సినిమా

ఈ ఏటితో తెలుగు సినిమాకు డెబ్భై ఐదేళ్ళు నిండాయి. 1931లో మొదలైన (టాకీ) సినిమాలు 1950ల నుంచి తెలుగువాళ్ళను అచ్చంగా సినీమాయలో పడేశాయి. సమాజంలో వీటికున్న విస్తృతి, ప్రభావశీలతల వల్ల సినిమాలు ఒక శక్తివంతమైన మాధ్యమగా అవతరించాయి. తెలుగువాళ్ళనింతగా ప్రభావితం చేస్తున్న సినిమాలెలా తయారవుతాయో తెలుసుకోవాలనే కుతూహలం గలవారి కోసం ఈ సినిమా శీర్షిక. రానున్న సంచికల్లో అసలు సినిమాలెలా తీస్తారో, చిత్రనిర్మాణంలోని వివిధ దశల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.

***

సినిమా – ఒక పరిచయం:

సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’ అనే చిన్నకథ కూడా ఇటీవలే సినిమాగా వచ్చింది. ఐతే ఏ సాహితీరూపమైనా ఎటువంటి మార్పులూ లేకుండా యథాతథంగా తెరమీదికెక్కదు. లిఖితమాధ్యమానికి, దృశ్యమాధ్యమానికి మధ్య ఉన్న మౌలికమైన తేడాలు, ఆ రెండుమాధ్యమాలకు ఉన్న వేర్వేరు పరిమితులు ఈ మార్పులకు కారణాలు.

ఉదాహరణకు ఒక నవలనే తీసుకుంటే సాధారణంగా ఒక రచయిత తనకు ఏం రాయాలనిపిస్తే అది, ఎలా రాయాలనిపిస్తే అలా లేదా తానెలా రాయగలిగితే అలా రాసేస్తారు. వీలైనంతవరకు తనకు నచ్చిన విధంగా నవల రాసుకునే వెసులుబాటు, స్వేచ్ఛ ఆ రచయితకు ఉంటాయి. ఒక ఆలోచన వచ్చిన వెంటనే కుదురుగా కూర్చుని ఏకధాటిగా రాసుకుపోవచ్చు రచయిత. ఐతే సినిమా అలా కాదు. ఒకరికి వచ్చిన ఊహ లేక ఆలోచనకు దృశ్యరూపమివ్వడానికి ఎంతో మంది కలిసి శ్రమిస్తేగానీ ఒక సినిమా తెరకెక్కదు. సినిమా శిల్పమనేది కథాశిల్పానికంటే, నవలాశిల్పానికంటే వేరుగా ఉంటుంది. సినీమాధ్యమానికున్న సాంకేతిక పరిమితుల వల్లా, ఆర్థిక పరిమితుల వల్లా, భిన్న వర్గాలకు చెందిన ప్రేక్షకుల అభిరుచులు, అవగాహనాస్థాయిల్లోని తేడాల వల్లా దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అలవడ్డాయి. ఆ ప్రత్యేక లక్షణాలు కథల ఎంపిక, కథను నడిపే తీరు (కథాకథనం), పాత్రధారుల ఎంపికలో వివిధరకాలుగా వ్యక్తమవుతాయి.

కథల ఎంపిక: సినిమా తీయాలంటే అన్నిటి కంటే ముందుగా కావలసింది కథ. ఎవరెన్ని రకాలుగా చెప్పినా కథే సినిమాకు ప్రాణం. నేల విడిచి సాము చేసే ఉత్సాహంలో కొందరు నిర్మాతలు ఈ ప్రాథమిక సూత్రాన్నే మరిచిపోయి పెద్ద పెద్ద తారలు, సాంకేతిక నిపుణులతో డేట్లు కుదుర్చుకుని, తాము తీయబోయే సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఆశపడి భారీగా ఖర్చుపెట్టి భంగపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నటుల లేక సాంకేతిక నిపుణుల సామర్థ్యం కథాబలాన్ని పెంచడానికి, కథను మరింత బాగా ప్రెజెంట్ చెయ్యడానికీ ఉపయోగించుకోవాలే తప్ప అవుంటే చాలు సినిమా ఆడేస్తుందని భ్రమలు పెంచుకోరాదు.

సినిమాలకు ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి? ఎలాంటి కథలనైనా ఎంచుకోవచ్చు. పౌరాణికాలతో మొదలై సాంఘికాలు, జానపదాలు, చారిత్రకాలు…ఇలా కొనసాగిన సినీప్రస్థానంలో ప్రతీకాత్మక కథలు (Allegories: ‘ఉపేంద్ర ‘ సినిమా), ‘ఆదిత్య 369′ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు తీసి కూడా ప్రేక్షకులను మెప్పించవచ్చని ఉపేంద్ర, సింగీతం శ్రీనివాసరావు లాంటి సాహసికులు నిరూపించారు. కాలాన్ని బట్టి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను బట్టి కథలను ఎంచుకోవాలి. బాగా తీస్తే జానపదాలకు, పౌరాణికాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని భైరవద్వీపం, బాలల రామాయణం నిరూపించాయి. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఒకప్పుడు యాంటీ సెంటిమెంటు కథలను ప్రేక్షకులు తిరస్కరించారు. మారిన సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పుడంత వ్యతిరేకత లేదు. ఒకప్పుడు సెంటిమెంటు డోసు ఎక్కువైనా జనం ఎగబడి చూసేవారు. ఇప్పుడు వెనుకాడుతారు. ఐతే ఎలాంటి కథనెన్నుకున్నా అది సగటు ప్రేక్షకులకు నచ్చాలనేదే సినీమాధ్యమంలో తారకమంత్రం.

కథనం: కథ చెప్పే (లేక కథ నడిపే) విధానమే కథనం. ఎంత మంచి కథనెన్నుకున్నా కథనసామర్థ్యం లేకపోతే ప్రేక్షకులకు, తద్వారా నిర్మాతకు నిరాశే కలుగుతుంది. సినిమాకు ఎలాంటి కథనెన్నుకున్నారని కాక ఎన్నుకున్న కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారన్నదే సాధారణంగా చిత్రవిజయాన్ని, పరాజయాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని కథలు టూకీగా (ఔట్‌లైన్) వింటే అద్భుతమనిపిస్తాయి. నిర్మాతలు కూడా ఆ నమ్మకంతోనే చిత్రనిర్మాణానికి సిద్ధపడుతారు. కానీ వాటిని ట్రీట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళేసరికి క్రమంగా బలహీనపడి చివరికి చాలా పేలవంగా మారి నీరుగారిపోతాయి. మరికొన్ని కథలు ఔట్‌లైన్ వింటే సాదాసీదాగా అనిపిస్తాయి. కానీ అవేకథలకు సరైన ట్రీట్‌మెంట్ కుదిరితే ఘనవిజయం సాధిస్తాయి. మారుతున్న కాలంతోబాటే కథనరీతులు కూడా మారుతూ ఉంటాయి. కథను ఆసక్తికరంగా నడిపించడానికి లిఖిత సాహిత్యంలో అవసరం లేని/అవసరం రాని కొన్ని అదనపు లక్షణాలు సినిమా కథలకున్నాయి – ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి. (ఇంటర్వెల్ బ్యాంగ్: రాతలో ఉన్నప్పుడు ఎంత పెద్ద నవలకైనా మధ్యలో విశ్రాంతి లాంటివేవీ ఉండవు. పాఠకుడికెప్పుడనిపిస్తే అప్పుడే ఇంటర్వెల్..ప్రొజెక్టర్ అతడి చేతిలోనే ఉంటుంది కాబట్టి! (ఇక్కడ పుస్తకమే ప్రొజెక్టర్). కానీ సినిమాల్లో (ముఖ్యంగా మన భారతీయ సినిమాల్లో) భవిష్యత్తు సంగతి చెప్పలేం గానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం సినిమా నిడివి దృష్ట్యా ఇంటర్వెల్ తప్పనిసరిగా ఉంటుంది. సినిమాకొచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకూ చూసి బోర్ కొట్టి వెళ్ళిపోకుండా నిలబెట్టేందుకైతేనేమి, తర్వాతేం జరగబోతోందోననే ఆసక్తి రేకెత్తించడం కోసమైతేనేమి ఇంటర్వెల్ బ్యాంగ్ అనే టెక్నిక్ ను (తప్పనసరిగా కాదుగానీ) ఎక్కువగా వాడుతారు. అంటే కథను ఒక ఆసక్తికరమైన లేక ఊహాతీతమైన మలుపు తిప్పి, ఏం జరుగుతోందో ప్రేక్షకులకు అర్థమై, ఏం జరగబోతోందో అని వాళ్ళలో ఉత్కంఠ రేగేవేళ, సరిగ్గా అప్పుడే ఆ మలుపులోనే ఇంటర్వెల్ కార్డు పడేస్తారు. కథ నడపడంలో ఇదో టెక్నిక్)

పాత్రల పరిచయం: “అనగనగా ఇద్దరు అన్నదమ్ములు. అన్న మంచివాడు, తమ్ముడిదేమో దొంగబుద్ధి…” అని చందమామ కథ లో లాగ మొదలయ్యే కథకు దృశ్యరూపమివ్వాలంటే వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు అని ఒక్క ముక్కలో చెప్పడానికి వీల్లేదు. ప్రతిదీ సన్నివేశాలపరంగానే చెప్పాలి. వీడి మంచితనం, వాడి చెడ్డతనం ప్రేక్షకులకు ఇట్టే అర్థమయ్యేటట్లు ఒకటిరెండు సన్నివేశాల్ని సృష్టించాలి. ఐతే ఇందుకు ప్రత్యేకంగా సన్నివేశాలను సృష్టించనవసరం లేకుండా కథాగమనంలోనే – అదీ కథాప్రారంభంలోనే – వారి స్వభావాలు తేటతెల్లమయ్యేటట్లు చూడ్డం ఇంకొక పద్ధతి. ఈ పద్ధతిలో కథనం చిక్కగా ఉన్నట్లనిపించినా సంభాషణలు కృతకంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి.

గతంలో శ్రీవారికి ప్రేమలేఖ, మంచుపల్లకి లాంటి సినిమాల్లో ఒక సన్నివేశంలో ఒక పాత్రను చూపించి, ఆ పాత్ర మీద కెమెరా ఫ్రీజ్ చేసి “ఈ మనిషి ఇలాంటివాడు” అని బ్యాక్ గ్రౌండు నుంచి చెప్పించారు. ఈ పద్ధతి ఇప్పుడు చెల్లదు. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో పాత్రల పరిచయం, మరి కొన్ని సరదా సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు నడిపించి, ఆ తర్వాతే అసలు కథలోకి వెళ్తున్నారు.

పాత్రధారుల ఎంపిక: పాత్రలకు తగిన పాత్రధారులను ఎంచుకోవడం నిజంగా కత్తిమీదసామే. కథ, కథనాలు బాగున్నా కేవలం కాస్టింగు(పాత్రలకు సరిపోయే పాత్రధారులు) నప్పకపోవడం వల్ల సినిమాలు ఫెయిలైన సందర్భాలు ఉన్నాయి. నటీనటుల నటనా సామర్థ్యంతో బాటు వాళ్ళ విగ్రహం, ఆంగికం, వాచికం లాంటివి అన్నీ పాత్రకు సరిపోతేనే ఆ పాత్రకు తీసుకోవాలి. లేకపోతే అపాత్రతే అవుతుంది. (ఇప్పుడు కాస్త నయం. నటుడి గొంతు బాలేకపోతే డబ్బింగు ఆర్టిస్టుది అరువు తెచ్చుకోవచ్చు.) ఇవేవీ కాకుండా కేవలం ఆయా నటులకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ పాత్ర స్వభావానికి సరిపడకపోవడం కూడా కొన్నిసార్లు కాస్టింగును దెబ్బతీస్తుంది. ప్రేక్షకులు కొందరు నటులను కొన్ని రకాల పాత్రల్లో ఆదరించినంతగా ఇతరపాత్రల్లో ఆదరించరు. దీనికితోడు మరికొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలుగులో కనీసం ఇద్దరు ప్రముఖ హీరోలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. అభిమానుల అభిమానం వెర్రితలలు వేసి నటులు తమ ఇమేజ్ చట్రంలో తామే బందీలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అసాధారణ నటనాసామర్థ్యముండి కూడా ఇమేజ్ పరిమితులకు లొంగని నటులు ఆ కాలంలోనూ (ఎస్వీ రంగారావు), ఈకాలంలోనూ (కమల్ హాసన్) ఉన్నారు.

సినీమాధ్యమానికున్న పరిమితులు:

సాంకేతిక పరిమితులు: రచయితదేం పోయింది? నవల్లోని పాత్రలు అసాధ్యమైన ఫీట్లు చేసినట్లుగా రాసిపారేస్తారు. దాన్ని తెరమీదకెక్కించాలంటే దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ చుక్కలు కనిపిస్తాయి. ఐతే కె.వి.రెడ్డి లాంటి మాయామేయ దర్శకుడికి మార్కస్ బార్ట్లే లాంటి ఛాయాగ్రాహకుడు తోడైనప్పుడు ఇలాంటి పరిమితులూ అవాక్కైపోయి నోరు తెరుచుకుని సినిమా చూసేస్తాయి.

ఆర్థిక పరిమితులు: రచయితకొచ్చిన ఒక ఆలోచన దృశ్యరూపంలో సాక్షాత్కరించడానికి డబ్బులు కావాలి. ఇంకా దానికెంతో మంది సాంకేతికనిపుణుల సహకారముండాలి. అందరి మధ్యా గొప్ప సమన్వయముండాలి. (ఒక్కోసారి “వంటగాళ్ళెక్కువై వంట చెడిపోవడం” కూడా జరుగుతూ ఉంటుంది.)ఇంతా ఖర్చు పెట్టి, ఇంతమంది కలిసి ఇంత శ్రమ పడ్డాక దాన్నెవరూ చూడకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నిర్మాత మునిగిపోతాడు. కాబట్టి తీసే సినిమాను జనాలకు నచ్చేటట్లు జనరంజకంగా తీయాలని నిర్మాత ఆశించడంలో తప్పులేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమాలు తియ్యడం అందరివల్లా అయ్యేపని కాదు. అందుకే నిర్మాతలు ప్రేక్షకుల్లో ఒక వర్గానికి బాగా నచ్చే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. గతంలో మహిళా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కడవలకొద్దీ కన్నీళ్ళు కార్పించే సినిమాలు తీశారు. యువతరాన్ని థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఒకప్పుడు ఫైట్లు, డాన్సులు పనికొస్తే ఇప్పుడు శృంగారానికీ, బూతులకే అగ్రతాంబూలమిస్తున్నారు. ఇది ఈమధ్య తరచుగా శృతిమించుతోంది కూడా.

లక్షిత ప్రేక్షకులు/టార్గెట్ ఆడియెన్స్: సాహిత్యం పుస్తకాల్లో ఉన్నంతవరకు దాన్ని చదివేవాళ్ళు సాధారణంగా సాహిత్యం పట్ల ఒక అభిరుచి, అవగాహన ఉన్నవాళ్ళై ఉంటారు. వారి అభిరుచికి, అవగాహనాస్థాయికి సరిపోయేవిధంగా రాసే సాహిత్యం చదివేవారికి అద్భుతంగా నచ్చినా యథాతథంగా తెరమీదికెక్కిస్తే సగటుప్రేక్షకులకు ఎక్కకపోవచు. వినోదం కోరి సినిమాలకొచ్చే సగటు ప్రేక్షకులు సినిమాల్లో వాస్తవికతను జీర్ణించుకోలేకపోవచ్చు లేదా కొత్తదనాన్ని ఆమోదించకపోవచ్చు. జనరంజకాలైన పాటలు లేవనో, కామెడీ లేదనో అసంతృప్తి చెందే అవకాశమే ఎక్కువ. కాలాతీతవ్యక్తులు నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ గా తీసినపుడు కథను దాదాపు పూర్తిగా మార్చివేశారు. ఆ నవల అంతగా ప్రసిద్ధం కావడానికి కారణమైన ఇందిర పాత్ర ప్రవర్తననుగానీ, ఆ పాత్ర మనస్తత్వ చిత్రణను గానీ సగటు ప్రేక్షకులు జీర్ణించుకోలేరనేమో పూర్తిగా మార్చేశారు.

-సుగాత్రి (http://sahityam.wordpress.com)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

7 Responses to సినిమా

  1. radhika says:

    calaa cakkati vyaasam.

  2. Krishh Rame says:

    అన్ని వ్యాసల్లో నాకు నచ్చిన వ్యాసమిది !!

    సినిమా గురించి కదా మరి !!

    చాలా బావుంది !!

  3. చాలా బావుంది !!
    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. valluri says:

    బాగుంది. మరిన్ని తెర వెనుక విషయాలు వ్రాయండి.

  5. చాలాపెద్ద విషయాలు ఒకే వ్యాసంలో చెప్పేశారు. సుగాత్రిగారు పొద్దుకోసం మళ్లీ రాయనన్నారా!? ఒకోవిషయానికి ఉదాహరణలతో నాలుగైదు వ్యాసాలుగా రాసివుంటే మరింత ఆసక్తిదాయకంగా వుండేదికదా. మంచి విషయపరిజ్ఞానమున్న ఇలాంటి రచయితలు ఒకో విషయంపైనే రాస్తూంటే పొద్దుపొడుపులు అప్రతిహతంగా కొనసాగుతూ వుంటాయి కదా!!

  6. రానారె గారూ!
    మీ అభిమానానికి కృతజ్ఞతలండీ! నా వ్యాసం ఇంతమందికి ఇంతబాగా నచ్చుతుందని, నా తర్వాతి వ్యాసం కోసం పొద్దు పాఠకులు ఎదురుచూస్తారని నేను ఊహించలేదు. నా తర్వాతి వ్యాసం ఈ వారాంతంలో పొద్దుకు అందిస్తాను. ఇకమీదట నా మూలంగా ఆలస్యం కాకుండా చూస్తాను. స్పందించిన పాఠకులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.

  7. vasanth says:

    nenu mee blog gurinchi eenadu lo chadivi telusukunnanu. e roju date 5th august 2007.
    cinema vysamu bagundi chala chakkaga vrasinaru. migatha blogs chaduvuthanu

    vasnath

Comments are closed.