సింధువు

swathi.bmp“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు పాఠకులకు కొత్తకాకపోయినా పొద్దులో ఇది స్వాతి గారి తొలి కవిత కావడం విశేషం.

————-

గవ్వల గనుల అన్వేషణ లో
అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో
ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో
పసితనపు పాటలకు
పరుగులెత్తి పడిన పందేలకు
సేద తీర్చిన సాగర సమీరం.

కలల తీరం లో
ప్రేమ పారవశ్యం లో
ఊహల భారం తో
మాటలు వెదికే మౌనం లో
మెల్లని కెరటాలని
పాదాల మీదకి పంపి
తలపులని తేలిక చేసే ఆర్ద్ర సముద్రం.

చిత్తమంతా చింతలు ముప్పిరిగొని
ఒకదాన్నొకటి ఢీకొని
ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి
మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి
ఆటు పోట్ల అంతస్సంఘర్షణ
నిదర్శనం గా కల్లోలపు కడలి.

ఘడియో క్షణమో
ఉద్రేకమో క్రోధమో
జీవితాల్నీ ఆశయాల్నీ
ఇళ్ళ్లనీ ఊళ్ళనీ
సుడిగుండాలతో సునామీలతో
మున్నీట ముంచిన
మహోగ్ర మహార్ణవం.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

7 Responses to సింధువు

  1. mohan says:

    Hi, its very good

  2. radhika says:

    చాలా చాలా బాగుంది స్వాతి.సముద్రం చూపే భావావేశాలు మీ పదాల్లో చక్కగా ఒదిగిపోయాయి.వళ్ళంతా ఉప్పు నీటిని నింపుకున్నా తన దగ్గరకి వచ్చేవాళ్ళకి మాత్రం ఆనందాన్ని ఇస్తూ,విషాదంలో వున్నవారికి ఓదార్పు గా చల్లని తెమ్మెర తో తలను నిమురుతూ గొప్పగా బ్రతికేస్తుంది.అందుకే నాకిష్టం సముద్రం.

  3. One of your best.

    ఒక్క సూచన. మొదటి చరణం చివరి వరుసలో “సాగర సమీరం” అనగానే సముద్రాన్ని వొదిలేసి గాలిని సంబోధించినట్లు అయింది. Consistency కావాలనుకుంటే దీన్ని కూడా సముద్రాన్ని సంబొధిచేట్టు మార్చగలరు.

  4. Thanks కొత్త పాళీ గారు, సాగరం అని వదిలేస్తే బాగుంటుందా?
    లేదా సాగర తీరం ఎలా ఉంటుంది?

  5. విజయ says:

    మనం ఏ మూడ్ లో ఉండి చూస్తే సముద్రం అలా కనిపిస్తుంది…నిజానికి కడలి మాతమే కాదు ప్రకృతి అంతా ఇంతే…మనసు బాగుంటే గాలి చల్లగా,ప్రభాతం సుభోదయంగా అనిపిస్తుంది…అదే మనసు ఆందోలనగా ఉంటే…మండే సూర్యుడు, కదలని గాలి ఇవే చూస్తూ చిర్రు బుర్రు లాడతాము. ఆస్వాదించే మనసు బట్టి ఉంటుంది…మన మూడ్ కి ప్రకృతి కి ఉన్న సంబంధం చక్కగా మంచి మాటలతో చెప్పరు..

  6. ranganadh says:

    mee kavita chaala baagundi

Comments are closed.