తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

(ఈ వ్యాసంలో నేను చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరచిన అభిప్రాయాలు, కేవలం తెలుగు వికీలో గత రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవముతో నేను గ్రహించినవి మాత్రమే. వీటికి వికీపీడియా కానీ, వికీమీడియా సంస్థ కానీ, పొద్దు పత్రిక కానీ ఎటువంటి బాధ్యతా వహించదు. – రవి వైజాసత్య)

వికీపీడియా ఒక ప్రజా విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా తెలుగు సంచిక భారతీయ భాషలన్నంటిలో అగ్రస్థానములో ఉండటం తెలుగు వారంతా ఒకింత గర్వపడదగిన విషయం. ఇది వరకు పొద్దు సంపాదకవర్గం మీకు ఈ శీర్షికలోని మొదటి వ్యాసంలో వికీని, వికీపీడియాను పరిచయం చేశారు. ఆసలు ఈ వికీ ఏంటీ? వికీపీడియా ఏంటి? అన్న సందేహలు కలిగితే ముందుగా మీరా వ్యాసాన్ని తప్పకుండా చదవవలసిందే!!.

తెలుగు వికీపీడియా యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అర్ధం చేసుకోవటానికి మనం ఇప్పటి దాకా తెలుగులో జరిగిన విజ్ఞాన సర్వస్వ కృషిని క్లుప్తంగా కొంత మేరకు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పూర్వం తెలుగు విజ్ఞానాన్నంతా ఛందోబద్ధంగా పద్యరూపములో ఇమిడ్చేవారు. అయితే వీటి విస్తృతి చాలా తక్కువ. ప్రస్తుతం వీటికి సాహితీ విలువ ఉన్నది కానీ అందులోని విజ్ఞానము పరిమితము. తెలుగులో కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞానసర్వస్వము ప్రపథమ విజ్ఞానసర్వస్వంగా భావించవచ్చు. ఇది ఒక అకారాది క్రమములో కూర్చిన విజ్ఞాన సర్వస్వము. అనగా అకారాది క్రమములో అ నుండి ఱ వరకు వివిధ అంశాలను గూర్చి వ్రాయ సంకల్పించారు. ఆయన మూడవ సంపుటం కూడా పూర్తిచేయకుండానే కాలధర్మం చేశారు. 20వ శతాబ్దపు తొలి దశకాలలో ప్రారంభమైన ఈ కృషిని 1930వ దశకములో కాశీనాథుని నాగేశ్వరరావు గారు నెత్తినెత్తుకొని కొంత ఆధునీకరించి, పొడిగించి రెండు సంపుటాలు తిరిగి పునర్ముద్రించారు. మూడవ సంపుటం ముద్రణలో ఉండగా ఆయన మరణించటంతో ఈ కృషీ ఆగిపోయింది.

అయితే అది అకారాది విజ్ఞానసర్వస్వమైనందున కొన్ని వ్యాసాలలో దీని తర్వాత ప్రచురించబోయే సంపుటాలలో వచ్చే ఫలానా వ్యాసం చూడండి అని రాసారు కానీ అవి అలా అసమగ్రంగానే మిగిలిపోయాయి. ఉదాహరణకు అనంగుఁడు అన్న శీర్షికలో ఇది మన్మథుని పేరు, ఆ తరువాత వచ్చే సంపుటాలలో మన్మథుని క్రింద దీని సమాచారం చూడండి అని రాశారు. కానీ ఆ మన్మథుని వరకీ ప్రయత్నము సాగలేదని వేరే చెప్పక్కర్లేదు.

అకారాది క్రమములో విజ్ఞాన సర్వస్వము కూర్చటం వలన, అన్ని సంపుటాలు పూర్తయ్యేవరకు విజ్ఞాన సర్వస్వము అసమగ్రముగా ఉండి, అంతగా ఉపయోగకరము కాదని, కేవలం ఒక నిర్దిష్ట విషయం పై ఆసక్తి ఉన్నవారు కూడా విజ్ఞాన సర్వస్వము నుండి అవసరమైన సమాచారం పొందడానికి విజ్ఞాసర్వస్వము యొక్క అన్ని సంపుటాలు కొనవలసి ఉండటం బాగాలేదని గ్రహించిన తెలుగు విశ్వవిద్యాలయం తాము తీసుకువచ్చిన తెలుగు విజ్ఞానసర్వస్వంలో వివిధ రంగాల వారీగా సంపుటాలు వెలువరించింది. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అయుర్వేదం, మతములు-దర్శనములు, భారత భారతి, విశ్వ సాహితి, తెలుగు సంస్కృతి, జ్యోతిష్యం, మొదలైన సంపుటాలను సిద్ధం చేసింది. ఇవి అనేక మంది పండితుల యొక్క దశాబ్దాల కృషి వల్ల రూపొందిన అమూల్య గ్రంథాలు. అయితే ఇవి అందరికీ ఉచితంగా లభ్యం కావట్లేదు. మిగిలిన అచ్చు విజ్ఞానసర్వస్వములలో వలెనే, వీటిలోని సమాచారానికి ప్రచురించిన కొద్దికాలానికే కాలదోషం పట్టే అవకాశముంది. పెరుగుతున్న విజ్ఞానాన్నంతా చేర్చి, అన్ని సంపుటాలనూ తరచుగా తాజాకరించి ప్రచురించటం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అంతర్జాల విజ్ఞానసర్వస్వాల్లోలాగా వీటిలో ఏదైనా విషయం గురించిన సమాచారం వెతకటం అంత సులువు కాదు. వీటి విస్తృతి కొన్ని రంగాలకే పరిమితమైనది.

ప్రపంచ విజ్ఞానము ప్రతి దశాబ్దకాలములో రెట్టింపవుతున్న ఈ తరుణంలో తెలుగు సాంప్రదాయిక అచ్చు విజ్ఞానసర్వస్వాలు రెండో లేదా మూడో సంపుటం ప్రచురించేసరికి మొదటి సంపుటంలోని విషయాలకు కాలదోషం పడుతుందంటే అతిశయోక్తి లేదు. పైగా అచ్చుప్రతుల ప్రచురణ వ్యయప్రయాసలతో కూడుకున్నపని. ఇలాంటి బృహత్తర కార్యంలో సామాన్య ప్రజలు పాలుపంచుకొనే అవకాశముండదు. ఒకవేళ ప్రచురించినా, ఉచితంగా పంపిణీ చెయ్యటం ఆర్థికపరంగా జరిగే పనికాదు.

ఇక్కడ మనం నేర్చుకోవలసినదేంటంటే విజ్ఞాన సర్వస్వ కృషి ఎంతటి మహానుభావులైనా ఒకరిద్దరి వల్ల సుసాధ్యమయ్యే పనికాదని గ్రహించాలి. తెలుగు విద్యావంతులంతా నడుంకట్టి తమకు చేతనైన సహాయం అందిస్తేనే ప్రస్తుత కాలమాన పరిస్థితులకు మనగలిగే అర్థవంతమైన, సందర్భోచిత విజ్ఞాన సర్వస్వం సృష్టించగలం.

తెలుగు వికీపీడియా ఉచిత విజ్ఞానసర్వస్వమే కాకుండా తెలుగులో అత్యంత విస్తృతి కలిగిన విజ్ఞాన సర్వస్వమున్నూ, అత్యంత తాజా విజ్ఞానసర్వస్వము అయ్యే విధంగా రూపొందించబడినది. మరి వికీ పద్ధతిలో స్థిరత్వము అంటూ ఉండదు కదా. తరచూ మారే విజ్ఞానసర్వస్వములో నాణ్యతను ఎలా కాపాడతారు అని ప్రశ్నించవచ్చు. ఇది సమంజసమైన ప్రశ్నే. వీటికి పరిష్కారముగా నియమిత సమయాలలో ఒక స్థిరమైన సీడీ (కాంపాక్ట్ డిస్క్) సంచికలను విడుదలచేయాలన్న ఆలోచన ఉన్నది. తెలుగు వికీపీడియాలో ఎంతో కొంత ఉపయోగకరమైనవిగా భావించే సమాచారమున్న వ్యాసాలు ప్రస్తుతం ఒక వెయ్యి దాకా ఉన్నాయి. అవి పదివేల సంఖ్యకు చేరగానే వాటిలో సమగ్రమైన వ్యాసాలను, సభ్యులతో కూడిన ఒక సంపాదక వర్గం ఎంపిక చేసి తెలుగు వికీపీడియా స్థిర సంచిక 0.1 ఒక సీ.డీ. లో విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నది. ఈ సీ.డీ.ని ఎవరైనా ఉచితంగా కాపీ చేసి పంపిణీ చేసేందుకు ఎటువంటి కాపీహక్కుల అడ్డంకులూ లేవు. కాబట్టి వీటిని అలా ఒకరినుండి ఒకరికి పంపిణీ చేస్తూ ఆంధ్ర దేశమంతటా తెలుగు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రతి బడికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి పంపిణీ చేయటానికి, ఒక వెయ్యి పేజీల ఉద్గ్రంథాన్ని పంపిణీ చేసే ఖర్చులో వెయ్యో వంతు కూడా ఖర్చు కాదు.

తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన వికీ ప్రాజెక్టు వికీపీడియా అయినప్పటికీ తెలుగు విక్షనరీ (ఒక మహా నిఘంటువు, పదకోశము) మరియు తెలుగు వికీసోర్స్ (ఒక ఉచిత మహా గ్రంథాలయము) లో కూడా కృషి పుంజుకొంటున్నది.

తెలుగు విక్షనరీ ఒక అనేక భాషలు – అనేక భాషలు (many – many) నిఘంటువు. అంటే తెలుగు పదానికి పలు భారతీయ మరియు ప్రపంచ భాషలలోనూ, పలు ప్రపంచ మరియు భారతీయ భాషలలోని ప్రముఖ పదాలన్నింటికి తెలుగులోనూ అర్థాలు ఇస్తుంది. ప్రస్తుతానికి ఇందులో తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు పదాలపైనే దృష్టి కేంద్రీకరించటం జరిగింది. తెలుగు విక్షనరీలో సుజాత గారు విశేష కృషి చేస్తున్నారు. తెలుగు వికీలో నిర్వాహకుడైన మాకినేని ప్రదీపు గారు బ్రౌణ్య ఆంగ్ల – తెలుగు నిఘంటువును మొత్తం విక్షనరీలో చేర్చే ప్రయత్నములో ఉన్నారు. దీనితో పాటు బ్రౌణ్య తెలుగు – ఆంగ్ల నిఘంటువు, కాపీహక్కులకు లోబడి వీలైతే వేమూరి గారి అంగ్ల – తెలుగు నిఘంటువులు కూడా చేర్చి తెలుగు పదాలన్నింటినీ ఒకచోట అందించాలని విక్షనరీ సభ్యుల అభిలాష. విక్షనరీ లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవటానికి విక్షనరీ సందర్శించాల్సిందే.

తెలుగు వికీసోర్సులో ఒక తెలుగు ఔత్సాహికుల బృందం ఆంధ్ర మహాభారతాన్ని యూనీకోడీకరించే బృహత్తర కార్యం చేపట్టింది. ఇప్పటికి 7 పర్వాలను పూర్తిచేశారు. మిగిలిన వాటిపై కృషి కొనసాగుతున్నది. అవే కాక వికీసోర్స్ లో చురుగ్గా పాల్గొంటున్న అన్వేషి మరియు రాజ్ గార్లు ఇప్పటికే 1300కు పైగా అన్నమయ్య కీర్తనలను, వందకు పైగా త్యాగరాజ కీర్తనలు, వ్యాస మహాభారతం, వాల్మీకీ రామాయణాన్ని తెలుగు వికీసోర్సులో చేర్చారు. ఆ రామాయణ మహాభారతాలు నా దగ్గర పుస్తక రూపములో ఉన్నాయి వీటివల్ల నాకుపయోగమేమి అని మీరడగవచ్చు. బోలెడన్ని. ఉదాహరణకు ‘శకునం’ అన్న పదాన్ని వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఏ సందర్భములో ఉపయోగించారో వెతికి పట్టుకోవటానికి ప్రయత్నించండి . గడ్డివామిలో సూదిని వెతికినట్టే అని అనుకుంటున్నారా? అయితే వికీ ప్రాజెక్టులన్నీ యూనీకోడ్లో ఉన్నవి. దాని వల్ల గూగూల్లో వీటిని వెతకటం “క్లిక్కులో”పనే. ఇందులో కాపీహక్కులు లేని తెలుగు పుస్తకాలన్నింటినీ చేర్చవచ్చు. చెప్పుకుంటూపోతే ఇలా చాలా కృషి జరుతోంది కానీ వీటిగురించి తర్వాతి టపాలలో విపులంగా చర్చిస్తాను.

తెలుగులో విజ్ఞానాన్ని అందరికీ ఉచితంగా పల్లె పల్లెకు, వాడ వాడకు వ్యాపింపజేసే ఈ బృహత్తర ప్రయత్నానికి మన వంతు సహాయాం చేద్దాం రండి. ఈ కృషిలో మీవంతు సహాయం చెయ్యటానికి శతకోటి విధానాలున్నాయి. మీరు కంప్యూటరు ముందు కూర్చుని వ్యాసాలే రాయక్కర్లేదు. మీరు ఫోటోగ్రాఫర్లైతే వికీలో పెట్టడానికి సరిపోతాయనిపించే ఫోటోలను ఇవ్వవచ్చు. చిత్రకారులు చిత్రాలను గియ్యవచ్చు, సంపాదకులు, భాషా పండితులు భాషా విషయమై సూచనలు చేయవచ్చు, వ్యాసాలలోని అచ్చుతప్పులు దిద్దవచ్చు, మీరు మాష్టారైతే వ్యాసాల నాణ్యతను బేరీజు వేసి మార్కులు వేయవచ్చు. బహుభాషా కోవిదులు, అనువాదకులైతే ఇతర భాషలనుండి తెలుగులోకి వివిధ వ్యాసాలను అనువదించవచ్చు. ప్రోగ్రామింగ్ గురు అయితే వివిధ చాకిరీ పనులను ఆటోమేట్ చెయ్యటానికి బాట్లను రాయవచ్చు, మీ గళం సూపర్ అనిపిస్తే వికీలోని వ్యాసాలను చదివి, రికార్డు చేసి పంపించవచ్చు. మీరు డిటెక్టివ్ నారద అయితే నిజ నిర్ధారణకు వచ్చిన విషయాలను కూపీ లాగవచ్చు. ఇవన్నీ చేయటానికి మీకు అర్హతలేమీ ఉండాల్సిన అవసరమేంలేదు. ఆసక్తి ఉంటే చాలు. అలా మనసుండలే కానీ మార్గముండదా?

పొద్దులో ఈ వికీ శీర్షిక ద్వారా తెలుగు వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్ మొదలైన సోదర ప్రాజెక్టులలో ముఖ్యంగా వికీపీడియాలో వెలువడిన కొత్త కొత్త వ్యాసాలను, జరుగుతున్న కృషిని చదువరులకు పరిచయం చేయాలని భావిస్తున్నాను. ఇంకా వికీ గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ వ్యాఖ్యలలో రాయండి. లేదా, తెలుగువికీ గూగుల్ బృందాన్ని సందర్శించండి. అదీ కాకుంటే, teluguwiki@yahoo.co.in చిరునామాకు ఈ-మెయిల్ పంపండి. వాటికి వెంటనే సమాధానమివ్వటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ అవకాశాన్ని కల్పించిన పొద్దు సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.

==మూలాలు==

*ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ద్వితీయ సంపుటం (1935) కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

*తెలుగు విశ్వవిద్యాలయము యొక్క విజ్ఞాన సర్వస్వము నాలుగవ సంపుటం (మతములు-దర్శనములు) (1994)

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

5 Responses to తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు

  1. sujatha says:

    eMtO cakkaTi spUrti dAyakamaina, upayOgakaramaina SIrsikanu aMdiMcinadAniki abhinaMdanalu.

  2. sujatha says:

    ఎంతో చక్కటి స్పూర్తి దాయకమైన, ఉపయోగకరమైన శీర్సికను అందించినదానికి అభినందనలు.

  3. viswanath says:

    మంచి సమాచారం అందించారు.కృతజ్ఞతలు.

  4. satyasai says:

    చాలా బాగా వ్రాసారు.

  5. E.V. Gangadhar rao says:

    తెలుగు వికీని అభివృద్ధి చేసి ఇంత ప్రాచుర్యము పొందడములో అవిరళ కృషి చేసిన రవి గారికి తెలుగు భాషాప్రేమికులందరూ ఎంతో ఋణపడి ఉన్నారు. (RTS లో రాసిన వ్యాఖ్యను తెలుగులోకి లిప్యంతరీకరణ చేసాం. -సం)

Comments are closed.