మా గురించి

అనగనగా పొద్దనగా..

“ఏమిటి మీ పొద్దు అంటే?” అని అడిగారొకాయన.
“తెలుగు వెబ్ పత్రికండి” అన్నాం.
“ఆహాఁ.. చాలా ఉన్నాయిగా వెబ్ పత్రికలు” అని స్వగతంలో అనుకున్నట్లు అనుకుని “ఏవిఁటి పొద్దు ప్రత్యేకత?” అని అడిగారు.
“లాభాపేక్ష లేని వెబ్ పత్రిక” అని అన్నాం.
“లాభ అపేక్ష లేని” యా లేక “లాభ అవకాశం లేని” యా అని అన్నారాయన, అవకాశాన్నొత్తి పలుకుతూ.
కాస్త సర్దుకుని, బెట్టుగా “లాభాపేక్ష లేనియే” అని అన్నాం.
“కానీ, వెబ్ పత్రికలన్నీ కూడా లాభాపేక్ష లేనివేగా.. పొద్దు ప్రత్యేకత ఏవిటని?” అని అడిగారు.
“ఇతర పత్రికల్లాగా నెలకోసారో రెణ్ణెల్లకోసారో రావడం కాదు, పొద్దు వారానికి ఒకసారో రెండు సార్లో ఉదయిస్తుంది”
“ఓహో, అదన్నమాట! బావుంది.” అనేసి, మళ్ళీ వెంటనే.. “కానీ బ్లాగులూ అలాంటివేగా, మరీ?” అని అడిగారు.
దొరికేసాడు లెమ్మనుకుని..
“బ్లాగులో సదరు బ్లాగరి ఒక్కరి ప్రతిభే కనబడుతుంది. పొద్దు అనేకుల ప్రతిభకు వేదిక కదా! అదన్నమాట తేడా” అన్నాం.
ఆయనూరుకోలేదు..
“అయితే కొందరు కలిసి రాసే ఉమ్మడి బ్లాగన్నమాట, పొద్దు!” అనేసి వెళ్ళిపోయారు.

————————

వ్యక్తుల ప్రతిభావేదికే గదా ఏ పత్రికైనా! పొద్దూ అంతే!
అనేకమంది నెజ్జనుల ప్రతిభా ప్రదర్శన వేదిక, పొద్దు!

బ్లాగులో టపాలుంటాయి, పొద్దులో వ్యాసాలుంటాయి.
బ్లాగులో బ్లాగరి తనకు నచ్చింది పెట్టుకోవచ్చు, పొద్దులో పాఠకులు మెచ్చతగినివే ఉంటాయి.
పొద్దుకొచ్చిన రచనలన్నీ సమీక్షించబడ్తాయి, చాలా వరకూ తిరస్కరించబడ్తాయి.

————————

పొద్దు సంపాదకులకు సొంత జెండాలు, ఎజెండాలు లేవు. సొంత వ్యాపారాలూ లేవు. అంచేత తెలుగు దినపత్రికల స్థాయి లేదు.
పొద్దులో బూతు బొమ్మలు ఉండవు. కాబట్టి ‘వార’పత్రికల స్థాయి లేదు.
పొద్దుకు ఛీఫ్ ఎడిటరు, రెసిడెంటు ఎడిటరు, ఫీచర్స్ ఎడిటరు వగైరాలు లేరు. కాబట్టి ఇంగ్లీషు పత్రికల స్థాయి లేదు.

పొద్దు అది కాదు, పొద్దు ఇది కాదు అన్నాం బానే ఉంది. మరదేంటి?

“ఆఁ.., వేళాపాళా లేకుండా ఉదయించే వెబ్ పత్రిక” అని అన్నారు. ఈ విశేషణం బావుందే అని అనుకున్నాం.

————————

అంతర్జాలంలో ఇప్పటికే కొన్ని పత్రికలున్నాయి. ఒక్కోదానికీ ఒక్కో ఒరవడి ఉంది. సాహిత్య ప్రధానమైనవి, సమకాలీన అంశాల ప్రధానమైనవీ ఇలా రకరకాలుగా ఉన్నాయి. చాలా పత్రికలు ఏదో ఒక వాదానికి చెందినవి. పొద్దు ఏ వర్గానికి, ఏ వాదానికి చెందుతుంది?

పొద్దు, పొద్దు వర్గానికే చెందుతుంది.
పొద్దు పాఠక వర్గానికి చెందుతుంది.
పొద్దు సృజనాత్మక రచనల వేదిక.

పొద్దులో గాంభీర్యత లేదు. పొద్దులో ఓ పద్ధతి లేదు. పొద్దులో మిలిటరీ క్రమశిక్షణ లేదు, చచ్చినా దాటగూడని లక్ష్మణరేఖలు లేవు.

ఫలానా రోజుల్లోనే కొత్త రచనలు వెలుస్తాయని చెప్పే టైమ్ టేబులు లేదు. ఫలానా రోజున ఖచ్చితంగా కొత్త రచన వస్తుంది అని చెప్పే గ్యారంటీ కూడా లేదు.

కానీ..

పత్రికల కట్టుబాట్ల నుండి, సాంప్రదాయికంగా పాటిస్తూ ఉన్న పద్ధతుల నుండి విడివడి స్వేచ్ఛగా ప్రవర్తించే విశృంఖలత పొద్దులో ఉంది.

పొద్దుకో విలక్షణత ఉంది. ఓ విభిన్న వ్యక్తిత్వం ఉంది. తనదైన ఓ శైలి ఉంది, ఆత్మీయత అనే ఓ లేబులుంది. ఆశ్చర్యపరచే ఓ వైఖరుంది.

ఉదయం వేదోక్తంగా పూజచేసి, మధ్యాహ్నం న్యూక్లియర్ ఫిజిక్సు పాఠం చెప్పి, సాయంత్రం అష్టావధానంలో పృచ్ఛకుడిగా ప్రశ్నలడిగి, రాత్రికి స్నేహితులతో డిస్కోథెక్కు వెళ్ళే తెలుగువాడు ఎలా ఉంటాడో ఊహించండి..

అదీ పొద్దు!
అదే పొద్దుత్వం, పొద్దు తత్వం!!

నుడికారం గురించి పాఠాలు చెప్పే వ్యాసాలూ ప్రచురిస్తాం, పేరడీలు రాసి అల్లరీ చేస్తాం.
ఎక్కడా ఎవ్వరూ చెయ్యని గళ్ళ నుడికట్టు ప్రయోగం చెయ్యగలం.

హాస్యం మాకభిమానం! విమర్శ మాకిష్టం!!

———————

ఐదుగురు సభ్యుల సంపాదకవర్గం – సంపాదన లేని వర్గం – ఆధ్వర్యంలో పొద్దు నడుస్తూంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నిరంకుశ నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ‘జరుగుతూ’ ఉంటాయి.

పొద్దు రథాశ్వాలు:
తుమ్మల శిరీష్ కుమార్
స్వాతి కుమారి
భారతి
కోడిహళ్ళి మురళీమోహన్
భైరవభట్ల విజయాదిత్య

———————

పొద్దులో ఎవరు రాయొచ్చు

అంతర్జాలంలో తెలుగు ప్రాచుర్యం పొందుతోంది. కంప్యూటర్లో తెలుగు అమలు చెయ్యడం సాంకేతికంగా చాలా సులభమైంది. ఇంకా సులభమౌతూ ఉంది. ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేని అంతర్జాలంలో తెలుగులో రాయగలిగే సౌకర్యం రావడంతో తెలుగువారికి తమ ఆలోచనలను తమ భాషలోనే రాతలోపెట్టే అవకాశం దొరికింది.

ఇప్పటి నెజ్జనుల్లో ఎక్కువమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళే అయినప్పటికీ తెలుగులో రాయగల ప్రావీణ్యత లేనప్పటికీ రాయాలన్న తృష్ణ ఎక్కువగా ఉంది. తెలుగువారు తాము చాట్ చేసేటపుడు తెలుగులోనే – కాకపోతే రోమను లిపిలో – రాస్తారన్నది విదితమే!

అంతర్జాలంతో సన్నిహిత సంబంధం ఉన్న తెలుగు వారిలో ఎంతో రచనాశక్తి, సృజనాత్మకత, దాగి ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రతీవ్యక్తిలోనూ ఎంతోకొంత రాయగలిగే శక్తి ఉంటుంది. రాస్తూ ఉంటే రచనాశక్తి ఇనుమడిస్తుంది.

మంచి భావాలు చెయ్యితిరిగిన రచయితల సొత్తేం కాదు. ఉత్కృష్టమైన భావాలు అందరికీ ఉంటాయి. తమ భావాలను అందమైన భాషలో పెట్టగలవారు రచయితలవుతారు. మిగతావారు పాఠకులవుతారు. మంచి రచయితకు మంచి భావాలు, ఆలోచనలు, సృజనాత్మకత, భాషా వైదుష్యం ఉండాలి. సగటు నెజ్జనులలో ఇవన్నీ ఉంటాయి.. ఒక్క భాష తప్ప. ఇంగ్లీషు చదువుల ఉరవడిలో పడి, తెలుగు నుడి మర్చిపోయాం, మర్చిపోతున్నాం. ఈసంగతి పొద్దుకు ఎరుకే! అందుకే మీ తెలుగు బాగుండదని మీకు చింత వద్దు. మీకు వచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా యూనికోడులో టైపించి పంపండి – తెలుగులో మాత్రమే సుమా! మేం దానికి సవరణలు సూచిస్తాం, సవరించాక ప్రచురిస్తాం. మాకు కావలసింది మీ భావాలూ సృజనాత్మకతే!

అంచేత..

రాయండి. ఆలోచనలు ఉన్న ప్రతివారూ రాయాలి.
చదవండి. ఇతరుల ఆలోచనలేంటో తెలుసుకోవాలి.

————————
పొద్దులో ఏమేం రాయొచ్చు?

-కథలు, కవితలు, సమీక్షలు, కబుర్లు ఏమైనా రాయవచ్చు. ఇంటర్వ్యూలు చెయ్యవచ్చు. గడిని కూర్చనూ వచ్చు.
-కొత్తగా మీరే ఏదైనా శీర్షికను మొదలుపెట్టి నిర్వహించవచ్చు కూడా.

మాకంటే మా రచయితలూ, పాఠకులూ తెలివైన వాళ్ళేననే సంగతి మాకు గుర్తుంది.. (ఆ సంగతి మేం ఎప్పటికీ మర్చిపోం.)

పొద్దు మనదే అని మా పాఠకులు అనుకుంటారు. అంచేత ఇది పాఠకుల పత్రిక!
మీ పత్రిక, e-పత్రిక

69 Responses to మా గురించి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *