వార్షికోత్సవ వేళ..

గత సంవత్సరం డిసెంబరు నెల మొదటివారంలో ప్రారంభమైన పొద్దుకు ఏడాది నిండి, రెండో యేట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరకాలంలో పొద్దు సాధించిన ప్రగతి, అలాగే ఈ పత్రికను పెట్టినప్పుడు మాకు మేం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని మేం ఎంతవరకు అందుకోగలిగాం అనే అంశాలను స్పృశిస్తూ ఒక సింహావలోకనం:

పొద్దు ఎందుకు పెట్టాం?

బ్లాగరులలో రకరకాల విషయాలపై బ్లాగులు రాస్తూ ఉన్నవారు ఉన్నారు. చక్కటి సాహిత్య చర్చలు, సామాజిక విషయాల చర్చలు మొదలైనవెన్నో జరుగుతున్నాయి. “ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను ఒకే చోట సంఘటితం చేస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచనే పొద్దుకు మూలం.

ఎలా పెట్టాం?

పత్రిక పెట్టాలన్న ఆలోచన చదువరిది. దాని గురించి ఆయన మాటల్లోనే విందాం:
ఆలోచన వచ్చిందే తడవుగా త్రివిక్రమ్ తో అన్నపుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ‘సరే పెట్టేద్దాం’ అన్నారు. త్రివిక్రమ్ తో అనడానికి ఒక కారణం ఉన్నది. అప్పటికే తెలుగు బ్లాగర్ల సంఘం తరపున మేమిద్దరం పరిచయస్తులమే. ఆయన సాహిత్యాభిలాషి అనీ, బాగా చదువుతారనీ నాకు తెలిసింది. పైగా సెప్టెంబరు 2006 లో నెట్లో తెలుగు వ్యాప్తి విషయమై ఆయన క్షేత్ర స్థాయిలో కొంత కృషి చేసారు. ధర్మనిధి పురస్కారాల కార్యక్రమంలో అంతర్జాలంలో తెలుగు గురించి తెలియజేస్తూ ఆయన కరపత్రాలు పంచిపెట్టారు. ఆపనిలో నేనూ కొంత సాయం చేసాను. ఆ విధంగా మా సాన్నిహిత్యం పెరిగింది. ఈ కారణాల వలన, పొద్దు ఆలోచన వచ్చినపుడు, త్రివిక్రమ్ పేరు చాలా సహజంగా స్ఫురణకు వచ్చింది.

పత్రికకు ఏం పేరు పెట్టాలనే విషయమై చర్చ చేసాం. చాలా పేర్లు అనుకున్నాం..

* పల్లకి
* కానుక
* మేఘదూత
* మెరుపు
* కబురు
* కబుర్లు
* వెలుగు
* పొద్దు
* వేకువ

చివరికి పొద్దుతో స్థిరపడ్డాం. వెంటనే పేరు నమోదు చేసాం. ఇక..

పొద్దును ఎన్నాళ్లకొకసారి తీసుకురావాలి?

మిగతా పత్రికలు నెలకో రెణ్ణెల్లకో ఒకసారి వస్తూ ఉన్నాయి. పొద్దు అలాకాక, తాజా విశేషాలు, వ్యాసాలతో ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలని తీర్మానించాం. పొద్దుకు రచనలు పంపేవాళ్ళు చాలామంది సొంతగూళ్ళున్న బ్లాగర్లు. ఏ రచయితకైనా, తన రచనని వీలైనంత త్వరలో పాఠకుల దగ్గరకు తీసుకుపోవాలనుంటుంది – బ్లాగులలోనైతే, వెంటనే పెట్టుకోవచ్చు కూడా. అందుకే, పొద్దులో మేం – రచన మాకు అందిన వెంటనే, వీలయినంత త్వరగా దానిని పరిశీలించి, ప్రచురిస్తున్నాం. అంతర్జాలంలో పత్రికకున్న సౌకర్యాలలో ఇదొకటి. ఇటు పాఠకులకి కూడా – మొత్తం రచనలన్నీ ఒక్కసారే చదవనవసరం లేకుండా, ఎప్పుడు వెలుగుచూసినవి అప్పుడే చదువుకోవచ్చును కదా? కాబట్టి, పొద్దు, పదహారణాల ఇంటర్నెట్ పత్రిక, రియల్ టైము పత్రిక. ఇది e-పత్రిక, మీ పత్రిక.

మరి, అందుకవసరమైన రచనలను సేకరించడం ఎలా? బ్లాగరులు, ఇతర నెజ్జనులు, నెజ్జనులు కాని సాహితీకారుల నుండి వ్యాసాలు, కథలు మొదలైన వాటిని సేకరించాలని తీర్మానించాం. నెజ్జనులపై మేం పెట్టుకున్న ఆశలు ఈ సంవత్సరంగా వమ్ము కాలేదు. చక్కని వ్యాసాలు, కవితలతో పొద్దును తీర్చిదిద్దగలుగుతూనే ఉన్నాం.

పొద్దు గురించి వీవెన్ తో చెప్పినపుడు తన వంతు సాయం చేస్తానని మాటిచ్చారు. అలాగే ఆయన ఎంతో సాయం చేసారు. పొద్దును సర్వరులో స్థాపించి, దానికోసం తన సర్వరులో కొంత స్థలాన్ని కేటాయించారు. పలు మూసలను పరీక్షించారు. పొద్దు కోసం ఆయన తీసుకున్న శ్రమకు గాను ఆయనకు నెనరులు తెలియజేస్తే పరాయి వాడైపోతారు కాబట్టి ఆ పని చెయ్యడం లేదు.

ఈ ఏడాదిలో ఏమేం చేసాం?
చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యలేకపోయినా కొన్నైనా చెయ్యగలిగాం. పొద్దు శీర్షికల్లో మాకు బాగా సంతృప్తి కలిగించినది, గడి! తెలుగులో మొట్టమొదటి ఆన్ లైను గళ్ళ నుడికట్టు, గడి! పొద్దుకు ఆ ఘనత ఉంది. ఆన్ లైనులోనే నింపి పంపగల గడి ఇప్పటికీ ఇదొక్కటే! గడి రూపకల్పనలో సాంకేతిక సహాయమందించిన సంపత్ కు, గడి కూర్పరులు సిముర్గ్, కొవ్వలి సత్యసాయి, భైరవభట్ల కామేశ్వరరావు గార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

ఏమేం చెయ్యాలనుకున్నాం? ఏమేం చేశాం?

మొదట అనుకున్నవాటిలో కొన్నింటిని అమలుచెయ్యలేకపోయాం. వాటిలో కొన్ని: భాష, నుడి, పద్యం, ప్రపంచ సాహిత్యం. మొదటిదాంట్లో తెలుగు భాషా-సాహిత్య చరిత్ర, వాడుకభాషలో వస్తున్న మార్పులు, తరచుగా దొర్లే తప్పులు, పరభాషా ప్రభావాలు మొదలైన అంశాల గురించి తెలిసినవారెవరిచేతైనా రాయించాలనుకున్నాం. అలాగే తెలుగు భాషకే ప్రత్యేకమైన లక్షణాలు, తెలుగు నుడికారం – సామెతలు, నానుడుల గురించి నుడి శీర్షిక నిర్వహించాలనుకున్నాం. సంవత్సరకాలం గడిచినా ఇవి రెండూ కార్యరూపం దాల్చలేదు.

త్వరలో వీటిని మొదలుపెట్టగలమనే అనుకుంటున్నాం. అలాగే పద్యలక్షణాల గురించి కూడా ఒక శీర్షిక పెట్టాలనుకున్నాం. ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలను పొద్దు పాఠకులకు పరిచయం చెయ్యాలనుకున్నాం. మాకున్న పరిమితుల వల్ల అవి రెండూ మొదలు కాలేదు. ఐతే త్వరలోనే ప్రపంచ జానపద కథలను అందించే ఆలోచనలో ఉన్నాం.

ఇక పొద్దులోని శీర్షికల గురించి:

అతిథి: రానారెతో మొదలైన ఈ శీర్షిక పొద్దుకే ఒక ప్రత్యేక అలంకారం. ఈ శీర్షికలో వైజాసత్య, శ్రీహర్ష, వీవెన్, విహారి, ఉప్పలపాటి ప్రశాంతి, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం, సుగాత్రి లాంటి ప్రముఖ బ్లాగరులు, వికీపీడియనులే కాకుండా కొలిచాల సురేశ్, కొడవటిగంటి రోహిణీప్రసాద్, నెల్లుట్ల వేణుగోపాల్ లాంటి ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయితలు కూడా పాల్గొన్నారు.

వ్యాసాలు: ఒకవైపు తెలుగు నుడికారం, స్త్రీ హృదయ రహస్యోపనిషత్తు, అన్నదాత బోర్లాగ్, బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ, మసకతర్కం, ప్రేమ…కథ, ఎర్రకోట, ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు లాంటి విభిన్నమైన వ్యాసాలు, మరోవైపు కొడవటిగంటి రోహిణీప్రసాద్, వివినమూర్తి, శారద మొదలైన ప్రముఖుల వ్యాసాలు అందించగలుగుతున్నాం.

బ్లాగు: తెలుగులో వైవిధ్యమైన బ్లాగులను పరిచయం చేసే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ శీర్షిక కొందరు బ్లాగరుల శైలులను అనుకరిస్తూ చేసిన పేరడీతో నెజ్జనులను ఎంతగానో అలరించినా తర్వాత కుంటుబడింది. ఈ శీర్షిక క్రమం తప్పక నడవాల్సిన అవసరముంది – మరీ ముఖ్యంగా కొత్త బ్లాగులు, కొత్త పాఠకులు ఎక్కువౌతున్న ఈరోజుల్లో. మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు బ్లాగుసమీక్షల్లో ఒక వినూత్న ప్రయోగం. కొవ్వలి సత్యసాయి గారి నేనెందుకు బ్లాగుతున్నాను? ఈ శీర్షికలోని మరో విభిన్న రచన.

వికీ: వైజాసత్య ఈ శీర్షికలో పొద్దు పాఠకులకు తెవికీ, అనుబంధ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారం అందిస్తున్నారు.

సరదా: వలబోజు జ్యోతి నిర్వహించిన ఈ శీర్షిక పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

వివిధ: సుధాకర్ ఈ శీర్షికను తనదైన శైలిలో విభిన్నంగా నిర్వహిస్తున్నారు.

కబుర్లు: ఈ శీర్షికను పునరుద్ధరించవలసి ఉంది.

సినిమా: సుగాత్రి ప్రారంభించిన ఈ శీర్షికను వెంకట్ అనితర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తున్నారు.

కథలు: ‘యునిక్ స్పెక్’ సుధీర్ కొత్తూరి, అర్చన, సౌమ్య, చావా కిరణ్ ల కథలు, కొల్లూరి సోమశంకర్ అనువాద కథ అందించగలిగాం. ఇక మీదట ఈ శీర్షికలో ప్రసిద్ధ రచయితల కథలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం.

కవితలు: రాధిక, సుధీర్ కొత్తూరి, చావా కిరణ్, కృష్ణదాస కవిరాజు, స్వాతికుమారి, జాన్ హైడ్ కనుమూరి, లలితా ముఖర్జీ, రవికిరణం, చందుపట్ల శ్రీధర్, కొత్త ఝాన్సీలక్ష్మి, అసూర్యంపశ్యల కవితలు అందించాం.

సమీక్ష: సగటున రెండు నెలలకొక సమీక్ష చొప్పున చుక్క పొడిచింది, అతడు అడవిని జయించాడు, దర్గామిట్ట కథలు, కాలాన్ని నిద్రపోనివ్వను, కథ 2005, కడప కథ పుస్తకాలపై సమీక్షలు అందించాం.

ఇవే కాకుండా కొడవటిగంటి కుటుంబరావు అనువాద నవల మృతజీవులు ను, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రచన మందిమన్నియమ్ ను ధారావాహికలుగా ప్రచురిస్తున్నాం.

ఇటీవలి కాలంలో పొద్దు సంపాదకవర్గం బలోపేతమయింది. ప్రముఖ నెజ్జనులైన సిముర్గ్, రానారె సంపాదకవర్గంలో చేరి పొద్దుకు హంగు చేకూర్చారు. సిముర్గ్ ఇటీవలి వరకు పొద్దు సంపాదకవర్గ సలహాదారుగా ఉన్నారు.

చివరగా…

పత్రికా నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానం గానీ, అనుభవం గానీ లేని కేవల ఔత్సాహికులం మేం. ఐనా సరే సంకోచించక ముందడుగేశాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వివినమూర్తి, వసుంధర, మొదలైన పెద్దలు మమ్మల్ని అభినందిస్తూ ప్రోత్సహించారు. వారికి మా ధన్యవాదాలు. పత్రికానిర్వహణలో తమ అమూల్య సలహాలు, సూచనలు అందిస్తున్న కేతు విశ్వనాథరెడ్డి, కొడవటిగంటి రోహిణీప్రసాద్, ఇంకా సాంకేతిక సహకారాన్ని అందివ్వగలమని ముందుకు వచ్చిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్, పద్మ ఇంద్రగంటి గార్ల సహకారం మరువలేనిది.

ఇప్పుడు తెలుగులో ఎందరో బ్లాగరులు చక్కటి శైలీ, శిల్పాలు ఉపయోగించి, మంచి విషయాలమీద రాస్తున్నారు. వీరిలో కొందరికైనా, బ్లాగర్లనుంచీ రచయితలుగా ఎదిగే అవకాశముంది. ఆ ప్రయత్నంలో మా వంతు కృషి చెయ్యాలన్నదే పొద్దు ఆశయాల్లో ఒకటి. అందుకే, ఔత్సాహిక రచయితల రచనలే పొద్దులో ఎక్కువ, వీలయినంత వరకూ, మా కందిన రచనలని – మేం పరిశీలించి, క్రియాశీలకమైన సూచనలు ఇచ్చాం. కొన్ని సార్లు, రచనని మెరుగు పరచడానికి మేమిచ్చిన సూచనలు, రచన కంటే ఎక్కువగానే ఉండేవి. (పొద్దుకి ఒక రచన అందాక, దానిని సమీక్షించి, పరిశీలించి ప్రచురించడానికి గాని, తిరస్కరించడానికి గాని గరిష్ఠంగా రెండువారాలు పడుతుంది.)

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసింది పొద్దు పొడుపుల్లో తెలుగు బ్లాగర్ల పాత్ర. తెలుగు బ్లాగర్ల ప్రోత్సాహం, సహకారం లేకపోతే ఈ పత్రిక ప్రారంభమయేదే కాదు. వారందరికీ వందనాలు. పొద్దు ప్రధానంగా తెలుగుబ్లాగరుల గుండెచప్పుడు. ఇది నిరంతరం తెలుగుబ్లాగరులవాణిని వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు బ్లాగుల్లో మంచి వాసిగల రచనలెన్నో వస్తున్నాయి. ఇవి అంతర్జాలానికే పరిమితం కారాదు. తెలుగు బ్లాగరుల రచనలు మరింత ఎక్కువమంది పాఠకులకు చేరువయేలా బయటి పత్రికల్లో కూడా వెలుగుచూడాలనేది మా కోరిక. అందులో భాగంగా కొన్ని పెద్దపత్రికలతో కంటెంట్ షేరింగ్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది పొద్దు. అంటే పొద్దులో ప్రచురితమయ్యే రచనలు బయటి పత్రికల్లో కూడా వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.

ఇప్పటి వరకూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఇకముందూ అందిస్తూ పత్రికను ఉన్నత స్థాయికి చేర్చేందుకు సహకరించవలసినదిగా పాఠకులను కోరుతూ, కింది కొత్త విశేషాలను అందిస్తున్నాం, ఆస్వాదించండి.
1. గడి
2. అతిథి శీర్షికలో నవయువకుని విజయగాథ
3. ఆరుద్ర రచించిన తెలుగు కలాలు వ్యాసం
4. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన విషాద సంధ్య కవిత
5. పులికంటి కృష్ణారెడ్డికి నివాళి
6. మధురాంతకం రాజారామ్ కథల గురించిన స్పందన
7. మృతజీవులు – 11

-పొద్దు

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

12 Responses to వార్షికోత్సవ వేళ..

  1. పొద్దు యాజమాన్యానికి శుభాకాంక్షలు. పొద్దు ఇలాగే మరిన్ని శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

    ఇప్పుడు పొద్దు చూడ ముచ్చటగా వుంది.

    — విహారి

  2. Sowmya says:

    పొద్దుకి జన్మదిన శుభాకాంక్షలు!

  3. జాన్ హైడ్ కనుమూరి says:

    శుభాకాంక్షలు

    సాహితీ శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాను
    జాన్ హైడ్ కనుమూరి

  4. జన్మదిన శుభాకాంక్షలు. పొద్దు సంపాదకులందరికీ అభినందనలు..

    ఇప్పుడు పత్రిక ముద్దుగా ఉంది..

  5. Rohiniprasad says:

    పొద్దు మొదలై అప్పుడే ఏడాది గడిచిందంటే ఆనందంగా ఉంది. ఎవరెలా అనుకున్నప్పటికీ ఈనాటి యువపాఠకుల్లోనూ, రచయితల్లోనూ కూడా కొంతమందికైనా మంచి విషయాలను తెలుసుకుందామనే ఆసక్తి ఎక్కువగా ఉంది. విభిన్న అంశాలను గురించిన రచనలు చదివే అవకాశాన్ని పొద్దువంటి వెబ్ పత్రికలు అందిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీలునుబట్టి బొమ్మలనూ, ఆడియో లింకులనూ కూడా జతచేస్తే వెబ్ పత్రిక సదుపాయాలన్నిటినీ ఉపయోగించుకున్నట్టుగానూ ఉంటుంది. గతంలో పెద్దలెందరో మంచి వ్యాసాలు రాసిఉన్నారు. వాటిని చదివేందుకు ఈనాటివారికి అవకాశాలు కల్పిస్తే మంచిదనుకుంటాను. అలాగే తగిన అనుమతులు పొంది శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నుంచీ పాతతరంవారి కథలను వేస్తే బావుంటుంది.

  6. పొద్దు సంపాదక వర్గానికి, యాజమాన్యానికీ శుభాకాంక్షలు.
    ఎంతో చక్కగా పొద్దు ని తీర్చిదిద్దుతున్నారు.

    అన్ని సార్లూ మెప్పించకపోయినా కంటెంటు కూర్చడానికి తీసుకున్న శ్రమ మాత్రం ప్రతీ సారీ కనిపిస్తుంది.

  7. radhika says:

    పొద్దు కు శుభాకాంక్షలు.కొత్త రూపం చాలా బాగుంది.అన్ని శీర్షికలను క్రమం తప్పకుండా అందిస్తారని ఆశిస్తాను.

  8. కందర్ప కృష్ణమోహన్ says:

    ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు…
    పదండి ముందుకు..

  9. పొద్దు ప్రారంభంనుంచీ ఒక కొత్త వరవడితో సాగింది. ఇలాగే శతాబ్దాల పాటు కొనసాగగలందులకు ఆశీస్సులు. పొద్దు, నాబ్లాగు ఇంచుమించు ఒకే ఈఢువాళ్లవడం, పొద్దు తొలిసంవత్సరం రచనల్లో ఓ రెండు నావి కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా.

  10. అప్పుడే సంవత్సరమయ్యింది..నిన్న మొన్న ప్రారంభించినట్టుంది. పొద్దు ఇలాగే ప్రతియేడూ జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు.

  11. వార్షికోత్సవం సందర్భంగా పొద్దు సంపాదక బృందానికీ నా శుభాకాంక్షలు. కొత్త లే-అవుట్ బాగుంది. మీ నూతన ప్రయత్నాలు ఫలించాలని, పొద్దు మరింత ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నాను.

  12. పొద్దుకు జన్మదిన శుభాకాంక్షలు.
    ఈ పొద్దు ఇలాగే మరింత వుత్సాహంతో పొడుస్తూనే వుండాలని అకాంక్షిస్తూ…

    –ప్రసాద్
    http://blog.charasala.com

Comments are closed.