమ్మేవారు. పేద పిల్లల అమ్మానాన్నలు వాటిని కొని తమ పిల్లలి పుస్తకంలా కుట్టి ఇచ్చేవారు. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు ఇప్పటికీ ఇలా రాయని కాయితాలని అమ్ముతున్నారో లేదో నేను నిర్ధారించుకోలేదు. కథా వస్తువుకి కొంత నా బాల్యాన్ని అన్వయించుకున్నాను.
  వాక్య నిర్మాణం తప్పుగా ఉందని మీరు అన్నారు. అయితే ఈ కథ పబ్లిష్ అయిపోయింది కాబట్టి, అటువంటి వాక్యాలను ఎలా రాయలో దయచేసి సూచిస్తే నా తరువాతి కథలలో జాగ్రత్త వహిస్తాను. నా ఈమెయిల్: somasankar@gmail.com
  ధన్యవాదాలు

 27. chandrasekhar says:

  పిల్లవాడి తరగతి ఎందుకంటే 5,6 తరగతుల లెక్కల పుస్తకం మీరు చూసారా? 2 రోజుల్లో పుస్తకమంతా copy చేయడం సాధ్యం కాదు. కథను బట్టి చూస్తే తల్లి చాలా cultured గానూ, educated గానూ కనిపిస్తుంది, మరి ఆమె కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుదలకోసం ఏమీ చేయదా? పైగా కథకు ఆమె copy పెద్దగా సహకరించదు, except పిల్లవాడిపట్ల ఆమె ప్రేమను సూచించటం తప్ప. కథ realistic గా ఉండటానికి చాలా జాగ్రత్తలు అవసరం. space తక్కువైనా ఉన్నంతలోనే సందేహాలకు తావివ్వకూడదు.

 28. chandrasekhar says:

  వాక్యం మీరే analyse చేసుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు. పిల్లల నుంచే direct గా కొన్నాడా? అన్ని తెల్లకాగితాలూ కొన్నాడా? తిరిగి అంటే ఇంటింటికీ తిరిగి అనా? back అనా? ఇటువంటి ప్రశ్నలకు మీ వాక్యనిర్మాణం తావిస్తోంది. think again.

 29. కొల్లూరి సోమ శంకర్ says:

  @చంద్రశేఖర్ గారూ,
  Now I realize that what you mean to say. I agree that I need to be more careful in representing real life stories. నా తరువాతి కథలలో జాగ్రత్త వహిస్తాను. ధన్యవాదాలు

Comments are closed.