మందిమన్నియమ్ -1

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp “మందిమన్నియం ” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మొదటిది:

6. పర్యాలోకన ప్రకరణము

మొదటి ప్రస్తావనము – ప్రజాస్వామ్య నిర్వచనములు

సూత్రము – 1: ప్రజాస్వామ్యము.

వృత్తి:

ఇది యధికారసూత్రము. ఇఁకముందు చెప్పఁబోవు నిఱువది యాఱు (26) వెనువెంటి సూత్రములకు దీని నన్వయించికొనునది. ప్రజాస్వామ్య మనఁగా నిచ్చటఁ బ్రాతినిధ్య ప్రజాస్వామ్యమునే గ్రహింపఁదగును.

సూత్రము – 2: ఏకదేశముల యందనిర్దిష్టులైన సంఖ్యాధికులకుఁ గల మాటచెల్లుబాటు.

వృత్తి:

(అ) ఏకదేశములనఁగా భాగములు. ఇచ్చట నేక దేశములనఁగా మొత్తము వ్యవస్థ కాక ప్రత్యేకములైన వేఱువేఱు విషయములున్ను, సమస్యలున్ను.

(ఆ) అనిర్దిష్టులనఁగాఁ బేరుచేతఁ గాని వర్గముచేతఁ గాని పేర్కొనఁబడని వారు. ప్రజాభిప్రాయసేకరణ జరుగు ప్రతి సందర్భమునకున్ను వీరు మారుచుందురు. వీరు ప్రతిసారియు నూకుమ్మడిగా నొక్క విధముగానే సమ్మతాసమ్మతములను దెలుపు సంభావ్యత లేదు.

(ఇ) సంఖ్యాధిక్య నిర్ణయ పద్ధతి దేశదేశమునకున్ను వారేర్పఱించికొన్న రాజ్యాంగముల ననుసరించి భేదించుచుండును. కొన్నియెడల నది నూటి కేఁబది యొక్కపాళ్ళు. మఱికొన్నియెడల నది నూటి కఱువదియాఱు చిల్లర పాళ్ళు. ఇంకొన్ని యెడల డెబ్బదియైదుపాళ్ళుగాఁ గాని యెనుబదిపాళ్ళుగాఁ గాని యున్నది.

(ఈ) సంఖ్యాధికు లెందరున్నప్పటికిన్ని వారి వ్యతిరేకులు కొందరుండుట తప్పదు. కాఁబట్టి తాము కూడ బలపడు వరకు వారెదురుచూడక తప్పదు.

సంఖ్యాధికులచేత గెలిపింపఁబడినవారు తమను గెలిపించినవారి బాగోగులను మాత్రమే పట్టించికొందురు కావునఁ బ్రజాస్వామ్యమునం దెల్లప్పుడును పైవారి దుర్విచక్షణమునకు బలియగు వర్గమొకటి యుండును.

(ఉ) ఒక కుటుంబముగాని, రాజకీయపక్షము గాని యెన్నికలలో గెలిచినంత మాత్రమునఁ బ్రజాసమస్యలపై వారికున్న సకల వైఖరులకున్ను లేదా భావజాలమునకున్ను ప్రజామోదము లభించినట్లు కాదు. ప్రాయికముగా నప్పటప్పటికిఁ బ్రజల దృష్టి కత్యవసరమని తోఁచిన యొకటి రెండు విషయములపైనఁ గాని, రెండుమూఁడు విషయముల పైనఁ గాని వారి వైఖరి నచ్చుటచే గెలి
పించినారని భావించుట సమంజసము. అట్లు గెలిపించినంత మాత్రమున యావత్తు దేశమును గాని, వ్యవస్థను గాని వారికి సమస్తహక్కు భుక్తములతో సహా శాశ్వతముగా వ్రాసి యిచ్చినట్లు కాదని తాత్పర్యము.

(ఊ) ప్రత్యేకముగాను మఱియు నాధికారికముగాను బ్రకటించిన కొన్ని విశేష సందర్భములలో మినహా, రాజ్యాంగ ప్రకారము నిర్ణీత కాలవ్యవధానమును బట్టి జరుగు సార్వత్రిక యెన్నికలు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగమే యగును దప్ప వ్యవస్థ యొక్క భవిష్యము నటో యిటో తేల్చి వేయు స్తోమత వానికి లేదు. అట్టి విధముగా వానిని గుఱించి వ్యాఖ్యానించుటయు మరియు నెన్నికలలోఁ గాని, యటుముందుఁ గాని యటుపిమ్మటఁ గాని యట్టి విధముగాఁ బ్రచారము సేయుటయు సమంజసములు కావు. ఏలనఁ బ్రాతినిధ్య ప్రజాస్వామ్యమునఁ బ్రజలు నేరుగా విధాన నిర్ణేతలు కాఁజాలరు.

సూత్రము – 3: ప్రజల కొఱ కే ప్రభువులు పరిపాలించుట.

వృత్తి:

ప్రజల యభీష్టము నెఱిఁగి పరిపాలించుటయే ప్రజాస్వామ్యమని సూత్రహృదయము. అయితే, అనింద్యమైన యెన్నికల ప్రక్రియవంటి యొక బహిరంగ వ్యక్తీకరణ ము లేకయే ప్రజాభీష్టమును గాని, ప్రజాప్రయోజనమును గాని నిర్దుష్టముగాఁ దెలిసికొనుట యెట్టి పరిస్థితులలోను సాధ్యము కాదు.

(అ) ప్రజలును బ్రభువులును అచ్చుమచ్చుగా నొకటి కారు. ప్రభువులు ప్రజలయందుండి ప్రభవించినవారే అయినను, ఒక్కసారి ప్రభుత్వ పీఠాధిష్ఠితులైన పిదప వారున్ను, వారి రాజకీయ సమర్థకులున్ను, ప్రజల కంటె వేఱై న జనవర్గమగుదురు. ప్రజాస్వామ్యమునఁ బరిపాలకులు అన్నివేళలఁ బ్రజలచేతఁ బ్రత్యక్షముగాఁ గాని, పరోక్ష ముగాఁ గాని యెన్నిక కానంత మాత్రము చేత వారి పరిపాలన యొక్క ప్రజాస్వామ్య ముద్రకు లోపము రాదని భావము.

(ఆ) ప్రజలే ప్రభువులని చెప్పి ప్రజలకున్ను ప్రభువులకున్ను తేడా పాటింపకపోవుట భ్రమప్రమాదజనితము. అంతేకాక మిక్కిలి హానికరము కూడ. రాజఱికమునందు వలెనె ప్రజాస్వామ్యమునందును ఒక పాలకవర్గముండుట నిజము. అధికారములో స్వయముగా నున్నను లేకపోయినను రాజకీయ సిద్ధాంతాది వైరుద్ధ్యముల కతీతముగాఁ బాలకవర్గ మెల్లప్పుడును బాలకవర్గమే. ఇది గమనింపనిచో సామాన్యప్రజల కొరకుఁ బ్రత్యేకింపఁబడిన యెల్ల లాభములను మరియు సదుపాయములను బ్రజలలో భాగమని పేరుబెట్టికొని పాలకవర్గముల సంబంధీకులే హస్తగతము జేసికొందురు.

రెండవ ప్రస్తావనము – ప్ర జాస్వామ్య గుణములు

సూత్రము – 4: మరియుఁ బ్రజాశ్రేయమును, బ్రజాభీష్టమును.

వృత్తి:

పృథగ్వ్యవహారముచేత నివి యన్యోన్యము పర్యాయ పదములు కావు.

సూత్రము – 5: బహుళ ప్రకారము.

వృత్తి:

ప్రత్య క్షము, పరోక్షము, ప్రాతినిధ్యము, పరోక్ష ప్రాతినిధ్యము, రాజఱిక ప్రజాస్వామ్యము, ప్రజామోదిత రాజఱికము, అధ్యక్ష ప్రజాస్వామ్యము, స్థానిక ప్రజాస్వామ్యము, ఏకపక్ష ప్రజాస్వామ్యము, బహుపక్ష ప్రజాస్వామ్యము, లిఖిత స్మృతి బద్ధము, అలిఖిత స్మృతి బద్ధము, వారసత్వ ప్రజాస్వామ్య ము, నైష్పత్తిక ప్రజాస్వామ్యము, శిష్టప్రజాస్వామ్యము, సార్వత్రిక ప్రజాస్వామ్యము అని ప్రజాస్వామ్యపుఁ బనితీరుపెక్కు తెఱఁగులు. వీనిలో మూఁడు, నాలుఁగు తెఱఁగు లొక్కటిగా సమ్మేళించుటయుఁ దఱచు.

సూత్రము – 6: ఒక లౌకిక రాజకీయ వ్యవస్థ.

వృత్తి:

(అ) వ్యవస్థ యనఁగాఁ గొన్ని ప్రాఙ్ నిశ్చిత లక్ష్యములను నెఱ వేర్చుటకై కొన్ని పరిసర పరిస్థితులను దృష్టిలో నుంచుకొని రూపొందించిన పూర్వాపర వచో వ్యాఘాత విరహితమైన నియమముల తార్కిక క్రమము.

(ఆ) ప్రజాస్వామ్యము తనవంటి అనేక ఇతర పాలన వ్యవస్థలలో ఒకానొకటి. ఇతర వ్యవస్థల కంటె దానికి గుణాధిక్య మిచ్చట పేర్కొనఁబడలేదు. కాని రాజు లేనంతమాత్రమున ప్రజాస్వామ్యమనఁగా నరాజకము కాదని తాత్పర్యము.

(ఇ) ఒక్కొక్క విధమైన ప్రజాస్వామ్యమునం దొక్కొక్క తెఱఁగు ఆర్థిక నమూనా వృద్ధిసెందును. కాని ప్రజాస్వామ్యము స్వయముగాఁ దానొక యార్థిక వ్యవస్థ కాదు.

(ఈ) దాని యొక్క యావత్తు సులక్షణ, విలక్షణ, అవలక్షణముల తోడను ఆమోదించి యనుసరించుటకు సిద్ధపడినప్పుడు ఏ వ్యవస్థ యైనను లోక కళ్యాణమునే చేయునని యెఱుఁగునది.

(ఉ) ఒకానొక దేశమునందు ప్రజాస్వామ్యము శాసనబద్ధమగు ప్రజాపాలన వ్యవస్థగాఁ బ్రకటింపఁబడినప్పటికిన్ని అచ్చటి రాజకీయేతర వ్యవస్థలకు -అనఁగాఁ గుటుంబము, విద్యాభ్యాసము, కళలు, శాస్త్రశోధన, మతము, వాణిజ్యము, శాంతిభద్రతల పరిరక్షణ, దైనందిన ప్రజా పాలనవ్యవహారములు మున్నగువాని అంతర్గత విషయములలో మట్టుకుఁ బ్రజాస్వామ్య సూత్రములు పూర్తిగాఁ గాని పాక్షికముగాఁ గాని వర్తింపకపోవచ్చును. కాని రాజకీయ వ్యవస్థ యొక్క స్వరూప స్వభావముల ప్రభావము సమాజమునందలి యెల్ల యితర వ్యవస్థలను కొద్దిగానో గొప్పగానో స్పృశింపక మానదు. అనఁగా సమూలమైన వ్యవస్థాగత మార్పులయందుఁ గాని జమాఖర్చుల సంస్కరణముల యందుఁ గాని ప్రజాస్వామ్య సూత్రములను సంపూర్ణముగాఁ బాటింప వలనుపడును.

(ఊ) లౌకికమనఁగాఁ బంచేంద్రియైకవేద్యమై మనందరి యొక్క నిత్య జీవితములయందును మిక్కిలి భేదింపని సారూప్యములతో ననుభవము లోనికి వచ్చుచు నీ యిహలోకమునకు-అందునా మనము నిర్మించికొన్న యీ మానవ సమాజమునకు మాత్రమే ప్రసక్తమైనట్టిది. ఏతద్ భిన్నములైన విషయములకుఁ బ్రజాస్వామ్య సూత్రములు వర్తింపవు.

సూత్రము – 7: పలు జనాంగములున్నచోట బహుళము.

వృత్తి:

(అ) జనాంగ మనఁగాఁ బ్రధాన జనవర్గముగాఁ గాక మొత్తము జనావళియం దేకదేశమై యుండునది. అట్లయ్యుఁ దన యొక్క స్వకీయమైన బ్రతుకోజ గలిగినది. అక్కారణమునఁ దన్నుఁ బ్రత్యేకమని యెంచికొనుచు నన్నివేళలఁ బ్రధాన జనవాహినితో నేకీభవింపనిది.

(ఆ) అట్టి చిన్నచితక జనాంగములు పెక్కు ప్రోఁగువడిన దేశమునందుఁ బ్రజాస్వామ్యము సఫలము కావచ్చును. లేదా, విఫలము కావచ్చును. పాక్షికముగా సఫలము కావచ్చును. లేదా, అసలు లేకయే పోవచ్చునని భావము.

(ఇ) ఇందులకుఁ గతనమేమఁగా – బ్రజాస్వామ్యము ప్రాథమికముగాఁ దలకాయల లెక్కయే గనుక, ననేకములైన చిఱుజనాంగములు కలఁగూడి నూటి కేఁబదియొక్క పాళ్ళ బలమును సమకూర్చికొని తక్కుంగల నలుఁబది తొమ్మిది పాళ్ళ బలము గల జనాంగములను దరచుగాఁ గ్రిందువఱచెదరు.

వారు వెనువెంటనే యే విధముగాఁ గాని ప్రతికరింపలేకపోయినను, ఈ పరిణామము పట్ల లోలోపల సహజముగాఁ గినిసి యుందురు. కనుక, జనాంగముల నడుమ వైషమ్యములు నానాటికిన్ని హెచ్చును. దీని ఫలితముగాఁ బ్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోవు నవకాశము తఱ చుగా నేర్పడఁగలదు.

(ఈ) ఇంతేకాక, ఆయా జనాంగముల ప్రత్యేక సంప్రదాయముల కనురూపముగా వేఱువేఱు విధములైన శాసనముల నేర్పఱించుటచే శాసనములకే విలువ లేని పరిస్థితి తలయెత్తును గావునను, ఆయా శాసనముల కాయా జనాంగముల పెద్దలు సందర్భానుసారము తమకుఁ దోఁచినయట్లు వక్ర భాష్యములు చెప్పు నవకాశముండుట వలనను ఒక దినుసు అరాచకము చోటుచేసికొనఁగలదు.

(ఉ) పలు జనాంగములున్న దేశపు సమస్యలు దుస్తరమగు సముద్రము వలె మొదలును దుదియు లేనియట్లు పైకి అనంతములై కానవచ్చును. జాతిపరమైన సమస్యలు నిజముగా నున్నను, లేకపోయినను, లేక యుపేక్షింపఁ దగినంత స్వల్పముగా మాత్రమే యున్నను, ఆ ప్రస్తావన రాజకీయ వాదులచే వారి వైయక్తిక జనాకర్షణ నిమిత్త మెడనెడ లేవనెత్తఁబడి పెద్దదిచేయఁబడి తఱచుగాఁ బెనుకల్లోలములకు దారితీయును. పర్యవసానముగాఁ బ్రజాస్వామ్యమునందుఁ బౌరుల నమ్మిక పదేపదే వమ్ము కావింపఁబడును.

సూత్రము – 8: సేవాప్రధానము.

వృత్తి:

(అ) ఇచ్చట సేవ యనఁగా – జీవనాధార భూతమైన ధనలాభము నిమిత్త మొక యజమానుని దగ్గరఁ గాని, యొక్కసారే పెక్కురు యజమానుల దగ్గరఁ గాని, తాత్కాలికముగాఁ గాని, శాశ్వతముగాఁ గాని, యిష్టపూర్వకముగాఁ గాని, అనిష్టపూర్వకముగాఁ గాని పనిసేయుట. ఇది ప్రేమస్నేహాది మనోద్వేగములచేఁ బ్రేరితమై చేయు స్వచ్ఛందసేవ కంటె మిక్కిలి భిన్నమైనది.

(ఆ) అధికారములున్ను, విధులున్ను, హక్కులున్ను ఎట్లున్నప్పటికిన్ని ప్రజాస్వామ్యమునం దొకరి కొకరు సేవకులనియేజెప్పఁబడుదురు. ఎట్లనఁగా

– వినియోగదారునకు వ్యాపారి సేవకుఁడు. శిష్యునకు గురువు సేవకుఁడు.
నాయకులు ప్రజలకు సేవకులు. రోగికి వైద్యుఁడు సేవకుఁడు.
యజమానులమని మాత్ర మెవ్వరును జెప్పికొనరు.

సూత్రము – 9: ఒక క్రమోన్నతి విధానము.

వృత్తి:

ప్రజాస్వామ్యము మానవులు క్రమక్రమముగా నున్నత తరగతికిఁ జేరికొనుటకు దోహదించు నొక రాజకీయ విధానము.

(అ) ఇంతకు ముందు చెప్పినట్లు ప్రజాస్వామ్యము తన స్వభావరీత్యా సమసమాజముతో సంవదింపదు గనుక దీనియందును ఎల్ల యితర సాంప్రదాయిక సమాజములందు వలెనె ధనపరముగాను హోదాపరముగాను వందలాదిగా హెచ్చుతగ్గులు కలవు. భేదమేమనఁగా – సాంప్రదాయిక సమాజములలో నున్నతి యనునది జన్మసిద్ధము. ప్రజాస్వామ్యములో మాత్రము కర్మసిద్ధము. అనఁగాఁ గొన్ని తెఱఁగుల వృత్తులున్ను ఉద్యోగములున్ను హెచ్చు తరగతికిఁ జెందినవనియు, మరికొన్ని తెఱఁగుల వృత్తులున్ను ఉద్యోగములున్ను నీచతరగతికిఁ జెందినవనియు నొక సుస్థిరాభిప్రాయము ప్రజాస్వామ్యమునందు సైతము ప్రచురముగా నుండును. కాని, యే యుద్యోగము గాని, వృత్తి గాని యెవ్వరికిని శాశ్వతము గావింపక పోవుట వలనఁ దన్మూలకమైన గౌరవాగౌరవములు ఆ వృత్త్యుద్యోగముల తోడనే సమసిపోవును.

ప్రజాస్వామ్యములో నవి యొక మనుష్యుని యొక్క యావత్తు శేషజీవితమును గాని యాతని వంశపరంపరను గాని ప్రభావింపఁ జాలవు.

(ఆ) కనుకఁ బ్రజాస్వామ్య మార్థిక తరగతుల నడుమను, వృత్త్యుద్యోగముల నడుమను ఉన్న యగాధమైన వ్యత్యాసములను దొలఁగించు పనికిఁ బూనికొన దు కాని, యొక యార్థిక తరగతి నుండి మఱియొక యార్థిక తరగతికి బదలాయిల్లు హక్కు నొసంగుటకు మాత్రము పూచీపడును. అట్లు మారుటకావశ్యకమైన ప్రయత్నము జేయవలసినదియు, సంభార సామగ్రులను సమకూర్చికోవలసినదియు సామాన్య పౌరుఁడే.

(ఇ) ఎవ్వరు గాని పుట్టుకతోడనే యితరుల కంటె గొప్పవారను విషయమును గాని, పుట్టుకతోడనే యితరులతో సమానమను విషయమును గాని ప్రజాస్వామ్య మంగీకరింపదు గనుక, పుట్టిన తరువాత గొప్పవారగుటకై ప్రయత్నము చేయు నవకాశము నెల్లరికిన్ని సమానముగాఁ గల్పించును. అందుచేత వృత్త్యుద్యోగముల రీత్యా నిమ్నతరగతిగా నెంచఁబడిన యొక కుటుంబము వేఱువిధమైన వృత్త్యుద్యోగముల నవలంబించి యున్నత తరగతిగా గురుతింపు నొందు స్వేచ్ఛను బ్రజాస్వామ్యము ప్రసాదించును.

(ఈ) ప్రజాస్వామ్యము పైవిధముగాఁ గల్పించిన యవకాశమును వివిధ వయస్సులవారు వివిధ సమయములందుపయోగించికొనుచుందురు గనుక యా దిశగా ముందు ప్రయత్నము జేసినవారికి సాందర్భికమగు ప్రాధాన్యమిచ్చు నిమిత్తము హోదాలలో నొక సోపానక్రమ మేర్పఱింపఁబడును.

సూత్రము – 10: తక్కువ హింసాపేక్షము.

వృత్తి:

ప్రజాస్వామ్య పద్ధతులలోఁ బరిపాలనము సేయుట కెక్కువ బలప్రయోగ మక్కఱ లేదు.
(అ) ప్రజాస్వామ్యమునందు సైత మెంతోకొంత శాసనవిరుద్ధమగు బలప్రయోగము తప్పదు. ఈ బలప్రయోగమున్ను, శాసనప్రకారము విధించు దండన ప్రక్రియయున్ను నొక్కటియే యని భావింపరాదు.

(ఆ) దండనభయము లేనిచోట నేరపూరితమైన యరాచకము తాండవించును. దండించుటయే మఱుఁగునఁ బడినప్పుడు సకారణముగాను, శాసన ప్రకారముగాను దండించినప్పటికిన్ని అది యొక యమానుషకృత్యమైనట్లును, నేరస్థులు దయనీయులైనట్లును, బ్రభుత్వమే దుర్మార్గమైనట్లును జూడఁబడును.

(ఇ) పై సూత్రము దేశపు టంతర్గత పరిపాలన వ్యవహారములను గూర్చి మాత్రమే. విదేశ వ్యవహారముల యందన్ననో, దౌత్యము విఫలమైనప్పుడు యెంతటి ప్రజాస్వామిక దేశమైనప్పటికిన్ని తప్పనిసరిగా హింసకున్ను, బల ప్రయోగమునకున్ను పాల్పడును.

(ఈ) ప్రజాస్వామ్యమునందలి యితర వ్యవస్థలయందీ సూత్రము బహుళముగా నన్వేయము.

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)

About తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

”నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు.

తెలుగు భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం ప్రశంసనీయమైనవి. ’తెలుగు సాహిత్యం’ బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు.

ఆయన రచనల్లో ఎక్కువ భాగం అముద్రితాలు. వాటిని తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to మందిమన్నియమ్ -1

  1. Padma I. says:

    ఈ రచనకి ముందు మాటో, ఉపోద్ఘాతమో, రచయితని దీనిని రాయడానికి ప్రేరేపించిన విషయాలో సంపాదకులో, రచయితో రాసి ఉంటే, ఈ రచనని context లో చదవడానికి వీలయేది. అది లేనందువల్ల పుస్తకం మధ్యలోంచి చదువుతున్నట్లు ఉంది.

    మొదటి భాగం అని ఆరో అధ్యాయం(?) నించి మొదలుపెట్టారే?

  2. పద్మ గారూ!

    మీ సూచనకు నెనరులు. ముందుమాట చేర్చాం.

Comments are closed.