తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం

ఈమాసపు అతిథి సురేశ్ కొలిచాల
భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులే. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా, పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం.

——————-

తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుండీ నా పేరు “సురేశ్” అనే రాసేవాడిని. అయితే మా ఇంటి ఎదురుగా ఉన్న గోడ మీద అంటించిన ఒక సినిమా పోస్టర్‌లో “సురేష్ ప్రొడక్షన్స్” అని చదివినప్పుడు మొదటిసారి నా పేరు తప్పు రాస్తున్నానేమోనన్న అనుమానం వచ్చిందని నాకు గుర్తు. అప్పట్నుండీ మా ఊళ్ళో నాకు తెలిసిన వారందరినీ నా పేరు కరెక్టుగా ఎలా రాయాలంటూ అడిగేవాడిని. ఎవ్వరూ నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదనిపించేది. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో హైదరాబాద్ కు మకాం మార్చిన తరువాత కూడా చాలాసార్లు సిటీసెంట్రల్ లైబ్రరీ వెళుతూ బూదరాజు రాధాకృష్ణ గారింటిముందు తచ్చాడేవాణ్ణి – ఎప్పటికైనా తలుపుతట్టి నా పేరు కరెక్టుగా ఎలా రాయాలో, ఎలా పలకాలో ఆ భాషావేత్తను అడిగి తెలుసుకుందామని. కానీ ధైర్యం చాలేది కాదు. ఇంజనీరింగ్ లో సీటు వచ్చిన తరువాత ఆ ఊపులో ఒక రోజు కొంత తెగువ చూపించి వారింటి కాలింగ్‌బెల్ నొక్కాను. ఆయన తలుపు తీసి సాదరంగా ఆహ్వానించి మూడు గంటల సేపు మాట్లాడారు. ధ్వని శాస్త్రం గురించి, ధ్వనుల ఉత్పత్తి గురించి, ఉచ్చారణలో మార్పుల గురించి, మాండలికాల గురించి చాలా ఓపికగా వివరించారు. ఈ రోజు భాషాశాస్త్రంపై నాకున్న కాస్తో కూస్తో ఉత్సుకతకి ఆ రోజు ఆయన చెప్పిన పాఠాలే స్ఫూర్తి.

ధ్వని శాస్త్రం (Phonetics)

త్వష్టృడనే రాక్షసుడు ఇంద్రుడిని జయించగలిగే పుత్రునికోసం ఘోర తపస్సు చేసాడట. కానీ వరమడిగే సమయంలో “ఇంద్రశత్రు” అన్న పదంలో అనుదాత్త ఉదాత్త స్వరాలు సరిగ్గా ఉచ్చరించలేకపోయినందుకు “ఇంద్రుడిని చంపగలిగే కొడుకు” కాకుండా “ఇంద్రుడే చంపగలిగే కొడుకు” పుట్టాడట. శతపథ బ్రాహ్మణంలోని ఈ కథ (శతపథ బ్రాహ్మణం 1.6.3.8) మన పూర్వీకులు ధ్వనుల ఉచ్చారణకు ఇచ్చిన ప్రాముఖ్యతను చెబుతుంది[5]. ప్రతి వేదసంహితానికి అనుబంధంగా ఆ వేదమంత్రాలలోని ధ్వనులను ఎలా ఉచ్చరించాలో తెలిపే విభాగాలు ఉండేవి. ఈ విభాగాలను ప్రాతిశాఖ్యలు అనేవారు. ఋగ్వేద ప్రాతిశాఖ్య, శుక్లయజుర్వేద ప్రాతిశాఖ్య, తైత్తిరీయ ప్రాతిశాఖ్య మొదలగునవి మనకు ఇప్పటికీ లభ్యమౌతున్న ప్రాతిశాఖ్యలకు కొన్ని ఉదాహరణలు. తరువాతికాలంలో ధ్వనుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రం “శిక్ష” అన్న వేదాంగంగా రూపొందింది. 2500 సంవత్సరాల క్రితమే ఎంతో శాస్త్రీయంగా శిక్షలలోనూ, ప్రాతిశాఖ్యలలోనూ కనిపించే సంస్కృత ధ్వనుల నిరూపణం ఆధునిక ధ్వనిశాస్త్రాలకి భిక్ష పెట్టిందనే చెప్పాలి. ఇతర విజ్ఞాన రంగాల మాట ఏమైనా, భాషాతత్వ పరిశీలనలో మాత్రం ఆనాడే భారతీయులు సాధించిన అభివృద్ధిని ఆధునిక భాషాశాస్త్రవేత్తలు 19వ శతాబ్దం దాకా అందుకోలేకపోయారంటే అతిశయోక్తి లేదు.

ఉచ్చారణా అవయవాలు (Organs of articulation)

మాట నాభిలోంచి రావాలంటారు. నాభి నుండి వెలువడిన నాదం, హృదయ కంఠ సీమలలో తాండవించి ముక్కు, నాలుకల సహాయంతో నిర్గమిస్తుందని సంప్రదాయం చెబుతుంది. సంగీత రత్నాకరంలో శార్ఙ్గదేవుడు నాభీ, హృదయ, మస్తిష్కాలను ఒకే శృతిలో అనుకంపించడం ద్వారా కలిగే ప్రాణానల సంయోగమే నాద యోగమని వివరించాడు. ఈ సంప్రదాయాలను అనుసరించే మన త్యాగరాజు కూడా “నాభీ హృత్కంఠ రసన నాసాదుల” యందు “శోభిల్లు సప్తస్వర సుందరుల”ను భజించాడని చెప్పవచ్చు.

అయితే ఉచ్చారణా అవయవాలను వివరించే ధ్వని శాస్త్రాల్లో ఎక్కాడా నాభి ప్రస్తావన ఉండదు. ఊపిరితిత్తుల నుండి వెలువడే గాలి కంఠబిలం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రాంతంలో మార్పు చెంది వేర్వేరు ధ్వనులుగా ఉత్పత్తి చెందుతుందని భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. కంఠబిలం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రదేశాన్ని ఆస్యం లేదా వక్త్రం అంటారు. భారతీయ ప్రాచీన ధ్వని శాస్త్రవేత్తలు కూడా ధ్వనుల ఉత్పత్తికి కారణమైన ఉచ్చారణావయవాలన్నీ ఈ భాగంలోనే ఉన్నాయని చెబుతూ వీటిని వక్త్రాంగాలు అని అన్నారు.


ధ్వనుల ఉత్పత్తికి కారణాలైన ముఖ్యమైన వక్త్రాంగాలు:

  • ఓష్ఠాలు (కింది పెదవి, పై పెదవి) ( lips)
  • జిహ్వ (tongue)
    • జిహ్వాగ్రము (tongue tip) – నాలిక కొస (tip) కాని నాలిక అంచు (blade)
    • జిహ్వమధ్యము (tongue body)
    • జిహ్వమూలము (tongue root)
  • దంతాలు (teeth)
  • దంతమూలము (alveolar bridge)
  • మూర్ధం (cerebral)
  • కఠిన తాలువు (hard palate)
  • మృదు తాలువు (soft palate)
  • లంబిక – కొండనాలుక (uvula)
  • స్వర పేటిక (larynx or voice box)
  • నాద తంత్రులు (vocal cords)

ఈ వక్త్రాంగాలలో కొన్ని కదలిక గలవి, మరికొన్ని కదలిక లేనివి. కదలిక గల అవయవాన్ని ‘కరణ’మని కదలిక లేని దాన్ని ‘స్థాన’మని అంటారు. సాధారణంగా కింది పెదవి, నాలిక (కొస, మధ్య, మొదలు) కరణాలు. పై పెదవి, పై దంతాలు, దంతమూలం, తాలువు స్థానాలు. కంఠ బిలం నుండి ఆస్య వివరం (oral cavity) ద్వారా గానీ, నాసికా వివరం (nasal cavity) ద్వారా గాని బయటకు వెలువడే గాలిని వివిధ ధ్వనులుగా పలికించే మార్పుని ‘ప్రయత్నం’ అంటారు. మనం పలికే ధ్వనులన్నింటినీ స్థాన కరణ ప్రయత్న భేదాల ద్వారా వేర్వేరు వర్గాలుగా విభజించవచ్చు.

స్థాన కరణ భేదాలు

ఒక వేణువులో గాలిని వేర్వేరు చోట్ల నిరోధించడం ద్వారా ఎలా వేర్వేరు స్వరాలను పలికిస్తామో, అలాగే మనం మాట్లాడేటప్పుడు స్థాన కరణాలను ఉపయోగించి గాలిని వేర్వేరు చోట్ల నిరోధించడం ద్వారా వేర్వేరు ధ్వనుల్ని ఉత్పత్తి చేస్తాం. స్థాన కరణాల భేదాలను బట్టి ధ్వనులను ప్రధానంగా ఈ క్రింది వర్గాలుగా విభజించవచ్చు:

  • ఓష్ఠ్యాలు (labials): స్థానం: పై పెదవి. కరణం: క్రింది పెదవి.
    తెలుగులో వినిపించే [ప], [ఫ], [బ], [భ], [మ] లు ఓష్ఠ్య ధ్వనులకు ఉదాహరణలు. పాపా, మామా, బాబా అన్న శబ్దాలను పెదవుల సహాయం లేకుండా పలకలేం. శిశువులు మొట్టమొదటగా పలుకగలిగే ధ్వనులు ఓష్ఠ్యాలే కాబట్టి ఈ ధ్వనులు ప్రపంచంలోని అన్ని భాషలలోను కనిపిస్తాయి. సినిమా పాటలను, మాటలను డబ్బింగ్ చేసేటప్పుడు ఆయా రచయితలు ఈ ధ్వనుల విషయంలోనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మూలంలో ఓష్ఠ్య ధ్వనులున్న చోట అనువాదంలో కూడా ఓష్ఠ్య ధ్వనులను వాడగలిగితే లిప్-సింకింగ్ సరిగ్గా సరిపోతుందన్న రహస్యం డబ్బింగ్ రచయితలకందరికీ తెలుసు.
  • దంత్యాలు (dentals): స్థానం: పై దంతాల వెనుక భాగం. కరణం: నాలుక కొస గాని, అంచు గాని.
    తెలుగులో వినిపించే [త], [థ], [ద], [ధ], [న], [స] లు దంత్య ధ్వనులకు ఉదాహరణలు. తట, దడ అన్న శబ్దాలలో [త] [ట] ధ్వనులను, [ద][డ] ధ్వనులను ఉచ్చరించేటప్పుడు నాలిక స్థానాన్ని గమనిస్తే ఈ రెండు ధ్వనులలో తేడా తెలుస్తుంది..

  • మూర్ధన్యాలు (retroflex): స్థానం: మూర్ధం కాని కఠిన తాలువు గాని. కరణం: మడత వేసిన నాలుక కొస
    తెలుగులో వినిపించే [ట], [ఠ], [డ], [ఢ], [ణ], [ష] లు మూర్ధన్య ధ్వనులకు ఉదాహరణలు. నిజమైన మూర్ధన్యాలు మన భారతీయ భాషలలోనే కనిపిస్తాయి. ఇండో-యూరోపియన్ భాషలలో వినిపించని ఈ ధ్వనులు, ద్రావిడ భాషల సంపర్కం ద్వారానే సంస్కృతంలోకి ప్రవేశించాయని కొంతమంది భాషావేత్తల అభిప్రాయం. తొలి ఋగ్వేద మండలాలలో అంతగా కనిపించని ఈ ధ్వనులు, తరువాయి మండలాలలో ప్రచురంగా కనిపించడం ఈ వాదానికి ఆధారం. ఇంగ్లీష్‌లో వినిపించే [t], [d] ధ్వనులు మూర్ధన్యాలు కావు, దంతమూలీయాలు.
  • తాలవ్యాలు (palatals): స్థానం: కఠిన తాలువు. కరణం: నాలుక ముందు లేదా మధ్య భాగం.
  • కంఠ్యాలు (velars): స్థానం: మృదు తాలువు. కరణం: జిహ్వ మూలం.
  • కంఠమూలీయాలు (glottals): స్థానం: కంఠ మూలం. కరణం: నాద తంత్రులు.
    తెలుగులో వినిపించే విసర్గ[:], [హ] లు కంఠమూలీయ ధ్వనులకు ఉదాహరణలు.

ఇవే కాక ఆధునిక ధ్వనిశాస్త్రానికి ఉపయోగపడే ఇతర ధ్వని వర్గాలు:

  • దంతోష్ట్యాలు (labiodentals): స్థానం: పై దంతాల వెనుక భాగం. కరణం: కింది పెదవి.
  • అంతర్దంత్యాలు (interdentals): స్థానం: రెండు దంతాల మధ్య. కరణం: నాలుక కొస
  • దంతమూలీయాలు (alveolars): స్థానం: దంతమూలం. కరణం: నాలుక కొస
  • లంబికాలు (uvulars): స్థానం: లంబిక. కరణం: జిహ్వ మూలం.

అచ్చులు, హల్లులు

శైవ వాఙ్మయంలోనూ, బృహత్కథలోను పాణిని రాసిన శివసూత్రాల గురించి ఒక కథ ఉంది. చిన్నప్పుడు పాణినికి గురువు గారు చెప్పే వ్యాకరణ పాఠాలేవీ అర్థమయ్యేవి కాదట. అప్పుడు గురువు గారి ఆజ్ఞ మేరకు పాణిని హిమాలయాల్లో ఆ మహాదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేసాడు. దాంతో శివుడు ఢక్కా డమరుకలతో ప్రత్యక్షమై అ-ఇ-ఉ-ణ్, ఋ-ఌ-క్, ఏ-ఓ-ఞ్,ఐ-ఔ-చ్అంటూ తన ఢమరుకాన్ని 4 సార్లు ఒక వైపు, హ-య-వ-ర-ట్,ల-న్ అంటూ 10 సార్లు మరో వైపు వినిపించాడు. మొదటి నాలుగు శబ్దాలు అచ్చులను వివరిస్తే, మిగిలిన పది శబ్దాలు హల్లులను వినిపించాయట. ఆ 14 శబ్దాలనే పాణిని శివసూత్రాలుగా రచించి, వాటి ఆధారంగా అష్టాధ్యాయిని నిర్మించి లోకప్రసిద్ధి పొందాడని ఈ కథల సారాంశం. అయితే పాణిని సూత్రాలపై వార్తికలు, భాష్యాలు రాసిన కాత్యాయన గానీ, పతంజలి గాని ఈ కథ గురించి ప్రస్తావించలేదు. అంతేకాక శివసూత్రాల క్రమం గురించి, అందులో కొన్ని అనవసరమైన పునరుక్తుల గురించి కాత్యాయన చేసిన విమర్శలను బట్టి చూస్తే ఈ సూత్రాలు ఈశ్వర ప్రసాదాలన్న నమ్మకం కాత్యాయన, పతంజలుల కాలంలో లేదని, తరువాతి కాలంలో వెలుబడిన శైవ వాఙ్మయంలోనే ఈ సూత్రాలకు దైవత్వం ఆపాదించబడిందని మనం చెప్పుకోవచ్చు[3].

అయితే, పాణిని కన్నా ఎంతో పూర్వమే సంస్కృత వ్యాకర్తలకు అచ్చులకు, హల్లులకు మధ్య ఉండే తేడా తెలుసు[4]. పాణినికి పూర్వం అచ్చు అక్షరాలను స్వరాక్షరాలని పిలిచేవారు. వీటినే ప్రాణాక్షరాలని కూడా అనేవారు. అంటే అక్షరంలో అచ్చు ప్రాణం వంటిదని వారి భావన. అలాగే హల్లు అక్షరాలను ప్రాణి అక్షరాలని, వ్యంజనాలని పిలిచేవారు. ధ్వనిశాస్త్ర ప్రకారంగా అచ్చులను, హల్లులను ఈ విధంగా నిర్వచించవచ్చు:

అచ్చులు

గాలిని ఏ మాత్రం నిరోధించకుండా ఉచ్చరించే ధ్వనులు అచ్చులు. అంటే వేర్వేరు అచ్చులను ఉచ్చరించేటప్పుడు స్థాన కరణాలలో భేదమే ఉంటుందిగాని, నిరోధ ప్రయత్నమే ఉండదన్నమాట.

హల్లులు

ఉచ్చరించేటప్పుడు స్థాన కరణాలు ఒకదానిని ఒకటి తాకుతూ గాలిని కొంతైనా నిరోధించే ధ్వనులు హల్లులు.

సురేశ్ కొలిచాల (ఈమాట సంపాదకులు)

హల్లుల్లో ప్రయత్నభేదాలు, తెలుగులో వర్ణ సమామ్నాయం, తెలుగులో ప్రత్యేక వర్ణాలు మొదలైన విషయాలగురించి ఈ వ్యాసం రెండవ భాగంలో చదవండి.

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

23 Responses to తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం

  1. చాలా బాగుంది వ్యాసం. తరువాతి భాగం కోసం వేచి చూస్తున్నాను.

  2. కామేష్ says:

    ఇటీవలి కాలంలో నేను మంచి వ్యాసాలలో ఇది ఖచ్చతంగా పై మెట్టుమీదనే ఉంటుంది. కీపిట్ అప్ సర్.

  3. చాలా చక్కగా శాస్త్రీయంగా వివరించారు. Oral cavity, nasal cavity లాంటి వాటికి తెలుగు పదాలు ఇప్పుడే తెలుసుకున్నాను.

  4. చక్కటి విషయాలను తెలియజెప్పారు. కృతజ్ఞతలు.

  5. మంచి వ్యాసం. చిత్రాలు మరింత వన్నె తెచ్చాయి.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. DVP Rao says:

    This is fantastic. I just frevently hope that Sri Kolichala would continue to comment on the other Brahmanams/puranams he referred to/ cited in this article at a later date. I am sure I owuld be personally benefitted by such …
    My gratitude….
    I will revisit this site . Thank you RB.

  7. వివినమూర్తి says:

    ఈ వ్యాసం చాలా విషయాలు తెలియజెప్పింది. అభివందనాలు.

  8. Quite interesting. I am only familar with the English version of the subject — hence the Telugu names are new to me.

    A few other things to note:

    1. The phonetics have two other dimensions as well — along with where they originate. For instance all ka, kha, ga, gha all block the air in only one way.

    The other two are:
    – voiced and unvoiced
    – asphirated and unasphirated.

    Of course, if you move out of main stream or popular languages, you will see other variations as well. Everytime I look at the way Telugu alphabet are arranged, I marvel at the thoughtfulness of those great phonetic scientists.

    2. You can distinguish between consonents depending on the way you block the air. If you have to, you can represent it by writing the description along the dimensions (How the air is blocked, voiced/unvoiced, asphirated/unasphirated).

    How can you describe vowels? [Stay tuned for the next installment of Suresh’s essay :-)]

    3. Now, what is the difference between “i” and “yi”. In Telugu, we do not have minimal pairs distinguishing between these two. Or, do we?

    This is a great article and should be read by most Telugu teachers so that they can understand the #varNa maala# scientificaly.

  9. Rohiniprasad says:

    bhAsha, uccAraNa modalainavATanniTikI uMDE AdhArAleTuvaMTivO I maMci vyAsaM teliyajEstuMdi. mana dESaMlOnU, itara dESAllOnU mATalu palakaDaMlOnU, konni pratyEka SabdAlu vADaMDaMlOnU tEDAlu eMdukErpaDDAyO InADu ceppaDaM sAdhyaM kAkapOvaccu. udAharaNaku beMgAl, orissA taditara prAMtAllO a anE aksharAnni o ani eMduku palukutArO, A alavATu eppuDu, eMduku modalayiMdO telusukOvaDaM kashTamE.

    mottaM mIda SabdAlU, aksharAlanu guriMcina telugu vyAsAllO SarIra nirmANaM guriMcina sacitra vivarAlu telipEdi idE modaTi vyAsamEmO. racayitaku abhinaMdanalu.

  10. Rohiniprasad says:

    భాష, ఉచ్చారణ మొదలైనవాటన్నిటికీ ఉండే ఆధారాలెటువంటివో ఈ మంచి వ్యాసం తెలియజేస్తుంది. మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మాటలు పలకడంలోనూ, కొన్ని ప్రత్యేక శబ్దాలు వాడడంలోనూ తేడాలు ఎందుకేర్పడ్డాయో ఈనాడు చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు బెంగాల్, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో అ అనే అక్షరాన్ని ఒ అని ఎందుకు పలుకుతారో, ఆ అలవాటు ఎప్పుడు, ఎందుకు మొదలయిందో తెలుసుకోవడం కష్టమే.

    మొత్తం మీద శబ్దాలూ, అక్షరాలను గురించిన తెలుగు వ్యాసాల్లో శరీర నిర్మాణం గురించిన సచిత్ర వివరాలు తెలిపేది ఇదే మొదటి వ్యాసమేమో. రచయితకు అభినందనలు.

  11. radhika says:

    చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను.చాలా మంచి వ్యాసం.

  12. vEmUri says:

    bAguMdi. #voiced, unvoiced# anna mATalaki kUDa ardhAlu teliyajEyagalaru.

  13. అభిమానంతో ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు రాసిన వారందరికీ కృతజ్ఞతలు.

    @వేమూరి గారు: శ్వాస నాదాలు (unvoiced & voiced), అల్పప్రాణ మహాప్రాణాలు, స్పర్శ, ఊష్మ, అంతస్థాలు హల్లులలో ప్రయత్న భేదాలు (manners of articulation). వాటి గురించి రెండో విభాగంలో చర్చించాను.

    @రోహిణీప్రసాద్ గారు, బెంగాలీ, ఒరియా వంటి తూర్పు ఇండో-ఆర్యన్ భాషలలో ధ్వని పరిణామాల గురించి గత రెండు శతాబ్దాల్లో బోలెడన్ని పరిశోధక వ్యాసాలు వచ్చాయి. వాటి గురించి సంగ్రహంగా తెలుసుకోవాలంటే ఈ రెండు పుస్తకాలను చూడవచ్చు:

    1. The Indo-Aryan Languages By Colin P. Masica 1991
    2. The Indo-Aryan Languages By George Cardona, Dhanesh Jain 2003

    కన్నెగంటి గారు అడిగిన గడ్డు ప్రశ్నల (“ఇ” “యి” లలో తేడాలు మొదలగునవి) గురించి ఆసక్తికరమైన చర్చకోసం రచ్చబండలోని ఈ కింది పుంజాన్ని పరిశీలించండి:
    Rules for written Telugu

    కృతజ్ఞతలతో,
    సురేశ్.

  14. inta goppa parishodhanA vyAsam pracurincinanduku dhanyavadAlu.

  15. మురళీకృష్ణ కూనపరెడ్డి says:

    చిన్నప్పుడు తెలుగు వ్యాకరణం క్లాసులో శబ్ధాలనెలా ఉచ్ఛరించాలో చెప్పేటప్పుడు వెనక బెంచీలో చేరి నిద్రపోయేవాళ్ళం. కానీ యిప్పుడు తెలుస్తోంది ఎంత మిస్సయ్యామో! కొలిచాల వారికి వందన శతసహస్రాలు.

  16. Hima says:

    Very intresting

  17. lalitha says:

    ఇటువంటి వ్యాసాలు ఎప్పుడైనా వచ్చి చూసుకోగల సౌలభ్యంతో ప్రచురించి సేకరించి ఉంచుతున్నందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం కోసం చూస్తుంటే ఇంకొన్ని నేను చూడని వ్యాసాలు కూడా కనిపించాయి.
    మా అబ్బాయికి తెలుగు అక్షరాలు పలకడం నేర్పిస్తూ “త” అనడానికి పళ్ళను తాకాలి, “ట” అనడానికి roof of the mouth ను తాకాలి ఇలా చెప్తున్నానీమధ్య. ఎందుకైనా మంచిది సరిగా చూసుకుని చెప్దామని మళ్ళీ వచ్చి ఈ వ్యాసం చూసుకున్నాను.
    Thanks again.

  18. చాలా చక్కని వ్యాసం. నిజంగా భాషాశాస్త్రాన్ని గురించి ఇంత చక్కగా వివరించిన వారిని ఇంతవరుకు చూడలేదు.
    ధన్యవాదాలు.
    స్వరూప్ కృష్ణ

  19. Dr.R.P.Sharma says:

    చాలా చక్కని విషయాలు అందించారు. తెలుగులో ఇంత చక్కని వ్యాసాలు ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మరిన్ని వ్యాసాలు మీ నుండి ఆశిస్తున్నాము.
    నెనర్లు.

  20. Sowmya says:

    Interesting article!
    మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు. అయితే, నాదో సందేహం…Palatals, Labiodentals.. etc etc .. వీటన్నింటికీ కూడా ఉదాహరణలు ఇచ్చి ఉండొచ్చు కదా… నాకు అర్థం కాలేదు కొన్ని ఎలాంటివో…

  21. చాలా బాగా చెప్పారు

  22. Pingback: ఈమాట » పలుకుబడి: శషసలతో శషభిషలు

Comments are closed.