తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం

గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది.

——————————

హల్లులలో ప్రయత్న భేదాలు

గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు.

స్పర్శాలు (stops/plosives):

గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం వల్ల ఏర్పడే ధ్వనులు స్పర్శాలు.
సంస్కృత వర్ణమాలలో క నుండి భ- వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు.

అనునాసికలు (nasals):

ఆస్య వివరం ద్వారా కాక, నాసికా వివరం ద్వారా వెలువడే ధ్వనులు అనునాసికలు. సంస్కృతంలో ఙ, ఞ, ణ, న, మ లు అనునాసికలు. [ప] ధ్వని, [మ] ధ్వని రెండూ ఓష్ఠ్యాలే అయినా, [మ] పలికేటప్పుడు గాలి ముక్కుద్వారా వెలువడుతుంది. [ప] నోటి ద్వారా పలికే స్పర్శం.

ఊష్మాలు (fricatives):

స్థానిక నిరోధం లేకుండా గాలి స్థానకరణాల గుండా ఒరుసుకొని వచ్చే ధ్వనులు ఊష్మాలు. సంస్కృతంలో శ, ష, స, హ లు ఊష్మాలు. స్పర్శాలకు, ఊష్మాలకు తేడా తెలియాలంటే తస, తస అంటూ [త], [స] ధ్వనులను వెంట వెంటనే పలికి ఆ ఉచ్చారణలో వ్యత్యాసాన్ని గమనించండి. రెండూ దంత్యాలే అయినా, [త] ధ్వని స్పర్శం [స] ధ్వని ఊష్మం.

అంతస్థాలు (approximants):

ఊష్మాల కున్నంత ఒరిపిడి లేకుండా గాలి జారిపోయే ప్రయత్నం వల్ల ఏర్పడే ధ్వనులు అంతస్థాలు. భాషలో ఇవి కొన్నిచోట్ల అచ్చులుగానూ, కొన్ని చోట్ల హల్లులుగాను ప్రవర్తిస్తాయి. సంస్కృతంలో య, ర, ల, వ లు అంతస్థాలు. అమెరికన్ ఇంగ్లీష్ లో butter అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు చివరి “ర”కారం మన “ఋ” అన్న అచ్చు ధ్వని లాగే పలుకుతారు. అలాగే, little అన్న పదంలో చివరి ల-కారం మన ఌ-కారంలాగే పలుకుతారు.

ఇవి కాక సామాన్య ప్రయత్న భేదాలు అల్పప్రాణ, మహాప్రాణాలు, శ్వాస, నాదాలు అని నాలుగు విధాలు.

అల్పప్రాణాలు (unaspirated):

మామూలుగా స్వాభావికోచ్చారణలో వదిలే గాలి “అల్పప్రాణం”.

మహాప్రాణాలు (aspirated):

మామూలు కంటే ఎక్కువ ఒత్తిడితో వెలువడిన ఊపిరి “మహాప్రాణం”. “క” అల్పప్రాణం అయితే, “ఖ” మహాప్రాణం. నోటికెదురుగా చేతిని ఉంచి “క” ధ్వనిని, “ఖ” ధ్వనిని పలికి చూసుకుంటే ఈ రెండు ప్రయత్నాల మధ్య తేడా తెలుస్తుంది.

శ్వాసాలు (voiceless):

నాద తంత్రులను కంపింపజేయకుండా వెలువడే ఊపిరిని శ్వాస అంటారు. క, చ, ట, త, ప లు శ్వాసాలు.

నాదాలు (voiced):

నాద తంత్రులను కంపింపజేస్తూ వెలువడే ఊపిరి నాదం. నాద ధ్వనులను పలికేటప్పుడు రెండు చెవులు మూసుకుంటే “గుయ్” మని వినిపిస్తుంది. గ, జ, డ, ద, బ లు నాద ధ్వనులకు ఉదాహరణలు.

అచ్చులలో భేదాలు

అచ్చులను పలికేటప్పుడు గాలిని నిరోధించే ప్రయత్న భేదాలేమీ ఉండవని ముందే చెప్పుకున్నాం కదా. అయితే నాలిక స్థానాలలో అంతరాలను బట్టి పెదవుల సహాయం ఉనికి లేములను బట్టి అచ్చులను వేర్వేరు ధ్వనులుగా ఉచ్చరిస్తాము. అచ్చులను పలకడంలో ఈ కింది లక్షణాలు ప్రధానమైన వ్యత్యాసాలకు కారణాలు:

నాలిక ఎత్తు (vowel height): వేర్వేరు అచ్చులను పలికేటప్పుడు నాలిక అంగిలి (roof of mouth) వైపు వేర్వేరు ఎత్తులలో లేచి నిలుస్తుంది. ఉదాహరణకు ఇది అన్న పదంలో ఇ-కారాన్ని పలికేటప్పుడు నాలిక అంగిలిని దాదాపు తాకేంతగా లేచి నిలుస్తుంది. అది అన్న పదంలో అ-కారాన్ని పలికినప్పుడు మాత్రం నాలిక అడుగునే ఉండిపోతుంది. అడుగునే ఉన్న స్థానాన్ని వివృతమని (open), పూర్తిగా అంగిలిని తాకేంత ఎత్తు ఉన్నప్పుడు సంవృతమని (close) సాంప్రదాయకంగా పిలుస్తారు. ఈ రెంటికి మధ్యస్థంగా ఉన్న స్థానాలను అర్ధ వివృతమని (half-open), అర్ధ సంవృతమని (half-close) అంటారు.
నాలిక వెనుకపాటు (vowel backness): పైన చెప్పిన నాలిక స్థానం ఎత్తులోనే కాక ముందు వెనుకలుగా కూడా మార వచ్చు. ఇ-కారాన్ని పలికేటప్పుడు నాలిక దంతాలకో, కఠిన తాలువుకో దగ్గరిగానూ, ఉ-కారాన్ని పలికేటప్పుడు మృదుతాలువుకి దగ్గరిగా ఉంటుందని గమనించ వచ్చు. ఆస్య వివరంలో నాలిక ముందుగా ఉన్నప్పుడు పలికే అచ్చులను అగ్రాచ్చులని (Front vowels) లేదా తాలవ్యాచ్చులని, వెనుక ఉన్నప్పుడు పలికే అచ్చులను కంఠ్యాచ్చులని (Back vowels) పిలుస్తారు.

telugu_vowels.GIF

పెదవుల సహాయం (unrounded vs. rounded):
పలికేటప్పుడు పెదవుల ఉపయోగాన్ని బట్టి అచ్చులు ఓష్ఠ్యాలు, నిరోష్ఠ్యాలని రెండు రకాలు. ఉ-కారాన్ని, ఒ-కారాన్ని పలికేటప్పుడు పెదవులను గుండ్రంగా చుట్టి పలుకుతాం. అదే అ-కారాన్ని, ఇ-కారాన్ని పలికేటప్పుడు మాత్రం పెదవుల్ని అలా గుండ్రంగా చుట్టి ఉంచం. ఇ-కారం పలికినప్పుడు నాలిక ముందుగా ఉండి పెదవులను చిరునవ్వు నవ్వినప్పుడు ఉంచినట్టుగా విశాలంగా ఉంచుతాం కాబట్టే, ఫోటో తీసుకునేటప్పుడు “cheese” అనమని చెబుతూ ఉంటారు.

తెలుగులో వర్ణ సమామ్నాయం (Phonology of Telugu)

ధ్వని (phone) – వర్ణం (phoneme)

స్థాన, కరణ, ప్రయత్న భేదాలను బట్టి, స్థాయి, స్వరోచ్చారణను బట్టి మనం వెయ్యికి పైగా విభిన్న ధ్వనులను ఉచ్చరించవచ్చు. అయితే, అన్ని భాషలలోనూ అన్ని భేదాలు ప్రధానం కాదు. ఉదాహరణకు [v] మరియు [w] ధ్వనులలో తేడా ఇంగ్లీష్ భాషలో ప్రధానం. vent, went అన్న పదాలను పలకడంలో తేడా ఇంగ్లీష్ మాతృభాష అయిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. భారతీయ భాషలు మాట్లాడే వారికి ఆ తేడా అప్రధానం. మన భాషలలో ఆ రెండు ధ్వనులలో ఏ ధ్వనిని ఉచ్చరించినా అర్థం మారదు. అంటే ప్రతి భాషలోనూ భిన్నార్థస్ఫూరకమైన ధ్వనులు నియతంగానే ఉంటాయి. ఆ ధ్వనులనే వర్ణాలు అంటారు.

తెలుగు వర్ణ నిర్మాణాన్ని.ఈ క్రింది పట్టికలలో చూపిన విధంగా సంగ్రహించవచ్చు.

అచ్చులు కంఠ్య తాలవ్య
నిరోష్ఠ్య ఓష్ఠ్య
వివృత అ, ఆ    
అర్ధ వివృత     æ
అర్ధ సంవృత   ఒ, ఓ ఎ, ఏ
సంవృత   ఉ, ఊ ఇ, ఈ

పైన చెప్పినట్టుగా, అచ్చుల ఉచ్చారణ స్థాన భేదాన్ని బట్టి కంఠ్యాచ్చులు (back vowels) అని తాలవ్యాచ్చులని (front vowels) రెండు రకాలు. అ, ఉ, ఒ లు కంఠ్యాచ్చులు. ఇ, ఎ, æలు తాలవ్యాచ్చులు. ఎ, ఒ కారాలకు సంస్కృతంలో లేని దీర్ఘ హ్రస్వ భేదం తెలుగులో కనిపిస్తుంది.

స్పర్శాలు (stops)
  శ్వాస అల్పప్రాణ శ్వాస మహాప్రాణ నాద అల్పప్రాణ నాద మహాప్రాణ అనునాసిక
కంఠ్య
తాలవ్య
మూర్ధన్య
దంత్య
ఓష్ఠ్య

.

స్పర్శాలు కాని హల్లులు
(semi-vowels and fricatives)
  అంతస్థాలు ఊష్మాలు
కంఠ్య    
తాలవ్య
మూర్ధన్య
దంత్య
ఓష్ఠ్య  
కంఠమూలీయ  

పైన చూపిన హల్లుల వర్ణ నిర్మాణం సంస్కృత వర్ణ సమామ్నాయమే అయినా, తెలుగు భాషలోని హల్లులను వర్ణించడానికి ఇది సరిపోతుంది. గత రెండు వేల సంవత్సరాలుగా సంస్కృత పోషణలో పెరిగినా, తెలుగు భాష జన్మతః ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది కాబట్టి, సంస్కృతంలో లేని ప్రత్యేక వర్ణాలు తెలుగులో ఉన్నాయి. అలాగే సంస్కృతంలో ఉన్న అల్ప-మహాప్రాణాల భేదం అచ్చ తెలుగు పదాలో దాదాపు లేదనే చెప్పాలి. అదీగాక, సంస్కృత వ్యాకర్తలు పేర్కొన్న ఉచ్చారణకు, తెలుగు ఉచ్చారణకు కొన్ని వర్ణాలలో వ్యత్యాసం ఉంది. అవన్నీ వివరించాలంటే మరో వ్యాసమే అవుతుంది కాబట్టి, తెలుగులో ప్రత్యేక వర్ణాలను క్లుప్తంగా వివరించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

తెలుగులో ప్రత్యేక వర్ణాలు

• ళ –స్థానం: మూర్ధం కరణం: మడత వేసిన నాలిక కొన. ప్రయత్నం: పార్శ్వికం. దీన్నే మూర్ధన్య అంటారు.
• ఱ- స్థానం: దంతమూలీయం కరణం: నాలిక కొన. ప్రయత్నం: అధిక కంపితం
• ೞ – మూర్ధం, కరణం: మడత వేసిన నాలిక కొన, ప్రయత్నం-అంతస్థం. తమిళ(తమిೞ అని రాయాలి) భాషలో ఇంకా వాడుతున్న ఈ వర్ణం తెలుగు శాసనాలలో 12వ శతాబ్దందాకా కనిపించేది.

æ – “పాడాడు”, “చెప్పాడు”, “చూపాడు”, “చేసాడు”, ” రాసాడు”, “చూపాడు” అన్న పదాలలో రెండవ అచ్చు ఇంగ్లీష్ భాషాపదాలైన bank,sad లలో వినిపించే æ [[Near-open front unrounded vowel]]ధ్వనియే. చారు, తాటాకు అన్న శబ్దాలలో కూడా ఈ ధ్వనిని వాడుతాము. రాయలసీమ ఉచ్చారణలో ఈ ధ్వని తరుచుగా పదాంతాలలో వినిపిస్తుంది. ఈ ధ్వనిని సూచిస్తూ రాయటానికి తెలుగులో ప్రత్యేక లిపిసంకేతం లేదు. అయితే, శాసనాలలో కనిపించే పళ్యాలు, చెల్యలు, మొదలైన పదాల ఆధారంగా ఈ ధ్వని 12 వ శతాబ్దం నుండి తెలుగులో వాడుకలోఉన్నట్టు మనకు తెలుస్తోంది. అంటే, తెలుగులో అంతర్గత ధ్వని పరిణామాలవల్లనే ఈ ధ్వని ఉత్పన్నమైయ్యింది గాని అన్య భాషాప్రభావం (ఆంగ్ల భాషాప్రభావం) వల్ల కాదని చెప్పవచ్చును.

ఉపసంహారం

గత రెండు వందల సంవత్సరాలుగా భాషాశాస్త్రం చాలా అభివృద్ధి చెందినా మిగిలిన భాషలతో పోల్చిచూస్తే తెలుగు భాష, చరిత్రలకు సంబంధించిన కృషిచాలా తక్కువేనని చెప్పాలి. భాషాశాస్త్ర దృష్టితో తెలుగుభాషపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసిన వారిలో చెప్పుకోదగ్గవారు భద్రిరాజు కృష్ణమూర్తి గారొక్కరే. ఎమెనో, బరోల పుణ్యమా అని మనకు ద్రావిడ భాషా వ్యుత్పత్తి నిఘంటువు లభ్యమౌతుంది. అయితే, ఇందులో చారిత్రాత్మకంగా ఏ పదాన్ని ఏ భాషలో ఏ అర్థంలో ఉపయోగించారన్న వివరణలు లేవు. తెలుగు భాషకు చారిత్రాత్మక నిఘంటువు నిర్మించే కృషి కూడా జరగలేదు. మన పూర్వ కవుల పదప్రయోగ కోశాలు లేవు. ఇవన్నీ భాషా పరిశోధనలకు అవసరమైన మౌలిక గ్రంథాలు. కనీసం, సామాన్య పాఠకుడికి అవసరమైన ఒక ప్రామాణికమైన సమగ్ర నిఘంటువు కూడా తెలుగు భాషకు లేకపోవడం శోచనీయం. యూనికోడ్ తో శక్తిమంతమైన తెలుగు వెబ్‌జైన్లు, బ్లాగులు, వికీపీడియా, విక్షనరీల ద్వారా ఈ వనరుల లోటును కొంత భర్తీ చెయ్యవచ్చు అనే నమ్మకం ఉన్నా, తెలుగు సాహిత్యాన్ని, భాషనీ కాపాడుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు తీరిక వేళల్లో చేసే ఈ కృషి సరిపోదు. మన భాషా, చరిత్ర, సంస్కృతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి పరిశోధనలకు వీలుకల్పించే బృహత్ ‌ప్రాజెక్టులను రూపొందించి అమలు చెయ్యాల్సిన బాధ్యత, స్థోమత తెలుగు దేశంలోని యూనివర్సిటీలదేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

కృతజ్ఞతలు

• Special thanks are due to Cindy Williams, Linguistics Coordinator SIL-Mexico for granting me permission to modify and use images from her website.
• ఈ వ్యాసానికి ఎంతగానో ఉపయోగపడ్డ “భాషాశాస్త్ర పారిభాషిక పదకోశం” పుస్తకాన్ని నాకందజేసిన పద్మ ఇంద్రగంటి గారికి
• నా వ్యాసం మొదటి ప్రతిని సమీక్షించి సూచనలు అందజేసిన రానారె గారికి
• ఈ వ్యాసం రాయమని నన్ను ప్రోత్సహించి, ఆలస్యం చేసినా మన్నించి ఓపిగ్గా ఎదురుచూసిన పొద్దు సంపాదకులకు

ఉపయుక్త గ్రంథాలు

1. భాష, సమాజము, సంస్కృతి – భద్రిరాజు కృష్ణమూర్తి
2. Dravidian languages – Bhadriraju Krishnamurti
3. Who Inspired Panini? Reconstructing the Hindu and Buddhist Counter-Claims Madhav M. Deshpande, Journal of the American Oriental Society, Vol. 117, No. 3 (Jul. – Sep., 1997), pp. 444-465
4. 1994. “Ancient Indian Phonetics.” In The Encyclopedia of Language and Linguistics, Volume 6, pp. 3053-3058. Oxford: Pergamon Press
5. Bad Grammar in Context [http://archimedes.fas.harvard.edu/mdh/bad-grammar.pdf]
6. Wikipedia: List of phonetic topics [[http://en.wikipedia.org/wiki/List_of_phonetics_topics]]

సురేశ్ కొలిచాల (ఈమాట సంపాదకులు)
This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

13 Responses to తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం

  1. vasundhara says:

    కొలిచాల సురేశ్‌గారి రెండు భాగాల వ్యాసం “వర్ణనిర్మాణం” అపూర్వం, ప్రయోజనాత్మకం. పాఠశాలల్లో పిల్లలకు తెలుగు బోధనకు, బయట ప్రపంచంలో పెద్దల అవగాహనకు ఇందులోని అంశాలు ఉపయోగపడతాయి. రచయిత శైలి, అవగాహన, జ్ఞాన పరిజ్ఞానాలు వ్యాసాల్ని మరింత అర్థవంతం చేసాయి. రచయితకు అభివందనాలు. పొద్దు కు అభినందనలు.
    వసుంధర

  2. chavakiran says:

    appuDE ayipoyinadaa anipiMcinadi.

  3. సురేశ్ గారూ,

    వ్యాసం నిజంగా అద్భుతంగా ఉంది. అయితే కొంత హ్రస్వలిపిలో రాసినట్టుగా ఉంది. చాల చోట్ల వివరణలు, విస్తరణలు అవసరమవుతాయి. మొత్తానికి చాల అవసరమైన రంగంలో మంచి కృషి చేసి దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు.

    – ఎన్ వేణుగోపాల్

  4. Rohiniprasad says:

    ఈ మంచి వ్యాసం చదువుతూంటే ఎప్పుడో నా చిన్నతనంలో మొదటిసారిగా చదివిన తిరుమల రామచంద్రగారి ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు ‘ అనే అద్భుతమైన పుస్తకం గుర్తుకొచ్చింది. ఏ భాషలోని అక్షరాలకైనా ప్రామాణిక స్వరూపం ఎలా ఉంటుందో ఇలాంటి వ్యాసాలు సులువైన పద్ధతిలో తెలియజేస్తాయి. భాషాశాస్త్రాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుంటే తప్ప ఇటువంటివాటిని గురించి సామాన్య పాఠకులెవరూ తెలుసుకునేందుకు ప్రయత్నించరు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈ రచయిత ఇటువంటి విషయం గురించి ఇంత శ్రద్ధ తీసుకుని చక్కటి వ్యాసం రాసినందుకు ఎంతో అభినందనీయుడు.

  5. భాస్కర్ says:

    ఈ వ్యాసరాజము అనేక సందేహములను తొలగించినది. ధన్యవాదములు.
    pha, fa ల మధ్య ఉచ్చారణ తేడాలను తెలియచేయ వలసినది. ఈ రెండింటిలో ఏది సరి
    అయినది? phaణి అని పలుకవలెనా, లేక faణి అని పలుకవలెనా?

  6. అందరికీ ధన్యవాదాలు. ఊహ తెలియంగల పాఠకోత్తముల అభినందనలు, ఒప్పు తప్పొరయు రసజ్ఞుల వ్యాఖ్యలు ఏ వ్యాసకర్తకైనా గిలిగింతలు పెట్టే విషయమే!

    భాస్కర్ గారు:
    fa-వర్ణం సంస్కృత తెలుగు భాషల వర్ణమాలలలో లేదు. మనం ఓనమాలు నేర్చుకొనేటప్పుడు ప, ఫ, బ, భ అంటూ ఫ-కారాన్ని అల్ప ప-కారానికి మహాప్రాణంగానే పలుకుతాం కదా!

    ఫ-, fa- ధ్వనుల ఉచ్చారణలో తేడాలు:

    ఫ (pha): ఓష్ఠ్య స్పర్శం, శ్వాసం, మహాప్రాణం (bilabial stop, voiceless, aspirated)
    fa: దంతోష్ఠ్య ఉష్మం (labiodental fricative)

    ఫ-ధ్వని రెండు పెదవులను వాడుతూ మహాప్రాణం గా పలికితే, fa-ధ్వని కింది పెదవి, పై దంతాలను ఉపయోగిస్తూ ఊష్మం (fricative) గా పలుకుతారు.

    అయితే, విద్యావంతులు కాని తెలుగు వారు ఈ రెండు ధ్వనులను సవర్ణాలుగానే (allophones) పలుకుతారు. ఫణిని faణిగానూ,
    coffeeని కాఫీ (kaaphii) గానూ పలకడం సర్వసామాన్యం.

    కన్నడ, హిందీ భాషలలో ఈ ధ్వనిని సూచించడానికి ప్రత్యేక లిపిసంకేతం ఉంది. फणी (ఫణీ) काफ़ी (kaafii) అంటూ fa-ధ్వనిని సూచిస్తూ ఫ-సంకేతానికి కింద దేవనాగరిలో ఒక చుక్క, కన్నడ లిపిలో రెండు చుక్కలు పెడతారు.

    బేఫికర్,
    సురేశ్.

  7. “సురేశ్”గారి వ్యాసం మొదటిభాగం చదివిన పాఠకుల్లో ఎవరూ “సురేష్” ప్రొడక్షన్స్ గురించి రచయితను మరేమీ అడగలేదు. అరుదైన వ్యాసం. ఏమిటి ఈ వ్యాసం వల్ల ఉపయోగం అంటే, నాకు తోచిన ఒక ఉదాహరణ చెబుతాను:

    పెళ్లి – అనే సినిమాలో “జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా …” అంటూ బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచి పాటొకటుంది.
    కబడ్డీ కబడ్డీ – అనే సినిమాలో “జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి …” అంటూ హరిహరన్ గానంచేసిన శ్రావ్యమైన పాటొకటుంది.
    బాలు శ్రీపతిపండితారాధ్యులవారి బాలుడు గనక, [జా]బిలమ్మ, [జా]జిపూలు ఎలా పలకాలో అలా పలికాడు. పాట హృద్యంగా [జా]లువారింది.
    హరిహరన్ ఆంధ్రుడు కాడుగనక, [జ్యా]బిల్లి, [చ్యూ]డాలి అని వినిపించేలా పలికాడు. దాంతో పాట హృద్యంగానే అయినా [జ్యా]లువారింది.
    ఇద్దరూ మహాగాయకులే. కానీ తెలుగులో ఏదైనా మంచి జావళీని ఒకరు పాడితే [జా]వళీ, మరొకరు పాడితే [జ్యా]వళీ.
    అలాగే చాప, జాతర లాంటివి మరికొన్ని పదాలున్నాయి. వీటికొక అక్షరమే ఉండేది. నేను పుట్టిన కొన్నాళ్లకు అది చచ్చిపోయింది. దానికి మళ్లీ జీవంపోసి యూనికోడులో కూడకుంటే, కొన్నాళ్లు గడిచాక ‘బాలు తప్పుపాడాడు’ అంటారు మనవాళ్లే.
    ఏదెలా పలకాలో వివరించే ఇలాంటి వ్యాసం అవసరం. అదీ దీని గొప్ప, ఉపయోగమూ.

    ఈ వ్యాసం చదివి కొన్ని కొత్త పదాలూ కొత్త విషయాలూ నేర్చుకున్నాను. వర్ణ సమామ్నాయమును గురించి భవిష్యత్తులో ఎక్కడ చర్చజరిగినా ఈ వ్యాసం ఒక వనరు కాగలదు. ఈ వ్యాసంలో వివరించిన విషయానికి సంబంధించి నా జ్ఞానము బహుస్వల్పం. నేనందించినవి చాలా చిన్న సూచనలు. పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు, అది రచయిత సంస్కారం.

  8. Rohiniprasad says:

    రానారె గారు చెప్పిన తేలిక చ, జ లకూ, అలాగే ఇంగ్లీషు అచ్చుల ఉచ్చారణకూ సరిపోయే కొత్త తెలుగు అక్షరాలను తయారుచెయ్యవచ్చునేమో ఆలోచించాలి. తెలుగు లిపిలో యాక్టర్, యాంకర్ అని రాయడమే కాక అలాంటి పదాలను చదివి అలాగే ఉచ్చరించేవాళ్ళు కూడా కనబడుతున్నారు. మరాఠీలో వీటికి గుర్తుగా అక్షరం ఎగువన ఒక ‘అర్ధ చంద్రుడి’ సంకేతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందుకు యూనీకోడ్ తదితర లిపులను ఉపయోగిస్తున్నవారు ప్రయత్నం చేస్తే ఇతరులు కూడా అనుసరించే అవకాశం ఉంటుంది.

  9. రానారె, రోహిణిప్రసాద్ గార్లు నేను ప్రస్తావించని విషయాల మీద మంచి చర్చనే లేవదీసారు. దంత్య చ, జ లను భాషా శాస్త్ర పరిభాషలో దంతమూలీయ స్పర్శోష్మాలు (alveolar affricates) అని అంటారు. వీటిని పలికేటప్పుడు మొదట స్పర్శ ప్రయత్నం, చివర ఊష్మ ప్రయత్నం ఉంటుంది. వీటిని IPA లిపిలో ts (Voiceless_alveolar_affricate), dz (Voiced alveolar affricate) అని రాస్తారు.

    అయితే ఇవి తెలుగు భాషలో ప్రత్యేక వర్ణాల కాదా అన్నది వివాదస్పదమైన అంశం. అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య చ (ఉదా:చిలక, చేప), కంఠ్యాచ్చుల ముందు దంత్య చ (ఉదా:చదువు, చుక్క, చొప్ప) ను పలుకుతాం. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని Complementary Distribution అని అంటారు. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య చ గా పలకడం వినిపిస్తుంది (ఉదా: చక్రం, చూడామణి, చోద్యము) కాబట్టి వీటిని ప్రత్యేక వర్ణాలుగా గుర్తించాలని వాదించవచ్చు.

    ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో వినిపించే ‘z’ ధ్వని (సైజ్, నాజూక్) ఊష్మమే (fricative) గాని తెలుగు ‘dz’ వలె స్పర్శోష్మం (affricate) కాదు.

    Michael Everson సాయంతో నాగార్జున వెన్న, నేను కలసి గత సంవత్సరం చేసిన ప్రపోజల్ [1][2] ను యూనికోడ్ కమిటీ అమోదించిన సంగతి మీలో చాలా మంది తెలిసే ఉండవచ్చు. ఈ ప్రతిపాదన ద్వారా యూనికోడ్ తెలుగు వర్గానికి చేర్చిన సంకేతాలలో దంత్య చ, దంత్య జ-లు కూడా ఉన్నాయి. వీటిని రాయడానికి RTS లో ~c, ~j సంకేతాలను వాడుతారు. padma 0.4.9లోను, ఈమాట కామెంట్ల స్క్రిప్ట్ లోనూ వీటికి సపోర్ట్ ఉంది. లేఖిని కూడా పద్మ సాంకేతికతనే పూర్తిగా వాడుకుంటుంది కాబట్టి ఇవి అక్కడ కూడా పని చెయ్యాలి. అయితే, సరి కొత్త pothana2000 ఫాంట్ ఉపయోగిస్తున్న వాళ్ళకు మాత్రమే ఈ కొత్త సంకేతాలు కనిపిస్తాయి. గౌతమి ఫాంట్ లో ఈ సంకేతాలకు ఇంకా సపోర్ట్ లేదు (Unicode 5.1 గ్రంథం ప్రచురించిన తరువాతే మిగిలిన ఫాంటు వారు వీటిని గుర్తించి అమలుపరుస్తారేమో).

    “æ” ధ్వనికి కొత్త సంకేతాలని ప్రతిపాదిస్తూ యూనికోడ్ కమిటీని ఒప్పించడం చాలా కష్టమైన పనే. ఇప్పటికే భాషలో ఉన్న లిపి సంకేతాలను డిజిటైజ్ చెయ్యడానికి మాత్రమే యూనికోడ్ ని ఉపయోగించాలని, భాషలో కొత్త సంకేతాల సృష్టికి సహాయం చెయ్యడం యూనికోడ్ పని కాదని unicode.org స్పష్టంగా చెబుతుంది.

    ఈ వ్యాసంలో ఏ వర్ణాన్ని ఎలా పలుకుతారో చెప్పానే గాని, ఎలా పలకాలో చెప్పలేదు :-). Descriptive గా ఉచ్చారణలు వాటి తేడాలు వర్ణించడానికి ప్రయత్నించానే గాని, ఒక వర్ణాన్ని కచ్చితంగా ఇలాగే పలికాలి అని prescriptive గా చెప్పలేదనే అనుకుంటున్నాను. గత రెండు వేల సంవత్సరాలలో తెలుగు ఉచ్చారణలో సంభవించిన మార్పుల గురించి, ధ్వనిపరిణామాల గురించి మరెప్పుడైనా ముచ్చటిద్దాం.

    నా కొత్త సినిమా పాటల పరిజ్ఞానం అంతంత మాత్రమే కాబట్టి వాటి గురించిన చర్చ మిగిలిన వారికి వదిలేస్తాను.

    ధన్యవాదాలతో,
    సురేశ్.

  10. Kiran says:

    సురేశ్ గారు ,

    మీరు సంస్కృతం లొ Fa లేదని అన్నారు. అది అంత నిజం కాదని అనుకుంటున్నా. నేను చదివిన ఒక reference ప్రకారం కొన్ని ప్రత్యేకమైన సంధర్భాలలొ Fa వస్తుంది

    ఉదా: రామః + పండితాః = రామFపండితాః

    ఈ Fa శబ్దాన్ని ఉపత్మనియ అంటారట. సంస్కృతంలో లేని ధ్వని లేదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఇచ్చారు ఈ క్రింద లింకులో.

    http://www.kamakoti.org/hindudharma/part6/chap6.htm

  11. కిరణ్ గారు,

    ఉపధ్మానీయ[ɸ] ధ్వని [f] ధ్వని కాదు. ఓష్ఠ్య (bilabial) వర్ణాల ముందు పలికే ఈ విసర్గను రెండు పెదవుల సాయంతో ఊష్మ ధ్వనిగా ఉచ్చరిస్తారు (voiceless bilabial fricative). [f] ధ్వనిని రెండు పెదవుల సాయంతో కాకుండా కింది పెదవి, పై దంతాల సాయంతో పలుకుతారు ( Voiceless labiodental fricative). అదీ ఈ రెండిటి మధ్య తేడా.

    ఉపధ్మానీయ[ɸ], జిహ్వమూలీయ [x] ధ్వనులు నిజానికి విసర్గ /ః/ కు సవర్ణాలే (allophones). ఓష్ఠ్య ధ్వనుల ముందు విసర్గను ఉపధ్మానీయ గాను, కంఠ్య ధ్వనుల ముందు జిహ్వమూలీయం గానూ పలుకేవారు. తెలుగులో మాత్రం ఈ రెండు ధ్వనులకు మారుగా అర్ధవిసర్గ అనే ఒకే ఒక సంకేతాన్ని వాడేవారు. (చూ: Proposal to add eighteen characters for Telugu to the BMP of the UCS

    సంస్కృతంలో లేని ధ్వని లేదు అన్న ఆ వెబ్‌సైట్ మాటలు నిజంగా నమ్ముతున్నారా? IPA చార్ట్ లో క్రోడికరించిన దాదాపు ఆరువందల అచ్చుల, హల్లుల ధ్వనులన్నింటినీ ఒకసారి లోతుగా పరిశీలించి మరీ చెప్పండి.

    ముందు చెప్పినట్టు నేను వాడుకున్న ఇమేజులు sil.org నుండి వారి అనుమతితో వాడుకున్నాను. ఆ ఇమేజులకు లింకులివిగో:
    The principal organs of articulation
    Places of articulation

    ఇంటరాక్టివ్‌గా వేర్వేరు ధ్వనుల గురింఛి తెలుసుకోవడానికి ఈ సైటు ఉపయోగపడవచ్చు:
    INTERACTIVE SAGITTAL SECTION

    రిగార్డులతో,
    సురేశ్.

  12. వివినమూర్తి says:

    ఇది అద్భుతమైన వ్యాసం. సాహిత్యానికి అంతర్జాల మాధ్యమమే భవిష్యత్తు అన్న నా భావన పట్ల నమ్మకం పెంచింది.

Comments are closed.