షరా మామూలే…

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు ఈమాటలో, మరికొన్ని కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి. పొద్దులో “తరగతి గదిలో” తర్వాత సౌమ్య రాస్తున్న రెండవ కథ ఇదిః

—————-
“ఈ ఒక్క రోజూ గడిస్తే … ” – ఇలా అనుకోవడం ఎన్నో సారో గుర్తు పెట్టుకునే అలవాటు లేదు రాజేష్ కి. ఇలాంటి నిరాశ నిండిన ఆశల నిట్టూర్పులు విడువటమే అలవాటు కానీ ఎన్ని విడిచామో గుర్తు పెట్టుకోవడం కాదు. అలవాటు గా మరో సారి అనుకున్నాడు. “ఈ ఒక్క రోజు గడిస్తే … రేపట్నుంచి ఇంక ఎంజాయే…” – యాహూ మెసెంజర్ లో ఎవరిదో బజ్ రావడం తో వెలువడిన శబ్దానికి టక్కున స్క్రీను వంక చూశాడు –
“అయిందా?” – కిశోర్ నుండి.
“ఈ వెధవ కిశోర్ గాడు ఒకడు. నేనెక్కడ చదవనో అని వీడి నిఘా ఒకటి.” – విసుగ్గా అనుకున్నాడు రాజేష్ మిత్రుడి శ్రద్ధ కు నవ్వాలో, ఏడవాలో తెలీక.

ఒక్క సారి గడియారం చూసుకున్నాడు. ఇంకో ముప్పావు గంట ఉంది పరీక్షకు. మరో సారి కంప్యూటర్ వైపు తిరిగాడు. కోర్స్ వెబ్సైట్ హోం పేజీ నిండు గా కళకళలాడుతోంది. రాజేష్ కి మాత్రం ప్రొఫెసర్ గయ్యాళి అత్తలా, కోర్స్ ఏమో అప్పడాల కర్రలా, తానేమో – సక్కుబాయి తరహా కోడలిలా అనిపించారు ఓ క్షణం. ఇంతలోనే తమాయించుకున్నాడు – “ఆలోచనలేంటి మరీ ఇంత విచిత్రంగా తయారయ్యాయి” అని. చివరి అరగంట లో ఏం చేయాలో ముందే ప్లాను వేసుకున్నాడు. ఎలాగో మొదటి నుంచి ఆ ప్లాను కాగితం లో ఉన్నవి ఇంటూలే కనుక ఇదొక్కటన్నా టిక్ కొట్టాలని కంకణం కట్టుకున్నంత పని చేసాడు. కాని, ఇంతలోపే – “ఒక్కాట హేంగరూ1 ఆడదాం. ఇది గనుక గెలిస్తే ఈ రోజు బాగా రాయడం ఖాయం.” అనుకున్నాడు. దానికి, దీనికి సంబంధం ఏమిటో గానీ. ఖాళీ డబ్బాలు నింపుతున్నాడు … ఇంకొక్క డబ్బా నింపితే ఈ లెవెల్ దాటి తరువాతి మెట్టు ఎక్కుతాడు. అక్కడ పొరబడ్డాడు. అక్షరమేదో కనుక్కోలేకపోయాడు. పక్కనున్న కంగారూ నానా తిట్లూ తిట్టి ఉరి వేసుకుంది. ఎక్కడ లేని నిరాశా ఆవరించింది రాజేష్ లో. పరీక్ష “సరిగా రాయనా?” – దిగులుగా అనుకున్నాడు. ఇంతలోనే గుర్తు వచ్చింది. ఇంకో అరగంటే అని. అప్పుడు వచ్చినట్లుంది అసలైన పరీక్ష భయం. గబగబా కోర్స్ సైటు కి వెళ్ళి కనబడ్డ మొదటి పీపీటీ ని చదవడం మొదలుపెట్టాడు. ఏమి చదవడమో కాని, అయిదు నిముషాల్లో నలభై స్లైడ్లను తిప్పేసాడు! రెండో పీపీటీ … మూడోది .. అలా నాలుగో దానిలో ఉండగా – తలుపు చప్పుడైంది. నరేన్ గాడు.

“ఏరా … తెగ చదువుతున్నావా? తలుపు తీయడానికి ఇంతసేపా?” – నరేన్ అన్న మాటలకి భోరున ఏడవాలనిపించింది రాజేష్ కి.
“ఒరేయ్, నీకేం అన్యాయం చేసాన్రా? ఎందుకురా నేనేమీ చదవలేదన్న విషయాన్ని చదువు అన్న పదం మళ్ళీ మళ్ళీ పలికి గుర్తు చేస్తావు?” – అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం – “ఏమిటి సంగతి?” – అని అడిగాడు.
“ఏమిటి సంగతా? పాప ఏడ్చింది రా. నువ్వేమన్నా జోల పాడతావేమో అని వచ్చా. మొహం చూడు … 15 నిముషాల్లో పరీక్ష రా. కదులింక.” – వెటకారం తో కూడిన వెక్కిరింత తో మొదలై కాస్తంత కోపం తో ముగించాడు నరేన్.
“ఇంకా 15 నిముషాలు ఉంది కద రా? ఆ ఎదురు బిల్డింగే కదా.. ఎందుకంత తొందర?” – అన్న రాజేష్ స్పందనకి జాలిగా చూశాడు నరేన్. చేసేది లేక బయలుదేరాడు రాజేష్..

దారిలో కిశోర్ తలుపు తట్టారు. లోపల నుంచి ఏదో గొణుగుళ్ళు వినిపించాయి. అస్పష్టంగా ఏవో పదజాలం … తనకు పరిచయమున్నదే … అనుకున్నాడు రాజేష్. వెంటనే తట్టింది – ఇప్పటి పరీక్షదే అని. మరుక్షణానికి అర్థమైంది. లోపల ఆ పరీక్షల పురుగు నెమరువేసుకుంటున్నాడు అని. తానెంత తేలిగ్గా తీసుకుని వెళుతున్నాడో తలుచుకుంటే భయం పుట్టింది. అదే మాట నరేన్ తో అనబోతూ ఉండగా –

“ఒరే, భయమేస్తోంది రా. ఏం చదవలేదు సరిగ్గా. వీడు చూడబోతే ఏమో తెగ చదివేస్తున్నాడు” – నరేన్ కాస్త దిగులుగా మొహం పెట్టి అన్నాడు.
“ఎప్పుడూ ఇంతే అందరూ. నేనేమన్నా అందాం అనుకుంటే ముందే అనేస్తారు. ఇంక నేనేమనాలి? వెర్రిగా అవుననడం తప్ప?” – విసుగ్గా అనుకున్నాడు. గంట క్రితం భోజనం చేస్తూ ఉంటే – నరేన్, కిశోర్ “నువ్వా – నేనా” అంటూ పరీక్షకు సంబంధించిన విషయాలన్నీ చర్చించుకుంటూ ఉంటే తాను కూడా ఆ వేరే క్లాసు వాడు నీల్ లాగా వింతగా, అయోమయంగా వీళ్ళిద్దరినీ చూడడం గుర్తు వచ్చింది రాజేష్ కు. ఇంతకీ కిషోర్ ని బయటకు లాగి “పరీక్ష రాయాలి రా బాబూ” అని గుర్తు చేసి – ముగ్గురూ కలిసి హాలు కి వెల్లారు. ఎవరి నంబర్లు వాళ్ళు చూసుకుని కూర్చున్నారు. రాజేష్ కి ఓ పక్క ఎంత దిగులు గా ఉందో ఓ పక్క అంత నవ్వు వస్తోంది. కిటికీ లోంచి చూస్తూ ఉంటే బయట నడుస్తున్న పిల్లాడి “అరగుండు” క్రాఫు, వాడి తో పాటు నడుస్తున్న వయ్యారి భామ నడక స్టైలూ దానికి కారణం.

అలా తనలో తానే నవ్వుకుంటూ ఉండగా పక్కన కూర్చున్న అమ్మాయి అనుమానంగా చూస్తూ ఉండటంతో నోరు మూసుకున్నాడు . ఇంతలో ప్రశ్నా పత్రాలు ఇచ్చారు. రాజేష్ కి తెలుసు – అది తనకు అయోమయంగానే అనిపిస్తుంది అని. అయినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చూశాడు. తెలిసిన ప్రశ్నలు ఉన్నన్ని తెలీని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. సరే – ఎంతో కొంత రాస్తాము లే అని రాయడం మొదలుపెట్టాడు.

మొదటి ప్రశ్న. ప్రశ్న ని చూస్తే తెలిసినట్లే అనిపించింది. రాయబోతూ ఉంటే పెన్ను కదలడం లేదు. తన ఆలోచనా శక్తి న్యూరల్ నెట్వర్కు లో చిక్కుకుని బయట పడే దారి మర్చిపోయి ఇరుక్కుపోయినట్లు అనిపించసాగింది రాజేష్ కి. అంత గందరగోళంగా ఉంది “దీని జవాబు మనకు తెలుసు” అనుకున్న ప్రశ్న పరిస్థితే! ఆ నిముషం లో అనుకున్నాడు – ” కాస్త శ్రద్ధ గా చదివి ఉంటే ఎంత బాగుండేది” – అని. ఆ అనుకోవడం అలా ప్రతి ప్రశ్న కూ అనుకుంటూనే ఉన్నాడు. క్లాసు ఎగ్గొట్టి క్యాంటీన్ లో కబుర్లు చెప్పుకోవడం, దొరికిన ప్రతి సినిమా నీ చూడ్డం, చూడనన్న ఆ కిశోర్ గాడిని చూసి వెటకారంగా నవ్వడం, కనబడ్డ ప్రతి వాణ్ణీ దారిలో ఆపి సుత్తి కొట్టడం, చివరి నిముషం లో ల్యాబ్ రికార్డు నరేన్ నుంచి కాపీ కొట్టేసి, వైవా లో చావు తప్పి కన్ను లొట్టపోయి కష్టపడి గట్టెక్కడం, మొదటి నుంచి, చివర దాకా ప్రతి అసైన్ మెంటు నీ కిశోర్ గాడి దగ్గర కాపీ కొట్టడం, క్లాసు లో శుభ్రంగా నిద్రపోవడం – ఒక్కోటీ జవాబు పత్రాన్నే 70 ఎమ్.ఎమ్. స్క్రీను లా మార్చేసి రాజేష్ కళ్ళ ముందు కదలాడ్డం మొదలుపెట్టాయి. పాడైపోయిన సెమెస్టరు గురించిన పశ్చాత్తాపానికీ, గ్రేడు కాపాడుకోవడానికి మిగిలిన చివరి అవకాశమైన పరీక్షకీ మధ్య ఊగులాడుతూ కాగితం పైన ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పక్కన కూర్చుని ఉన్న గుప్తా ఒక అడీషనల్ షీటు కోసం అడగడం వినిపించింది. తానింకో ఎనిమిది పేజీలన్నా రాయనిదే మరో షీటు తీసుకోడు. అతనేమో అప్పుడే .. రాజేష్ కి గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం మొదలైంది. ఇటు పక్కకి చూశాడు. వంచిన తల ఎత్తకుండా రాస్తున్న నరేన్ కనిపించాడు. ముందుకి చూస్తే – శ్రద్ధ గా స్కేలు తో మార్జిన్ గీస్తున్న కిశోర్ గాడు కనిపించాడు. మరు నిముషం తన పేపరు చూసుకున్నాడు. చేత్తో మడిచి చేసుకున్న మార్జిన్, పరమ కేర్ లెస్ గా రాస్తున్న చేతి వ్రాత … ” పనికిమాలిన వెధవా!” – తండ్రి తిట్లు గుర్తు వచ్చాయి. “మనుష్యులెందుకో ఇంత శ్రద్ధగా పని చేస్తారు – నా లాంటి వాళ్ళ ప్రాణాల మీదకు తేవడానికి కాకపోతే. ” – అనుకున్నాడు. మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు.

కాసేపు రాసాడో లేదో – బోరు కొట్టేసినట్లు ఉంది .. మళ్ళీ తల పైకి ఎత్తాడు. బయటి నుంచి చల్లని గాలి వస్తోంది. కిటికీ వైపు కి చూశాడు. మబ్బు కమ్ముకుంది. వర్షం పడేలా ఉంది. మట్టి వాసన కూడా వస్తోంది సన్నగా. “ఇలాంటి మంచి వాతావరణం లో ఈ గదిలో పరీక్ష రాయడం … చ!” – నిట్టూర్చాడు. “అసలు మనిషి గా కాక ఏ జంతువు గా పుట్టి ఉన్నా కూడా ఈ పరీక్షల గోల ఉండేది కాదు. హాయిగా ఆ వర్షం లో తడుస్తూ, నేల పై పడ్డ నీటిపై చిందులేస్తూ తిరిగేవాణ్ణి. ఇలా జైలు లాంటి ఈ గదిలో కూర్చుని నిట్టూర్చే బాధ తప్పేది.” – దిగులుగా అనుకున్నాడు. “అసలు టెక్నాలజీ ఎందుకు?” – మొన్న సురేంద్ర తో చేసిన చర్చ గుర్తు వచ్చింది. “నిజమే, అప్పుడు ఏమీ తెలీలేదు కానీ .. అసలు టెక్నాలజీ ఎందుకు? ఈ కంప్యూటర్లూ, ఈ పరిశోధనలూ లేకుండా మనుష్యులు బ్రతకలేరా ఏం? పోనీ వాళ్ళ మానాన వాళ్ళు కొత్త వస్తువులు కనిపెట్టి ఊరుకుంటారా అంటే లేదు. అవన్నీ మనకు పాఠ్యాంశాలు అయి కూర్చుంటాయి. ప్రతి సంవత్సరమూ సీనియర్ల కంటే ఎక్కువ సిలబస్సు పెడతారు. పైగా – విలువలు తగ్గిపోతున్నాయి అని గోల. అంతంత చదవమని అంతా అర్థం చేసుకొమ్మంటే ఎలా? 20 ఏళ్ళ క్రితానికీ, ఇప్పటికీ తేడా ఉందంటే వినరు.” – ఒక్క సారే అందరినీ తిట్టేసుకున్నాడు. “హాయిగా ఆది మానవుడిగా పుట్టినా బాగుండేది. ఈ ఎగ్జామ్స్ గోల ఉండేది కాదు” – కసిగా అనుకున్నాడు. ఏ కళనున్నాడో – ముందు కూర్చున్న వాడు అడిషనల్ తీసుకోవడం తో మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు – ఈ స్వగతాలన్నీ ఆపేసి.

రాత్రి కూడా ఓ సినిమా చూసాడు – ఈరోజు ఎగ్జామ్ అని తెలిసి కూడా. పొద్దున్న టిఫిన్ తిన్నాక చదువుకుందాం అనుకుని పనిగట్టుకుని 10 దాకా టిఫిన్ తినకుండా వుడ్ హౌస్ నవల చదువుతూ కూర్చున్నాడు. “ఇన్ని చేసి కూడా బాగా రాయడం లేదని బాధపడ్డం అవసరమా?” – అనుకున్నాడు. “ఒక్క క్లాసన్నా విని ఉండాల్సింది. కనీసం ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పిన క్లాసులు అన్నా విని ఉండాల్సింది.” – అనుకున్నాడు. అయినా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పిన క్లాసులు ఏవో ముందే ఎలా తెలుస్తుంది? “ఆ టీయే ని బెదిరించో, బ్రతిమాలో కొన్ని ప్రశ్నలు తెలుసుకుని ఉండాల్సింది.” “అదేదో ఫార్వర్డ్ వచ్చిందే ఆ మధ్య – ఓ పిల్లాడు మేరీ మాత విగ్రహం ఎత్తుకుపోయి క్రీస్తు ని బెదిరిస్తాడు – ’మరియాదగా నా కోరికలు తీర్చకపోతే మీ అమ్మ ను నీకివ్వను’ అని … అలా సార్ వాళ్ళ వాళ్ళు ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది?” – ఇలా సాగాయి రాజేష్ ఆలోచనలు. ఓ సారి హాలంతా చూసాడు. ఎవరి రాతల్లో వారు మునిగి ఉన్నారు. ఆ చివర కుర్చీ వద్ద మాత్రం తన లాంటి వాడే ఒకడు – చంద్రా మాత్రం అయోమయం గా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరి చూపులూ ఒక్కసారి కలుసుకున్నాయి. ఇద్దరికీ అవతలి వాళ్ళ పరిస్థితి అర్థమైంది. అవతలి మనిషి పై జాలో, లేక మనలాంటి వాడు ఒకడు ఉన్నాడు అన్న ధైర్యమో కానీ, ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో ఇన్విజిలేటర్ తన వైపు కి రావడం తో ఎక్కడ కాపీ అని అనుమానిస్తాడో అన్న భయం తో చంద్రా తలవంచుకుని ఏదో రాస్తున్నట్లు నటన మొదలుపెట్టాడు. దానితో రాజేష్ కూడా తల వంచుకున్నాడు.

ఎందుకో అనుమానం వచ్చి ఓ సారి వాచీ చూసుకున్నాడు. ఇంకా అరగంటే ఉంది సమయం. “ఇంకా అరగంటుందా?” అనుకున్నాడు విరక్తిగా. అప్పటికే తను రాయగలిగినంత వరకు రాసేసాడు. ఇంక ఎన్త గింజుకున్నా ఒక్క లైను కూడా రాయలేడని అర్థమైంది. తన ప్రదర్శన ఏమంత బాగా అనిపించలేదు రాజేశ్ కి. తన నిర్లక్ష్యానికి తననే మరోసారి నిందించుకున్నాడు. “మొదటి నుంచీ కాస్త శ్రద్ధగా చదివి ఉండవలసింది.” – అనుకుని నిట్టూర్చాడు. స్కూలు రోజుల్లో ఉన్న రాముడు మంచి బాలుడు తరహా ఇమేజీ గుర్తు వచ్చింది. బహుశా ఈ కోర్స్ ప్రాఫ్ తన గురించి ఇలా అనుకుంటూ ఉంటాడు అన్న- “రౌడీ వెధవ” ఇమేజ్ గుర్తు వచ్చింది. “ఇప్పుడనుకుని మాత్రం ఏమి లాభం? అన్తా అయిపోయాక!” – దిగులు పడ్డాడు. “మై ఐసా క్యూ హూ..” – అనుకున్నాడు. “ఏ తీరుగ నను దయచూసెదవో .. ఓ నా మంచి గురువా.. ” , “నను బ్రోవమనిచెప్పవే .. ఓ ఆన్సర్ షీటా!”, “నా తరమా … పరీక్షాసాగరమీదను…” – రామదాసు ను తలుచుకోకుండా ఉండలేకపోయాడు. ఇంకా అక్కడే కూర్చుంటే సన్యాసి గా బయటకు వస్తాడేమో అనిపించింది. దానితో – “ఏదో ఒకటి రాసాను లే” – అనుకుని పేపర్ ఇచ్చేసి హాలు బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ సీరియస్ గా అనుకున్నాడు వచ్చే సారి నుంచన్నా బాగా చదువుకోవాలి అని. బయటకు వచ్చి మెట్లు దిగుతూ ఉంటే ఎదురు గది నుండి తన లాంటి మొహమే పెట్టుకుని బయటకు వస్తున్న నీల్ గాడు కనిపించాడు.

ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కలుసుకున్నారు. ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంతసేపూ పరీక్ష సరిగా రాయలేదు అనుకుంటున్న వాడల్లా దాని గురించి మరిచిపోయాడు. “చలో రే… చాయ్ పియేంగే!” – అనుకుని ఇద్దరూ కాఫీ షాప్ వైపు దారి తీసారు. “ఆజ్ ఏక్ సినిమా దేఖ్నా హై భాయ్!” – నీల్ అనడం తో – “క్యూ నహీ? జరూర్!” అని ఈల వేసుకుంటూ ముందుకు అడుగేసాడు రాజేష్. వెళుతూ ఉంటే ఎవరో ఆపి – “ఎలా రాసావు?” అని అడిగారు. “ఓకే…” అంటూ సాగదీసి – “ఏం చదువులో ఏమో!” అని ఓ సారి మళ్ళీ నిట్టూర్చి, “జానేదో! ఇది కాకుంటే ఇంకోటి! విద్యార్థి జీవితం లో పరీక్షలకి కొదువా? వచ్చే పరీక్షలు బాగా రాద్దాం” అనుకున్నాడు. “ఇలా అనుకోవడం ఇది ఎన్నో సారి చెప్పు?” – ఓ పక్క లోపలి మనిషి ప్రశ్నిస్తూ ఉంటే – “కుక్క తోక వంకర అన్నట్లు ఉంది లే నీ వాలకం” అని వెక్కిరిస్తూ ఉంటే – ఎప్పటిలాగే ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. “మారేదెవరు? మార్చేదెవరు? మారాలని అనుకున్నా, మారలేను. మారను. అదే నేను..నా జీవితం. బాగుందా రా నా ఫిలాసఫీ?” రాజేష్ మాటలకి మనసులో “హమ్మయ్య… నాకో తోడు దొరికాడు..” అనుకున్నాడు నీల్. దాంతో అంతా మర్చిపోయి చెట్టాపట్టాలేసుకుని పరీక్షలైపోయాయన్న ఆనందం లో స్వేఛ్ఛావిహంగాలై రెక్కల్లేకుండానే ఎగురుతూ క్యాంటీన్ వైపుకి దారి తీసారు ఇద్దరూ.

1. Hangaroo అని ఒక ఆట ఉంది. Hangman తరహా ఆట. అయితే పక్కనో kangaroo బొమ్మ ఉంటుంది. అది మనం తప్పు అక్షరాలు నొక్కినప్పుడల్లా ఏదో తిట్టడమూ, సరైనవి నొక్కితే పొగడడమూ చేస్తుంది. చివరికి మనం అక్కడున్న పదాన్ని కనిపెట్టకుండానే మనకున్న 4 అవకాశాలు ముగిసిపోతే దానికి ఉరి శిక్ష. మనం ఓడిపోయాము అన్న దానికి సూచనగా అది ఉరితీయబడి, ఆత్మ గా మారి స్వర్గానికి వెళ్ళిపోవడం తో ఆట ముగుస్తుంది. స్థూలంగా ఇది ఆట.
————
*ప్రతి మనిషి లో నూ ఏదో ఓ సమయం లో రాజేశ్ పరకాయ ప్రవేశం చేసి ఉంటాడు అని నా నమ్మకం. మీరేమంటారు?

————-

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com)

About వి.బి.సౌమ్య

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

11 Responses to షరా మామూలే…

 1. radhika says:

  చాలా బాగుంది సౌమ్య.ఫెయిల్ అయ్యే అంత కాకపోయినా ఎప్పుడూ 60 తగ్గకుండా ,60 కి పెరగకుండా సాగిన నా చదువులో అడుగడుగునా రాజేష్ పరకాయ ప్రవేశం జరిగింది.ప్రకాయ ప్రవేశం వాడడం తప్పేమో నేనూ రాజేష్ నే అనాలేమో?

 2. Lalitha Sravanthi says:

  its absolutely correct

 3. Sivanand says:

  Recently i found this blog name in eenadu paper. So first i visit this blog i read this story. Its really good. Hope every average studend will experecinced this. I am interesting to read story’s, novels. But i don’t know the sites so every time i am waiting for eenadu sunday special story. Now i think i can expect more storys in these blogs.

  Thanks Poddu.net

  Wish you all the best

 4. Bhoopal M Reddy says:

  Thanks to poddu.net,

  I found this site in eenadu sunday special,

  then search for once with a trail.

  Now Iam really feel very about regarding these stories and ofcourse encouraging young web browsers writers.

  If any one who sketch the cartoons with humorous comments send and publish in this site.

  Thanks to PODDU

 5. subhash says:

  this story is 100% sutable for me also.

  I am very fond of telugu stories, Thank to sowmya garu and Poddu.

 6. prasanthi says:

  Very hilarious, Sowmya. In fact I liked this one very much out of all that I read of yours.

 7. Rajesh says:

  నా పేరు రాజేష్. కథ చాలా బావుంది. నేను మరీ మీ కథలో లాంటి వాడ్ని కాదు కాని నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ IIT రోజులు గుర్తుకువచ్చాయి.

 8. Classy narration…Really enjoyed.

 9. Pavan Kumar says:

  Sowmya Garu,

  This is a fantastic story. This is the best of all your stories posted in this site. I really think every student will identify himself/herself with one aspect or the other you describe in your stories. Your eye for trivial yet hilarious aspects of life and your expression are simply out of the world. Now I will go and read all that you have posted in your personal site.

  Thanks again for the great story. Keep going!!

 10. KK Bhimavarapu says:

  Soumya garu kadha bagundi. Sagatu sudents andaru ilane vuntaremo. Narration style chala bagundi.Keep it up.

 11. vinay chakravarthi says:

  …mmmmm nenu raajesh la fims choosi veltanu examki but……manaki eppudu prob face cheyaledu………mee narration stylr chala typical…………neural networks lanti words..use cheyadam avasarama………….ani…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *