నేనూ మీ లాంటి వాడినే

నాకు నాలుగేళ్ళు వచ్చేసరికే, మా అమ్మని, రెండు గాడిదలని వదిలి మా నాన్న చనిపోయాడు. అమ్మదింకా అప్పటికి చిన్న వయసే కాబట్టి మరో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ, కట్నంగా ఒక గాడిదని తనతో తీసుకుపోయింది. నాన్నకి సొంత భూమంటూ ఏదీ లేదు. నాన్న చావు, అమ్మ రెండో పెళ్ళి తర్వాత, మా మురికి వాడ యజమాని నన్ను అక్కడి నుంచి తరిమేసాడు. నా మేన మామ, అతడి భార్య నన్ను చేరదీసారు. మిగిలిన ఆ ఒక్క గాడిదను వాళ్ళు ఉంచేసుకున్నారు.

ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ ‘ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారి అద్దాల బోర్డు ఉంది. ఓ బట్టల సబ్బు కంపెనీ వ్యాపార ప్రకటనల కోసం ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఈ పుస్తకంలో నా పేరు కూడా ఉంది. ఆ బోర్డు పైన నా నీడ పొడుగ్గా పడుతోంది. ఓ బండి నన్ను దాటుకుంటూ వెళ్ళింది. నా నీడ ఇంకా పొడుగయ్యింది. అదృశ్యమయ్యేముందు నీడలు మరీ పొడుగవుతాయి.

ఈ ఏడాది నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతోంది. ఆ మేరకు ఉత్తరం కూడ వచ్చింది. ఏం లాభం? నేను ఏ భాషలోను చదవలేను. నా మిత్రులు నాకు చదివి వినిపించారు. ఇదే నా స్థలం! రాధు కిళ్ళీకొట్టు పక్కన. నేనిక్కడ అందరినీ నవ్విస్తాను. ఉత్సాహపరుస్తాను. నిజానికి నేను నోరు తెరవక్కరలేదు. పెదాలు కదిలిస్తే చాలు, జనాలు విరగబడి నవ్వుతారు. కాని ఈ పిల్లలు జాలి లేని వాళ్ళు. వీళ్ళు రాక్షసులే! నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతారు. జుట్టు పట్టి లాగుతారు. నేను ఎదురుతిరిగితే, దూరం నుంచి రాళ్ళు విసురుతారు. వీళ్ళ కారణంగా నేను స్వేచ్ఛగా తిరగలేను.

మా మావయ్య నన్ను చక్కగా చూసుకుంటాడు. ఇక అత్త అయితే అమ్మే! వీళ్ళే లేకపోతే నేనీపాటికి ఏ సర్కస్ కంపెనీలోనో ఉండేవాడిని. ఓ సారి ఓ కంపెనీ వాళ్ళు నాకు లక్షరూపాయలు ఇస్తామని మా అత్తకి, మామకి ఆశ చూపారు. ఎన్ని జన్నలెత్తినా, అంత పెద్ద మొత్తాన్ని కళ్ళజూడరేమో. కాని మా అత్త ఒప్పుకోలేదు. “వరుసగా పదడుగులు సరిగా వేయలేడు, సర్కస్ లో తాడు మీద ఎలా నడుస్తాడు? ఓ పెద్ద జోకర్ కాళ్ళమధ్యనుంచి కిందకి పడిపోతే? పులి నోట్లోకి వెళ్ళి తిరిగిరాగలడా? మేజీషియన్ పెట్టెలోంచి బయటకు రాగలడా?” అంటూ మా అత్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

హిందీ సినిమాలలో ప్రయత్నిద్దామని ఓ సారి బొంబాయి కూడ వెళ్ళాను. కాని ఫలితం లేకపోయింది. ఊరంతా తిరిగి, వట్టిచేతులతో ఇల్లు చేరాను. క్రిందటి ఏడాది ఓ టి.వి. బృందంలో హాస్యగాడిగా చేరి కొంచెం డబ్బు సంపాదించాను.

మా అత్తని, మావయ్యని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. ఇప్పుడు నా వయసు 23 ఏళ్ళు. వీళ్ళ మీద ఆధారపడి ఎంత కాలం బతకడం? ఓ సారి తినుబండారాల కొట్టు పెట్టాను. అత్త పదార్థాలు చేసిస్తే, నేను వాటిని అమ్మేవాడిని. చుట్టుపక్కల పిల్లలంతా తిని పోయేవారు. డబ్బులిచ్చేవారు కాదు. పిల్లలు ప్రతీసారి తినేసి పరిగెత్తేవారు. నన్నేదో మోసగించాలని వారి ఉద్దేశ్యం కాదు. నేను వాళ్ళని వెంటబడి తరిమితే చూడాలని వారి కోరిక. ఈ వ్యాపారంలో నేను నష్టపోయాను.

ఓ సారి మా నగర మేయర్ నన్ను చూసారు. అప్పటికే నా పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. నాకు మేయర్ సన్మానం చేసారు. కాని నాకది అవమానంగా తోచింది. “ఈ అబ్బాయి రికార్డు పుస్తకాలలోకి ఎక్కగానే సరికాదు, గౌరవప్రదమైన జీవితం గడపడానికి మనమందరం తోడ్పడాలి” అంటూ మేయర్ గంభీరంగా ప్రకటించారు. ఆ మాటలకి నేను పొంగిపోయాను. ఏదైనా మంచి అవకాశం వస్తుందేమోనని చాలా కాలం వేచిచూసాను. కాని అటువంటిదేదీ జరగలేదు. మేయర్ మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాను. నేను ఒంటరిగా వెళ్ళలేను. నాతో పాటు ఎవరో ఒకరు తోడు రావల్సిందే. పైగా బస్సులలో అసలు వెళ్ళలేను. ఆటోలో వెళ్ళాల్సిందే. మరి డబ్బులో? అంత మొత్తం నేనెలా భరించగలను? విసిగి వేసారిపోయాను.

నాకు సినిమాలంటే ఇష్టం. అమితాబ్ బచ్చన్ నా అభిమాన హీరో. ఎంత పొడుగ్గా ఉంటాడో కదా! హీరోయిన్లలో నాకెవ్వరూ నచ్చరు. నాకు నటీమణులు నచ్చరు. నాకున్న స్నేహితులంతా మగవాళ్ళే. మా అత్తని మినహాయించాలి. ఆమె నా పాలిట దేవత! కిళ్ళీ కొట్టు యజమాని రాధు నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం చాలా సమయం కలసి గడుపుతాం. అలాగే లతీఫ్ కూడ. లతీఫ్ దర్జీ. నా బట్టలు ఉచితంగా కుట్టిపెడతాడు. గుడ్డముక్కలు అత్త కొంటుంది. అయినా నా శరీరానికి ఏ మాత్రం గుడ్డముక్క కావాలేంటి?
నాకు ఇంకో మిత్రుడున్నాడు. వాడి అసలు పేరు చెప్పను. ‘రాహు’ అనుకుందాం. వాడో వెధవ. దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. వాడెంత సమర్ధుడంటే, రెండు సన్నని చేపలని పిడికిళ్ళలో పెట్టుకుని, బూజు పట్టిన గొట్టాలని అవలీలగా ఎక్కిదిగగలడు.

కాలక్షేపం కోసం నేను టి.వి. చూస్తాను. పేపరు చదవలేను, కాని మావయ్య వార్తలను పైకి చదువుతుంటే వింటాను. ఓ రోజు మా పేటలో ఏవో సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. నన్ను కొన్ని చేష్టలు చేయమన్నారు. చేసాను. ప్రతిఫలంగా కొంత డబ్బిచ్చారు. ఓ సారి మా టి.వి. బృందానికో పెద్ద అవకాశం వచ్చింది. ప్రదర్శన కొనసాగుతోంది. మా బృందంలో ఓ గాయని కూడ ఉంది. ఆమె పేరు మీరా. ఆమె పాటలు పాడుతుంటే, మధ్యలో నేను కుప్పిగెంతులు వేసి ప్రేక్షకులని నవ్విస్తున్నాను. స్టేజికి వెనుకగా కట్టిన తెరమీద నా నీడ పడి, పెరుగుతూ తరుగుతూ ప్రేక్షకులకి వినోదం పంచుతోంది. అందరూ చప్పట్లు కొట్టారు. మీరా కూడా. విరామ సమయంలో పాట ఆగింది, కాని వాయిద్యాలు ఆగలేదు. అందరూ చూస్తుండగా మీరా తెర వెనక్కి నన్ను లాక్కెళ్ళింది. ఏదో విశేషమైన అంకం కాబోలని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఒకరో ఇద్దరో ఈలలు కూడ వేసారు.

“నిన్నొక మాట అడగనా?” అంది మీరా జీర గొంతుతో. మళ్ళీ తనే మాట్లాడుతూ,
“ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను. కాని ధైర్యం చాలలేదు. నీ సమాధానం ‘సరే’ అయితే ఇప్పుడే చెప్పేయ్. ‘కాదు’ అయితే మాత్రం ఇప్పుడే చెప్పకు. నేను తట్టుకోలేను. నా హృదయం బద్దలవుతుంది” అని అంది. మా నీడలు తెరమీద పడి, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్న సంగతి ఎదురుగా కూర్చున్న అందరికీ తెలుస్తోంది.
నేను ఆసక్తిగా ఆమెకేసి చూసాను.
“నా హృదయం నీకర్పించాను. నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగింది మీరా. ఇంత అప్యాయంగా నాతో మాట్లాడినవారెవ్వరూ లేరు. నేను కరిగిపోయాను.
నేను పిల్లి మొగ్గ వేసాను. డ్రమ్స్ వాయించే కుర్రాడి భుజంపైకెక్కి, డ్రమ్‌ని రెండు సార్లు మ్రోగించాను. తర్వాత మీరా దగ్గరికి పరిగెత్తాను. ఆమె గౌను అంచుని ముద్దాడాను. ఆమె వాయిద్యకారులున్న వైపు నడిచింది. వాళ్ళలో ఒకడు మైక్ పట్టుకుని, “ఏమన్నాడు?” అని అడిగాడు.
ప్రేక్షకులు కూడా ” ఏమన్నాడు?” అంటూ కోరస్ గా అరిచారు.

ఆ వంచకి, మైక్ అందుకుని, “నేను అతడిని నన్ను పెళ్ళిచేసుకుంటావా అని అడిగాను” అంటూ వీక్షకులకి చెప్పింది. నా వీపు ప్రేక్షకులకి కనపడేలా నిలుచున్నాను. “జవాబు ఏం చెప్పాడు?” అంటూ ప్రేక్షకులు గోల గోలగా అడిగారు. నాకు సిగ్గేసింది. నా ముఖం మాడిపోయింది. నా శరీరం ఎదగలేదు నిజమే, కాని బుద్ధి ఎదిగింది. ఆమె నన్ను గేలి చేసిందని గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు. ఇక్కడి జనాలను నవ్విస్తూ, నేను చనిపోయుంటే, నేను నా చివరి క్షణాలలో ఎవరిని తలుచుకునుండే వాడినో తెలుసా? అమ్మ కన్నా ఎక్కువైన అత్తని కాదు, దేవుడి లాంటి మావయ్యని కాదు, ఆఖరికి నా మిత్రబృందాన్ని కూడా కాదు. మీరాని ! అటువంటిది – ఎంతటి విద్రోహం?

మీరా హుషారుగా చెబుతోంది – ” అతడు సరేనన్నాడు. మనం ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అని అడిగాడు”

అంతే అక్కడ ఒక్కసారిగా, నవ్వులవాన కురిసింది. జనాలందరూ హేళనగా పగలబడినవ్వారు. వాళ్ళల్లో మా అత్త, మావయ్య కూడ ఉన్నారు.
మోసగాళ్ళు. అందరూ మోసగాళ్ళే! మీరా, అత్త, మావయ్య, రాధు, లతీఫ్……. అందరూ! గడ్డిలో దాక్కున్న పాములు! వాయిద్యకారులు గట్టిగా మ్రోగించి ప్రేక్షకులని మరింత రెచ్చగొట్టారు.

నేనింకా అలాగే నిలబడి ఉన్నాను. మీరా నన్ను వెర్రి వెధవని చేసింది. నేను మరుగుజ్జునే కావచ్చు. కాని నా గుండె చిన్నది కాదే? మాములు మనుషులకి ఉండే పరిమాణంలోనే నా గుండె కూడ ఉంది. వర్షాకాలంలో కురిసిన వానంతా కలసి నా కళ్ళలో సముద్రమైంది. నా కళ్ళ లోంచి జారుతున్న నీటి బొట్లని చూడండి. వాటి పరిమాణాన్ని గమనించండి. ప్రపంచంలోని ఏ మనిషి కళ్ళనుంచైనా కారే నీటి బిందువుల పరిమాణమే కదా అవి? లేదంటే అవింకా చిన్నవని మీరు భావిస్తున్నారా?

* * *

ఒరియా మూలం: హృశికేశ్ పండా
ఆంగ్లం: లిపి పుష్పనాయక్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్. కథారచయిత మరియు అనువాదకుడైన ఈయన గతంలో కొన్ని దిన పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించారు. వ్యాసాలు రాసారు. ఈయన సొంత కథలు, అనువాదాలు వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. మంచి కథలు ఎక్కద చదివినా, వాటిని తెలుగు లో కి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

6 Responses to నేనూ మీ లాంటి వాడినే

  1. సి.ప్రతాప్ (అభయ్-కలం పేరు) says:

    ఈ మధ్య కాలంలొ నేను ఇంత చక్కని కధ అస్సలు చదవలెదు. పరభాషా కధ అయినా మన నేటివిటీకి తగినట్లుగా అనువదించిన సొమశంకర్ గారికి నిజంగా హెట్సాఫ్. కధ అద్యంతం ఎంతో భవొద్వేగంతో చదివించింది.మరుగుజ్జులైతెనేం హృదయం మాత్రం మాములు మనుష్యుల పరిణామంలొనె వుంటుంది అన్న వాక్యాలు నా మనస్సును కలిచివేసాయి.ఇతరులను నవ్వించు గాని ఇతరులను జూసి నవ్వకు అన్న ఒక గొప్ప వాక్యం నాకు ఈ కధ చదువుతుంటే గుర్తొచ్చింది. మానవ సంభంధాల యొక్క ప్రాభవాన్ని తెలియజెప్పే ఈ కధను అందరూ పదికాలాల పాటు దాచుకోవాలి. అంతే కాక అందరికీ ఈ లింకును పపించండి. అద్భుతమైన కధను అందించినందుకు పొద్దుకు నా ధన్యవాదాలు.

  2. సోమశంకర్, చాలా బాగా రాశారు. మూల కథలో ఉన్న ఆర్దత ఒక యెత్తైతే మీ అనువాదం దానికి జీవం పోసింది.

  3. sharada says:

    It is really good story. It is very interesting story. Really I liked so much.
    Thanks to Mr. Somashanker.

  4. prasu says:

    what an heart touchig story really xcellent

  5. t.sujatha says:

    గుండెలోని ఆవేదనని చక్కగా చిత్రించిన కథ.కధలోని జీవం,ఆర్దత ఉట్టిపడే అనువాదము మొత్తం ంమీద ఇది ఒక మంచికథ.

  6. ఈ కథని ప్రచురించిన పొద్దు సంపాదక బృందానికీ, స్పందించిన పాఠకులకు నా కృతజ్ఞతలు.

Comments are closed.