మందిమన్నియమ్ -2

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది రెండోది:

సూత్రము – 11 : పరిపాలనముపై నిరాయుధులైన సాధారణ పౌరుల నియంత్రణము.

వృత్తి :

నిరాయుధులనఁగా గాయపఱచుటకున్ను చంపుటకున్ను ఉద్దేశింపఁబడిన సాధనములను వృత్తి ధర్మముగా ధరింపనివారు. సాధారణ పౌరులనఁగా సైనికేతరులని ప్రకరణగతార్థము.

(అ) నాగరికత యొక్క ప్రారంభదశలందు శారీరికబలము గలిగి యాయుధములను ధరించి పోరాడఁగలిగినవారిదే రాజ్యాధికారము. ప్రజాస్వామ్యమునాగరికత యొక్క పరాకాష్ఠకుఁ జెందిన వ్యవస్థ కావున నిందులోఁ గండ బలమున కంటెను బుద్ధిబలముపైననే ఊనిక హెచ్చు. కనుక దేశీయమైనపరిపాలనమున కాయుధధారణ మక్కఱలేదు. పరిపాలనమునకుఁ గలనిర్వచనము మారుటచేఁ గలిగిన స్థితి యిది. ప్రజాస్వామ్యమునందుఁ బరిపాలనమనఁగా దేశసమస్యల పరిష్కారమే తప్ప తదన్యము కాదు.

(ఆ) వైయక్తికమైన సాయుధ పోరాటకలిమి పరిపాలనావకాశమునకుఁబ్రాథమికార్హత కాకపోవుట వలనఁ బ్రజాస్వామ్యమునందు సైనికేతర వృత్తుల వారికిన్ని, మఱియు సాంప్రదాయికముగా నబలలుగాఁ బరిగణింపఁబడినస్త్రీలకున్ను సైత మధికార పగ్గములను జేపట్టుట కవకాశము లభించును.

(ఇ) సైనికుల పని శత్రుసైన్యముల బారినుండి దేశమును గాపాడుట. వారికుద్యోగమున్ను, పనియు రెండును ఉన్నప్పుడు వారుత్తమసైనికులనిపించికొందురు. ఉద్యోగము మాత్రమే యుండి, పనిలేనప్పుడు వారు ప్రజాస్వామ్యమునకు విపత్కారులగుదురు.

సూత్రము – 12 : అధికారమును వికేంద్రీకరించును.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు ఏ యధికారమున్ను ఎల్లప్పుడున్ను ఏ యొక్కవ్యక్తి చేతిలోఁ గాని, ఏ యొక్క కుటుంబము చేతిలోఁ గాని యుండదు.

(అ) ప్రజాస్వామ్యమునందు జరుగునట్టి మిక్కుటమైన శ్రమవిభజనమువలనఁ బ్రత్యేక నైపుణ్యములకుఁ బ్రాధాన్యమేర్పడును. అందుచేత నెవరుచేయఁదగిన పని వారికే యప్పగింపఁబడును. కనుక నొకే సమయములోయొకే ప్రభుత్వము క్రింద వేఱువేఱు అధికారకేంద్రములేర్పడును.

(ఆ) ప్రభుత్వపరముగా సర్వసమానత్వ సూత్రము నంగీకరించుట వలననెల్ల ప్రాంతములవారికిన్ని, వర్గములవారికిన్ని పరిమితమైన స్వయంపాలనావకాశమును గల్పించు నిమిత్తము కూడఁ గొన్ని యధికారములు వికేంద్రీకరింపఁబడును.

(ఇ) వికేంద్రీకరణము వలన నిరంకుశత్వము తగ్గును. నాయకులకున్నుఅధికారులకున్ను శ్రమబాధ్యతలు తగ్గును. ఏ యొక్కరి నిమిత్తమున్నువ్యవస్థను స్తంభింపఁజేయు నవసరముండదు. వికేంద్రీకరణము వ్యవస్థయొక్క గెలుపోటముల కందరిని సమష్టిగా బాధ్యులను జేయును. కనుకలాభనష్టములు ఏ యొక్క వ్యక్తివో కాక యవి సమానముగా నెల్లరికిని చెందును.

(ఈ) కాని దీని మూలమునఁ బ్రజలు ఒకే పని కొఱకుఁ బదిమంది నాశ్రయించు నగత్యమేర్పడును.

సూత్రము – 13 : ప్రజలలోఁ బరిజ్ఞానమును బెంపొందించును.

వృత్తి :

ప్రజాస్వామ్యమునం దెల్లరిని భాగస్వాములుగాఁ జేయవలెనన్నచోనెల్లరికిని రాజకీయ విషయముల గుఱించి యెంతయోకొంత పరిజ్ఞానమావశ్యకము. కనుక రాజకీయాధికారము కావలసినవారే తమ స్వార్థమునిమిత్తమైనను దానిని బ్రజలలోఁ బెంపొందింప సమకట్టెదరు. రాజకీయాధికారము కొఱకు జరుగు కుమ్ములాటలలో రాజకీయములతోఁ బాటువాని కంటె మిక్కిలి వేఱైన ప్రస్తావనములు సైతము బయల్పడును గావునఁబ్రజలు మునుపటి వలె వాని పట్ల తూష్ణీంభూతులై యుండరు.

సూత్రము – 14 : ప్రజలను సశక్తులుగాఁ జేయును.

వృత్తి :

ప్రజాస్వామ్యము బలహీనులకుఁ జేయూత. గొంతెత్తలేనివారికిగొంతు. అణఁగారిన వర్గముల కుద్ధరణము. పేదల కాశాకిరణము. ధనికులకురాజభయము నుండి విముక్తి. సంప్రదాయములకు రక్షణము. నవ్యతలకుస్వాగతాచరణము.

దాఁపఱికములకు భరతవాక్యము. జ్ఞాన విజ్ఞాన ప్రసారమునకు నాందీవాక్యము. యుద్ధములకు స్వస్తివాచనము. దేశదేశముల నడుమ మైత్రీబంధమునకు శ్రీకారము. ఇది యొక మార్గదర్శక సూత్రము.

::మూడవ ప్రస్తావనము – ప్రజాస్వామ్య దోషములు::

సూత్రము – 15 : ప్రాయికముగా వణిఙ్నాయకము.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందుఁ బెక్కురు నాయకులు తమ జీవనోపాధిని బట్టి తఱచుగాఁ బూర్తికాలిక వ్యాపారులు గాని, అంశకాలిక వ్యాపారులు గానిబహిరంగ వ్యాపారులు గాని, ప్రచ్ఛన్న వ్యాపారులు గాని, భూతపూర్వ వ్యాపారులు గాని, వర్తమాన వ్యాపారులు గాని అగుదురు.

(ఆ) సత్యాసత్య సమ్మిళితమును, షుమారుగా సమానమూల్యకమును,అన్యోన్య సమ్మతిపూర్వకమును, శాసనబద్ధమును, వస్తుద్రవ్యాదానప్రదానాత్మకమును అగు జీవనాధార కార్యకలాపము వాణిజ్యము.

(ఇ) తాను స్వయముగాఁ బనిచేసి పారితోషికమందుకొనుట వ్యాపారముకాదు. కాని యితరుల కొఱకితరులచేతఁ బనిచేయించి వారి పారితోషికమునందు వాటాఁ గైకొనుట మట్టుకు వ్యాపారమే యగును.

(ఈ) పెట్టుబడి, ఉత్పాదన, అమ్మకము, లాభము, నష్టము మొద లగువానితో సంబంధముండుటచే రైతులు కూడ వ్యాపారులే.

(ఉ) ప్రజలకు నాయకత్వము వహింపఁగోరువారు సేవకవృత్తిలో నుండుటనాయకత్వ లక్షణమునకు వ్యాఘాతమగుటచే వారు మొదటఁ దమ కుటుంబముల జరుగుబాటు విషయమున స్వతంత్రులగుట తప్పనిసరి కనుక వ్యాపారము చేయుట విధాయకము.

సూత్రము – 16 : ప్రచారాశ్రితము.

వృత్తి :

(అ) ఇచ్చటఁ బ్రచారమనఁగా నూరువాడలయందుఁ జాటుట. ఇది వాంగ్మూలముగాను, వ్రాఁతపూర్వకముగాను, ముద్రిత సామగ్రి ద్వారమునను, దృశ్య శ్రవణ మాధ్యమముల సహాయముతోడను బలువిధములుగా జరుగవచ్చును.

(ఆ) ప్రజాస్వామ్యమునందుఁ బ్రజల యభిప్రాయములను మలచియు, రూపుదిద్దియు, దారిమళ్ళించియు వారి యంగీకార యోగ్యతను బడయుటచేతనే దమ లక్ష్యములను సాధించికొనుట వీలుపడును గావున నీ వ్యవస్థలోఁబ్రతివారును రంగస్థలి నెక్కిన నటులవలెనె ప్రవర్తింతురు. ఇందు నాయకులు, ప్రజలు, ప్రభుత్వములు, వ్యాపారులు, కవులు, కళాకారులు, పండితులు, స్త్రీ లు, పురుషులు, గురువులు, శిష్యులు, చిన్న, పెద్ద యను వ్యత్యాసము లేనేలేదు.

(ఇ) ప్రజాస్వామ్యమునందుఁ బదునైన యాయుధములతో యుద్ధములు జరుగక పోయిననుఈ విధముగాఁ బ్రచార యుద్ధములు మాత్రము ఎడతెఱపి లేక నిరంతరాయముగా జరుగుచునే యుండును. వానియందు నెగ్గిన వాఁడు మాత్రమే ప్రజాస్వామ్యమునందుఁ దాను కోరికొన్న రంగమునం దాధిపత్యమును సంపాదింపఁగలుగును. సాధారణముగా ద్రవ్యపుష్టియు మందిమార్బలమును మొదలుగాఁ గల సాధన సంపత్తి లేనివాఁడీ పోరునం దోడిపోవును.

(ఈ) అందుచేతఁ బ్రజాస్వామ్యమునందు సైతము ప్రజామోదమును బడసిన ప్రతి యభిప్రాయమును సత్యము కాకపోవచ్చును. మానవ ప్రకృతియెట్టిదనఁగాఁ బ్రతిదినమున్ను జెవిలో నిల్లు కట్టికొని పోరినచో నెంత మొండివాఁడైనను ఏదోయొక బలహీన క్షణమునందుఁ దప్పుడుమాటలకుఁ దలయొగ్గవచ్చును.

సూత్రము – 17 : ధనమే యోగ్యతా ప్రమాణముగాఁ గలది.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందు లావుగా డబ్బు గడించినవారే నాయకులున్ను, పాలకులున్ను అగుదురు కావున వారి దృష్టాంతమును బట్టి యశేష ప్రజాబాహుళ్యము సైతము మానవుని శ్రేష్ఠతానిర్ధారణ నిమిత్తమతఁడు గడించిన ధనరాశినే కొలబద్దగాఁ గైకొనును. తన్మూలకమున ధనార్జన కుపకరించు విద్యలకే యగ్రాసనము లభించును. ఒకరి ప్రాచీనవారసత్వము గాని, సంస్కృతిసంప్రదాయములు గాని, గుణోత్తరత గానిప్రజాస్వామ్యమునందుఁ బాటిగాఁ దీసికొనఁబడవు. అ విధముగాఁ బ్రజాస్వామ్యమునందు ధనప్రమాణమొక్కటియే తక్కుంగల యెల్ల యెగుడుదిగుళ్ళను ఊచమట్టుగాఁ జదును చేసివేయును.

(ఆ) అందువలన సమాజములోఁ గొంత వైవిధ్య భంగము కలుగును. కనుకలభ్యమగు వనరులపైన ఒత్తిడి హెచ్చును.

(ఇ) ఈ హేతువు వలన సైతము ప్రజాస్వామ్యమున్ను సమసమాజ భావనయున్నుఁ బరస్పరము అసమన్వేయములు.

సూత్రము – 18 : శాసన బహుళము.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు రాజకీయముల కెక్కుడు ప్రాధాన్య మేర్పడుటచేఁ బ్రజల మనోవాక్కాయముల వక్రగతి నియంత్రణమునకు రాజకీయశాసనముల పైననే మిక్కిలి యాధారపడుదురు. వానిని బ్రజలెన్నికొన్ననాయకులు రూపొందించి యుండుటచే నవియే ప్రామాణికములని భావింతురు. తద్ద్వారా మత ధార్మిక సంస్కృత్యాచార వ్యవహారాదికములైన సాంప్రదాయిక నియంత్రణములకుఁ దొలుతఁ గల ప్రాబల్యము క్షీణించి యవిసైతము రాజకీయములకు విధేయము కావింపఁబడుటచే నవి పూర్వమునియంత్రించిన ప్రతి విషయమును లిఖిత శాసనముల ద్వారా మరల నియంత్రించుటకుఁ బ్రయత్నము చేయఁబడును. కనుకఁ బ్రజాస్వామ్యమునందు అంతకు మున్నెన్నడు నెఱుఁగనన్ని పరస్సహస్ర శాసనములు ప్రోఁగువడును.

సూత్రము – 19 : సంఘ సంస్కరణలకు దూరము.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందుఁ జెప్పువాఁడున్ను, వినువాఁడున్ను అని యిరుతెఱఁగుల మనుష్యులుండరు గనుకనున్ను, బ్రాయికముగా నంద రును ఇతరులకుఁ జెప్పువారే కనుకనున్ను సంఘసంస్కరణాది కార్యకలాప ములు బోత్తిగా ఫలింపవు. ఏ హితవచనమైనను అది చెప్పువారి యొక్క యనాధికారిక స్వాభిప్రాయముగాఁ జూడఁబడును గావున నెంతకాలము గడచినను సంస్కరణవాదుల గుంపులే తప్ప సంస్కరింపఁబడిన సమాజము మాత్రము కనఁబడదు.

(ఆ) దీనికి మూఁడు పర్యవసానములు గలవు. ఒకటి – ప్రజాస్వామ్య మేర్పడుటకు ముందున్న కాలమున కంటె ఛాందసముగాఁ దమ తమ నమ్మ కములకున్ను వ్యవస్థలకున్ను కట్టుబడి బిగిసికొనిపోయిన యభిప్రాయ ములు గల వర్గములు పెరిగిపోవుట.

(ఇ) రెండు – అందరున్ను ప్రభుత్వమునో ప్రజాప్రాతినిధ్య సభలనో నిష్పాక్షిక మధ్యవర్తులుగా భావించి తమ నమ్మకములపై శాసనములు చేయునధికారమును వానికిఁ గట్టఁబెట్టుట.

(ఈ) ఈ ప్రకరణమునందలి 2, 7, 15, 16, 17 సూత్రములతోఁ గలిపి యీ సూత్రమును జదువునది. ఫలితార్థముగాఁ , నెక్కడెక్కడఁ బ్రజాస్వామ్యము గలదో అక్కడెల్ల హింసాకాండ ద్వారమున వార్తలకెక్కుచుఁ బ్రభుత్వములపైన నొత్తిడి తేరఁజూచు నుగ్రవాదగుంపులు పెచ్చరిల్లును. సాధారణముగా నొక దేశమవలంబించు జాతీయవాద సిద్ధాంతములలోని లోపములే యుగ్రవాదరూపమున బయల్పడుచుండును.

సూత్రము – 20 : అతిమృదూకరణము.

వృత్తి :

ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరుల యొక్క హక్కులకిచ్చు నభయమున్నుమఱియు భద్రతయుఁ గాలక్రమమున వారిని మితిమీఱిన మృదుస్వభావులుగా మార్చివేయును.

(అ) ప్రజాస్వామ్యమునందు రక్తపాత రహితముగాఁ బ్రభుత్వములు మారుట, సమస్యలకు శాసనబద్ధమైన సత్వర పరిష్కార మార్గముల లభ్యత, సార్వత్రిక విద్యావిధాన మూలమున నితరుల హక్కులను గౌరవించుచుఁ దమహక్కుల నానందముగా ననుభవించుట, ఏ విషయముపై నైనను సహేతుకమైన తర్క వితర్కముల సహాయమున నితరులను ఒప్పించుట, శరీరముతోఁగాక మనస్సుతో మాత్రమే పనిచేయుట మొదలగు నాగరిక దర్జాల కలవడినప్రజలు తద్విరుద్ధమైన యనుభవముల నిచ్చు సంభావ్యత గల పరిస్థితులుప్పతిల్లినచో దిగ్భ్రాంతులై వాని కెదురొడ్డుటకు మానసికము గాను, శారీరికముగాను సన్నద్ధులు కాక దిగఁజాఱిపోవుదురు.

(ఆ) నిసర్గ కర్కశత్వము మిక్కిలి ముఖ్యమైన లక్షణము. ఈ లక్షణ మప్పుడప్పుడు పాపాచరణమునకుఁ ద్రోవసూపినను, జాతి యొక్క మనుగడయనేక విధములుగా దానిపైననే యాధారపడి యున్నది. మనుష్యులలోనిర్భీకమైన చొఱవకున్ను, పరాయివారి నెదిరించుటకున్ను, క్రొత్త భూములాక్రమించుటకున్ను, స్వభూములను గాఁపాడికొనుటకున్ను, సాహసోపేతమైన కొంగ్రొత్త పథకములను జేపట్టుటకున్ను ప్రేరణభూతమైనదదియే. ప్రజాస్వామ్య మూలమునఁ బౌరులు తమ తొల్లింటి నిసర్గ కర్కశత్వమునుగోల్పోయిన పిమ్మట ననాగరిక బర్బర జాతుల దాడులకుఁ దాళఁజాలకతమ దేశ మును వారి కప్పగించి పలాయనము చిత్తగించుటో లేదా, వారికి దాసోహమని శరణు వేఁడుటో చేయుదురు.

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)

About తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

”నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు.

తెలుగు భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం ప్రశంసనీయమైనవి. ’తెలుగు సాహిత్యం’ బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు.

ఆయన రచనల్లో ఎక్కువ భాగం అముద్రితాలు. వాటిని తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to మందిమన్నియమ్ -2

  1. subba rao says:

    It would be appeciated if there is a special reason why spoken language was not used in writing this. Thanks

  2. ఈ తరహా రచనలకు వ్యావహారికం suitable కాదని ప్రయోగపూర్వకంగా గ్రహించిన తరువాతనే సరళ గ్రాంథికాన్ని అవలంబించడం జరిగింది. ఎందుకు suitable కాదు ? అంటే-

    1. వ్యావహారికంలో కొత్త/పాత సాంకేతిక పదాల ప్రయోగానికీ coinage కీ స్థానం లేదు. వ్యావహారికాన్ని ఉపయోగించడం ద్వారా రచయిత అందరికీ అర్థం కావాలనే ఆదర్శానికి తాను కట్టుబడి ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించుకుంటాడు కనుక, ప్రతి వ్యక్తీకరణా ఆ పరిధిలోనే చెయ్యాల్సి వస్తుంది. ఇది పదానికీ పదానికీ మధ్య సూక్ష్మమైన అర్థభేదాల్ని ఎఱిగిన రచయితకు సంకెల మాదిరిగా అనిపిస్తుంది.

    2. ఇది శాస్త్ర రచనగా ఉద్దేశించబడింది. కేవలం అభిప్రాయప్రకటనగా కాదు. కాని వ్యావహారిక శైలి ఈ సబ్జెక్టు యొక్క తటస్థతని చెడగొట్టి రచయితని ఒక prejudiced light లో చూపిస్తుంది. తద్వారా సబ్జెక్టు యొక్క గాంభీర్యం చెడిపోతుంది. ఇది మన బ్లాగుల్లో ఇప్పటికే జరుగుతోంది. తటస్థత కోసం అనవసరమైన వాక్యాలూ పదాలూ పెంచడం కంటే గ్రాంథికమే ఆ కార్యాన్ని సమర్థంగా నెఱవేరుస్తుందని రచయిత అభిప్రాయం.

    3. ప్రాంతీయ మాండలికాల వాదం పెచ్చరిల్లుతున్న తరుణంలో అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన తెలుగుశైలి సరళ గ్రాంథికమే.

    4. మందిమన్నియం రచన ప్రతివారి కోసమూ ఉద్దేశించబడినది కాదు. ఈ సబ్జెక్టు మీద ఆసక్తి గలవారి కోసమే ఇది ఉద్దేశించబడింది. ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్టు కోసం ఎంత దూరమైనా వెళతారనే నమ్మకంతో గ్రాంథికాన్ని వాడేందుకు వెనకాడలేదు.

    5. అయినా ఇది చదువుకున్నవారికి అవగాహనదూరం కాదు.

Comments are closed.