మృతజీవులు – 12

“సరేనమ్మగారూ! అంటూ ఫితీన్య పరుపుమీద దుప్పటి పరచి దిళ్ళు పెట్టింది.

“ఇదుగో మీపక్క. హాయిగా నిద్రపోండి. ఇంతకూ మీకేమీ అక్కర్లేనట్టేనా? రాత్రిపూట మడమలు ఒత్తించుకోవటం మీకు అలవాటున్నదా? మావారు అలా కాని నిద్రపోయేవారు కారు”, అన్నది ఇల్లుగలావిడ.

అతిథి కాళ్ళు వత్తడాన్ని కూడా నిరాకరించాడు. ఇంటావిడ వెళ్ళిపోగానే అతడు దుస్తులు విప్పి, పైనా లోపలావేసుకున్నవన్నీ ఫితీన్యకు ఇచ్చేశాడు. ఆమె అతనికి గుడ్‌నైట్ చెప్పి తడిబట్టలతో నిష్క్రమించింది. అతను దాదాపు కప్పు ఎత్తున ఉన్న పక్కను చూసి సంతోషించాడు. ఈకలను కొట్టడంలో ఫితీన్య చాలా నిపుణురాలే. అతను ఒక కుర్చీ వేసుకుని దానిమీదుగా పక్కమీదికి ఎక్కేసరికి అది అతని బరువుకు ఇంచుమించు నేలకు అంటుకున్నంత పని చేసింది. పరుపులో నుంచి ఈకలు చిమ్మి గది నాలుగు మూలలా పడ్డాయి. అతను కొవ్వొత్తి ఆర్పేసి, రజాయి మీదకు లాక్కొని, ఉండ చుట్టుకుని పడుకుని, క్షణంలో నిద్రపోయాడు. అతను మరుసటి ఉదయం నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది, ఎండ అతని కళ్ళలో పడుతోంది. కిందటి రాత్రి గోడలమీదా, కప్పు కిందా మాటుమణిగి నిద్రపోయిన ఈగలు ఇప్పుడతన్ని పరిశోధిస్తున్నాయి. ఒకటి అతని పెదవి మీదా, మరొకటి చెవిమీదా కూచున్నాయి. మూడోది అతని కంటిమీద వాలే ప్రయత్నంలో ఉన్నది. ఇంకొకటి అవివేకంగా అతని ముక్కు రంధ్రం సమీపంలో వాలి, శ్వాసతోపాటు లోపలికి వెళ్ళిపోగా అతనికి తుమ్ములు పట్టుకున్నాయి – అందుకే అతను నిద్రలేచాడు.

ఇప్పుడు గది అంతా చూస్తే పటాలన్నిటిలోనూ పక్షుల బొమ్మలు కావని తేలింది. వాటిలో ఒకటి కటూజవ్ చిత్తరువు. మరొకటి తైలచిత్రం, అందులో ఒక ముసలాయన మొదటి పాల్ పరిపాలన నాటి యూనిఫాం వేసుకుని ఉన్నాడు. గడియారం మళ్ళా బుసకొట్టి పదికొట్టింది. ఒక ఆడమొహం తలుపులోంచి తల లోపలికి పెట్టి, అతను సుఖంగా నిద్రపోగలందులకై ఉడుపులు సాంతం తీసేసి ఉండడం గమనించి, చప్పున మాయమయింది. అతను కొంచంసేపు ఆలోచించాక గాని ఆ మొహం ఇల్లుగల ఆవిడదని జ్ఞాపకం రాలేదు. అతను షర్టు తొడుక్కున్నాడు. ఆరబెట్టి బ్రష్ చేసిన అతని ఉడుపులన్నీ అతని పక్కనే ఉన్నాయి. అతను దుస్తులు షరించి అద్దం ముందు నిలబడి ఎంత గట్టిగా తుమ్మాడంటే, సరిగా సమయానికి కిటికీ దగ్గరికి వచ్చిన ఒక టర్కీ కోడి తన భాషలో “నీ ఇల్లు బంగారం కానూ!” అని కాబోలు అరిచి పారిపోయింది. చిచీకవ్ దాన్ని “ఫూల్” అని తిట్టాడు. భూమికి ఆటే ఎత్తులేని కిటికీ వద్దకు వెళ్ళి అతను బయటికి చూచాడు. కిటికీ అవతల ఉన్నది కోళ్ళ ఆవరణ లాగా కనబడింది. ఇరుకుగా ఉన్న ఆవరణలో అన్ని రకాల పక్షులూ, జంతువులూ ఉన్నాయి. కోళ్ళకూ, టర్కీ కోళ్ళకూ లెక్కలేదు. వాటిమధ్య ఒక పుంజు కళ్ళు ఎత్తెత్తి వేస్తూ, పచార్లు చేస్తూ, నెత్తి మీది కుచ్చు ఆడిస్తూ, తల పక్కకుపెట్టి ఏదో ఆలకిస్తున్నట్టుగా ఉన్నది.

అక్కడ ఒక ఆడపందీ, దాని పిల్లలూ ఉన్నాయి. అది ఒక కుప్పను కుళ్ళగించుతూ, మధ్యలో అటుగా వచ్చిన ఒక కోడిపిల్లను కబళించి, ఏమీ ఎరగనట్టు ఎప్పటిలాగే పుచ్చతొక్కులు తింటున్నది. ఈ కోళ్ళదొడ్డి కంచె అవతల కూరల మళ్ళలో కాబేజీలూ, ఉల్లీ, ఉర్లగడ్డలూ, బీటురూట్ వగైరా అనేక కూరలూ మొక్కలున్నాయి. ఈ మళ్ళమధ్య అక్కడక్కడా యాపిల్ చెట్లూ, ఇతర చెట్లూ ఉన్నాయి; వాటిని పక్షులు పాడుచెయ్యకుండా వలలు అడ్డం కట్టారు. పిచ్చుకలూ, తీతువు పిట్టలూ మందలు మందలుగా ఇక్కణ్ణుంచి అక్కడికీ, అక్కణ్ణుంచి ఇక్కడికీ ఎగురుతున్నాయి. వాటికోసమే అక్కడక్కడా గడలపైన చేతులుచాచి ఉన్న దిష్టిబొమ్మలను కూడా ఉంచారు. కూరమళ్ళ అవతలగా కమతగాళ్ళ గుడిసెలున్నాయి. అవి బారులు తీరిలేక, ఇష్టం వచ్చినట్లుగా కట్టి ఉన్నాయి. కాని చిచీకవ్ చూసినదాన్నిబట్టి, ఇళ్ళు బాగుండడంచేత కమతగాళ్ళ ఆర్థికస్థితి బాగానే ఉన్నట్టు కనబడింది. కప్పుమీది చెక్కలు పుచ్చినచోటనల్లా కొత్త చెక్కలు వేసి ఉన్నాయి. ఒక్క గేటు కూడా ఒరగబడిలేదు. అతనికేసి తిరిగి ఉన్న ఇళ్ళ ఆవరణల్లో ఒకదానిలో ఒక కొత్తబండి ఉన్నది, మరొకదానిలో రెండు కూడా ఉన్నాయి.

“ఏం, ఈవిడకు మంచి ఊరే ఉందే!” అనుకుని అతను ఆవిడతో దీర్ఘంగా మాట్లాడి ఆమెతో మరింత బాగా పరిచయం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఆవిడ లోపలికి తొంగి చూసిన తలుపు సందులగుండా చూస్తే అవతలి గదిలో టీబల్ల వద్ద ఆమె కనిపించింది. అతను స్నేహ సౌహార్దాలు ఉట్టిపడేలాగా ఆమెను సమీపించాడు.

“గుడ్మార్నింగ్, బాబుగారూ. చక్కగా నిద్రపోయారా? అన్నదామె కూర్చున్న చోటి నుండి లేస్తూ. ఆమె రాత్రి ధరించిన దుస్తుల కంటె మంచివి ధరించి ఉన్నది. ముదురు రంగు గౌను తొడిగింది, నెత్తికి కుళాయి లేదు, మెడకు మాత్రం ఇంకా ఏదో చుట్టుకుని ఉన్నది.

“చాలా బాగా నిద్రపట్టింది, మీరెలా నిద్రపోయారు?” అంటూ అతను ఒక వాలుకుర్చీలో కూచున్నాడు.

“బాగా నిద్రపోలేదు”

“అదేం?”

“నాకు నిద్ర పట్టదు, నడుమునొప్పి. మోకాలికి ఎగువగా ఒకటే సలుపు.”

“పోతుందమ్మా, పోతుంది. దాన్ని గురించి ఆలోచించకండి.”

“పోతే కావలసిందేమిటి? కొవ్వేసి తోమి కర్పూరతైలం పట్టించాను. మీరు టీతో ఏం తీసుకుంటారు? ఆ సీసాలో ఇంట్లో కాచిన సారా ఉన్నది?”

“మరేమండీ? ఒక చుక్క ఇంటి సారాకూడా తీసుకుందాం!” అన్నాడు చిచీకవ్.

చిచీకవ్ స్నేహభావంగానే ఉన్నప్పటికీ మానిలవ్ వద్దలాగా మొహమాటానికి పోకుండా స్వేచ్ఛగా ప్రవర్తించడం పాఠకులు గ్రహించే ఉంటారు. రష్యాలో మేము మిగతా దేశాల కన్న ఇతర విషయాలలో వెనకబడి ఉన్నప్పటికీ ప్రవర్తన విషయంలో అందరికన్నా ముందుకు వెళ్ళామనాలి. మా ప్రవర్తనలు చూపే విచక్షణ వివరించటానికి సాధ్యపడదు. అందులో ఉండే స్వారస్యం జర్మనువాడికిగాని, ఫ్రెంచి వాడికిగాని అర్థం కాదు. వాళ్ళు కోటీశ్వరుడితోనూ, పొగాకు అమ్మేవాడితోనూ ఒకే గొంతుతో, ఇంచుమించు ఒకేభాష మాట్లాడుతారు, మనసులో కోటీశ్వరి పట్ల దాస్యభావమే ఉన్నప్పటికీనూ. మా పద్ధతి అదికాదు; మాలో ఎంత తెలివిగలవాళ్ళున్నారంటే వాళ్ళు మూడువందల కమతగాళ్ళు గలవాడితో మాట్లాడినట్టు రెండువందల మందే కలవాడితో మాట్లాడరు; మూడువందలు గలవాడితో మాట్లాడినట్టు ఐదువందలు గలవాడితో మాట్లాడరు; ఐదువందలు గలవాడితో మాట్లాడినట్టు ఎనిమిది వందలు గలవాడితో మాట్లాడరు. పది లక్షలమంది గలవాడివరకూ ఎక్కడికక్కడే తేడా ఉంది. మాటవరసకు ఒక ప్రభుత్వ కచేరీ ఉందనుకుందాం – ఇక్కడ గాదు, ఎక్కడో ఇంకో లోకంలో – ఈ కచేరీకి ఒక పెద్ద అధికారి ఉన్నాడనుకుందాం. ఈ మనిషి తన కిందివాళ్ల మధ్య కూచుని ఉండగా గమనించండి – అతన్ని చూసి బిత్తరపోతాం. దర్జా, హుందా… ఆ మొహంలో ఎన్ని కళలు! బ్రష్ తీసుకుని అతని చిత్తరువు వేయవచ్చు. సాక్షాత్తూ సృష్టికర్తే, మూడు మూర్తులా సృష్టికర్త! గరుత్మంతుడల్లే గంభీరంగా మసలుతాడు. ఇంత గరుత్మంతుడూ తన గది విడిచి తన పై అధికారి గదికి చంకలో కాగితాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు లచ్చుకలాగా అయిపోతాడు. ఉత్తప్పుడుగాని, ఏదైనా పార్టీ జరిగే చోటగాని తనచుట్టూ ఉన్నవాళ్ళు తనకన్న తక్కువ హోదా గలవాళ్ళయితే సృష్టికర్త సృష్టికర్తలాగే ఉంటాడు, తనకంటె ఒక్క పిసరు హెచ్చు హోదా గలవాళ్ళుంటే చాలు అంతలో అద్భుతంగా మారిపోతాడు; ఈగ అయిపోతాడు, ఈగకన్న కూడా హీనం, నలుసుగా మారిపోతాడు! అతన్ని చూసి మనం, “ఇతను ఇవాన్ పెట్రోవిచ్ ఎందుకయింది? ఇవాన్ పెట్రోవిచ్ ఇంకా ఎత్తుగా ఉంటాడు, వీడెవడో సన్నగా, పొట్టిగా ఉన్నాడు; ఇవాన్ పెట్రోవిచ్ బలంగా, గంభీరధ్వనితో మాట్లాడుతాడు, ఎన్నడూ నవ్వడు; వీడు చూడబోతే ఏం మాట్లాడుతున్నదీ తెలియనంత సన్నగా మాట్లాడుతూ, నవ్వుతున్నాడు కూడానూ” అనుకుంటాం. కాని దగ్గరికి వెళ్ళిచూస్తే ఇవాన్ పెట్రోవిచే! మనం అప్పుడేమనుకుంటామంటే, “ఓహో!…” అది అలా ఉంచి మన కథలో పాత్రల సంగతి చూసుకుందాం.

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.