నవతరంగం

వెంకట్ సిద్దారెడ్డి
వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.

————–

తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!

అప్పుడప్పుడూ ఆవేశం ఆపుకోలేని అనీష్ లాంటి వాళ్ళు తెలుగు సినిమాని “Shame! Shame! Puppy Shame!” చేద్దామనుకున్నా “ఓ, పెద్ద దిగొచ్చాడండి. ఈ మాత్రం విషయం మనకు తెలియనట్టు. చూసీ చూడనట్టు మెలగుకోవాలి. మనదేం పోయింది. వాళ్ళ డబ్బులుపెట్టి సినిమాలు తీసేది మన ఆనందం కోసమేగా! పాపం లేటు వయసులో కూడా కుర్రాళ్ళలా నటించడానికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఢిల్లీ, బొంబాయిలనుండి వచ్చి పాపం ఇక్కడ బట్టలిప్పి ఎగురుతున్న ఆడ లేడీస్ చేసే సర్వీస్ అంతా ఇంతానా? ఎవరికోసం? ఇదంతా ఎవరికోసం? మన కోసం కాదేంటి? అయినా అంతంత పెద్దోళ్ళనలా దిగజార్చడం ఎంత మాత్రం సబబు కాదు. ఈ రోజు వాళ్ళనలా తీసిపారేస్తే రేపు మనకు రాజకీయనాయకులెక్కడ దొరుకుతారు? నేటి సినిమా స్టారే కదా రేపటి రాజకీయ నాయకుడు. అర్థం చేసుకోవాలి.” అని అతని ఆవేశాన్ని చల్లార్చేయడం జరుగుతుంది.

నిజంగానే మన తెలుగు సినిమాది దౌర్భాగ్య స్థితి. గత 20 ఏళ్ళలో మన తెలుగు చిత్ర పరిశ్రమనుంచి ఎన్ని మంచి సినిమాలు వెలువడ్డాయి అంటే, కనీసం ఇరవై మంచి సినిమాల (అంటే సంవత్సరానికొకటి) పేర్లయినా గుర్తుకు రాని అభాగ్య స్థితి మనది. తెలుగులో అసలే మంచి సినిమాలు లేవని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు.

సంవత్సరానికి షుమారు 200కు పైగా తెలుగు సినిమాలు నిర్మితమవుతున్నప్పటికీ అందులో కనీసం ఒక్క శాతమయినా మంచి సినిమాలుగా గుర్తించలేని దుస్థితి మనది. కానీ అక్కడో ఇక్కడో అప్పుడప్పుడూ కొంతమంది దర్శకులు ఎంతో కొంత నవ్యతను తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకందివ్వాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. 1980 కి ముందు వచ్చిన మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, సాక్షి, లాంటి ఎన్నో సినిమాలు తెలుగు సినిమాను కాసేపు ప్రకాశింపజేసినప్పటికీ అప్పటి సినిమాలను మారుతున్న సమాజం దృష్ట్యా ప్రామాణికాలుగా తీసుకోవడం కొంచెం కష్టమే! 1980 ల తర్వాత విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి వారు తమ తమ పరిధుల మేరకు తమ కంటూ ఒక శైలి, తమ సినిమాలకొక భాష, ఆ భాషకొక వ్యాకరణం సృష్టించుకున్నారు. కానీ అవన్నీ పాత మధురాలు. గత కాలపు స్మృతులు. జంధ్యాల అస్తమయంతో ఆరోగ్యకరమైన నవ్వులూ మాయమయ్యాయి. ఇప్పుడంతా వెకిలి హాస్యం. రెండర్థాల బూతు ప్రహసనం. విశ్వనాధ్, బాపూలు ఇప్పటికీ సినిమాలు తీస్తున్నప్పటికీ వృధ్ధ్యాప్య ప్రభావమో ఏమో గానీ అప్పటి సృజనాత్మకత ఇప్పటి సినిమాల్లో లోపించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు తన సినిమాలతో కొత్త ప్రయత్నాలకు నాంది పలికారు. ఒక “పుష్పక విమానం”, “ఆదిత్య-369”, “విచిత్ర సహోదరులు” లాంటి ఎన్నో సినిమాల ద్వారా కమర్షియల్ సినిమాల్లోనూ నవ్యతకు అవకాశం వుందని నిరూపించారు. మనకీ ఉన్నాడో నవ సినిమా నిర్మాత అని గర్వంగా చెప్పుకునేలా సినిమాలు తీసిన వంశీ గత కొంత కాలంగా (డిటెక్టివ్ నారద తర్వాత) formలో లేరన్నది నిజం. ఆ మధ్యలో “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను పునరుజ్జీవనం చేసే ఛాయలు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అది నిజం కాదని నిరూపించాయి.

1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” సినిమాతో తెలుగు సినిమా పునాదులు కదిలి నవ శకానికి నాంది పలికినప్పటికీ ఆ ట్రెండుని కొనసాగించే సత్తా కలిగిన దర్శకులు ఇప్పటికీ మనకి కరువయ్యారు కనకనే మన సినిమాలు ఇప్పటికీ పాత ధోరణిలో సాగిపోతున్నాయి. తెలుగు సినిమాలో కొత్త పోకడలకు, సాంకేతిక నైపుణ్యానికి నాంది పలికిన వర్మ, సినిమానో యజ్ఞంగా భావించి నవయువ దర్శకులకు స్ఫూర్తి కలిగిస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. కానీ కాలక్రమంలో సినిమాను కళాత్మక దృష్టితో కాకుండా కేవలం వ్యాపారంగా భావించి కుప్పలు తెప్పలుగా సినిమాలు తీయడంతో అతని ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇప్పుడు నామమాత్రమయ్యాయన్నది నిజం. వర్మ మొదలు పెట్టిన యజ్ఞాన్ని కొన్ని రోజులు కృష్ణ వంశీ కొనసాగించినప్పటికీ ఆయన సినిమాలు ఇప్పుడు కమర్షియల్ వెల్లువలో కొట్టుకుపోతున్న కాగితం పడవలు మాత్రమే!

ఇక 21వ శతాబ్దపు మొదటి రోజుల్లో నాగేష్ కూకునూర్ తన “హైదరాబాద్ బ్లూస్” సినిమా ద్వారా కొత్త ప్రయోగం చేసారు. సినిమా అనగానే కోట్లకొద్దీ నిర్మాణవ్యయం, పేరుపొందిన నటీనటులు, ఫారిన్లో చిత్రీకరించిన పాటలు, సినిమాకు సంబంధం లేని కామెడీ ట్రాకులు అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వల్ప బడ్జెట్లో మంచి సినిమా తీసారు. కానీ తన సినిమాకు ప్రేక్షకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినా అక్కడక్కడా వున్న రస హృదయులు ఆ సినిమాను ఆదరించి చివరకు విజయాన్ని చేకూర్చారు. ఆ తర్వాత నాగేష్ చాలా సినిమాలు తీసినప్పటికీ తన మొదటి సినిమా “హైదరాబాద్ బ్లూస్” లోని అపూర్వతను మళ్ళీ సృష్టించలేకపోయరు. ఈ మధ్య కాలంలో అతను తీసిన “ఇక్బాల్”, “దోర్” సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పటికీ ఈ సినిమాలు గొప్ప సినిమాలని అంగీకరించడం కొంచెం కష్టమే! వారం వారం బాలీవుడ్ సినిమా పరిశ్రమనుంచి వెలువడుతున్న మసాల సినిమాలకంటే ఈ సినిమాలు వేరుగా ఉండడమే కాకుండా పెరిగిపోతున్న మల్టిప్లెక్స్ సాంప్రదాయానికి ఈ సినిమాల విజయమే సాక్ష్యం.

2002లో నీలకంఠ “షో” సినిమా ద్వారా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. కేవలం ఇద్దరి పాత్రధారులతో మంచి కథ, కథనాలతో నడీచే “షో” సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందకపోయినప్పటికీ నీలకంఠకు జాతీయ స్థాయిలో అవార్డును తెచ్చిపెట్టాయి. కానీ “షో” తర్వాత నీలకంఠ దర్శకత్వం వహించిన సినిమాల్లో కేవలం “మిస్సమ్మ” ఒక్కటే ప్రేక్షకాదరణ పొందింది. కానీ ఇంటెలిజెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందివ్వాలన్న తపన మాత్రం నీలకంఠలో బాగా కనిపిస్తుంది.

“హైదరాబాద్ బ్లూస్” చిత్ర విజయం స్ఫూర్తితో శేఖర్ కమ్ముల “డాలర్ డ్రీమ్స్” చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందినప్పటికీ, సినిమా నిర్మాతగా మాత్రం చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ళకు “ఆనంద్” సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఇండిపెండెంట్ సినిమాకు నాంది పలికారు. నిజానికి “ఆనంద్” సినిమా గొప్ప సినిమా కాకపోయినప్పటికీ యాక్షన్, వయొలెన్స్ మరియు ప్రేమ చిత్రాలతో విసిగి వేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకు నిజజీవితానికి దగ్గరగా సరళమైన రీతిలో ఆర్భాటాలు, హంగులు, హడావుడులకు దూరంగా మంచి సంగీతంతో కొత్తదనాన్ని అందించడంలో సఫలం కాగలిగారు. “ఆనంద్” తర్వాత శేఖర్ తీసిన “గోదావరి” సినిమాలో పాత్రల మనస్తత్వాన్ని అవగాహన చేయడం వరకూ బాగానే ఉన్నప్పటికీ సినిమాలో ఏదో లోపం కనిపిస్తుంది. అందుకేనేమో “ఆనంద్” లాగ ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. అంతమాత్రాన గోదావరి సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైందని చెప్పలేము. శేఖర్ కమ్ముల సినిమాలకు లభిస్తున్న ఆదరణకు ముఖ్య కారణం చదువుకున్న యువతీ యువకులు అర్థవంతమైన సినిమాకై వేచిచూడడమే అన్నది సత్యం.

“ఆనంద్” సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కేవలం ఐదు లక్షల వ్యయంతో షుమారు రెండు గంటల నిడివి కలిగిన సినిమాను తీసి డిజిటల్ సినిమాకు తెలుగులో పునాదులు వేశారు. కాకపోతే పాత రోజుల్లోని మూఢనమ్మకాల ఆధారంగా ఈయన రూపొందించిన సినిమా కేవలం అవార్డులు మాత్రమే సాధించగలిగింది కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా చేరలేదనడంలో సందేహం లేదు. అందుకు కారణం అతనెన్నుకున్న కథే అని చాలా మంది అభిప్రాయం. అంతే కాకుండా ఈ సినిమాలో ఏముందని అతనికన్ని అవార్డులొచ్చాయో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఒకప్పటి మన సాంప్రదాయాలను తెరకెక్కించడం మంచిదే కానీ అతనికిచ్చిన పదకొండు అవార్డులు అతనికే దక్కాయంటే అందులో అతని ప్రతిభతోబాటు, మంచి సినిమాలు రూపొందించే దర్శకులు కూడా కరువయ్యారన్న నిజం కూడా నిర్ధారణవుతుంది. అతని రెండో సినిమా అయిన “మాయా బజార్” రొటీన్ కి భిన్నంగా ఉండేలా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం అపజయం పొందిందనే చెప్పాలి. చాలా రోజులుగా అతను పని చేస్తున్న “ఏకాంత గీతం” సినిమా రూపొందాక గానీ ఈ దర్శకుని సత్తా ఏమిటో అంచనా వేయలేము.

వీరందరితోపాటు “ఐతే” సినిమా తీసిన చంద్రశేఖర్ ఏలేటి కూడా స్క్రీన్ ప్లే పరంగానూ, దర్శకత్వ పరంగానూ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. అందరూ కొత్తవాళ్ళతో మితిమీరిన వ్యయ ప్రయాసల జోలికి పోకుండా “ఐతే” ద్వారా మంచి ప్రయత్నమే చేసినప్పటికీ, ఇతని రెండో సినిమా “అనుకోకుండా ఒక రోజు”, ఆ తర్వాత వచ్చిన “ఒక్కడున్నాడు” సినిమాలు కాస్తంత విపరీత ధోరణిలో నడుస్తాయి. వెరైటీని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు కానీ ఆ వెరైటీ మరీ తెచ్చిపెట్టినట్టు ఉండకపోతే బావుంటుందన్న విషయం ఈయన గ్రహిస్తే మంచి సినిమాలు తీసే అవకాశం ఎంతో వుంది.

పైన పేర్కొన్న వాళ్ళు మాత్రమేకాకుండా “కోకిల” సినిమా తీసిన గీతాకృష్ణ, “కళ్ళు” సినిమా తీసిన MV రఘు, “దాసి” సినిమా తీసిన బి.నర్సింగరావు, “తిలాదానం” తీసిన KNT శాస్త్రి, “ఎల్లమ్మ” తీసిన మోహన్ కోడా, “వనజ” సినిమా తీసిన రజనీష్ లాంటి వారు చాలా మంది తెలుగులో మంచి సినిమాలను తీసుకొద్దామని ప్రయత్నం చేసారు. రాబోయే కాలంలో చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు సంవత్సరానికి ఒకటో అరో మాత్రమే కావడంతోనూ, ఇప్పటికీ మెజారిటీ సినిమాలు పాత ఫార్ములమీదే ఆధారపడి నిర్మితమవుతుండడంచేతనూ మన సినిమాలకొచ్చిన గడ్డురోజులు ఇప్పట్లో పోయే సూచనలేవీ కనిపించడంలేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు తమిళ, మళయాళం, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తమిళ సినిమాకి మహేంద్రన్, భారతీరాజా, బాలూ మహేంద్ర, బాలచందర్, మణిరత్నం, బాల, చేరన్, గౌతం మీనన్ లాంటి వాళ్ళు కన్సిస్టెంట్ గా మంచి సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అక్కడి దర్శకులే కాకుండా సూర్య, విక్రమ్, కమల్ హాసన్ లంటి స్టార్ ఇమేజ్ కలిగిన నటులు కూడా ఇమేజ్ చట్రం నుండి బయటకొచ్చి ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో గిరీష్ కాసరవెళ్ళి, నాగాభరణ, గిరీష్ కర్నాడ్, MS సత్యు, పుట్టణ్ణ కనగళ్, పట్టాభిరామిరెడ్డి, శంకర్ నాగ్ లాంటి దర్శకులు కమర్షియల్ సినిమాకు సమాంతరంగా తమ సినిమాలను రూపొందించడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ కూడా చూరగొన్నారు. ఇలాగే మలయాళం లో కూడా అదూర్ గోపాల కృష్ణన్, జాన్ అబ్రహాం, అరవిందన్, K R మోహనన్ లాంటి దర్శకులెందరో అర్థవంతమైన సినిమాలను రూపొందించారు. బెంగాలీ సినిమాల గురించి ఇక చెప్పనవసరం లేదు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, అపర్ణ సేన్ లాంటి ఎంతో మంది తమ సినిమాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. ప్రస్తుత హిందీ సినిమా పరిస్థితి మనకంటే ఘోరంగా ఉన్నప్పటికీ 1980 ప్రాంతాల్లో ఎంతో మంది దర్శకులు అద్భుత కళాఖండాలను మనకందించారు. శ్యాం బెనెగల్, సాయి పరాంజపే, గురు దత్, అమోల్ పాలేకర్, గౌతం ఘోష్, గోవింద్ నిహలానీ, మీరా నాయర్, కేతన్ మెహతా వంటి దర్శకులు తమ సమాంతర సినిమాలతో భారతీయ సినిమాకు మరో దృక్కోణాన్ని కల్పించారు.

హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా పరిశ్రమల్లో లాగా మన సినీ పరిశ్రమలో సమాంతర సినిమా (parallel cinema) కి అవకాశం లేనందువల్లనే తెలుగు సినిమాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోయింది. 21 వ శతాబ్దపు మొదటి దశాబ్దపు చివరి రోజుల్లో కూడా తొడ కొడితే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, కేరళలో బీభత్సం సృష్టించిన మన తెలుగు వాడి గురించి కనీసం వార్తగానైనా అందకపోవడం, గాల్లో ఎగిరే బైకులు, జీపులు, తను ప్రేమించిన అమ్మాయికోసం ప్రపంచాన్నే ఎదిరించడం లాంటి విపరీత ధోరణులు తప్ప, నవ్యతకు అవకాశం లేకుండా పోతోంది.

ప్రస్తుత తెలుగు సినిమా యొక్క దీన స్థితికి కారణాలు అనేకం. అందులో కొన్ని:

  1. హిట్టయిన సినిమా కథనే మళ్ళీ మళ్ళీ వాడుకుని కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త సినిమాలు తీయడం
  2. ప్రతిభ కలిగిన నూతన నటీనటులకు అవకాశాలు లేకపోవడం
  3. సినిమాలు వారసత్వ సంపదగా భావించి కొంతమంది ఆజమాయిషీ చేయడం
  4. సినిమా తారలను కులాల ప్రాతిపదికగా ఆరాధించడం, దైవంతో సమానంగా పూజించడం
  5. తమ స్వార్ధం కొరకు సినిమాలను వినియోగించుకోవడం
  6. నవ యువ దర్శకులు కూడా పాత పధ్ధతులనే అవలంబించడం
  7. తెలుగులో ఉన్న సాహిత్యాన్ని సినిమాలుగా మలిచే ఆలోచన లేకపోవడం
  8. దర్శక నిర్మాతల్లో కళాదృష్టి లోపించడం
  9. వసుధైక దృక్పథం కలిగిన కథలు సృష్టించలేకపోవడం
  10. వ్యాపారాత్మక ధోరణి లోనే సినిమాలను చూడడం

పైన పేర్కొన్న కారణాలన్నీ సినిమాలు తీసే వారి కోణంలో మాత్రమే. సినిమాకి తీసే వాళ్ళు ఎంత ముఖ్యమో చూసే వాళ్ళూ కూడా అంతే ముఖ్యం. ఎవరేం చెప్పినా సినిమాకి ప్రేక్షకులు అవసరం. ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తీస్తున్నామని దర్శకులు, నిర్మాతలు తమని తాము మోసం చేసుకున్నా మనకిలాంటి నాణ్యతలేని సినిమాలే దిక్కవుతున్నాయంటే తప్పు ప్రేక్షకుల్లోనూ వుంది. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూడాలి. చెత్త సినిమాలను సానుభూతి లేకుండా నిరాకరించాలి. జాతి కుల మతాలకు అతీతంగా సినిమాలను మనం ఆదరించాలి. సినిమా అంటే కేవలం చవుకబారు వినోదం కాదని మనం గుర్తించాలి. చూస్తూ చూస్తూనే బుర్రకథ, హరికథ, నాటకం, తోలుబొమ్మలాట లాంటి కళలు మన కళ్ళముందు నుండి అదృశ్యమయ్యాయి. సంగీత పరంగా మనకిప్పుడు సినిమా పాటలే దిక్కయ్యాయి. శాస్త్రీయ సంగీతం మూగబోతోంది. తెలుగు సాహిత్యపు వెలుగులు గుడ్డిదీపాల్లా నిస్తేజంగా ఉన్నాయి. చిత్రకళకు ప్రోత్సాహం లేక కుంచెలు ఎండిపోతున్నాయి. శిల్పకళ, నృత్యకళల సంగతి ఇక సరే సరి. ఇప్పుడు మనకున్న ఒకే ఒక కళ సినిమా. సినిమా అంటే 64 కళల సమ్మేళనం అంటారు. కానీ నానాటికీ క్షీణించిపోతున్న కళలతోపాటు త్వరలో సినిమా కూడా కమర్షియల్ ఒరవడిలో కొట్టుకుపోయి చివరకు మనకు మిగిలేది అర్థం పర్థం లేని గోల మాత్రమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే మన సినిమాల్లో మార్పు అవసరం.

ప్రపంచంలోని అన్ని సినిమా పరిశ్రమల్లో జరిగినట్టే మనసినిమాల్లోనూ మార్పు సంభవించాలి. ప్రపంచ దేశాల్లోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలో 1980 ప్రాంతంలో విజృంభించిన సమాంతర సినిమా లాగా మన సినిమా పరిశ్రమలో కూడా కొత్త వాయువులు వీచాలి. అందుకు ముందుగా ప్రేక్షకులు మారాలి. ఫ్రాన్స్ లో ఎగసిన new wave గురించి తెలుసుకోవాలి. సోవియట్ రష్యా లో ఐసెన్‌స్టీన్ ఎడిటింగ్ ద్వారా చేసిన ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి. ఇటలీ లోని వాస్తవికతాధార సినిమాలు మనకి ప్రేరణ కావాలి. 1995 లో, డెన్మార్క్ లో చెత్త సినిమాలు తియ్యమని ప్రతిజ్ఞ పూని Dogme అనే కొత్త సినిమాను సిద్ధాంతపరిచిన దర్శకులు మనకు ఆదర్శం కావాలి. జర్మనీ, హాంగ్‌కాంగ్, ఇరాన్, అమెరికా, ఇంగ్లాండ్, తైవాన్ లాంటి దేశాల్లో ఏర్పడిన సినీ విప్లవాల నుంచి మనమూ పాఠాలు నేర్చుకోవాలి. యదార్ధమైన తెలుగు కథలు మన సినిమాలకు ఆధారం కావాలి. అన్నింటికీ మించి, మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ కావాలి.

“ఆఫ్ట్రాల్ సినిమానే కదా ? దీనికింత చర్చలు అవసరమా? ఇష్టం లేకపోతే చూడొద్దు. It is not an obligation, I say!” అని అనుకుంటే సరిపోదు. నిజమే!తెలుగు సినిమాలు చూడమని ఎవరూ ఎవర్నీ నిర్బంధించలేరు. కానీ సినిమాల్లేకుండా ఊహించలేనంత విధంగా మన జీవితాలు సినిమాలతో ముడివడిపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకూ “ఏ సినిమా షూటింగ్ మెదలయింది, ఏ సినిమా రిలీజ్ అయ్యింది, హిట్టయిందా, ఫ్లాపయిందా? , ఏ సినిమా ఎన్ని సెంటర్లలో వంద పడింది, ఎన్ని ప్రింట్లతో రిలీజయింది, కలెక్షన్లెంత, ఫలానా హీరో సినిమాలో పాటలెలా ఉన్నాయి” లాంటి విషయాలు మన దైనందిన జీవితంలో నిత్యం చోటు చేసుకుంటూనే వుంటాయి. “లేదే? మా జీవితాల్లో సినిమాకు మించిన విషయాలెన్నో ఉన్నాయి. సినిమాలు మా జీవితాల్లో పెద్దగా ప్రభావం చూపట్లేదే” అని మీరనుకుంటే ఇంతవరకూ చదివి మీ సమయం వృధా చేసుకున్నట్లే! ఇది సినిమాల గోల. సినిమా అంటే పడి చచ్చిపోయే వారి గోల. అన్నింటికీ మించి రొటీన్ రూట్లో పయనిస్తున్న సినిమా నావకు నవతరంగపు అలజడితో కొత్త దిశను నిర్దేశించాలన్న తపన. ఈ మార్పు ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అనేది చాల పెద్ద ప్రశ్న.

వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఇది మొదటి అడుగేమో! ఇంటర్‌నెట్ విప్లవంతో జ్ఞానం విస్తరించింది. ప్రజల మధ్య కమ్యూనికేషన్ సులభతరమైంది. DVD ల ద్వారా ప్రపంచ నలుమూలల నుండి వెలువడిన సినిమాలను చూసే అవకాశం కలుగుతోంది. ఈ మధ్యనే ఇంటర్‌నెట్ తెలుగులో కూడా లభ్యమవుతుంది. మన వాళ్ళూ ప్రపంచం నలుమూలలా వ్యాపించారు. లెక్కకు మించి ఫిల్మ్ ఫెస్టివల్స్, TV చానల్స్ ఉన్నాయి. మంచి సినిమా ప్రదర్శనకు సినిమా హాళ్ళే అవసరం లేదు. మంచి సినిమా తీయాలనుకునే వాళ్ళకు హద్దులు, పరిమితులు చెరిగిపోతున్నాయి. సినీ వీరాభిమనులారా నడుం బిగించి మరో అడుగు వేయండి. ప్రయాణానికి సిధ్ధం కండి. ఈ ప్రయాణానికి గమ్యం లేదు. This is a journey more important than its destination. పదండి ముందుకు. మరో ప్రపంచం పిలుస్తోంది.

పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

About వెంకట్ సిద్ధారెడ్డి

వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

36 Responses to నవతరంగం

  1. Rohiniprasad says:

    ఇటువంటి వ్యాసం ఎవరైనా రాయకపోతారా అని ఎన్నో ఏళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్నవాళ్ళలో నేనొకణ్ణి. ఇటువంటి టాపిక్స్ గురించి ఎవరైనా రాస్తే బాగుంటుందని ఈ మధ్యనే ఈమాట పత్రికలో నేను సూచించాను. సినిమా అనేది కళలూ, సాంకేతిక విజ్ఞానమూ రెంటికీ ఎంతో ప్రాధాన్యత ఉన్న అపూర్వమైన రంగం.

    వ్యాసాలు రాయగలిగినవాళ్ళకి విషయం తెలియకపోవడంవల్లనూ, తెలిసినవాళ్ళు “కుట్ర”లో భాగస్వాములు అయినందువల్లనూ, లేదా నిర్లక్ష్య వైఖరివల్లనూ రాయటం లేదని సరిపెట్టుకోవలసి వస్తోంది. అటువంటి సందర్భంలో ఈ వ్యాసం రావడం చాలా సంతోషకరం.

    వెంకట్‌గారు నిర్మొహమాటంగానే కాక, తన వృత్తి దృష్ట్యా సాధికారికంగా కూడా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిజాలే. తెలుగు సినిమాల మీద డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న stranglehold ఎటువంటిదో అందరికీ తెలుసు. ముదురు హీరోలూ, ముతక రొమాన్సూ, బూతు హాస్యం తప్ప దేన్నీ తెలుగు ప్రేక్షకులు అర్థంచేసుకోలేనట్టి వాజమ్మలని తీసేవారి ఉద్దేశం. చూసేవాళ్ళని “క్లాస్, మాస్” అంటూ విడగొట్టేసి, ఏది ఎక్కువమందికి నచ్చితే అదే తోసేద్దాం అనే భావనతో సినిమాలు తీస్తున్నన్నాళ్ళూ మనకు మెగా హీరోలూ, బట్టలు చాలని హీరోయిన్లే మిగులుతారు. ఇరాన్ వంటి దేశాలు కూడా గొప్ప సినిమాలు తీస్తూ ఉంటే మనం మాత్రం చచ్చురకం ప్రొడ్యూసర్ల బొక్కసాలు నింపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.

    ఏనాటివో సత్యజిత్ రాయ్ సినిమాలూ, మృణాళ్ సేన్ సినిమాలూ చూసి ఆనందిస్తున్న మాకు 70లలో కనకాల దేవదాస్ తీసిన చలిచీమలు, నిజం మొదలైన సినిమాలు తాత్కాలికంగా సంతోషాన్నిచ్చాయి. కాని ఆ “అల” త్వరలోనే సమసిపోయింది. కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ బాపూ, విశ్వనాథ్, జంధ్యాల మార్కు సినిమాలు అసంతృప్తికరమే. వెంకట్ వంటివారు కొత్త రకం సినిమాలు తీసి, లేదా తీయించి, తెలుగు సినిమాలకి కొత్త దిశానిర్దేశం చేస్తే అదెంతో వాంఛనీయమైన పరిణామమే.

    ఈ వ్యాసం కొంత చర్చను లేవనెత్తుతుంది కనక సంపాదకవర్గానికి కూడా మనం అభినందనలు చెప్పాలి.

  2. Krishh Raem says:

    Great Article !!

    I gotta concur everything being said in the post !!

    well as a film buff all I can do is

    just wait for the revolution in

    telugu cinema !!

    by the way మీరు మళయాల సినిమా గురించి చెబుతూ జాన్ అబ్రహం గురించి చెప్పారు !!
    ఆంధ్ర జ్యోతిలో మొన్నే ఆయన గురించి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది !! ఆయన గురించి వినడం అదే మొదటి సారి !! మళ్ళీ మీరు ప్రస్తావించారు !!

    Thanks !!

  3. Manjula says:

    1. To Rohiniprasad: I dont know what you mean by Iran laanti Desaalallo kooda. Mee uddesam Iran desam lo Freedom of Expression ledanaa leka maredayinaa anaa? Nenu Last year San Francisco film festival oka Iraninan cinema choosanu. It was based on Orwell’s Animal Farm. If Freedom of expression is an issue they couldnt have made such film. Iran daaka enduku, Mana desam(India) lo entha freedom of expression undi edisindi?
    Moroka vishayam. Chaalaa ella kritham nenu Amol Palekar interview choosaanu. Athanu annaadu ‘Is desh me har sau kilometer me bhaasaa badal jaata hi, khaanaa badal jaata hi. Aise desh me aap kaise kah sakte hi ke ek hi cheez logon ko pasand aayegaa.’ Which is very true.

    Telugu cinemaalalo parallel cinemaa enduku peddaga popular avaledo naaku teliyadu. Kaani ee cinemaala ki entha publicity isthaaru? Chaalaa saarlu ilaati cinemaalu vasthaayane teliyadu. Vacchinaa ekkada dorkutaayo kooda teliyadu.’Grahanam’ cinema choodadaaniki nenu aa DVD gurinchi vethakani place ledu. Finally google vidoes lo choosaanu. Naaku siggu kooda vesindi, raaka raaka vacchina manchi cinemaa ki dabbulu ivvananduku.

    I think this is what all cinephiles should do. If somebody makes a good film and they want that kind of films to survive, they should make financial contributions. Doesnt have to be a huge money, even 10 additional dollars would make a lot of difference.

  4. మీరు చెప్పిన విశేషాలు బాగున్నాయి.
    మరి ఇలాంటి భావ సారూప్యత ఉన్నవారందరూ కలిసి చక్కగా ఒక మంచి సినిమా తీసి ఇలా కూడా తీయొచ్చు అని చూపిస్తే అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపగలదు జనాల మీద.

  5. Rohiniprasad says:

    Manjula,

    I mentioned Iran not from the point of view of political freedom but because our film industry started much earlier. And we are a much bigger country.

  6. radhika says:

    నిజానికి మంచి సినిమాలు తగ్గాయంటే దానికి కారణం ప్రేక్షకులమయిన మనమే.గ్రహణం లాంటి సినిమాలని డివిడిలు తెచ్చుకుని ఇంట్లో చూద్దాము అనుకుంటామే గానీ 60 రూపాయలు పెట్టి ధిఏటర్ కెళ్ళి చూడాలనుకోము.అప్పుడప్పుడు అన్నా మంచి సినిమాలు తీసేవారికి పెట్టుబడి కూడా రాక మళ్ళా ఇంకో మంచి సినిమాను తీద్దామనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఒక వేళ క్లాసు జనాలము అనుకునే మనలాంటి వాళ్ళు హాలు కెళ్ళి చూద్దాము అని ఆ సినిమా గురించి ఎదురుచూసినా ఆ సినిమాను వేయడానికి వాళ్ళకి ధియేటర్లు దొరకవు.డిస్త్రిబ్యూటర్లు ముందుకు రారు.అంతదాకా ఎందుకు దూరదర్శన్ లో ఆదివారం మధ్యాహ్నం వేసే అవార్డు సినిమాలను ఎంతమంది చూసేవాళ్ళము? అవార్డు సినిమా అంటేనే అదేదో అంటరాని సినిమాలా భావించేస్తాము.ప్రస్తుతం వనజ సినిమా పరిస్తితి ఏమిటో తెలిసిందేకదా.

  7. Manjula says:

    Rohiniprasad,

    I get your point. Thanks for clarifying it. Meeku oka qn. 70s lo meeru cheppina cinemaalu ekkadaina choodadaaiki dorukuthaaya? DVDs or youtube google. I dont mind spending some extra bucks for watching them. Naaku chalicheemalu dd lo choosina gurthu. Kaani nenu appudu chinna pillani.

    Radhika,

    I dont agree with you, when you say that people do not want to watch movies like Grahanam in theaters. There are always people who will go to theaters & watch. If it were screened in a theater here, I would’ve paid double the price for it(I’ll still do it). My issue with these arthouse film industry is that they dont not publicize properly.

  8. సిముర్గ్ says:

    వ్యాసం చాలా బాగుంది. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన సుప్రసిద్ధమైన సినిమాలన్నిటిని స్పృశించారు. బి.న్.రెడ్డిగారి మల్లీశ్వరి, బంగారుపాప తెలుగులో వచ్చిన దృశ్యకావ్యాలుగా చెప్తారు కదా? వాటిని కూడా ఒకసారి ప్రస్తావించుంటే బాగుండేది.

    సినిమాలు చూడటమే తప్ప వాటిలోని సాంకేతికాంశాలు ఏమాత్రం తెలియని మాలాటి వారికోసం వెంకట్ గారు – మంచి సినిమా అంటే ఎమిటో కొన్ని కోణాల్లో వివరంగా తెలియచేస్తే చాలా బాగుంటుంది.

    ” విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి వారు తమ తమ పరిధుల మేరకు తమ కంటూ ఒక శైలి, తమ సినిమాలకొక భాష, ఆ భాషకొక వ్యాకరణం సృష్టించుకున్నారు”

    రాబోయే వ్యాసాలలో వెంకట్ గారు – పైన ప్రస్తావించిన శైలి, భాష, వ్యాకరణం గురించి వివరంగా చెప్తారని ఆశిస్తాను.

  9. Rohiniprasad says:

    I think Mr. Kanakala Devadas should be directly contacted for his old movies. He lives in Hyderabad and his son Rajeev is quite popular these days. Mr. Devadas made Nijam movie based on Raavi Sastry’s well-known play and Mr. Gummadi Venkateswara Rao mentions it as one of his best performances ever (as the evil MP). Unfortunately this excellent movie got side-tracked by Sankarabharanam.

    I too look forward to a series of instructive articles from Mr. Venkat on film making in general with illustrative examples from Indian and world cinema.

  10. Manjula says:

    Rohiniprasad gaaru, Thanks for responding. I’ve no idea as of how to contact him. Probably got to google. It would be nice to have a film review site where people can post their review about these kinds of films.

  11. venkat says:

    అందరికీ వందనములు.
    తెలుగు సినిమాల్లో ఎంతో కొంత మార్పు తెద్దామనే ఉద్దేశంతో నేను అక్కడా(www.passionforcinema.com/author/venkat), ఇక్కడ(www.24fps.co.in) నేను రాస్తున్న వ్యాసాలను ఇప్పుడు పొద్దుకి తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన సంపాదకులకు ,నా వ్యాసం చదివి నన్ను ప్రోత్సాహిస్తూ వ్యాఖ్యలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు.

    సిముర్గ్ గారు చెప్పినట్టు మల్లీశ్వరి లాంటి సినిమాలను నేను కావాలనే ప్రస్తావించలేదు. అందుకు కారణం పాత సినిమాల మీద నాకు అంత అవగాహన లేకపోవడమే. అందుకే ఆ పాత సినిమాలను గానీ, పాత దర్శకులని గానీ నేనేమాత్రం ప్రస్తావించలేదు. వీలైనప్పుడూ చూసి ఆ పాతమధురాల గురించి ఒక వ్యాసం రాయగలను. సిముర్గ్ గారు, రొహిణి ప్రసాద్ గారు అడిగినట్టు మరో వ్యాసంలో వివిధ దర్శకుల శైలి, భాష, వ్యాకరణాల్ని తప్పకుండా వివరించగలను.

  12. వెంకట్ గారూ,
    మన సినిమా దుస్తితికి మీరు చెప్పిన పది కారణాలూ సత్యం. మరిన్ని వ్యాసాల కోసం ఎదురు చూస్తాం.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  13. పాత సినిమాల గురించి చాలా మంది జనాలు గొంతులు బొంగురు పోయేలా ఘోషించారు, ఇంకా షించుతున్నారు – మీరు హాయిగా కొత్తసినిమాల పని పట్టండి.

  14. చైతన్య says:

    Quote:
    “21 వ శతాబ్దపు మొదటి దశాబ్దపు చివరి రోజుల్లో కూడా తొడ కొడితే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, కేరళలో బీభత్సం సృష్టించిన మన తెలుగు వాడి గురించి కనీసం వార్తగానైనా అందకపోవడం, గాల్లో ఎగిరే బైకులు, జీపులు, తను ప్రేమించిన అమ్మాయికోసం ప్రపంచాన్నే ఎదిరించడం లాంటి విపరీత ధోరణులు తప్ప, నవ్యతకు అవకాశం లేకుండా పోతోంది”

    వెంకట్ గారు మీకు పైన పేర్కొన్న సన్నివేశాలు తప్పితే మిగిలిన బడా స్టారులు నటించిన సినిమాల్లోని సన్నివేశాల్లో అంత నవ్యత కనిపిస్తోందా? మీరు ఒక కులానికి చెందిన హీరోలు నటించిన సినిమాల్లోని సన్నివేశాలు ప్రస్తావించకుండా వుంటే పైన పేర్కొన్న నాలుగవ పాయింటు కనీసం మీరు పాటిస్తున్నారన్న నమ్మకం కలిగేది…

  15. venkat says:

    చైతన్య గారూ!
    మీ ఉద్దేశమేంటో నాకు చాలా బాగా అర్థమయిపోయిందోచ్! నేను రెడ్డి కావడం మూలాన, ఖమ్మ హీరోల సినిమాలను దెప్పిపొడుస్తున్నాని భలేగా చెప్పారు. నా పేరులో రెడ్డి వుండడం నా తప్పు కాదు.అంత మాత్రాన నేను ఒక కులం హీరోలనే ఖించపరిచేలాగా రాసానని మీరనుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. నేను కులమతాలకతీతమని, సినిమా నా కులం , కళ నా మతం అని మాత్రం చెప్పగలను. మన సినిమాల దుస్థితికి కారణం ఏంటో మీలాంటి వారి వాఖ్యలే సమాధానం.

  16. “గాల్లో ఎగిరే బైకులు, జీపులు, తను ప్రేమించిన అమ్మాయికోసం ప్రపంచాన్నే ఎదిరించడం లాంటి విపరీత ధోరణులు” లేకుండా ఏ బడా స్టారు నటించిన సినిమాలైనా ఉన్నాయా? చైతన్య గారికి ఈ మాటల్లో కులం ఎక్కడ కనిపించిందో నాకు అర్థం కావడం లేదు. కొడవటిగంటి కుటుంబరావుగారేనేమో ఒకచోట “ఒకే కులం వాళ్ళతో సినిమాలు తీసేవాళ్ళు ఆ సినిమాలను ఒకే కులం వాళ్ళు చూస్తే ఏమౌతారు?” అని రాశారు. (ఇవే మాటలు కాదుగానీ భావం అదే!)

  17. >> అందుకు కారణం పాత సినిమాల మీద నాకు అంత అవగాహన లేకపోవడమే…..

    వెంకట్…సినిమా కళను ఇంతగా ఇష్టపడే మీలాంటి వారు పాత తెలుగు సినిమాల మీద అవగాహన లేదు అనటం నాకు ఆశ్చర్యంగా ఉంది. అచ్చ తెలుగు సినిమా అంటేనే..1970ముందు విడుదలైనవి అని అర్థం. కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి), బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఘంటసాల బలరామయ్య, గూడవల్లి రామబ్రహ్మం వంటి పాత తరం దర్శకుల సినిమాలు చూడండి. వారు వొఠ్ఠి సాంఘికమే కాకుండా చరిత్ర, జానపదం, పౌరాణికం సినిమాలు కూడా తీశారు. మీకు నా శుభాకాంక్షలు.

  18. TLS Bhaskar says:

    Venkat: Very analytical essay. Did you forget to mention the movie made by Indrakanti Mohana Krishna, although you have talked about it.

    Grahanam.

    It is a fantastic movie. I have seen it twice. I recommend others to watch too…

  19. చైతన్య says:

    వెంకట్ గారూ,

    మీరు వ్రాసినదాన్ని ఎత్తి చూపిస్తే ప్రస్తుత సినిమా దుస్థితి కి నేనే కారణం అనేశారే. మీరు “రెడ్డి” కావటం మూలాన మీరు కమ్మ హీరొలను కించపరిచేలా రాశారని నేనెక్కడా అనలేదు…మీ కులం గురించి నేను ప్రస్తావించనేలేదు. నిజం చెప్పాలంటే మీ పేరు లొ రెడ్డి వున్న సంగతి కుడా నేను గమనించలేదు. నిష్పాక్షికం గా యే హీరో నటించిన సినిమాల్లోని సన్నివేశాలు ప్రస్తావించకుందా వ్రాస్తే బాగుండెదనే వుద్దేస్యం తో పై వ్యాఖ్య రాశాను….దయచేసి దీనికి కుడా కులం రంగు పులమకండి..నేను సినిమా కి అభిమానిని…సినిమా హీరో లకి కాదు..

    సుగాత్రి గారూ,
    “తొడ కొడితే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, కేరళలో బీభత్సం సృష్టించిన మన తెలుగు వాడి గురించి కనీసం వార్తగానైనా అందకపోవడం”
    పై వ్యాఖ్య కి వ్యాసం లోని ‘ప్రస్తుత తెలుగు సినిమా యొక్క దీన స్థితికి కారణాలు’ నాలుగో పాయింటు ని పోలుస్తూ నేను వ్యాఖ్య రాశాను.

  20. venkat says:

    చైతన్య గారు ఏమన్నా అననీ నేను మాత్రం ఒక కులపు హీరోలను ఉద్దేశించి ఈ వ్యాసం రాయలేదు. చైతన్య చేసిన వ్యాఖ్యలకు నేను కొంచెం అతిగా రియాక్ట్ అయ్యానేమో అనిపించింది. నేను గుమ్మడికాయల దొంగనేమో :-). ఏదేమైనప్పటికీ ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం.మంచి సినిమాలకొరకై శ్రమిద్దాం.

  21. venkat says:

    పాత సినిమాలు చూడలేదంటే అందుకు కారణం అవి అంత సుళువుగా దొరకకపోవడమే! రష్యాలో ఎప్పుడో వచ్చిన Battleship Potemkin ఇప్పుడు నేను చూడాలంటే గంటలో ఎక్కడో దగ్గర సంపాదించి చూడగలను.అదే ఒక మాలపిల్ల లేదా ఒక భక్త పోతన సినిమా చూడాలంటే ఆ DVD లు సంపాదించడం చాలా కష్టంగా వుంటోంది. అలా అని అసలే చూడలేదని కాదు. కానీ అవి చూసిన రోజుల్లో నాకు సినిమాలంటే కేవలం వినోదం మాత్రమే! ఇప్పుడు చూడాలంటే సులభంగా అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద కారణం. అదీకాక గత కొన్నేళ్ళుగా వేరే దేశంలో వుండడం మూలాన మరీ కష్టమైపోయింది. మీరు చెప్పినట్టు ఆ సినిమాలు చూడకుండా ఒక కంప్లీట్‌నెస్ రాదన్నది నిజం. ఎవరో ఒకరు పూనుకుని ఆ సినిమాలన్నింటిణీ మంచి క్వాలిటీ DVD లుగా తీసుకొస్తే అంత కంటే మంచికార్యముండదు. గత కొన్నేళ్ళుగా నేను పట్టభిరామి రెడ్డి గారి సంస్కార అనే కన్నడ చిత్రాన్ని చూడడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ కుదర్లేదు. కానీ ఎదో ఒక రోజు మన క్లాసిక్ తెలుగు సినిమాలన్నీ చూసి తీరతానని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను.

  22. ఇంటర్నెట్టు ఉండగా మనకు దిగులేంటండి…పాత తెలుగు సినిమాలు కావాలనుకున్నోళ్ళు eMail నాకు పడెయ్యండి..లింకు పంపుతాను.

  23. nagaraja says:

    మీ బ్లాగును పూర్తిగా చదవడానికి ఒక పుణ్యకాలాన్ని పెట్టుకుని ఎదురుచూస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన టాపిక్. చాలా బాగుంది. ఇకపోతే, శ్రీశ్రీ గారి కవిత.. పదండి ముందుకు, “పడండి” త్రోసుకు! గమనించగలరు.

  24. vanapalli Ramu says:

    hello, this is the first time to see this website.I knew about it through Eenadu sumday weekly. I will follow with you regularly
    bye

  25. Bhoopal M Reddy says:

    Really thanks to Every one who ever participate in this Discussions(Not an argument). thanks to Venkat By this Article I learn little bit more regarding telugu cinema which is helpful to me in any discussions.

    And thanks to Some of Directors like K.Viswanath,Bapu,Jandyala, Vamsi ,Krishnavamsi,K.V Reddy,A.Subbarao, Madhusushan rao, Shekhar Kammula , Nilakanta , Mohanakrishna Indraganti at least these are all put there efforts to talk about telugu cinemas.

    Thanks ALL.

  26. sateesh says:

    మంచి రైటర్ లేకుండా మంచి సినిమా తీయడం సాధ్యమౌతుందా? ప్రస్తుతం తెలుగు లో మంచి నవల ఏదైనా ఉందా?

  27. venkat says:

    sateesh,
    I totally agree with you.
    నా అభిప్రాయం కుద అదే! కానీ పాత నవలు చాల వున్నాయి. నాకెవరన్న నిర్మాత దొరికితే ముందుగా దగా పడిన తమ్ముడు, లెదా చిల్లదేవుళ్ళు నవళ్ళని సినిమా గా తీసేస్తా!

  28. Apparusu Ramakanth Rao says:

    Yes I endorse the facts mentioned by Venkat is absolutely correct.We can not blame the producers. They are just commercial people. They want 2 earn. But the Directors,Heroes with their egoistic surnames such as Megha Star,Power star,Prince,Super Star are making the cine goers fools and minting money.I do not know how such actors claim themselves serving to ART.They are selling their arts.They can not be treated as Artists, they should be treated as Proffessionals. We are insulting the basic concepts of conferring the Bharath Rathna,Padmabhusan and Padma Sree’s on these professionals when their profession is to earn money for themselves. The make us to see the movies wherein thw Heroes and Heroins are their sons,brothers,daughters and other kin.We have the weakness of going to movies just to refresh ourselves,and the so called actors are minting our weakness. Hence we can not have good films and best literary values in songs and stories unless these selfish actors and Directors are eliminated.

  29. వ్యాసం చాలా బావుంది. సినిమా గురించి కొత్తవిషయాలు తెలిసాయి. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలను కలిగి, అభిరుచి గల తోటి మిత్రులతో వాటిని అప్పుడప్పుడు పంచుకుంటుంటాను.

    “నాకెవరన్న నిర్మాత దొరికితే ముందుగా దగా పడిన తమ్ముడు, లెదా చిల్లదేవుళ్ళు నవళ్ళని సినిమా గా తీసేస్తా”
    చిల్లర దేవుళ్ళు (దాసరధి రంగాచార్య రాసిన నవల) సినిమా ఇదివరకే వచ్చింది. వివరాలు ఇక్కడ వున్నాయి. http://www.citwf.com/film61562.htm

  30. ఆదిత్య says:

    వెంకట్ గారూ, వ్యాసం చాలా బాగుంది. నిజంగానే ఎప్పటినించో చాలా మందిలో ఉన్న, అనుకుంటున్న భావాలను చక్కగా రాసారు. నేను ఎక్కువగా వినేవి -“మంచి సినిమాలు చూసే జనాలు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు మాత్రం ఎందుకు తీస్తారు?” ; “ఈ సో కాల్డ్ మాస్ మసాలా సినిమాలను జనాలు ఆదరిస్తున్నారు కాబట్టే వాళ్ళు తీస్తున్నారు.” – కొంత వరకూ జనాలు ఆదరించడం మాట నిజమే అయినా, ఇటువంటి చిత్రాలు ఎంత వరకు మన మీద రుద్దబడుతున్నాయి అని ఆలోచించుకోవాలి. సినిమాల కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నా, నాకు తెలిసిన చాలా మంది మాత్రం హాలు కి వెళ్ళి సినిమాలు చూడటం ఎప్పుడో మానేసారు.

    People just have to come out of the frame of mind that you’ll need crores of rupees to make a film, and that to get a profit on that, you’ll need to get lots of people to watch it, and that you need to make a so called ‘formula’ movie to make that possible.
    All those bada producers who have earned many profits all these years should ‘try’ to make a ‘good movie’, and try to give something valuable and meaningful to the people from whom they have got all their wealth.

  31. vijay says:

    Obligatory Dissent 🙂

    ఎవరైనా సినిమా బాగుంటేనే చూస్తారండీ. ఇది కళాత్మక విలువలున్న సినిమా, చూడు, ఆదరించు అని లాక్కువెళ్లటం కుదరని పని. కొన్ని దేశాల్లో మార్పులు సంభవించాయి, అలాగే మనలోనూ జరగాలి అని రాశారు మీరు. నేననుకోవటం ఆ దేశాలవాళ్లు కూడా పక్కదేశాల గురించి ఇలాగే అనుకుంటూ ఉంటారని. పొరుగింటి సాంబారు ఎప్పుడూ రుచే. చిన్ననాటి జ్ఞాపకాల nostalgia కి, పెద్దవాళ్ల “మా రోజుల్లో” syndrome కి ఇదొక రూపమనుకుంటా.

    నిజంగా మంచిది ఏదైనా అన్నిటినీ తన్నుకుంటూ, తోసుకుంటూ పైకొస్తుంది. మార్పులు సంభవించిన దేశాల్లో, భాషల్లో వచ్చిన సినిమాల గురించి ఎందుకు మనకు తెలీదు? అదే టైటానిక్ ని ప్రపంచం మొత్తం డబ్ చేసుకుని మరీ ఎందుకు చూశారు? మామూలు జనానికి కళలని పనిగట్టుకుని ఆదరించటం జరిగే పని కాదు. హరికథ, బుర్రకథ మాయమయ్యాయంటే ఇదే కారణం.

    సినిమాల్లో విలువల గురించి. వంశాలూ, ప్రేమలూ తప్ప గొప్ప వెరైటీ తెలుగులో లేదన్నది నిజం. కానీ అవి మనం సైలెంట్ గా చూస్తున్నంత కాలం వస్తూనే ఉంటాయి. అందులో తప్పు కూడా ఏమీ లేదు. ఆ కథలని వెక్కిరించటం డెయిలీ సీరియల్స్ ని వెక్కిరించటం లాంటిదే. అవి చూసే డెమోగ్రాఫిక్ కి కళలతో, విలువలతో సంబంధం లేదు. సినిమా బాగుండాలి అంతే. అత్యంత కఠినమైన కన్స్యూమర్స్ వాళ్లు. ఆ సీరియల్స్ చూసేవాళ్లే టైటానిక్ నీ, శంకరాభరణాన్నీ, ఐతేనీ కూడా హిట్ చేయగలరు. స్కోర్సెసీ అంతటివాడు ఒక హాంగ్ కాంగ్ సినిమాని ఇంగ్లీషులో తీసి ఆస్కార్ కొట్టాడు. రేపు మన స్టోరీలు కూడా అలాగే కావచ్చు 🙂

    సినిమాలు మారాలంటే మార్పు రావలసింది డైరెక్టర్లలోనో, జనాల్లోనో కాదు. ఆ రెండు గ్రూపులూ “మారండి” అంటే మారవు. మన డైరెక్టర్లు తీయలేరు, తీయగలిగినా తీయరు. తీయగలిగేవాళ్లని, తీసేవాళ్లని ఎలాగూ ఎవరూ ఆపలేరు. జనాలతో అసలు సమస్యే లేదు. వాళ్లు చెత్త సినిమాలను ఆడనివ్వరు (మనకి ఆడినవి కొన్ని చెత్త అనిపించొచ్చు, అది వేరే విషయం). మారాల్సింది మీడియా. చిరంజీవిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు – ఒక ఇంద్ర సినిమా పాటలో ఆర్తి అగర్వాల్ చెస్ట్ చూసి సజెస్టివ్ గా నవ్వుతారు, ఇంత వయసొచ్చి ఒక సినిమాలో అలా చేయటానికి మీకు సిగ్గు వేయలేదా అని అడగాలి. సినిమా రివ్యూలు రాసేటప్పుడు ఏమాత్రం తప్పున్నా కడిగిపారేయాలి. అమెరికా న్యూస్ పేపర్లలో సినిమాల వాళ్లు ads వేసేటప్పుడు – న్యూయార్క్ టైమ్స్ మాకు 4 స్టార్లు ఇచ్చింది, ఈ రివ్యూవర్ ఇలా కాంప్లిమెంట్ చేశారు అని గొప్పగా రాసుకుంటారు. కామెంటరీకి విలువ లేనంత కాలం, మీడియా గట్టిగా ఉండనంత కాలం మన సినిమాలు ఇలాగే ఉంటాయి.

  32. రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    నేను తీరిగ్గా చదువుదామని మొదలు పెట్టి –వర్మ మొదలు పెట్టిన యజ్ఞాన్ని కొన్ని రోజులు కృష్ణ వంశీ కొనసాగించినప్పటికీ — దగ్గరకు వచ్చే సరికి బ్రేకు నానెత్తిన ఒక మేకు పడింది.మిగిలిన భాగం ఎప్పుడు చదువుతానో?శివ సినిమా హిట్టవకపోతే కొంపలంటుకునేవి కాదు గానీ మనకు రాంగోపాల్ వర్మ అనే మంచి దర్శకుడు దొరికేవాడు.అలా జరగలేదు కాబట్టే అదే సినిమాని ఇంకా తీస్తూనె ఉన్నాడు,కొన్ని మినహాయింపులతో.ఇదేపని ఇంతకు ముందు చేసిన విజయబాపినీడు మామూలు దర్శకుడు ఎందుకయ్యడు వర్మ అంత గొప్పవాడు ఎందుకయ్యాడు.ఏదో ఒకసినిమా కొంచెం బాకప్ ఉంటే కృష్ణవంశీ బాగా తీయగలడు,నిన్నెపెళ్ళాడుతా,అంతపురం వగైరా.ఖడ్గం.శ్రీఅంజనేయం.డేంజర్,సముద్రం.రాఖీ,ఏమిటో ఇవన్నీ…ఇంతకీ వర్మ మొదలుపెట్టిన యజ్ఞం ఏమిటో ????

  33. venkat says:

    Shankar Suri (Editor)-Siva
    J.D. Chakravarthi (Actor)-Siva
    Mani Sharma (Composer)-Ratri
    Teja (Cinematographer)- Ratri
    Sanjay Chhel (Dialogues)-Rangeela
    Neeraj Vora (Dialogues)-Rangeela
    Shefali Shah (Actor)-Rangeela
    H Sridhar (Sound department) -Rangeela
    Manoj Bajpai (Actor) – Daud
    Rasool Ellore (Cinematographer) – Daud
    Bhanodaya (Editor) -Daud
    Anurag Kashyap (Writer)-Satya
    Saurabh Shukla (Writer) -Satya
    Sushant Singh (Actor)-Satya
    Sandeep Chowtha (Composer)-Satya
    Snehal Dabi (Actor)-Satya
    Mazhar Kamran (Cinematographer) -Satya
    Apurva Asrani (Editor)-Satya
    Rajpal Yadav (Actor) -Mast
    Antara Mali (Actor) -Mast
    Chandan Arora (Editor) -Mast
    Vinod Ranganathan (Writer)-Mast
    Ramesh Katkar (Writer)-Mast
    Nitin Raikwar (Lyricist) -Mast
    Jaideep Sahni (Writer) -Jungle
    Vijay Raaz (Actor) -Jungle
    Dwarak Warrier (Sound designer)-Jungle
    E. Nivas (Director) -Shool
    Rajat Mukherjee (Director)-Pyar Tune kya kiya
    Venkat R. Prasad (Cinematographer)-Pyar Tune kya kiya
    Rajnish Thakur (Writer)-Pyar Tune kya kiya
    Viveik Oberoi (Actor)-Company
    Hemant Chaturvedi (Cinematographer)-Company
    Koena Mitra (Actor) -Road
    Sudeep Chatterjee (Cinematographer)-Road
    Shimit Amin (Editor)-Bhoot
    Vishal Sinha (Cinematographer)-Bhoot
    Peeya Roy Chowdhury (Actor)-Bhoot…..
    ఇంక టైప్ చెయ్యలేను, చేతులు నొప్పెడ్తున్నాయి(ఇంకా వర్మ పరిచయం చేసిన వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ(http://passionforcinema.com/rgv-ki-aag/) చూడండి. స్టార్ సిస్టం కి వ్యతిరేకంగా దర్శకుడే సినిమాకి ప్రధానం అని నిరూపిస్తూ, ప్రతి సినిమాలో కొత్త వాళ్లని పరిచయం చేస్తూ, వర్మ చేసింది యజ్ణం కాకపోతే మరేమనాలో తెలియలేదు రాజేంద్ర గారూ. కాకపోతే ఇప్పుడాయన మారిపోయారన్న సంగతి వేరే విషయం అనుకోండి

  34. రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    అయ్యా నేను ఆయన పరిచయం చేసిన జాబితా గొప్పదే కాదనటం లేదు కానీ సినిమాల్లో వర్మ స్కూలు అనె పేరుతో వచ్చి పడుతున్న ఉత్పాతాల గురించి

  35. venkat says:

    స్కూలా నా బొందా? కెమెరా ఎక్కడ పెట్టాలో, ఎందుకు పెట్టాలో తెలియని చాలా మంది ఎక్కడో దగ్గర పెట్టి వర్మ స్కూల్ఆనడం కొన్నాళ్ళూ జరిగింది. ఇప్పుడు వర్మ కే దిక్కుతోచని పరిస్థితి. ఇంక ఆయన స్కూలు జనాలు దాదాపు వదిలేసినట్టే!

  36. rayraj says:

    బావుంది

Comments are closed.