నుడికారము – మరికొన్ని కోణాలు

రానారెయర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. తెలుగు నుడికారం పై పొద్దులో ఒక వ్యాసం రాసి పాఠకజనావళి అభిమానం పొందిన రానారె, అదే అంశంపై రాసిన రెండో వ్యాసమిది. ఆస్వాదించండి.

——————–

“పురుగు మూజూసింది!” అనేది ఒకానొక పలుకుబడి. పురుగు అంటే విషపురుగు. ముఖ్యంగా పాము. మూజూడటం అంటే మామూలు అర్థం వాసన చూడటం అని. కానీ ఈ పలుకుబడిలో మాత్రం కాటువేసిందని అర్థం. పాము కరచిందని చెప్పొచ్చుకదా ఎందుకీ “డొంకతిరుగుడు”!? అనిపించవచ్చు. కారణం ఏమిటంటే కరచిన ఆ పాము పేరు వినవస్తే మత్రంయొక్క లేదా మందుయొక్క ప్రభావం పోతుందని ఒక నమ్మకం. ప్రస్తుతం ఆ నమ్మకం ఉన్నా లేకున్నా ఈ పలుకుబడి మాత్రం జనంలో నిలిచిపోయింది.

“బొత్తిగా నల్లపూసవైపోయావు, ఏమిటి సంగతులు?” పలుకరించాడొక మిత్రుడు. నల్లపూసనయిపోవడం ఏమిటి? “ఈ మధ్య కనబడటం లేదు, కనీసం నీ గొంతుకూడా వినలేదు, నీ గురించి ఏ సమాచారమూ లేదు” అనే ప్రేమపూర్వకమైన అర్థమున్నట్లు తెలుగు వాతావరణంలో తిరగినవారికి తెలుసు. భాష మాత్రమే తెలిసినవారూ లేదా కొత్తగా తెలుగునేర్చుకున్నవారైతే, “ఎండాకాలం కదా, బయట తిరిగి బాగా నల్లబడి చిక్కిపోయావు” అనే అర్థముందేమోనని బుర్రలకు పనిచెప్పవలసింది.

ఇట్లాగ ఒక వాక్యంలోని పదాల అర్థాన్ననుసరించిగాక, ఆ ప్రాంతపు జనజీవన నేపథ్యాన్ననుసరించి కొత్తభావం పుడుతుందన్నమాట. పురుగు మూజూసింది, నల్లపూసవైపోయావు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ – ఈ పదాలనుండి యథాతథంగా వచ్చే భావము ఒకటి. ఈ పలుకుబడులలో దాగిన వాడుకలోని భావము మరొకటి. ఇదే నుడికారపు ముఖ్య లక్షణం. గత వ్యాసంలో ఈ విషయాన్ని మరింత విపులంగా ప్రస్తావించడం జరిగింది.

“పొద్దు గూట్లో పడింది” అంటే ఏమిటో, “చిలక గోరింకల్లాగా” కాపురం చేయమనడం ఏమిటో తెలుసా?
****************************

ఒక భాషలోని పలుకుబడులు మరో భాషలోకి తర్జుమా చేయడంలో ఎన్నో ఇబ్బందులు. రెండు భాషల ప్రజల జీవన విధానాల మధ్య అంతరాలు ఎక్కువయేకొద్దీ ఈ ఇబ్బందులు తీవ్రమౌతాయి. అనువాదరచనలు చేసేవారికి భాష తెలిస్తే సరిపోదు. ఆయా భాషలకు సంబంధించిన సంస్కృతులపై అనువాదకునికి అవగాహన లేకపోతే ఆ అనువాదంలో జీవం ఉండదు.

మనవాళ్ల పెళ్లిచూపుల తంతగాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలంటే అందులో ఎంతోకొంత అసహజత్వం తొంగిచూడక తప్పదు. ఎందుకు? పెళ్లిచూపులు అనబడే వ్యవహారమే ఆంగ్లేయులకు అసహజం కనుక. అందుచేత ఏ భాష నుడికారం ఆ భాషకే ప్రత్యేకం. మన జీవనం పాశ్చాత్య జీవనానికి దగ్గరగా మారేకొద్దీ ఈ ప్రత్యేతక కనుమరుగౌతూ పోతుంది. అప్పుడు మన నుడికారం కూడా ఆంగ్ల నుడికి దగ్గరగా మారిపోతుంది. జీవనవిధానమే నుడికారానికి ముడిసరుకు కనుక ఇది అనివార్యం.
****************************

సినిమాలలో ఒక సన్నివేశానికి తీవ్రతను చేకూర్చడంలో నేపధ్య సంగీతం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మనకు తెలుసు. సందర్భానికి తగిన శబ్దాలతోకూడిన పదప్రయోగం చేయగలిగే వీలు భాషలోనే ఉండటం ఒక చెప్పుకోదగ్గ విశేషం. చిన్న ఉదాహరణ చూద్దాం. విపరీతమైన కోపంలో ఉన్న మహా బలవంతుడైన ఒక మహాకాయుని ముఖాన్ని ఊహించండి. ఆ ముఖంలో క్రోధాన్ని తెలుపుతూ అతని నొసలు ఎగిరెగిరి పడుతోంది. ఈ ఉగ్రరూపాన్ని కళ్లకు కట్టేందుకు వాడబడిన ఒకేఒక్క పదం: నటదుద్యద్భృకుటీభయంకరము. ఈ పదాన్ని పలకడంలోనే ఆ ఉధృతి అర్థమౌతుంది. నటత్ ఉద్యత్ భృకుటీ భయంకరము. నుడి అంటే మాట,పలుకు అనే అర్థాలున్నాయి.

దాశరథీ శతకంలోని ఈ పద్యం చూడండి – రాముడు తిరుగులేని వీరుడు, ఎదురులేని దేవుడు, రెండవ సాటి దైవమింక లేదనే భావాన్ని ఎలుగెత్తి ప్రకటించే ఈ పద్యంలోని శబ్దార్థాలు గమనించండి.

భండన భీము డార్తజన బాంధవు డుజ్జ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, రామ మూర్తికిన్,
రెండవ సాటి దైవ మిక లేడనుచున్, గడగట్టి, భేరికా
దాండ డడాండ డాండ నినాదంబు లజాండము నిండ, మత్తవే
దండము నెక్కి చాటెదను! దాశరథీ కరుణా పయోనిధీ!

ఇంతకు మించిన ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. మీకు తోచింది మీరూ ఒకటి చెప్పండి.

ఉచ్చారణలోని వైవిధ్యం వలన జనించే అర్థాలు పలువిధాలుగా ఉండటం మనకు అనుభవంలోనిదే. ఇది దాదాపుగా ఏ భాషలోనైనా ఉండేదే. ఈ విధానం తెలుగుకు ప్రత్యేకమేమీ కాదు. కానీ ఇది ఒక్కో పదాన్ని నొక్కి పలికే తీరులో మాత్రం ఏ భాష ప్రత్యేకత దానిదే. ఇక్కడే భాష ప్రత్యేతకను నుడికారము నిలబెడుతుంది.
****************************

“తలపులు ఎన్నెన్నొ – కలలుగ కంటావు. కల్లలు కాగానె – కన్నీరౌతావు. మౌనమె నీ భాష ఓ మూగ మనసా …” ఈ గేయాన్ని మీరు వినే ఉంటారు. తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా ఉంటూనే ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పినట్లుగా అనిపించే సంబోధన “ఓ మనసా” అనేది. ఈ ప్రయోగం మాటల్లోనూ, పాటలోనూ, కవితల్లోనూ కనబడుతూ ఉంటుంది. బహుశా వాగ్గేయకారులు “ఓ మనసా … ” అనే సంబోధనను వాడకంలో పెట్టి ఉండవచ్చు.

జనసామాన్యంలోకి చొచ్చుకుపోయి దీర్ఘకాలంపాటునిలిచే రచనలు చేసిన వారందరూ తమదైన నుడికారాన్ని అప్రయత్నంగానే సృష్టిస్తూ ఉంటారు.
****************************

నీ శ్రాద్ధమ్, నీ పిండమ్, అప్రాచ్యుడా – ఇలాంటి సంస్కృతతిట్లు బ్రాహ్మణుల ఇళ్లలో వినబడటం మీరు గమనించే ఉంటారు. ఆ సమాజాల్లో సంస్కృతం చదువుకున్నవారు ఎక్కుగా ఉండటం వల్ల కావచ్చు. ప్రాచ్యం అంటే తూర్పుప్రాంతం. ప్రాచ్యుడు కానివాడు అప్రాచ్యుడు. తిట్లేకాదు మామూలు మాటల్లో కూడా సంస్కృతం ఎక్కువగా తొంగిచూస్తుంది. దేవభాషాపరిమళం ఎంత ఎక్కువగా ఉంటే ఆ భూసురునికి అంత గౌరవం. బ్రాహ్మణేతర సమాజాల్లో తిట్లు, మాటలూ మరోలా ఉండటం మనకు తెలిసిందే. ఇలా బ్రాహ్మణుల నుడికారం కాస్త ప్రత్యేకం(గా ఉండేది). గురజాడ కన్యాశుల్కం, చిలకమర్తివారి గణపతి మొదలైన రచనలలో మనం ఈ నుడికారాన్ని చూడవచ్చు.

కొన్నేళ్ల కిందటి మాట. మా పల్లెకు ఒక కొత్త కోడలు వచ్చింది. చాలా ఆరోగ్యవంతురాలు. మగవాళ్లు మాత్రమే చేయగలిగే కొన్ని సేద్యపు పనులను కూడా అలుపు లేకుండా చేయగలిగేంది. ఆమెకొక బిడ్డ కలిగిన కొత్తల్లో వాళ్ల పుట్టింట్లో కొన్నాళ్లుంది. వాళ్లు ఆమెకు కేవలం గొడ్డుకారం మాత్రమే ఆహారంగా పెట్టారు. నీళ్లు ఎక్కువగా తాగనివ్వలేదు. ఇలా పథ్యం పెట్టకపోతే బాలెంతరాళ్లకు కొన్ని ప్రాణాంతక వ్యాధులొచ్చే అవకాశం ఎక్కువని వాళ్ల గట్టి నమ్మకం. బిడ్డతో ఆమె మా ఊరికొచ్చేసరికి ఆమె ఆరోగ్యము, బలమూ అన్నీ శాశ్వతంగా కోల్పోయింది. ఆమె పరిస్థితి చూసి హృదయం ద్రవించినవాళ్లు అన్నమాట – “ఎద్దట్లాటి మనిషి. ఎట్టైపోయనో చూడు.” ఒక ఆడ మనిషిని ఎద్దుతో పోల్చడం – కేవలం వ్యవసాయాధారిత సమాజంలో మాత్రమే వినబడుతుంది. మిగతావారికిది మొరటుగానూ ఎబ్బెట్టుగానూ ఉంటుంది. ఎద్దులపై సహజీవనం చేసేవారికీ వాటిపై ప్రేమగలవారికీ ఇవేమీ కనబడవు. ఎద్దుల శక్తి, ఎప్పుడంటే అప్పుడు ఎంత పనైనా చేసేందుకు సిద్ధపడటమే కనబడుతుంది.

సముద్రానికి దగ్గరగా నివసించే మత్స్యకారులకు వారి జీవనవిధానంనుడి పుట్టిన ప్రత్యేక నుడికారం ఉంటుంది. ఇలా ఏ వృత్తిలోనివారికి ఆ వృత్తికి, ఆ జీవితానికి సంబంధించిన పలుకుబడులు వారి భాషలో భాగమైపోతాయి. ఇందుకే తెలుగు నుడికారం భాషకు సంబంధించినది మాత్రమేగాక మన సమాజ జీవనానికి సంబంధించినది.
****************************

ప్రపంచంలోని ప్రతి భాషకు వ్యాకరణము, ఛందస్సులాంటి కొన్ని సంప్రదాయనియమాలతో తనదైన శిల్పం ఉంటుంది. ఈ లక్షణం ఆయా భాషల నుడికారాలను నిర్దేశిస్తుంది. ప్రతినిత్యం మనం టీవీలో చూసే వ్యాపార ప్రకటనల్లో వినిపించే భాషను గమనించండి. ఉదాహరణకు ఒక సబ్బు గురించి “ఇది రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది” అనేమాటను నమ్మకంగా సాధికారంగా సొగసుగా చెప్పవచ్చు. కానీ దీన్నే మరోవిధంగా చెబుతారు – “ఇది ఉంచుతుందీ… మిమ్మల్ని రోజంతా తాజాగా.” ఇలాంటి మాటలు హిందీనుండి లేదా ఇంగ్లీషునుండి అనువదింపబడిన వ్యాపారప్రకటనల్లో తప్ప మామూలుగా ఎవ్వరూ మాట్లాడరు. ఇది ఉంచుతుంది … అంటూ మొదలెట్టడం ఆ భాషలకు నప్పుతుందేమోగానీ, తెలుగుకు ఇది కొత్త. కానీ పదేపదే మన టీవీల్లో ఇలాంటిమాటలు వినీవినీ మన పిల్లలకు ఇది అలవడవచ్చు.
****************************

కేవలం వ్రాత(లిపి) ద్వారా నుడికారం అన్నది అందదు. శబ్దార్థం నుడికారానికి ప్రాణం. దీన్నే యాస అనుకోవచ్చు. ఒక మాటను ఎలా పలుకుతున్నామన్నదాన్నిబట్టి మాత్రమే కాక, ఎవరితో మాట్లాడుతున్నామన్నదాన్నిబట్టి కూడా దాని అర్థం మారిపోతుందని మనకు తెలుసు. ఔనా!? — అంటే “అలాగన్నమాట, సరే” అని ఒక అర్థం, “తెలిసి చెబుతున్నావా, నాకు తెలీదని చెబుతున్నావా” అన్న సందేహం వ్యక్తపరచడం ఇంకొక అర్థం. “అబ్బా! మాకు తెలీదులే” అనే వేళాకోళం మరొక అర్థం. పలికే పద్ధతినిబట్టి, శ్రోతల నేపథ్యాన్నిబట్టి ఈ అర్థాలు మారుతూంటాయి.

ఆంధ్రదేశంలో ‘బాగున్నావా?’ యొక్క కొన్ని ఇతర రూపాలు: “బాగున్నవా? బావున్నావా? మంచిగున్నవా? మంచిగున్నావె? మంచిగున్నవానె? బాగుండావా? బాగుండావ్? బాండా..వ్?”

నేను దగ్గరగా గమనించిన ఒక ఉదాహరణ – సాధారణంగా వ్యవహారంలో వినబడే ప్రశ్న “బాగున్నారా?”. దీన్ని కడపజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో …
— తూర్పు-ఆగ్నేయం — “బాగుండా…రు?” (‘డా’ను కొంచెం సాగదీసి, ‘రు’ను కొంచెం కుదించి)
— తూర్పు-ఈశాన్యం — “బాగుండారూ…?” (‘రూ’ను కొంచెం సాగదీసి)
— పశ్చిమ-నైరుతి — “బాగుండారా?”
— పశ్చిమ-వాయవ్యాలలో ఎలా పలుకుతారో నాకు ఇదమిద్దంగా తెలియదు.

ఇలా ఒకే జిల్లాలోనే అతి సామాన్యమైన, సాధారణమైన ఒక చిన్న మాటను వివిధ రకాలుగా ఉచ్చరించడాన్నిబట్టి నుడికారపు ప్రాంతీయతను గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. కడపజిల్లా యాస అంటూ ప్రత్యేకించి ఒకే ఒక్క యాస లేదు. కాకపోతే, మిగిలిన జిల్లాలతో పోల్చినపుడు సార్వజనీనమైన ఒక యాస ఉందనుకోవచ్చు. అలాగే, “రాయలసీమ మాండలికం” అన్నది కూడా. తెలంగాణ, కోస్తా ప్రాంతాల యాసలతో పోల్చినపుడు మాత్రమే రాయలసీమ మాండలికం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు దేనికదే సార్వజనీనమైన ప్రత్యేక యాస ఉంది. కాబట్టి రాయలసీమలోని ఏ ప్రాంతపు భాషను మరియు యాసను ‘రాయలసీమ మాండలికం’ అంటున్నారన్నది రాయలసీమ వాసులకు తెలియనట్లే, తెలంగాణలోని ఏ ప్రాంతపు యాసను ‘తెలంగాణ’ మాండలికం అంటున్నారో వారికీ తెలియదనుకొంటాను. అలాగే కోస్తా జిల్లాల్లోనూ ఎన్నో మాండలికాలు. “వస్తా ఉండారా, పోతా ఉండారా” అని ఏవో రెండుమూడు పదాలు మాట్లాడి, అదే రాయలసీమ నుడికారం అనిపింపజేస్తుంటారు మన సినిమాల్లో. ప్రాంతీయజన జీవనంతో మమేకమైతే తప్ప, ఏ ప్రాంతపు నుడికారమైనా ఎవ్వరికీ అలవడదు. మన సినిమాల్లో చూపించే ‘సీమ యాస’ సీమలోని ఏ ప్రాంతానికీ దగ్గరగా ఉండదు. కాకపోతే అది సీమేతరులకు తెలిసే అవకాశం తక్కువ. సినిమాల్లోని తెలంగాణ, కోస్తా యాసల సంగతి కూడా ఇంతేనేమో!?
****************************

ఒక వ్యవస్థకు, రంగానికి లేదా వర్గానికి సంబంధించిన వ్యక్తులమధ్య జరిగే సంభాషణలో వారికే ప్రత్యేకమైన, ఒకోసారి వారికి మాత్రమే అర్థమయ్యే నుడులు దొర్లుతూ ఉంటాయి.

హాస్టలు విద్యార్థుల మధ్య కొన్ని నుడులు పుడుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ: “జాతీయం చేసెయ్యడం” — అంటే ఏదైనా ఒక వస్తువు దొరికితే, దాని సొంతదారుడు గుర్తుపట్టకుండా రూపురేఖలు మార్చి, అందరూ కలసి దాన్ని వాడుకోవడం. నాగార్జునసాగరం లాంటి ఆనకట్టలను జవహర్లాల్ నెహ్రూ జాతికి అంకితం చేయడం, బ్యాంకుల జాతీయకరణం మొదలైనవి పాఠ్యపుస్తకాలలో చదవడం ఈ నుడికారానికి నేపథ్యం. మన విద్యాలయాల్లో ఇలాంటి పలుకుబడులు లెక్కలేనన్ని.

రెవెన్యూ వ్యవహారాలలో ఎక్కువగా వినబడే ఉర్దూ, పారసీ భాషల పదాలు. దీనికి కారణం బహుశా మహమ్మదీయ రాజుల పరిపాలనలు కావచ్చు. ప్రామిసరీనోటు రాయడానికి ఉపయోగించే భాష ప్రత్యేకంగా ఉంటుంది. డబ్బు చెల్లించినపుడు “… గాన, ముట్టినది” అని ‘రసీదు’ రాసివ్వడం రెవెన్యూ నుడికారం.

కాలంతోబాటుగా పుట్టి, కాలంతోబాటే మాసిపోగల నుడులకు ఒక ఉదాహరణ ‘గాంధీలెక్కల్లో కలిపెయ్యడం’ — గాంధీ ప్రభావం తగ్గుతున్నకొద్దీ, ఈ నుడి వాడుక తగ్గుతోంది.

ఇంగ్లీషు మాట్లాడినట్లుగా తెలుగు మాట్లాడటం. ఎంత కాదనుకున్నా, మన తెలుగు టీవీ ప్రయోక్తలదీ ఒక నుడికారమే. బయట మామూలుగా మాట్లాడేవారు, కెమెరా ముందుకు రాగానే, వారు మాట్లాడే పద్ధతి మారిపోతుంది (కారణాలు, అవసరాలు ఏవైనా).

మన సామెతలన్నీ నుడికారంలో భాగాలే.
****************************

సంధులు, సమాసాలద్వారా ఒకటికన్నా ఎక్కువపదాలను కలిపి ఒక కొత్త పదాన్ని తయారుచేయగలగడం తెలుగులోని ఒక భాషావిశేషం. ఒక పదానికి ఒకటికన్నా ఎక్కువ అర్థాలున్న పదాలతో ఇలా ఏర్పడిన కొత్తపదాల్లోని కొన్ని చమత్కారాలు:
ఆలమంద అంటే ఆవుల మంద అని అర్థం. పెళ్లాల మంద కాదు.
ఆలవాలము – ‘ఆలవాలము’ అంటే ‘పాదు’ అని అర్థం. మొదళ్ల చుట్టూ నేల కుళ్లగింపబడి, నీళ్లు నిలిచి, మొక్కలు చురుకుగా పెరగడానికి అనువైన పరిస్థితి పాదులో ఉంటుంది. రాజమహేంద్రవరాన్ని (రాజమండ్రిని) వర్ణిస్తూ ‘కవిసార్వభౌములకిది ఆలవాలము’ అన్నారు. అలా కాకుండా ‘ఆలమంద’ నుండి ఆవులయొక్క అని గ్రహిస్తే, వాలము అంటే తోక గనక, ఆవులతోక. పక్షులు ఆవులపై వాలి వాటిని బాధించే పిడుదులను, వాటిపైవాలే ఈగలను తింటాయి, ఆ ఈగల్లాగా పక్షులలాగా ‘ఆవులపై మేము వాలము’ అని ఇంకో అర్థం కూడా తీయొచ్చు. తెలుగులో ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఎన్నెన్నో.
****************************

గతంలో నుడికారంపై నేను రాసిన వ్యాసానికి పూర్ణత్వాన్నిచ్చే ప్రయత్నంగా నాతో ఈ వ్యాసాన్ని రాయించిన (సాలభంజికల)నాగరాజుగారికి కృతజ్ఞతాభివందనాలతో … రానారె.


~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

15 Responses to నుడికారము – మరికొన్ని కోణాలు

  1. t.sujatha says:

    చాలా బాగుంది

  2. t.sujatha says:

    ఇలాంటి మంచి వ్యాసము చదివి చాలా రోజులైంది.

  3. నుడికారం గురించిన రానారెగారి వ్యాసాలకు స్పందన
    రానారెగారి రెండు మంచి వ్యాసాలూ ఒకేసారిగా ఇప్పుడే చదివాను. ఆయన వాటిలో ఎన్నో ముఖ్య విషయాలను చక్కగా వివరించడం ఒక విశేషం; ఈ మధ్య కాలంలో నా మనసులో మెదులుతున్న కొన్ని భావాలే వీటిలో కనిపించి నన్ను ఆశ్చర్యపరచడం మరొక విశేషం.

    టీవీ ప్రకటనల తెలుగు విషయంలో రానారె రాసినదాని గురించి బొంబాయిలో డబ్బింగ్ పని చేసినవాడిగా నాకు కొంత అనుభవం ఉంది. అవన్నీ ఎక్కువగా బొంబాయిలో తయారవుతాయనేది అందరికీ తెలిసినదే. తెలుగులో మాట్లాడటానికీ అనువాదానికీ కూడా స్థానికులనే నియమిస్తారు. అక్కడి ప్రొడ్యూసర్లు పెట్టే ‘హింస’కూ, వింత ఆంక్షలకూ తెలుగు రచయితలు లోబడడం ఒక ఎత్తయితే వారికున్న మిడిమిడి తెలుగు పరిజ్ఞానం మరొక ఎత్తు. (‘తొక్క ఒలిచిన ఉల్లాసం’ అనే ఉదాహరణను మా స్నేహితుడొకడు గుర్తు చేసుకునిమరీ నవ్వేవాడు. Unpeel the joy అన్నదానికి తర్జుమా అనుకుంటాను). చాలా ఏళ్ళ కిందట ఒక తెలుగాయన హిందీ చందమామకు రాసేవాడు. ఆయన పెరిగినదంతా ఉత్తరాదిలోనే కనక తెలుగు నుడికారంతో అప్పుడప్పుడూ ఇబ్బందులు కలిగేవి. ‘మండిపడ్డాడు’ అనేదానికి ఆయనొకసారి ‘జల్ గయా’ అని అనువాదం చెయ్యబోయాడట.

    రానారె చెప్పిన అనేక ముఖ్యవిషయాల్లో నుడికారానికుండే ప్రాంతీయ స్వభావం ఒకటి. మా కర్నూలు మిత్రుడొకాయన ఉపయోగించే మాటల అర్థాలను అడిగి తెలుసుకుని మరీ ఆనందించేవాణ్ణి. విశాఖలో ‘నువ్వేం ఆకాశం నుంచి ఊడిపడ్డావా?’ అనే అర్థంలో ‘నువ్వేం దేవుడి కొడుకోయ్?’ అంటారు.
    ఇవికాక ఈ మధ్య నేను కొనుక్కున్న తెలుగు పదకోశాల్లో (సరిగ్గా రానారె చెప్పినట్టుగా) మత్స్యకార తదితర పరిశ్రమలకు సంబంధించిన అనేక తెలుగు మాటలని చూసినప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు రేగాయి. ఆ మాటలేవీ మనకిప్పుడు తెలియవు. ఆ పనిముట్లూ, ఆ జీవిత విధానమూ కూడా మనకు తెలియనివి. ఒక రకమైన జీవనశైలి కనుమరుగవుతున్నప్పుడు దానికి సంబంధించిన పదసంపద కూడా మాయమవక తప్పదేమో. దీన్ని గురించి కొంత ఆందోళన కలిగినప్పటికీ నిస్సహాయంగా కూడా అనిపిస్తుంది. అయితే ఇందులో కొంత వర్గ, కుల స్వభావం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతకాలంలో కనబడనివే అయినప్పటికీ జాలరి తదితర వృత్తుల్లోని మాటలు మాయమైనంత త్వరగానూ, సులువుగానూ ఛత్రచామరాలూ, వంధి మాగధులూ వగైరా విషయాల పరిజ్ఞానం కనుమరుగవదు. పౌరాణిక సినిమాల ద్వారానో, ఇతర మార్గాల్లోనో ఇప్పటి కాలానికి ఏ మాత్రమూ సంబంధించని అటువంటి కొన్ని మాటలు మాత్రం కాస్త నిలిచే ఉన్నాయనిపిస్తుంది.

    నుడికారం అనేది నిత్యజీవితంలో నుంచే పుట్టుకొస్తుందనేది తెలిసినదే. ఇందులో పల్లెల్లో ఉపయోగించేది విలువైనదిగా, ఎక్కువ వాస్తవికంగా అనిపిస్తుంది కాని ఇతర సందర్భాలూ ఉన్నాయి. రానారె చెప్పినట్టుగా బ్రాహ్మణ పరిభాష ఒకటుంది. ‘వైదీకుల తిట్లూ, శాపనార్థాలూ’ అనే ఒక మంచి వ్యాసం జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి రాశారు. దాన్ని నేను 45 ఏళ్ళ నాటి ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచికలో చదివాను. ఆధునికుల నుడికారమూ (ముఖ్యంగా స్కూలు, కాలేజీల్లో పుట్టుకొచ్చేది) చూస్తాం. ‘అంత సీన్ లేదు ‘ వగైరాలన్నీ ఈనాటి పలుకుబళ్ళు. అంతకు ముందు ‘అయిసైపోయాడు ‘ మొదలైనవి వినేవాళ్ళం. ముళ్ళపూడి రాసిన ‘ప్రెవేటు చెప్పడం’ స్థానే ఆ తరవాత ‘క్లాసు తీసుకోవడం’ వచ్చింది. ఇలా ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి. వీటిలో చాలామటుకు పాత సాహిత్యంలో నిలిచిపోతాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి తదితరుల కథలు ఉదాహరణలు. ప్రస్తుతం తెలుగులో రాస్తున్నవారు నుడికారాన్ని ఎంతగా వాడితే అది అన్నాళ్ళు నిలిచి ఉంటుంది.

    నా లెక్కన ఏ రకమైన తెలుగు మాటలూ, నుడికారాలూ మనకు దూరం కారాదు. కనీసం నిఘంటువుల్లోనైనా వాటిని మనం కాపాడుకోవాలి. నుడికారం అనేది కథల్లోనూ, వ్యాసాల్లోనూ కొనసాగాలి. అవేమిటో తెలియని కొత్తతరంవారు ‘ఏమిటి దీనర్థం?’ అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అచ్చగా రోజువారీ ఉపయోగానికే పరిమితం అయితే భాషకు సాంస్కృతిక వారసత్వమూ, కంటిన్యూయిటీ లేకుండా పోతుంది. అమెరికన్లలాగా రోజువారీ పనుల కోసం ఏ యాభై మాటలతోనో పని గడుపుకునే స్థితికొస్తాం.
    ఇదొక చిన్న వ్యాసమే అయింది కాని ఇది కేవలం రానారె రచనలకు స్పందనే. దీన్ని ‘సీరియస్‌గా తీసుకోకపోయినా’ ‘పుట్టి మునిగిపోదు’!! (సీరియస్‌గా తీసుకోవడానికి తెలుగులో ఏమనాలి? ఇంగ్లీషువాళ్ళు రాకముందు మనవాళ్ళు దేన్నీ ‘గరిమ గలిగినదిగా పరిగణించలేదా’?)
    – రో.ప్ర.

  4. ఏ విధంగానయితే ఏం ? ఇంకో చక్కని వ్యాసం నీ నుండి. భేష్…
    అన్నట్టు పారసీ నా పార్శీ నా సరయినది ?

  5. నుడికారం మీద ఇంకో చక్కని వ్యాసం అందించారు. అసలు నుడికారం మీద రాసే కొద్దీ కొత్త కొత్త విషయాలు తడుతూ ఉంటాయేమో.

  6. vrdarla says:

    రానారె రాసిన ‘నుడికారము – మరికొన్ని కోణాలు’మంచి వ్యాసం.ఇంకా కొనసాగిస్తే బాగుంటుంది. ఈ వ్యాసం నచ్చిన వారికి మరింత సమాచారం కోసం తిరుమల రామచంద్ర,తాపీధర్మారావు గార్లవ్యాసాలు కూడా మరింత ఆనందాన్ని కలిగిస్తాయి.

  7. radhika says:

    వ్యాసం అప్పుడే అయిపోయిందా అనిపించింది.రానారే రాసిన వ్యాసానికి రోహిణీ ప్రసాద్ గారి కామెంటు పొడిగింపు లా వుంది.ఆ కామెంటు తో వ్యాసానికి సంపూర్ణత్వం వచ్చినట్టుంది.

  8. రాధిక, సుజాతగార్లకు: ధన్యవాదాలు.

    రోహిణీప్రసాద్‌గారికి: మీరన్నట్లు జీవన శైలితో పాటు పదాల జననమరణాల విషయంలో బాధ అనిపించినా అది సహజ పరిణామం కనుక నిస్సహాయంగా అనిపించినా ఏమీ చేయలేం. మన తెలుగులోకి ఆంగ్లం ప్రవేశించడం కూడా మన జీవనశైలిలో వస్తున్న మార్పులవలనే కదా! బ్రాహ్మణ పరిభాషలాగా ఈ వ్యాసంలో ప్రస్తావించని మరో పరిభాష క్రైస్తవమత బోధనల్లోనిది.

    ప్రవీణ్: థాంక్యూ. తెలుగులోకి వచ్చేటప్పటికి పారశీ, పార్శీ రెండూ సరైనవే అవుతాయనుకొంటాను. కూర్చుండ మాయింట కురిచీలు లేవు … అన్నాడుకదా కరుణశ్రీ! కుర్చీ … కుర్సీ అనేది కూడా పార్శీ పదమేమో!? నీ వ్యాఖ్యలు ఇచ్చిన ప్రోత్సాహంతో, “తొక్క ఒలిచిన ఉత్సాహం”తో మరికొన్ని వ్యాసాలు రాస్తాను 🙂

    సిరిసిరిమువ్వగారికి: ఈ వ్యాసం ముగించేటప్పటికి నాకూ అలాగే అనుపించింది. రాసేకొద్దీ ఉంటాయి.

    దార్లగారికి: మీరు కోరినట్లుగా ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఈ విషయమై మీ సహాయం అర్థించబోతున్నాను. ముందస్తు కృతజ్ఞతలు. 🙂

  9. Ravi says:

    Namaskaaramandi,

    Atyadhbhutamgaa vundi andi Raanaare gaaru. Nenu kostaa jillaa ki chendina vaanni. nijamgaa cheptunna, raayalaseema vaallu ante teluguni anta baga maatladaledremo anukune vaanni.(cinemaala prabhavamo emo teleedu) Kaanee mee vyaasam chadivaaka, nenu alaa anukovatam tappane nirnayaaniki vachchesaanu. mee paata vyaasaaru, blaagulu veelainapudu tappakundaa chaduvutaanu. baaga raastunnaru. manchidi. Telugu lo blaagula punyama ani eeroju manchi manchi vishayaalu telisaai. Tvaralo nenu kooda blaagulu raayataaniki prayatnistaanu, mee andari spoorthi tho…

    dhanyavaadaalu,
    Ravindranath Chowdary Y

  10. చాలా బాగా వ్రాసారండి. అసలు మీ వ్యాసం చదివి తెలుగు నుడికారానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. మీ నుండి ఇలాంటి మరెన్నో వ్యాసాలను ఆశిస్తూ…

  11. రానారె ఎవరో తెలియదు. తెలుసుకోవలసిన పని అంతకంటే లేదు.

    రానారె వ్యాసాలు / బ్లాగులు చదివితే చాలు.

    ఆ మధ్య తోటి బ్లాగర్లు కొంతమంది – బ్లాగులలో స్పందనలు – వాఖ్యలద్వారా కనబడటం లేదు అని అనుకున్నారు.

    బ్లాగులో వాఖ్య కనబడితేనే దానికి రో.ప్ర గారు అన్నట్టు “గరిమ గలిగనదిగా మరిగణించడబడడం” – దురద్రుష్టకరం.

    వాఖ్య మీకు కనబడినా కనబడకపోయినా, మీ బ్లాగులు చదువుతునే ఉంటా..రు.:)

    మంచివి, బాగున్నవి ఎక్కడున్నా వెతుక్కూంటూ ఉంటారు!
    ఇప్పుడే గమనించాను. ఇది “పొద్దు”లో దని.
    ఇది బ్లాగు అని అనుకున్నాను. అందుకని పై వాఖ్య!
    ఇక్కడికి లంకె ద్వారా చేరాను.

  12. “స్కడ్ వేసాడ్రా!” మా వైద్య కళాశాలలో విరివిగా వాడబడ్డ ఓ నుడికారం:)
    పుట్టుపూర్వోత్తరాలు: క్రీ.శ.1991 (ఇప్పటికీ నిలిచే ఉంది!)

  13. మదరాసు యాసలో చెప్పాలంటే, “రానారే!నిండా బాగ రాస్తివిబా”

  14. రవిగారు, మీ వ్యాఖ్య చాలా సంతోషం కలిగించింది. మీరుమార్చుకున్న అభిప్రాయాన్ని గురించి ఒక్క మాట – రాయలేలిన సీమ కదండీ. అష్ట దిగ్గజాల్లో కొన్ని ఇక్కడివే మరి.

    శ్రీనివాస్‌గారూ, మీకు నెనర్లు. మీకు తెలిసినవి కూడా ఉంటే అప్పుడప్పుడూ సందర్భోచితంగా ఉపయోగిస్తూ ఉండండి. వాణ్యేకం సమలంకరోతి అన్నారు కదా!

    నెటిజనమహాశయా, మీరు నా బాధను సరిగ్గా అర్థం చేసుకున్నారు. తన కోడిపుంజు కూతపెట్టకపోతే ఆ పల్లెకే తెల్లవారదనుకొనే ముసలమ్మలాగా, ఇక్కడ కామెంట్లు కనబడపోతే పొద్దుకు పాఠకులు తగ్గారేమో అనుకున్నాను. మీ వ్యాఖ్య సంతోషం కలిగించింది.

    డాక్టర్‌సాబ్, అదొక్కటేనా, వైద్య కళాశాలలో ఇంకెన్నో పుట్టి ఉంటాయి, మీరు కాస్త తీరిగ్గా ఆలోచిస్తే ఒక టపా వేయవచ్చు. ఔనంటారా?

    నారాయణరావుగారూ, రొంబ నండ్రి. వణక్కం.

  15. Can I just say what a relief to find someone who
    genuinely knows what they are discussing on the
    web. You definitely understand how to bring a problem to light and make
    it important. More and more people should look at this and understand
    this side of the story. I was surprised that you’re not more popular since you most certainly have the gift.

Comments are closed.