జగజ్జేత ఆనంద్!

-రానారె (http://yarnar.blogspot.com)

గతనెలలో మన క్రికెట్ జట్టు 20-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారం రోజులకే క్రీడాప్రపంచంలో మరో చరిత్రాత్మక సంఘటన జరిగింది. భారతదేశానికే చెందిన క్రీడాకారుడు ఒకరు జగజ్జేతగా నిలవడమేగాక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ క్రీడ మనదేశంలో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగం కాగా ఆ క్రీడాకారుడు…

విశ్వనాథన్ ఆనంద్.
ఎలాంటి సందేహాలకూ తావులేకుండా చదరంగ క్రీడా ప్రపంచపు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన విజేత.

1972లో అమెరికా దేశీయుడు బాబీ ఫిషర్ తరువాత ‘మొదటి స్థానము (ర్యాంక్) మరియు విశ్వవిజేతగా గుర్తింపు’లను ఒకేసారి సాధించి నిలుపుకొన్న రష్యనేతరుడు ఆనంద్. చదరంగం క్రీడలో 35 సంవత్సరాలపాటు కొనసాగిన రష్యన్ల ఆధిపత్యానికి గండికొట్టిన భారతీయుడు ఆనంద్.
క్రీ.శ.2000 లో నాకౌట్ పద్ధతిలోనూ, 2007లో రౌండ్-రాబిన్ పద్ధతిలోనూ చదరంగ కిరీటం కోసం నిర్వహింపబడిన ప్రపంచస్ఠాయి పోటీల్లో ఒక్క ఓటమి కూడా ఎరుగకుండా నిలిచిన ఒకే ఒక్క క్రీడాకారుడుగా విశ్వనాథన్ ఆనంద్ చరిత్ర సృష్టించాడు. 1995లో గారీ కాస్పరోవ్ తరువాత రెండవస్థానం లోనూ, 1998లో అనతోలీ కార్పోవ్ తరువాతి స్థానంలోనూ నిలిచిన ఆనంద్ ఇటీవలి విజయాన్ని తన క్రీడాజీవితంలోనే అత్యంత ఘనమైనదిగా భావించడానికి కారణాలున్నాయి.

క్రీ.శ.2000వ సంవత్సరంలో సాధించిన విజయాన్ని కొందరు చదరంగ ప్రపంచప్రముఖులు నిఖార్సయిన విజయంగా పరిగణించలేదు. కారణం ఏమిటంటే, ఈ పోటీలు అప్పటికే కాస్పరోవ్ ని నిలువరించి చదరంగ రంగంలో సరికొత్త రారాజుగా అవతరించిన వ్లాదిమిర్ క్రామ్నిక్ గైర్హాజరీలో జరగడమే. (1993లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ చదరంగ సమాఖ్య(FIDE)పై తిరుగుబాటు చేసి పోటీగా ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ (PCA) ఏర్పాటుచేసుకున్నాడు. తిరిగి ఆ రెండు సంస్థలూ 2006లో ఏకమయ్యే వరకు ప్రపంచ చదరంగపోటీలు వేర్వేరుగానే జరిగాయి.) ఈ మారు మాత్రం అటువంటి సందేహాలు మచ్చుకైనా లేవు. ఏడేళ్ల క్రితం ఆనంద్ ఎదుర్కొన్న శక్తులకన్నా ఈసారి ప్రత్యర్థివర్గం బలమైనది. క్రామ్నిక్ తో సహా ప్రపంచ చదరంగ హేమాహేమీలందరూ బరిలో ఉన్నారు.

“నిలకడగా (consistent) విజయాలు సాధించడం ఈ భారత మేధావి ప్రత్యేకత. రెండు ప్రపంచస్థాయి పోటీలు, రెండు ప్రపంచ కప్పులు, అనేక ప్రముఖస్ఠాయి పోటీల్లోని విజయాలు సంప్రదాయ (classical) మరియు మెరుపువేగపు (rapid) విభాగాల్లో ఆనంద్ యొక్క బహుముఖ పాటవాన్ని బయల్పరచే ప్రబలనిదర్శనాలు. ప్రపంచ ర్యాంకింగ్ అనేది ఒక క్రీడాకారుని ఫామ్ కూ నిలకడతనానికీ కొలబద్ద అయితే దశాబ్దకాలానికి పైగా మొదటి మూడు స్ఠానాల్లో నిలిచిన ప్రత్యేకత విశ్వనాథన్ ఆనంద్ సొత్తు. అంతేగాక, 2002 మే నెల నుండీ జరిగిన ఏ టోర్నమెంట్లోనూ మొదటి మూడు స్థానాలకంటే తగ్గి నిష్క్రమించడం జరగలేదు.

స్వతహాగా వేగవంతమైన అతని ఆటతీరు — ప్రపంచ వేదికపై ఆనంద్ తనదైన ముద్రను వేసిన తొలినాటి నుండి ఉజ్వలంగా కొనసాగుతూనే వస్తోంది. పావులను కదిపే సమాలోచనలో గత కొద్ది నెలలుగా కాస్త ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్న విషయం వాస్తవమే ఐనా, అతని ఆటతీరు తన ప్రాభవాన్ని కోల్పోలేదు. “బహుశా నేనిప్పుడు చదరంగం బల్లపై మరిన్ని ఎక్కువ అంశాలను చూస్తున్నానేమో” అంటూ విశ్లేషిస్తారు చిచ్చరపిడుగుగా (lightning kid) పేరొందిన ఈ మేథావి. గత కొన్నేళ్లుగా నల్లపావులతో ఆనంద్ విజయాలు పెరుగుతుండగా తెల్లపావులతో అపజయాలు అరుదుగానే మిగిలిపోయాయి. అతని విజయము, శైలి, స్వతహాగా గల ఆకర్షణల కలబోత భారత చదరంగానికి దేశంలో ఏ ఇతర వ్యక్తిగత క్రీడకూ లేనివిధంగా ఒక ఆరాధనీయమైన రూపాన్నిచ్చాయి.

భారతదేశపు తొలి జూనియర్ ప్రపంచ విజేత మరియు తొలి భారత గ్రాండ్ మాస్టర్ గా 1987లో అవతరించిన నాటినుండీ దేశ చదరంగంలో వచ్చిన నిశ్శబ్దవిప్లవానికి ఆనంద్ సూత్రధారి. అత్యంత మేథోపూరితమైన ఈ క్రీడను సమర్థవంతంగా ప్రచారం చేసేవిధంగా ప్రసారమాధ్యమాలను బానగిల్లజేసి క్రీడాజర్నలిజాన్నే మార్చివేసిన ఘనత విశ్వనాథన్ ఆనంద్ కే చెందుతుంది.
భారతదేశంలో ఆనంద్ కంటే ముందు చదరంగం క్రీడపట్ల ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. తమిళనాడుకు చెందిన మాన్యుయెల్ ఆరన్ మనదేశానికి చెందిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్. (ఈయన క్రికెటేతర క్రీడలకు మరే పత్రికా ఇవ్వనంత విస్తృత కవరేజీ ఇచ్చే హిందూ పత్రికకు చెస్ కంట్రిబ్యూటర్ గా పనిచేశాడు.) ఐతే భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ గా (ఆసియాలో రెండో గ్రాండ్ మాస్టర్) తన విజయాలతో దేశంలో వేలాదిమంది యువచదరంగక్రీడాకారులను ఉత్తేజితులను చేసిన ఘనత ఒకేఒక్కరికి చెందుతుంది. ఈనాడు మన దేశంలోని పదహైదు మంది గ్రాండ్ మాస్టర్లకూ, వివిధ వయసుల విభాగాలకు చెంది ప్రపంచ మరియు ఖండాంతర విభాగాల్లో ఛాంపియనులైన అనేకులకూ అంతెందుకు బడికెళ్లే పసివారికీ తెలుసు ఆ స్ఫూర్తి ప్రదాత ఎవరో!

విశ్వనాథన్, సుశీల దంపతులకు 1969 డిసెంబరు 11న చెన్నైలో జన్మించిన ఆనంద్ ఆరవ యేట తన తల్లి వద్ద చదరంగంలో తొలి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. తండ్రి పేరిట ‘విశీ’ అని ఇంట్లో పిలువబడే విశ్వనాథన్ ఆనంద్ తండ్రి ఒక రైల్వే అధికారి. తండ్రి ఉద్యోగరీత్యా ఫిలిప్పీన్స్ లోని మనీలాకు వెళ్ళాల్సిరావడం ఆనంద్ కు కలిసొచ్చింది. అక్కడ చదరంగం బాగా ప్రజాదరణ ఉన్న క్రీడ. అక్కడ టెలివిజన్ కార్యక్రమంలో రోజూ మధ్యాహ్నం చదరంగం ఎత్తుగడలు చర్చించేవారు. ఆ కార్యక్రమం చివర్లో ఒక చిక్కుప్రశ్న ఉండేది. ఆనంద్ తల్లి ఆ చర్చనంతా నోట్స్ రాసి కొడుకుకిచ్చేది. ఆనంద్ ఆ చిక్కుముడులు విప్పి బోలెడన్ని చదరంగ పుస్తకాలు గెల్చుకున్నాడు. ఇప్పటిలాగ ఇంటర్నెట్, ఆన్లైన్ చెస్ అవకాశాలు లేని రోజుల్లో ఆ పుస్తకాలే ఆనంద్ ప్రతిభకు పదునుపెట్టాయి.

1980లో చెన్నయ్ కి తిరిగివచ్చాడు ఆనంద్. అప్పటి నుంచి ఆనంద్ జైత్రయాత్ర మొదలైంది. విసుగూవిరామం లేకుండా కొత్తశిఖరాలు అధిరోహిస్తూనే ఉన్నాడు. జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ విభాగంలో 1983లో విజేత కావడం తొలినాళ్లలో ఘనవిజయం. అప్పటికి ఆనంద్ వయసు పద్నాలుగేళ్లు. 2007 సెప్టెంబరు 29న మెక్సికో సిటీలో ప్రపంచ ఛెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ గెలుపొందిన ఆనంద్ వయసు ముప్ఫైఏడేళ్లు.

1985లో అర్జున అవార్డు, 1987లో పద్మశ్రీ, నేషనల్ సిటిజన్స్ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2000లో పద్మభూషణ్, 1997, 98, 2003, 04లలో ఛెస్ ఆస్కార్ అవార్డులను పొందాడు. స్పెయిన్లో గవర్నమెంట్ ఆఫ్ లాన్జెరోట్ అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే ‘జేమియో డి ఓరో’ అనబడే అత్యున్నత గౌరవాన్ని 2001 ఏప్రిల్ 25న పొందాడు. 1998లో స్పోర్ట్ స్టార్ పత్రికవారి సహస్రాబ్ది పురస్కారం (Millennium Award) పొందాడు.

ప్రస్తుత తాత్కాలిక తారారాధనాయుగంలో, నడమంత్రపు కీర్తినిచ్చి అదేపనిగా ఆకాశానికెత్తే ఈ క్రీడా ప్రపంచంలో… మరే భారతీయ క్రీడాకారుడూ సమీప భవితలో చేరుకోలేని ప్రతిభాకీర్తిశిఖరంపై విశ్వనాథన్ ఆనంద్ ఒక్కడై నిలిచివున్నాడు.

ఆనంద్ అధిగమించిన కొన్ని మైలురాళ్ళు-పొందిన కొన్ని పురస్కారాలు:

1983 – జాతీయ సబ్ జూనియర్ టైటిల్

1984 – ఇంటర్నేషనల్ మాస్టర్

1986 – జాతీయ సీనియర్ టైటిల్,

– అర్జున అవార్డు,
1987 – ప్రపంచ జూనియర్ టైటిల్ (తొలి ఆసియా వాసి)

– గ్రాండ్ మాస్టర్ హోదా (రెండో ఆసియావాసి)

– పద్మశ్రీ (పొందిన తొలి టీనేజర్)
– నేషనల్ సిటిజన్స్ అవార్డు

– సోవియెట్ లాండ్ నెహ్రూ అవార్డు
1998 – స్పోర్ట్ స్టార్ పత్రికవారి సహస్రాబ్ది పురస్కారం (Millennium Award)

1992 – భారతదేశపు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న తొలి గ్రహీత

1994 – ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానం (విజేత కాస్పరోవ్)

1997 – చెస్ ఆస్కార్ విజయం (98, 2003, 04లలో కూడా)

2000 – ప్రపంచ చదరంగ విజేత

– పద్మభూషణ్

2001 – పద్మవిభూషణ్

– స్పెయిన్ దేశపు అత్యున్నత అవార్డు ‘జేమ్స్ డి ఓరో’

2003 – రాపిడ్ చెస్ ప్రపంచ విజేత

2007 – ప్రపంచ చదరంగ విజేత

– చదరంగ చరిత్రలో చెస్ రేటింగ్స్ లో 2800 ఎలో పాయింట్లు దాటిన నాలుగో ఆటగాడు (ఇతరులు: గ్యారీ కాస్పరోవ్, వ్లాదిమిర్ క్రామ్నిక్, వెసిలీన్ తొపలోవ్)

………………………………………………

విషయ సేకరణ: ది హిందూ, ఎన్వికీ, ఈభూమి వారపత్రిక ల నుండి.

……………………………………………….

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to జగజ్జేత ఆనంద్!

  1. రానారె గారికి నెనర్లు, విశ్వనాథన్ ఆనంద్ అసమాన క్రీడాకారుడు…

Comments are closed.