సినిమాలెలా తీస్తారు?-1

చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి:
ప్రి-ప్రొడక్షన్
ప్రొడక్షన్
పోస్ట్-ప్రొడక్షన్

షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి.
ప్రొడక్షన్ దశలో షూటింగు జరుగుతుంది. మిగతా సినిమా అంతా షూటింగయ్యాక డబ్బింగ్ జరిగితే పాటల విషయంలో మాత్రం రికార్డింగ్ తర్వాతే షూటింగ్ జరుగుతుంది.
షూటింగు తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఎడిటింగ్, డబ్బింగ్, సెన్సారింగ్, ప్రింట్లు వెయ్యడం, డిస్ట్రిబ్యూషన్, చివరగా ఎగ్జిబిషన్ జరుగుతాయి.
ఇప్పుడు వీటిలో ఒక్కొక్క అంశాన్ని గురించి విశదంగా తెలుసుకుందాం:

ప్రి-ప్రొడక్షన్

కథ నిర్ణయం: సినిమా పని కథనెన్నుకోవడంతో మొదలౌతుంది. ఎంత పిచ్చివాళ్ళు కూడా కథ ఫలానా అని అనుకోకుండా సినిమా పని మొదలుపెట్టరు. ఈ కథనెలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? అనేవి తర్వాతి ప్రశ్నలు.
నిర్మాత లేదా దర్శకుడు తమంతట తామే ఒక కథనెన్నుకుని లేదా కథను రూపొందించుకుని దాన్ని సినిమాగా తియ్యాలనుకోవడం ఒక పద్ధతి. అలాకాకుండా ఇంకో పద్ధతిలో ఐతే కథారచయిత తన కథను తీసుకుని దర్శకుడు లేదా హీరోలను కలవడం, వాళ్ళకు ఆ కథ నచ్చితే, వాళ్ళు ఆ కథను తమ నిర్మాతలకు సిఫార్సు చెయ్యడం జరుగుతుంది. లేదా రచయితలు తమ కథను నేరుగా నిర్మాతకే వినిపించడం ఇంకొక పద్ధతి. ఎందుకంటే సినిమాకు నిర్మాతే చోదకుడు. ఇంకా చెప్పాలంటే సినిమాకు నిర్మాతే సొంతదారు. అందుకే ఉత్తమ చిత్రం పురస్కారం నిర్మాతలకే ఇస్తారు. ఇది ప్రపంచమంతటా నెలకొని ఉన్న సంప్రదాయం.

ఐతే తెలుగు సినిమా చరిత్రనొకసారి పరిశీలిస్తే మొదటి దశలో (1931 నుంచి 1950 దాకా దాదాపు ఇరవై సంవత్సరాలు) దర్శకుడికి ఎక్కువ ప్రాధాన్యతుండేది. హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, మొదలైన దర్శకులు చలనచిత్రరంగానికి చుక్కానులుగా ఉన్నారు. (వాళ్ళు దర్శకనిర్మాతలైనా నిర్మాతలుగా కంటే దర్శకులుగానే ప్రసిద్ధులయ్యారు.) తర్వాత విజయా, ఏ.వీ.ఎం. లాంటి సంస్థల ఆవిర్భావంతో నిర్మాతల శకం వచ్చింది. కె.వి.రెడ్డికి, విజయా నిర్మాతలకు మధ్య ఒకరకమైన ఆధిపత్యపోరు కూడా కొంతకాలం నడిచింది. మీరు గమనించారో లేదో జగదేకవీరుని కథ విజయావారి సినిమాయే అయినా నిర్మాతలుగా చక్రపాణి-నాగిరెడ్డి పేర్లకు బదులుగా కె.వి.రెడ్డి పేరే ఉంటుంది. దానికి కారణం ఈ ఆధిపత్యపోరే! తర్వాత 1980 ల నుంచి హీరోల శకం రావడమొక కొత్తపోకడ. కథాచర్చల్లో ఇది ఒక ప్రధానమైన అంశం.

ఫలానా కథను సినిమాగా తియ్యాలని నిర్మాత-దర్శకులు నిర్ణయించుకున్నాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలు నిర్మాత, దర్శకుడు, కథారచయితల మధ్య జరగడం ఆనవాయితీ.కథ నిర్ణయమయ్యాక ముందడుగు పడాలంటే బడ్జెట్ నిర్మాతకు ఆమోదయోగ్యం కావాలి. అయితే ఈ బడ్జెట్ వేసిచ్చే బాధ్యత దర్శకుడిదే!

బడ్జెట్: తామనుకున్న కథను సినిమాగా తీయడానికి దర్శకుడు వేసిచ్చిన బడ్జెట్ చూసి నిర్మాత అందుకు సిద్ధపడ్డాకే తర్వాతి అడుగులు పడుతాయి. సినిమాకు అవసరమైన పెట్టుబడి పెట్టేది నిర్మాతే అయినా తాము తీయదలచిన సినిమాకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయగలిగేది దర్శకుడే. కథ ఖరారు కాగానే ఈ కథను తెరకెక్కించడానికి ఇంత ఖర్చు అవుతుందని దర్శకుడు చెప్పాక అంత పెట్టుబడి అవసరమా? అవసరమైనా తాను అంత పెట్టుబడి పెట్టగలడా అనేది నిర్మాత అలోచించుకుని ముందడుగు వెయ్యడమో, వెనక్కు తగ్గడమో చేస్తాడు.

ఈ బడ్జెట్ అంచనాలు వెయ్యడంలో కె.వి.రెడ్డి సిద్ధహస్తుడని ప్రతీతి. ఆయన కథ వినగానే దీనికి ఇన్ని అడుగుల ఫిల్ము అవసరమౌతుంది అని చెప్పేవాడు. షూటింగు పూర్తయాక చూసుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పినంతే వచ్చేది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా: మాయాబజార్ నిర్మాణ సమయంలో తెరవెనుక పెద్ద కథలే జరిగాయి. అప్పట్లో సాధారణ సినిమాలకయ్యేదానికి మూడురెట్ల నిర్మాణవ్యయంతో అంచనాలు రూపొందించి, అంతా సిద్ధం చేసుకుని తీరా షూటింగు మొదలుపెట్టే సమయానికి నిర్మాతలకు ధైర్యం చాలక అక్కడితో ఆపేద్దామన్నారట. దాంతో కె.వి.రెడ్డి హతాశుడయ్యాడు. ఎన్నో ఊగిసలాటల అనంతరం నిర్మాతలు ఖర్చెంతవుతుందో చెప్పమని దర్శకుణ్ణి పిలిపించి మళ్ళీ అడిగారు. ఆయన ఎంతో చెప్పి “ఇంతకు మించి మీరు ఒక్క పైసా పెట్టనక్ఖర్లేదు. ఖర్చు నా అంచనాలు దాటినట్లైతే అదనంగా అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను.” అని వారికి హామీ ఇచ్చిన తర్వాతే రథం మళ్ళీ కదిలింది. బడ్జెట్ మీద దర్శకుడికి ఆ అదుపు లేనట్లైతే సినిమాలు తియ్యాలనే ఉత్సాహంతో వచ్చే చాలా మంది నిర్మాతల దారి గోదారే అవుతుంది.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారట: నిర్మాణవ్యయం దర్శకుడు వేసిచ్చిన అంచనాలను మించినట్లైతే దర్శకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. సినిమాలు తీసే ఉబలాటంలో డబ్బుసంచులు పట్టుకుని దిగే ఔత్సాహిక నిర్మాతలు ఊబిలో దిగకుండా ఉండాలంటే ఇలాంటి కట్టుబాట్లు చేసుకోవడం చాలా అవసరం.

కథాచర్చలు: కథ నిర్ణయమైనాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలప్పటికి ప్రధానపాత్రలు ఎవరిచేత వేయించాలో దర్శకనిర్మాతలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. (ఈ కథాచర్చలనే స్టోరీ సిట్టింగులని, స్టోరీ డిస్కషన్లని అంటారు.) దీనివల్ల స్క్రిప్ట్ రాసే రచయిత కూడా ఆ పాత్రధారులను దృష్టిలో పెట్టుకుని రాసే వీలు కలుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది మరింత అవసరం. ఒక్కోసారి దర్శకుడు లేదా రచయితలు “ఈ కథ ఈ హీరోను దృష్టిలో పెట్టుకునే తయారుచేశాం. ఈ సినిమాను తీయడమంటూ జరిగితే అది ఈ హీరోతోనే తీయాలనుకున్నాం.” అని చెప్పడం మనం వింటూ ఉంటాం. ఐతే అన్ని కథలకూ ఆ అవసరముండదు. కొన్ని కథలు ఎవరితో తీసినా, ముఖ్యంగా ఏ రకమైన ఇమేజ్ లేని నటులతో తీస్తేనే సరిపోయే విధంగా ఉంటాయి. ఈ కథల మాటెలా ఉన్నా పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని తయారుచేసే కథల్లో ముందుగా ఆ హీరోకు స్థూలంగా ఇదీ కథ అని చెప్పి, కథాచర్చల్లో కూడా ఆ హీరోకు పూర్తి స్వేచ్ఛ – దర్శకనిర్మాతలతో సమంగా – ఇవ్వడం కొత్త పోకడ. ఇక్కడ దర్శకుడు కొత్తవాడైతే నటుడు అత్యుత్సాహంతో తనే దర్శకపాత్ర వహించి సినిమాను చెడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ కథాచర్చల్లో తప్పనిసరిగా ఉండేదీ, ఉండవలసిందీ దర్శకుడు, నిర్మాత, కథారచయిత. కథారచయిత అని చెప్పడమెందుకంటే సినీరంగంలో కథారచయిత, మాటల రచయిత, పాటల రచయిత, స్క్రిప్ట్ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత…ఇన్నిరకాల రచయితలుంటారు. అరుదుగా కామెడీ ట్రాక్ రచయితలు కూడా వేరేగా ఉంటారు. వీళ్లలో ఒక్క కథారచయిత తప్ప మిగిలినవాళ్ళంతా తర్వాతిదశల్లో రంగప్రవేశం చేస్తారు. ఐతే ఒక్కోసారి తమ కథ వెండితెరకెక్కడమే మహాభాగ్యంగా భావించే రచయితలు కొందరు ఆ కథ లో ఎలాంటి మార్పులు చేసినా తమకభ్యంతరం లేదని ముందే ప్రకటించి కథాచర్చల నుంచి తప్పుకుంటారు.

స్క్రిప్టు: ఇక్కడ స్క్రిప్టుకు, స్క్రీన్‌ప్లేకు మధ్య గల స్వల్ప తేడా గురించి చెప్పడం అవసరం. మాటలు ప్రేక్షకులకు వినిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సన్నివేశంలో ఏం జరుగుతోందో స్క్రిప్టులో రాసుకుంటారు. దాన్ని తెరమీద ఎలా చూపించాలో కూడా రాసుకుంటే అదే స్క్రీన్‌ప్లే అవుతుంది. ఒక మంచి కథారచయిత సినిమా చిత్రీకరణకు సంబంధించిన సాంకేతికాంశాలజోలికి పోకుండా స్క్రిప్టు రాసివ్వడం తేలిక. అసలు తాను కథ రాసేటప్పుడే ఆయా సన్నివేశాల్ని తన మనోయవనికపై సాక్షాత్కరింపజేసుకునే రచనలు చేస్తారు ఏ రచయితైనా. అందుకే స్క్రిప్టు రాసివ్వడం వారికి నల్లేరు మీద బండి నడక లాంటిది. అయితే స్క్రీన్‌ప్లేలో అనేక సాంకేతికాంశాలు చోటు చేసుకుంటాయి. ఇవి రచయితకు సంబంధం లేనివి. స్థూలంగా చెప్పలంటే దృశ్యవిభజన వరకు స్క్రిప్ట్ రచయిత చేతిలో ఉంటే షాట్ విభజన స్క్రీన్‌ప్లే రచయిత చేతిలో ఉంటుంది. సాధారణంగా చిత్రదర్శకుడే స్క్రీన్‌ప్లే నిర్ణయిస్తారు.
సంభాషణ, లేక స్క్రిప్టు రచయిత పాత్రల అభినయానికి సంబంధించి, ఆహార్యానికి సంబంధించి కొన్ని సూచనలు రాస్తాడు. అంతేకాక కథాచర్చలప్పుడు లభించని కొన్ని పాత్రౌచిత్యాలు, సంభాషణ రచనతో పూర్తవుతాయి. పాత్రల కదలికలు, హావభావాలు కూడా స్క్రిప్టులోనే వస్తాయి. మాటల రచన పూర్తయేసరికి కథా దృక్కోణంతోబాటు సినిమాలో ఎన్ని దృశ్యాలుండేదీ, వాటి ఉద్దేశ్యాలేమిటైందీ, కథావాతావరణం ఎలాంటిదనే విషయాలు కూడా తెలుస్తాయి.

స్క్రీన్‌ప్లే: మాటల రచయిత పని పూర్తై స్క్రిప్టు చేతికందాక దాన్ని వెండితెరమీద ఎలా చూపించాలనేది దర్శకుడి పని. అప్పుడే స్క్రీన్‌ప్లే ఖరారవుతుంది.
ఉదాహరణకు రచయిత సూర్యోదయమవుతోంది అని రాశాడనుకోండి. దర్శకుడు ఆ సూర్యోదయానికి తన చిత్రంలో, ఆ సన్నివేశంలో, ఆ దృశ్యంలో ఎంత ప్రాధాన్యత ఉందో అన్ని షాట్లు తీస్తాడు. ఆ దృశ్యంలో ఎన్ని షాట్లు తియ్యాలి, అందులో క్లోజప్పులు ఎన్ని, మిడ్ షాట్లు ఎన్ని, లాంగ్ షాట్లు ఎన్ని, సంభాషణ నడిచేటప్పుడు ఏదైనా పాత్ర మీద క్లోజప్ తియ్యాలా మిడ్‌షాటా, లాంగ్ షాటా… ఇవన్నీ నిర్ణయించడం దర్శకుడి పనే.
(స్క్రీన్ ప్లే గురించి మరిన్ని వివరాలు మరోసారి)

-సుగాత్రి(http://sahityam.wordpress.com)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to సినిమాలెలా తీస్తారు?-1

  1. అద్భుతంగా వివరించారు.
    సినిమా చూసినంత సులభం కాదన్నమాట తీయడం! ఈ విషయంలో సుగాత్రి గారికి చాలా పట్టున్నట్లుంది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. radhika says:

    చదువుతుంటేనే చాలా కష్టం అనిపిస్తుంది.ఇంక తీసేవారికి ఎంత కష్టం గా వుంటుందో?మనమేమో బాగుందనో..బాలేదనొ ఒక్క మాటలో తేల్చేస్తాము.అందరికీ అర్దమయ్యేలా చాలా బాగా రాసారు సుగాత్రి గారు.

  3. సినీ నిర్మాణం వివరించే పని చక్కగా మొదలుపెట్టారు. మనోయవనిక అనే పదంలో యవనిక అంటే Screen కదండీ!? ఈ భాగంలో ఉదాహరణలు ఇవ్వడానికి కుదిరినట్టులేదు మీకు. ఆసక్తిగా తెలుసుకోవాలనుకునే వారికి పాఠ్యపుస్తకంలాగా సమాచారభరితంగా వుందీ రచన. స్క్రీన్‌ప్లే కోసం ఎదురుచూస్తాం.

Comments are closed.